ఉపోద్ఘాతం:

భవిష్యత్తు గూర్చి ఆలోచిస్తున్నామంటే, దాని అర్థం మనం బాల్యావస్థలో ఉండి ఉండాలి. లేదా మన స్థితి బాగుండక పోయి ఉండాలి. తెలుగులో ఎంతో సాహిత్యం ఉంది కదా! మన భవిష్యత్తుకు ధోకా ఏమిటి అంటే, ఉన్న సాహిత్యం ‘సంపద’ అని చెప్పదగిన స్థాయిలో లేదన్న మాట! కాదు, మనది గొప్ప సంపద అనుకుంటే, మన వద్ద ఉన్న సాహిత్య సంపదను మనం చక్కగా ఏర్పరచుకోవటం లేదన్న మాట!

భవిష్యత్తు గూర్చి ఎప్పుడు ఆలోచించాలి:

తెలుగు భాష ప్రాచీన హోదాకు వచ్చిన ప్రమాదం ఏమి లేదని తెలుసుకున్న సందర్భంలో, తెలుగు సాహిత్యం బాల్యావస్థలో లేదన్న విషయం స్పష్టమయింది. తెల్ల వారి లేచి ఏపత్రిక చూచినా, సాహిత్య సభల వార్తలకు కొదవ లేదు. బిరుదులకు, సన్మానాలకు కొదవలేదు. మరి ఇతర భాషా సాహిత్యాలకు వచ్చినంత గుర్తింపు తెలుగు భాషా సాహిత్యాలకు రాదేమి? మనకు తెలియకుండా ఎక్కడో ఏదో సమస్య ఉన్న మాట నిజం. ముందుగా సమస్యను గుర్తిస్తే కదా పరిష్కారాన్ని వెతకగలం. “ All is well ” అంటూ మనలను మనం మభ్య పెట్టుకోవటం వల్ల ఒరిగేదేమి ఉండదు. అందుకే ‘రోగం రట్టు’ అన్నారు పెద్దలు.

భవిష్యత్తు గూర్చి ఎవరు ఆలోచించాలి?:

ఒక శిశువు భవిష్యత్తు కోసం తలిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కృషి చేస్తారు. మొత్తం సమాజానికి చెందిన సాహిత్య భవిష్యత్తుకు కృషి చేయవలసిన రంగాలు ముఖ్యంగా ఐదు ఉన్నాయి.
1. కుటుంబం 2. విద్యారంగం 3. సృజన కర్తలు 4. భావుకులైన పాఠకులు 5. ప్రభుత్వం.

1. కుటుంబం:

కుటుంబం మిగిలిన నాలుగు వర్గాలకు మూలం. ముందుగా ఈ స్థాయిలో ఏ శషభిషలులేకుండా, ‘కానీ, అయినా’ అంటూ మినహాయింపులు ఇవ్వకుండా మనభాష అయిన తెలుగును ప్రేమించడం నేర్చుకోవాలి. రాజకీయ నాయకుల్లా మనో వాక్కాయ కర్మలకు సంబంధం లేకుండా, మాతృ భాషా దినోత్సవం నాడో, తెలుగు భాషా దినోత్సవం నాడో, పితృకర్మ సందర్భంలోలాగా తెలుగు భాషకోసం ప్రాణాలను పణంగా పెట్టిన వారిని స్మరించుకోవటం కాక, నిరంతరం మనం మనభాష జవజీవాలపై నిజంగా దృష్టి నిలపాలి.

మనం తెలుగు మాట్లాడి, మన పిల్లలు తెలుగు మాట్లాడేలాగా శిక్షణను ఇవ్వాలి. కనీసం పిల్లలకు ఐదు సంవత్సరాలు నిండేదాకా, అయినా ఈ జాగ్రత్త తీసుకోవాలి. భాష అంటూ వస్తే కదా మన తరువాతి తరాలు సాహిత్యాన్ని కనీసం చదవ గలుగుతారు. మనం ఈ జాగ్రత్త తీసుకోనందువల్లనే, నేటి తెలుగు సాహిత్యానికి సృజన కర్తలే కాక చదువరులు కూడా కరువై పోయారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలను ఏళ్ళ తరబడి కరువు బాధించి, బాధించి… చివరకు అవి ఎడారిగా మారిపోతున్నాయని గ్రహించి, ఇప్పుడు ఆ ప్రాంతాలకు నీటి సరఫరాపై దృష్టి నిలుపుతున్నారు. సరిగా ఇలాగే, భాష విషయంలో ఇప్పుడు మనం శ్రద్ధ తీసుకోక పొయామో, సాహిత్యం సంగతి దేవుడెరుగు ముందుగా భాషే నశించిపోతుంది.

