ఉపోద్ఘాతం: 

ఆదికవి వాల్మీకి రచించిన శ్రీమద్రామా యణం సర్వ ప్రపంచానికి ధర్మాద్దీపకమైనది. రామాయణం కుటుంబ జీవితమును గురించి సత్సంప్రదాయములను గురించి సమగ్ర సుందరంగా చిత్రించిన మహాకావ్యం. వాల్మీకి రామాయణము ఆధారంగా విభిన్న భాషలలో రామకథ రచన సాగింది. మన తెలుగు భాషలోనే ఎవరో ఒకరు వ్రాస్తూనే ఉన్నారు. ఈ ప్రక్రియ ఇంతటితో ఆగేది కాదు. ఒకే కావ్యాన్ని ఇంతమంది వ్రాస్తున్నారంటే అది దాని ఔచిత్యన్ని చెప్పకనే చెప్తుంది. " రాఘవేశ్శరు చారిత్రము లెందరెన్నిగతులన్ నంగ్రాలదే " అన్నాడు ఉత్తర రామాయణ కర్త కంకటి పాపరాజు. రామాయణ కావ్యమును తెలుగులో రచయించిన కవయిత్రులలో కుమారి మొల్ల ప్రథమ గణ్యురాలు.

రాధికా స్వాంతనం ముద్దు పళనిని తప్పిస్తే పూర్వ కవయిత్రులలో ఇంతటి ప్రాచుర్యం పొందిన స్త్రీలు లేరేమో! మొల్ల రామాయణం ఒక్కటే అందరికి తెలిసిన ఆమె రచన. ఆమె ఇంక ఏమేమి వ్రాసిందో లేదో వ్రాసివుంటే అవి దొరుకుతాయో లేదో తెలియదు. శ్లోకం అన్నది సంస్కృత సంప్రదాయ విశేషం. మొల్ల తన కావ్యాన్నిసంస్కృతాన్ని వీడి జాన తెలుగులో వ్రాసింది.

ఈ పద్యాలనే కొందరు విశ్లేషకులు శ్లోకాల న్నారు. ఆమె రచనలను శ్లోకాలనడం ఆమెకు ఒక పాండిత్య స్థాయిని కల్పించడానికే అని అన్పిస్తుంది.

కవయిత్రి ఆత్మీయత:

పాండిత్య ప్రకర్షకు, అర్ధవంతమగు సులభ శైలికి సహజములగు వర్ణనలకు, శబ్దార్థముల హృదయంగమ రూపకల్పనకు ఈమె శిల్పము ప్రసిద్ది గాంచినది. రాజాస్థానాలలో ఉండిన కవులలో అహంకారం, ఆడంబరత కనిపిస్తే, నిరాడంబర జీవితం  గడుపుతూ కవిత్వం వ్రాసిన మొల్లలో సహజంగానే వినయశీలత కన్పిస్తుంది. ఈమె రచనలలో సహజ సుందరత అధికమై కేవలం భక్తి భావంతోనే కలం పట్టిన మొల్ల తన రామాయణ రచనలో హృదయ సంస్కారం పండించుకున్నది. శ్రీరాముడు కరుణతో కాపాడడానికి వారి వారి భక్తియే కారణం కాని చదువులు, పాండిత్య ప్రకర్షలు కావని మొల్ల ప్రగాఢ విశ్వాసం.

విద్య మాటకొస్తే, తాను అట్టే చదువు కోలేదని ఆమె వినయంగా చెప్పుకున్నా ఆమె రచనలో చమత్కారాలు, పాండిత్య ప్రకీర్షా, పూర్వ కవుల గ్రౕంధాలలో భాష గురించి ఆమె చేసిన వ్యాఖ్యానాలు చూస్తే ఆమె విస్తృతంగా కావ్యాలు,ప్రబంధాలు చదివినట్లు కనిపిస్తుంది. ఉదాహరణకు అవతారికలో ఈ పద్యం చూడండి.

