ఉపోద్ఘాతం:

మన దేశసంస్కృతిలో రామాయణ భారత ఇతిహాసాలకు జాతీయ గౌరవముంది. ఈ ఇతిహాసాల్లో సదాచారం, నీతినియమాలు, ధర్మ నిరతి, భక్తి జ్ఞానవైరాగ్యాలు అన్నిచోట్ల కనిపిస్తాయి. కార్యసాధనలో వ్యక్తిగత సుఖాలను పరిత్యజించి, సత్య ధర్మ న్యాయ సదాచారాలకు ప్రాధాన్యమివ్వటం ముఖ్యమనే విషయాన్ని రామాయణం ప్రభోదిస్తుంది. విశ్వకళ్యాణ భావన, సద్గుణవృద్ధి, సత్యపాలన, సన్మార్గగమనం, దానగుణం, ఆత్మవిశ్వాసం, సక్రమధనార్జన, క్రోధనాశనం, సోదరప్రేమ, శాంతి మొదలగు మానవతా విలువలకు రామాయణం పట్టుకొమ్మగానిలుస్తుంది. సామాజిక వికాశానికి, సంస్కృతి పరిరక్షణకు మంచి మానవ సంబంధాలు ముఖ్యమైనవి. అలాంటి మానవసంబంధాలను ప్రస్ఫుటం చేస్తూ జనుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించి జాతి సమైక్యతకు దోహదం చేసే సందేశాలను రామాయణం మనకు అందిస్తుంది.

మొల్లరామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండలను 6 కాండములున్నవి. అందులోని సుందరకాండ కావ్యానికి ఆయువుపట్టు వంటిది. రమాయణంలో అంతామధురమే. శబ్దగతమాధుర్యం, అర్థగతమాధుర్యం, రసమాధుర్యం అనే మూడురకాల మాధుర్యాలకు నిలయం రామాయణం.

మొల్ల కవితారీతి:

మొల్ల రామాయణం సంగ్రహ రచన. ఇందులో కథ చాలావరకు టూకీగా చెప్పి, మానవసంబంధాల సన్నివేశాలున్నచోట మొల్ల తన కవితా పతిభను ప్రదర్శించడం పాఠకులు గమనించవచ్చు. స్త్రీకి గల సహజమైన ఆర్థ్రత ఆమె భావాల్లో కనిపిస్తుంది.

ఈమె రచనా శైలి మృదు మధురంగా ఉంటుందని చెప్పడానికి గాను అవతారికలో ఆమె చెప్పిన ఈక్రింది పద్యం ద్వారా పాఠకులు గమనించ వచ్చు.

ఆ.వె.
తేనె సోక నోరు తియ్యన యగురీతి
తోడనర్థమెల్ల తోచకుండ
గూఢశబ్దములను గూర్చిన కావ్యమ్ము
మూగ చెవిటివారి ముచ్చటగును

అన్నట్లుగా మొల్ల తేట తెలుగు మాటలతో కూర్చిన రామాయణం ఇది. లెక్కకు మిక్కిలిగా ఉన్నతెలుగు రామాయణాలన్నిటిలోకి బహుళ జనాదరణ పొందేటట్లు తీర్చిన గొప్ప కవయిత్రి మొల్ల. ఈ కవయిత్రి పూర్తి పేరు ఆతుకూరి మొల్ల. ఈమె క్రీ.శ. 16 వ శతాబ్దానికి చెందినది. ఈమె తండ్రి ఆతుకూరి కేసన. మొల్ల గోపవరపు శ్రీకంఠ మల్లేశు వరముచే కవిత్వం చెప్పడం నేర్చుకుంది.

పోతనలాగ ఈమె కూడా పలికించెడివాడు రామభద్రుడే అని చెప్పి, తన రామాయాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేసింది. అవతారికతో కలిసి యుద్ధకాండవరకూ మొత్తం 869 గద్య పద్యాలు ఈ రామాయణంలో ఉన్నాయి. మొల్ల రామాయణం రాశిలో చిన్నదైనా వాసిలో మిన్న అయినది.

మొల్ల కవిత్వం - మానవీయవిలువలు :

మొల్ల తన రచనలో మానవీయ విలువలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని చెప్పడానికి ఈక్రింది పద్యాలను గమనించవచ్చు.

