వ్యాస ప్రధానోద్దేశం:

కళింగాంధ్రకు చెందిన అముద్రిత కావ్యం 'శ్రీరామలీలావిలాసము'ను పరిచయం చేయటం ఈ వ్యాస ముఖ్యోద్దేశం:

 ప్రథానాంశాలు/ కావ్యపరిచయం:

"వాల్మీకి గిరి సంభూతా రామసాగర గామినీ !

శ్రీమద్రామాయణీ గంగా పునాతి భువన త్రయమ్ !"

 అలనాడెప్పుడో వాల్మీకి అనే పర్వతం నుంచి ప్రభవించిన రామాయణ గంగ నాటికీ, నేటికీ లోకాలను పావనం చేస్తూనే ఉన్నది. కలం పట్టిన  ప్రతి భారతీయుడూ రామకథను స్పృశించకుండా కావ్యరచన చేయలేదు. కవులే కాదు- ఇతర కళాకారులు కూడా రాముని చరితను పాడారు, చిత్రించారు, నర్తించారు, ఆడారు,మలచారు.  పండిత, పామరరంజకమైన రామకథను తెలుగుకవులు అనేక  ప్రక్రియల్లో రచించారు. హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట మొదలైన కళారూపాల్లోనూ రామకథ తెలుగునాట విస్తరిల్లింది. రామలీల నాటకరూపంలో ఉత్తర భారత దేశంలో ప్రచారంలో ఉన్నది. రాజస్థాన్, మధుర, బృందావనం, ఆగ్రా, కాన్పూర్ మొదలైన ప్రాంతాల్లో ప్రముఖంగా ప్రదర్శింపబడే రామలీల దక్షిణ భారతంలోని మైసూరు,రామేశ్వరంవంటి ప్రదేశాలలో కూడా ప్రదర్శింపబడేదని 'హిందీ సాహిత్యకోశ్' వలన తెలుస్తున్నది.

ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా 19వ శతాబ్దంలో విజయనగరాధీశుడైన పూసపాటి విజయ రామగజపతి ప్రేరణతో రామలీల ప్రదర్శితమైంది. విజయనగర పాలకులకు వారణాసితో సంబంధం ఉండేది. విజయరామ గజపతి తాను బాల్యంలో వారణాసిలో దర్శించిన రామలీలస్మృతితో విజయ నగరంలో ప్రదర్శింపజేసాడు. ఆ విధంగా విజయరామ గజపతి శ్రీకారం చుట్టిన రామలీల తరువాతికాలంలో విశాఖపట్టణం మొదలైన చోట్లకూడా ప్రదర్శితమయింది.విశాఖలో రామలీలప్రదర్శన మహోత్సవం అపూర్వమైనదని శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రిగారి రచనల వలన తెలుస్తున్నది

తులసీదాసు రచించిన 'రామచరితమానస్'కు ప్రథమ తెలుగు అనువాద ప్రతి విజయనగర రాజుల పుస్తక భాండాగారంలో లభ్యమయింది. ఈ లిఖిత ప్రతి డా. భీమసేన్ నిర్మల్ గారి సంపాదకత్వంలో (సుందరకాండ వరకు) ప్రచురింపబడింది. 19 వ శతాబ్దానికి చెందిన శ్రీ శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి, శ్రీమండ కామయ్య శాస్త్రి అనే ఇద్దరు కవులు తెలుగులో 'రామచరితమానస్"ను అనువదించారు. ఈ కవిద్వయం  దోహా - చౌపాయీ  రూపంలో కావ్య రచన చేసారు.

విజయరామ గజపతి పట్టాభిషేక సమయంలో రామలీల అద్భుతంగా ప్రదర్శింపబడింది. ఈ ప్రదర్శనను కనులారా తిలకించిన ఆ రాజు ఆస్థాన కవి పోడూరి వెంకటరాజు 'శ్రీ విజయరామ గజపతి పట్టాభిషేక మహోత్సవ రామలీలా విలాసము' అనే పేరుతో ప్రబంధాన్ని రచించాడు. ఈ రచన సంస్కృతభాష మేళవింపుతో, వివిధ వర్ణనలు, అలంకారాలతో, వివిధ ఛందస్సులతో కూడిన పద్యాలతో, గద్యాలతో చంపూ శైలిలో సాగింది. కవి దీనిని ప్రబంధంగానే పేర్కొన్నారు. ఈ ప్రబంధంలో మూడు ఆశ్వాసాలు, 928 గద్య, పద్యాలున్నాయి. నైమిశారణ్యానికి వచ్చిన దేవర్షి నారదునికి, రౌమ హర్షిణికి మధ్య జరిగిన సంభాషణారూపంలో రచనా పద్ధతి కొనసాగింది. ఈ  వక్తృ, శ్రోతృ క్రమం పురాణరచనా ప్రభావంగా భావించ వచ్చు.

