ఉపోద్ఘాతం:

ఒకవైపు స్త్రీని దేవతగా కొలుస్తూనే, మరోవైపు ఆమె పుట్టుకే గిట్టని వైరుధ్య సమాజంలో మనం ఉన్నాం. మరొక వైపు సమాజాన్ని వివిధ వర్ణాలుగా విభజించింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే ప్రధాన వర్గీకరణతో పాటు, ఈ నాలుగు వర్ణాలకు మరొక వర్ణం చేరి పంచమవర్ణం అయ్యింది. మొదటి మూడు వర్ణాల స్త్రీలకే కనీస హక్కులు లేనప్పుడు, మిగతా వర్ణాల స్త్రీల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో దళిత స్త్రీల గురించి వివిధ తెలుగు నవలల్లో వర్ణితమైన స్త్రీవాద తత్వాన్ని ఈ పత్రంలో పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాను.

చాతుర్వర్ణాల్లో మొదటి మూడు వర్ణాల స్త్రీలు కొన్ని యేండ్ల పాటు ఇంటిలోనే ఉండవలసిన నిర్భంధ పరిస్థితి ఉంటే, మరొక వైపు మిగతావర్ణాల స్త్రీలకు ఇంటా, బయటా ఉండకపోతే బతుకలేని పరిస్థితి ఏర్పడింది. ఒక వర్గానికి చెందిన స్త్రీలకు ఇంటిలోనే ఉండటం రక్షణగా అనిపించినా, అంతర్గతంగా అదే స్వేచ్ఛను హరించింది. మరొకవర్గానికి చెందిన స్త్రీలకు ఇంటా బయటా తిరగడంలో స్వేచ్ఛ ఉన్నా, అది మిద్యాస్వేచ్ఛగా మారింది. తమకు చారిత్రకంగా లభించని సామాజిక రక్షణ తమని బలహీనులుగా మార్చడం వల్ల అత్యాచారాలకు, హత్యాచారాలకు గురవ్వడమే కాకుండా, శ్రమదోపిడికి కూడా గురికావలసివచ్చింది. అందువల్ల మొదటి మూడు వర్ణాల్లోనూ పితృస్వామ్యం, మిగతా వర్ణాల్లో మాతృస్వామ్య ఛాయలు కనిపిస్తాయి. ఈ స్వభావాన్ని తెలుగు దళిత నవలల్లో ఎలా పట్టుకోగలిగారో పరిశీలించాలి.

తెలుగులో నవల అనేది నరహరి గోపాల కృష్ణమశెట్టి ‘శ్రీరంగరాజచరిత్రము’(సోనాబాయి పరిణయం) 1872లోను, 1878లో కందుకూరి వీరేశలింగం ‘శ్రీ రాజశేఖర చరిత్రము’ రాశారు. వీటి తర్వాతనే తెలుగులో ‘నవల’ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. అనేక సామాజిక పరిణామాల్ని గమనించిన తెలుగు నవలల్లో దళితుల గురించి కూడా అక్కడక్కడా ప్రస్తావన కనిపిస్తుంది.

సామాజిక పరిణామాన్ని బట్టి సాహిత్యంలోనూ కొన్ని ధోరణులు, వాదాలు, సిద్ధాంతాలు బయలుదేరాయి. భావ, అభ్యుదయ, విప్లవ, దిగంబర, స్త్రీవాద, దళిత, ముస్లిం మైనారిటీలు గా వీటిని పేర్కొంటున్నారు. ఈ రకమైన వర్గీకరణ చేయడానికి ప్రధానంగా కులం, జెండర్, మతం కారణాలయ్యాయి.

స్త్రీవాదంలో చర్చనీయాంశాలు:

సాధారణంగా స్త్రీవాదంలో ప్రధానమైన భావనలుగా స్త్రీపురుష సమానత్వం, స్వేచ్చ, (లింగవివక్ష), స్త్రీని భోగవస్తువుగా చూసే దృష్టి పట్ల వ్యతిరేకత, స్త్రీ పునరుత్పత్తి స్వేచ్చ, పితృస్వామ్య వ్యవస్థ పట్ల వ్యతిరేకత, ఆర్ధిక స్వాతంత్ర్యం, అన్నింటిలోనూ సమానావకాశాలు, ఆధిక్యతా భావాన్ని వ్యతిరేకించడం, కొన్ని పనులు ఆడవాళ్ళకే చెందుతాయనే భావనల పట్ల వ్యతిరేకత, సాహిత్యంలో ప్రయోగించే భాషాధిపత్యం, పురుషులకు మాత్రమే గుర్తింపు కలిగించే ప్రయోగాలు, స్త్రీలను కించపరిచే ప్రయోగాలు, సామెతలు, పలుకుబడులు మొదలైన వాటి పట్ల వ్యతిరేకత, పిల్లల పెంపకం కేవలం స్త్రీలకే చెందిందనే భావనను వ్యతిరేకించడం, స్త్రీ స్వతంత్రంగా ఆలోచించలేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందనే వాదనలను వ్యతిరేకించడం, స్త్రీ శారీరక స్థితి గతులను బట్టి అస్పృశ్యతను పాటించడం, కొన్ని కార్యక్రమాల్లో, దేవాలయ ప్రవేశాలను నిషేధించడాన్ని వ్యతిరేకించడం, దేవాలయాల్లో పూజారులుగా పనికిరారనడం, స్త్రీ పునర్వివాహం మొదలైనవన్నీ స్త్రీవాదంలో కనిపించే భావనలు.

దళిత స్త్రీవాదంలో ప్రత్యేకాంశాలు:

దళిత స్త్రీలు కూడా ఈ భావనలు చాలా వరకూ అనుభవిస్తున్నా, వీటిలో కొన్నింటి పట్ల వీరికి స్వేచ్ఛ ఉంది. మరికొన్ని కేవలం దళిత స్త్రీలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. దళిత స్త్రీలనే దేవదాసి, మాతంగులుగా కొనసాగిస్తున్నారు. మిగతా స్త్రీలతో పోల్చి చూసినప్పుడు మానం, ప్రాణం విషయంలో దళిత స్త్రీల పట్ల మరింత పీడన కొనసాగుతోంది. దళిత స్త్రీలకు పునర్వివాహం పెద్ద అవరోధం కాదు. అయినప్పటికీ, చాలా మంది పునర్వివాహాన్ని చేసుకోవాలో వద్దో వాళ్ళ స్వేచ్ఛ మీదే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి విషయాలు సాధారణ స్త్రీవాదంలో సరిగ్గా ప్రతిఫలించలేదనే వాదన కూడా ఉంది. ప్రసవవేదనలో కూడా దళిత స్త్రీల ప్రసవవేదనను స్త్రీవాదం నిర్లక్ష్యం చేసిందనే విమర్శ ఉంది. చదువుకున్న దళితుల, దళిత స్త్రీల విషయంలో అటు స్త్రీవాదులు ఎదుర్కొనే సమస్యలతో పాటు, చదువుకోని దళిత స్త్రీలు ఎదుర్కొనే సమస్యల మధ్య నలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది.