కం. ఉన్నాడు లెస్స రాఘవు
డున్నాడిదె కపులగూడి, యురుగతి రానై
యున్నాడు, నిన్నుగొని పో
నున్నాడిది నిజము నమ్ముముర్వీ తనయా! (మొ.రా.సు-91)

లంకానగరంలో అశోకవనంలో శింశుపా వృక్షం క్రింద సీతమ్మ తల్లి రాక్షసుల చెరలో ఆనేక రకాలయిన ఇక్కట్లు పడుతూ శ్రీరామచంద్రుడిని గురించి ఆందోళన చెందుతున్న సీతమ్మతల్లిని హనుమంతుడు ఆ చెట్టుపై నుండి చూచి, ఆమెకు ధైర్యం చెప్పే సందర్భంలో ఈ పైన ఉదహరించిన పద్యాన్ని చూడవచ్చు. మాటలాడేటప్పుడు ఎదుటివారి పరిస్థితిని బట్టి మాట్లాడాలి. మాటలలో నేర్పరి మన హనుమంతుడు. సీతకు ముందుగా కావలిసింది రాముని క్షేమసమాచారం, కాబట్టి ముందుగా ‘’ఉన్నాడు లెస్స రాఘవుడు’’ అని హనుమంతుడు ప్రారంభించాడు. ఈ వాక్యం ‘’ఉన్నాడు ’’ అనే క్రియా పదంతో ప్రారంభించాడు. ఉన్నాడు అనే మాట వినేసరికి సీత మనస్సు శాంతిస్తుంది. తరువాత ఎవడు ఉన్నాడు అనే సందేహం సీతకు కలగవచ్చు. దాని నివృత్తికై హనుమంతుడు వెంటనే ‘’ రాఘవుడున్నాడు’’ అని చెప్పాడు. ఇప్పుడు సీత మనస్సు ఇంకాస్త కుదుటపడి, ఎలా ఉన్నాడు అనే సందేహం కలుగుతుంది. దానికి సమానంగా ‘’లెస్సగా ’’ ఉన్నాడని తెలుస్తుంది. తర్వాత సీతను చెరనుండి విడిపించడం ఎలా అనే సందేహానికి సమాధానంగా కపులగూడి (సైన్యంతో కూడి) ఉన్నాడు. తర్వాత ఎంత సమయం పడుతుందనే ప్రశ్నకు సమాదానంగా ‘’ఉరుగతి రానై యున్నాడు’’ అని చెప్పడం జరిగింది, అనగా అతిత్వరలోనే నీ శ్రీరామచంద్రుడు కపిసైన్యంతో వచ్చి, నిన్ను ఈ చెరనుండి విడిపించి, అయోధ్యకు తీసుకువెళతాడు అనే మాట, సీతాదేవికి కలిగే ఆందోళనలను నివృత్తిచేస్తుంది. మేమంతా రామునితో ఉన్నాము. ఇది నిజం అనే నమ్మకాన్ని కలిగించే విధంగా హనుమంతుని మాటల్లో సీతమ్మకు హనుమంతుడు ధైర్యాన్నిచ్చి ఆశల ఊరటను కల్పించాడు. 

మనం ఆపదలో ఉన్నామని తెలిసి కొంతమంది సహాయం చేయడానికి వస్తారు. మరికొందరు ఇదే అదనుగా చేసుకొని (విషకుంభం పయోముఖం అన్నట్లుగా) మోసం చేద్దామని చూస్తుంటారు. ఇది లోక తీరు. అందువలన సహాయం చేస్తానని వచ్చిన ప్రతి ఒక్కరి మాటలను గుడ్డిగా నమ్మరాదు. అలా గుడ్డిగా నమ్మి ప్రస్తుత ప్రపంచంలో ఎంతో మంది స్త్రీలు మోసపోతున్నారు. ఈ విధంగా ఎవ్వరూ మోసపోకుండా ఉండాలంటే, వచ్చినవారి అంతర్గత మనసును పరిశీలించాలి. దానిని తెలుసుకోవాలంటే సీతలాగ ప్రవర్తించాలనే సందేశం రామాయణంలో ఈ క్రింది పద్యం ద్వారా తెలియుచున్నది.

వచ్చిన హనుమంతుడు పరిచయస్తుడు కాడు. ఆగంతుకుడు. అందువలన ఇతడు కూడా రాక్షసమాయయేమో అని భావించి సీతమ్మ తన సందేహ నివృత్తికై హనుమంతునితో ఇలా అంటుంది.

