''జ్ఞాన మొక్కటి నిలిచి వెలుగును'' -  ''యుగకర్త'' గురజాడ అప్పారావు

బాల్యం - వ్యక్తిగత విషయాలు:

తిమడాం గ్రామంలో నేను పుట్టాను. శ్రీకాకుళం జిల్లా, నరసన్న పేట తాలూక, జలుమూరు మండలం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం. నేను పుట్టి పెరిగిన మా ఊరు తిమడాం అంటే నాకు చాలా ఇష్టం. ప్రతీ వ్యక్తి జీవితం, తాను పుట్టిపెరుగుతున్న వాతావరణంపై ప్రభావం వుంటుంది. ఆ పరిస్థితులే అతనికి ముందుకు తీసికెళతాయి. నా పరిస్థితి కూడా అదే.

నా తల్లి దండ్రులు శ్రీమతి వెలమల ఆరుద్రమ్మ, డాక్టర్‌ వెలమల కృష్ణమూర్తి గార్లు. వీరికి సుదర్శనరావు, సిమ్మన్న, మన్మథరావు, సులోచన, రంగారావు, లక్ష్మి, ఆరుగురు సంతానం. నేను రెండో వాడిని, 1955 మార్చి 1వ తేదిన నేను జన్మించాను. నా భార్య పేరు శ్రీమతి వెలమల పార్వతి. మాకు ప్రశాంత్‌, ప్రియాంక, ఇద్దరు పిల్లలు. ఇద్దరూ అమెరికాలో వున్నారు. అక్కడే ఎమ్‌.యస్‌ చదువుకున్నారు. అల్లుడు పేరు కర్రి అవినాష్‌. మనవడిపేరు కర్రి విక్రమ్‌.

తిమడాం గ్రామం ''విద్యలకు నిలయం'' కావాలనే దృఢ సంకల్పంతో, ఊరిపెద్ద వెలమల రామన్నగారు అప్పలస్వామి (కాపు పంతులు) అనే మాష్టారిని ప్రక్క ఊరి నుంచి పిల్లలకు పాఠాలు చెప్పించడానికి, తిమడాం గ్రామం రప్పించారు. మాష్టారికి, అన్ని సౌకర్యాలు రామన్నగారే చూసుకునేవారు. మకాం కూడా తిమడాంలోనే. రాత్రులు, పగలు, అనే తేడా లేకుండా గ్రామంలోని పిల్లలందరూ, కాపు పంతులు ఇంటిదగ్గర చదువుకునేవారు. పాఠాలు చెప్పడమే కాదు, అనేక పద్యాలు వల్లెవేయించి, ప్రతీరోజు అప్పగించుకొనేవారు. అప్పచెప్పకపోతే కఠినంగా వ్యవహరించేవారు. మా మాష్టారు గారిచే నేను ఎన్నో సార్లు దెబ్బలు తిన్నాను. ఆ దెబ్బలవల్ల దారిలోకి వచ్చాను. కాపు పంతులు వల్ల తిమడాం గ్రామంలో ఎందరో బాగుపడ్డారు. అందులో నేను కూడా ఒకడను.

విద్యాభ్యాసం:

నా ప్రాథమిక విద్య మా ఊరిలోనే జరిగింది. ముగ్గురు ఉపాధ్యాయులు వుండేవారు. ముగ్గురూ తిమడాం గ్రామం వాళ్లే. వెలమల కామినాయుడు, పొడుగు రాజారావు, పాగోటి కామినాయుడు మాష్టార్లు. ఎంతో ఆసక్తికరంగా బాగా పాఠాలు బోధించారు.

ఉన్నతవిద్య కూడా తిమడాం గ్రామంలో చదువుకున్నాను. వెలమల సత్యనారాయణ, డబ్బీరు జగన్నాధం, దుర్గారావు, డబ్బీరు కృష్ణమూర్తి, రంగనాయకులు, మరడ జనార్ధనరావు, రాములు, పి.పురుషోత్తం, బి.అప్పలనాయుడు, ముద్దాడ నరసింహులు, టి.వి.రమణమూర్తి, వి.వి.చైనులు గార్లు చక్కగా పాఠాలు బోధించారు. ఉన్నత విద్యలో పాగోటిలచ్చున్నాయుడు, వెలమల పెద్దబాబు, చంద్రభూషణ రావు, ఇంద్రసేన రావు, నారాయణ రావు, పొడుగు సుభద్ర, పొడుగు లక్ష్మీబాయి, పొడుగు కృష్ణవేణి, వెలమల అన్నపూర్ణ, వెలమల చిట్టమ్మ, మట్టా మల్లేసు, అంపోలు అప్పారావు, పల్లి జగ్గారావు మొదలైన వారు అందరమూ కలిసి చదువుకున్నాం. వీళ్ళందరూ మా ఊరివారే.

ఏది మంచి, ఏది చెడో తెలుసుకొనే దశవచ్చేసరికి, నేను 9వ తరగతి చదువుచున్నప్పుడు మా అమ్మగారు చనిపోయారు. మేనత్త సీతమ్మగారు పెంచి, పోషించి పెద్ద చేశారు. అమ్మలేని లోటును తీర్చారు. ఆమెకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా చిన్నాన్న గారి భార్య శ్రీమతి వెలమల తవిటమ్మ గారికి, చదువు విషయంలో నన్ను ఎంతగానో ప్రోత్సహించిన మేనత్త శ్రీమతి పాగోటి వరహాలమ్మ గారి వారి శ్రీవారు పాగోటి సూర్యనారాయణ గార్లకు, వారి పిల్లలు శ్రీమతి అమ్మనమ్మ, శ్రీమతి పుణ్యావతి, శ్రీమతి ఊర్మిళ, శ్రీమతి శ్యామల గార్లకు కృతఙ్ఞతలు.

ఇంటర్మీడియట్‌, నరసన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో చదువుకున్నాను. ఇప్పుడు అది డిగ్రీ కాలేజీగా మారింది. ప్రత్యేక అంశాలుగా హిష్టరి, తెలుగు, రాజనీతి శాస్త్రం చదివాను. ఇంటర్‌లో గంటి నరసింహశర్మ, కృష్ణంరాజు, వి.వి.రామారావు, జానకీ రామ్‌, సి.వి.రత్నం, శ్రీరాములు గార్లు ఎంతో ఆసక్తికరంగా పాఠాలు బోధించారు. ఇంటర్‌లో ధర్మాన దాసు, ధర్మాన లక్ష్మినారాయణ, నారాయణ రావు, ఇంద్రసేన రావు మొదలైన వారు కలిసి చదువుకున్నాం.

