ఉపోద్ఘాతం: 

పూర్వపరిశోధకులు అంటే కనీసం మూడు, నాలుగు దశాబ్దాల పూర్వందాక, ఎం.ఫిల్ ప్రవేశపెట్టకముందు వరకు బోధనానుభవం, సాహిత్య పరిచయం, రచనా వ్యాసంగం కలిగి ఉండేవారు. పిహెచ్.డిలో ప్రవేశం కోరుతున్ననాటికి కొంత సాహిత్య కృషి చేసి, ఆ అంశం మీద పూర్వీకుల కృషి కొంతైనా తెలుసుకొని వచ్చేవారు. అంతేగాక అతిస్వల్ప వ్యవధిలో సిద్ధాంత గ్రంథ రచనం ముగించాలన్న తపన ఉండేది కాదు. అప్పటికే ఉద్యోగస్థులు అయి ఉండడం మూలానా డాక్టరేటు ద్వారా కొత్త ఉద్యోగం ఏదీ వచ్చేస్థితి లేకపోవడంతో ప్రశాంతంగా విషయాసక్తితో పరిశ్రమించేవారు. అందువల్ల వాటికి మంచిపేరు వచ్చింది.

ప్రస్తుతం పరిశోధకులు:

ఇప్పటి పరిశోధక విద్యార్థి స్థితి వేరు. అతని ఆందోళనలు, మానసిక సమస్యలు వేరు. ఈ రోజు పరిశోధక విద్యార్థి ప్రధానంగా రెండు సమస్యలు ఎదుర్కొంటున్నాడు.

1. పరిశోధనాంశానికి సంబంధించిన నేపథ్య పరిజ్ఞాన రాహిత్యం.

2. జీవితానికి సంబంధించిన ఉద్యోగరాహిత్యం నేపథ్య పరిజ్ఞాన రాహిత్యం (Background Knowledge)

అంటే ఎం.ఫిల్లో చేరేనాటికి ఏ అంశాన్ని ఎందుకు తీసుకోవాలో, ఆ అంశం మీద ఎంతవరకు కృషి జరిగిందో ఏ మాత్రం అవగాహన లేకపోవడం. దీనికి కారణం ఉంది. ఎం.ఏలో చదివేపధ్ధతికీ, రిసెర్చిలో అధ్యయనం చేసే పద్ధతికి పూర్తి వ్యత్యాసం ఉంటుంది. ఎం.ఏ. ఢాకా ఒక ప్రత్యేకమైన పాఠ్యప్రణాళిక ఉండడం అందులో సగం సిలబసన్ను చదివితే చాలు ఉత్తీర్ణులయ్యే అవకాశం. ముండడం. ప్రశ్నలకు జవాబులుగా పుస్తకాల నుండి యథాతథంగా ఎత్తి రాసుకొని కంఠస్థం చేసుకొని కానీ, గుర్తుంచుకొని కానీ పరీక్షల్లో రాస్తే చాలు కృతార్థులవుతారు. ఎం.ఏలో. సామూహికకృషితో ఫలితాలు సాధించవచ్చు. తరగతిమొత్తంలో ఇద్దరు ముగ్గురు విద్యార్థులు శ్రమిస్తారు. నోట్స్ రాస్తారు. తక్కినవారు వాటిని ఎత్తి రాసుకొంటారు. ఎత్తి రాసుకోవడం కూడ ఇప్పుడు పోయింది. పరీక్షలకు రెండు రోజుల ముందు జిరాక్స్ చేసుకొంటున్నారు. పరీక్షహాలు. నుండి బయటికి వచ్చే వరకు జ్ఞాపకముంటే సరి. కాని పరిశోధక విద్యార్థి అలాకాదు. అతని కృషి సామూహికంగా ఉండదు. వ్యష్టిగా ఉంటుంది. బాధ్యత తీసుకోవల్సి ఉంటుంది. పర్యవేక్షకునితోనేగాదు, ఇతర ఉపన్యాసకులతోను, మిత్రులతోను చర్చించాల్సి ఉంటుంది. తనకు కావల్సిన సమాచారం తానే రాబట్టుకోవాల్సి ఉంటుంది. ఎం.ఏ పరీక్షలో విషయం తెలుసా లేదా అనే చూస్తారు. అలాగే చూడాలి కూడా. ఎం.ఏలో విద్యార్థి మౌలికంగా సొంత వ్యాఖ్యానాలు చేయడానికి అంతగా వీలుపడదు. కాని పిహెచ్.డిలో మౌలికతకే ప్రాధాన్య ముంటుంది. పొరపడితే. పరీక్షకులు మాత్రమే కాదు. లోకంలో ఎవరైనా ఎప్పుడైన వాటిని తప్పు అని నిరూపిస్తూ కొత్తవి ప్రతిపాదించే అవకాశం ఉంటుంది.

ఇలా ఎం.ఏలో సిలబస్ మాత్రులై కంఠస్థమే గమ్యం కావడం ఒకటి కాగా జీవితంలో స్థిరపడాల్సిన దశ కావడంతో విద్యార్థులు తమ దృష్టిని పోటీ పరీక్షల మీద ఉద్యోగాన్వేషణ మీద కేంద్రీకరించక తప్పదు. పత్రికల్లో సాహిత్యానుబంధాల పేజీ మీద కన్నా ఉద్యోగ ప్రకటన పేజీ మీద దృష్టి ఉంటుంది. తాము పుట్టిన గ్రామాల్లోకన్నా నగరాల్లో ఉంటే ఉద్యోగార్జున ఉద్యమంలో కృతకృత్యులు కాగలరు. కనుక వారు ఎదుర్కొనే సమస్య వసతి కష్టమో నష్టమో ఎం.ఫిల్, పిహెచ్ డిల్లో సీట్లు తెచ్చుకుంటే కొంతకాలం హాస్టల్లో ఉండవచ్చు తినడానికి తిండి, ఉండడానికి వసతి లభిస్తాయి పోటీ పరీక్షలు రాసుకొని అదృష్టదేవత కరుణిస్తే చిన్నదో, పెద్దదో ఉద్యోగం దొరికించుకొని వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా 'లక్ష్యమే' వేరయిన విద్యార్థుల నుండి మంచి పరిశోధనలు రావాలని ఎలా ఆశించగలం? తమకు తిండి పెట్టని పరిశోధన. వైపు కాకుండా జీవనోపాధి చూపించే అవకాశాలున్న కోర్సులవైపు దృష్టి పెట్టక తప్పదు మరి మరి భారీగా ఉపకారవేతనాలు పొందే వారో! వారూ అంతే!

అట్లాగే ఎం.ఫిల్ విద్యార్థులకు విషయావగాహన చదివితే వస్తుంది కాని రచనా పరమైన అభ్యాసం లేకపోవడం ఒకలోపం. ఎలా మొదలు పెట్టాలి? ఎలా ముగించాలి? వాక్య నిర్మాణాలు ఎలా ఉన్నాయి? కంటిన్యుటీ ఉందా? లేదా? అకస్మాత్తుగా మరో విషయం. మీదికి వెళ్ళిపోతున్నామా? మొదలైన విషయాలలో వారు ఇంకా శక్తి సమన్వితులు కావలసిన అవసరం కనిపిస్తుంది. కొందరు పర్యవేక్షకులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ దశను ఎం. ఏ వరకే దాటిన వారికి ఎం. ఫిల్లో రాయడం సులువవు తుంది. విషయ విశ్లేషణను, విషయ ప్రతిపాదనలను పర్యవేక్షకుడు చూడడం సముచితం కాని రాతదోషాలను కూడా సవరించుకొంటూ కూర్చునే తీరిక పర్యవేక్షకునకుండదు. ఒక్కోసారి పర్యవేక్షకుడు విద్యార్థికి ఎంత చెప్పినా అర్థంకాని స్థితి. అశక్తత ఉంటాయి. అటువంటప్పుడు విషయం మీది కన్నా శీర్షికలు, అధ్యాయాలపేర్లు సరిచేసి వదిలేయడం జరుగుతుంది. అంతే తప్ప పర్యవేక్షకుడు స్వయంగా రాసివ్వలేదు. అసలు పరిశోధకులు రాసుకొచ్చిన దానిని దిద్దడం కన్నా రాసివ్వడమే సులభం అని వాపోతున్న పర్యవేక్షకులు లేకపోలేదు.

అసలు ఎం.ఏలో పరిశోధనకు సంబంధించిన ఊసే లేకపోవడం విచిత్రం, విమర్శ పేపరులో 'పరిశోధన'కు సంబంధించిన అంశం ఉండాలి. పాఠశాలల్లో చిన్న పిల్లలచేత కూడ 'ప్రాజెక్ట్స్' చేయిస్తుంటే ఎం.ఏలో ప్రాజెక్ట్ ఉండకూడదని గొడవలు చేసి తీసేయిస్తున్నారు.

అనితర సాధ్యమైన విశ్లేషణనూ, నూతన అన్వయాలనూ చేయగలిగిన శక్తి లేకపోయినా చెప్పేది సూటిగా నిర్దుష్టంగా ఉందా లేదా అని పరిశీలించు కోవడం, అక్షర వాక్యనిర్మాణ దోషాలను సవరించుకోవాలన్న పట్టుదల ఉండడం ఉత్తమ పరిశోధకుని లక్షణం. నిర్లక్ష్యంతో ఏం రాసినా ఎలా రాసినా చెల్లిపోతుందన్న ధీమాతో రాస్తే, పర్యవేక్షకుడు వాత్సల్యంతో, ఔదార్యంతో, ఓపికలేని తనంతో ఆమోదించవచ్చు. కాని ఆ దోషాలు పరీక్షకుల దృష్టిలో పడతాయి.

పరిశోధన - ఆశయం:

ఒక అంశాన్ని గురించి విశ్లేషణ పద్ధతి, తార్కికత, అనుశీలించే విధానం తెలిసి ఉండడమే స్థూలంగా బ్యారేటు ఉద్దేశ్యం. విశ్వవిద్యాలయ స్థాయిలో పిహెచ్.డి అనేది అత్యున్నతస్థాయి డిగ్రీ ఇక ఆపైన చదువు ఉండరు. ఈ మధ్య డి.లిట్ ఇస్తున్నారు. కాని ఇది అంత వ్యాప్తిలో లేదు. అంటే ప్రత్యేకాంశం పైన ఇక అతడే ఎంతో అవగాహన కలిగిన వ్యక్తిగా ముద్రపడతారు. అతనయితేనే సప్రమాణంగా చెప్పగలదు అని ప్రజలు విశ్వసిస్తారు! అందుకుగాను పరిశోధకుడు పిహెచ్.డీలో చేరాలనుకొనేవాటికి ఆ ప్రత్యేక రంగంలో వచ్చిన మూడు నాలుగు పిహెచ్.డీ గ్రంథాలరైనా, అవసరమున్న పేజీలు కాక మొదటి పుట నుండి చివరి పుట దాకా ప్రత్యక్షరం నిశితంగా చదవాలి కనీసం చేరిన కొత్తల్లోనైనా చెదివితీరాలి. ఉదా॥ జానపదరంగంలో పరిశోధించాలను కొంటే బి. రామరాజు, నాయనికృష్ణ కుమారి, తంగిరాల వెంకటసుబ్బారావు, ఆర్.వి. ఎస్. సుందరం, రావి ప్రేమలత, కసిరెడ్డి ప్రభృతుల గ్రంథాలను చదవకుండానే ఆ రంగాన్ని ఎన్నుకుంటే ఎట్లాగు? ఆధునిక కవిత్వం మీద చేసేవారు, సి. నారాయణ రెడ్డి, ముదిగొండ శివప్రసాద్, వెబ్బేరు నారాయణ రావు, జి. చెన్నకేశవరెడ్డి, ఎస్వీ సత్యనారాయలు గారల రచనలు విధిగా చదవాలి. ఇంచుమించు ఆధునిక కవిత్వమంతా వివిధ ఉద్యమాలతో మమేకమై సాగింది. కనుక ఆ ఉద్యమాల పరిణామవికాసాలు సిద్ధాంతాల పట్ల అవగాహన పెంచుకోవాలి. అట్లాగే ఏ రంగాన్ని తీసుకొన్నా ఆ రంగానికి చెందిన ప్రామాణిక రచనలు చదవాలి. వీటిలో సగం పుస్తకాలు ఎం.ఏ స్థాయిలో పాఠ్యగ్రంథాలుగా ఉండడంతో చదివే అవకాశం సిద్ధిస్తుంది. ఎంఏలో ప్రశ్నలకు జవాబుల కోసం ఈ పుస్తకాల్లో ఏ పుటల్లో దొరుకుతుందో చదువుతారు. ఇప్పుడు అలాకాదు. వారి వారి ప్రణాళికలు ఎలా ఉన్నాయి? విషయ వివరణకు అవి ఎంతవరకు సరిపోయాయి? రచనా విన్యాసం, విషయ వ్యక్తీకరణ విధానం ఎలా ఉంది? మొదలైన విషయాలను జీర్ణం చేసుకోవడానికి చదవాలి. తర్వాత పిహెచీలో చేరాక పరిశోధనలో తాదాత్యం పెరుగుతున్న కొద్దీ పుస్తకాలు చదివే పద్ధతి మారుతుంది. ఈ సమయంలో మనకు కావలసిన సమాచారం, వ్యాఖ్యలు ఏ పేజీలలో దొరుకుతాయో, వాటిని మాత్రం శ్రద్ధగా చదువుతూ తక్కిన పుటలు గమనిస్తు వెళ్ళిపోతుండాలి. కనిపించిన ప్రతి పుస్తకం చదువుతూ పోతే జ్ఞానపరిధి విస్తృతమే అవుతుంది. నిజమే కానీ పరిశోధన కుంటుపడుతుంది. ఇలా పేజీలు తిప్పేస్తూ గమనిస్తు పోతూనే గ్రహించే శక్తి ఓ వందగ్రంథాల నయినా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తేనే సిద్ధిస్తుంది.

తన పరిశోధనాంశంతో పోలిన అంశాలమీద పరిశోధన చేసిన వారు ఎలా ప్రణాళిక వేసుకొన్నారు? ఉపశీర్షికలెలా ఉన్నాయి? ఏఏ అంశాలను ఎలా చర్చించారు? అన్నది పరిశీలించుకొని తన పరిశోధనాంశానికి అనువైన చట్రాన్ని తయారు చేసుకో వచ్చు. తర్వాత పర్యవేక్షకునితో చర్చించి మరింత నిగ్గుదేల్చుకోవచ్చు..

పరిశోధకుడు - ముఖ్య లక్షణాలు:

పరిశోధకునికి తన పరిశోధనాంశానికి ఉపకరించే అంశాలు ఎక్కడున్నా పట్టుకోగలిగే నేర్పరితనం ఉండాలి. అది చిత్తుకాగితాల బుట్టలో పారేసిన ఒక పాతపేపరులో దొరకవచ్చు. లైబ్రరీలో అతిభద్రంగా దాచబడ్డ పుస్తకంలో దొరకవచ్చు. ఒక్కోసారి రచయితలు తమ వ్యాసాలకు డొంక తిరుగుడు పేర్లు పెట్టి రాయవచ్చు. లేదా మహారచయితలు తమ విస్తృత అనుభవాన్ని పురస్కరించుకొని ఒక విషయాన్ని చెప్తూ మరొక అప్రస్తుతాంశాన్ని చెప్పవచ్చు. ఆ వ్యాసాన్ని చదివిన పాఠకులకు ఆ వ్యాసం ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కాని అప్రస్తుతంగా చెప్పిన ఆ అంశం ఈ పరిశోధకునికి ఒక్కోసారి మార్గదర్శనం చేయవచ్చు.

నిడుదవోలు వెంకటరావు గారి 'ఆధునికయుగం గాంధీప్రభావం' అనే వ్యాసం 1973 ఫిబ్రవరి మార్చి భారతి సంచికల్లో వచ్చింది. ఈ వ్యాసం శీర్షికద్వార మన కర్ణం అయ్యేదేమిటి? స్వాతంత్రోద్యమంలో గాంధీ నాయకత్వం స్థిరమైన తర్వాత వెలువడిన సాహిత్యం, దానిమీద గాంధీ ప్రభావప్రసరణం అనే భావిస్తాం గదా! కాని ఆ మహానుభావుడు పోతన, కూచిమంచి జగ్గన మొదలైన రాజులను ఎదిరించిన కవులందరిని వివరిస్తూ ఆధునిక కవుల దగ్గరకు వచ్చాడు ఇలాంటి వాటిని కూడా పరిశోధకుడు పట్టుకోగల్గాలి. ఉపయోగించుకోగల్గాలి. ముఖ్యంగా తమ అంశానికి సంబంధమున్న అంశాలమీద వచ్చిన సిద్ధాంత గ్రంథాల్లో ఉపయుక్త గ్రంథసూచికలను పరిశీలిస్తే దారి దొరకగలదు.

పరిశోధకునిలో పరిశోధనకు సంబంధించిన కుతూహలం ఉండడం సహజం. ఏదైనా కొత్తఅంశం లభించిందంటే అమాంతం ఎగిరిగం చేయడం సహజం. ఆ పారవశ్యంలో వస్తువును సక్రమంగా గమనిస్తున్నామా? లేదా ఎక్కడైనా పొరపాటు పడుతున్నామా? అని ఒకటికి రెండు సార్లు మనల్ని మనం పరీక్షించుకోవాలి.

భాగవత కర్త పోతనకు ఒక కొడుకు ఉన్నాడు. అతడి పేరు మల్లన్న రుక్మాంగద చరిత్ర కావ్యం రాసిన ప్రౌఢకవి మల్లన తండ్రి పేరు పోతన, అది చూసి ఆ పోతన కొడుకు ఈ మల్లన అని పరవశించిపోవచ్చు. ఒక ప్రముఖ విమర్శకుడే అలా పరవశించిపోయాడు. కాని పోతనది కౌండిన్య గోత్రం, మల్లన్నది శ్రీవత్సగోత్రం అని సావకాశంగా గద్యలను పరిశీలిస్తే తేలుతుంది. ఇద్దరు వేర్వేరు అని రూఢిపడుతుంది. నామసామ్యం వల్ల పొరపాటు పడే అవకాశం ఉంటుందని హెచ్చరించడానికి ఈ ఉదాహరణ ఈ ఒక్కటే కాదు ఇంకా ఎన్నో రకాలుగా పొరపాట్లు పడే అవకాశ ముంటుంది.

పోతన భక్తితత్వ విశ్లేషణం సామాన్యాంశం. కాని డా॥ ప్రభల జానకి పోతనను సంగీత విద్వాంసునిగా ప్రతిపాదించడం వినూతనాంశం.

“సాంద్ర శరచ్చంద్ర చంద్రికా ధవళిత, విమల బృందావన వీధియందు రాసకేళీ మహోల్లాసుఁడై యుత్ఫుల్ల, జలజాక్షు డొక నిశాసమయమునను దనరారు మంద్రమధ్యమతారముల నింపు దళు కొత్త రాగభేదములఁ దనరి దైవత ఋషభ గాంధార నిషాద పంచమ షడ్జమధ్యమ స్వరములోని గళలు జాతులు మూర్ఛనల్ గలుగ వేణు, నాళ విమాంగుళిన్యాసలాలనమున మహితగతిఁబాడె నవ్యక్తమధురముగను, బంకజాక్షుండ దారువులంకురింప” (2-188)

అనే పద్యంలో సంగీత శాస్త్ర సాంకేతిక పదాలనేకం ప్రయుక్తమైనాయి. పద్యారంభంలోనే 'చంద్రిక'రాగం సూచితమైంది. "ద,రి,గ,ని, ప, స,మ" అనడంలో సప్తస్వరాలు, మంద్ర, మధ్యమ, లనే త్రిస్థాయిలు, కళలు, జాతులు, మూర్ఛనలు- ఇవన్నీ సంగీతశాస్త్ర సాంకేతిక పదాలై తజ్ఞులకు మాత్రమే అర్థమౌతాయి. 'సరిగమపదని' అని కాకుండా 'ద.వి.గ.ని.ప.స.ము' అనే వరుస నిర్దేశించడం చేత చంద్రికారాగ ఆరోహణాపరోహణలు కూడా సూచించినట్టైంది. కళలంటే సంగీతంలో 'సంగతులు' అయితే ఇది తాళదశప్రాణాల్లో ఒక తాళాంగంగా కూడా సంగీతజ్ఞులు. సంభావిస్తారు. ఈ కళలు మళ్ళీ ఏక, ద్వి, చతుష్క భేదంతో ఒకటి, రెండు నాలుగక్షరాల కాలపరిమితిని తెలుపుతాయి. దీప, ఆయత, కరుణ, మృదు, మధ్యమ భేదంతో జాతులైదని సంగీత సంప్రదాయం. ద్వావింశతి శ్రుతులందరికీ పరిచితమైనవే ఇంతటి గంభీరార్ణాన్ని పోతన అలవోకగా సీసపద్యంలో నిక్షేపించడం ఆయన సంగీతజ్ఞానానికి నిదర్శనం'

అట్లాగే భాగవతం దశమస్కంధం ఉత్తర భాగం 1096లో పేర్కొనబడిన పదిహేను వాద్య విశేషాలు, నీలోత్సల (10-పూర్వభాగం-776), హంసధ్వని (10 పూర్వభాగం-778) భువనమోహిని రాగం (10 పూర్వభాగం 772) ప్రస్తావనలు పరిశీలిస్తే పోతన కేవల సాహితీమూర్తే గాక ఎంతటి నాదోపాసనా నిష్ఠిత బుద్ధికలవాడో అవగతమౌతుంది' పోతన. దగ్గర 'సంగీతం' ప్రస్తావిస్తే కొత్తదనం వస్తుంది. రామరాజ భూషణుని దగ్గర సంగీతం ప్రస్తావిస్తే సామాన్యాంశమవుతుంది. ఎందుకంటే ఆయన 'సంగీత కళారహస్యనిధినని కంఠోక్తిగా చెప్పుకున్నాడు. నన్నయ తెసుగుదనాన్ని గురించి, పాల్కురికి సోమన, తిక్కనల తత్సమ పదభూయిష్ఠ, సమాసాత్మక రచనను విశ్లేషిస్తే నూతనత్వం వస్తుంది. పరిశోధన గ్రంథంలో 75 శాతం గతానుగతికత్వం ఉన్న 25 శాతమైన వినూతనత్వం, స్వీయముద్ర, సృజనాత్మక అన్వయం ఉంటే ఆ పరిశోధకుడు విజయం పొందినట్లే..

అన్వయించడంలో పరిశోధకునికి సృజనశీలం కూడా అవసరం అట్లెందుకని ఉంటాడు. అని ప్రశ్న వేసుకోవాలి. లోకంలో వారి వారి అభిరుచులను అనుసరించి పాక్షిక వ్యాఖ్యానాలు చేస్తుంటారు. పరిశోధకులు ఆ గాలివాటంలో కొట్టుకపోకూడదు.

'ఉపమ గలిగిన శయ్యల నొప్పియున్న ఆంధ్రభవుని కావ్యంబు గ్రాహ్యంబు కాద'ని ఎంత గొప్పదనా శూద్రుని కావ్యం బ్రాహ్మణ కావ్యంతో సమానం కాదు. అని కాకునూరి అప్పడవి అప్పకవీయంలో రాశాడట దీనిని ఉల్లేఖిస్తూ ఇది అవమానించడం తప్ప మరొకటి కాదని, ఇంతకన్నా కుల అహంకార సిద్ధాంతం వేరే ఉండదు. అంటూ వ్యాఖ్యానించిన ప్రసిద్ధులు, అప్రసిద్ధులూ ఉన్నారు. చేమకూర వేంకటకవి కావ్యం గొప్పది గదా అన్న వారూ ఉన్నారు. ఈ స్పందన చాలా సహజమైంది. వికీభవించదగిందే కాని చాలామంది ఇంతవరకే. ఆగిపోయి తృప్తి పడతారు పరిశోధకుడు ఇక్కడ తనబుద్ధికి పదును పెట్టాలి ఇంత కులవివక్ష కలిగిన అప్పకవి శ్రీకృష్ణదేవరాయలు, రామరాజభూషణుడు, చేసుకూర వేంకటకవి, సురభిమాధవరాయలు లాంటి బ్రాహ్మణేతర కవులను ఉదాహరించడమేమిటి? పరము భక్తాగ్రగణ్యుడు, లోక ప్రియుడు అయిన పోతన భాగవతంలో నుండి ఒక్కటంటే ఒక్క పద్యం కూడా ఉదాహరించక పోవడమేమిటి? ఈ ప్రశ్నను వేసుకొని సమన్వయించే ప్రయత్నం చేయడం పరిశోధకుని కర్తవ్యం.

ఆనాటి సామాజిక స్థితిని బట్టి గ్రంథావతారికలో అప్పకవి ఔపచారికంగా చెప్పాడు. గ్రంథంలోపల మాత్రం ఒక శాస్త్రవేత్తగా తన లాక్షణిక దృక్పథానికి అనుగుణమైన రచనలనే ఉల్లేఖించాడు తప్ప అది అప్రసిద్ధమా? సుప్రసిద్ధమా? బ్రాహ్మణ కృతమా? బ్రాహ్మణేతర కృతమా అన్నది పరిగణించలేదన్న విషయం తేటపడుతుంది. ఈ సమన్వయం అందరికీ నచ్చుతుందా? నచ్చదా అన్నది కాదు సమస్య పరిశోధకుడు ప్రయత్నం చేశాడా? లేదా అన్నదే సమస్య, ఇది కేవలం ఉదాహరణ కోసం చెప్పిందే.

మనసమాజం రకరకాల సెంటిమెంట్లకు, విశ్వాసాలకు, కట్టుకథలకు, మానవాతీత విషయాలకు పెట్టింది పేరు. వాటి ప్రభావం అనివార్యంగా మన మీద ప్రసరిస్తుంది. నమ్మేవాడు గుడ్డిగా నమ్మేస్తాడు. నమ్మనివాడు విపరీతంగా ద్వేషిస్తాడు. పరిశోధకుడు ఈ విపరీత నమ్మడం, విపరీతంగా ద్వేషించడం లాంటి భావనాద ధోరణిలో పడిపోకుండా.. మధ్యలో తనదైన దారి వేసుకొని సాగాల్సి ఉంటుంది.

ఒకనవల, ఒకకావ్యం చదువుతున్నప్పుడు అందులో ఇతివృత్తిపరమైన సమాచారంతోపాటు సామాజిక ఆధ్యాత్మికాది ఎన్నెన్నో అంశాలుంటాయి. కొన్ని కవి కల్పనలు, ప్రతీకలు, ఉంటాయి. పరిశోధకుడు భౌతిక వాస్తవికాంశాలతోపాటు కళాత్మక సత్యాలను గూడ గుర్తించాలి. కళాత్మక సత్యాలను వాస్తవికాంశాలుగా కూడా భ్రమిస్తూ వాటి సాధ్యాసాధ్యాలను, ఔచిత్యాలను గురించి వ్యాఖ్యానించరాదు.

'వేయి పడగలు'లో పసిరికను మనిషిగా భావిస్తే పప్పులో కాలేస్తాం రామేశ్వర శాస్త్రి మూడు వర్ణాలకు చెందిన అమ్మాయిలను పెళ్ళాడాడు అనేది కూడా ప్రతీకాత్మకంగా వ్యాఖ్యానించాల్సిందే, తప్ప భౌతికంగా భావించలేం. అయోనిజలు, అగ్ని ప్రవేశాలు, ఒకేసారి రెండు చోట్ల ప్రత్యక్షం కావడాలు, వరప్రసాదాలు లాంటి ఎన్నెన్నో అంశాలు ఉంటాయి. వాటిని గుడ్డిగా ఆరాధించకుండా, దూకుడుగా తిట్టిపోయ కుండా మధ్యేమార్గాన్ని అనుసరించాలి. ఆ విషయాల 'గొప్పతనాన్ని సూచించడానికి ఇవి జోడింపబడతాయి అన్న గుర్తింపుతో ముందుకు సాగుతూ ప్రధానాంశం మీద దృష్టి కేంద్రీకరించాలి.

సామాజిక పరిణామాల పట్ల, మారుతున్న నూతన రాజకీయ ఆర్థిక దృక్పథాల పట్ల, -శాస్త్ర సాంకేతికరంగాల ప్రభావం పట్ల చాలినంత పరిచయం సంపాదించుకోవాలి అలంకార శాస్త్ర పరిచయం ఆధునిక విమర్శ రీతులేకాకుండా చరిత్ర, ఆంత్రోపాలజీ, సోషియాలజీ లాంటి Interdisciplinary Subjects తోను, ఇతర భాషా సాహిత్యాలతోను పరిచయం సంపాదించుకొని వాటిని అన్వయించుకొని వ్యాఖ్యానించ గలిగితే సిద్ధాంత గ్రంథం బహుళ జనాదరణ పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ చెప్పినవన్నీ ఒక్కడే నేర్చుకుంటే మంచిదే కాని అది సాధ్యపడనప్పుడు వచ్చినవారితో చర్చించి అవసరమైనంతవరకు అవగాహన చేసుకోగల్గాలి.

అంతటా ఉన్నట్లే తెలుగు భాషా సాహిత్యాలకు పరిమాణంతో పాటు పరిణామం కూడా ఇందనీ, ఏ భాషాసాహిత్యకారులకైనా, ఏకాలపు కవులకైనా రాగద్వేషాలు, దృక్పథాలు, నిబద్ధతలు, మహమాటాలు, అమాయకత్వాలు, విశ్వాసాలు ఉంటాయని పరిశోధకుడు గుర్తించాలి. ఇప్పుడు మనకు కూడా అవన్నీ ఉన్నాయని వాటికతీతులం కామని అంగీకరిస్తూ వర్తమాన సమాజగమనానికి అనువైననేమిటి? కానీవేమిటి? ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచేవి, సమానత్వాన్ని ప్రబోధించేవి ఏమిటి వాటి తీరుతెన్నులెలా ఉన్నాయన్నది పరిశోధకుడు గుర్తించి వ్యాఖ్యానించాలి. వీటిని పరిశోధకులు సత్యాన్వేషణ దృష్టితో రాయాలి.

అడవి బాపిరాజు నవలా సాహిత్యానుశీలనం మీద పరిశోధించి 1991లో నాగార్జున విశ్వవిద్యాలయం ద్వార డాక్టరేటు పొందిన శ్రీ మన్నవ సత్యనారాయణ సిద్ధాంత గ్రంథంలో అడవి బాపిరాజు రచనల్లోని లోపాలను ఎంత నిశితంగా పరిశీలించి పట్టుకున్నారో పరిశోధకులు గమనించాలి.

1. నరుడు నవలలో జెన్నిఫర్ వైద్య కళాశాలలో ప్రవేశించిన కొత్తల్లో విలియమ్సన్న గాఢంగా తన పెదవులను ముద్దుపెట్టుకోనిచ్చింది. అన్న వాక్యం ఉన్న తర్వాతి పుటలో అందుకనేగా ఇంతవరకు నిన్ను నా పెదవులను ముట్టనివ్వలేదు. అని కనిపిస్తుంది.

2. గోనగన్నా రెడ్డి మిత్రుడు అక్కినను గురించి పెళ్ళయి నాలుగేళ్ళయింది' అంటూనే కానున్న భర్తగారు, 'కానున్న మొగుడు వస్తే' అనే వాక్యాలు వస్తాయి .

3. వదిన మరదండ్రయిన రుద్రమదేవి ముమ్మక్కులు తర్వాత తోడికోడళ్ళుగా కనిపిస్తారు.

4. రుద్రమదేవిని అష్టమచక్రవర్తి అని ఒకసారి నవను చక్రవర్తి అని ఒకసారి వర్ణిస్తారు.

5. 'నరుడు'లో బాపిరాజుగారు దళితుల స్థితిగతులను కళ్ళకు కట్టినట్లుగా అద్భుతంగా వర్ణించి కథాభాగాల్లో ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించి నాయికా నాయకుల ప్రణయవర్ణన వైపు వెళ్ళడంతో సంఘసంస్కరణ వరంగా ప్రారంభించిన కథలో క్రమంగా పట్టుసడలిపోయింది.

మన్నవ సత్యనారాయణగారిని పొగడడం నా ఉద్దేశంకాదిక్కడ ఆయన చదవడానికి రాయడానికి అవకాశంలేని ఒక అంధుడు. ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడవలసిన వ్యక్తి (వీరిప్పుడు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు) మరి ఒక ప్రజ్ఞాచక్షువు ఇలా దోషాలను ఉగ్గడించగలిగితే రెండుకళ్ళూ ఉన్న పరిశోధకులు తమపరిశోధనాంశాన్ని మరెంత జాగ్రత్తగాను, నిశితంగాను పరిశీలించవచ్చునో, మరెన్ని విశేషాలను పేర్కొనవచ్చునో ఆలోచించండి. పరిశోధకులకు స్ఫూర్తి ఉత్తేజం కలగడం కోసమే ఈ ఉదంతాన్ని పేర్కొంటున్నాను.