దళిత నవలల్లో స్త్రీవాద తత్వం:

‘స్త్రీవాద తత్త్వం’ అనే పారిభాషిక పదాన్ని స్త్రీవాదంలో కనిపించే స్వభావచిత్రణనూ లేదా భావజాలాన్ని, అది కొనసాగిన దృక్పథంలో గల విలువల మూల్యాంకనాన్ని గుర్తించడంగా భావిస్తున్నాను. ‘తత్త్వం’ అనే పదానికి ‘పరమాత్మ’, ‘స్వభావం’ అనే అర్థాలున్నాయి. ఇక్కడ ‘స్వభావం’ అనే అర్థాన్నే స్వీకరించాలి. ఆంగ్లంలో ‘Truth, Reality, Mind, Intellect, The true perfection, Ideology, ‘The real nature of a thing the essential nature of anything’. అంటే సత్యం, వాస్తవం, బుద్ధి, వివేకం, పరిపూర్ణత్వం, భావజాలం మొదలైన అర్ధాలు ఉన్నాయి. ఒక వస్తువు లేదా ఏదైనా ఒక విషయానికి గాని ఉన్న సత్యమైన స్వభావాన్ని గుర్తించడమే తత్త్వం. ఆంగ్లంలో Philosophy అనే పదానికి గల అర్థాన్ని చూసినప్పుడు ‘Hypothesis or System upon which natural effects are explained’ అనే వివరణ కనిపిస్తుంది. సహజమైన వివిధ ప్రభావాల్ని వివరించడంపై ఆధారపడే ఊహా పరికల్పన సిద్ధాంతం లేదా వ్యవస్థ గా Philosophy ని వివరించారు. Oxford Dictionary కూడా ఇంచుమించు ఈ వివరణలనే వివరిస్తుంది. The study of the fundamental nature of knowledge, reality, and existence, especially when considered as an academic discipline.

ఇలా తత్త్వం గురించి ఆలోచించినప్పుడు ‘దళిత స్త్రీవాదం యొక్క సత్య స్వరూపాన్ని లేదా దాని స్వభావాన్ని లేదా దాని వాస్తవిక దృక్పథాన్ని గుర్తించడమే దళిత స్త్రీవాద తత్త్వంగా భావించవచ్చు. దళితుల భావజాలాన్ని, వారి దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకొని దళిత నవలల్లో స్త్రీవాద భావనల చిత్రణ జరుగుతుందో లేదో విశ్లేషించుకోవడం లేదా దాన్ని గుర్తించడం దళిత స్త్రీవాద తత్త్వం’గా భావిస్తున్నాను.

దళిత వాదానికి లేదా దళిత ఉద్యమానికి ‘తాత్త్వికభావజాలం’ అంతా జోతిరావు ఫూలే(1827 –1890), పెరియార్ రామస్వామి (1879 –1973), డా.బి.ఆర్.అంబేద్కర్ (1891–1956), కాన్షీరామ్ (1934 –2006), సాహు మహరాజ్ (1874 –1922), నీగ్రో సాహిత్యంలోని తిరుగుబాటు తత్త్వం మొదలైన వారందరి ల ఆలోచనల సమాహారమే దళిత తాత్త్వికత. కారల్ మార్క్స్ (1818 –1883) భావజాలాన్ని కూడా కలిపి దేశీయ మార్క్సిజం అనే భావజాలం కూడా దళిత సాహిత్యంలో చర్చనీయాంశంగానే కొనసాగుతుంది. కానీ, డా.బి.ఆర్. అంబేద్కర్ తన రచనల్లో చార్వాకం, బౌద్ధంతో పాటు చారిత్రక, గతితార్కిక భౌతికవాదాన్నీ, దాని పరిణామాల్ని విశ్లేషించి, భారతదేశానికి కులాన్ని ప్రధానం చేసుకోవాలనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ‘‘నా తాత్త్విక దృక్పథానికి పోరాటం, గమ్యం ఉన్నాయి. నా తాత్విక సిద్ధాంతం పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తుంది’’అని అంబేద్కర్ వ్యాఖ్యానించారు. (కత్తి పద్మారావు, దళిత దర్శనం, పుట:28) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మతపరమైన తాత్త్వికాంశాల పట్ల కూడా స్పష్టతనే ప్రదర్శించాడు. తనకు ముగ్గురు గురువులనీ, వారు బుద్ధుడు, కబీరు, జోతీరావు ఫూలే అని అంబేద్కర్ ప్రకటించాడు. ( గులాంగిరి, జోతీరావు పూలే, తెలుగు అనువాదం ఏలూరి రామయ్య అనువాదకుడిమాట, పుట:1, హైదరాబాదు బుక్ ట్రస్టు, 2003) కనుక, డా.అంబేద్కర్ ఆలోచనా విధానంతో పాటు, మిగతా పైన పేర్కొన్నవారి భావజాలాన్ని కలిపి దళితతాత్త్వికతగా గుర్తిస్తున్నారు. వీరి ఆలోచనా విధానం ప్రకారం దళిత స్త్రీవాదం చిత్రితమైతే, అది నిజమైన దళిత స్త్రీవాద తాత్త్వికత అవుతుంది. కొన్ని పరిస్థితుల్లో వీరి ఆలోచనలను మించి స్వీయానుభవంతో దళితులు వర్ణించిన భావనలు కూడా దళిత తాత్త్వికతలో భాగమే అవుతాయి. రచయితలు వ్యక్తీకరించే జీవితానుభవాల్ని వివిధ సంఘటనలు, పాత్రలు, సన్నివేశకల్పనల ద్వారా వర్ణించేది సాహిత్యంలో తాత్త్వికత అవుతుంది.

దళిత స్త్రీ వాదం - నవలా తత్త్వం:

దళితుల గురించి దళితేతరులు తమ నవలల్లో చిత్రించినప్పటికీ, భారత రాజ్యాంగం పేర్కొన్న షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన రచయితలను దళితులుగా అంగీకరించే ధోరణి ఒకటి సాహిత్యలోకంలో ఉంది. కాల పరిమితుల దృష్ట్యా ఈ పత్రంలో షెడ్యూల్డు కులాల వారు రాసిన నవలల్లో గల దళిత జీవితాలను మాత్రమే విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాను.

తెలుగు నవలా సాహిత్యంలో చిలుకూరి దేవపుత్ర (అద్దంలో చందమామ-1988, పంచమం-1998)), బోయి జంగయ్య (జాతర-1998, జగడం-2003), కొలకలూరి ఇనాక్ (ఊరబావి-1969) జి.కళ్యాణరావు (అంటరానివసంతం, 2000), వేముల ఎల్లయ్య (కక్క-2000, సిద్ధి-2006), భూతం ముత్యాలు (సూర-2004), కదిరె కృష్ణ, (పొద-2010) బొజ్జాతారకం(పంచ తంత్రం,2013), జాజుల గౌరి (2012), దుగ్గనపల్లి ఎజ్రాశాస్త్రి (మా ఎర్ర ఓబన్నపల్లె 2018), పి.నాసరయ్య (మాదిగ పల్లె, 1998) మొదలైన వారు రాసిన నవలల్లో గల దళిత స్త్రీవాద నవలా తత్త్వం ఎంతగానో కనిపిస్తుంది. కానీ, ఈ పత్రంలో పై వాటిలోని కొన్నింటినే విశ్లేషించాలనుకుంటున్నాను.

