ఉపోద్ఘాతం:

సంస్కృత వాజ్మయంలో కావ్యరచనలు మొదట రామాయణ భారత పురాణాది కథలనాధారంగా చేసుకొని విస్తృతిని పొందినవి. అటు పిమ్మట కొన్ని ఉత్పాద్య (కవి కల్పిత) కథల నాధారంగా చేసుకొని వైపుల్యమును పొందినవి. అట్టి వాయాప్తిని పాందిన ఈ కావ్య ప్రపంచములో కొన్ని సందేశ కావ్యములున్నవి. వాటి యందేకదేశముగా సంస్కరణాత్మక భావములు కొన్ని శ్లోకములలో కనిపించుచున్నవి. అట్టి  సంస్కరణాత్మక దృష్టి కలవారిలో “క్షేమేంద్రుడు" అనుకవి పండితుడు అగ్రస్థానమును పొందును. ఈతడు "ఔచిత్య విచార చర్చ" అను ఆలంకారిక లక్షణ గ్రంథకర్తగా ప్రసిద్ధిచెందినాడు. మరియు ఇతనిచే రచించబడిన లఘుకావ్యములు అనేకములున్నవి. వానిలో 'దర్పదలనమ్' అను లఘుకావ్యముకటి. ఆ ’దర్పదలనమ్ ' అనగా గర్వమును అణచుట అని యర్ధము.

లోకములో గర్వము – కుల – రూప – ధన – విద్య మొదలగు వివిధ విషయములచే ఉండునని వాటిలో అన్నిటికన్న కుల గర్వము శ్రేయోమార్గమునకు అత్యంత హానికరమని ప్రథమముగా కుల గర్వము కల్గినవారిని విమర్శించి వారి గర్వమును అణచినాడు. ఈ విధముగా ప్రాచీనకాలమునందే సామాజిక సంస్కరణాత్మక దృష్టి చూపబడినది. క్షేమేంద్రునిచే రచింపబడిన కొన్ని శ్లోకములను పరిశీలించినచో ఆ కవియొక్క హృదయము తెలియగలదు. “కులము కమలము యొక్క సాదృశ్యమును పొందును. అనగా కమలముయొక్క ఉత్పత్తి మాలిన్యముతో ప్రారంభమై ఉండును. అట్లే ఏ కులమందైన ఎక్కడైనను దోషములుండును. కావున కులగర్వము మంచిదికాదు” అని చెప్పుచున్నాడు. ఆ భావంగల శ్లోకమిది.

కులస్యకమల స్యేవ మూలమన్విష్యత్యది!

దోషపంక ప్రసక్తాంతస్తదావశ్యం ప్రకాశతే !

సూర్య చంద్ర వంశపు రాజులుగా ప్రసిద్ధిచెందిన రాజులయొక్క మూల పురుషులు సైతము ఏజాతికి చెందనివారుగా చెప్పబడుచున్న "చండాలుడు” ఉన్నాడని

సూర్యవంశోత్రిశంకుర్య: చండాలో భూన్మహీపతి:!

దిలీపరఘురామాద్యా: క్షితిపా స్సత్కులోద్భవాః

అనగా దిలీపాదిరాజులకు పూర్వమందున్న సూర్యవంశ పూర్వపురుషుడైన 'త్రిశంకువు' చండాలుడని చెప్పినాడు. మరియు ఈ గ్రంథ భాగములోనే ఒక కథను చెప్పుచు 'అస్థిరః కులసంబంధః' అని కులము వలన ఏర్పడిన సంబంధము స్థిరముకాదని మరియు 'కులీనుడు' అను శబ్దమునకు ఈ రకముగా నిర్వచనము చెప్పినాడు.

ఏ తదేవకులీనత్వ మేతాదేవగుణార్జనమ్ !

యత్ సదైవ సతాంసత్సువినయావనతం శిరః ||

ఋజువర్తనము కలిగిన సజ్జనులయందు వినయముచే శిరస్సువంచు సత్ప్రవృత్తియే 'కులీనత్వ' మనిపించుకొనును. కాని 'జాతి' చేత కాదని చెప్పినాడు. మరియు 'కులము' అనగా ఉత్తమవంశమందు పుట్టుటచేత 'కులీనుడు కాలేడని ఉత్తమగుణముల నాశ్రయించి మాత్రమే కులము ఉండునని, కావున గుణములయందు ఆదరము చూపవలెనని జాతి దురభిమానమును విడువమని ఇట్లు చెప్పినాడు.