తన సిద్ధాంత గ్రంథ రచనకు దోహదం చేసే ప్రశ్నలు వేసుకొనే నైపుణ్యం బాగా ఉండాలి. ''రచన' చదువుతూనే Between the lines అన్నట్లు అంతర్గతంగా ఉన్న అంశాన్ని పసిగట్టాలి. ఒక రచయిత జీవితం రచనల మీద చేసే విద్యార్థి ఆ రచయిత పుస్తకాలు మాత్రమే చదువుతానంటే సరిపోదు. ముఖ్యంగా ఆ రచయిత సహాధ్యాయులు, సన్నిహిత రచయితల జీవిత చరిత్రల్లో, జ్ఞాపకాల కూర్పుల్లో ఈ రచయిత వివరాలు ప్రసక్తంగా రావచ్చు. వాటన్నింటిని కూర్చుకొంటే ఎన్నో వివరాలు తెలుస్తాయి. ముఖ్యంగా సమకాలీన రచయిత అయితే అతని వాదాలను వ్యతిరేకిస్తూ వచ్చిన రచనలుంటే వాటిని కచ్చితంగా చదవాలి. ఆ వ్యతిరేకుల అభిప్రాయాలలోని సామంజస్యాలను నిగ్గుదేల్చడం పరిశోధకుని ప్రాథమిక కర్తవ్యం

వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలు చేసేటప్పుడు మనం ఎవరి రచనలమీద పరిశోధిస్తున్నామో ఆ రచయితకు గిట్టనివారి అభిప్రాయాలను మృదువుగా ప్రస్తావించాలి. ఒక్కోసారి పరిశోధకునకు సన్నిహితుడు కావచ్చు. అతని ఇంట్లో అతిథిగా ఉండి ఈ రచయిత దగ్గరికి వచ్చినా, అతనిని గురించి గొప్పగా ప్రస్తావించినా ఈ రచయిత చిన్న బుచ్చుకోవడమో, మాట్లాడడానికి ఇష్టపడక పోవడమో జరిగే అవకాశం ఉంటుంది.

వీలైనంత వరకు ఇతర వ్యక్తుల ప్రస్తావనలు లేకపోవడమే మంచిది. మనం ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ రచయిత అనుమతిని ముందుగా తీసుకొని వెళ్ళాలి. మనం ఏదో హడావుడిలో ట్రెయిన్ టైం అవుతుందనీ, లాస్ట్బస్ కూడా వెళ్ళిపోతుందని, ఆకలి వేస్తుందని ఆరాటపడకుండా సావకాశంగా వెళ్ళాలి సాధారణంగా వయస్సులో పరిశోధకుడు చిన్న వాడవుతాడు. పరిశోధ్య రచయిత పెద్ద వాడవుతాడు. మనం అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పే స్థితి ఉండదు. గంట గంటన్నరసేపు ఇతరేతరాంశాలు ఎన్నెన్నో ప్రస్తావించి, తనకు ప్రమోషన్ ఇవ్వకుండా తొక్కిపెట్టారనీ, తనకన్నా తక్కువ స్థాయి రచయితలకు ఎన్నో పురస్కారాలు లభించాయని చెప్పి అప్పుడు మనం అడిగిన విషయాలలోకి రావచ్చు. వాటన్నింటిని ఓపిగ్గా భరిస్తు ఇతరాంశాల నుండి మళ్ళిస్తూ మనం జవాబులు నేర్పుగా రాబట్టుకోవాలి.

జానపదాల క్షేత్రపర్యటన చేస్తున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక రాజకీయాలతో సంబంధం పెట్టుకోరాదు. మతాచారాలను విమర్శించకూడదు. తీవ్రవాద ఉద్యమాలకు నెలవైన చోట్లకు వెళ్ళినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి స్థానికంగా ఉండే ప్రముఖులతో పరిచయాలు పెంచుకోవాలి.

ముగింపు: 

మనం పరిశోధిస్తున్న అంశాన్ని, రచయితల కృతుల్ని ఆకాశానికి ఎత్తాల్సిన పనిలేదు. పాతాళానికి తొక్కాల్సిన పనిలేదు అసలు ఆకాశానికి ఎత్తడం పాతాళానికి తొక్కడం అనేది పరిశోధకుని వ్యవహారం కానేకాదు. దాన్ని విశ్లేషించి బాగోగులు చర్చించడమే పని. అందులో మనం ప్రదర్శించిన నిశితత్వానికి, వివేచనాశీలానికి అన్వయసామర్ధ్యానికి ప్రశంసలు దక్కుతాయి.

ఉపయుక్త గ్రంథ సూచి:

1. వెంకటరావు, నిడదవోలు, ఆధునికయుగ గాంధీ ప్రభావం, (వ్యా.) భారతి పత్రిక, సంచిక ఫిబ్రవరి, మార్చి - 1973 

2. జానకి, ప్రభల, పోతన భక్తితత్త్వ విశ్లేషణం (సి.గ్రం.),

3. భక్తిపథంలో ప్రస్థానత్రయం (పోతన, రామదాసు, త్యాగరాజు) - 2003.

4. సత్యనారాయణ, మన్నవ, అడవి బాపిరాజు నవలా సాహిత్యానుశీలనం 1991.

5. నిత్యానందరావు, వెలుదండ, విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన - 2013.