క. నిను విశ్వసింపజాలను,
వినుపింపుము నీ తెఱంగు, విభుని తెఱంగు
న్ననవుడుఁ బావని తెలియఁగ
వినయంబున విన్నవించె విస్ఫుట ఫణితిన్ (మొ.రా.సు-97)

సీతాదేవి మొగమాటం లేకుండా హనుమంతునితో నేను నిన్ను నమ్మలేకపోతున్నానని నిస్సంకోచంగా చెప్పింది. ఎదుటివారి మాటలను ఖండించడం చాలా కష్టమైన విషయం. వారు బాధపడతారేమోనని తనను తాను వంచించుకోకూడదు. తాను అనుకున్నది చెప్పితీరాలి. అందుకే సీతాదేవి ఎన్ని కష్టాలలో ఉన్నప్పటికి ముక్కుసూటిగా హనుమంతునితో నేను నిన్ను నమ్మలేకపోతున్నానని చెప్పింది. అయితే హనుమంతుని మాటల్లో సీత నమ్మగల నిజము కూడా ఉంది. కనుక శ్రీరామచంద్రుని గిరించి నాకు వినిపించుమని వినయంగా కోరింది.

హనుమంతుడు తనను గూర్చి, రాముని గూర్చి నమ్మకం కలిగే విధంగా సీతకు వివరించాడు. అదే సందర్భంలో హనుమంతుడు, అమ్మ! ఇప్పుడే నేను నిన్ను అయోధ్యకు తీసుకువెళతాను నా వీపుపైన కూర్చోమని చెప్పాడు. అప్పుడు సీతాదేవి ఎన్ని కష్టాలలో ఉన్నప్పటికి తన ఆత్మాభిమానంతో కూడిన మానవీయ విలువలను ప్రకటించింది.

క. నీ వంతవాడ వగుదువు,
నీ వెంటనె వత్తునేని నెగడవు కీర్తుల్
రావణుకంటెను మిక్కిలి
భూ వరుండే దొంగ యండ్రు బుధ నుత చరితా! (మొ.రా.సు-119)

ఓ హనుమా! నీవంతటి సమర్థుడవే. కాని నీ వెంట నేను వస్తే రామునికి అపకీర్తి కలుగుతుంది. రావణుడు చేసిన తప్పును, మనవంటి ఆత్మాభిమానం కలవారు చేయరాదు. అలాగ చేసినట్లైతే రావణుని కంటే రాముడే పెద్ద దొంగ అని లోకం అంటుందని, వీరులైన వారు సాహసంతో యుద్ధం చేసి దొంగిలించి తెచ్చిన రాక్షసుని సంహరించాలి. కాని నన్ను దొంగిలించి తీసుకొని పోవడం దొరలకు తగినది కాదని మానవతా విలువలను చూపించింది.

మఱియును, శ్రీరాముడు ముల్లోకాలలో ముఖ్యమైన వీరుడునూ, విలువిద్యా దీక్షను తీసికొన్న వారిలో గొప్పవాడునూ, రాక్షస వంశానికి యముని వంటి వాడునూ అయినందున, భార్యకు ద్రోహము చేసిన రావణుని యుద్ధంలో అందరికీ తెలిసేటట్లు చంపి, నన్ను తీసికొని వెళ్ళడం ధర్మమని హనుమంతునితో హితవు పలికింది. నీవు శ్రీరామచంద్రునికి ముఖ్యమైన బంటువు. పుత్రునితో సమానుడవు. కాబట్టి నీతో రావడం, తప్పుకాకపోయినా, పగ తీర్చకుండా రావడం, తగినది కాదు. కాబట్టి శ్రీరామునికి ఈ విషయాలన్నీ తెలిసేటట్లు చెప్పు. ఆలస్యము చేయకుండా రాముని వెంటపెట్టుకొని రావలసింది అని, సీతమ్మ చెప్పెను. పై మాటలద్వారా సీతమ్మతల్లి ఇంతటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ధర్మము తప్పకూడదని, ఆపదల సమయంలోకూడా విలువలను కోల్పోకూడదని, భావితరాలకు మానవీయ విలువలను చూపింది. 

ప్రతి భార్య తన భర్తపట్ల అన్యోన్యతను, పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలని అనుకుంటారు. సీతాదేవి కూడా తన పతిదేవుడు శ్రీరామ చంద్రునియందు గల అన్యోన్యత, పాతివ్రత్యాన్ని తెలుపుకొంది.

క. ఏ యెడఁ జూచిన ధరణీ
నాయకు శ్రీపాద యుగము నా చిత్తములోఁ
బాయ దని విన్న వింపుము
వాయు తనూభవుఁడ! పుణ్యవంతుఁడ! తెలియన్. (మొ.రా.సు-111)

ఓ పుణ్యాత్ముడా! వాయునందనుడా! ఆ భూనాయకుని పాదాలు నా మనస్సు నుండి దూరం కాదని తెలియజెప్పమని కోరింది.

