ఉపోద్ఘాతం:-

శ్రీమదాంధ్ర భాగవత సారం భక్తి తత్వం. దానికి సంక్షిప్త రూపం వేటూరి గీతం. వేటూరి భక్తి రసప్రధానగీతాలలో అత్యుత్తమ గీతం, “నంది” పురస్కార గీతం “ కాంచన గంగ” చిత్ర గీతం “ బృందావనీ ఉంది”

సంగ్రహం:-

శ్రీమద్భాగవతాది ఇతిహాసలలో నిక్షిప్తమయిన “కృష్ణ తత్వం” అనే నిధి ని, “కాంచనగంగ” చిత్రం ద్వారా, ఈ తరం యువత కి అందజేసిన సినీ గీత రచయిత శ్రీ వేటూరి సుందర రామ్మూర్తి గారి గీతం “ బృందావనీ ఉంది”. ఆ గీతం లోని అర్థం, పరమార్థం, అద్వైతం, ఔచిత్యమ్, తెలుగు చిత్ర గీతాలకి కావ్య వైశిష్ట్యమ్ కల్పించిన విధానం, శ్రీ వేటూరి గారి ప్రతిభ పాటవమ్ వెరసి “వేటూరి రసమాధురి”.

ముఖ్యాంశాలు:-

శ్రీకృష్ణ తత్వం, శ్రీకృష్ణ లీలలు- వాటి పరమార్థం, భవబంధాలు, అద్వైతం,వేటూరి ప్రతిభ. “నంది” పురస్కారానికి అర్హత సాధించిన వైనం.

విశ్లేషణ:-

శ్రీమదాంధ్రరామాయణం, మహాభారతం, భాగవతం వంటి అనువాదాలు మొదలుకొని, తెలుగులో, ప్రబంధాలు,కావ్యాలు, ఇతిహాసాలు, సంకీర్తనలు, హరికథలు, శతకాలు, అవధానాలు, అంటూ పలు కమనీయమయిన ప్రక్రియలని గత వెయ్యేళ్లుగా మన తెలుగు భాష చవి చూసింది. పలు ప్రక్రియల ద్వారా తెలుగు భాషని పరిపుష్ఠం చేసి, పద సంపద పెంచి, భిన్నమయిన సాహితీ ప్రక్రియలతో మనల్ని అలరించి, ఆలోచనామృతం చిలికించి, తెనుగు తల్లికి అక్షరార్చన చేసిన , చేస్తున్న,అక్షర అర్చకులు- మహా కవులు కవయిత్రులు ఎందరో ఉన్నారు ఈ తెలుగు నేలపైన. భారత దేశం లోనే కాదు, విదేశాలలో ఉన్న తెలుగువారిలో సైతం భాషాభిమానం ఉండటం వల్ల, పలు రకాల సాహితీ ప్రక్రియలు చేపట్టి భాషా దీప్తిని నలుదిశలా వ్యాపింపచేస్తున్నారు, ఎందరో మహానుభావులు, అందరీకి వందనములు!

అయితే ఆధునిక కాలంలో మిగతా ప్రక్రియలకన్నా, చిత్ర గీతాలలోని సాహిత్యానికి ఆదరణ బాగా పెరిగింది. నేటి యుగంలో కవి అంటే సినిమా పాటలు రాసేవాడని జనబాహుళ్యంలో మిక్కిలి ప్రచారంలో ఉన్నది. 85 ఏళ్ల తెలుగు సినీ జగత్తులో ఖ్యాతికెక్కిన ఎందరో సినీ గీత రచయితలలో, శ్రీ వేటూరి సుందర రామ్మూర్తి గారిది విశిష్టమయిన స్థానం. వేనవేల పాటలు రాసిన ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియే లేదు. నిజానికి గత వెయ్యేళ్ళ సాహితీ ప్రక్రియలన్నింటినీ తెలుగు సినీ గీతాలలో పలు సందర్భాలలో గుప్పించి మన కుదుళ్లను మనం మరచిపోనివ్వకండా తగురీతిని సేవ చేశారు, సినీ గీతాలకి కావ్య వైభవం కల్పించారు. “సినిమా పాటలు కూడా సాహిత్యమేనా?” అని పెదవి విరిచిన వారికి, ప్రాచీన సాహితీ ప్రక్రియలని, వర్ణనలనీ, సందర్భానుసారం సంకీర్తనలని, వ్యాకరణాన్ని, ఛందస్సునీ, శ్లేషలనీ, యమకాలని, అగామి సూచకాలని, కవి సమయాలని, పద్య రీతులనీ అలంకరించి,తేనెల తెనుగు పాటలలో కోయిల గీతులని పలికించారు.

వేటూరి సుందరరామ్మూర్తి గారి అక్షరం- అక్షయం. ఆయన పాట తెలుగు అక్షరాల జలపాతం లా ప్రవహించి జీవనదిలా విస్తరించి మహా సముద్రమై స్థిరపడి ప్రతి తెలుగు గుండెలో ఘోషిస్తుంది. ఆనంతకోటి భావాల కెరటాలు ఎగసిపడే సాహితీ సముద్రం ఆయన మస్తిష్కం. జీవితంలో ప్రతీ అడుగులో, ప్రతీ సందర్భానికీ ఆయన పాట ఉంది.

“అలలు కదిలినా పాటే
ఆకు మెదిలినా పాటే
కలలు చేదిరినా పాటే
కలత చెందినా పాటే ”
(సీతామహాలక్ష్మి చిత్ర గీతం)

అగస్త్యులవారు సముద్రాన్ని ఔపోసనం పట్టినట్టు సామాన్యులు వేటూరి గారి సాహితీ సముద్రాన్ని ఔపోసనం పట్టలేరు. పైపైని కెరటాలతో దోబూచులాడేవారికి నురగ నవ్వులు దొరుకుతాయి, దూరంగా నిలుచుని చూసే వారికి ఆ సంద్రంపై తరళం అయి మెరిసే వెన్నెల కిరణాలు మనోల్లాసాన్ని కలిగిస్తాయి, శ్రమకోర్చి నడి సముద్రం లోకి దూకి శోధించిన గజ ఈతగాళ్ళకి వెలకట్టలేని ముత్యాలు, రత్న మాణిక్యాలు లభ్యం అవుతాయి. ఎవరి సామర్ధ్యాన్ని బట్టి వారికి రంజన కల్పించగల శక్తి ఆయన పాటలకి సొంతం. వేదాంతం, భక్తి, రక్తి, విరక్తి, శృంగారం, ప్రణయం, కలహం, ప్రేరణ, దేశభక్తి, విప్లవం, హరికథ, అంటూ వేనవేల సాహితీ ప్రక్రియల ముఖాలు గల విశ్వరూపకారుడు శ్రీ వేటూరి సుందర రామ్మూర్తి గారి పాటలలో నేడు మనం “కాంచన గంగ” చిత్రం లోని నంది అవార్డు కైవసం చేసుకున్న “ బృందావనీ ఉంది- యమునా నదీ ఉంది- మధురాపురి ఉంది- కాళింది ఉంది, లేనివాడొక్కడే శ్రీకృష్ణమూర్తి, కలిలోన శిల అయిన కళ్యాణ మూర్తి” అనే పాటలోని లోతైన వేదాంత భావాలని పరిశీలిద్దాం.

ఈ సాహిత్యం వల్ల కృష్ణ తత్వం సులభంగా బోధపడుతుంది.

#పల్లవి#
బృందావనీ ఉంది- యమునా నదీ ఉంది
మధురాపూరీ ఉంది- కాళింది ఉంది
లేనివాడొక్కడే శ్రీకృష్ణమూర్తి-
కలిలోన శిల అయిన కళ్యాణ మూర్తి.
కలిలోన శిల అయిన కళ్యాణ మూర్తి

#చరణం1#
పుట్టగానే పెరిగేటి మాయబంధనాలకన్నా,
పుడుతూనే తొలిగేటి చెరసాలలే మిన్న,
ఆ కిటుకు తెలిసేరా శ్రీకృష్ణమూర్తి
ఆ కిటుకు తెలిసేరా శ్రీకృష్ణ మూర్తి
చెరసాలలోపుట్టే చైతన్య మూర్తి
చెరసాలలో పుట్టే చైతన్య మూర్తి

#చరణం2#
వెంటబడి వేధించే వేలమంది స్త్రీలున్నా
ఇంట ఉండి పూజించే ఇంతి ఉంటే చాలన్న
ఆ కిటుకు తెలిసేరా శ్రీకృష్ణ మూర్తి
ఆ కిటుకు తెలిసేరా శ్రీకృష్ణ మూర్తి
రాధ గుండె దోచినాడు వేదాంత మూర్తి
రాధ గుండె దోచినాడు వేదాంత మూర్తి

#చరణం3#
గేయాలుగా మారే గాయాలు ఎన్నున్నా
గాయాలు మాన్పేటి గానాలు మిన్న
ఆ కిటుకు తెలిసేరా శ్రీకృష్ణ మూర్తి
ఆ కిటుకు తెలిసేరా శ్రీకృష్ణమూర్తి
వేణువూది లాలించె గీతానువర్తి
వేణువూది లాలించె గీతానువర్తి"

