ఉపోద్ఘాతం:

"గాయత్య్రా: పరం మంత్రం నమాతుః పరదైవతమ్" తల్లి రక్తమాంసాదులను ధారపోసి జన్మను ప్రసాదించడం చేత ఆమెకు మించిన పర దేవత లేదనడం సత్యం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు పుట్టుకతో ఒక జన్మ ప్రాప్తిస్తూ ఉంటే ఉపనయన సంస్కారంచే రెండవ జన్మ లభిస్తుంది. కాబట్టి వారికి ద్విజులు వ్యవహారం ఏర్పడింది. ఆ ద్విజత్వాన్ని ప్రసాదించేది గాయత్రి మంత్రోపాసనం. ఆ గాయత్రికి సంధ్య, సావిత్రి, సరస్వతి అను నామాంతరాలున్నాయి.

గాయత్రీ మంత్రోపాసనం సంధ్యావందన సమయంలో గావింపబడుతుంది. కావున సంధ్యావందనం, సంధ్యోపాసనం అనేవి గాయత్రీ జపానికి సమానార్థకాలుగా వ్యవహార ప్రసిద్ధి పొందేయి. “అహరహ సంధ్యా ముపాసీత” అని శ్రుతి చెప్తోంది. ప్రతిదినమూ సంధ్యోపాసన ఆచారించాలని భావం. “ఉపాసీత” అను క్రియారూపం విధ్యర్థకం. ఏ విధమగు చర్చకూ అవకాశమొసంగక నిస్సంశయంగా ఎట్టి స్థితిలో కూడా విడువక సంధ్యాదేవిని ఉపాసింప వలెనని భావం. అంతటి మహత్వంగల గాయత్రి నామానికి గల అర్థవిశేషాలెట్టివో, దాని ప్రాశస్త్యం ఎటువంటిదో, భాగవతానికి - గాయత్రీ మంత్రానికి గల అనుబంధం ఎటువంటిదో తెలిసికోడం ఎంతైనా అవసరం.

గాయత్రి - అర్థవిశేషాలు:

“గయ” అనగా ప్రాణాలని అర్థం. వానిని రక్షించేది కాబట్టి గాయత్రి అని బృహదారణ్యకం ఇలా బోధిస్తోంది-

"సా హైషా గాయం స్తత్రే ప్రాణావై గయా స్త త్ప్రాణాం స్తత్రే

తద్యద్గయాం స్తత్రే తస్మా ద్గాయత్రీనామ". ( అధ్యా 5 – బ్రాహ్మణం 14)

గాయత్రి అనే శబ్దానికి "గాయంతం త్రాయతే ఇతి గాయత్రీ" అని వ్యుత్పత్తి. తన్ను ఎవ్వరు గాన మొనరిస్తారో అనగా ఉపాసిస్తారో వారిని " ఆ దేవత అనేక విధాలుగా రక్షిస్తుంది. కాబట్టి గాయత్రి అను నామం ఏర్పడిందని భావం.

యజుర్వేద సంహిత “యా గాయంతం త్రాయతే సా గాయత్రీ” అని నిర్వచించింది.

స్కాంద పురాణాంతర్గతమయిన కాశీఖండము కూడా పై భావాన్నే "గాతారం త్రాయతే యస్మాద్గ్రాయత్రీ తేన గీయతే" అని వివరించింది. శివపురాణం "గాయకం త్రాయతే పాపాత్ గాయత్రీ త్యుచ్యతే హి సా"అని పై అర్థాన్నే బోధిస్తోంది.

గానం చేస్తున్న పరమేశ్వరుని ముఖం నుండి మొట్టమొదట ఛందో రూపంలో ఆవిర్భవించింది “గానగాయత్రి” అని నిరుక్తము ఇట్లు నిర్వచించింది. "గాయతో ముఖాత్ ఉపతదితి గాయత్రీ".

దేవీభాగవతం - గాయత్రి:

ఓంకారముతో మూడు వ్యాహృతులతో గానం చేసే వారిని ఈ మంత్రం రక్షిస్తుంది కాబట్టి దీనికి గాయత్రి అను నామం ఏర్పడిందని దేవీ భాగవతం ఇట్లు తెలుపుతోంది.

"గాయంతం త్రాయతే తస్మా ద్గాయత్రీ త్య భిధీయతే

ప్రణ వేనచ సంయుక్తాం వ్యాహృతి త్రయ సంయుతామ్"

ప్రాతః సంధ్యాకాలంలో ఆరాధింపబడే దేవత గాయత్రి అని, మధ్యాహ్న సంధ్యా సమయంలో జపింపబడే దేవత సావిత్రి అని, సాయంసంధ్య కాలంలో అర్చింపబడే దేవత సరస్వతి అని వ్యవహరింపబడుతుందని సంప్రదాయంలో ఇలా ప్రసిద్ధి పొందింది.

