ఉపోద్ఘాతం:

తెలుగుకు ప్రాచీనభాష హోదా వచ్చిన తర్వాత ప్రాచీన సాహిత్యంమీద పరిశోధనలు విసృతంగా జరగడానికి అవకాశం వచ్చింది. ఆధునిక పాఠకులకు ప్రాచీన సాహిత్యాన్ని అందించడానికి డిజిటైజేషన్‌, కంప్యుటీకరణ వంటివి సాధనాలు అవుతున్నాయి. అంటే ప్రాచీన కావ్యాలను పాతపద్ధతుల్లోనే అందిస్తామంటే ఇప్పటికాలంలో కుదరని పని. అధునిక పాఠకులకు కూడా పద్యంలో ఉండే అందచందాలను అందించాలి.

పద్యం అర్ధమవడమంటే ప్రతిపదార్థ - తాత్పర్యాలను చెప్పడమనే భావన పోవాలి. ఆంతరంగికాంశాలైన రసం, ధ్వని, వక్రోక్తులను గురించే తెలుసుకోగలిగితేనే పద్యసాందర్యాన్ని పరిపూర్ణంగా అస్వాదించగలుగుతాం. పాఠకుడు కావ్యాన్ని చదివేటప్పుడు అందులోని అంతర్గత అందచందాలను గురించి. సమన్వయరూపంలో తెలుసుకోగలగాలి. అప్పుడే స్వారస్యాన్ని అందుకోగలుగుతాడు. లేకపోతే కావ్య పఠనము - లక్షణ పరిశీలన సమాంతర రేఖల్లా ప్రయాణిస్తాయి. కాని వాటి మధ్య సయోధ్యను సాధించలేం. పాఠకులు ప్రాచిన సాహిత్య సౌరభాలను ఆస్వాదించలేరు. అందుకు అనువైన ఆధునిక విజ్ఞానాన్ని వినియోగించుకోవలసిందే. కొత్తతరాల వారికి ప్రాచినభాషాసాందర్యాలను గాని, సాహిత్య మధురిమలను కాని ఆధునిక పరిజ్ఞానంతో చెప్పగలగాలి. అప్పుడే కృతకృత్యులం కాగలుగుతాం. ఆ కోణంనుండి పరిశోధనలు జరిగితే బాగుంటుందని చెప్పే ప్రయత్నమే ఈ వ్యాసం.

ప్రబంధయుగానికి చెందిన తెనాలి రామకృష్ణుని రచన అయిన పాండురంగ మాహాత్మ్యంలోని భాషను విశ్లేషించడం మాత్రమే కాదు, పాండురంగ మాహాత్మ్యాన్ని భాషాశాస్త్ర పరంగా విశ్లేషించడం కూడా. ఒక సాహిత్య గ్రంథాన్ని భాషాశాస్త్ర దృష్టితో అనుశీలించడం, భాషాశాస్త్ర సూత్రాలను అనువర్తింపచేసి విశ్లేషించడం అవసరం. సాధారణంగా పరిశోధనలు విషయ సంబంధి, విధాన సంబంధి అని రెండు రకాలు. విషయ సంబంధిలో ఆ రచనలోని విషయం సామాజికమా? తాత్తికమా? మనస్తత్వమా? వంటి అంశాల పరిశీలన కనిపిస్తుంది. విధాన పరిశోధనలో భాషాతత్తం ఎలా ఉంది? విషయనిర్వహణ ఎలా చేశాడు? వంటి అంశాల పరిశోధన ఉంటుంది. ఈ శైలీ పరిశీలన విధాన పరిశోధనకు సంబంధించింది. విధానానికి ప్రధాన భూమిక అయిన భాషకు సాహిత్య పరిశోధనలో తగిన పాత్ర ఉంది. భాషాతత్త్వాన్ని ఆవిష్కరించే భాషాశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఒక సాహిత్యగ్రంథాన్ని విశ్లేషించడం వల్ల రచనా విధానాన్ని అవగతం చేసుకోవడం సులభమవుతుంది. విధానంలో భాషా భూమికవల్ల ఏర్పడ్డ సౌందర్యాన్ని, ఆ కారణంగా ఆ గ్రంథంలో ఆవిష్కరించదగిన సాహిత్యపు విలువలనూ భాషాశాస్త్ర విశ్లేషణవల్ల గ్రహించవచ్చును. ఈ నేపథ్యంలో పాండురంగ మాహాత్మాన్ని భాషాశాస్త్ర పరంగా విశ్లేషించి, ఆ రచనలో భాషాపరమైన, సాహిత్యపరమైన సౌందర్యాలను, విలక్షణతను వివరిస్తూ... అవి భావాన్ని పరిపుష్టం చేయడానికి తోడ్పడిన వైనాన్ని గమనిద్దాం.