తెలుగు సాహిత్యంపై నా దృష్టి వెళ్లడానికి మా నాన్నగారు ప్రధాన కారణం. నాన్నగారు భారత, భాగవత, రామాయణ మొదలైన అనేక గ్రంథాలు బాగా చదవుకున్నారు. ఆ గ్రంథాలన్నీ ఆయనకు కొట్టిన పిండి. ఒక అంశాన్ని విశ్లేషణాత్మకంగా చెప్పేవారు కూడా. చుట్టుప్రక్కల వారు, మిత్రులు, బంధువులు హజరయ్యేవారు. మా ఇంటి ముందు వరండాలో ఎప్పుడూ సాహిత్య గోష్ఠితో కళకళ ఆడుతూ వుండేది. మా ఊరిలో రామాలయం వుంది. ప్రతీ శనివారం రాత్రి భజనలు జరిగేవి. మా నాన్నగారు తప్పనిసరిగా భజనకు వెళ్ళి, భజన పాటలు మధురంగా, రాగయుక్తంగా పాడేవారు. నేను కూడా నాన్నగారితో రామాలయానికి వెళ్ళేవాడిని. శ్రోతలు బాగానే వచ్చేవారు. మరో గొప్ప విషయం ఏమంటే మా నాన్నగారు గొప్ప హాస్య ప్రియులు, నటుడుకూడా. నాటకాలు కూడా వేశేవారు ''రామాంజనేయ యుద్ధం'' నాటకంలో ఆంజనేయుడి పాత్రను చాలాచక్కగా పోషించేవారు. ఊరిలో పండగలు జరిగేటప్పుడు రకరకాల వేషాలు కూడా వేసేవారు. పెద్దలచే ప్రశంసలు కూడా అందుకున్నారు. మా ఊరిలోని రామాలయాన్ని ఊరి మునసబు వెలమల లచ్చున్నాయుడు ప్రజల సహాయ సహకారాలతో చాలా కష్టపడి కట్టించారు. గ్రామంలోని వారందరూ బాగా చదువుకోవాలని మనసారా కోరుకునేవారు లచ్చున్నాయుడు గారు.

బి.ఏ. విజయనగరం మహారాజా కాలేజిలో చదువుకున్నాను. ఈ కాలేజీలో నేను చదవడానికి ప్రధాన కారకులైన పెద్దనాన్న వెలమల ఆదినారాయణ, చిన్నాన్న వెలమల సీతారాం గార్లకు కృతఙ్ఞతలు, అంతేకాక మా ఊరిలో అప్పటికే విజయనగరంలో కొంత మంది చదువుతున్నారుకూడా. డిగ్రీలో కూడా ప్రతేక అంశాలుగా హిష్టరి, తెలుగు, రాజనీతిశాస్త్రం తీసుకున్నాను. నారాయణ స్వామి, సాయినాథ శాస్త్రి, రమణయ్య గార్లు గురువులు. ఈ ముగ్గురు నన్ను సాహిత్యంలో అభిలాషను పెంపొందించారు. ఎమ్‌.ఆర్‌.కాలేజీలో మంచి లైబ్రరీ వుండేది. అక్కడికి వెళ్ళి గ్రంథాలు, పత్రికలు చదివేవాడిని. నారాయణ స్వామిగారు తెలుగు విభాగాధిపతి. వీరు తమ విద్యార్థులందరినీ ఇంటికి తీసుకొని వెళ్ళి, ప్రత్యేకంగా పాఠ్యాంశాల్ని బోధించేవారు. ఈ ముగ్గురి మాష్టర్ల ప్రభావం నాపై వుంది. వీరు చదువేకాకుండా క్రమశిక్షణ, సంస్కారం కూడా మప్పారు. విజయనగరంలో నేను చదవుకోక పోతే, ఆంధ్రవిశ్వకళాపరిషత్‌లో నాకు ఎమ్‌.ఏ. తెలుగు సీటు వచ్చేది కాదు. అంతబాగా పాఠాలు చెప్పారు మా మాష్టార్లు. అందుకు వారికి కృతఙ్ఞతలు.

డిగ్రీ చదువుచున్నప్పుడు ప్రతీరోజు క్లాసులకు వెళ్ళేవాడిని. ఎప్పుడూ క్లాసులు మానడం అంటూ లేదు. ముందువరుసలో కుర్చొని శ్రద్ధగా పాఠాలు వినేవాడిని. డిగ్రీలోనే సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించాను. ఒకరకంగా చెప్పాలంటే నాకు జ్ఞానోదయం విజయనగరం లోనేే జరిగింది. ఇక్కడ ఎందరో కవి, పండితులతో, సాహితీ వేత్తలతో, భాషాభిమానులతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. నా జీవితంలో మరపురాని, అద్భుతమైన ఘట్టం, విజయనగరంలో నేను చదువుకోవడం. ప్రతీరోజు ఆధునిక తెలుగుసాహిత్య యుగకర్త గురజాడ అప్పారావు గారి ఇంటిమీద నుంచి కాలేజీకి వెళ్ళేవాడిని. మరల అదే దారిలో వచ్చేవాడిని. గురజాడ గొప్పతనం గూర్చి, ఆయన రచనా వైశిష్టం గూర్చి, మా గురువులు ఎప్పుడూ చెప్పుతూ వుండేవారు.

డిగ్రీ మొదటి రెండు సంవత్సరాలు లంకవీధిలో వుండేవాడను, మూడో సంవత్సరం హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణ దాసుగారి కూతురు సావిత్రమ్మ గారి ఇంటిలో వుండేవాడిని. విజయనగరంలో బైరి లక్ష్మణమూర్తి, సాసుబెల్లి కృష్ణారావు, బొడ్డు శ్రీరామమూర్తి, మొదలైన మంచి స్నేహితులతో పరిచయం ఏర్పడింది.

విజయనగరంలో నేను చదువు కోవడంవల్ల నాకు చాలా మేలు జరిగింది. ప్రతీ రోజు విజయనగరంలో ఎక్కడో ఒక దగ్గర సాహిత్య సభలు, సమావేశాలు, జరుగుతూవుండేవి. నేను వెళుతూ వుండేవాడిని. అవి కూడా నా సాహితీ జీవితానికి గట్టి పునాదులేర్పడ్డాయి. విజయనగరంలో చదివే రోజుల్లో వివిధ సాహిత్య గ్రంథాలతోనూ, రచయితలతోనూ ప్రత్యక్ష పరిచయం నాలో సాహిత్యాభిరుచిని ఇంకా పెంచింది.

స్నాతకోత్తర విద్య ఎమ్‌.ఏ తెలుగు, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌, తెలుగు శాఖలో చదివాను. యస్వీ జోగారావు, కొర్లపాటి శ్రీరామమూర్తి, లకం సాని చక్రధరరావు, చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి, వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి, కోలవెన్ను మలయవాసిని మున్నగు వారు గురువులు. నాలో సాహిత్యాభిలాష మరింత పెంపొందటానికి ఈ అధ్యాపకులు ముఖ్యులు. అధ్యాపకునిగా, పరిశోధకునిగా, రచయితగా, నాకు మంచిపేరు రావడానికి ఆంధ్రవిశ్వకళాపరిషత్‌, తెలుగుశాఖలో చదివిన చదువే ప్రధాన కారణం. ఇక్కడ చదవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా పెద్దనాన్న గారి కుమారుడు వెలమల ఇంద్రసేనరావు, నేను, ఇంటర్‌, డిగ్రీ, పి.జి, కలిసి చదువుకున్నాం. ఆ స్నేహం ఎన్నటికీ మరవరానిది. చదువుకున్న సమయంలో తరుచూ విశాఖపట్నంలో సాహితీ వేత్తల సభలకు వెళ్ళేవాడిని. నారచనా వ్యాసంగం ఆంధ్రవిశ్వకళాపరిత్‌లోనే మొదలైయింది. నేను ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో ప్రవేశించాక, పుస్తక పఠనాభిలాష క్రమక్రమంగా పెరిగింది. దానితో పాటు, రచనాభిలాష కూడా పెరిగింది. సాహిత్య రచనా వ్యాసంగం ఒక దీక్షగా కొనసాగించాను ఇప్పటికీ కూడా.