2. విద్యారంగం:

రెండవది విద్యారంగం. ఈ రంగంలో బోధకులు స్వయంగా పండితులే కాక మంచి భావుకులై ఉండటం అవసరం. అప్పుడే వారు సాహిత్యాన్ని విద్యార్థులు ఆనందించ గలిగేలా బోధించ గలుగుతారు. అంతే కాక, ఆయా తరగతుల్లో బోధించటానికి ఎంపిక చేసే పాఠ్యభాగాలు అలా భావుకతను జోడించే అవకాశం ఇచ్చేలాగా ఉండాలి. పాఠ్యభాగాల ఎంపికలో, బోధకుల ఎంపికలో పాండిత్యం –భావుకతలకు మించిన ఏ ఇతర కారణాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వరాదు. ఇలా జరిగినప్పుడే ఇప్పుడు మనకు ఉన్న సాహిత్యమైనా జవజీవాలతో ముందుతరాలకు అందుతుంది. విద్యారంగం సమాజానికి కేవలం భాషా పరిచయాన్నే కాక కనీస పాండిత్యాన్ని కూడా అందజేయాలి. సాహిత్య విద్య, విద్యగా నిలచినప్పుడే సాహిత్యానికి అందమైన భవిష్యత్తు ఉంటుంది.

3. సృజనకర్తలు:

మూడవది సృజనకర్తల రంగం. సాహిత్యాన్ని ఆనందించాలంటే ముందుగా అందమైన, అజరా మరమైన సాహిత్యాన్ని సృజించే సృజనకర్తలు కావాలి. సృజన కర్తలది మాతృస్థానం. గర్భం ధరించే ముందే తల్లి ఆరోగ్యం చక్కగా ఉండటమే కాక పరిపుష్టి గా కూడా ఉండాలి. సందర్భాన్ని బట్టి బలవర్ధకమైన ఆహారాన్ని, విశ్రాంతిని తీసుకుంటూ, లేదా తేలికపాటి వ్యాయామాలను చేస్తూ, తల్లి శిశూదయం వరకు నిరంతరం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఉంటుంది.

మరి సాహిత్యంలో సృజన కర్త ఆరోగ్యమంటే ఏమిటి? మన ప్రాచీనులైన మమ్మటుడు, ఆనందవర్ధనాది అలంకార శాస్త్రజ్ఞులు చెప్పినట్లుగా (అ.) ప్రతిభ, అనగా, సహజంగా వ్యక్తుల్లో శక్తి, యుక్తి ఉండాలి. దానిని మెరుగుపెట్టే (ఆ) వ్యుత్పత్తి, అనగా ఎన్నో పుస్తకాలను అధ్యయనం చేసి సంపాదించే పాండిత్యం ఉండాలి. అందుకు విశేష కృషి చేయవలసి ఉంటుంది. ఏ ప్రక్రియను చేపట్ట దలచుకొంటే, ఆప్రక్రియకు సంబంధించిన చక్కని సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి. ఈ డొక్కశుద్ధి కలిగాక, ఆయా ప్రక్రియల్లో ప్రసిద్ధ రచనలను సవిమర్శకంగా అధ్యయనం చేసి ఉండాలి. చేసేది పద్యరచన అయితే, ఛందోపరిజ్ఞానంతో పాటు, ఆణిముత్యాల వంటి రచనలను చేసిన పూర్వ కవుల కావ్యాలను అధ్యయనం చేసి ఉండాలి. ఆయా ప్రయోగాల మర్మాలను గ్రహించ గలిగి ఉండాలి. నవలా రచన చేస్తున్నట్లయితే, పాత్ర చిత్రణ, కథను విస్తరించే పద్ధతులు, కథన పద్ధతులు మొదలైన సాంకేతిక పరిజ్ఞానం ఉండితీరాలి. ప్రపంచ ప్రసిద్ధి పొందిన నవలలను అధ్యయనం చేయటం, ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని రచనకు అన్వయం చేసుకొని, చదివే నేర్పు కలగాలి. అప్పుడు అనుభవపూర్వకంగా సృజన కళను (ఇ) అభ్యాసం చేసిన ఫలితం కలుగుతుంది. అప్పుడు సృజన కర్తకు ఉన్న ప్రతిభకు బలం చేకూరుతుంది.

