“శ్రీమహా విష్ణువు మోహినీ అవతారంలో దేవ దానవుల యోగ్యతను బట్టి అమృతాన్ని పంచడంలో ఔచిత్యాన్ని ప్రదర్శించాడు. పరమ ఔచిత్యకారి - ఆ అచ్యుతుడికి నమస్కరిస్తున్నాను” అని కాశ్మీర పండిత అగ్రేసరుడు క్షేమేంద్ర మహాకవి ప్రస్తుతించాడు. సౌందర్య శాస్త్రంలో ఔచిత్య సిద్ధాంత ప్రతిపాదనతో ఆచార్య పీఠాన్ని అలంకరించాడు. ప్రతి పదంలో, వాక్యంలో, అలంకార, రసాదుల్లో, దేశ కాలాలలో అన్ని చోట్లా యోగ్యతను అనుసరించి ఔచిత్యాన్ని పాటించాలని ఘంటా పథంగా చెప్పాడు. తెలుగు భాషా సాహిత్యాల్లో కూడా ప్రాచీనం - ఆధునికం అనే భేదాలేవీ లేకుండా సమకాలీన సమాజ ఉద్ధరణకు ఈ ఔచిత్యమ్ ప్రాణప్రదమైంది. ఈ మహిత ఉద్దేశాన్ని తెలియజేసేదిగా, ఉన్నత ఆశయాలను చేరుకోవాలనే లక్ష్యంతో ఈ అంతర్జాల తెలుగు మాస పత్రికకు “ఔచిత్యమ్” అని నామకరణం చేశాం.

తెలుగు పరిశోధక శిఖామణులారా..! రండి....! మీ బహు గ్రంథపఠన కౌశలానికి, ప్రామాణిక పరిశోధనా పద్ఢతుల పరిమళాలను వెదజల్లే ఆలోచనలను మేళవించి, విశ్వవేదికపై కొలువుతీరిన తెలుగుతల్లి మెడలో వ్యాసమాలగా అలంకరించండి. ఈ విజయ దశమి రోజు ప్రారంభ సంచికను కొన్ని వ్యాసాలతో వెలువరించాం. ఆసాంతం ఆస్వాదించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.

- ప్రధాన సంపాదకుడు

శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ.