పరిచయం:

రంధి.. అంటే పేచీ. గుంటూరు జిల్లా ‘వేజెండ్ల’ గ్రామనేపథ్యంలో చిత్రించబడ్డ ఈకథ, గ్రామంలో అత్యంత శక్తివంతమైన ఒక భూస్వామ్యకుటుంబానికీ, అదే భూస్వాముల ప్రాపున, వారి మోచేతినీళ్ళు తాగుతూ బ్రతికే మాదిగ కుటుంబానికీ  మధ్య జరిగిన ‘రంధి’ కథ. కథాకాలం ఇదీ అని రచయిత ఎక్కడా నిర్దిష్టంగా చెప్పకపోయినా “తీర్మానం”లో  చేయబడిన సూచనను బట్టి, ఇది స్వాతంత్ర్యానంతరం, భారతరాజ్యాంగం అమలులోనికి వచ్చిన సంవత్సరం, అంటే 1950-60 మధ్యలో జరిగినట్టుగా ఊహించవచ్చు. 

కథ - సమీక్ష:

కథాప్రారంభంలోనే ఊరిప్రజలు బహిర్భూమికి వెళ్ళడానికి ఉపయోగించే తాటితోపు వర్ణన... అక్కడ విచ్చలవిడిగా తిరిగే ఏనుగుల్లా బలిసిన పందులూ, పందులంత బలుపు లేకపోయినా, సమూహబలం యొక్క ప్రయోజనాన్ని గుర్తించి, గుంపులుగా తిరుగుతూ పందుల్ని వెంటాడి, వేటాడి, చివరికి భక్షించే కుక్కలూ, ఇది మాత్రమేకాక ఆ తాటితోపులో పేరుకుపోయిన కుళ్ళూ, కశ్మలం, దుర్గంధం, అందులోనే తిండివెతుక్కునే పందులూ.... వీటిని పాఠకుడి ఒళ్ళు జలదరించేలా చేసిన వర్ణన చదువుతున్నప్పుడు, “వర్ణించడానికి ఈయనకి ఇంతకంటే సుందరమైన దృశ్యం ఇంకేదీ దొరకనేలేదా. ఎందుకు పందుల్ని లేళ్లను వర్ణించినట్టూ, దుర్గంధాన్ని  మల్లెల సౌరభాన్ని వర్ణించినంత ఆనందంగానూ ఇలా వర్ణిస్తున్నాడీయన? దేనికీ?” అని  పాఠకుడు కించిత్ విస్మయానికీ, ఇంకాస్త  కోపానికి గురైతే  అది వాడి(పాఠకుడి) తప్పు మాత్రంకాదు.

కాని, అలా కోపానికి గురౌతున్నప్పుడు,  చదవడం ఆపుచేసి, పుస్తకం మూసేసి, కళ్ళుమూసుకొని,  కా...స్త ఆలోచిస్తే,  అలా వర్ణించడం వెనుక  గల రచయిత అంతరార్దం తేటతెల్లమౌతుంది. అశుద్దాన్ని తిని జీవించే పందుల్ని చచ్చిన గొడ్లని తింటూ  బ్రతుకీడ్చే  శాపగ్రస్తులైన మాదిగల జీవితాలకు ప్రతీకలుగానూ,  శారీరకంగా బలహీనులైనా గుంపుబలంతో,  బలిసిన పందుల్ని అనాయాసంగా  చంపుకుతినే కుక్కల్ని...అవి పులులూ సింహాలే కానక్కరలేదు.. కులబలంతో ధనమదంతో అంటరానికులాల్ని దోపిడీ అణచి వేతలకు గురిచేస్తున్న భూస్వామ్యవవస్థకు చిహ్నంగానూ చెప్పీ చెప్పకుండా పాఠకుడికి తెలియజేసే ప్రయత్నంగా   అర్దం కావచ్చు.  ఆ విషయం గ్రహించగలిగితే...’కుక్కలు తరిమితే పందులు చనిపోతాయి. దొరలు తిడితే, కొడితే, చంపితే, మాదిగలు పడతారు. గతిస్తారు’ అన్న రచయిత ఆక్రోశానికి దాన్ని  అనుసంధానించుకుంటే... మున్ముందు తనేమి చదవబోతున్నాడో అన్న విషయం కూడా, ఎందుకంటే అదింకా నవలకి మొదలేగాబట్టి,   పాఠకుడికి అవగతమౌతుంది. ఈ విధంగా పాఠకుడి జ్నాననేత్రం కొద్దిగా తెరుచుకున్న తరువాత, అతనిలో చోటుచేసుకుంటున్న జుగుప్స, రోత, అసహ్యం లాంటి భావాలు తొలగిపోయి, వాటి స్థానంలో పీడనకు గురౌతున్న  మాదిగలపై కాస్తంత సానుభూతి ఏర్పడడం ప్రారంభమౌతుంది. అప్పుడు  చదవడం మళ్ళీ ప్రారంభించాక. పాఠకుడు నవలని ఇక కింద పెడతాడనుకోను.  ఏకబిగిని చదవడం పూర్తిచేస్తాడు.