అభ్యాసంతో స్వీయ శైలిని ఏర్పరుచుకోవాలి. చక్కని మృదువైన మాటలతో ఏవో నాలుగు సంఘటనలను రాసేస్తే అది కథ కాదు. కథా కళకు ఒక శిల్పం ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలి. అలాగే ప్రతి సృజనకర్తా తనదైన ఒక కార్యక్రమాన్ని కలిగి ఉంటాడు.అటువంటి మౌలిక దృక్పథం లేకపోతే మంచి రచనలు అతని నుండి వెలువడటం సాధ్యం కాదు. తన సాహిత్య ప్రయోజనం ఏదోసృజనకర్త నిర్ణయించుకొని, ఆ గమ్యం చేరుకోవటానికి తగిన కళాత్మక మార్గాన్ని తానే నిర్మించుకోవాలి. ఉదాహరణకు నేటి సాహిత్యమంతా అస్తిత్వ పోరాటాలతో నిండి ఉంది. పూర్వం ఏవో సాహిత్య సిద్ధాంత వాద వివాదాలు ఉండేవి. పోరాటాన్ని మాత్రమే వ్రాసేస్తే అది కళారూపం కాదు. ఒక కళారూపాన్ని ఎంచుకొని, ఆరూపపు విలువలకు తగ్గకుండా అస్తిత్వపోరాటా న్నే చేసినా, సిద్ధాంత రాద్ధాంతాలనే చేసినా అది సాహిత్యంగా నిలబడుతుంది. కాలానికి ఎదురీదుతుంది. లేనప్పుడు వార్తాకథనంగా మిగిలిపోతుంది.

మాతృస్థానంలో ఉండే సృజన కర్త తన సంతానం అనగా రచనలు కాలానికి ఎదురీది, కలకాలం నిలవాలని కోరాలి గాని, ఈ పోటిలో గెలిస్తే చాలు, ఈ ప్రచురణకు ఎన్నికైతే చాలు అని తాత్కాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రచనలను చేయకూడదు. ఏడాదికి ఎన్ని రచనలు చేసాం, ప్రచురించామన్నది కాదు, మనం వ్రాసినవి ఎంతకాలం నిలుస్తాయన్నది ముఖ్యం. అల్పాయుష్కులను కనాలని ఏతల్లి అనుకుంటుంది? చదవటం, మరింత చదవటం, నిర్మాణ మర్మాన్ని తెలుసుకొని చదవటం, సృజన కర్త ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పుష్టిని కలిగిస్తాయి. ఇటువంటి పరిశ్రమ అతని సృజనకు ఆయుర్దాయాన్ని పెంచుతుంది. రచయిత నిరంతరం సమాజహితానికే పాటుపడాలి. ఆ హితంతో పాటు సగటు పాఠకుని స్థాయిని పెంచటం కూడా ఒకటి. భాష విషయంలో, భావం విషయంలో రచయిత సగటు పాఠకుని స్థాయికి దిగి రావటం కాక, అతను ఒకమెట్టు ఎక్కేలాగా రచన ఉండాలి. నిరంతరం గొట్టంలో ఆహారాన్ని అందిస్తూ పొతే రోగి జీర్ణ శక్తి క్రమంగా నశించినట్లు, మరీ వార్తా పత్రికల స్థాయిలో సాహిత్యాన్ని సృజిస్తామంటే, సగటు మానవునికి తెలిసే పద సంపద తగ్గిపోతుంది. అందువల్ల భాషకు అపారమైన నష్టం వాటిల్లుతుంది. పర్యవసానంగా సాహిత్య విద్య నశించిపో తుంది.

విమర్శకులు ఏ వర్గం? :

విమర్శకులు కూడా సృజన కర్తల వర్గంలోనే చేరుతారు. విమర్శకునికి పాండిత్యం ఎంత కావాలో, భావుకతా అంతే కావాలి. మంచి విమర్శకులు బోధకులైతే, విద్యార్థికి సాహిత్యాన్ని ఆనందించే, అధ్యయనం చేసే మార్గాలు బోధ పడుతాయి. సాయం సమయ సూర్యుడు ఆకాశపు ఒడిలో కురిపించే రంగులను చూచి ఆనందించటం తెలిసిన అధ్యాపకునికి పెద్దన మనుచరిత్రలో సాయం సమయ వర్ణనను ఆనందించటం సులువౌతుంది. బోధించటమూ సులువౌతుంది. విమర్శకులు సమాజానికి సాహిత్యంలోని మర్మాలను వివరిస్తారు. ఏది ఎందుకు బాగుందో, ఏది ఎందుకు బాగులేదో వివరిస్తారు. సమాజంలో సాహిత్యాభిరుచిని పెంపొందిస్తారు. సాహిత్యాన్ని ఆదరించే పాఠకులే సాహిత్య భవితవ్యానికి ఆకరాలు. అందువల్ల విమర్శకూడా ఒక స్వతంత్ర ప్రక్రియ.

