ఉపోద్ఘాతం:

“నవభావామృత రసధుని కవితాసతి నొసట నిత్య రస గంగాధర తిలకం”అని శ్రీశ్రీ చేత కొనియాడబడిన వ్యక్తి దేవరకొండ బాల గంగాధర తిలక్.అభ్యుదయ కవితా యుగంలో వందల మంది కవులు ఒకే రకమైన భావాలను గతంలో ప్రకటించినప్పటికీ వారిలో బహు స్వల్ప సంఖ్యలో మాత్రమే కవులుగా చలామణి కావడానికి ప్రధాన కారణం వారి శైలి నైపుణ్యత.ఒక ప్రత్యేకమైన శైలి నైపుణ్యతను పుణికిపుచ్చుకుని వచన గేయపు శైలిలో తిలక్ చూపిన వరవడులవల్ల ఆ ప్రక్రియకు వన్నెతెచ్చిన వాడయ్యాడనవచ్చు అంటాడు కుందుర్తి ఆంజనేయులు.తిలక్ తను ప్రధానంగా అనుభూతి వాదినని బల్లగుద్ది చచెప్పుకున్నాడు.ఈ అనుభూతి వివాదం ఇటీవల కాలంలో భావకవితాయుగ సంబంధిఅని చెప్పబడింది.తిలక్ కవిత్వంలో అభ్యుదయ పోకడలతో పాటు భావకవిత్వపు పరిమళాలు కూడా స్పష్టంగా దర్శనమిస్తాయి.తిలక్ భావకవిత్వాన్ని రాస్తున్న కాలానికి భావకవిత్వపు పోకడలు కొంతగా తరిగిపోతూ అభ్యుదయ వీచికలు ప్రారంభమైన సంధికాలమని చెప్పవచ్చు.తిలక్ తన అనుభూతి వాద కవిత్వం ద్వారా భావ అభ్యుదయ కవిత్వాలను సమపాళ్ళలో పండిపించాడని విమర్శకుల భావన

“నా కవిత్వం”అనే కవితలో తన కవిత్వాన్ని గురించి తెలియజేస్తూ”నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు నా అక్షలు ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు”అని పలకడంలో అభ్యుదయ కవిత్వం వీచికలుతోపాటు భావకవిత్వపు పరిమళాలు కూడా తన కవిత్వంలో నిండి ఉన్నాయని చెప్పకనే చెప్పాడు.భావకవిత్వపు ప్రధాన వస్తువులైన ప్రకృతి కవిత్వం,ప్రణయ కవిత్వం,ఆత్మాశ్రయ కవిత్వం,స్మృతి కవిత్వం,భక్తి,విరహం,వేదన మొదలైన వాటిని తిలక్ తన కవిత్వంలో సుసంపన్నం చేశాడని చెప్పొచ్చు.తిలక్ కవిత్వంలో ఒక్కోకవిత ఒక్కో రకమైనటువంటి భావకవిత్వపు పరిమళాలను వెదజల్లుతుంది అని భావించవచ్చు.”అన్నా! కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చేయాలి విస్తరించాలి చైతన్య పరిధి అగ్ని జల్లినా అమృతం కురిసినా అందం ఆనందం దాని పరమావధి”అని అంటారు తిలక్.

ప్రకృతి:

తిలక్ కవిత్వంలో ప్రకృతి శోభ కొత్తదనంతో దర్శనమిస్తుంది. వర్ణనా శైలి ఎరిగిన వాడు కావడం చేత ప్రతి వస్తువు కొత్త రమణీయతను సంతరించుకున్నదిగా కనిపిస్తుంది.దీనికి సంబంధించి తిలక్ కవిత్వంలో అనేక సందర్భాలు దర్శనమిస్తాయి. ప్రకృతితో మమేకమైన ఏ కొద్ది మందికోతప్ప అనితర సాధ్యం అనిపించే ఈ విధంగా ఉంటుంది.”సంధ్య”కవితలో ప్రకృతి రామణీయత వర్ణన పరిశీలిస్తే”గగనం ఒక రేకు కన్నుగవ సోకు ఎరుపు చెక్కిళ్ళ విరిసినది చెంగల్వ సంజె వన్నెల బాల రంగు పరికిణి చెంగు చీకటిని తాకినది అంచుగా చిరుచుక్క”…అంటూ సంధ్యా సమయాన్ని చక్కని పడుచుగా పేర్కొంటాడు కవి. అంతేకాకుండా ఇలా అంటాడు కూడా”సంధ్య పెదవులు ఎరుపు కడలి అంచున విరిగి సంజె పరికిణి చెంగు ఎడద లోతుల మెరసి ఏటి కొంగల నిదుర ఎర్రగా ప్రాకింది”అంటూ ఎర్రని సూర్యకాంతిని వర్ణించిన తీరు రమణీయమైన భామినీ ముఖారవిందాన్ని గుర్తుకు తెస్తుంది. ”కవిత్వమొక మెస్మరిజం కవి కన్ను ఒక ప్రిజం”అంటాడు శేషేంద్ర.

