ఉపోద్ఘాతం:

తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల అంటేనే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది చేనేత పరిశ్రమ. ఇక్కడి నుండి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అనేక చేనేత కళాఖండాలు తయారయ్యాయి. చేనేత కార్మికుల బతుకు వెతలు మనకు ఇక్కడ కన్పిస్తాయి. అయినా వారి మగ్గం శబ్దం మాత్రం ఆగదు. నిరంతరము మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అలాంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కేవలం చేనేత పరిశ్రమకే కాకుండా సాహిత్యానికి కూడా జీవధాతువు వంటింది. ఎందరో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కవులు, కళాకారులు ఈ గడ్డపై జన్మించారు. డా. సి. నారాయణరెడ్డి, గూడూరి సీతారాం, పత్తిపాక మోహన్, పెద్దింటి అశోక్ కుమార్, నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం, కె.వి. రమణాచారి లాంటి ఎందరో గొప్ప రచయితలను, సాహితీవేత్తలను తెలుగు సాహిత్య లోకానికి పరిచయం చేసింది ఈ ప్రాంతమే. ఆ వారసత్వంనుండి పుట్టుకొచ్చిన సాహితీ ముత్యమే గరిపెల్లి అశోక్. సిరిసిల్ల జిల్లా భీముని మల్లారెడ్డి పేటలో రాజేశం, వెంకటలక్ష్మి దంపతులకు గరిపెల్లి అశోక్ జన్మించారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించినప్పట్టికీ చదువుపై ఉన్న ఆసక్తితో 1979 నుండి 82 మధ్యకాలంలో ఒక రంగుల కంపెనీలో పగలంతా కార్మికుడిగా పనిచేస్తూ సాయంత్రం ఆంధ్రా ఓరియంటెడ్ కళాశాలలో చదువుకొని డిగ్రీ పూర్తి చేశారు. ఆతర్వాత తెలుగు పండిట్ ట్రైయింగ్, ఎం.ఏ., ఎం.ఫిల్ కూడా పూర్తి చేశారు.

రచనలు:

1984లో స్పెషల్ లాంగ్వేజ్ టీచర్ గా  ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. చదువుకునే రోజుల్లోనే సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. 1977లో ఇంటర్  చదువుతున్నప్పుడు తన తొలి కవితా సంపుటి "నాంది"  ప్రచురించారు. ఉద్యోగంలో చేరగానే తను రాయడం కంటే పిల్లలతో రాయించి వారిలోని సృజనాత్మకతను వెలికితీయాలని భావించారు. వారిని కవులుగా చూడాలనుకున్నారు. 2014లో నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ద్వారా ముస్తాబాద్ లో డా. పత్తిపాక మోహన్ సంచాలనంలో ఏర్పాటు చేసిన బడిపిల్లల కథా రచన శిక్షణా శిబిరంలో అశోక్ శిష్యుడు బానుప్రసాద్ రాసిన కథను మహారాష్ట్ర ప్రభుత్వం 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో పెట్టిందంటే తన విద్యార్థులను కథలు రాయడంలో ఎంతగా ప్రోత్సహించేవాడో మనం గ్రహించవచ్చు . ఇక్కడ పనిచేస్తున్నప్పుడే పర్యావరణ పరిరక్షణ గురించి పిల్లలచే ఓ డాక్యుమెంటరీ కూడా చేశారు. అది కరీంనగర్ ఫిలిం సొసైటీ వారిచే ప్రశంసలు కూడా అందుకుంది. అదే విధంగా ముస్తాబాద్ బడిపిల్లల కతలతో 2016లో "జాంపండ్లు" అనే సంకలనం తీసుకువచ్చారు. నిరంతరం విద్యార్థులకు చేదోడువాడుగా ఉంటూ వారి కొరకు అనేక రచనా కార్యాశాలలు నిర్వహించారు. బడి పిల్లల కతలతో "బంగారు నెలవంకలు", "కతల వాగు" సంకలనాలు వెలువరించారు. 2017 లో కేంద్ర సాహిత్య అకాడమీ సిరిసిల్లలో నిర్వహించిన బడిపిల్లల సృజనాత్మక రచనా కార్యశాలలో వచ్చిన రచనలతో "కవితల సింగిడి" అనే పుస్తకాన్ని ముద్రించారు. అదే విధంగా "ఆకుపచ్చని ఆశలతో" బడి పిల్లల కవితా సంకలనంతో పాటు డా. పత్తిపాక మోహన్ వెలువరించిన "రఘుపతి రాఘవ రాజారాం' అనే గాంధీ గేయాల పుస్తకానికి సంపాదకుడిగా ఉన్నారు.