పరిశోధన:

ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారి పర్యవేక్షణలో పిహెచ్‌.డి (1980-1985) పూర్తి చేశాను. పరిశోధన ఎలా చెయ్యాలి? ప్రామాణికత ఎలా పాటించాలి? లాంటివి గురువుగారి దగ్గర నేర్చుకున్నాను. కొర్లపాటి వారే నాకు దిశా నిర్దేశకులు. ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ రీసెర్చి ఫెలోషిఫ్‌, యూనివర్సీటీ గ్రాట్స్‌ కమీషన్‌, ఢిల్లీ వారి ఫెలోసిఫ్‌లు నాకు వచ్చాయి. పరిశోధనలో కొర్లపాటి వారు పరాకాష్ఠకు చేరుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి డి.లిట్‌ పొందిన గొప్ప పరిశోధకులు వీరు. క్రమశిక్షణలో, సమయపాలనలో బోధనలో, పరిశోధనలో, ఆయనకు ఆయనే సాటి. వీరి దగ్గర పరిశోధన చేయడం నా జీవితంలో గొప్ప పెద్ద మలుపు.

నా పరిశోధన విషయంలో సహాయ సహకారాలు అందించిన పెద్దనాన్న గారి కుమారుడు డాక్టర్‌ వెలమల సుందరరావు, వారి శ్రీమతి వెలమల సుశీలమ్మ గార్లకు మరియు ఒరుదు రంగారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను ఎంతగానో అభిమానించే ప్రొఫెసర్‌ చల్లా జోగులు, ముద్దాడ సత్యం గార్లకు కృతజ్ఞతలు.

నేను ఎం.ఏ చదవుచున్నప్పుడూ, పిహెచ్‌.డి చేస్తున్నప్పుడూ, ఎక్కువ సమయం ఆంధ్రవిశ్వకళాపరిషత్‌ గ్రంథాలయంలోనే వుండేవాడిని, గ్రంథాలయంలో శ్రద్ధగా కూర్చుని గ్రంథాలు, పత్రికలు, చదవడం నాకు అలవాటు అయింది. గ్రంథాలయంలో చేసే పుస్తక పఠనం, నాలో ఎక్కువగా రచనాభిలాషను కలిగించింది. సాహితీ సాంస్కృతిక సంస్థలతో సత్సంబంధాలు పెంచుకుంటూ, ముందుకు సాగాను. నిరంతరం చదువుచుండే వాడను. చదువు అంటే నాకు మహా ఇష్టం. ఒక్కప్రక్క పరిశోధన చేస్తూ, మరో ప్రక్క రచనా వ్యాసంగంమూ చేస్తూ వుండేవాడిని. బాగా చదవడం వల్ల, పఠనాశక్తి పెరగడంవల్ల, ఏది మంచి, ఏది చెడు, అని విశ్లేషించుకోగలిగిన శక్తి సామార్థ్యాలు నాకు వచ్చాయి. అనేక గ్రంథాలు చదవడం వల్ల వచ్చిన విజ్ఞానం అంతా ఇంతాకాదు. అది నా జీవితాన్ని ఆనందమయం చేసిందని చెప్పక తప్పదు. గ్రంథాలయమే నాకు దేవాలయం. అక్షరమే నా దేవత. అందుకే అక్షరానికి నా నమస్కారం.

సీనియర్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లమా ఇన్‌ సంస్కృతం (1981), డిప్లమా ఇన్‌ హిందీ (1983), డిప్లమా ఇన్‌ తమిళం (1984), డిప్లమా ఇన్‌ ఉర్దూ (1987), పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లమా ఇన్‌ లింగ్విస్టిట్స్‌ (1988), పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లమా ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌ (1991), పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లమా ఇన్‌ ఫంక్షన్‌ ఇంగ్లీషు (1993), అనే ఏడు డిప్లమాలను ఆంధ్రవిశ్వకళా పరిషత్‌లో చేశాను. ప్రతీ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు క్లాసులు జరిగేవి. చాలా శ్రద్ధగా క్లాసులకు వెళ్ళి, చదువుకున్నాను.

ఉద్యోగ ప్రస్థానం:

చదువుకున్న ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లోనే స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, తెలుగు విభాగంలో 8మే 1986లో ఉద్యోగంలో చేరాను. నా శ్రమకు, కృషికి ఫలితం లభించిందని చాలా ఆనందించాను.

ఎం.ఏ చదవివే రోజుల్లో నేను ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారి బోధనా విధానానికి మిక్కిలి ఆకర్షితుడినైనాను. గురువుగారిలా పాఠం చెప్పాలనీ, పరిశోధన చేయాలనీ, అనుకున్నాను. గురువుగారు లాగే, అదే రీతిలో, పాఠ్యాంశవిశ్లేషణ, వివరణ, ఇవ్వాలనే దీక్షతో పట్టుదలతో నిరంతర నిర్విరామం అధ్యయనం చేశాను. దానికోసం, 35 సంవత్సరాలు రోజుకు 16 గంటలు కష్టపడ్డాను. అధ్యయనంలోనూ, పరిశోధనలోనూ, బోధనలోనూ, ఎక్కువ సమయం గడిపాను. నాకు పుస్తక పఠనం ఒక వ్యసనంగా మారింది. అది ఇప్పటికీ కొనసాగుతుంది. దానివల్ల నాకు ఎంతో మేలు జరిగింది. సాహిత్య దృక్పథం, కూడా విస్తృతమైంది. విశ్వవిద్యాలయంలోనే భాషమీద అభిమానం, సాహిత్యంపై అభిరుచి, ఏర్పడ్డాయి.

గురు-శిష్య పరంపర:

మా గురువు గారు కొర్లపాటి వారి మార్గంలో నడవడానికి ప్రయత్నించాను. గురువుగారి దారిలోనే, నేను నడుసుకుంటూ, మును ముందుకు సాగాను, జీవితంలో ''రోల్‌ మోడల్‌''గా గురువుగారిని తీసుకున్నాను. చివరకు విజయం సాధించాను. ఒక రోజు గురువుగారు ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు ఒక పెద్ద సభలో ''సిమ్మన్న నా వారసుడు'' అని ప్రకటించారు. గురువుగారి దగ్గర పరిశోధన చేసిన శిష్యులందరూ, ఆ సభలో వున్నారు. నా జీవితంలో ఇంతకన్నా గొప్ప విషయం మరొకటి లేదు. వివిధ పత్రికల్లో నేను రాసిన వ్యాసాలు చూసి, గురువుగారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నేను రాసిన తెలుగు భాషాచరిత్ర, తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, ఆధునిక భాషా శాస్త్రం, ప్రపంచ భాషలు, మొదలైన గ్రంథాలు చూసి, గురువుగారు నన్ను మనస్పూర్తిగా అభినందించారు. నేను పైకి ఎదిగి రావటానికి ప్రేరకులు, కారకులు మా గురువుగారే.

