ఉపోద్ఘాతం:

"విశ్వశ్రేయ: కావ్యమ్" అనే లక్ష్యంతో తెలుగు సాహిత్యం కవిత్రయ భారతానువాదముతో ప్రారంభమై నిరంతరజీవనదిగా మానవతావిలువలు అనెడి ఒడ్డులను తాకుతూ ప్రవహిస్తూ వస్తున్నది. ధార్మికదృష్టికలిగిన వ్యాసమహర్షి మహాభారతగ్రంథాన్ని విలువల పరిరక్షణకు, సామాజిక శ్రేయస్సుకు భంగము కలుగకుండా మానవతా ప్రమాణాల ఆవిష్కరణ పరమార్థమే లక్ష్యంగా ఆదికవి, వాగనుశాసనుడైన నన్నయభట్టు భారతానువాదాన్ని చేపట్టి గురుభక్తి, సత్యనిష్ఠ, మాతృభక్తి, పితృభక్తి ఇత్యాదిగా లోకోత్తరములయిన మానవతావిలువలను పరిరక్షించడానికి తెలియచేయబడిన దుష్యంతోపాఖ్యానము, ధర్మవ్యాధోపాఖ్యానము, ఉదంకోపాఖ్యానము మొదలయిన వాటిని అర్థపుష్టితో కథాకథన దక్షతతో, అక్షరరమ్యతతో చదువరుల హృదయాలకు హత్తుకొనేలా వివరించిన తీరు విశదీకరించబడినది.

ఆధునికయుగంలో పాశ్చాత్యధోరణులు తెలుగులోకి ప్రవేశించడం, రాయప్రోలు, గురజాడ మొదలగు ఆధునిక కవులు ఆత్మసౌందర్యాన్వేషకులై, కార్యకారణ సంబంధమైన ఆలోచనాసరళిలో ప్రజలలో నెలకొన్న మూఢవిశ్వాసాలను తొలగించడానికి, మానవీయబంధాలు బలపడటానికి, జాతిమత భేదాలులేని వర్గరహిత ఆదర్శ సమాజ నిర్మాణదిశగా తేట తెలుగులో, వాడుకభాషలో మానవీయ విలువలకు పెద్ద పీటవేసిన ముత్యాలసరాలు, మనిషి ఇత్యాది గేయాలలో ప్రదర్శించిన కవితాశిల్పం వివరింపబడినది. నవయుగకవిచక్రవర్తి గుర్రం జాషువా కవివరేణ్యులు గబ్బిలం కవితాఖండికలో ప్రకటించిన మానవతాదృష్టి, అదే రీతిగా శ్రీశ్రీ,తిలక్, కరుణశ్రీ తమ కవితలందు ప్రకటించిన మానవీయ విలువలు వివరింపబడినవి. మానవతా విలువలు పాటించని సామాజికజీవితం పురోగతి సాధించదని సారాంశము.

సాహిత్యం - మానవత:

సమాజంలో మానవజీవితము ధర్మబద్ధము కావాలని, అందరి మేలు కోరుతూ మానవత్వంతో మసలుకొన్నప్పుడు సుఖశాంతులు వర్ధిల్లి అభ్యుదము సిద్ధిస్తుంది. మన తెలుగు భాషా సాహిత్యకారులైన కవులందరు ఒకే గొంతుతో ఇదే సందేశమందించారు. “సాహిత్యం”అనే పదానికి అర్ధాన్ని పరిశీలిస్తే హితమును అనగా మంచిని మానవతను పంచాలని ప్రపంచశాంతికి తపించాలనే భావము స్పష్టంగా తెలియవస్తోంది. విశ్వశ్రేయస్సును కలిగించడమే సాహిత్యము యొక్క పరమార్థము.