సామాజిక సేవ:

2019 లో మంచి పుస్తకం వారు ముద్రించిన తెలంగాణ బడి పిల్లల కథలు "తీయని పలకరింపు" పుస్తకానికి విద్యార్థులచే కథలు రాయించి, పంపించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపారు. పిల్లలకు కేవలం చదువు చెప్పడం , సాహిత్య విషయంలో పరిజ్ఞానం కలిగించడమే కాకుండా వారికి తన సొంత ఖర్చులతో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సైకిళ్ళు, నోట్ బుక్స్ కొనివ్వడం, ఉపకార వేతనాలు ఇప్పించడం, పిల్లల రచనలు పుస్తక రూపంలో ముద్రించడంలాంటి అనేక సామాజిక సేవాకార్యక్రమాలను చేపట్టిన నిబద్ధతగల ఉపాధ్యాయుడు గరిపెల్లి అశోక్. అంతేకాక సాహిత్యంతో ప్రజలలో చైతన్యం నింపి స్ఫూర్తినిచ్చే లక్ష్యంతో గరిపెల్లి అశోక్ మానేరు రచయితల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అనేక విశిష్ట కార్యక్రమాలు చేపడుతు ప్రజలలో చైతన్యం తీసుకువస్తున్నారు.

పిల్లల కోసం రాసిన కతలు, పరిశీలన:

ఇటీవలే తెలంగాణ బడిపిల్లల కతల పేరుతో వచ్చిన పుస్తకం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఎందరికో స్ఫూర్తినిచ్చినది. మణికొండ వేదకుమార్ సంపాదకత్వంలో చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమి, బాలచెలిమి ప్రచురించిన తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల కథా సంపుటాలుగా గరిపెల్లి అశోక్ కన్వీనర్ గా ఉండి పిల్లల దగ్గర నుండి అనేక కథలు సేకరించి ఆ బృహత్తర కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఉపాధ్యాయ వృత్తి నుండి విరమణ పొందినప్పటికీ పిల్లలకు ఇంకా ఏదో చేయాలన్న ఆరాటం తపన తనను రచన వ్యాసంగం వైపు మళ్లించింది. మళ్ళీ తను రచనా వ్యాసంగంపై అడుగులు వేశారు. మధురకవి దూడం నాంపల్లి రచనలు, పరిశీలన అనే ఎం.ఫిల్ సిద్ధాంత గ్రంథాన్ని వెలువరించారు. తన ఉద్యోగ జీవితంలో చవి చూసిన అనుభవాల సంఘటనలతో ఇటీవలే "ఎంకటి కతలు", "మా బడి కతలు" పుస్తకాలను ప్రచురించారు. మనకు తెలిసిన అవుపులి కథను తన మనమరాళ్లకు సరికొత్త రీతిలో చెప్పి ఆ ప్రేరణతో "సరికొత్త అవుపులి కథలు" వెలువరించారు. పెద్దలు రాసే సాహిత్యం బాలల స్థాయికి తగిన విధంగా రాయవలసి ఉంటుంది. అలా రచయిత గరిపెల్లి అశోక్ బాలల స్థాయికి ఎదిగి ఒదిగి రాసిన పుస్తకాలు ఇవి. ఈ మూడు పుస్తకాలు పలువురి సాహితీవేత్తల మన్ననలతో పాటు పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