"గాయత్రి నామ పూర్వాహ్ణే సావిత్రీ మధ్యమే దినే

సరస్వతీ చ సాయాహ్నే సైవ సంధ్యా త్రిషు స్మృతా"

సాయం ప్రాతః సంధ్యలు ఒక్కొక్కటి మూడు విధాలు అని దేవీ భాగవతంలో ఇట్లు విభజింప బడ్డాయి.

"ఉత్తమా సూర్యసహితా మధ్యమా౭స్తమితే రవౌ

అధమా తారకో పేతా సాయం సంధ్యా త్రిధా మతా" (11 స్కం - 18 - శ్లో. 5)

"ఉత్తమా తారకోపేతా మధ్యమా లుప్త తారకా

అధమా సూర్య సహితా ప్రాతః సంధ్యా త్రిధా మతా" (11 స్కం - 18 - శ్లో. 4)

సూర్యునితో కూడినప్పుడు చేయబడే సాయంసంధ్యోపాసన ఉత్తమం. నక్షత్రాలు ఉదయింపక పూర్వం చేయబడేది మధ్యమం. నక్షత్రాలు బాగుగా ప్రకాశించే సమయంలో చేయబడేది అధమం. ఉదయ సంధ్యోపాసన నక్షత్రాలతో కూడిన సమయంలో చేయబడితే ఉత్తమం. నక్షతాలు లోపించిన పిమ్మట చేయబడితే మధ్యమం. సూర్యునితో కూడినప్పుడు చేయబడితే అధమం. కాబట్టి ద్విజులు సూర్యుడు పూర్తిగా అస్తమింపక పూర్వం సాయం సంధ్యావందనాన్ని, అట్లే నక్షత్రాలతో కూడిన అంటే సూర్యోదయానికి పూర్వం ప్రాతః సంధ్యావందనాన్ని ఆచరించాలి అని తాత్పర్యం. అలా అయితే ఆ గాయత్ర్యుపాసనం ఉ త్తమమై, అధిక ఫలప్రదమవుతుంది.

గాయత్రిని జపించేటప్పుడు సంఖ్యా విషయంలో సంప్ర దాయం ఇలా వివరిస్తుంది.

"అష్టోత్తర సహస్రం వా అష్టోత్తర శతం తు వా

అష్టావింశతి రేవా౭థ గాయత్రీం దశకం జపేత్"

వేయిన్నూటఎన్మిదిగాని, నూటెనిమిది గాని, ఇరవై ఎనిమిది, గాని కనీసం పది గాని సంఖ్య గలుగునట్లు గాయత్రి జపించాలి అని తాత్పర్యం. యథాశక్తిగా గాయిత్రీ మంత్రోపాసన చేయాలి గాని మానకూడదు. మానడం సర్వానర్థకాలకు ప్రధానహేతువు.

రామాయణం - గాయత్రి:

ఆ గాయత్రీ ప్రాశస్త్యాన్ని ఎందరో ఎన్నెన్నో విధాలుగా బోధించేరు. శ్రీమద్రామాయణము గాయత్రీ మంత్రాక్షరానుసారము చతుర్వింశతి సహస్రశ్లోక నిబద్ధమైనదని ప్రసిద్ధి. ఆ మంత్రాక్షరాలకి సంబంధించిన అక్షరాలలో కూర్పబడిన శ్రీమద్రామాయణ శ్లోకాలకు గాయత్రీ రామాయణమని వ్యవహారం. దానికి నిత్యపారాయణ సంప్రదాయం కూడా ఏర్పడింది. దానిని మూడు సంధ్యలలో పఠించే వారు సర్వ పాప విముక్తులగుదురని ఫలశ్రుతిలో ఇలా చెప్పబడింది.

"ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీ బీజ సంయుతం

త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే"

భాగవతం - గాయత్రి:

అష్టాదశ పురాణాలలో మిక్కిలి ప్రసిద్ధి గాంచిన భాగవతం గాయత్రీ మంత్రాధికృతంగా రచింపబడిందని మత్స్య , స్కాంద పురాణాలు పేర్కొంటున్నాయి. మత్స్యపురాణంలో –

"యత్రాధికృత్య గాయత్రీం వర్ణ్యతే ధర్మవిస్తరః

వృత్రాసుర వధోపేతం తద్భాగవతమిష్యతే

అష్టాదశ సహస్రం తత్ పురాణం పరికీర్తితం"

అని పేర్కొనబడింది. గాయత్రి నాధారముగా చేసికొని ధర్మ బాహుళ్యం భాగవతంలో వర్ణింపబడిందని భావం. గాయత్రితో భాగవతము ఆరంభించబడిందని స్కాందపురాణము ఇలా పేర్కొంటోంది-

"గ్రంథో౭ష్టాదశ సాహస్రో ద్వాదశస్కంధ సమ్మితః

హయగ్రీవ బ్రహ్మవిద్యా యత్ర వృత్రవధస్తథా

గాయత్య్రా యా చ సమారంభః తద్వై భాగవతం విదుః"