తెలుగు భాషా చరిత్రకు సంబంధించి కానీ, భాషా శాస్త్రానికి సంబంధించికానీ, వ్యాకరణానికి సంబంధించికానీ, తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించికానీ, తెలుగు సాహిత్య విమర్శకు సంబంధించి కానీ, ప్రాచీన సాహిత్యానికి సంబంధించి కానీ, ఆధునిక సాహిత్యానికి సంబంధించి కానీ, ఎంత క్లిష్టమైన పాఠ్యాంశాన్ని అయినా, సరళంగా సులభంగా, సుభోధకంగా, విద్యార్థికి అర్థమయ్యే విధంగా, తరగతి గదిలో చక్కగా ప్రణాళికా బద్దంగా బోధించడం నేర్చుకున్నాను. ప్రతీ అంశాన్ని పరిశోధనా దృష్టితో, నిశితంగా పరిశీలించడం అలవర్చుకున్నాను. నా క్లాసు వుందని తెలుసుకున్న విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరవుతారని చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. బోధనలోనూ, పరిశోధనలోనూ, ప్రముఖలతో ప్రశంసలు అందుకున్నాను. యూనివర్సీటీ నాకు అప్పగించిన పనిని పూర్తి బాధ్యతాయుతంగా చేశాను. అధికారుల అభినందనలుకూడా అందుకున్నాను. ఈ నాటి నాగుర్తింపుకు, నా గురువులే కారణమని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా వుంది.

రచనలు :

భాష, సాహిత్యం, వ్యాకరణం, భాషాశాస్త్రం, విమర్శ, పరిశోధన, మొదలైన రంగాలకు సంబంధించి 87 గ్రంథాలను రాశాను, ముద్రిత రచనలు 82, ఆముద్రిత రచనలు 5. ఈ గ్రంథాలన్నీ (బాలవ్యాకరణం - శాస్త్రీయ వ్యాఖ్యానంతప్ప) ''దళిత సాహిత్య పీఠం'' ప్రచురించింది. ఈ పీఠం ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ కొండపల్లి సుదర్శనరాజు, కార్యదర్శి డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు, అధ్యక్షులు ప్రొఫెసర్‌ వెలమల సిమ్మన్న. స్వంతబాధ్యత మీద గ్రంథాలను అచ్చువేయించాను. ప్రస్తుతం నా రచనలన్నీ విజయవాడ విశాలాంధ్ర, ఆంధ్ర ప్రదేశ్‌ వారు ప్రచురిస్తున్నారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

ముద్రిత రచనలు :

మీరేం రాశారండీ అని ఎవరైనా అడిగితే, ఇదిగో ఇవేనండి నారచనలు చూడండి.
1. దర్శిని (1994), 2. అడివి బాపిరాజు కథలు, కవిత్వం-పరిశీలన (1995), 3. కళాతపస్వి బాపిరాజు (1996), 4. తెలుగు శబ్ద పరిణామం (1997), 5. తెలుగు భాషా చంద్రిక (1998), 6. జాషువా పిరదౌసి - ఒక పరిశీలన (1999), 7. బాల వ్యాకరణం (సంజ్ఞ, సంధి, సమాస పరిచ్ఛేదాలు - విశ్లేషణ) (2000), 8. రసతరంగిణి (2000), 9. తెలుగు సాహిత్య విమర్శ (2001), 10. తెలుగు భాషాకౌముది (2001), 11. తెలుగు భాషాతత్త్వం (2002), 12. సాహితీ కిరణాలు (2002), 13. బాపిరాజు భాషా వైదుష్యం (2002), 14. ప్రపంచ భాషలు (2003), 15. సంధి - తులనాత్మక పరిశీలన (2003), 16. సహృదయలహరి (2003), 17. తెలుగు భాషా దర్పణం (2004), 18. తెలుగు భాషా సంజీవని (2004), 19.తెలుగు భాషా చరిత్ర (2004), 20. భాషా శాస్త్ర వ్యాసాలు (2004), 21. విమర్శ - వివేచన (2004), 22. నాటకం - పరిశీలన (2005), 23. ఆధునిక సాహిత్య విమర్శ (2005), 24. తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు (2005), 25. ప్రముఖ భాషా శాస్త్రవేత్తలు (2006), 26. తెలుగు భాషా దీపిక (2006), 27. భాషా పరిశోధనా వ్యాసాలు (2007), 28. భాషా శాస్త్ర విజ్ఞానం (2007), 29. భాషా చారిత్రక వ్యాసాలు (2007), 30.భాషాను శీలనం (2008), 31. ఆధునిక భాషాశాస్త్రం (2008), 32. లోచనం (2009), 33. డాక్టర్‌ సి.ఆర్‌.రెడ్డి (2009), 34. విమర్శ భారతి (2009), 35. భాషాబోధిని (2009), 36.తెలుగు సాహిత్యంలో ప్రక్రియలు (2010), 37. విమర్శ - పరామర్శ (2010), 38.విమర్శనదర్శనం (2011), 39. తెలుగు సాహిత్య చరిత్ర (2011), 40. ప్రముఖ సాహిత్య విమర్శకులు (2011), 41. తెలుగు సంస్కృతిపై బౌద్ధమత ప్రభావం (2011), 42. సాహిత్యం - ప్రయోజనం (2011), 43. తెలుగు భాషా స్వరూపం (2011), 44. సాహితీ స్రవంతి (2012), 45. విశ్వనాథ శబరి (2012), 46. సాహిత్య మంజరి (2012), 47. సాహితీ సౌరభం (2012), 48. తెలుగు భాషా శాస్త్రవేత్తలు (2012), 49. వ్యాకరణ ప్రకాశిక (2013), 50. ప్రముఖ పత్రికా సంపాదకులు (2013), 51. సాహిత్యసుధ (2013), 52. తెలుగు వెలుగు (2013), 53. అన్వేషణ (2014), 54. బోయి భీమన్న సాహితీ సమాలోచన (2014), 55. సాహిత్యం - సమాజం (2014), 56. అక్షరార్చన (2014), 57. సాహితీ పరిమళం (2014), 58. సాహిత్య సంపద (2014), 59. వాణీ విపంచి (2015), 60. సాహితీ రంజని (2015), 61. ఆంధ్రనాయక శతకం - రచనా వైశిష్ట్యం (2015), 62. ఎన్‌.జి.ఓ. నాటకం - సామాజిక చైతన్యం (2015), 63. వ్యాకరణ సంజ్ఞాకోశం (2015), 64. కృష్ణపక్షం-కృష్ణశాస్త్రి భావ కవితాసౌందర్యం (2016), 65. ఆంధ్రప్రశస్త్రి - విశ్వనాథ కవితా వైభవం (2016), 66.అవలోకనం (2016), 67. అక్షరప్రభ (2016), 68. ముత్యాల సరాలు - మహాకవి మార్గం (2016), 69. గబ్బిలం - జాషువా దృక్పథం (2016), 70. మహాప్రస్థానం - శ్రీశ్రీకవితాదర్శం (2016), 71. అమృతం కురిసిన రాత్రి -తిలక్‌ కవితాత్మ (2016), 72. బాలవ్యాకరణం - శాస్త్రీయ వ్యాఖ్యానం (2016), 73. సాహితీ వీక్షణం (2017), 74. హృదయ దర్పణం (2017), 75. కాళ్ళకూరి నాటకాలు - పరిశీలన (2017), 76. సాహిత్య సౌందర్యం (2017), 77. లక్షణ దీపిక (2017), 78. యుగకర్త గురజాడ (2018), 79. వ్యాస జ్యోతి (2018), 80. సాహితీ మహతి (2019), 81. ప్రాచీన విశిష్ట భాషగా తెలుగు (2020), 82. మాతృభాషలు - పరిరక్షణ (2020).