ఎందుకంటే పైన చెప్పినట్టు ఇది రెండుకుటుంబాల మధ్య..కాదు కాదు, రెండు వర్గాలమధ్య జరిగిన రచ్చ గూర్చిన కథ గనుక. అయినంత  మాత్రాన ఏకబిగిని చదివిస్తుందా అంటే కాదనే సమాధానం చెప్పాల్సివస్తుంది. అప్పుడు, ఈనవల మాత్రమే ఎందుకు అలా చదివిస్తుంది అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఆ ప్రశ్నకు  “ఇది మన వశిష్టగోదావరిలా మెత్తగా మంద్రంగా సాగిపోయే కథకాదు గనుక. దట్టమైన అడవులగుండా ప్రవహించే అమెజాన్ నదిలా చిత్రమైన మెలికలు తిరుగుతూ సాగే కథ గనుక” అని సమాధానం చెప్పాల్సి వస్తుంది.

జరిగిన రచ్చలో ప్రతీ ముఖ్యమైనఘట్టంలోనూ “ఇదిక్కడితో సరి. మాదిగల పనైపోయింది” అని పాఠకుడు నిశ్చయంగా అనుకున్న ప్రతీచోటా  కథ చిన్నదో పెద్దదో ఒక మలుపు తిరుగుతుంది. ఆ మలుపులో బలవంతుడైన పీడకుడు నేలకరుస్తాడు.  ఓడిపోయారనుకున్న పీడితవర్గానిది పైచేయవుతుంది. అయితే, ఇక్కడ వక్రోక్తి (irony) ఏంటంటే, తాము కిందపడ్డట్టు పడిన పీడకునికి అవగతమౌతుందిగాని, పైచేయి సాధించిన  పీడితునికి  మాత్రం ఆవిషయం అర్దమైనట్టు కనిపించదు. ‘దయచూపమనీ, కనికరించమనీ, రక్షించమనీ’ ఇంకా భూస్వామి కాళ్ళావేళ్ళా పడుతూనే ఉంటాడు.  గెలిచిన తరవాత కూడా  వీడెందుకు ఇంకా వాడి కాళ్ళుపట్టుకొని వేళాడుతున్నట్టు...అని పాఠకుడు కోపం తెచ్చుకోవచ్చు. వాడికి నిజంగా అర్దంకాకే అలాచేస్తున్నాడా లేక వ్యూహాత్మకంగా వేస్తున్న ఎత్తుగడా అన్న అనుమానంకూడా కలగొచ్చు.  కాని, పుస్తకం మూసేసి, మళ్ళీ ఇంకొకసారి కాస్త శాంతంగా ఆలోచిస్తే ‘శతాబ్దాల తరబడి అణచివేతకూ, దోపిడీకి గురౌతున పీడితునికి...వాడు హిందూదేశంలో అంటరానివాడైనా, అమెరికాలో నల్లజాతివాడైనా, వాడు గెలిచినా గెలిచినట్టు గ్రహించగలిగే శక్తి మొద్దుబారిపోతుందనీ,  గెలుపు అనేది అసలు వాడికి అర్దమే కాని ఒక సంశ్లిష్టమైన రహస్యం అనీ, అందుకే వాడు అణగదొక్కేవాడి కాళ్ళుపట్టుకొని వదలడనీ, వదలలేడనీ’ అర్దమౌతుంది. పర్యవసానంగా అణచివేతకు గురైనవాడిమీద అప్పటికే ఏర్పడిన సానుభూతి రెట్టింపవడం మాత్రమే కాక సహానుభూతి (empathy) కూడా చోటుచేసుకుంటుంది. ‘అలాంటి భయంకరమైన పరిస్థితిలో నా తల్లో, నా భార్యో, నాపిల్లో ఉంటే? అని ప్రశ్నించుకోకుండా ఉండడం అసాథ్యమౌతుంది. 

కథ విషయానికి వస్తే... ఇది రెండు వర్గాల మధ్య సంఘర్షణ అనుకున్నాం కదా.  రెండు వర్గాలకీ రెండు కుటుంబాలు ప్రాతినిధ్యం వహిస్తాయి ఈ రంధిలో. ముందు భూస్వామ్య వర్గానికి చెందిన కుటుంబం గురించి చూద్దాం. ఈ కుటుంబం అంతా కలిపి ముచ్చటగా ముగ్గురే. కుటుంబయజమాని ‘నాంచారయ్యా’, అతని భార్య లచ్చిందేవీ, వారి కొడుకూ,  ఈ కథకి ప్రతినాయకుడూ అయిన ‘రాముడూ’. కుటుంబం చిన్నదే గాని   విస్తారంగా వ్యవసాయ భూములూ, పశుసంపదా, పర్యవసానంగా పోగుపడ్డ ఐశ్వర్యం, దాన్ని పదింతలుగా అభివృద్దిచేసే వడ్డీవ్యాపారం, వీటితోపాటూ అప్రయత్నంగా ఒంటబట్టే దురహంకారం, ఆభిజాత్యం మెండుగాఉన్న శూద్రకుటుంబం. అయితే ఆశ్చర్యంగా,  ఇంటిఇల్లాలు లచ్చిందేవి మాత్రం ఇటువంటి రాగద్వేషాలకు అతీతమైన పరమ సాత్వికురాలు. 