రచయితగా గరిపెల్లి అశోక్ సామాజిక బాధ్యతను గుర్తెరిగి నేటి చదువులకు అద్దం పట్టేవిధంగా ఎంకటి కతలు పుస్తకాన్ని రూపొందించారు. గ్రామీణ పాఠశాల పరిమళాన్ని గుభాళించిన ఎంకటి కతలు పుస్తకం చదువుతున్న ప్రతి పాఠకుడికి తన బాల్యపు సంఘటనలు గుర్తుకు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రామీణ విద్యార్థుల మనోభావాలను వారు ఆడే ఆటపాటలను, వారియొక్క కష్టాలను, కన్నీళ్లును మన కళ్ళ మందు నిలిపారు రచయిత. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ బడిపిల్లల ప్రతినిధి ఈ ఎంకటి. అతను విద్యార్థి దశలోనే సమాజంలోని మంచి చెడులను ఆకళింపు చేసుకొని భావి తరాలకు ఆదర్శంగా నిలిచాడు. ఇందులోని కథానాయకుడు ఎంకటి ఒక వ్యక్తి కాదు, ఉన్నత భావాలుగల కొందరి వ్యక్తిత్వాల సమాహారంతో సమాజ మార్పును ఆశించే ఒక ప్రభలమైన శక్తి. ఎందరికో స్ఫూర్తినిచ్చే బాలుడు.

తాను బోధించిన పాఠశాలల్లో పొందిన అనుభవాలతో పర్యావరణ, సామాజిక సృహను కలిగించేలా విభిన్నమైన కోణంలో మాబడి కతలు పుస్తకాన్ని రచించారు గరిపెల్లి అశోక్. ప్రకృతి ఒక అందమైన అద్భుతం. ప్రకృతి మనకు గురువులాంటిది. ప్రకృతి నుండి మనము ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అదే విధంగా బడి కూడా మనకు అనేక జీవిత పాఠాలను నేర్పిస్తుంది. ఈ భూమిపై నివసించే ప్రతి ప్రాణిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టుగానే బడిలో చదువుకునే ప్రతి విద్యార్థిలో కూడా ఏదో ఒక నైపుణ్యం అంతర్గతంగా దాగి ఉంటుంది. అలా విద్యార్థిలో దాగి ఉన్న సృజనాత్మక నైపుణ్యమును వెలికితీసే విధంగా మా బడి కతలు ఉన్నాయి. ఇందులో మొత్తం పదిహేను కథలు ఉన్నాయి. ప్రతి కథ దేనికది ప్రత్యేకమైనదే. మాబడి కథలలో పర్యావరణ పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, సహ పాఠ్యాంశాలు, మూల్యాంకనం ఇలా ఒకటేమిటి బడిలో జరిగే అనేక అంశాలను ఇందులో ప్రస్తావించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల స్వభావం ఈ కథల్లో చిత్రితమైనాయి. గ్రామీణ విద్యార్థులు ఎదుర్కొంటున్న పేదరికాన్ని, వారికున్న సహజ ప్రతిభను ఈ కథలు మన కళ్ళముందు నిలిపాయి. తను ఉద్యోగం చేసిన చోటె ఉండడంచే రచయిత గ్రామంలో, పాఠశాలలో ఉండే సమస్యలను, వాటి పరిష్కారాలను సహజంగా, సందేశాత్మకంగా చిత్రించారు.