కాల్పనిక సాహిత్యంలో దళిత స్త్రీవాద తత్వానికి బీజప్రాయం ‘ఊరబావి’:

ఆచార్య కొలకలూరి ఇనాక్ సర్కార్ గడ్డి, సమత మొదలైన నవలల్లో దళిత స్త్రీల ప్రస్తావన చేసినా, ‘ ఊరబావి’ (1969) దళిత స్త్రీ తాత్త్వికతకు ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుంది. ఇది వస్తు పరిమితి దృష్ట్యా కథగా ఒక ప్రధాన సంఘటనపైనే ఆధారపడినా, మాదిగ జీవితం, దాన్ని నిర్మించిన రచనా విస్తృతుల దృష్ట్యా నవలిక వంటిది. ఈ కథలో మాదిగ చిదంబరం భార్య పాత్రలోని చైతన్యం మాదిగ స్త్రీ ధైర్యం, తెగువ, సాహసంతో ముందుకు అడుగువేసే తెగువ, కార్యనిర్వాహక దక్షతలకు నిదర్శనంగా నిలుస్తుందని, శారీరక దృఢత్వం, పౌరుషం,నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయని కొలకలూరి మధుజ్యోతి వ్యాఖ్యానించారు. (ఆధునిక తెలుగు సాహిత్యం-దళిత సంస్కృతి, పుట: 96-97) అందుకనే దీన్ని ‘దళిత స్త్రీ వాదానికి భూమికగా గుర్తించాల్సిన అవసరం ఉంది’ అన్నవాళ్ళతో.(డా. కొలకలూరి ఇనాక్ రాసిన మొదటి దళిత స్త్రీవాద కథ ఊరబావి, శ్రీభవ్య, మే, 2014, సరసభారతి ఉయ్యూరు, అంతర్జాల పత్రిక) దళిత సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసేవారు అంగీకరిస్తారనుకుంటున్నాను. మాదిగ చిదంబరం భార్య గేదె తెట్టెం బావిలో పడేయ్యడం, దాన్ని తీయడానికి గ్రామస్థులంతా ప్రయత్నించి, దాన్ని దళితులకిచ్చెయ్యడానికి చేసిన ప్రయత్నం ఆమె వ్యక్తిగత పోరాటంలో భాగం కాదు. అది తరతరాల దళితుల నీటి సమస్యకు నాటి కాలానికి అనుగుణమైన పరిష్కారంగా భావించింది. అది వ్యక్తిగతమైన చైతన్యంగా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఊరబావిలో బీజప్రాయమైన దళిత స్త్రీ చైతన్య తత్త్వం ‘అంటరానివసంతం’ లో వటవృక్షంగా విస్తరించుకుంది.

మనువాదంపై దాడి: దళితుల ప్రత్యామ్నాయ సంస్కృతి:

జి.కళ్యాణరావు ‘అంటరానివసంతం’ లో రచయిత మార్క్సిజానికే ప్రాధాన్యం ఇచ్చినా, నవలా తత్త్వం దళిత జీవితాల్నే కేంద్రీకరించింది. రూతు, భూదేవి, లింగాలు, లచ్చిమి, సుభద్ర మొదలైన స్త్రీ పాత్రల్ని చిత్రించేటప్పుడు దళితుల్లోని పోరాటతత్త్వాన్నీ, తెగింపునీ, ఆత్మగౌరవాన్నీ వీడలేదు.

భూదేవి తన అన్నయ్య ఎర్రెంకడికి పెళ్ళిచేయడానికి భార్యను చూసొచ్చి, పిల్ల బాగుందని ఇలా చెప్తుంది. ‘‘ అయిదు గుడ్ల గడ్డి ఒక్క వూపులో మోస్తదిరా అంది.’’ తర్వాత ఆ పిల్ల (లింగాలు) పొడవైన మనిషి అనీ, చూరుకప్పు దాటేటట్లు ఉందనీ, ‘‘ వాకిలి ఎత్తు లేపాల్రా అన్నా’’ అంటుంది. ( అంటరానివసంతం, 2008, పుట: 14)

డా.బి.ఆర్. అంబేద్కర్ కులం-వర్గాల గురించి చేసిన సైద్ధాంతిక చర్చలో భారత దేశంలో మనుస్మృతి చేసిన కుట్ర ఫలితంగా శూద్రులు ఆర్థికంగా ఎలా పతనమైపోయారో అనేక ఉదాహరణలతో వివరించాడు. క్షేత్రీయులు ఆర్యుల చేతిలో పరాజయం పొందిన తర్వాత బ్రాహ్మణులు చేసిన కుట్రల ఫలితంగా శూద్రులు దస్యులుగా, సేవకులుగా, వెలివేయబడినవారిగా, అంటరానివారిగా, అస్పృశ్యులుగా మారారో వివరించాడు. (బాబా సాహెబ్ అంబేద్కర్ రచనలు- ప్రసంగాలు, సంపుటి-7, పుట: vii, 1992, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ, ప్రధాన సంపాదకుడు: సి.నారాయణరెడ్డి)

జోతీరావు పూలే‘గులాంగిరి’(ప్ర.ము.1873, హై.బు.2003)లో ‘‘ అతణ్ణి (బ్రాహ్మణుణ్ణి) మిగతావారందరూ పూజించాలి, సేవించాలి, గౌరవించాలి....బ్రాహ్మడి పాదాలు పవిత్రమైనవి. అతడి ఎడమకాల్లో అన్ని తీర్థాలూ నివసించి ఉంటాయి. తన కాలిని అతను నీట్లో ముంచి ఆ నీటిని పరమ పవిత్రమైన పుణ్య తీర్థ జలాలుగా మారుస్తాడు’’ (పుట: 7) అని బ్రాహ్మణాధిపత్యం కొనసాగుతున్న తీరుని వాదిస్తుంటాడు.

జి.కళ్యాణరావు ‘అంటరాని వసంతం’లో ఇటువంటి భావాల్నే తన మాటల్లో చెప్తూ ‘‘ వాళ్ళు విశ్వానికంతకి ప్రభువులు. దేవుడితో సమానులు. వాళ్ళని పూజించాలి, సేవించాలి, గౌరవించాలి. .... వారి పాదాల్లో పవిత్రత వుంది. అన్ని తీర్థాలు వాళ్ళ ఎడమకాళ్ళలో దాగివున్నాయి. కడగాలి వాళ్ళ పాదాలని. అప్పుడు కనిపిస్తాయి అనంత తీర్థాలు’’ (2008-62)

నవలలో ఈ మాటల్ని రూతుకి, రూబేను చెప్తాడు. అవి పదేపదే గుర్తుకొస్తుంటాయి. ఇక్కడ రచయిత కళ్యాణరావు స్పష్టంగా జోతీరావు ఫూలే భావజాలాన్ని ప్రదర్శించాడని తెలుస్తుంది. దళిత సమస్యను మార్క్సిస్టు కోణంతో కనిపించే దళిత స్త్రీ తత్త్వం ‘ అంటరానివసంతం’ నిండా కనిపిస్తుంది.