కవి ఊహలో సత్తు రేకు కూడా స్వర్ణంవలె మెరుస్తుంది అనడానికి ఉదాహరణ అన్నట్లు “ఆ రోజులు”కవితలో కవి పొందిన భావవీచికలు ఈ కవితలోదర్శనమిస్తాయి. ”పచ్చని పచ్చిక గల మధ్య విచ్చిన తోటల మధ్య వెచ్చని స్వప్నాల మధ్య మచ్చిక పడని పావురాల మధ్య పరువానికి వచ్చిన ఆడ పిల్లల మధ్య”………అంటూ సాగే కవితలో ప్రకృతి పరవశం దర్శనమిస్తుంది.

ఆంధ్రదేశ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం. అఖండ గోదావరి పరవళ్లు తొక్కుతూ పరవశింప చేస్తుంది.సహజమైన ప్రకృతి అందాలకు నిలయమైన గోదావరి తీరం గురించి భావుకుడైన కవి చేసిన వర్ణన ప్రకృతికే కొత్త సొగసును అద్దినట్టుగా భావన కలిగిస్తుంది.”రాజమండ్రి పాటలు”కవితలో ఇలా పేర్కొంటాడు.”రాత్రివేళ రాజమండ్రి వెళుతుంటే రమ్య గౌతమీ జలాలలో కొన్ని వేల విద్యుత్ దీపాలు ప్రతిఫలిస్తాయి ఎవరీవిడధమ్మిల్లంలో ఇన్ని కాంతి లతాంతాల్ని తురుమారూ?ఎవరీవిడగుండెల్లో యిన్ని కాంక్షాకీల్ని వెలిగించారు?అని విస్తుపోతాను”………….అంటూ అఖండ గౌతమి రాత్రిపూట అందాలకు మురిసిపోతాడు కవి. వేసవిలో గోదావరి నదిలో ఇసుక తిన్నెల పైన పూచిన రెల్లుపొదలను నైలాన్ చీర కట్టిన రాజమండ్రి అనే యువతిలా గోచరిస్తుంది అంటూ కవి చెందిన భావుకత స్త్రీ రూపాన్ని మన కళ్ళముందుంచేవిధంగా ఇలా అంటాడు”గ్రీష్మంలో రెల్లుపూల బార్డర్ వేసిన నీలాల నీటి నైలాన్ చీర ఒంటి మీద నుంచి జారుతుండగా రాజమండ్రి అనే యువతి”……. అంటూ పేర్కొంటాడు.

కవి తనలో తాను తాదాత్మ్యం పొందుతూ రాత్రి సమయాన్ని తన ఊహలతో భావాలతో ఎలా గడిపాడో,తన మనసులో రాత్రి గురించిన భావనలు ఎలా దొంతరలుగా సాగాయో తెలియజేస్తూ“రాత్రివేళ”కవితలో ఇలా అంటాడు”రాత్రివేళ ఎవ్వరూ లేరింట్లో మసకగా ఉన్న విద్యుత్ దీపాల కాంతిలో ఒక్కణ్ణీ బాల్కనీలో కూర్చున్నాను.బోగన్ విల్లా పందిరిలో ఒక్క నిమిషం ఆగి తెరలు తెరల్లాగా వీచే గాలిలోంచి ఎవరిదో ఏదో మధురాతి మధుర విషాద గానం నేరుగా వచ్చి గుండెల్లోకి గుచ్చుకుంటుంది”………అంటూ సాగే కవితలో రాత్రి ఎలా తన ఊహల్లో దర్శనమిచ్చిందో ప్రతీకాత్మక పోలికతో”చేరచబడ్డ జవ్వని విడివడిన పృథుశిరోజ భారంలాగా ఈ నిమలిన మలిన మైన చెదరిన తన అందాన్ని చీకట్లతో కప్పుకుంటోంది ఒంటరిగా నాలో ఊహలలో అభివ్యక్తంలాగా వొదుగుతుంది”అంటాడు.”స్వేచ్ఛా విహారం”కవితలో పలికిన భావుకత ప్రకృతిని,ప్రణయాన్ని చక్కగా చూపిస్తుంది ”సరుగుడు చెట్ల నీడలో సరదాగా తిరుగుదాం సగం మబ్బు సూర్యుడి మీద శాటిన్ తెరలా కప్పుకుంది సంజ యెరుపు సెలయేటి మీద చల్లిన తొలి సిగ్గులా ఉంది ఒక్కసారి ఇల్లు విడిచి ఉత్సాహంగా రా చెలీ!” అంటాడు.