రెండవకుటుంబం కోటిగాడు అని అందరితోనూ పిలవబడే మాదిగకోటయ్య కుటుంబం. హిందూకులవ్యవస్థలో అట్టడుగున ఉన్న మాదిగలుకూడా చిన్నచూపుచూసే ‘అలగామాదిగవర్గానికి’ చెందినవాడు కోటయ్య. బానిసలకు బానిస. ఇతనిదీ చిన్న కుటుంబమే కాని నిరుపేదకుటుంబం. భార్య ‘బూది’ తల్లి ‘లింగీ’ కాక కూతురు ‘సువార్త’...ముద్దుపేరు...‘సువ్వి’. ముగ్గురే.  ఈ కథకి ‘కథానాయకి’  సువ్వి.

నాయకీ, ప్రతినాయకుడూ గుంటూరులో చదువుకోవడానికి ప్రతీరోజూ వేజెండ్లనుండి రైల్లో వెళ్ళిరావడంతో కథ మొదలౌతుంది.  రాముడు, తండ్రి పెంపకంలో పరమఅహంకారిగా తయారై, తన ఇష్టాన్ని ఎదురులేకుండా చెల్లించుకొంటూ వస్తున్న గారాలబిడ్డ మాదిగపిల్లైన సువ్వి చదువుకోవడమేకాక, తనతో పాటు సమానంగా రైల్లో ప్రయాణించడంకూడా సహించలేని దురహంకారి. సువ్విని తను ఎక్కే రైలుపెట్టెలో ఎక్కొద్దంటాడు. తన ఎదురుగా కూర్చోవడానికి వీలులేదంటాడు  ఎప్పుడైనా పొరపాటున అలాంటిదేదైనా జరిగితే సహించలేడు.  ఆపిల్లని  ‘నువ్వు నల్ల తుమ్మమొద్దులా ఉన్నావని’ వేళాకోళం చేయడం మాత్రమేకాక అనేక విధాలుగా పీడనకి గురిచేస్తాడు.

వాడి హింస భరించలేని సువ్వి, మాదిగలకు సహజంగా ఉండే భయాందోళనలూ ఆత్మన్యూనతల  కారణాన రాముడ్ని తప్పించుకొని తిరిగేందుకే ఎల్లప్పుడూ ప్రయత్నించినా, వాడికి ఎదురుపడక తప్పనప్పుడు వాడుచేసే దుర్మార్గపుపనులకు ఒళ్ళుమండి,  వాడికి ఎదురుతిరగడం తప్పేదికాదు. ఆఖరుకు ఒకరోజు పరిస్థితులు శృతిమించి, రాముడు సువ్విని చెయ్యిచేసుకునే వరకూ, సువ్వి వాడిమీద తిరిగి చెయ్యేత్తేవరకూ  వస్తుంది విషయం.

తరవాత పరిస్థితి కాస్త సద్దుమణిగినట్టు కనిపించినా, నాయకి పెద్దదై అందాలు సంతరించుకోవడం మొదలయేసరికి ప్రతినాయకునికి “రంధి” (‘రంధి’ అంటే ఇంగ్లీషులో lust అనే అర్దంకూడా ఉంది) పుట్టుకొస్తుంది.  ‘మంచితనం ముఖానికి పులుముకొని, బుద్దిమంతుళ్ళా’ నటించబోతాడు. నాయకి వాడిని ఖాతరు చేయదు. అయినా వాడు పట్టువదలని విక్రమార్కునిలా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడమేకాక, సువ్విచేతిలో ఒకసారి చెంపదెబ్బా ఇంకొకసారి ముక్కు అదిరిపోయేలా ముష్టిఘాతం కూడా రుచిచూడాల్సివస్తుంది. దానితో రాముడిలో పౌరుషం ప్రకోపించి, ‘మాదిగలంజా నిన్ను నెత్తురుకారేట్టు చెరచకపోతే నాపేరు రాముడేకాదు’ అని శపథం  చేసేవరకూ వెళ్తుంది కథ.  ఆ తరవాత రకరకాల మలుపులు తిరుగుతూ సాగుతుంది. 

పాత్ర చిత్రణా వైశిష్ట్యం:

ఇప్పుడు నవలలో పాత్రలను పరిశీలిద్దాం. రాముడి తండ్రి నాంచారయ్య భూస్వామ్యవ్యవస్థకూ, దానికి ప్రతీకలైన ప్రతీఅవలక్షణానికీ కరడుగట్టిన ప్రతినిథి.   జీతగాళ్ళుతప్ప, బంధువులంటూ లేనివాడు. లేనివాడంటే అసలు బంధువులే లేరని కాదు, ఉన్నవాళ్ళని ఎవరినీ దరిచేరనివ్వని అహంకారి.     డబ్బుసంపాదన తప్ప జీవితానికి వేరే పరమార్దం లేదని నమ్మే లోభి.  దానికొరకు అనేకమైన హత్యలు, తనచేతికి రక్తపుచుక్క  అంటకుండా,  అతిలాఘవంగా జరిపించినవాడు. తన కొడుకుకూడా తనలాగే “ప్రయోజకుడు” కావాలని మనసావాచా ఆకాంక్షించడమేగాక, వాడిని ఆవిధంగా తీర్చిదిద్దిన వాడు కూడా.   రాముడు సువ్విని చెరుస్తానని ఒట్టుపెట్టుకుంటే, వాడిచేతినుండి సువ్విని కాపాడమని వేడుకోవడానికి వచ్చిన కోటితో ‘ఎందుకురా మాదిగముండకు సతుకు! రాముడు దాన్ని చెరుత్తాడు. వారంరోజులో, పదిరోజులో అదాడి కాళ్ళకాడ పడిఉంటాది.  ఆ పైన పెళ్ళిచెయ్’ అని వదరిన వదరుబోతు. ‘ఆ తరవాత దాన్నెవడు పెల్లాడతాడు దొరా’ అని వేదనతో ప్రశ్నించిన కోటికి ‘డబ్బుపారేత్తే ఎవడైనా కడతాడు తాళి. నేను పారేత్తా డబ్బు. పో’ అని సమాధానం చెప్పిన పొగరుబోతు. అలాంటి దుర్మార్గుడు కొడుకు మాదిగపిల్లని చెరుస్తానని ప్రతినబూనితే, ఒద్దని సుద్దులు చెప్పకపోవడంలో ఆశ్చర్యంలేదుగాని, ఆ ప్రతిన నెరవేర్చడంలో కొడుక్కి మార్గదర్శకత్వం నెరపకపోగా,  ఆ బృహత్కార్యాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తించడానికి కావలసిన ప్రణాళిక రచించడంలో గాని,  దాన్ని అమలుపరచడంలోగాని జోక్యంచేసుకోకుండా, ఆ బాధ్యత అంతా వాడికే  వదిలెయ్యడం మాత్రం  ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.  

రాముడి పాత్ర పరిచయం:

రాముడి విషయానికి వస్తే, వాడొక పెద్ద చిక్కుప్రశ్న(enigma) ఈ నవలలో. గర్వి, అహంకారి, అన్నమాట నిజం. వాడి ప్రవర్తనలో ఆవిషయం చాలా స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.  కాని, వాడినొక ప్రహేళికగా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే, ఒక్క సువ్వి వెనక మాత్రమే పడి ఆమెను సతాయించడం, అవమానించడం, ఆఖరుకు చెరుస్తానని ప్రతినబూనడం తప్ప, ఊరిలో వాడికి ఎంత ఎదురులేకపోయినా, వాడేంచేసినా నోరెత్తేవాడే లేకపోయినా,  వాడింకొక ఆడదాని వెంటపడి క్షోభపెట్టినట్టుగాని, ఇతరేతర  అవలక్షణాలు ఇంకేమైనా కలిగిఉన్నట్టుగాని  దాఖలాలు లేవు. అంతేకాకుండా, సువ్విని మానభంగం చేసే ప్రయత్నంలో సఫలీకృతుడు కాకపోయినా,  తన స్నేహితులతో మాత్రం మానభంగం చేసానని గొప్పలుచెప్పుకుంటాడు.

జీవితంలో అన్నీ పరాజయాలే రాముడికి. అనుకున్నదేదీ సవ్యంగా చెయ్యలేని దుర్బలుడి (imbecile)గా మిగిలిపోతాడు నవలలో. అందరిముందూ వాగినట్టు సువ్విని మానభంగం చెయ్యలేడు. ఆమె పెళ్ళిఆపలేడు.  ప్రతిజ్నచేసినట్టు ఆమెను హత్యచెయ్యలేడు. జీవితంలో దారుణంగా విఫలమౌతాడు. ఆఖరు ప్రయత్నంగా సువ్విని చంపడానికి,  నర్సుని బ్రతిమాలి తెచ్చుకున్న మత్తుఇంజక్షన్ తనకుతానే చేసుకొని, ఆత్మహత్యచేసుకుంటాడు.  అదికూడా తన ప్రత్యర్థి  చందిరి సహాయసహకారాలు తీసుకొని మరీ ఆత్మహత్య చేసుకుంటాడు.

అయితే వాడు సువ్విని మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నట్టూ, ఎందుకు అంత దారుణంగా పీడించినట్టు అన్న ప్రశ్నకి  సమాధానం వెంటనే దొరకదు. దానికొరకు పాఠకుడు చివరివరకూ వేచి చూడాల్సిందే. ‘‘సువ్విని ఎక్కడైనా తాకడం తన హక్కుగా భావించడంవల్ల వెయ్యరానిచోట చెయ్యి వెయ్యడం, ఊహించని ప్రతిఘటన ఎదురవడంతో తట్టుకోలేక పోతాడు. తిరుగుబాటు తనమీద కాదనీ, తనకులం మీదని భావించడంతో రెచ్చిపోతాడని’ పాఠకుడు భావించేలా కథ చివరివరకూ నడిచినా, రాముడు అలా ప్రవర్తించడానికి అసలు కారణం వాడు సువ్విని ప్రేమించడమేననీ, సువ్వి మాదిగపిల్ల గనుక ఆప్రేమను  ధైర్యంగా వ్యక్తపరచలేక ఆవిధంగా వక్రంగా ప్రవర్తించాడనీ నాంచారయ్య మాటల్లో బహిర్గతమౌతుంది. అప్పటికి రాముకు ఆత్మహత్యచేసుకొని మరణిస్తాడు. అవిషయం  పాఠకుడి ఊహకు అందకుండా చివరివరకూ చాకచక్యంగా  కథనడిపించడంలో  రచయిత చతురత బహిర్గతమౌతుంది.      