గుణాధీనం కులం జ్ఞాత్వా గుణేష్వా ధీయతాం మతి:

“జాతిచేత తక్కువవారైననూ వారివద్ద ఉత్తమ విద్యలను గ్రహింపవలయును” అని "హీనా దప్యుత్తమా విద్యా" "అకలంక వివేకానాంశీల- మేవావలంబనమ్” నిష్కళంకమైన వివేకముకలవారికి సత్ప్రవర్తనమే సత్కార కారణమగునుగాని జాతి కాదని భావముగల వచనముల వలన తెలియుచున్నది.

కులీనుడు కులీనుడు అగుచో అనగా కు= కుత్సితములైన నీచమైన వ్యసనములందు ఆసక్తి కలవాడు. కులీనుడైననూ మంచివంశమునందు పుట్టిననూ కులీనుడు కాజాలడు. కుత్సిత విషయములందు దుర్వ్యసనములందు ఆసక్తిని పొందనివాడే అకులీనుడైననూ కులీనుడగును, అని ఈ విధముగా క్షేమేంద్రుడు అనేక శ్లోకములలో కులాభిమానమును నిరసించి సంస్కరణాత్మక మార్గదర్శకులలో అగ్రగణ్యుడైనాడు.

ఈ ప్రకరణము చివరలో 'శీలం విశాలం కులమామనంతి' అని మానవుని యొక్క సత్ప్రవృత్తియే కులముగాని వేరుగాదని ఉపదేశించినాడు. మరియు ఆదిశంకరులు అద్వైత ప్రచారము చేయు సందర్భములో ఈశ్వరుడు 'చండాల' వేపముతో అడ్డునిలువగా తొలగిపొమ్మని శంకరుడనగా “దేహమునా? ఆత్మనా? తొలగిపొమ్మనుచున్నావు” అని ఆ చండాలవేపమున ఉన్న ఈశ్వరుడు పల్కగా యథార్థము తెలుసుకొని జాతిభేదమును విడిచి ఆదిశంకరులు తన పొరబాటును గ్రహించి పరమేశ్వరుని క్షమాయాచన చేసిరి. ఈ కథ విద్యారణ్యస్వామి రచించిన శంకర విజయమునందు కలదు. అనగా అనంగుడు విరక్తుడు జ్ఞాని అగువానికి అస్పృశ్యత లేదని పరమేశ్వరుడు బోధించెను. ఈ సందర్భమునందే శంకరాచార్యులు 'మనీషాపంచకము' అను పేరుతో ఒక స్తోత్రము వ్రాసిరి. ఇందలి చివరి పాదము "చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషామనీషామమ" అని మకుటము కలదు. అనగా ఆత్మజ్ఞాన సంపన్నుడై వెలుగొందువాడు చండాలుడైననూ ద్విజుడైనను అతడు నాకు గురువు. నిశ్చయముగా ఇదియే నా ఆక్రాయము అని అర్ధము. కావున ఈ వాక్యమును అనుసరించి మయబడినదని జాతికి ప్రాధాన్యమీయబడలేదని తెలియుచున్నది.

ఆ విధముగా సంస్కృత సాహిత్యములో సంస్కరణాత్మక దృష్టిలో కావ్య నిర్మాణములు జరిగియున్నవి. శంకారాచార్యులు భక్తి విషయమున భగవత్ప్రియుడగు కన్నప్ప విషయముని “శివానందలహరి' అను గ్రంథమందు ఉదహరించిరి.

మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే
గండూషాంబు నిషేచనం పురరిపో ర్దివ్యాభిషేకాయతే |
కించిద్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే
భక్తిః కిం నకరో త్యహో వనచరో భక్తావతంసాయతే ||

'కుల' శబ్దమే విపరీతార్ధము నిచ్చునపుడు కులాహంకారమునకు అర్థమేలేదు. “కు కుత్సితం విషయం 'లాతి' గుహ్నాతి ఇతి కులం” నీచమైన విషయము తెలియజేయునట్టిది అని కులమను శబ్దమునకు వ్యుత్పత్యర్థము. అందుకే చివరగా క్షేమేంద్రుడు ఈ కుల, ధన, విద్యా, రూప అభిమానములను విడిచి వివేకముతో సామరస్యముతో జీవనమును సాగించమని హితమును చెప్పుచున్నాడు.

కులాభిమానం త్యజ సంవృతాగ్రం
ధనాభిమానం త్యజ దృష్టనష్టం 
విద్యాభిమానం త్యజ పణ్యరూపం
రూపాభిమానం త్యజ కాలలేహ్యమ్

పైపై మెరుగులు గల కులాభిమానమును విడువుము. చూచుచుండగానే నశించు ధనాభిమానమును విడువుము. అమ్ముకొని డబ్బు సంపాదించు విద్యాభిమానమును విడువుము. క్రమముగా నశించునిట్టి రూపాభిమానమును విడువుము.