" దేశీయ పదము దెనుగు సాంస్కృతుల్ సంధులు ప్రాజ్ఞుల శబ్ద వితతి
శయ్యలు రీతులుఁ జాటు ప్రబంధము లా యా సమాసంబులర్ధములును
భావార్ధములు గావ్య పరిపాకములు రస భావ చమత్కృతుల్ పలుకు. సరవి
బహు వర్ణములును విభక్తులుధాతు లంకృతి చ్ఛందో విలక్షణములుఁ
కావ్య సంపద క్రియలు నిఘంటువులును గ్రమము లేనివియు నెరుగ విఖ్యాత
గోపవరపు శ్రీకంఠ మల్లేశు వరము చేత నెఱి కవిత్వంబు జెప్పఁగా నేర్చికొంటి "

పై పద్యంలో వ్యాకరణ ఛందోరీతులు:

దేశీయాలు సంధులు సమాసములు విభక్తులు భావ చమత్కృతులు వాటి క్రమం తెలియదంటూనే అంత చిట్టా  ఆవర్జాలు వల్లించడం ఏమీ తెలియని వారికి సాధ్యం కాదు కదా! తాను రామాయణాన్ని తెలుగు చేస్తూ తాను కావ్య సంపద క్రియలకు పోనని చెప్పింది. చదువరు లకు అర్థం కాని భాషలో వ్రాస్తే అది మూగ చెవిటివారు ముచ్చట్లాడినట్లే ఉంటుందని హాస్యమాడుతుంది.

మొల్ల రామాయణం - మరికొన్ని చమత్కారాలు:

" తేనె సోక నోరు తీయనయగు రీతి
తోడ నర్ధమెల్ల దోచ కుండ
గూఢ శబ్దములను గూర్చిన కావ్యమ్ము
మూగ చెవిటి వారి ముచ్చట యగును. "

తానంత విద్యా సంపన్నురాలను కాదని చెప్పుకున్నా ఈమె కావ్యమున పాండిత్య లోపమెచ్చటను కనిపించదు ఈమె శైలి మృదుమధుర పద గుంఫితమును భావబంధురమునై సర్వ జన రంజకముగా నుండును." అని దివాకర్ల వేంకటావధానిగారు
ప్రశంసిచారు.

"మేరు మందర సంకాశోబభౌ దీప్తానల ప్రభః ఆగ్రతో వ్యవస్థ చ సీతాయా వానరోత్తమః
హరిః పర్వత సంకాశః మహాబలః వజ్రదంష్ట్ర నఖో భీమ వైదేహి మిదమబ్రవీత్"

అనగా హనుమంతుడు మేరు,మందర గిరులతో సమానంగా పెరిగి, ప్రజ్వలించుచున్న అగ్ని జ్వాల వలె వెలుగొందుచు  సీతాదేవి సమ్ముఖమున నిలిచెను. పర్వత సదృశు డును ఎఱ్ఱని ముఖము కలవాడును, మిక్కిలి బలశాలియు, వజ్రము వలె తీక్ష్ణములైన కోరలు నఖములు, భయంకరమైన ఆకారము గలవాడు అయిన హనుమంతుడు సీతాదేవితో ఇట్లు పలికెను.ఆ దృశ్యాన్ని సులభ శైలిలో తేట తెలుగు ఒకే ఒక్క పద్యంలో వర్ణించింది మొల్ల.

"చుక్కలు తల పూవులుగా
అక్కజముగ మేను పెంచి అంబరవీధిన్
లెక్కసమై చేపట్టిన
నక్కోమలి ముదమునొందె నాత్మస్దితికిన్ "

తన పద్య రచనతో సుందరాకాండకు వన్నె తెచ్చింది మొల్ల. కవయిత్రి మొల్ల 15 శతాబ్దపు ఉత్తరార్ధం లేదా 16 వ శతాబ్దపు పూర్వార్ధంలో జన్మించి ఉంటుందని సాహిత్య పరిశోధకులు, చరిత్ర కారులు నిర్ధారించారు. మొల్ల తన రచనలలో ఎక్కడా తన జనన కాలం లేదా రచనా కాలం గురించి ప్రస్తావించలేదు. ఆమె కవితా విశిష్టతను పెక్కురు ప్రశంసించారు. అందులో కొందరు దివాకర్ల వేంకటావధాని, ఆండ్ర శేషగిరి రావు, ఊటుకూరి లక్ష్మీశాంతమ్మ, కావలి వేంకటరామస్వామి, చిలుకూరి వీరభద్రరావు, పుండ్ల రామకృష్ణయ్య, జనమంచి శేషాద్రి శర్మ, బొద్దికూరపాలు వేంకట రంగకవి, మలయ వాసిని మొదలగువారు.