సువ్వి - పాత్ర ఔన్నత్యం:

నవలా నాయిక, సువ్వి... ఒక సాదాసీదా మాదిగపిల్ల అనుకుంటే పాఠకుడు పప్పులో కాలేసినట్టే. అప్పుడప్పుడే నిద్రలేస్తున్న అణగారినవర్గాల నవచైతన్యానికి ప్రతిరూపం సువ్వి. అణచివేతను అణచివేయాలని  అట్టడుగువర్గాలలో మొగ్గతొడుగుతున్న తిరుగుబాటుతత్వానికి అపరావతారం. చదువుకుంటే తప్ప విముక్తిలేదనే సత్యాన్ని ఆకళింపు చేసుకుంటున్న నిరక్షరాస్యులైన మాదిగజాతికేకాక, యావత్ స్త్రీజాతికే   ప్రతిరూపం. రాముడ్ని చెంపదెబ్బ కొట్టడంలో, చందిరిని పెళ్ళిచేసుకోవడానికి నిర్ణయించుకోవడంలో, కొడుకు చేసిన తప్పుకి పరిహారంగా నాంచారయ్య ఇవ్వజూపిన ధనాన్ని తిరస్కరించడంలో, పెళ్ళై, శోభనం అయ్యాకకూడా  చదువుకొనసాగించడంలో, అందుకు భర్తని ఒప్పించడంలో....ప్రతీ దానిలోనూ సువ్విలో ఉన్న క్రియాశీలతా  తెగువా మాత్రమేకాక,  తిరుగుబాటుకి సన్నద్దమౌతున్న మొదటితరానికి చెందిన యోధుల్లో అంతర్లీనంగా ఉండే భయం, అవిశ్వాసం,   వాటిని  జయించడానికి చేసే ప్రయత్నాలూ...అన్ని స్పష్టంగా విశదమౌతూనేఉంటాయి. అందుకే ‘వెయ్యరానిచోట చెయ్యివేస్తే   తిరగబడ్డ ఆడతనం ఆమెతో రాముణ్ణి చెంపదెబ్బకొట్టించినా, కులంకూడా ఆము పెంచుతుందని తెలిసికూడా అవమానం భరించలేకపోవడంవల్ల తిట్టుకు తిట్టూ, వేటుకు వేటుగా నిలబడిందిగాని రాముడి ప్రతిజ్నకు భయపడి ఇంట్లోనే ఉండిపోసాగింది’ అని అమెను వర్ణించడం,  ఆమెలో గూడుకట్టుకొని ఉన్న ద్వందప్రవృత్తినీ, సంఘర్షణనూ పాఠకునికి  తెలియజేసే ప్రయత్నంగా భావించవచ్చు.  

ఇతర పాత్రలు: 

నవలలో ఇతర పాత్రల విషయానికి వస్తే, ఇంకొక అతిముఖ్యమైన పాత్ర చందిరి. వాడొక  దిక్కూమొక్కూలేని అనాధ.  ఎవరేపని చెప్పినా కాదనకుండా చేసిపెట్టే మంచిమనిషి. భీమబలుడు. అయినా సరే చీమకి కూడా అపకారం తలపెట్టనివాడు. సువ్వికి అనధికారిక అంగరక్షకుడూ, మూగప్రేమికుడూకూడా. మూగప్రేమికుడు మాత్రమేకాడు నిజంగా కూడా మూగవాడే. మాట రానివాడు, మాట్లాడలేనివాడు. డార్లింగ్ ఆఫ్ మాదిగపేట.

ఈ నవలలో అన్ని పాత్రలకన్నా ఉదాత్తమైన పాత్ర. చందిరి ఉదాత్తత ఎంత గొప్పదంటే, సువ్వికీ వాడికీ పెళ్ళి జరిగేరోజు  ఉదయం, తాటితోపుకు వెళ్ళిన సువ్విని అక్కడ  మానభంగం చేయబోతాడు రాముడు. విషయం తెలుసుకున్న మాదిగపేట అట్టుడికినట్టుడికినా, సహజసిద్దమైన భయంకొద్దీ,  గొడవచేయడం సరే కనీసం ఊరిపెద్దలదృష్టికి తీసుకెళ్ళడానికి కూడా సిద్దపడరు.  వారి భయమంతా సువ్వి చెడిపోయిందనీ,  ఆమెకు ఇక పెళ్ళికాదనీ. అటువంటి పరిస్థితుల్లో, ముందుగా అనుకున్నట్టు సువ్వి మెడలో మూడుముళ్ళూవేసి తన విశ్వసనీయతనూ,  మగతనాన్నీ  చాటుకున్న మగధీరుడు  చందిరి.