అముద్రిత రచనలు :

1. నవయుగ వైతాళికుడు - వీరేశలింగం, 2. గిడుగు పిడుగు, 3. సంస్కర్త త్రయం, 4. గురజాడ కథలు - సంస్కరణ దృక్పథం, 5. శబ్దబ్రహ్మ - చిన్నయ సూరి.
మొత్తం గ్రంథాల్ని భాష, సాహిత్య, విమర్శ, వ్యాకరణం, ఛందస్సు, వ్యక్తుల జీవితాలకు, ఇతరాంశాలకు సంబంధించినవిగా వర్గీకరించవచ్చు. నా రచనా వ్యాసంగంలో అపూర్వమైన, అమోఘమైన, మలుపులు ఎన్నో వున్నాయి.

నేను రాసిన తెలుగు భాషా చరిత్ర, తెలుగు సాహిత్య చరిత్ర, తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, ఆధునిక భాషాశాస్త్రం, బాలవ్యాకరణం - శాస్త్రీయ వ్యాఖ్యానం, యుగకర్త గురజాడ, మొదలైన గ్రంథాలు సివిల్‌ సర్వీస్‌, గ్రూప్‌-1,2, డి.ఎల్‌, జె.ఎల్‌, నెట్‌, స్లెట్‌ వివిధ పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళకే కాక, అన్ని విశ్వవిద్యాలయాల్లోని ఎం.ఏ తెలుగు విద్యార్థులకు ఈ గ్రంథాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ గ్రంథాలు అధ్యాపకులకు, ఆచార్యులకు, పరిశోధకులకు, భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు, బాగా ఉపయోగపడతాయి. ఈ గ్రంథాలవల్ల నాకు బాగా గుర్తింపువచ్చింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను.

నేను 460 పరిశోధన వ్యాసాలు రాశాను. నా మొదటి వ్యాసం ''సాహిత్యంలో చిత్ర లేఖనం'' ఆగస్టు 1981 ''నవ భారతి''లో అచ్చు అయింది. అచ్చులో నా పేరుతో వచ్చిన వ్యాసాన్ని చూసుకొని, ఆకాశంలోని నక్షత్రాలని అందుకున్నంత ఆనందించాను. నేను పంపించిన రచనలన్నింటిని ప్రచురిస్తూ, నా రచనలకు అప్పటినుండి ఇప్పటి వరకు, అన్ని పత్రికలు నన్ను ప్రోత్సహించాయి. పత్రికల సంపాదకులకు కృతజ్ఞతలు.
నవ భారతి, భారతి, తెలుగు, వాఙ్మయి, తెలుగు విద్యార్థి, సమాలోచన, భావవీణ, మిసిమి, సాహితీ స్రవంతి, చేతన, ఆంధ్రప్రదేశ్‌, చినుకు, మూసీ, నడుస్తున్న చరిత్ర, తెలుగు వెలుగు, ప్రసన్న భారతి, విశాఖ సంస్కృతి, ఉపాధ్యాయ మిత్ర, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ప్రజాశక్తి, విశాలాంధ్ర, లీడర్‌, మొదలైన ప్రముఖ మాస, త్రైమాస, వార, దిన, పత్రికల్లో ముద్రించబడ్డాయి. ఈ వ్యాసాల్ని 1. భాషావ్యాసాలు, 2. సాహిత్య వ్యాసాలు, 3. విమర్శ వ్యాసాలు, 4. వ్యాకరణానికి సంబంధించిన వ్యాసాలు, 5. జీవిత చరిత్ర వ్యాసాలు, 6. ఇతర వ్యాసాలు అని ఆరు రకాలుగా వర్గీకరించవచ్చు.

50కి పైగా రేడియో ప్రసంగాలు చేసి శ్రోతల్ని అలరించాను. నాదగ్గర 28 మందికి ఎం.ఫిల్‌, 16 మందికి పిహెచ్‌.డిలు వచ్చాయి. వివిధ పత్రికల్లో ప్రముఖులు నాగూర్చి, నా రచనల గూర్చి, 45 వరకు వ్యాసాలు, సమీక్షలు, రాశారు.

''ఆచార్య వెలమల సిమ్మన్న వ్యాసాలు-పరిశీలన'' అనే అంశంపై ఎమ్‌.గోపాలనాయుడు నాగార్జున విశ్వవిద్యాలయంలో డాక్టర్‌ గుమ్మా సాంబశివ రావుగారి పర్యవేక్షణలో ఎమ్‌.ఫిల్‌ చేశారు. గోపాలనాయుడు సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజి సీనియర్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.

నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎన్‌. కృష్ణారావుగారి సారథ్యంలో ఎమ్‌.గోలపాయుడు గారు ''ఆచార్య వెలమల సిమ్మన్న భాషా, సాహిత్యసేవ'' అనే అంశంపై పిహెచ్‌.డి చేస్తున్నారు.

నా జీవితంలో చెప్పుకోదగ్గ వారు పూర్వ రాజ్యసభ సభ్యులు కింజరాపు ఎర్రంనాయుడు, ఆంధ్రవిశ్వకళా పరిషత్‌ పూర్వ ఉపకులపతులు ఆచార్య కోనేరు రామకృష్ణారావు, డాక్టర్‌ గొద్దు శ్రీరామచంద్రమూర్తి, పూర్వ ఏపిపియస్‌ చైర్మన్‌ గొల్లు సూర్యనారాయణ, పూర్వ రాజ్యసభ సభ్యులు, ప్రస్తుత అధికార భాషా సంఘ అధ్యక్షులు, హిందీ అకాడమీ అధ్యక్షులు, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, పూర్వమంత్రి, డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధ ప్రసాద్‌, గుత్తి కొండసుబ్బారావు, డాక్టర్‌ జి.వి. పూర్ణచంద్‌, డి. సుందరనారాయణ, పైలా తాతారెడ్డి గార్లు మొదలైన వారు ఎందరో వున్నారు.