సాహిత్య గ్రంథాలను అనుశీలించడానికి భాషను కొలమానంగా గ్రహించి చేసిన అధ్యయనాలు తెలుగులో చాలా తక్కువ. కవుల రచనలమీద విమర్శన గ్రంథాలు వెలువరించేటప్పుడు తక్కిన అంశాలతోపాటు భాషా విశేషాలనుకూడా చెప్పడం మనకు ఆనవాయితీ. అయితే కేవలం భాషద్వారా సాహిత్య విలువను సాహిత్య విలువను అంచనావేసే ప్రయత్నం చేయాలి. ప్రబంధయుగంలోని ఇతర ప్రబంధకవుల శైలి కన్నా రామకృష్ణుని శైలి విలక్షణంగా ఉంటుందని పలువురి విమర్శకుల భావన. అయితే అవి భాషాశాస్ర సూత్రాల అనువర్తనతో వచ్చినవి కావు. భాషాతత్తాన్ని ఆధునిక భాషాశాస్త్ర అధ్యయనంవల్ల కాక సంప్రదాయ శాస్ర పరిజ్ఞానంతోనూ, తమబుద్ధిసూక్ష్మతతోనూ, ఆకళింపు చేసుకొని ఆయా పండితులు వెలువరించేవారు. అందులో ప్రధానమైనది పాండురంద విభుని పదగుంఫనము అనే ఉక్తి. ఆరుద్రగారు రామకృష్ణుడు సంస్కృతోజల్యమాన భోజనాన్ని వడ్డించారు అన్నారు. ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారు, సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యగారువంటి విమర్శకులుకూడా తమ తమ వ్యాసాల్లో రామకృష్ణుని కవితారీతుల్సి, కవిత్తభాషా తత్తాన్ని ఎంతో లో చూపుతో విమర్శించారు.

వీటి పుట్టుకకు ఆధారం రామకృష్ణుని శైలి ఆధారం. ఇతని రచనలో కనిపించే పదగుంఫనం ఏమిటి? దానిని మనం ఎలా గుర్తించగలం? వంటి ప్రశ్నలకు సమాధానాలను వస్తునిష్టతో నిగ్గుతేల్చాలి.