ఆశ్వాసాంత గద్యలో ఉన్న విషయాలను బట్టి ఆ ఆశ్వాసంలోని ఇతివృత్తం, కవిని గురించిన సమాచారం తెలుస్తున్నది. శ్రీ సీతా లక్ష్మణ, భరత, శతృఘ్న, హనుమదాది సమేత శ్రీరామచంద్ర మూర్తికి ఈ కావ్యం అంకితమనే విషయం కూడా ఆశ్వాసాంత గద్యనుబట్టి తెలుస్తున్నది. రామభక్తుడైన ఈ కవి పోతన వలె సహజ పాండిత్య బిరుదాంకితుడు. కావ్యరచనాకాలం ప్రమాదీచ, ఆనందనామ సంవత్సరాలు. ప్రమాదీచ ఫాల్గుణ బహుళ గురువారంనాడు ప్రథమాశ్వాసాన్ని,ఆనంద చైత్రశుక్ల బుధవారంనాడు ద్వితీయా  శ్వాసాన్ని,గురువారంనాడు తృతీయాశ్వాసాన్ని రచించాడని ఆశ్వాసాంత గద్యలనుబట్టి తెలుస్తున్నది. అంటే క్రీ.శ. 1854 సం. ఏప్రిల్ 13, గురువారం. కావ్యంలో వర్ణితమైన విషయాలు అశ్వాసాల వారీగా ఉన్నాయి.

 ప్రథమాశ్వాసము:

భక్తిపూర్ణ మనస్కుడైన కవి ముందుగా దేవతాస్తుతి, పూర్వకవిస్తుతి చేసి తన వంశాన్ని గురించి ప్రస్తావించాడు. ఈవిధంగా మంగళాచరణం పూర్తయిన తరువాత కవి తన కావ్యరచనకు ప్రేరణను గురించి చెప్పాడు. కవికి ఒకనాటి రాత్రి కలలో శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చాడట. శ్రీరాముడు కవితో భూలోకంలో, మా సూర్యవంశంలో పూసపాటి పేరుతో ప్రసిద్ధమైన వంశంలో నా భక్తుడు విజయరామ గజపతి జన్మించాడు. అతని జననాది విషయాలను, విజయనగరంలో ప్రదర్శితమైన చిత్రలీలా విశేషాలను నారద, రౌమహర్షిణి సంవాద రూపంలో సరస ప్రబంధంగా రచించి నాకు అంకితమివ్వు, సకల విద్యా స్వరూపిణి అయిన శారదాదేవి నీకు తోడ్పడగలదు. నీకు శుభం చేకూరుతుంది అని చెప్పాడట.

నైమిశారణ్య వర్ణనతో కథ మొదలవుతుంది.  సూతుడు శానకాది మునులకు భూలోకంలో ప్రసిద్ధులైన రాజుల చరిత్రలను వివరిస్తుంటాడు. ఒకనాడు నారదుడక్కడకు వచ్చాడు. సూతుడు త్రిలోకసంచారి అయిన నారదునితో తాము గొప్ప దానశీలి, రాజ్యపాలనలో మేటి, పరాక్రమధనుడు, దైవభక్తుడు, పండితుల ప్రశంసలందినవాడు అయిన రాజుగురించి తెలుసుకోవాలనుకుంటున్నామని అంటాడు. నారదుడు వారితో ఇలా అంటాడు.

"భూలోకంలో కళింగ దేశం ప్రసిద్ధమయింది. అక్కడి ప్రజలందరూ వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తారు. ఆ దేశ రాజధాని అయిన  విజయనగరం వైభవంలో, వస్తు సమృద్ధిలో సాకేత నగరంతో సాటి రాదగినది. సూర్యవంశోద్భవుడైన నారాయణ గజపతి అక్కడి పాలకుడు. అతడు దేవ, బ్రాహ్మణులపట్ల భక్తికలవాడు, ఆశ్రితులకు కల్పతరువు. నారాయణ గజపతి కుమారుడు విజయరామ గజపతి. నారాయణ గజపతి పుత్రుడు ఉదయించిన వేళ గొప్ప ఉత్సవం జరిపించాడు. జ్యోతిష్కులను పిలిపించి కుమారుని భవిష్యత్తును గురించి ప్రశ్నించాడు. వారు ఆ కుమారుడు పుణ్యచరిత కలవాడవుతాడని, శరణాగత వత్సలుడు, సార్వభౌముడు అవుతాడని చెప్పారు. దానగుణంలో కర్ణునికి, బుద్ధిలో బృహస్పతికి, శరణాగత వాత్సల్యంలో శ్రీరామచంద్రునికి, పరాక్రమంలో అర్జునునికి,లీలాచాతుర్యంలో శ్రీకృష్ణునికి,ప్రతాపంలో సూర్యునికి. సౌందర్యంలో పూర్ణచంద్రునికి, సత్యవాక్పాలనలో హరిశ్చంద్రునికి సాటి రాగలడని, తన గుణాలతో తండ్రికి ప్రీతిని కలిగిస్తాడని చెప్పారు.

