ఉపోద్ఘాతం:

భరతభూమి వేదభూమియై సాంస్కృతికముగా సాంప్రదాయములతో సత్కర్మాచరణముతో విరాజి ల్లుచున్నది.అనాదికాలమునుండి మహర్షుల,యోగుల ,సాంస్కృతిక సనాతనసారథుల సారథ్యంలో అత్యంతవిశిశ్టములైన మానవతావిలువలు సమాజానికి అందింపబడినవి. వివిధసంస్కృతులతో విభిన్నకళలతో ఏ దేశానికి లేని అపరిమిత ఆనందానుభూతి కలిగించే వేదశాస్త్రపురాణేతిహాసాదులు అందించిన ఆర్షసంస్కృతి ప్రపంచమానవాళికి ఆదర్శప్రాయమైనది. సృష్టిలో జీవరాశులన్నిటికి భగవంతుడు ఇచ్చిన జీవనవిధానము వారివారి జీవనమునకు అనువుగా అనుగ్రహించాడు. మిగతా ప్రాణులన్నిటికంటే మానవునికి విశేషమైన జ్ఞానము భగవంతుడిచ్చిన వరముగా శాస్త్రాలలో విశేషంగా వివరించబడింది.

ఆహారనిద్రాభయమైథునం చ
సామాన్యమేతత్ పశుభిర్నరాణామ్ |
జ్ఞానో హి తేషాం అధికో విశేష:
జ్ఞానేన హీన: పశుభి:సమానా: ||

జన్తూనాం నరజన్మదుర్లభం అని వివేకచూడామణిలో జగద్గురు శంకరభగవత్పాదులు వాకృచ్చారు.

ఈ విధముగా మిగతా జంతువులకు మానవులకు ఉండె భేదము వివేకము మరియు జ్ఞానము అని తెలియుచున్నది. ఆ వివేకము మానవుని శ్రేయోమార్గమును తీసుకువెళ్లడానికి దోహదపడుతుందని మానవుడై పుట్టి మహనీయునిగా లోకంలో చిరస్థాయిగా నిలిచిఉండుటకు సహాయకారిగా భారతీయసాహిత్యము ఎంతగానో దోహదపడుతున్నది.

సాహిత్యము - మానవీయత:

కావ్యమెప్పుడు హితమును చేకూర్చేదై ఉండవలెనని సమాజమునకు గాని , వ్యక్తిగతంగా కాని అపకారము కలుగజేయకూడదని అటువంటిది కావ్యమనదగదని మరియు అది హితమును కలుగజేయదని వాక్రుచ్చారు. దీనిననుసరించి సాహిత్యము హితముతో నిండియుండునని తెలియుచున్నది. ఆ హితము వ్యక్తిగతంగా కాకుండా సమాజహితము కూడా అందులో అంతర్భాగమై యున్నది. హితమెవ్వరికి అను ప్రశ్న ఉదయించును.విచక్షణావివేకము కలిగియుండు ప్రాణులకు హితమావశ్యకము. వివేకము కలిగియుండు మానవులకు హితము కలిగిస్తూ వివేకము లేని ప్రాణులయెడ కూడా హితము చేకూర్చడం మానవధర్మంగా శాస్త్రములు ఉద్ఘోషించుచున్నవి. మానవులకు తప్ప ఇతరజంతువులకు వివేకము లేదు . ఇదె మానవతావిలువలను పెంపొందింపజేయడానికి, మానవుడు ప్రధానంగా మానవధర్మము విస్మరించకుండా ప్రవర్తించడానికి సహకరిస్తుంది అనడం సత్యసమ్మతం. మానవతావిలువలు నిలిచిఉంటే మానవుని జీవనమునకు, మానవుని జన్మమునకు సార్ధకము కలుగగలదని లోకంలో ఉన్నతముగా గుర్తుండిపోవుటకు అవకాశము కలదని మన సాహిత్యము పలువిధములుగా తెలియజేయచున్నది. మన భారతదేశము సంస్కృతి సాంప్రదాయలకు ప్రతీకగా నిలిచిఉండటంలో మనకున్న అమూల్యవిషయములను బోధించే సాహిత్యమే అని పలువురు ఏకగ్రీవంగా అంగీకరించడం మనకు అత్యంత ఆనందదాయకము. సాహిత్యము మనిషిని మనీషిగా తీర్చిదిద్దడంలో ఎంతో సహకరిస్తుందనడంలో ఎటువంటి సంశయము లేదు. మన వేదపురాణేతిహాసాదులు కావ్యశాస్త్రాదులు మానవతావిలువలు గురించి విశేషముగా విపులీకరించి తెలియజేసినవి.

సుభాషితము - మానవీయత:

ప్రస్తుతము మనకున్న అశేషసాహిత్యములో సుభాషితాలు అత్యున్నతస్థానమును పొంది ఉన్నాయి మానవతావిలువలగురించి పూసగుచ్చినట్లు విశదీకరిస్తున్నాయి. సుభాషితాలు మానవుని విలువలను గుర్తుచేస్తూ మానవీయవిలువల ఉన్నతిని ,ఔన్నత్యమును నిలబెడతూ మంచిమార్గమును చూపుతూ ఇహపరలోకంలో చిరస్థాయిగా నిలిచిఉండేందుకు దోహదపడతాయి. మానవీయవిలువలు శాశ్వతమైనవి.మానవునిగా జీవిస్తూ మానవీయవిలువలు తెలుసుకుని జీవనము గడుపుతూ ఉన్న ఉంటున్నమహనీయులెందరో మనకు చరిత్రలో కనబడతారు. వారందరూ జీవనౌన్నత్యమును బొందినవారే. మనకు సులభముగా , సరళమైన శైలిలో , సుబోధకముగా , సునిశితముగా బోధించేవే సుభాషితాలు. అటువంటి సుభాషితాలలో మానవీయ విలువలకు సంబంధించినవి కొన్ని ఈ పరిశోధపత్రములో విశదీకరించడానికి ప్రయత్నిస్తాను.