పాండురంగమాహాత్మ్యం 1300 పద్యగద్యలతో, 5 ఆశ్వాసాలతో ఉన్న ప్రబంధం. ఈ కావ్యంలో రామకృష్ణుని శైలిని వస్తునిష్టతకో పరిశోధించడానికి అవకాశం ఉంది. దేనిని పదగుంఫనము అంటున్నాం. సంస్కృతోజ్జ్వల్యమాన భోజనం అంటే ఏమిటి? రామకృష్ణుడే తన రచనా విధానాన్ని సూక్తినిధి అని ఎందుకు పేర్కొన్నాడు. నన్నయ తర్వాత ఈ పదాన్ని వాడింది రామకృష్ణుడే. ఇతను నిర్వహించిన సూక్తినిధిత్వం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉంది. అందుకోసం శైలీశాస్త్రాన్ని భాషాశాస్త్రాల పరిచయాన్ని, ఆ శాస్త్రాల పుట్టుపూర్వోత్తరాలను, వాటిమధ్య ఉన్న సంబంధాన్ని గమనించగలం. భాషాశాస్ర దృష్టికోణంనుండి శైలీశాస్ట్రాన్ని అవగాహన చేసుకోవాలి. ఆధునిక భాషాశాస్ర సిద్ధాంతాల నేపథ్యంనుండి శైలీశాస్త్ర సిద్దాంతాలను నిర్మించుకోవాలి. శైలీశాస్త్ర సిద్ధాంతాలలో భారతీయ, పాశ్చాత్య సిద్ధాంతాల సమన్వయం చాలా ప్రధానం. భారతీయ శైలీశాస్త్ర సిద్దాంతలను గమనించేటప్పుడు భాషాసంబంధి సిద్దాంతాలను మాత్రమే ఇక్కడ పరగణనలోకి తీసుకోవాలి. భారతీయ సాహిత్యవేత్తలు శబ్బార్థాల గురించి, వాటిమధ్య సంబంధాన్ని గురించి కూలంకషంగా చర్చించారు. ఏ ప్రాచీన సాహిత్య భారతీయ సాహిత్యవేత్త అయినా తాము చెప్పేదే సర్వస్వమని ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు. కాలానుగుణంగా, రచనానుగుణంగా వీటిలో కొంగ్రొత్త అంశాల చేరిక ఉండవచ్చునని అంగీకరించారు. కావ్యం గురించి మన ఆలంకారికుల దృష్టికోణాన్ని వివరిస్తూ, దోషాలు, గుణాలు, శబ్దాలంకారాలు, రీతి, ధ్వని, వక్షోక్తి వంటి భారతీయ శైలీశాస్త్ర సిద్దా ద్ధాంతాలను కూలంకంషంగా చర్చించాలి. అలాగే ఆధునికంగా వెలువడిన పాశ్చాత్య శైలీశాస్ర సిద్ధాంతాలను, ప్రేగ్‌, లండన్‌ భాషాశాస్త్రజ్ఞులు వెలుగులోకి తెచ్చిన సిద్ధాంతాలను గమనించాలి.

పాండురంగ మాహాత్మ్యం – శైలీవిశ్లేషణ:

శైలీ విశ్లేషణలో ప్రధానభూమికను వహించేది అగ్రీకరణం. వ్యవహార వాక్యానికి కావ్యరూపం ఇచ్చినప్పుడు కనిపించే మార్పు అగ్రీకరణం. ఉదా - ఆమె అందంగా ఉందని మనం నిత్యసంభాషణల్లో అంటూంటాం. ఇదే వాక్యాన్ని కావ్యంలో లేదా కవితాత్మకంగా చెప్పవలసివస్తే ఆమె రంభ అంటాం. ఇలా వ్యవహార వాక్యాన్ని , కవితాత్మకంగా చెప్పినప్పుడు వాక్యం మార్పుచెంది ప్రయోగింపబడడం అగ్రీకరణం. దీనిని ముకరోవ్క్‌ స్కీ అనే ప్రేగ్‌ భాషాశాస్రజ్ఞుడు ప్రతిపాదించాడు. దీనిని భారతీయ సిద్ధాంతాలలో వక్షోక్తితో తుల్యం చేయవచ్చు. ఈ అగ్రీకరణాన్ని వర్ణ, పద, వాక్య, అలంకారస్థాయిలో గుర్తించవచ్చును. శబ్జ్దాలంకారాన్నీ వర్ణస్థాయి అగ్రీకరణలో భాగాలే. ఆలంకారికస్థాయిలో ఉపమాలంకారాలు అగ్రీకరణను పొందుతాయి.