తన వదినను చూడ్డానికి వెళ్లి, పొడుగ్గా ఉందని, చూరు పైకి ఎత్తాల్సిందేనని భూదేవి తన అన్నతో చెప్పడం కూడా మనుస్మృతిలో చెప్పిన శూద్రుల గృహనిర్మాణాన్ని వ్యతిరేకించడమే.

తన మేనల్లుడి పేరు పెట్టే విషయంలో ఎల్లడు కాదనీ, ఎల్లయ్య, ఎల్లన్న అనడంలోనూ మనుస్మృతి పట్ల తీవ్రమైన వ్యతిరేకతను భూదేవి ద్వారా ప్రదర్శిస్తాడు రచయిత. మనుస్మృతిని నిందించడంలోను, అగ్రవర్ణ భావజాలాన్ని తిప్పి కొట్టి ప్రత్యామ్నాయ సంస్కృతిని సూచించడంలో అంటరానివసంతాన్ని మించిన నవల ప్రస్తుతానికి లేదనిపిస్తుంది.

కులాంతర వివాహాలు:

దళిత నవలల్లో ఒక ప్రధాన తాత్త్వికాంశం కులాంతర వివాహాలు. ప్రేమకు జాతి, కుల, మత, వర్గ, ప్రాంత, భాషా భేదాలు ఉండవు. కానీ, వీటిలో మిగతా వాటికంటే కుల భేదాలు ఎన్నో అడ్డంకులకు కారణాలుగా భావిస్తున్న సంఘటనలను దళిత నవలల్లో చాలామంది చిత్రించే ప్రయత్నం చేశారు.

‘పంచమం’ (1998)నవలలో కులాంతర వివాహాలు జరగడానికి గల కారణాలను, వాటిని అడ్డుకునే కులాధిక్యతను చిలుకూరి దేవపుత్ర వాస్తవిక దృష్టితో చిత్రించాడు. నవలలో ప్రధాన నాయకుడైన శివయ్య మాదిగ కులస్తుడు. అతని పట్ల ఈడిగ కులానికి చెందిన పద్మ మొదట్లో ఆతని కులాన్ని బట్టి ఈసడించుకుంటుంది. కానీ, అతను చదువుకోవడం, ఆమెకు ట్యూషన్ చెప్పేటప్పుడు ఆతనిలోని తెలివితేటల్ని గమనించి, ఇష్టాన్ని పెంచుకుంటుంది. కులాంతర వివాహం చేసుకొందామని కూడా ప్రోత్సహిస్తుంది. కానీ, అప్పటికే ఆ గ్రామంలో చాకలి ఓబన్న, భూస్వామి సీతారామప్ప మనవరాలు రుక్మిణి కులాంతర వివాహం చేసుకుంటే జరిగిన పరిణామాలు గుర్తుకొస్తాయి. వాళ్ళిద్దరూ పారిపోయి తిరుపతిలో పెళ్ళిచేసుకుంటే, రౌడీలతో ఓబన్నను నరికించేసి, మరలా తమ కులానికి చెందిన వాడితో రుక్మిణికి పెళ్లిచేస్తారు. తన లక్ష్య సాధన పూర్తి కావకపోవడం, దానితో పాటు సామాజిక వాస్తవికతలన్నీ శివయ్య ఈడిగ పద్మను కులాంతర వివాహం చేసుకోవడానికి అంగీకరించకపోవడానికి కారణాలుగా చిత్రించాడు రచయిత.

పంచమం నవలలో పద్మ, రుక్మిణి, బ్రాహ్మణుడైన కృష్ణశాస్త్రి చెల్లెలు ఇలా కొన్ని స్త్రీ పాత్రలు సృష్టించినా, దళిత స్త్రీ స్వభావాన్ని ప్రత్యక్షంగా చిత్రించలేదు. కానీ, బాగా చదువుకుంటే కులాంతర వివాహాలు జరగడానికీ అవకాశం ఉందనే దృష్టి ఈ నవలలో బాగా కనిపిస్తుంది.

భూతం ముత్యాలు ‘సూర’(2004) లో మాల కులానికి చెందిన చెన్నడు కొడుకు సూరడు. తల్లిదండ్రులతో పాటు పట్నం వచ్చేసి, అక్కడే చదువుకుంటుంటాడు. కొన్నాళ్ళ తర్వాత తమ ఊరికి చెందిన పెద్దదొర కూతురు జయలక్ష్మి ఆ కళాశాలలో చేరుతుంది. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరి మధ్యా పరిచయం ప్రేమగా మారుతుంది. వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకుంటారు. చదువుకున్న సూరడు కి ఊరిలో పెత్తందారులు భయపడుతూ, ప్రత్యక్షంగా ఏమీ చేయలేకపోయినా పరోక్షంగానైనా ఎలాగోలా అతడ్ని చంపెయ్యాలని చూస్తారు. మైసమ్మ పండుగ నాడు ఊరంతా ఉత్సవాల్లో మునిగి ఉంటారనీ, అదే సమయంలో సూరడిని మాయం చేసి చంపాలని పటేలు నాగిరెడ్డి ప్రణాళిక వేస్తాడు. దాని ప్రకారమే తన మనుష్యుల చేత కత్తులతో దాడిచేయిస్తాడు. ఆ డప్పుల హోరులో సూరడి భార్య తన భర్తని రక్షించమని అరిచే అరుపులు ఎవరికీ వినిపించవు. పండగ జరుపుకుంటున్న జనానికి జయమ్మ ఆ వార్త తెలపడంతో, ఎలాగోలా కొంతమంది ఆడవాళ్ళే (చంద్రి, జయలక్ష్మి, ఝాన్సీ) అతడిని ఆసుపత్రిలో చేరుస్తారు. ఈ లోగా మరొకరెవరో నాగిరెడ్డిని చంపేశారనే వార్త తెలుస్తుంది.

‘సూర’లో కులాంతర వివాహాల గురించి చిత్రించినా, దానివల్ల వచ్చే పరిణామాల్ని పరోక్షంగా చెప్పేప్రయత్నం చేశాడు రచయిత. కానీ, కులాంతర వివాహాలు చేసుకున్న తర్వాత వెంటాడే భయాన్ని, అందని సహకారాన్ని వాస్తవికంగా చిత్రించాడు రచయిత.

‘మా ఎర్ర ఓబన్నపల్లె’ ( 2018) లో దుగ్గనపల్లి ఎజ్రాశాస్త్రి ‘ముత్యాలు’ అనే దళిత స్త్రీ పాత్రలో జానపద రీతిలో స్వచ్ఛమైన మనసుకూ, పవిత్రతకూ నిదర్శనంగా నిలిచే అరుంధతీదేవి తత్త్వాన్ని వర్ణించాడు. తల్లి చనిపోయి అనాథలయ్యే పరిస్థితుల్లో వాళ్ళని పెంచడం కోసం, 15 యేండ్ల ముత్యాలు 50 యేండ్ల ముసలివాణ్ణి వివాహమాడ్డానికి కూడా వెనుకాడలేదు. పెళ్ళి అయిన తర్వాత అతను పిడుగు పడి చనిపోయినా, తనపై అనేకమంది పురుషులు కోరికను పెంచుకున్నా, తన స్వచ్ఛతను కోల్పోలేని నిగ్రహ వ్యక్తిత్తవం దళిత స్త్రీల్లో ఉంటుందని నిరూపించే పాత్ర. ఆమెను అంత దళితురాలనీ, అస్ఫృశ్యరాలనీ నిందిస్తున్న సమయంలో ఆ ఊరిలో నరసింహస్వామి దేవాలయం దగ్గర ఎవ్వరు పెట్టినా నిలవని సమయంలో ముత్యాల వల్ల అది నిలబడిందని ఆమెలో మహిమలున్నాయనే నమ్మకాన్ని ప్రజలంతా నమ్ముతుంటారు. వైద్యం నేర్చుకొని ప్రజలకు తోడ్పడ్డం, తనపై అపవాదులేసిన రెడ్డికి పట్టిన రాచపుండుని తన వైద్యంతో నయం చేయడం వంటి సన్నివేశాలు పగా, ప్రతీకారాలకంటే, ప్రేమ, కరుణలకే దళితులు ప్రాధాన్యాన్నిస్తారనే సూచన చేశాడు రచయిత.

మద్యపానం- బాధల తాత్కాలిక ఉపశమనం:

దళితులు స్త్రీ, పురుషులనే భేదం లేకుండా మద్యం తాగడం అనేక కుటుంబాల్లో కనిపిస్తుంది. కొంచెం ఆలోచన ఉన్న స్త్రీలు వీటికి దూరంగా ఉంటారు. జాజుల గౌరి ‘ వొయినం’ లో ప్రధాన నాయకురాలు నీలమ్మ మద్యం తాగదు. తన భర్త మధ్య తాగి చెడిపోతున్నందుకు బాధ పడుతుంది. తాగొద్దని బ్రతిమలాడుతుంది. తన భర్త త్రాగుడికి అలవాటు పడ్డానికి కారణమేంటో మొదటిలో తెలియకపోయినా, తర్వాత తెలుసుకోగలుగుతుంది. తన భర్తను మరలా మామూలు మనిషిని చేయాలని ఆశిస్తుంది.

భూతం ముత్యాలు ‘సూర’ లో దళిత స్త్రీ కూడా అత్యంత సహజంగా మద్యం(కల్లు) తాగుతుంది. చెన్నడు భార్య చంద్రి. తన భర్తకు చెందాల్సిన భూముల్ని పాలెగాళ్ళు లాక్కుంటారు. ఆ ఊరిలో బతకలేక, పట్టణం వెళ్ళెపోయేటప్పుడు ఒక చోట ఆగి తాను కల్లు తాగడమే కాకుండా, తన కొడుక్కి కూడా పట్టిస్తుంది. తన మనసులో ఉన్న బాధను వెళ్ళగ్రక్ర్కుతూ ఏం బాధలొచ్చేగదరా కొడ్కా ఊల్య (ఊరిలో) పాలోల్ల పోరు పడలేక నల్లుట్ల ఇజ్జత్ కి పాట్ల వడి పొట్ట చేత్త బట్కొని దేశంగాని దేశం వొలసిపోవాల్సొచ్చే. ఇంటాడ నిచ్చే కిక్కిరి బెట్కోని పాలోల్ల పొంద నీయ్యకబోయిరి. ఆల్లు నాశనంగాను. మేం దీసినట్లు ఆళ్ళు శరలు దీయ, ఆళ్ళ కడ్పుల మారమ్మ మొల్వ, ఆల్లెన్నుల్ల జెట్టపుట్ట, ఆల్లింట ఉప్పలమ్మ మొల్వ, మమ్మల ఏం సుఖపడనిచ్చినై. నా సొమ్ము సగానికి సగం మల్పుకుండ్రు" అని తన బాధను వెళ్ళ గ్రక్కుతుంది.

అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అత్యాచారాలు చెయ్యడం:

దళిత స్త్రీలను దళితేతరులు, దళితులు అవకాశాన్ని బట్టి లొంగదీసుకోవడానికి ప్రయత్నించడం ఇంచు మించు అన్ని దళిత నవలల్లోను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చిత్రిస్తున్నారు.

జాజుల గౌరి ‘వొయినం’లో మొగులయ్యను పెంచి, పెళ్ళి చేసిన తన పెదనాన్న సత్తెయ్య, తన దగ్గరున్నంత కాలం ఒక పాలేరులా పనిచెయ్యించుకున్నాడు. పెళ్ళి అయిన తర్వాత, వేరేగా ఉన్నా సత్తెయ్య, వాళ్ళావిడా మొగులయ్యను రకరకాలుగా బాధలు పెట్టారు. కేవలం మొగులయ్యనే కాకుండా, ఆతడి భార్య నీలమ్మను కూడా రకరకాలుగా మానసికంగా హింసించారు. సత్తెయ్య బాధలు పడలేక, సమాజానికి తన గోడు సమర్థవంతంగా వినిపించుకోలేక, తాగుడికి బానిసై మొగులయ్య చనిపోతాడు. ఆ తర్వాత ఆతని భార్య నీలమ్మ వాళ్ళపుట్టింటికి వెళ్లిపోతే, మరలా మొగులయ్య బాగుచేసి, పంట పండిస్తున్న భూమిని కూడా లాక్కోవాలనుకుంటారు. కానీ, నీలమ్మ తన పుట్టింటికి పోకుండా, తన ఇద్దరి పిల్లల్ని పెంచుకుంటూ పొలం కూడా పండిస్తుంది. ఈ పరిస్థితుల్లో వరుసకు పెదమామయ్య అయ్యే సత్తెయ్య ఒక యువకుడు రాజుని నీలమ్మతో అక్రమసంబంధం పెట్టుకొనే ఎల్లయ్య అనే ఒక తాగుబోతుకి డబ్బులిచ్చి ప్రోత్సహిస్తాడు. చివరికి నీలమ్మ రాజుకి లొంగకపోయేసరికి, నీలమ్మపై అపనిందలు వేసి, పంచాయితీ పెట్టి ఆమెని అవమానిస్తాడు. వరుసకు మరిది అయ్యే రాజు, పెళ్ళై భార్య ఉన్నప్పటికీ, పెద్దవాళ్లిచ్చిన ప్రోత్సాహంతో నీలమ్మను అత్యాచారం చెయ్యాలనుకుంటాడు.