అయితే, అటువంటి ధీరోదాత్తుడు కూడా,  అంతకు కొన్నిరోజుల ముందు, ‘సువ్వి మానం కాపాడతానని మాట ఇచ్చిందాకా నీకాళ్ళు వదలను దొరా’ అన్నట్టు  నాంచారయ్య కాళ్ళూ,  ఆతరవాత ‘సువ్విని చెరచొద్దని’  రాముడికాళ్ళూపట్టుకొని చిన్నపిల్లాడిలా ఏడుస్తూ ప్రాధేయపడే ప్రయత్నంలో, వారితో తన్నులు తింటాడుగాని, దొరల  గొంతు పట్టుకునే ధైర్యంమాత్రం చెయ్యడు. ఈ సంఘటన అసంబద్దంగా కనిపించినా,   తరతరాలుగా మస్తిష్కంమీద బలంగా ముద్రించుకుపోయిన బానిసమనస్థత్వం యొక్క ప్రభావం బహిర్గతమౌతుంది  ఈసన్నివేశంలో. అలాంటి మనస్థత్వాన్ని విసర్జించడానికి,  సువ్విమీద జరిగిన ప్రయత్నంలాంటిది  ఒక్కటి మాత్రమే చాలదనీ,  అలాంటివి అనేకమైనవి జరిగితేనేగాని, శతాబ్దాలకాలంగా భయంనీడలో బ్రతుకుతున్న జీవన్మృతులలో చలనం కలగదనీ,  అంతవరకూ చందిరిలాంటి బలశాలికూడా దోపిడీదారు కాళ్ళే పట్టుకుంటాడుగాని, గొంతు పట్టుకోడనీ,  పట్టుకోలేడనీ, అలాపట్టుకోవాలన్న ఆలోచనే వాడికి రాదనీ, పాఠకుడు గ్రహించాల్సి ఉంటుందిక్కడ.

‘మాటలురాని మహాపండితుడు మామాదిగోడు’ అని పెదమాదిగతో ప్రశంసించబడిన చందిరికి మాటరాకపోతేనేం, వాడికి ఏంటి నష్టం అని అనిపించడం ఎంత సహజమో, ‘మొగోడివి, మొనగాడివి, ఈరుడివీ. తెలియటంలేదా. మొగోడంటే ఈడే. అసలు సిసలు మొగోడు’ అని  చందిరిని ప్రశంసిస్తూ తాత పలికినమాటలు చదువుతుంటే “ఆడు మగాడ్రా బుజ్జీ” అన్న  సినిమాడైలాగు గుర్తురావడం కూడా అంతే సహజం. “రంధి” నవలకి నిస్సందేహంగా నాయకుడు చందిరిగాడే అని పాఠకుడు అనుకునేటంత ఉదాత్తంగా చిత్రించబడిన పాత్ర... చందిరి పాత్ర. 

మిగిలిన పాత్రల్లో చెప్పుకోదగ్గ ముఖ్యమైన పాత్రలు రెండే. ఒకటి తాతపాత్ర అయితే రెండోది బైరాగి పాత్ర. వీరిద్దరినీ “మార్గదర్శకమండలి”గా అభివర్ణించొచ్చు.  ముఖ్యంగా తాత.  తిరుగుబాటును ప్రేరేపించడంలో ఉత్ప్రేరకపాత్ర పోషించినది నిస్సందేహంగా తాతే.  ‘ముసిలాడ్ని నా దొమ్మలేం పగలగొడతావుగాని కుర్రాళ్ళ దొమ్మలు పగలగొట్టు’ అంటూ మాదిగ కుర్రాళ్ళని రెచ్చగొట్టడంలో గాని, ‘మీలో మొగోడంటూ ఉంటే సెడిపోయినదాన్ని కట్టుకోండిరా’ అని వాళ్ళని సవాలు చెయ్యడంలోగాని, ‘ఒరేయ్ ఇటురా. మొగుణ్ణొదిలేసిన మనిషిని మీ నాయిన పెల్లాడ్లితే నువ్వు పుట్టేవు’ అంటూ చందిరి గురించి చులకనగా మాట్లాడిన ఇంకొకడి సిగ్గుతియ్యడంలోగాని, ఆలోచనా విధానంలో గాని, పరిణతిలో గాని,  తన కాలానికంటే చాలాముందున్న మోటుమేధావి(rustic intellectual) తాత. ఇక మాదిగపెద్దలకు మార్గనిర్దేశకత్వం చెయ్యడంలో తాత చూపిన చతురత చాణక్యుడ్ని తలపింపజేస్తుంది.

బైరాగి,  చందిరిని తీర్చిదిద్దడంలోనూ,  వారిద్దరికీ మాత్రమే అర్దమయ్యే భాషలో వాడికి  జ్నానోపదేశంగావించడంలోనూ, రాముణ్ణి తుదముట్టించడానికి వాడ్ని కార్యోన్ముక్తుడ్ని చెయ్యడంలోనూ  తనవంతు పాత్ర సమర్ధవంతంగా పోషించాడు.

రచనా నేపథ్యం:

“మాదిగ తిరుగుబాటు” ఈ నవలకు గుండెకాయవంటిది. మొదలైన దగ్గరనుండి ముగిసేవరకూ అంతులేని ఉత్కంఠతో సాగిన మహాప్రస్థానం. ‘అగ్రహారం ద్వేషించినా, ఊరు ప్రేమించకపోయినా, ఊరినీ, ఊరిప్రజలనీ ప్రేమించే మాదిగలు, ఆపదలో ఉన్న తమని అంటుకోవడానికి శూద్రులకు అంటు అడ్డం వచ్చినా, ఆపదలో ఉన్న శూద్రులను రక్షించడానికి అదే అంటు అడ్డంరాని మాదిగలు, గోచిగుడ్డకు చేయి అడ్డంపెట్టుకొని మానంకాపాడుకునే మాదిగలు’ తరతరాల అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు బాటతొక్కడం...కచ్చితంగా ప్రపంచపు ఎనిమిదో వింతే.