ధర్మం - మానవత:

మానవుడు కేవలం అర్థసంపాదన, స్వీయకాంక్షలను సిద్ధింపచేసుకోవడమే లక్ష్యముగా జీవించకుండా ధార్మిక జీవనము సాగిస్తూ సాటి మానవులు ధర్మబద్ధముగా జీవించడానికి సహకరిస్తూ మంచి గంధములా పరిమళించే మానవత్వాన్ని, సత్యదృష్టి సమభావన సహనం శాంతి కాముకత, సౌభ్రాతృత్వం, అహింస ఇత్యాదులైన మానవీయవిలువలు పరిరక్షించుకొని మానవుడు మాధవుడిగా మనిషి మనీషిగా ఎదగడానికి సహకరించే పాత్రలు సన్నివేశాలు సందేశాత్మక రచనలు చేసిన తెలుగుకవులు మనసాహిత్యాన్ని, మానవసమాజాన్ని సన్మార్గంలో నడిపించారు. ప్రాచీనసాహిత్యం నుండి ఆధునికయుగం వరకు కొందరు తెలుగు కవులు ప్రబోధించిన మానవతావిలువలను పరిశీలించడమే ప్రస్తుతవ్యాసరచన పరమోద్దేశము.

నైతిక విలువలు- మానవత:

మానవుడు నైతికవిలువలతో మానవత్వాన్ని చాటుతూ సామాజికశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని జీవించడమే మానవత అనిపించుకుంటుంది. దీనిని HUMANISM అనే ఆంగ్లపదమునకు సమానార్థకంగా నేడు వాడుతున్నారు. పాశ్చాత్యదేశాలలోని ఈ వాదము బ్రహ్మసమాజముద్వారా మన తెలుగుసాహిత్యంలో ప్రభావం చూపించింది. ఇది మహోద్యమముగా మారి సామాన్యమానవునికి సార్వభౌమునిగా పట్టాభిషేకం చేసింది. మూఢ నమ్మకాలను తొలగించి శాస్త్రీయదృక్పథాన్ని కలిగించి ప్రపంచమానవుల మధ్య అడ్డుగోడలను తొలగించి విశ్వమంతా ఒకే కుటుంబము అనే ఆదర్శభావనను వ్యాపింపచేసింది.మానవతాధర్మమే అందరినీ సక్రమమార్గంలో నిలిపి సజ్జనులుగా చేస్తుంది. ఈ విషయంలో పరుషమైన పలుకు,ఈర్ష్య,కోపం,దురాశ అనే ఈ నాలుగు దరి చేరకుండా జాగ్రత్తపడాలని మన కవులు తరచుగా తెలియజేయడం జరిగింది. సత్యాన్ని పలకడం , ఇంద్రియనిగ్రహం,తపస్సు,శుచిగా ఉండటం, సంతోషం , సహనం మంచి స్వభావం, జ్ఞానము, కరుణ , ధ్యానము మానవీయధర్మలక్షణాలుగా పేర్కొనబడినవి.మనభారతీయ మహేతిహాసములైన శ్రీమద్రామాయణ మహాభారతాలలో వాల్మీకి వ్యాస మహర్షులు పరోపకారం పుణ్యమని , పరపీడనమ్ పాపహేతువని మానవులకు ప్రబోధించి మానవత్వానికి బాటలు వేయడం జరిగింది.

నాగరికత- మానవత:

ఆధునిక నాగరికతపేరుతో యువతీయువకులు సంఘంలో కట్టుబాట్లను అతిక్రమించి పెద్దలకు తెలియకుండా తొందరపడితే యువతులందరు శకుంతల వలె బాధపడి న్యాయం కోసం సత్యం కోసం పోరాడవలసి వస్తుందని తెలియజేసారు. మోసగించాలని ప్రయత్నించే యువకులు దుష్యంతునిలా తరతరాలకు నిందను భరించవలసివస్తుందని మహాభారతంలో దుష్యంతోపాఖ్యానం మనకు తెలియజేస్తుంది. మానవతావిలువలలో అత్యంతవిశిష్టమైన సత్యప్రాధాన్యాన్ని శకుంతల పాత్రద్వారా తెలియజేయబడింది.