విజయరామగజపతి వూర్వోక్త గుణాలతో పెరుగుతున్నాడు. ఒకనాడు నారాయణ గజపతి కాశీయాత్ర చేయాలని సంకల్పించాడు. రాజ్యభారాన్ని విశ్వాసపాత్రులైన అధికారులకు, పుత్రరక్షణ భారాన్ని ఆత్మీయులకు అప్పగించి నారాయణ గజపతి మిత్రులతో, మంత్రులతో, బంధువులతో కలిసి కాశీకి తరలి వెళ్ళాడు. అనేక గ్రామాలు దాటి కాశీకి చేరాడు. విశ్వనాథుని దర్శించాడు. కలుషహారిణి గంగలో స్నానం చేసాడు. నిత్య కర్మానుష్ఠానం   చేసి, ఈశ్వరుని అర్చించాడు. వారణాసి నమీపంలోని సుక్కులూర్ అనే ప్రదేశంలో బసచేసాడు. సూతుని కోరికపై నారదుడు కాశీ నగర మహిమను వివరించాడు.

నారాయణ గజపతి కుమారుని కాశీకి పిలిపించాడు. అనేక విద్యలలో శిక్షణనిచ్చి, ఉపనయన, వివాహాది సంస్కారాలను జరిపించాడు. ధర్మకార్యాలతో, పుణ్యాకథా శ్రవణంతో కాలం గడపసాగాడు. యువకుడైన విజయరామ గజపతి అనేక విద్యలలో ఆరితేరాడు. నారాయణ గజపతి తనకు అంత్యకాలం నమీపించిందని గ్రహించి కుమారునికి రాజనీతిని ఉపదేశించాడు. కుమారుని రాజ్యాధిపతిని చేయమని అధికారులను అదేశించాడు. విజయరామ గజపతి మరణించిన తండ్రికి శాస్త్రోక్తంగా ఉత్తరక్రియలు చేసి విజయనగరానికి బయలుదేరాడు. దారిలో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ రాజ్యానికి చేరాడు. కీలకనామ సంవత్సరం, చైత్ర శుక్లపంచమి, శనివారంనాడు కోటలో ప్రవేశించాడు. ఆ సంవత్సరమే వైశాఖ కృష్ణ పాడ్యమి నాడు సూర్యోదయ సమయంలో పట్టాభిషేక సుముహూర్తం నిర్ణయించారు.ఇక్కడ రాజు దుర్గ ప్రవేశం చేయటాన్ని కవి విపులంగా వర్ణించాడు. సూతుడు మొదలైన వారు సావధాన చిత్తులై ఈ కథను విని అనంతర కథను చెప్పమని నారదుని ప్రార్ధించారు. 

ద్వితీయాశ్వాసము:

నారదుడు నైమిశారణ్యంలోని మునులకు తరువాతి కథను చెప్పటం మొదలు పెట్టాడు. ఇక్కడ రాజు పట్టాభిషేక మహోత్సవాన్ని కవి విపులంగా వర్ణించాడు. విజయరామ గజపతి ధర్మ బద్దుడై రాజ్యపాలన చేస్తూ నిర్మలమైన కీర్తిని ఆర్జించాడు. ఆ రాజు విజయనగరంలో జరిపిన రామలీలోత్సవాన్ని నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. రాజాజ్ఞతో  రామాయణ కథకు అనురూపమైన సాకేతము, లంక, కిష్కింధ, చిత్రకూటము, జనస్థానము మొదలైన ప్రదేశాలు కల్పించబడినాయి. శ్రీరామ జనన  కథాప్రసంగాలు ఏర్పాటయ్యాయి. కపిసేన, రావణసేన, సేతుబంధం మొదలైనవి తదనుగుణమైన కల్పనతో రచించారు. శిల్పులు  రామకథకు సంబంధించిన మూర్తులను తయారుచేసారు. ఈ విషయాలను విన్న రౌమహర్షిణి నారదునితో రామకథను ఏ రూపంలో స్మరించినా భవబంధాలు తొలగిపోతాయన్నాడు. దేవతలకు కూడా శరణమిచ్చేది రామకథ.రామలీలా  ప్రదర్శన ఆంధ్రదేశంలో నూతనమైనది. అందువల్లనే కవి దీనిని పౌరాణిక పాత్రల ద్వారా పరిచయం చేసాడు.