వ్యాసభాగవతమందలి తొట్టతొలి శ్లోకమిట్లు రచింపబడింది-


"జన్మాద్యస్య యతో౭న్వయాదిత ర శ్చా ర్థే ష్వభిజ్ఞ: స్వరాట్

తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూర య:

తేజో వారి మృదాం యథా వినిమయః యత్ర త్రిసర్దో మృషా

ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి"

ఈ జగత్తును జన్మ స్థితిలయాదులు ఎవని నుండి కలుచున్నవో అన్వయ వ్యతిరేకాలచే సర్వ వస్తువులందు కనబడే వాడెవ్వడో స్వయం ప్రకాశకుడైన వాడెవడో, ఏ పరమేశ్వరుడు బ్రహ్మకు మనస్సు చేత వేదాలని ఉపదేశించేడో, ఎవనిని గూర్చి పండితులు మోహం పొందుతున్నారో, ఎండమావులను నీరు, కాచాదులందు అన్యత్వం వలె ఎవ్వనియందు భ్రాంతి గల్గుతుందో, ఎవనియందు సత్త్వ రజస్తమోగుణాలు (అ) సత్యమవుతున్నాయో, తన మహస్సుచే కపటాన్ని పోగొట్టుచున్న వాడెవడో, త్రికాల బాధితమైన ఆ పరమాత్మను ధ్యానింతును” - అని తాత్పర్యము.

శ్రీధర పండితులు భాగవతానికి వ్యాఖ్య రచిస్తూ ఈ శ్లోకాన్ని గాయత్రీ మంత్ర పరంగా సమన్వయించి వ్యాఖ్యానించిన విధం పరిశీలనార్హం - దాని సారం :

పై శ్లోకంలో "జన్మాద్యస్య" అను పదద్వయం గాయత్రి మంత్రంలోని "సవితుః" అనే పదాన్ని బోధిస్తుంది. శ్లోకంలోని “పరం” అనుపదం - గాయత్రి మంత్రంలోని “వరేణ్యం” - అనే పదానికి బోధకం. శ్లోకంలోని “స్వరాట్”, “ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం” అనే పదాలు మంత్రంలోని భర్గః అను పదానికి బోధకాలు, “తే నే బ్రహ్మ య ఆదికవయే” - అను శ్లోకభాగం 'ధియో యో నః ప్రచోదయాత్” అనే భాగానికి బోధకం. శ్లోకం లోని సత్యం - అనే పదం మంత్రం లోని ఆరంభంలో ఉండే “తత్” - అనే పదానికి బోధకం. “అస్య” - అనే శ్లోకస్థ పదం మంత్రంలోని “దేవస్య”- అనే పదానికి బోధకం. “ధీమహి” -అనేది శ్లోకంలోను, మంత్రంలోను సమానంగా ఉంది. “హృదా” - అను శ్లోకంలోని పదం విభక్తి వ్యత్యయం గల్గి “ధియః” - అను గాయత్రీ మంత్రంలోని పదాన్ని బోధిస్తుంది. శ్లోకంలోని “ఆదికవయే” అను పదం మంత్రంలోని “నః” - అను పదాన్ని సూచిస్తోంది. శ్లోకమందలి “తేన” - అను క్రియాపదం మంత్రంలోని “ప్రచోదయాత్” అనే పదానికి సన్నిహితమైనది.

ఈ విధంగా శ్రీధరపండితులు భాగవత ప్రథమశ్లోకాన్ని వ్యాఖ్యానించి భాగవతము గాయత్య్రాఖ్య పరబ్రహ్మ విద్యా రూపమైన పురాణమని నిర్ణయించేరు.

ముగింపు:

పురాణాలు పేర్కొనినను, శ్రీధరులు సమన్వయించినను, భాగవతంలోని పన్నెండు స్కంధాలలో మరెక్కడా గాయత్రి ప్రసక్తి కానరాకుండడం విచిత్రం. వ్యాసముని ప్రణీతమైన దేవీభాగవతమునందు మాత్రం ఏకాదశ స్కంధంలో గాయత్రీ మహిమ, స్వరూపం, జప విధానం నామసహస్రం మొదలైన అనేక విషయాలు సమగ్ర సుందరంగా విశదీకరింపబడ్డాయి.

ఆధారగ్రంథాలు:

1. శ్రీ మన్మహాభాగవతము, వ్యాసప్రణీతము - శ్రీధరీయవ్యాఖ్య.

2. శ్రీ మద్దేవీభాగవతము, వ్యాసప్రణీతము.

3. బృహదారణ్యకోపనిషత్

4. యజుర్వేద సంహిత

5. శ్రీ శివపురాణం

6. శ్రీ వాల్మీకి రామాయణము

7. శ్రీ స్కాందపురాణము