భూతం ముత్యాలు ‘సూర’లో బతుకు తెరువుకోసం పట్నం వచ్చి బతుకుతున్న మాల చెన్నని భార్య చంద్రి ఇంటికొచ్చి, ఆమె వండిన భోజనం తిని, ఆ రాత్రి ఆ ఇంటిలో ఉండి, చెన్నని చెల్లెలు రంగిని లోబరుచుకుని అనుభవిస్తాడు అగ్రవర్ణానికి చెందిన నాగిరెడ్డి. పట్నంలో ఎక్కడా ఉండడానికి వీల్లేక, చెన్నడు దగ్గరకొచ్చిన అగ్రవర్ణావారు, ఆ ఇంటిలో పడుకొని, ఊరిలో ఇంటి స్థలం ఇప్పిస్తానని మాయమాటలతో లోబరుచుకుంటాడు. తర్వాత చెన్నడు భార్య చంద్రిని అనుభవించాలనుకుంటాడు. ఆమె భర్తకు బాగా సారా తాగించి, ఆమెను అత్యాచారం చేస్తాడు.

దళితుడు అత్యాచారం చేసినా, చెయ్యకపోయినా కఠిన శిక్షలు:

వేముల ఎల్లయ్య ‘సిద్ధి’ ( 2005)లో చదువుకునే పిల్లలు ‘అమ్మా-నాన్నా’ ఆట ఆడుకోవడానికి పెద్దవాళ్ల బట్టలు కట్టుకుంటారు. పెళ్లి పెద్దలుగా పిల్లలుంటారు. వాళ్ళ సమక్షంలోనే వాళ్ళకి పెళ్లిచేస్తారు. అదొక ఆట. లింగ భేదం సరిగ్గా తెలిసీ తెలియని వయసులో పిల్లలు ఈ ఆటాడుకుంటారు. మాదిగ కులానికి చెందిన సిద్ధి, దొరకూతురు పద్మ కలిసి ‘అమ్మా-నాన్న’ ఆటాడుకుంటారు. ఆ రోజే పద్మ రజస్వల అవుతుంది. దానికి భయపడి సైదులు తనింటికి వెళ్ళిపోయి దాకుంటాడు. ఆ రక్తస్రావం చూసి భయపడి, పద్మ తన ఇంటి దగ్గర చెప్తుంది. మాదిగ సైదిగాడు తన కుమార్తెపై అత్యాచారం చేశాడని ఇంటికెళ్ళి సైదుల్ని పొత్తి కడుపులో తన్నుతూ, రక్తం కక్కేలా కొడతాడు. పోలీసు కేసు పెట్టి, జైలుకి పంపిస్తాడు.

బోయ జంగయ్య ‘జాతర’ (1988) నవలలో స్త్రీలపై దళితేతరులు చేసే మోసపూరిత అత్యాచారాల్ని వర్ణించాడు. పిల్లలు పుట్టకపోతే జాతరకు వెళ్ళి రాత్రి ఆ జాతరలో పడుకుంటే పిల్లలు కలుగుతారని నమ్మించి, స్త్రీలను అత్యాచారాలు చేసే వైనాన్ని వర్ణించాడు. ఈ దురాచారానికి జాతర నవలలోని అగ్రవర్ణ పటేల్ భార్య రాధ కావచ్చు. బలహీన వర్గాలకు ( చాకలి కులానికి) చెందని మంగమ్మ కావచ్చు. వీళ్ళంతా పరాయి పురుషుల అత్యాచారాలకు బైనవాళ్ళే. కొద్దిగా చదువుకున్న వీళ్ళే ఇలా బలై పోతే దళిత స్త్రీ పరిస్థితి మరెంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోమని పాఠకునికే వదిలేస్తాడు రచయిత.

జోగినిలుగా మార్చడం – దోపిడీకి గురవ్వడం

మాతంగి, జోగిని, దేవదాసి మొదలైన పేర్లతో దళిత స్త్రీ లైంగికంగా దోపిడీకి గురవుతుంది. ‘‘దళితులలోని స్త్రీలను ఎక్కువగా ఆడపిల్లలను, దేవతల పేరిట, లేదా దేవుడి పేరి వదిలివేయటం ఈ ఆచారం.ఆనాటి నుంచి ఆ అమ్మాయి ఊరందరి సొత్తు. ఎవరు కోరినా కాదనేందుకు లేదు. భయంకరమైన ఈ వ్యవస్థ తీరు ఎందరో అమ్మాయిలను జీవచ్ఛవాలను చేసింది...’’ (కొలకలూరి మధుజ్యోతి, ఆధునిక తెలుగు సాహిత్యం-దళిత సంస్కృతి, పుట: 101) ఇటువంటి దళిత స్త్రీ మానసిక, శారీరక సంఘర్షణను చిత్రిస్తూ కొన్ని దళిత నవలలు వచ్చాయి.

బోయజంగయ్య ‘జగడం’ నవల్లో విమల పాత్ర ద్వారా దళిత స్త్రీలు జోగినిలుగా మారే స్థితిని, తదనంతర దోపిడీని వర్ణించాడు. అయితే, ఈ నవలలో విమల చదువుకున్నయువతి కావడం వల్ల జోగిని గా బలవంతంగా మార్చినా, తర్వాత ఆమె ప్రదర్శించిన తెలివి తేటలు దళిత స్త్రీ ఆలోచనని తెలియజేస్తుంది. దేవుడికి భార్య అయిన తర్వాత దేవునికి ఉండే మాన్యం కూడా దేవుని పెళ్ళానికే దక్కాలని వాదించడంలో ఆమె తెలివితేటలు ప్రదర్శితమయ్యేలా, దళిత స్త్రీ పాత్రను చైతన్యవంతంగా తీర్చిదిద్దాడు రచయిత. దేవుడి మాన్యాల కంటే, వాటిని తనకే దక్కాలనడం ద్వారా ధర్మకర్తృత్వమండలిలో మార్పుని తీసుకురావాలని విమల ప్రయత్నించిందని, అందుకనే ఆదర్శవాది రాజం ను వివాహమాడుతుంది.

తమ పిల్లల్ని చదివించే తల్లుల పాత్రలు:

దళితులు బాగా చదువుకోవడం ద్వారా నిజమైన చైతన్యాన్ని పొందగలుగుతారని జోతీరావు పూలే, అంబేద్కర్ లు భావించారు. ఆ విషయాలు తెలిసినా, తెలియకపోయినా తమ పిల్లలు కూడా చదువుకుంటే బాగుపడతారనే ఉద్దేశంతో తమ పిల్లల్ని బడికి పంపించినట్లుగా సహజత్వంతో రచియితలు దళిత స్త్రీపాత్రల్ని తీర్చి దిద్దారు.

భూతం ముత్యాలు ‘సూర’ లో సూరడు బడికి వెళ్లకపోతే కొట్టైనా సరే పంపిస్తుంది. బడికి వెళ్లి చదువుకోవడం వల్ల మరలా కులం ఆధిపత్యం చెలాయించే తన గ్రామానికి వెళ్లి, అక్కడ కులాధిపత్యానికి బలైపోతున్నవాళ్ళని సంస్కరించేందుకు అనేక విధాలుగా కృషి చేస్తాడు సూరడు.