నారదుడు రామలీల ప్రదర్శనను వివరించాడు. మహారాజు ఆదేశంతో సేవకులు విజయనగరం దక్షిణదిక్కున శత్రుదుర్భేధ్యమైన అయోధ్యను నిర్మించారు. వాయవ్యదిశలో మిథిలానగర నిర్మాణం జరిగింది. మిథిలకు సమీపంలో కిష్కింధను నిర్మించారు. అదేవిధంగా అందమైన లంకానగరాన్ని కూడా నిర్మించారు. అగస్త్యాశ్రమం, సిద్ధాశ్రమం, భరద్వాజాశ్రమం, గౌతమాశ్రమం మొదలైన అశ్రమాల నిర్మాణమూ జరిగింది. వింధ్య, గంధమాదనాది పర్వతాలు,దండకారణ్య, అశోకవనాదులు కల్పించబడినాయి.విజయనగరంలోని జలాశయాలు సరయు,తమస,గంగ,గోదావరీ నదులుగా మారినాయి.

రామలక్ష్మణ, భరత, శత్రుఘ్నుల వేషాలను అందమైన బ్రాహ్మణబాలకులు ధరించారు. జనకుడు, వశిష్ఠుడు, దశరధుడు, కౌసల్య, జానకి, శతానందుడు,జటాయువు మొదలైన రామాయణంలోని చిన్న,పెద్ద పాత్రలన్నీ కల్పించబడినాయి. విజయరామ గజపతి ఇతర రాజులతో,మిత్రులతో కలసి పట్టపుటేనుగుపై ఆసీనుడై వచ్చి రామలీలలను తిలకించాడు.

తృతీయాశ్వాసము: 

ఈ ఆశ్వాసంలో రామకథ సంక్షిప్తంగా వర్ణించబడింది. కవి బాలకాండలోని అయోధ్యానగర వర్ణన నుంచి యుద్ధకాండలోని రామపట్టాభిషేకం, రాజ్యపాలన వరకు ఉన్న కథను హృద్యంగా చెప్పాడు. చివరలో ఫలశ్రుతి ఉన్నది.- రామకథను నిష్ఠతో చదివిన వారి కోరికలు సఫలమవుతాయి. నామసంకీర్తనతో పాపాలు నశిస్తాయి. భయం తొలగిపోతుంది, వ్యాధి నివారణ జరుగుతుంది. దీర్ఘాయువు, చిరకీర్తి లభిస్తాయి. చివరలో మోక్షం ప్రాప్తిస్తుంది.

రచనావిశేషాలు:

వేంకటరాజకవి కవిత్వం ప్రసన్నమైనది. పద్యం ధారలా సాగిపోతుంది. అంగద రాయబారఘట్టంలోని ఈ పద్యాన్ని చూడండి.

   "దితిసుతకులారి సాధుభాషితవిచారి

   దుష్టసంహారి రవికుల తోయజారి

   విశృతయశుండు నసదృశవిక్రముండు

   సుప్రసన్నుండు కౌసలేయప్రభుండు"

(తృతీయాశ్వాసం)

శ్రీరామ పట్టాభిషేక సందర్భంలోని మరొకపద్యం-

"సీతామహాదేవి భాతిగా వామాంక - తలమందు ముద్దులుఁగులుకుచుండ

పవనసూనుడు పురోభాగమందున నిల్చి - యొప్పుగా చరణంబు లొత్తుచుండ

పశ్చాత్ధ్సలంబున భక్తితో సౌమిత్రి - సలలిత మౌక్తిక చ్ఛత్రమూన

పార్శ్వదేశంబులన్ భరతశతృఘ్నులు - వింజామరలుబూని విసరుచుండ

సరసమిహిరాత్మజాంగద జాంబవద్వి - భీషణాదులు సేవింప ప్రేమతోడ

శ్రుతివిధుల మునుల్ వినుతింప నతులగతుల - దాశరధిఁదనరె కిశోరతరణికరణి"

(తృతీయాశ్వాసం)

కవులు సాధారణంగా ఇష్టంతోనో, గౌరవంతోనో పూర్వకవులను అనుసరిస్తారు. అటువంటివాటికి రెండు ఉదాహరణలు.