సంపూర్ణంగా శ్రీకృష్ణ తత్వం ఒంటబట్టించుకొని, ఆత్మజ్ఞానం పొంది, అద్వైత భావం నిండిన తత్వవేత్త లాగా వేటూరి గారు రాసిన సాహిత్యం ఇది. కనకనే కలకాలం నిలిచిపోయింది తెలుగు ప్రజల గుండెల్లో. మొదటి చరణం లో-

“పుట్టగానే పెరిగేటి మాయబంధనాల కన్నా- పుడుతూనే తొలిగేటి చెరసాలలే మిన్న! ఆ కిటుకు తెలిసేరా శ్రీకృష్ణ మూర్తి, చెరసాల లో పుట్టే చైతన్య మూర్తి." అని విపులంగా ఆ పురుషోత్తముడి జన్మకారణం బోధపరిచారు. భవబంధాలు తెంచుకుని పుట్టిన వాడు కాబట్టే వ్యామోహం పక్కన పెట్టి కర్తవ్యం నెరపమని గీతోపదేశం చేసే అర్హత సాధించాడు, కాలం ఉన్నంతకాలం నిలిచిపోయే చైతన్యం కలిగించాడు. అసలు కృష్ణ మూర్తి అందుకే అవతరించాడు

. అలాగే రెండో చరణం లో "వెంటబడి వేధించే వేలమంది స్త్రీలున్నా(కొరికలూ అరిషడ్ వర్గం, ఐహిక సుఖాలు ఇత్యాది బాహ్య ప్రాపంచిక విషయాలు ఎన్నో ఉన్నా) ఇంట ఉండి (జీవుడి లో ఉండి) పూజించే ఇంతి(ఆత్మజ్ఞానం) ఉంటే చాలన్న, ఆ కిటుకు తెలిసేరా శ్రీకృష్ణ మూర్తి ....రాధ(ప్రకాశం అని అర్థం) గుండె దోచినాడు వేదాంత మూర్తి. అబ్బాబ్బా ఎంత కమనీయంగా రాశారు? రాధ గుండె దోచిన వాడు శృంగార మూర్తి కాదు వేదాంత మూర్తి ట…రాధ అంటే జ్ఞానప్రకాశం కనక - జీవాత్మని పరమాత్మ లో కలిపే అద్వైతం కలిగిస్తుంది కనక రాధ ని గైకొన్నవాడు వేదాంత మూర్తి అయ్యాడు.

మనమే ఆ రాసలీలలన్నీ శృంగార లీలలు అనుకుంటాం, కానీ వేదాంతం అని గ్రహించము.

మూడో చరణం లో "గేయాలు గా మారే గీతాలు ఎన్నున్నా గాయాలు మాన్పేటి గానాలు మిన్న. ఆ కిటుకు తెలిసేరా శ్రీకృష్ణమూర్తి, వేణువూది లాలించే గీతానువర్తి.”(సప్తపది లో చెప్పినట్టు పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు అల్లన మోవికి తాకితే గేయాలు…)

అలాగే వేణువు అయినా, జీవుడు(అర్జునుడు) అయినా నిలువెల్ల గాయాలు అయిన వారు ఎవరయినా ఉంటే, వారిని చేరదీసి తీయని 'గీత' ఆలపన తో చైతన్య పరుస్తాడు,జన్మ ధన్యం చేస్తాడు ఆ గీతానువర్తి. పీపీలికాది బ్రహ్మ పర్యంతం అందరి మీద కరుణ వర్షించే ఆ కృష్ణ మూర్తి ని అందుకే కదా ప్రేమించకండా ఉండలేము.

ముగింపు:-

ముల్లోకాలనీ భక్తి రసం లో ఒలలాడించే కృష్ణ తత్వాన్ని ఔపోసనం పట్టి 3నిలమిషాల చిత్ర గీతం లో సంక్షిప్తీకరించటం వేటూరి గారి ప్రత్యేక ప్రతిభ కనకనే ఆ కవికుల కోకిల ని ఈ గీతానికి గాను అప్పటి ఆంశ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం “నంది” పురస్కారం తో సత్కరించింది

ఇలాంటి రసప్ప్లావితం అయిన , నర్మగర్భం అయిన, సాహితీ విలువలున్న, మేధోమధనం చేసి ఆలోచనామృతం చిలకరించే చిత్ర గీతాలు వేటూరి సుందర రామ్మూర్తి గారు వేలల్లో రాశారు. ఆ కారణజన్ముడు తన కర్తవ్యం ముగియగానే దివికేగి, ఆ సత్యలోకంలో శారద కంఠసీమలో మేలురత్నమై ఒదిగి ఉన్నాడు. తెలుగు భాషకు-వేటూరి పాటకు శతమనంభవతి.

ఆధార విషయాలు:-

1.youtube – “mee Veturi” channel
2. “Usha kiran movies”.
3. Youtube -“patalapallaki” channel
4. Wikipedia- kanchana ganga 1984 telugu film