బోయ జంగయ్య ‘ జగడం’లో కూడా తల్లి ఎల్లమ్మ తన కొడుకుని చదివిస్తుంది. ప్రభుత్వం అందించే సదుపాయాలు తెలియకపోయినా, కష్టనష్టాలకు గురైనప్పటికీ చదివించాలనుకుంటుంది. తామ చేసే వెట్టి నుండి విముక్తి కలిగించడమే తమ లక్ష్యంగా భావించినా, పరోక్షంగా అది దళిత తాత్వికతలో భాగంగానే రచయిత సూచించాడు.

దళిత యువకుల్ని వాడుకోవడం, తెలిస్తే చంపేయడం:

వేముల ఎల్లయ్య ‘కక్క’ ( 2000)లో పటేలమ్మ, ‘మాదిగ బాల్కానితో తొడ సంబంధం పెట్టుకుంటే వాణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపించారు పటేండ్లు’ (1980 తర్వాత తెలుగు దళిత నవల, పుట:88). పటేలమ్మ తన కోరికను తీర్చుకోవడానికి అణగారిన కులాలు, వర్గాల వారిని వాడుకుంటుంది. బలవంతంగానో, భయపట్టో కూడా తన సుఖాన్ని అనుభవిస్తుంది. అది బయట పడితే తిరగబడి అతడ్ని చంపించేస్తుంది.

దళిత స్త్రీపై అత్యాచారం జరిగినా, తర్వాత చింపేసినా కనీసం కేసులు కూడా పెట్టించుకోలేని స్థితిలో దళిత స్త్రీలు ఉన్నారు. కానీ, దళితేతర స్త్రీలపై అత్యాచారం జరిగినా, జరగకపోయినా, తమవైపే న్యాయం జరుగుతున్న తీరుతెన్నుల్ని ఈ సంఘటన వల్ల గ్రహించవచ్చు.

దేవతలు పూనడం-మహిళల్ని పావులుగా వాడుకోవడం:

భూతం ముత్యాలు ‘సూర’లో దళితుల్ని మరింత బలహీన పరచడానికి స్త్రీలకు దేవతలు పూనడాన్ని ఒక అవకాశంగా సమాజం ఉపయోగించుకుంటున్నారో చిత్రించాడు రచయిత.

మాదిగలకు ఊరులో వారసత్వంగా వచ్చిన మాన్యం భూముల సుమారు వంద ఎకరాలు ఉంటుంది. చదువుకున్న సూరడు ఊర్లో లేకుండా చూసి పటేలు నాగిరెడ్డి ఆ భూములపై లోనులు తీసుకుంటాడు. తీరా కట్టవలసి వచ్చేసరికి, వాటిని మాదిగలే కట్టాలంటాడు. ఆ విషయాన్ని మాల, మాదిగలు కొంతమంది పటేలుని అడగడానికి వెళ్ళినందుకు వాళ్ళపై పోలీసు కేసులు పెట్టించి, కొట్టించి, ఊరు పారిపోయేలా చేస్తాడు. మరికొంతమంది. ఆ ఊరిలో ఉన్న గొల్లవారి గుడిదగ్గరకు వెళతారు. వెనుకబడిన తరగతులకు చెందిన ఒక మహిళ ఎల్లమ్మకు దేవత పూనుతుంది. మాలలు గొల్లవారి గుడిదగ్గరకు పోయినందుకే ఊరిలో రకరకాల దుష్ఫలితాలు సంభవిస్తున్నాయని చెపుతుంది. కొట్లాటలు, టైఫాయిడ్ రావడం అన్నీ అమ్మవారి ఆగ్రహం వల్లనే అని నమ్మేలా చెప్తుంది. కానీ, సూరడు అవన్నీ అశాస్త్రీయాలని, వివిధ పరీక్షలు చేయించి నిరూపిస్తాడు. సూరడు పాత్ర జోతీరావు పూలే, డా.అంబేద్కర్ భావజాలానికి ప్రతీక. ( ఈ విషయాన్ని రచయిత, ఈ వ్యాసకర్తకు 22.10.2018 తేదీన ఇచ్చిన ఫోను ఇంటర్య్యూలో కూడా చెప్పాడు.)

తమ ఆధిపత్యం చెలాయించుకోవడానికి స్త్రీలను పావులుగా వాడుకునే విధానాన్ని ఇక్కడ చూడొచ్చు.

దళిత స్త్రీ ధైర్యం, ఆత్మ విశ్వాసం:

వేముల ఎల్లయ్య ‘కక్క’లో లస్మక్క పాత్ర ఎంతో ధైర్యం కలిగిన పాత్ర. డప్పు కొట్టగలదు. దాన్ని ఇతరులకు నేర్పించగలదు. తాను ప్రేమించిన కక్కడి కోసం ప్రేమతో ఎండుతునకలు వేయించుకొని ఇంటికి వెళ్ళి, అతనితో వేళాకోళం ఆడి మరలా తానే ఒంటరిగా రాగలదు. తనకు ఆటలు, పాటలు వచ్చు. ఇక్కడ ఒక ధైర్యశాలియైన మాదిగ స్త్రీగా లస్మక్క కనిపిస్తుంది.

జి. కళ్యాణరావు ‘అంటరానివసంతం’లో రూబేను పాత్ర కూడా ధైర్యానికీ, కళలు నేర్చే మాల కులానికి ప్రతీకగా నిలుస్తుంది.

బోయ జంగయ్య ‘జాతర’(2003) లో మాదిగ కులానికి చెందిన ఎల్లమ్మ తన కొడుకుని చదివించడంలో ఎంతో చొరవను చూపిన దళిత స్త్రీ తత్త్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. అంబేద్కర్ ఆశించిన దళితులు బాగా చదువుకోవాలనే భావజాలానికి ప్రతీకగా నిలిచేపాత్ర. తన కొడుకు రాజయ్యను ప్రభుత్వ వసతి గృహంలో వేసి, తన కొడుకు చదువుకోవడమే తన జీవిత లక్ష్యంగా బతుకుంతుంది. ఒక నాడు పొయ్యిలో పుల్లల కోసం పుట్టమీద కాలువేస్తే పాము కాటువేస్తుంది. కానీ, ఆ పాముని గమనించని ఆమె ఏదో పురుగు కుట్టిందనుకొని దాన్ని పట్టించుకోకపోవడంతో చనిపోతుంది.

జాజుల గౌరి ‘వొయినం’లో నీలమ్మ బాల్య వివాహం చేసుకొని, మొగులయ్య ఇంటికి కాపురానికి వెళ్ళినా, క్రమేపీ జీవితంలోని ఒడిదుడుకుల్ని తట్టుకొని, గ్రామంలో ఎవ్వరూ ఎదిరించలేని దుర్మార్గుడైన సత్తెయ్యకు ఎదురు నిలిచి, తన భర్త ద్వారా తనకు సంక్రమించిన వ్యవసాయాన్ని నిలుబెట్టుకున్న గొప్పధైర్యవంతురాలు. దళిత స్త్రీ వ్యావసాయిక కుటుంబంలో నిర్వహించే అనేక పార్శ్వాలను చైతన్యవంతంగా తీర్చిదిద్దిన పాత్ర.