నుతజలపూరింతబులగు నూతులు నూరిటికంటె ----- ఒక సూనృతవాక్యము మేలుచూడగన్ ||

గుణం- మానవత:

మంచి ఎక్కడనున్నా స్వీకరించడానికి మానవుడు సంకోచపడరాదని ధర్మవ్యాధుని వృత్తాంతము ద్వారా తెలియజేయబడింది. కులము కన్న గుణము ప్రధానమని ఘంటాపథంగా తెలియజేసే ధర్మవ్యాధోపాఖ్యానములో బ్రాహ్మణుడు జ్ఞానబోధనము కసాయి కులంలో పుట్టిన ధర్మవ్యాధుని ద్వారా పొందడం ఈ విషయాన్ని తెలియజేస్తుంది. తల్లిదండ్రులు ,సద్గురువు, అగ్ని, ఆత్మ అనే ఐదింటిని భక్తితో ఆరాధించడం ద్వారా తనకు విశేషమైన జ్ఞానము కలిగిందని అందువలన ముందుగా తల్లిదండ్రులకు సేవ చేసి తరించమని మానవీయ ధర్మాలు ప్రబోధించడం జరిగింది.

గురజాడ - మానవతావాదం:

వాడుకభాషకు పట్టంకట్టిన, సంస్కరణకు పెద్దపీటవేసిన మానవతావాదాన్ని ముత్యాలసరాల గేయరచనతో శుభస్వాగతం పలికిన గురజాడ అప్పారావు గారు ఆధునికసాహిత్యానికి యుగకర్తగా ప్రసిద్దికెక్కారు. వీరి ప్రసిద్ధసాంఘికనాటకం కన్యాశుల్కము మానవీయవిలువలకు మహాభాష్యంగా పేర్కొనబడింది. మనిషి అనే గేయంలో గుడిలో దైవాన్ని కొలుస్తు ప్రక్కనే నిలబడిన సాటి మనిషిని నిరసించే మానవుని అజ్ఞానాన్ని ఇలా తెలియజేస్తున్నారు.

మనిషి చేసిన రాయి రప్పకు మహిమకలదని సాగి మ్రొక్కుతు మనుషులంటె రాళ్ళకంటె కనిష్టంగా చూస్తావేల బేల

ఈయనే మరొకచోట దేశమనే వృక్షము ప్రేమలనే పూలతో పరిమళించాలని , జాతులు మతాలు అన్నదమ్ములవలె మెలగాలని , శ్రమతత్వంతో మానవజీవనం అభివృద్ధి ఫలాలను పొందాలని గురజాడవారు మానవతా శంఖాన్ని పూరించారు.

ఇదే విధంగా నవయుగకవిచక్రవర్తి గుర్రం జాషువాగారు , అభ్యుదయకవితారథసారథి శ్రీశ్రీ , దేవరకొండ్ బాలగంగాధరతిలక్ , కరుణశ్రీ గా ప్రసిద్ధికెక్కిన జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు తమ కవితలలో అకుంఠింతమైన మానవీయ పతాకాన్ని ఎగురవేసారు.

ముగింపు:

నాటినుండి నేటివరకు నిరంతరపరిణామశీలంగా సాగుతున్న తెలుగు సాహిత్యాన్ని పరిశీలిస్తే పూలదండలో దారంలా మానవతా విలువలను కవులు ముక్తకంఠంతో ప్రబోధించిన విషయం స్పష్టమౌతున్నది. మానవత్వం లేని జీవితం వాసనలేని పూవులా , మాధుర్యం లేని ఫలంలా , శ్రావ్యతలేని గానం లా , ఏకాగ్రత లేని ధ్యానంలా , గమ్యం లేని ప్రయాణంలా, లక్ష్యం లేని సాధనలా, చిత్తశుద్ధి లేని పూజలా , సందేశం లేని సాహిత్యం లా నిరర్ధకం అవుతుంది.

ఉపయుక్త గ్రంథ సూచి:

1. శ్రీరామమూర్తి, కొర్లపాటి, తెలుగు సాహిత్య చరిత్ర.
2. కవిత్రయ భారతం, ఆది, అరణ్య పర్వాలు, తితిదే ప్రచురణ.
3. వెంకటప్పారావు, గురజాడ, దేశభక్తి.
4. వెంకటప్పారావు, గురజాడ, కన్యాశుల్కం.
5. నారాయణరెడ్డి, సి., ఆధునికాంధ్రకవిత్వం - సంప్రదాయాలు - ప్రయోగాలు.