విమర్శకుడు కూడా సృజన కర్త :

ప్రతి రచయితా, విమర్శకుడు, తాము రచించినదంతా వేదమని, ప్రచురణార్హమని భావించకుండా, నిష్పాక్షికంగా, అది ఎంతకాలం నిలుస్తుంది అనే విషయాన్ని పరీక్ష చేసుకోవాలి. అలా నిలబడదు అనుకున్నప్పుడు, అందులోని లోపాలను గుర్తించి, దిద్దుకోవాలి. అధిగమించే మార్గాలను తెలుసుకోవాలి. అవసరమైతే తిరిగి వ్రాయాలి. కేవలం తన రచనలనే కాక, సమకాలికుల రచనలను, పూర్వపు కళాఖండాలను నిరంతరం చదువుతూనే ఉండాలి. రచనాకళ సిలబస్ లేని పరీక్షకు కూర్చోవటం లాంటిది. అయితే ఈ పరీక్షను మూడు గంటల్లో వ్రాయాలనే నిబంధన లేదు కాబట్టి, ముప్ఫై సంవత్సరాలు తీసుకున్నా పరవాలేదు. చిరాయువుగా నిలచే సాహిత్యానికి దగ్గర దోవ ఉండదు మరి.

4. భావుక పాఠకులు :

భావుకులైన పాఠకులు సాహిత్యపు ఉజ్జ్వల భవితవ్యానికి అండగా నిలబడే నాలుగో వర్గం. ఆలోచనామృతమైన సాహిత్యాన్ని మరీ మరీ భావించినప్పుడే అందులోని స్వారస్యం అనుభవంలోకి వస్తుంది. అలా అనుభవంలోకి తెచ్చుకోవటానికి పాఠకుని అస్తిత్వ సమస్యలు ఆటంకం కారాదు. సాహిత్య సృజన కర్త ఎవరైనా, దాన్ని ఆనందించే సహృదయత పాఠకునికి ఉండాలి. మన విశ్వాసాలకో, అస్తిత్వానికో అనుకూలమైనది కాదని భావించినంత మాత్రాన, అందులోని విలువలను పక్కన పెట్టడం మంచిదికాదు. చక్కని విషయ పరిజ్ఞానం, జీవితం పట్ల ఉత్సాహం, నిష్పాక్షికత కలిగిన భావుక పాఠకులే సాహిత్యాన్ని నిలిపే గొప్ప ఆకరం. వీరు చక్కని రచనలు సేకరించటమే కాక తమ చుట్టూ పక్కల వారిని, బంధు మిత్ర వర్గాలను సాహిత్యాస్వాదన చేయటానికి ప్రోత్సహిస్తారు. రాజపోషణ లేని ఈ కాలంలో సాహిత్య పోషణ చేసేది సామాన్యులే! అలాకాక, తమ కులానికో, వర్గానికో, లింగానికో పరిమితమైన సాహిత్యాన్ని మాత్రమే సాహిత్యంగా ప్రచారం చేసే వారు, సమాజంలోని చీలికలను మరింత ప్రోత్సహించిన వారౌతారు గాని సాహిత్య పోషకులు కాలేరు.