తిరగబడడం మాత్రమేకాక, ఆ తిరుగుబాటుని ఒక తార్కికమైన ముగింపుకి తోడుకొనిపోవడంలో  మాదిగపెద్దలు,  ముఖ్యంగా మాదిగపెద్ద ప్రదర్శించిన చతురత  శ్లాఘనీయం. ‘ఆడు దొరబిడ్డ. మనమనగానెంతా? మనబిసాదెంత? దగ్గర మొదలుబెట్టి ‘మన పుటకేం పుటక? మాదిగపుటక. ఆళ్ళపుటకేం పుటక! దొరలపుటక! ఆళ్ళొకటంటారు. మనం అనిపించుకోవాల. ఆళ్ళొకటేత్తారు. మనం ఓర్చుకోవాల’ అన్న నిజాన్ని నిర్వేదంగా తెలియజేస్తూ, ‘మనకా డబ్బూ దసకంలేదు. మందీమార్బలం లేదు. మనబతుకులు ముళ్ళకంపమీద బట్టలు. ఆటిని సిరక్కుండా సూసుకోవాలి’ వంటి జీవితసత్యాలను బోధపరచినట్టే బోధపరుస్తూ, చివరికి  ‘ఇట్టా జరిగితే మనం ఊరికే పడుండమన్న సంగతన్నా తెలుసుద్ది’ అన్నంతవరకూ చర్చను  నడిపించి, అక్కడికొచ్చాక ‘అట్టాగే కానీయండి’,   ‘అదే బాగుంటుంది’, ‘సరేమరి’ ‘మీరెట్ట జెప్తే అట్టా’ అని మిగిలిన నలుగురు పెద్దలూ తలూపేలాచేసి,  తిరుగుబాటుకు తెరతీసిన వ్యవహారదక్షుడు  మాదిగపెద్ద.

ఆ కౌశలం అక్కడితో ఆగిందా అంటే...ఆగలేదు. నాంచారయ్యనీ రాముణ్ణీ పంచాయితీకి రప్పించడం మాత్రమేకాక, ఇస్తానని ఒప్పుకున్న నష్టపరిహారం సువ్వి చేతికి అందించడానికి సాక్షాత్తూ రాముణ్ణే మాదిగపల్లెకు రప్పించేలా చేసింది. అక్కడితోనూ ఆగలేదు.   ‘మమ్మల్ని కులంపేరుతో తిట్టొద్దు దొరా’ ‘మీ తల్లులు మీకు దేవతలైనట్టు మా తల్లులు మాకూ దేవతలే’ అని హెచ్చరించేవరకూ, ‘తప్పుచేసేది మీరూ, దండించేది మమ్మల్నీనా’ అని ప్రశ్నించేవరకూ క్రమవికాసం చెంధిందికూడా. జరుగుతున్న నాటకాన్ని అలా చాకచక్యంగా నిర్దేశిస్తూనే  ‘ఆళ్ళ మజ్జ దెబ్బలాటలో మాదిగలు ఓటమి ఖాయం’ అన్న పరమసత్యాన్ని  దృష్టిపథంనుంచి దూరంచేసుకోకుండా, ‘మీమాటే మాకు వేదం’ అంటూ ఒకపక్క పంచాయితీ పెద్దలనూ, ఇంకొకపక్క నాంచారయ్యనూ శమింపజేస్తూనే, తను అనుకున్నది సాధించడంలో సఫలీకృతుడౌతాడు మాదిగపెద్ద.

ఇంతచేసి ఎక్కడో ఆకాశాన కూర్చున్న నాంచారయ్యను నేలమీదకు దిగలాగిన మాదిగపెద్దలకు ‘సువ్వి’ నష్టపరిహారాన్ని నిర్ద్వందంగా నిరాకరించడం ఊహించని పరిణామం.  ఆ తరవాత రాముడు సువ్విని చంపుతాననడం, దాన్ని ఆపే ప్రయత్నంలో మాదిగపెద్దలు మళ్ళీనాంచారయ్య శరణుజొచ్చి, అతనిచేత అవమానింపబడడం, సువ్విని చంపడానికి రాముడు చేసిన అపరిపక్వమైన ప్రయత్నాలూ,  వాటిలో వాడు విఫలంచెందడం, సువ్విని చంపడానికి ఆఖరుప్రయత్నంగా  ఆస్పత్రిలో నర్సుకి మాయమాటలు చెప్పి, ఆమె దగ్గరనుండి మత్తుమందు సంపాదించడం, (అనుభజ్నురాలైన ఒకనర్సుని రాముడిలాంటి తెలివితక్కువవాడు అంత సులువుగా బుట్టలోవేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించినా), చివరకు ఆ మత్తుమందుతోనే తనప్రాణాలు తీసుకోవడం....కథ వేగంగా ముందుకు దూకుతుంది. రాముడి మరణంతో ముగుస్తుందనుకున్న కథ ఆ తరవాతకూడా కొనసాగి, నాచారయ్య మారిన మనసుతో, కొత్త అవతారం ఎత్తడంతో ముగుస్తుంది.

కొత్త నాంచారయ్య తన తప్పులు తెలుసుకుంటాడు. అంతకాలమూ మాదిగలయెడల  ఎంత అమానుషంగా ప్రవర్తించాడో గ్రహిస్తాడు. పశ్చాత్తాపం చెందుతాడు. తప్పులు దిద్దుకునే ప్రయత్నం చేస్తాడు.  ఆ ప్రయత్నంలో భాగంగా, మాదిగపల్లెకు వచ్చి, కోటి ఇంట్లోకూర్చొని,  చల్లతాగి, చందిరికి సువ్వికీ పుట్టబోయే కొడుకుని దత్తతచేసుకుంటానని పల్లెప్రజలందరి ఎదుటా ప్రకటిస్తాడు. అంతేకాకుండా తన మరణానంతరం చందిరి మాత్రమే తనకు  తలకొరివిపెట్టాలని కూడా నిర్దేశిస్తాడు.

ఆఖరుకు ‘పందులు ఒంటరిగానే కాదు, ఐకమత్యంతో ఆత్మరక్షణా చేసుకోగలవు. అవసమైతే ఆత్మహానీ చెయ్యగలవు’ అనిచెప్తూ కథ (మాదిగలకోణం నుండి) సుఖాంతం చేస్తారు రచయిత.

భాష - శైలి:

నవలలో కథ ఆద్యంతం ఉత్కంఠతో సాగినా, సుదీర్ఘమైన, సందర్భోచితంకాని  వర్ణనలూ, అనవసరమైన సాగదీతా, కథనంలో లోపించిన సరళతా,   పాఠకుడి ఆసక్తిని కుంటుబరచే అవకాశంలేదని చెప్పడానికి లేదు.  ఉదాహరణకు, పైన చెప్పినట్టు తాటితోపు వర్ణన జుగుప్సాకరంగా అనిపిస్తే అది పాఠకుని తప్పుకాదు.  అలాగే కథ చివరిలో కాటికాపరి జీవితవిధానాన్ని అంత సుదీర్ఘంగా వర్ణించడం కథకు అవసరమా అన్న ప్రశ్నను లేవనెత్తుతుంది. వేరైన రాముడి తలను వాడి శరీరానికి కలిపికుట్టే సన్నివేశాన్ని వర్ణించిన విధానం, తిరిగి కుట్టబడిన కొడుకు శరీరాన్ని చూసిన నాంచారయ్య ’ఆనందంతో ఏడ్చాడు’ అని చెప్పడం మొరటుగా(insensitive) అనిపిస్తుంది కూడా. మధ్యలో వడ్డెరవాడు పందిని చంపే విధానం, పందివారు రుచిని గూర్చి  చేసిన విస్తారమైన వర్ణనా, ఇవి లేకపోతే కథాగమనం కుంటుబడుతుందా?లాంటి ప్రశ్నలకు కాదనే సమాధానం చెప్పాల్సివస్తుంది.  అటువంటి అనావశ్యకమైన వర్ణనలను పూర్తిగా తొలగించిగాని, కనీసం కుదించిగాని  చెప్పిఉంటే నవలయొక్క పఠనీయత (readability) తప్పకుండా పెరిగి,  అన్నివర్గాల పాఠకుల్నీ ఆకట్టుకునేది.

ముగింపు:

చివరిగా,  హిందూదేశంలో దళితులు శతాభ్దాలుగా గురిచేయబడ్డ అణచివేత వట్టి అభూతకల్పన అన్నట్టు  నటిస్తూ,  ఐదారు దశాబ్దాల చరిత్రను  మాత్రమే దృష్టిలో పెట్టుకొని, వారిని ఇప్పటికీ అనేకమైన అవహేళనలకూ, అవమానాలకూ గురిచేస్తూ, దేశంలో ప్రతిభా పాటవాలు మంటగలిసిపోవడానికి వారే ముఖ్యకారకులంటూ మొసలికన్నీరుకార్చే కుహనా దేశభక్తులకు,  నవలలో  కళ్లకు కట్టినట్టు వర్ణించబడ్డ అణచివేతా, దాని పర్యవసానంగా పరమనికృష్టంగా కునారిల్లిపోయిన అంటరానివారి జీవనస్థితిగతులూ కూడా అభూతకల్పనలు గానే కనిపించవచ్చునేమోగాని, తటస్థంగా (objective) విశాలదృక్పథంతో (openmind)  చదివిన ప్రతీపాఠకుడినీ,  గుండెలోతుల్లో స్పృశించి, అక్కడ నిక్షిప్తమైఉన్న ‘తడి’ని  కళ్ళలోకి ఎగదన్నేలా చేసితీరుతుంది “రంధి” నవల. అంతేకాదు. ‘అంటరానితనం అంతరిస్తున్నట్టు అనిపిస్తుంది. కనిపిస్తుంది. వినిపిస్తుంది. వాస్తవమైతే ఎంత అదృష్టం’ అన్న శ్రీ కొలకలూరి ఈనక్ గారి కల నిజం కావడానికి దోహదకారి అవుతుందికూడా.