మనిషి మానవులలో మహనీయునిగా వెలుగొందడానికి పరోపకారము చెయ్యవలెనని ,ఆ పరోపకార ఫలము మిగతా దేనిద్వారా కూడా సిద్ధింపదని ప్రసిద్ధ సుభాషితము మనకు నిత్యప్రాత:స్మరణీయము శీఘ్రసమాచరణీయము అయి తెలుపుతున్నది.

పరోపకారాయ ఫలన్తి వృక్షా:
పరోపకారాయ వహన్తి నద్య: |
పరోపకారాయ దుహన్తి గావ:
పరోపకారార్థమిదం శరీరమ్ ||
అనియు మరియు
పరోపకార: కర్తవ్య: ప్రాణైరపి ధనైరపి |
పరోపకారజం పుణ్యం న స్యాత్ క్రతుశతైరపి ||

ప్రాణాలర్పించి కాని ధనమును ఇచ్చిగాని పరోపకారము చెయ్యవలెనని , ఆ పరోపకారము చెయ్యడంవలన కలిగే పుణ్యము వంద యజ్ఞములాచరించినను కలుగదని తెలియుచున్నది. వందయజ్ఞములాచరించుట బహుకష్టమైనది, మరియు అసాధ్యమైనది కూడాను. చేయుటకు కూడా బహుధనమావశ్యకము . మన ఆయువు దానికి సహకరించవచ్చు లేదా జీవితము ముగియవచ్చు.ఇవన్ని సందేహములతో కూడి యున్నవి. అయితే ఒక సత్సంకల్పముతో ఒకజీవితము నిలబెట్టడానికి ధనసహాయము చేసినట్లైతే ఆ సహాయము విశేషమైన ఫలమును శారీరికశ్రమ లేకుండా ఇచ్చునని వివరింపబడుతోంది. పైగా ఇహపరలోకంలో కూడా ఆ పరోపకారఫలము కీర్తింపబడుతోంది.ఈ లోకంలో కీర్తి నిలిచి ఉంటూ పరలోకంలో విశేషమైన ఫలమిచ్చునని తెలుపుతున్నది.

జీవితంలో మనిషి మెల్లగా ఎదగమని అటువంటి ఎదుగుదలలో నిండుతనమున్నదని అదియె సుస్థ్జిరమైన అభివృద్ధని, నిదానమే ప్రధానమన్న సూక్తిని బలపరస్తున్న ఈ సుభాషితము నీతికోవిదుల అనుభవసారము నిరూపిస్తున్నది. మానవతావిలువలు స్థిరంగా నిలిచిఉండాలన్నా మనిషిగా జీవించాలన్నా లోకంలో ఒక ఉన్నతి పొందాలన్నా ఇతరులతో ఉండే సాన్నిహిత్యము ప్రధానముగా కారణమగుచున్నది. ఆ సాన్నిహిత్యము ఏ విధముగానుండాలో తెలియజేసే సుభాషితము మరొక ఉదాహరణమగుచున్నది .

లోకయాత్రా భయం లజ్జా దాక్షిణ్యం ధర్మశీలతా |
పంచ యస్మిన్నవిద్యన్తే న కుర్యాత్ తేన సంగతిమ్ ||

లోకం గురించి తెలియని వానితో, భయం,లజ్జ,దయాగుణము,ధర్మప్రవర్తనము లేని వ్యక్తితో సాన్నిహిత్యము ఉండకూడదని చెప్పుచున్నది. లోకంగురించి మనము తెలుసుకోవాలి. లోకంలో మనుషుల ఆచారవ్యవహారములు , తదితర సాంప్రదాయాలు తెలుసుకొని ప్రవర్తించాలి.

ముగింపు:

లోకయాత్ర చెయ్యడం వలన ఎన్నో విషయాలు మనకు అవగతమవుతాయి. లోకం గురించి ,లౌకికవ్యవహారములను గుర్తెరిగి ప్రవర్తించడం మానవతావిలువలకు ప్రతీకగా చెప్పబడుతోంది. భయం లేనిదే లోకంలో జీవించడం కష్టము. మనము మానవునిగా జన్మించి మానవజీవనానికి సార్థకత కలిగించే వాటిని పాటించకపోతే మరలా ఇంకొక విధముగా జన్మిస్తామనే భయం లేకపోతే మనిషి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాడు కనుక భయం తప్పనిసరిగా ఉండాలి.ఈ విధంగా సుభాషితాలు పరిపుష్టమైన మానవతావిలువలు అందించి విశిష్టతను సంతరించుకున్నాయి.మహనీయుల అనుభవసారమునుండి ఆవిష్కృతములైన సుభాషితాలు మంచికు మానవతకు పట్టుకొమ్మలై సన్మార్గంలో నడిపించడానికి సహకరించాయి

ఆధార గ్రంథాలు:

1. క్షేమేంద్రుడు, నీతి కల్పలత.
2. నారాయణ పండితుడు, హితోపదేశం.
3. చాణక్యుడు, నీతి దర్పణం.
4. భర్తృహరి, సుభాషిత త్రిశతి.