ఒకసారి ఇచ్చిన బహుమతుల్ని మరలా తీసుకోలేనట్లే ఒకసారి పెళ్ళిచేసి ఇంటికి పంపిన అమ్మాయిని మరలా తమ పుట్టింటికి ఎట్టి పరిస్థితుల్లోను తీసుకురారు. అదే విధంగా నీలమ్మను పెళ్ళి చేసి పంపించేసిన తర్వాత భర్త ఉన్నా, లేకున్నా అత్తగారి ఇల్లూ, ఊరే ఆమె ఊరవుతుంది. అంతే తప్ప తమ పుట్టినిల్లు, పుట్టినూరు తమ ఊరవ్వదు. ఇది తెలుసు కనుకనే నీలమ్మ ఎట్టి పరిస్థితుల్లోను మరలా తన పుట్టింటికి వెళ్లాలనుకోలేదు. కానీ, అక్కడ ఉండనివ్వకుండా, ఆమెకు తన భర్తవల్ల లభించిన వంశపారంపర్య ఇంటినీ, వ్యవసాయాన్నీ తామెలాగైనా దక్కించుకోవాలనే కుట్రల్లో తనకు వరుసకు మేనమామ అయిన సత్తెయ్య, ఊరిపెద్దగా చెలామణీ అయ్యే తార్పుడుగాడు, వ్యసనపరుల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురౌతాయి. అయినా తట్టుకొని నిలబడ్డమే ఈ నవల్లో నీలమ్మ పాత్రలో కనిపించే ధైర్యం.

ఈ విధంగా కొలకలూరి ఇనాక్ గారి ‘ఊరబావి’ కథాత్మక నవలలో మాదిగ చిదంబరం భార్య పాత్ర ద్వారా బీజప్రాయమైన చైతన్యం జి.కళ్యాణరావు ‘అంటరానివసంతం’ లో భూదేవి, రూతుల దగ్గరకొచ్చేసరికి వటవృక్షమైపెరిగింది. ఈ మధ్య కాలంలో దళిత స్త్రీ లు ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్లో జోగినులుగా మారడం ( బోయజంగయ్య – జగడం), అత్యాచారాలకు గురికావడం (భూతం ముత్యాలు ‘సూర’), కులాంతర వివాహాలు – భయోత్పాత పరిస్థితులు ( చిలుకూరి దేవపుత్ర-పంచమం, సూర- పెద్దదొరకూతురు జయలక్ష్మి), మారుమనువులు (కక్కడి తల్లి కి పెళ్ళి చేసుకోవడం వంటివి స్త్రీ పునర్వివాహాన్ని చిత్రించాయి. అంటరానివసంతం’లో ఉరుముల చంద్రప్ప పరిచయం, ఆమె జీవితంలో ప్రవేశించడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశంగా వర్ణించలేదు.పుట: 39) చివరికి జాజుల గౌరి ‘వొయినం’ నవలలో నీలమ్మ దళిత స్త్రీ ధైర్య స్థైర్యాలకు ప్రతీకగా తీర్చి దిద్దారు. దళితులు రాసిన దళిత నవలలన్నింటిలోనూ దళిత స్త్రీవాద తత్త్వం చక్కగా ప్రతిఫలిస్తుంది. ఈ నవలలన్నింటిలోని దళిత స్త్రీ పాత్రల్ని పరిశీలించినప్పుడు కొలకలూరి మధుజ్యోతిగారు దళిత కథల్లో స్త్రీ పాత్రల్ని విశ్లేషించే సందర్భంలో ‘‘దళిత కులాలలో స్త్రీకి సమప్రాధాన్యం ఉంటుంది. అది దాదాపు అన్ని విషయాల్లోను ఉంటుంది.’’ (మధుజ్యోతి, ఆధునిక తెలుగు సాహిత్యం-దళిత సంస్కృతి, పుట:48 అని చేసిన వ్యాఖ్య దళిత నవలల్లో స్త్రీపాత్రలకు కూడా సరిపోతుంది. దళిత స్త్రీ తత్వాన్ని పరిశీలించినప్పుడు దళితుల్లోని మాదిగ, మాల కులాలకు చెందిన స్త్రీల తత్త్వాన్ని చిత్రిస్తూ కొంత సాహిత్యం వచ్చినా, దళితుల్లోని అన్ని ఉపకులాల స్త్రీల తత్త్వం ఇంకా రావలసి ఉందని తెలుస్తుంది.

ఆధార గ్రంథాలు:

1. ఎజ్రాశాస్త్రి, దుగ్గనపల్లి. మా ఎర్ర ఓబన్నపల్లె (నవల), మల్లెతీగ ముద్రణలు, విజయవాడ, సెప్టెంబరు, 2018

2. కళ్యాణరావు, జి. అంటరానివసంతం(నవల), విప్లవ రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్,(మొదటి ముద్రణ:2000), 2008.

3. కృష్ణ, కదిరె. పొద (నవల). బర్డ్స్ ప్రచురణలు, హైదరాబాదు. 2010.

4. గౌరి, జాజుల. వొయినం (తెలంగాణ నవల), విశాల సాహిత్య అకాడమి, హైదరాబాదు2012.

5. చంద్రశేఖరరెడ్డి, రాచపాళెం. కె.లక్ష్మీనారాయణ. ( సంపా.) 1980 తర్వాత తెలుగు దళిత నవల (వ్యాస సంకలనం), రమా పబ్లికేషన్స్, అనంతపురం, 2003.

6. జంగయ్య, బోయ. జగడం. బోజ ప్రచురణలు, నల్గొండ, 2003.

7. జోతీరావు ఫూలే, గులాంగిరి (తెలుగు అనువాదం: ఏలూరి రామయ్య) హైదరాబాదు బుక్ ట్రస్ట్, 2003.

8. నారాయణరెడ్డి.సి. (ప్రధాన సంపాదకుడు) బాబా సాహెబ్ అంబేద్కర్ రచనలు- ప్రసంగాలు, సంపుటి-7, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ, హైదరాబాదు.1992

9. ముత్యాలు, భూతం. సూర (దళిత నవల), గుంపు సాహితీ సంస్థ. నల్లగొండ. 2004.

10. మధుజ్యోతి, కొలకలూరి. ఆధునిక తెలుగు సాహిత్యం- దళిత సంస్కృతి. జ్యోతి గ్రంథమాల, హైదరాబాదు. 2013.

11. మధుజ్యోతి, కొలకలూరి. దళిత సౌందర్య తత్త్వం. తెలుగు అకాడమి, హైదరాబాదు.

12. వెంకటేశ్వరరావు, దార్ల. దళిత స్త్రీవాదాన్ని వివరించిన 'మంకెనపువ్వు' (వ్యాసం), దట్స్ తెలుగు అంతర్జాల పత్రిక, 19 నవంబరు 2015

13. శ్రీభవ్య. ‘‘ డా. కొలకలూరి ఇనాక్ రాసిన మొదటి దళిత స్త్రీవాద కధ ఊరబావి’’ (వ్యాసం), మే, 2014, సరసభారతి ఉయ్యూరు, అంతర్జాల పత్రిక.