కుమ్మరి కులావతంసమైన ఆతూరి మొల్ల కేశనసెట్టి కూతురు. ఈమె భర్త చిన్నతనం లోనే పోయాడని కొందరు, ఆమె వివాహమే చేసుకోలేదని కొందరు అంటారు. ఏది ఏమైనా ఆమె కుమారి మొల్లగా ప్రశస్తిగాంచింది. ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉండిన విద్వాంసులు " ఇది శూద్ర కవిత్వం కనుక నిషిద్ధం " అని నిరాకరించారట. అయితే మొల్ల తను వ్రాసిన కొన్ని పద్యాలను చదివి రాజుకు వినిపించింది. అంతట ఆ రాజు ఆమె కవిత్వాన్ని మెచ్చుకొని ఆమెకు ' పల్లకి ', ' నగరి ', నిత్య జీతం ', 'మాన్యాలు' ఏర్పాటు చేసాడట.

కుమారి మొల్లకు ముందు రామాయణాన్ని తెనిగించినవారు ఆనాడు వాడుక లోనున్న శిష్ట గ్రాంధీకాన్ని ఎంచుకున్నారు. దానిని ఆమెఅధిక్షేపించిన విషయం ముందు పేరాల్లోనుంది. నిజమే అవి చదవాలంటే పండితులే నిఘంటువును దగ్గర పెట్టుకోవాలి. మొల్ల తన రామాయణాన్ని అందరికీ అర్థమయ్యే జాను తెలుగులో సులభ శైలిలో వ్యవహారిక భాషలో వ్రాసి అందరి మన్ననలు పొందింది.

"అది రఘురామచరితము
నాదరముగ విన్న గ్రొత్తయై లక్షణ సం
పాదమ్మె పుణ్య స్థితి
వేదమ్మె తోచకున్న వెఱ్ఱి నే చెప్పన్ "

బమ్మెర పోతన మహా భాగవతాన్నిశ్రీరామచంద్రుని ఆజ్ఞతో వ్రాసినట్టు చెప్పాడు. అదే ఒరవడిలో కుమారి మొల్ల ఇలాగంది.

" చెప్పమని రామ చంద్రుడు
చెప్పించిన పలుకు మీద జెష్ఫెద నే నె
ల్లప్పుడు నిహ పర సాధన
మిప్పుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్! అంటుంది వినయంగా.

మొల్ల రచనలో ఎన్నో చమత్కారాలు న్నాయి. సాకేతపుర వర్ణనలో కాదు కాదంటూనే ఏది అవునో వివరిస్తూ ఆమె చెప్పిన పద్యాలు హృద్యంగా ఉన్నాయి.మచ్చుకి రెండు పంక్తులు."మదనాగ యూధ సమగ్ర దేశము గాని/కుటిల వర్తన శేష కులము కాదు " ఏది కాదో ఏది అవునో విశేష చమత్కృతితో వ్రాసినది.

ముగింపు:

కుమారి మొల్ల నిజంగా ధన్యురాలు. సవర్ణులు నిమ్నజాతివారిని అణగద్రొక్కు తున్నారు, వారు మనువాదులని నేటి సెక్యులరిస్టులు ఓట్ల లబ్ది కోసం హిందూ సమాజాన్నిరెండుగా చీల్చి రంకెలు వేస్తున్నారు వారి ఆరోపణలతో ఎలాంటి పస లేదు. కుమ్మరి జాతిలో పుట్టిన మొల్ల రామా యణాన్ని తెనిగించి ధృవతారగా నిలిచింది. ఈ కుహనా సెక్యురిష్టులు చరిత్రను చదివి యధార్ధమును తెలుసుకోవలసిన తరుణమిదే.