జీవితంలో నాకు మంచి సాహితీ మిత్రులు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. డాక్టర్‌ ద్వానా శాస్త్రి, ఆచార్య కొండపల్లి సుదర్శనరాజు, డాక్టర్‌ గుమ్మా సాంబశివ రావు, డాక్టర్‌ డి. మీరాస్వామి, డాక్టర్‌ ఎన్‌. చంద్రశేఖర్‌, శ్రీ ఎన్‌. రామకృష్ణ మొదలైనవారు నేను రాసిన పరిశోధన పత్రాలను, గ్రంథాలను, ఇంచుమించు అన్నీ నా మిత్రులు చూశారు. మంచి సూచనలు, సలహాలు ఇచ్చారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

నా జీవితంలో ప్రధాన విషయాలు ఎన్నో వున్నాయి. అందులో ముఖ్యమైనవి.
రెండు రాష్ట్రాల్లోనూ అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ, అన్ని డిగ్రీ కాలేజీల్లోనూ పరీక్షల ప్రశ్న పత్రాల్లో నా గూర్చి రాయమని అడగడం.

ప్రతీరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటలవరకు విద్యార్థులకు, పరిశోధకులకు, అధ్యాపకులకు, సివిల్స్‌, గ్రూప్‌-1,2, డి.ఎల్‌, జె.ఎల్‌, పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళకు సూచనలు, సలహాలు ఇస్తూ వుంటాను. ఇది నా బాధ్యతగా స్వీకరించాను.

నాకున్న పనులు మూడే మూడు. ఒకటి చదవడం, రెండు రాయడం, మూడు బోధించడం. ఇతరులు చెప్పిన మంచి విషయాలు వినడం కూడా నాకు ఇష్టం.
నేను రాసిన వ్యాసాల్ని ఆచార్య యస్వీజోగారావుగారు చూసి, నన్ను అమితంగా ప్రోత్సహించడమే కాకుండా, అమాంతంగా కౌగలించుకున్నారు. నీవు రాసిన అన్ని వ్యాసాలు చూస్తున్నాను. బాగా రాస్తున్నావు. బాగా రాయు అని దీవించారు.

నేను రాసిన ''తెలుగు భాషా చరిత్ర''ను ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ గారు హిందీలోకి అనువాదం చేయించారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ హిందీ విభాగంలోని ప్రొఫెసర్‌ వర్మగారు అనువాదకులు.

గుమ్మా సాంబశివరావు గారిని, నన్ను తానా సభలకు అమెరికా తీసుకెళ్ళారు యార్లగడ్డవారు. అంతేకాదు. మా ఇద్దరనూ సింగపూర్‌ కూడా తీసికెళ్ళారు. చాలా జాగ్రత్తగా మమ్ముల్ని చూసుకున్నారు. మాటలతో చెప్పలేం. మాపై యార్లగడ్డ వారు చూపిన ప్రేమ, వాత్సల్యం, అభిమానం, అంతా ఇంత కాదు. మేము ఎప్పటికీ మరవలేం. ఆయన ఋణం తీర్చుకోలేం.
నేను రాసిన తెలుగు భాషాచరిత్ర, తెలుగు సాహిత్య చరిత్ర, తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, ఆధునిక భాషా శాస్త్రం, మొదలైన ఎన్నో గ్రంథాలను నాకు డబ్బులు ఇచ్చి కొన్నారు. ఆ గ్రంథాలన్నీ భారతదేశంలోని పెద్ద పెద్ద వాళ్ళకు ఉచితంగా ఇచ్చావారు. అంతే కాదు అమెరికా, కెనడా మొదలైన విదేశాలకు కూడా తీసికెళ్ళారు. ఈ విషయం కొందరి ప్రముఖుల ద్వారా నాకు తెలిసింది. ఎంతో ఆనందించాను.

కృష్ణాజిల్లా రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్‌, అధ్యక్షులు గుత్తి కొండ సుబ్బారావు, ప్రధానకార్యదార్శి డా|| జి.వి.పూర్ణచంద్‌ మొదలగు వారు నాపై వారు చూపిన ప్రత్యేక అభిమానం ఎన్నటికీ మరువలేను.

నా జీవితంలో నాగార్జున విశ్వవిద్యాలయం, తెలుగు శాఖలో ఒక అద్భుతం జరిగింది. విశ్వవిద్యాలయంలో డిగ్రీ కాలేజి అధ్యాపకులకు యు.జి.సి. రిఫెరెన్స్‌ క్లాసులు జరిగాయి. నేను క్లాసులు చెప్పడం కోసం విశాఖపట్నం నుంచి నాగార్జున విశ్వవిద్యాలయం వెళ్ళాను. ''వ్యాకరణం : అధ్యయనం - బోధన - పరిశోధన'' అనే అంశంపై పాఠం చెప్పాను. తరగతిగదిలో వ్యాకరణం బాగాతెలిసిన మహా పండితులు ఇద్దరు వున్నారు. ఆ ఇద్దరూ వున్నట్లు నాకు తెలియదు. నా క్లాసు పూర్తి అయింది. తర్వాత తెలిసింది ఒకరు డాక్టర్‌ అంబటిపూడి నాగభూషణ గారు, రెండోవారు డాక్టర్‌ మైలవరపు శ్రీనివాసరావుగారు.

అప్పటికే ఇద్దరూ సంస్కృత డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. అంతేకాదు, ఇద్దరూ 30 సంవత్సరాలనుండి వ్యాకరణం పాఠం చెపుతున్నారు. ఇద్దరూ వ్యాకరణంపై పరిశోధన చేశారు. ఇద్దరూ వ్యాకరణాలపై వ్యాఖ్యానాలు రాశారు. నాగభూషణంగారు ప్రౌఢ వ్యాకరణంపై పిహెచ్‌.డి చేశారు. వ్యాకరణం గూర్చి ఎక్కువ గ్రంథాలు కూడా వీరు రాశారు. ''బాలవ్యాకరణానికి అర్ధ దీపిక'' వ్యాఖ్యానం కూడా రాశారు అంబటి పూడివారు. మైలవరపు శ్రీనివాసరావు గారు ''బాల ప్రౌఢ వ్యాకరణ దీపిక'' పేరుతో వ్యాఖ్యానం రాశారు. ఇలాంటి పెద్ద వాళ్ళు వున్న తరగతి గదిలో నేను వ్యాకరణం గూర్చి పాఠం చెప్పాను. నా క్లాసును, ఇద్దరు వ్యాకరణ పండితులు మెచ్చుకున్నారు. అంతేకాదు మీ పాఠం బాగుంది. చెప్పేవిధానం, విశ్లేషణ, వివరణ బాగుంది, మీరు వ్యాకరణంపై పిహెచ్‌.డి చేశారా? అని అడిగారు. వ్యాకరణాన్ని లోతుగా మీరు పరిశీలించారని మెచ్చుకున్నారు. ఇంతకన్నా నా జీవితంలో గొప్పతనం ఏమివుంటుంది. చెప్పండి.

నా గ్రంథాలను చదివి, పత్రికా ముఖంగానూ, వ్యక్తిగతంగానూ, సహృదయ పాఠకులు, విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు, ఆచార్యులు, రాసిన లేఖలు, ఫోన్‌ కాల్స్‌ నాకు ఎంతో తృప్తినిచ్చాయి. నన్ను ఆదరించి, అభిమానించిన భాషా, సాహితీ ప్రియులకు నా కృతజ్ఞతలు.