ప్రతి వ్యక్తి తాను చేసిన పొరపాటును సవరిదిద్దుకోవాలి. ఎవరియందు ఆ తప్పుచేసారో వారిని క్షమించమని కోరడం మానవీయత. సీతాదేవి, దండకారణ్యంలో లక్ష్మణుని మాటలను లెక్కచేయకుండా, అతనిని దూషించింది. అందువల్లనే ఈ పరిస్థితి సంభవించిందని తెలుసుకున్న సీతమ్మ తనను రావణుడెత్తుకు పోయినప్పటినుండి లక్ష్మణుని క్షమించమని కోరాలనుకుంటుది. కాని తెలియపరచినవారు లేరు. ఇప్పుడు తెలియపరచిన వ్యక్తి హనుమ ఉన్నాడు. అందువలన వెంటనే హనుమతో ఈవిధంగా చెబుతుంది.

చ. జనకుని భంగి రామ నృపచంద్రుని, ననున్ను దల్లిమాఱుగాఁ
గని, కొలువంగ నేర్చు గుణ గణ్యుని, లక్ష్మణు నీతి పారగున్
వినఁ గన రాని పల్కు లవివేకముచేతను బల్కినట్టి యా
వినుత మహాఫలం బనుభవించితి నంచును జాటి చెప్పుమా (మొ.రా.సు-115)

తండ్రివలె రాముని, తల్లివలె నన్ను సేవించే సద్గుణ గణ్యుడు, నీతిమంతుడైన లక్ష్మణుని తెలివితక్కువగా వినకూడని మాటలతో అతని మనసును నొప్పించాను. దాని ఫలితం అనుభవిస్తున్నానని చెప్పు.

క. ఆ మాటలు మది నుంచక
నా మానముఁ గావు మనుచు మయ వినయ గుణో
ద్ధాముఁడ, రాముని తమ్ముండు
సౌమిత్రికిఁ జెప్పవయ్య సాహసివర్యా! (మొ.రా.సు-116)

నేను అన్న ఆ మాటలను మనసులో పెట్టుకోవద్దనీ, నా గౌరవాన్ని కాపాడమనీ వినయగుణసంపన్నుడైన రాముని తమ్ముడైన లక్ష్మణునికి చెప్పమని కోరింది.

సాధారణంగా ప్రతి వ్యక్తి కష్టాలలో ఉన్నపుడు ధర్మాన్ని ఆచరించడానికి వీలుపడదు, కాని సీతమ్మ ఎన్ని కష్టాలలో ఉన్నప్పటికి ధర్మాన్ని వీడని భూమిజను చూసి హనుమంతుడు ఆనందించి చేతులు జోడించి నమస్కరించి మరొకమారు నమ్మకం కలిగించే ధైర్యవచనాలు చెప్పుచున్నాడు.

ఉ. నీ విభుఁ డబ్ధి దాఁటి, ధరణీతల నాథులు సన్నుతింప, సు
గ్రీవ సుషేణ ముఖ్య బల బృందముతో నరుదెంచి, నీచునిన్
రావణు నాజిలోఁ దునిమి, రాజస మొప్పఁగ నిన్నుఁ గొంచు, సే
నావళి తోడ నీ పురికి నారయ నేఁగు నిజంబు నమ్ముమా! (మొ.రా.సు-123)

నీ భర్త రామచంద్రుడు, సముద్రాన్ని దాటి, రాజులు అందరూ పొగడుతుండగా, సుగ్రీవుడు, సుషేణుడు మొదలయిన సైన్య సమూహములతో, లంకకు వచ్చి, నీచుడయిన రావణుని యుద్ధంలో చంపి, రాజఠీవి మెరసేటట్లుగా, నిన్ను తీసుకొని, సైన్యాలతో మీ అయోధ్యా నగరానికి వెలతాడు. ఈ మాట నిజము దయచేసి నా మాట నమ్ముము.

సీత ఆపదలోఉంది. అందులోను అపహరించబడి, వేరే ప్రదేశానికి తీసుకు వెళ్లబడింది. రాక్షసుల బారిన పడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి ఊరట కలిగించే మాటలు కావాలి. అందువలన వ్యాకరణ పండితుడైన హనుమంతుడు చక్కగా మానవీయ విలువలను చూపిస్తూ ధైర్య వచనాలు పలికాడు.


ఉపయుక్త గ్రంథసూచి:

1. మొల్ల రామాయణం – సుందరకాండ. రామా అండ్ కో. ఏలూరు.