విభీషణుడు శరణార్ధియై వచ్చిన సందర్భంలో రాముని వర్ణన:

"ఘనతరశ్యామల ఘనశరీరమువాని - నలినసుందరలోచనముల వాని" ఇది మొల్ల రామాయణం లోని -

"నీలమేఘచ్ఛాయఁ బోలు దేహమువాని - ధవళాబ్జపత్ర నేత్రములవాని" అనే పద్యానికి అనుసరణగా ఉన్నది.

అదే విధంగా దేవతలు రావణుని బాధను తొలగించుమని విష్ణువును ప్రార్దించే సందర్భంలోని-

 "మకరకిరీటాది మహిత భూషణువాని - మొగమున చిరునవ్వు మొలచువాని"

అనే పాదం పోతన భాగవతావతారికలోని  శ్రీరామ స్తుతితో పోలి ఉన్నది.కవి అక్కడక్కడా ఉర్దూ పదాలను ఉపయోగించాడు. ఉదాహరణకు నారాయణ గజపతి తన రాజ్యాన్ని అధికారులకు అప్పగించి వారణాసికి వెళ్ళే సందర్భంలో వారు అతనితో " రాజా! సునోజీ సునోజీ తుమారా హుకుం హం హమేషా హుషారిన్ చలాయింతు" మన్నారట. అంగదుడు రావణునితో ఆంజనేయుడు తన మేనత్త కుమారుడనటం వినూత్నమైన కల్పన. ఇటువంటి విశేషాలు కావ్యమంతటా ఉన్నాయి.

     "మీపురీ వైభవంబు భస్మీకరించి

       నట్టివాడు మా మేనత్తకగ్రతనయు

       డాతడును నేను వారిలో నల్పభటుల

       మిద్ధబలశాలులగువారి నెన్నతరమె" ( తృతీయాశ్వాసం)

ముగింపు:

కాశీలోని గంగానది ఆవలి తీరాన ఉన్న రామ్ నగర్ లోని రామలీలలకు, విజయనగరంలో జరిగిన రామ లీలలకు ఎంతో సామ్యమున్నది. రామ నగరంలో ఆనాటి కాశీరాజు బలవత్ సింహుడు 18వ శతాబ్దిలో రామలీలను ఆరంభించాడు. భారతేందు హరిశ్చంద్ర రామలీలను అభినయించటానికే "శ్రీరామ లీలా నాటకము'ను రచించారు. రేవామహారాజయిన విశ్వనాథ సింహుని సోదరుడు రఘురాజ సింహుడు ఆధునిక కాలానుగుణంగా రామలీలను తీర్చాడు. రామ్ నగర, విజయనగర రాజులిరువురూ రామభక్తులు కావటంవలన రామలీలను నిర్వహించారు.

తెలుగు ప్రబంధమైన ఈ 'రామ లీలా విలాసము' లోని భాష సంస్కృత పద భూయిష్ఠమైనది. శార్దూల విక్రీడితము, భుజంగప్రయాతము మొదలైన సంస్కృత వృత్తాలతోపాటు సీసము,గీతము  మొదలైన దేశీఛందోరీతులుకూడా దీనిలో ఉన్నాయి. సంస్కృత గద్య కావ్యాలలోని గద్యాల వంటివి ఈ ప్రబంధంలో ఉన్నాయి. ఉత్తరభారతంలో ప్రముఖంగా ప్రదర్శించబడే రామలీలలు తెలుగుదేశంలో ప్రదర్శించటం సాంస్కృతిక ఐక్యతకు కారణ మవుతుంది. దానికి ఈ ప్రబంధం మరింత ఉపయోగపడుతుంది. పరిశోధక విద్యార్థులు ఈ గ్రంథాన్ని పరిశోధనాంశంగా ఎన్నుకోవచ్చు పుణ్య చరితమైన రామకథా కావ్యాల పరిచయం, ఉత్తర, దక్షిణ  భారతదేశాలలో ప్రదర్శితమయ్యే రామలీలా నాటకాలు, సంస్కతీపరమైన ఏకత్వం- వీటిని వివరిస్తూ ఈ ప్రబంధాన్ని పరిశీలించటం పరిశోధకులకు మంచి గుర్తింపునిస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఆధారగ్రంథాలు:

1. శ్రీరామలీలావిలాసము - లిఖితప్రతి

2. రామ్ లీలాపర్ ఆధారిత్ ప్రబంధ కావ్య్ రామ్ లీలా విలాస్ (హిందీ వ్యాసం) - డా.తుమ్మలపల్లి రాజేశ్వరానంద శర్మ.