అవార్డులు, పురస్కారాలు, సన్మానాలు, బిరుదులు, ముఖ్యమైన అంశాలు :

1. ''రఘుపతి వెంకట రత్నం నాయుడు బెస్ట్‌ థీసెస్‌ అవార్డు'' - ఆంధ్ర విశ్వకళాపరిషత్‌, విశాఖపట్నం (1985), 2. ''బెస్ట్‌ రీసెర్చర్‌ అవార్డు'' - ఆంధ్ర విశ్వకళాపరిషత్‌, విశాఖపట్నం (1995), 3. ''దళితస్త్రీ'' ప్రాజక్టు - ఆంధ్ర విశ్వకళాపరిషత్‌, విశాఖపట్నం (2001 - 2002), 4. ''డాక్టర్‌ పిల్లి శాంసన్‌ స్మారక సాహితీ పురస్కారం - ''డాక్టర్‌ పిల్లి శాంసన్‌ స్మారక సాహితీ పీఠం'' - గుంటూరు (2003), 5. ''సాహితీ మిత్రులు సాహితీ పురస్కారం'' - సాహితీ మిత్రులు సాహితీ సమస్థ - మచిలీపట్నం (2005), 6. ''ఆంధ్ర ప్రదేశ్‌ సాహితీ సాంస్కృతిక సమాఖ్య పురస్కారం'' - ఆంధ్రప్రదేశ్‌ సాహితీ సాంస్కృతిక సమాఖ్య, శ్రీకాకుళం (2005), 7. ''ఆచార్య రొక్కం రాధాకృష్ణ సాహితీ పురస్కారం'' - ఇండియన్‌ హైకూ క్లబ్‌ - అనకాపల్లి (2005), 8. ''భాషా విశిష్ట పురస్కారం'' - ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌరవనీయులు డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి గారి చేతులు మీదుగా, అంతర్జాతీయ భాషా దినోత్సవ సందర్భంగా - హైదరాబాద్‌ (2006), 9. ''ఉగాది సాహితీ ప్రతిభా పురస్కారం'' - ఆంధ్ర సారస్వతి సమితి, మచిలీపట్నం (2006), 10. ''ధర్మ నిధి పురస్కారం'' - శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ (2007), 11. ''ఆత్మీయ పురస్కారం'' - తెలుగు భాషా బ్రహ్మూెత్సవాలు, తిరుపతి (2007), 12. ''బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ ఇన్‌ తెలుగు'' (పి.జి) - ఛైర్మన్‌, తెలుగుశాఖ, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌, విశాఖపట్నం (2007-2010), 13. ''ఉగాది సాహితీ పురస్కారం'' - జ్యోత్స్నా కళాపీఠం, హైదరాబాద్‌ (2008), 14. ''తెలుగు భాషా పురస్కారం'' - తెలుగు తేజం, విశాఖపట్నం (2008), 15. ''బహుముఖ ప్రజ్ఞాశాలి కట్ట మంచి రామలింగా రెడ్డి'' - డైరెక్టర్‌, యు.జి.సి. జాతీయ సదస్సు, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌, విశాఖపట్నం, డిసెంబర్‌ 10, 11, (2008), 16. ''బెస్ట్‌ ఎకడమీషియన్‌ అవార్డు'' - ఆంధ్ర విశ్వకళాపరిషత్‌, విశాఖపట్నం (2009), 17. ''పురిపండా అప్పల స్వామి అవార్డు'' - అరసం (ఆంధ్ర ప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం), విశాఖపట్నం (2010), 18. ''విశిష్ట సాహితీ పురస్కారం'' - రసభారతి సాహితీ సంస్థ, విజయవాడ (2011), 19. ''తెలుగు భాషా చరిత్ర'' - హిందీ భాషలోకి అనువాదం, ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడమీ, హైదరాబాద్‌ (2011), 20. ''మోదు గురుమూర్తి స్మారక పురస్కారం'' - సత్యమూర్తి చారిటబుల్‌ ట్రస్టు, విశాఖపట్నం (2012), 21. ''విశిష్ట సేవా పురస్కారం'' - భారత ప్రభుత్వం స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌, ఆగస్టు 15 శ్రీకాకుళం (2012), 22. ''గిడుగు రామమూర్తి పంతులు ప్రతిభా పురస్కారం'' - డాక్టర్‌ పట్టాభి కళాపీఠం, మచిలీపట్నం (2012), 23. ''భాషా బ్రహ్మ'' పురస్కారం - సత్యమూర్తి చారిటబుల్‌ ట్రస్టు 12వ వార్షికోత్సవ సందర్భం, విశాఖపట్నం (2012), 24. ''శ్రీమతి కుర్రాకోటి, సూరమ్మ స్మారక సాహితీ పురస్కారం'' - శ్రీమతి కుర్రాకోటి, సూరమ్మ స్మారక సాహితీ అవార్డు ఫౌండేషన్‌ కమిటి - ఒంగోలు (2013), 25. ''బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ ఇన్‌ తెలుగు'' (పి.జి) - ఛైర్మన్‌, తెలుగు శాఖ, డాక్టర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం (2013), 26. ''ఉగాది గౌరవ పురస్కారం'' - విజయనామ ఉగాది సందర్భంగా ఉత్తరాంధ్ర వెలమ సంక్షేమ సంఘం, విశాఖపట్నం (2013), 27. ''ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక అవార్డు'' - ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం విద్యాశాఖా మంత్రి గౌరవనీయులు శ్రీ కె. పార్థసారధి గారి చేతులు మీదుగా ప్రతిష్ఠాత్మకమైన అవార్డు, 5 సెప్టెంబర్‌ - హైదరాబాద్‌ (2013), 28. ''ఎకడమిక్‌ సెనేట్‌ సభ్యులు'' - ఆంధ్ర విశ్వకళాపరిషత్‌, విశాఖపట్నం (2013), 29. ''తెలుగు వాఙ్మయ ప్రగతి రత్నాలు పురస్కారం'' - తెలుగు భాషా పరి రక్షణ సమితి, పుంగనూరు, చిత్తూరు (2014), 30. ''భాషా విభూషణ'' బిరుదు - శ్రీ ప్రభాసాంబ సాహితీ పీఠం, విశాఖపట్నం, జనవరి 11 (2014), 31. ''సాహితీ బ్రహ్మ'' అవార్డు - శ్రీ శ్రీ సాయి సరిగమ సేవా సంస్థ, విశాఖపట్నం (2014), 32. ''విశిష్ట ఉగాది సాహితీ పురస్కారం'' - ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతులు మీదుగా శ్రీమన్మథ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తుళ్ళూరు, అమరావతి (2015), 33. ''తానా సభలకు హాజరు'' - (తెలుగు అసోషియేషన్‌ నార్త్‌ అమెరికా) డెట్రాయిడ్‌, మిషిగన్‌ రాష్ట్రం, అమెరికా, జూలై - 2-4, (2015), 34. ''సాహితీ తపస్వి పోలవరపు కోటేశ్వరరావు సాహితీ పురస్కారం'' - సాహితీ తపస్వి పోలవరపు కోటేశ్వరరావు సాహితీ కళాపీఠం మరియు ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడమీ, విజయవాడ, అమరావతి, 1 ఆగస్టు (2015), 35. ''విజయభావన'' ''ఉగాది సాహితీపురస్కారం'' ధుర్ముఖి ఉగాది సందర్భంగా, విజయనగరం, 8 ఏఫ్రిల్‌ (2016), 36. ''సాహితీసవ్యసాచి'' - బిరుదు, విజయభావన, విజయనగరం, (2016), 37. ''ఆంధ్రరత్న'' బిరుదు, ''అర్పిత'' సాంస్కృతిక, సామాజిక సేవాసంస్థ, విశాఖపట్నం (2016), 38. ''సింగపూర్‌లో జరిగిన 5వ ప్రపంచ తెలుగు సదస్సుకు హాజరు'' (సింగపూర్‌ తెలుగు సమాజం, వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా, లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా, మలేషియా తెలుగు సంఘం సారథ్యంలో) సింగపూర్‌, నవంబర్‌ 5,6 (2016), 39. ''పి.జి.బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ ఇన్‌ తెలుగు'' - ఉస్మానియా (హైదరాబాద్‌), ఆచార్య నాగార్జున (గుంటూరు), ఆది కవి నన్నయ (రాజమండ్రి), కృష్ణా (కృష్ణాజిల్లా), మొదలైన విశ్వవిద్యాలయాల్లో మెంబర్‌గా, 40. ''యు.జి.బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ ఇన్‌ తెలుగు'' - ప్రభుత్వ, ప్రైవేటు డీగ్రీ కాలేజిల్లో డాక్టర్‌ వి.యస్‌.కృష్ణా కాలేజీ - విశాఖపట్నం, ఆంధ్ర లయోలా కాలేజి - విజయవాడ, జె.ఎమ్‌.జె.కాలేజి - తెనాలి, ఎమ్‌.ఆర్‌. కాలేజి - విజయనగరం, సెంట్‌ జోసెఫ్‌ కాలేజి ఫర్‌ ఉమెన్‌ - విశాఖపట్నం, వై.యస్‌.ఎన్‌ కాలేజి - నరసాపురం, సిద్ధార్థ కాలేజి - విజయవాడ, మొదలైన కాలేజీల్లో మెంబర్‌గా. ఇలా ఎన్నో పురస్కారాలు, అవార్డులు, అందుకున్నాను. నూట అరవైకి పైగా వివిధ ప్రసిద్ధ సాహితీ సంస్థలు, మరియు ఇతర ప్రముఖ సంస్థలు, సాహితీ కృషిని గుర్తించి, ఘనంగా సన్మానించాయి.