5. ప్రభుత్వం :

ఇక పై ఎత్తున ఉండి, సాహిత్యానికి భవిష్యత్తును కల్పించే ఐదవ రంగం ప్రభుత్వం. సంపదసృజనే ప్రధానంగా నడుస్తున్న ప్రభుత్వాలు సాహిత్యాన్ని – ఆమాటకు వస్తే అన్ని సాంఘిక మానవ శాస్త్రాలను పక్కన పెడుతున్న మాటవాస్తవం. కఠోర సత్యం. ప్రభుత్వాలు సాహిత్య సంపదను సంపదగా గ్రహించలేక పోవటం మన దురదృష్టం. పరిశ్రమల్లో లాగా సాహిత్యం తక్షణ సంపదను, కనిపించే సంపదను ఇవ్వదు మరి. సాహిత్య సంపద సంమాజంలో వ్యక్తుల విలువలను పెంచి, ఆరోగ్యకరమైన సమాజనిర్మానానికి దోహదం చేసే ప్రాతిపదికను ఏర్పరుస్తుంది. అది పిల్ల భవిష్యత్తు కోసం ఖర్చు చేసి, కృషి చేయటం లాంటిది. పెట్టుబడి వంటిది. తెలుగు భాషాసాహిత్యాల ప్రస్తుత దీనస్థితికి ప్రభుత్వ బాధ్యతా ఎంతో ఉంది.

ప్రజలచేత, ప్రజలకొరకు, ప్రజలే చేసేది ప్రజాస్వామ్యం అయినప్పుడు, ప్రభుత్వం బాధ్యత వహించటం అంటే ప్రజలే బాధ్యత వహించటం. ప్రభుత్వం అంటే మనమే! చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా కాక, నిజంగా మనకు భాషా సాహిత్యాలపట్ల అభిమానం పెరగ వలసి ఉంది. మన ప్రాధాన్యాలు మారాలి. ప్రజల ప్రాధాన్యం సాహిత్యమైనప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం సాహిత్యాభివృద్ధికి కృషి చేయక తప్పదు. సాహిత్య సభలను నిర్వహించటం, బహుమతులను ప్రకటించటం, మాత్రమె కాక, ప్రభుత్వాలు ఆ బహుమతులు నిజంగా అర్హులైన రచయితలకు, రచనలకు అందేలా జాగ్రత్త వహించాలి. అందుకు ఓంప్రథమంగా బహుమతుల ఎంపిక సంఘాలను నిజాయితిగా ఏర్పాటు చేయాలి. సహృదయ పాఠకలను, విద్యా వేత్తలను ఆయా సంఘాల్ల్లో సభ్యులుగా నియమించాలి. ప్రజల భాషలో ఓట్లను కోరే వారు ప్రజల భాషలోనే పాలన సాగించాలి. అయితే ఇందుకు దోహదం చేసేది ప్రజాభిష్టమే! ఉద్యోగ నియామకాలను చేపట్టినప్పుడు చక్కని తెలుగు వ్రాయగలవారికి ప్రాధాన్యమివ్వాలి. అటువంటి నైపుణ్యా న్ని విద్యార్థులు భాషా సాహిత్యాలను అధ్యయనం చేయటం ద్వారా మాత్రమే సాధించగలరు.

ఇతర భాషా సాహిత్యాలు పొందినంత గౌరవాదరాలను తెలుగు భాష పొందక పోవటానికి కారణం మన వద్ద ఉత్తమ సాహిత్యం లేక పోవటం మాత్రమేకాదు, ఉన్న సాహిత్యాన్ని బహిరంగ పరచే సహృదయత మనకు లేక పోవటం ప్రధాన కారణం. సృజన కారులు పరస్పర హననానికి పాల్పడుతుంటే, అస్తిత్వ రాజకీయాలు ఉత్తమ సాహిత్యం నలుగురి కంటా పడకుండా అడ్డుకుంటున్నాయి.

ముగింపు:

పైన చెప్పుకున్న అన్ని రంగాల వ్యక్తులూ విద్యా రంగంలోనే తయారు అవుతారు. అందువల్ల ముందుగా విద్యారంగం అన్ని విధాలుగా ప్రక్షాళన పొందవలసి ఉన్నది. అలా విద్యారంగం సమున్నతిని పొంది, సృజన కర్తలు శ్రమించే తత్త్వాన్ని పెంపొందించుకున్నప్పుడు మాత్రమే తెలుగు సాహిత్యానికి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. అందుకు మనమందరం ఎంతో కృషి చేయవలసి ఉంది.

సంప్రదించిన గ్రంథాలు:

1. శ్రీరామచంద్రుడు, పుల్లెల, మమ్మట కావ్యప్రకాశము, బాలనందినీ వ్యాఖ్య, సంస్కృతభాషా ప్రచార సమితి, హైదరాబాద్, 1995.

2. శ్రీరామచంద్రుడు, పుల్లెల, ధ్వన్యాలోకము, బాలనందినీ వ్యాఖ్య, శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్, హైదరాబాద్, 1998.