ఇక మూడవ పుస్తకం సరికొత్త అవుపులి కథలు. ఇందులో పన్నెండు కథలు ఉన్నాయి. ప్రేమ, ఐకమత్యం, సహకారం, ఓర్పు, త్యాగం, ధర్మం, దానం వంటి అనేక గుణాల కలబోతగా ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. ఇది మనకు తెలిసిన ఆవు పులి కథకు కొనసాగింపుగా పిల్లలు ఎంతో ఇష్టపడే విధంగా ఇందులోని కథలు రాశారు రచయిత గరిపెల్లి అశోక్. పాఠ్యపుస్తకాలలో ఆనంతామాత్యుని "భోజరాజీయం" లోని ఆవు పులి కథను మనము విభిన్న ప్రక్రియల్లో చదువుకున్నదే. ఆధునిక కాలంలోని పిల్లలు కూడా సెల్ పోన్ లలో కథలు చూడటమే కాకుండా , అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలను కూడా కథలు చెప్పమని అడుగుతున్నారంటే దానికి కారణం వారికి కథలంటే ఆసక్తి ఉండటమే. అందుకే రచయిత తన మనుమరాళ్లు శ్రద్ధ, శ్రేయలకు బోజరాజీయంలోని ఆవుపులి కథను వినూత్న పద్దతిలో చెప్పి వాటిని మనకు పుస్తక రూపంలో అందించారు. 'ఆడిన మాట తప్పరాదు' అని పాత ఆవు పులి కథ తెలియజేస్తే మారుతున్న విలువలకు ప్రతీకగా ఈ సరి కొత్త అవుపులి కథలను తీర్చిదిద్దారు రచయిత గరిపెల్లి అశోక్. పిల్లలకు నీతిని బోధించే విధంగా, నేటి మానవ సమాజంలోని పరిస్థితులకు అద్దంపట్టే విధంగా సరికొత్త అవుపులి కథలు ఉన్నాయి.

నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల బాల సాహితీవేత్తలకు గరిపెల్లి అశోక్ ఒక దిక్సూచి. బాల సాహిత్య హితైషిగా రచయితలకు, ఉపాధ్యాయులకు సుపరిచితుడు. బడిపిల్లల పట్ల తనకున్న ప్రేమ అపారమైనది. పిల్లల ఎదుగుదలే తనకు సంతోషం. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరో విద్యార్థులను రచయితలుగా తీర్చిదిద్దిన గరిపెల్లి అశోక్ తన పదవీ విరమణానంతర జీవితాన్ని కూడా పిల్లలకే అంకితం చేసి బాలసాహిత్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. పిల్లలలో గల రచనా నైపుణ్యంను వెలికి తీయడం కొరకు అనేక కార్యశాలలు నిర్వహించి బాల సాహిత్యాభివృద్ధి కొరకు అలుపు లేకుండా నిరంతరం శ్రమిస్తున్న బాల సాహిత్య ప్రేమికుడు, కార్యశీలి, ప్రతిభాశాలి గరిపెల్లి అశోక్. పిల్లలతో పాటు ఉపాధ్యాయులను, బాల సాహితీవేత్తలను నిరంతరం ప్రోత్సాహిస్తూ బాల సాహిత్యం మరింత సుసంపన్నం కావడానికి కృషి చేస్తున్నారు.

ముగింపు:

రెండు తెలుగు రాష్ట్రాల బడిపిల్లల రచనా సంకలనముకు సంబంధించిన ఏ సమాచారం కావాలన్న అతని వద్ద లభిస్తుంది. ఒక రకంగా గరిపెల్లి అశోక్ బాలసాహిత్య భాండాగారం లాంటివారు. ఎందరో బాలకవులను తీర్చిదిద్దిన ఘనత తనది. ఎంకటిలాంటి సహజ ప్రతిభ కలిగిన అమ్మాయిలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరియు ప్రభుత్వ పాఠశాలల్లో మనకు ఎందరో కనబడుతుంటారు. అలాంటి వారి గురించి రచయిత తన అనుభవాన్ని జోడిస్తూ అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చేలా మరొక పుస్తకం తీసుకువస్తే బాగుంటుందని అందుకొరకు ఒక చిరు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా. బాలల మంచిని కాంక్షిస్తూ నిరంతరం బాలలకు ఎదో చేయాలనే లక్ష్యంతో పనిచేసే గరిపెల్లి అశోక్ కలం నుండి మరెన్నో బాల సాహిత్యపు రచనలు రావాలని ఆశిద్దాం. డా. నందిని సిధారెడ్డి చెప్పినట్టు బాలసాహిత్యం కోసం బలమైన కృషి చేస్తున్న వారిలో గరిపెల్లి అశోక్ మొదటి వరుసలో ఉంటాడు అనేది అక్షర సత్యం.

ఆధార పుస్తకాలు:

1. ఎంకటి కతలు.

2. మాబడి కతలు.

3. సరికొత్త ఆవు-పులి కతలు.