బాగా చదువు కోవడం వల్ల సమాజంలో ఒక వ్యక్తికి గౌరవం, హోదా వుంటుందని నేను గ్రహించాను. ఆ ఆత్మ విశ్వాసం నన్ను ముందుకు నడిపించింది. బాగా చదువుకొని, పెద్దలచే మన్ననలను పొందాలని అనుకున్నాను. అలాగే పిహెచ్‌.డి డిగ్రీ వరకు చదువుకున్నాను. అయితే అదే నా జీవితానికి గమ్యం అని నేను అనుకోలేదు. అంత కంటే ముందుకు నడిశాను. ఎన్నో ఉత్తమ పరిశోధన వ్యాసాలు రాశాను. విద్యార్థులకు ఉపయోగపడే మంచి గ్రంథాలను ముద్రించాను. వీటన్నిటికంటే అశేష భాషా, సాహిత్యాభిమానులు నాపట్ల చూపుతున్న ప్రేమ, వాత్సల్యం, వెలకట్టలేనటువంటిది. వారి అదరణ ఎన్నటికి మరువలేను.

విహంగవీక్షణం:

ఒకసారి జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే, నన్ను నేను అభినందంచుకోదగ్గ అనేక అంశాలు వున్నాయి. నా జీవితంలో నేను అనుకున్న దానికన్నా ఎక్కువే సాదించాను. ఆశించినదానికన్నా ఎక్కువే గుర్తింపు పొందాను. పెద్దలచే ప్రశంసలు అందుకున్నాను. ఆ సంతృప్తి నాకు పూర్తిగా వుంది. ఒక వ్యక్తి జీవితం, ఆయన రచనలకన్నా ఉన్నతమైంది, మ¬న్నతమైంది. విలువైనది, విశిష్టమైనదని నా భావన.

నిరంతరం నాకు సహాయ సహకారాలు అందిస్తూ, నన్ను ప్రోత్సహిస్తూ, నారచలను అభినందిస్తున్న భాషాభిమానులకు, సాహిత్యాభివానులకు కృతజ్ఞతాంజలిలు ఘటిస్తున్నాను.
నిరంతరం భాషా సాహిత్య వ్యాసాంగంలోనే వున్నాను. నేను సైతం.. నా వంతు భాషా, సాహిత్య కృషి చేస్తున్నాను. ఇంతింతై.. నాసాహితీ విశ్వరూపం ఇలా విస్తరించి, ప్రముఖులచే ప్రశంసలు అందుకుంటానని మొదటలో నేను అనుకోలేదు. నా సాహితీ జీవితం ధన్యమైనదిగా భావిస్తున్నాను. అందుకు సహకరించిన ప్రముఖులందరికీ నా కృతజ్ఞతలు.

నా సాహితీ యాత్రలో, నా కుటుంబం ఎంతగానో నాకు సహకరించింది. మిత్రుల సహకారం కూడా మరవలేనిది. సాహితీ సమాజం కూడా నన్ను ఎంతగానో గుర్తించి, గౌరవించి, ఆధరించి, ఘనంగా సత్కరించింది. వీళ్ళందరూ, నాపై చూపిన ప్రేమను, అభిమానాన్ని, ఎన్నటికీ మరవలేను. ఒక్క వాక్యంలో చెప్పాలంటే నా జీవితం, సాహిత్య మయం అయింది. ఇదే నా సాహితీ జీవితం.

భాష నశించి పోతే, జాతి నశించిపోయినట్లే. చరిత్ర, సంస్కృతులు వగైరాలు అన్నీ కాలగర్భంలో కలిసిపోయినట్లే. ఇలాగే భాషను ప్రభుత్వాలు ఆశ్రద్ధచేస్తే కాల క్రమంలో తెలుగు భాష మరుగున పడిపోతుంది. కొంతకాలానికి మాట్లాడే భాషగా, మాత్రమే మిగులుతుంది. తర్వాత తర్వాత అది కూడా వుండదు. చివరకు గుండుసున్నా మిగులుతుంది. కాబట్టి భాషమీద, తెలుగు వారందరూ ప్రేమ, అభిమానం, గౌరవం తప్పనిసరిగా పెంచుకోవాలి. తెలుగు భాషా, సాహిత్యాల ఔన్నత్యాన్ని, గొప్ప తనాన్ని పరిరక్షించుకోవడానికి మన మంతా కలిసి కృషిచేద్దాం.

తెలుగు భాషకి వందనం అభివందనం