ఉదా - వనితామానససూనసాయకుడు - (3-6). ఇది నిగమశర్మ పరిచయంలో ఓం ప్రథమంగా వాడిన విశేషణం. స్ట్రీల మనసులకు మన్మథుడివంటివాడు. అగ్రీకరణార్థం - వనితామానససూనసాయకుడు. సాధారణార్థం - నిగమశర్మ చాలా అందగాడు. ఈ వాక్యల వెనుక ఉన్నది ఉపమాలంకారం. ఇక్కడ నిగమశర్మ అందాన్ని మన్మథుని అందంతో పోల్చి చెప్తున్నాడు. ఇటువంటి విశ్లేషణలు పాండురంగ మాహాత్మ్యంలో కోకొల్లలు.

అలాగే యోగ్యతాభంగం కూడా శైలిలో భాగమే. నీటితో కాల్చడం, అగ్నితో తడపడంవంటి వాక్యాలలో పదాలమధ్య యోగ్యత లేదు. అంటే ఇవి నియతినుండి వైదొలగిన వాక్యాలు. ఇవి మామూలు సంభాషణ/సంవాదంలో పొసగవు. కాని కావ్యభాషలో ఇది సాధారణం. ఇటువంటి ప్రయోగాలు ఎన్ని రకాలుగా ఈ కావ్యంలో ప్రయోగింపబడ్డాయో కూడా గమనించవచ్చు. సంధాయకం కూడా శైలీ పరిశీలనలో భాగమే. వాక్యాలమధ్య ఉండే సంబంధాన్ని విశ్లేషించడం సంధాయకం. వీటిలో శూన్యబంధం క్రియాబంధం, అర్ధబంధం వంటివి పరిశీలనార్జాలు. అర్థవిపరిణామం, మహాకావ్య నిర్మణం, వాక్యసమీకరణాలు, ఛందోసమీకరణాలు, అలంకార సమాకరణాలువంటి సమీకరణ విధానాల పరిశోధన అవసరం.

ముగింపు:

ఇటువంటి పరిశోధనా ఫలితాలను బోధనలో సమన్వయం చేసుకుంటే నూతన బోధనా పద్ధతులను పునర్మించుకోవచ్చు. ప్రాచీన సాహిత్యం అన్నా, కావ్యాలన్నా ఉన్న చులకన భావాన్ని తొలగించడానికి ఇటువంటి పరిశోధనలు దోహదపడతాయి. భావితరాలకు చక్కని మనోవికాసాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని, భాషాజ్ఞానాన్ని, విమర్శనాశక్తిని, భావవ్యక్తీకరణ విధానాన్ని అందించినవాళ్ళమవుతాం.

ఉపయుక్త గ్రంథసూచి:

1. నరసింహం, కెవిఆర్, ఆంధ్రప్రబంధాల అవతరణ - వికాసాలు.
2. రామనరసింహం, పరిమి ఆంధ్ర మహాభారతం - శైలీ పరిశీలన.
3. లక్ష్మీకాంతం, పింగళి, ఆంధ్ర సాహిత్య చరిత్ర.
4. శ్రీరామచంద్రుడు, పుల్లెల, (వ్యాఖ్య) అలంకారశాస్త్ర చరిత్ర.
5. శ్రీరామచంద్రుడు, పుల్లెల, (వ్యాఖ్య) కావ్యప్రకాశం - మమ్మటుడు
6. శ్రీరామచంద్రుడు, పుల్లెల, (వ్యాఖ్య) కావ్యమీమాంస - రాజశేఖరుడు.
7. శ్రీరామచంద్రుడు, పుల్లెల, (వ్యాఖ్య) కావ్యాదర్శం - దండి.
8. శ్రీరామచంద్రుడు, పుల్లెల, (వ్యాఖ్య) కావ్యాలంకార సూత్రవృత్తి - వామనుడు.
9. సుబ్రహ్మణ్యం, పి.యస్. , ఆధునిక భాషాశాస్ర సిద్ధాంతాలు.
10. సూర్యనారాయణ శాస్త్రి, సన్నిధానం (వ్యాఖ్య), కావ్యాలంకార సంగ్రహం.