అంతేకాకుండా”ఒకరినొకరు చుట్టి ఉల్లాసంగా తిరుగుదాం సరుగుడు చెట్ల నీడలో విరుగుడు చేవ తోటలో…అంటూ స్వేచ్ఛా విహారాన్ని కోరుకుంటాడు. ”కొంచెం సేపు స్వప్నంలోకి గోరువంక రెక్కలతో ఎగిరి పోదామన్నీ మరచి మునిమాపు వేళ రెండు నక్షత్రాలు ముద్దు పెట్టుకున్నప్పుడు కాళ్ళమీద నిలిచి దేవతలు అసూయగా చూస్తున్నప్పుడు” అంటూ పలికిన మాటలు భావకవిత్వానికి నిజమైన ప్రతీకలుగా నిలుస్తాయని చెప్పవచ్చు.తిలక్ లోని అవ్యక్త భావనా స్వరూపానికి నిలువెత్తు సాక్ష్యంగా”దీపం”కవితలోని ఈ మాటలు పరిశీలిస్తే”ఎన్ని కోరికలు ఎన్ని ప్రవృత్తులు ఎన్ని విచిత్ర ప్రకృత్యార్భాట ఝంఝూ మరుత్తులు ఎన్ని చలత్ హేమంత వర్షానిదాఘ ఋతు శకుంతల గరుత్తులు ఈ అనంత దృశ్యం నుండి ఎంత వైశ్వానరశక్తి శిలను చీల్చి సిరలు దాల్చి చిగురించిన ప్రాణశక్తి”……అంటూ పేర్కొంటారు.తిలక్“అమృతం కురిసిన రాత్రి” కవిత భావకవిత్వ లోకంలో నిజంగా అమృత వర్షం అని చెప్పొచ్చు.ఎంతో గొప్ప భావుకతతో కవి ప్రకృతిలో లీనమై తనే ఒక ప్రకృతిగా మారి ప్రవచించిన కలవరించిన అద్భుత కవిత.తిలక్ లోని వర్ణనా శక్తికి ఊహా శక్తికి ప్రతీక ఈ కవిత. ప్రకృతిలో లీనమైన అరుదైన సంఘటనను ఈ కవితలో దర్శింప చేశారు.

”అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు నేను మాత్రం తలుపు తెరచి ఇల్లు విడిచి ఎక్కడికో దూరంగా వెన్నెల మైదానంలోకి వెళ్లి నిలుచున్నాను. ఆకాశం మీద అప్సరసలు వయ్యారంగా పరుగులు పెడుతున్నారు…అంటూ పలికిన మాటలు ఒక కొత్త లోకాన్ని దర్శింపజేసే విధానం ప్రకృతిలోని సుదూర తీరాలకు చేరవు చేసేవిగా అగుపిస్తాయి.కవి కనలేని భావమంటూ ఉండదు. కవి తాను పొందిన అనుభూతులనూ అనుభవాలనూ ఊహించి, పరవశించి, పులకించి ఆ అనుభూతులను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ అక్షర రూపం చేస్తాడు. అలా అక్షర రూపమైన కవిత అజరామరం అవుతుందనడానికి తిలక్ కవిత్వం ఒక ఉదాహరణ.

స్మృతి కవిత్వం:

”ఒక్కసారి”అనే కవితలో మనోవేదన పలికిస్తూ బాధ నిండిన హృదయంతో ఇలా అంటాడు“ఒక్కసారి ఆశ జారి నిస్పృహలో నీరసించి నేరడువంటి వేదనలో తూలిపోకు కాలిపోకు కలల బాట విడిచిపెట్టి వలపు చెలియ తొలగనెట్టి నడిరాతిరి పడిపోవకు”….. అంటూ బాధాతత్పరత కనబరుస్తాడు. ”గుండె గొంతుకలోన కొట్టాడుతాది కూకుండనీయదు కూసింతసేపు”అని అంటాడు నండూరి.తిలక్ లో కూడా అటువంటి వేదనే కుదురుగా ఉండనీయక గుండె గొంతులోనుండి అనంతమైన భావాలు పలికించిన తీరు దర్శింప వస్తుంది”నా గది స్వప్నాలతో నిండిపోయింది నా మది స్వగతాలుతో కుంగిపోతుంది ఇంకా రావెందుకు ప్రభూ శంకాకులమై ఈ రాత్రి సడలిపోతుంది…అంటూ అవధరించవెందుకు పరిపక్వమైన నా యౌవన విన్నపాన్ని నవధరించవెందుకు అసంకృదతిశయోక్తికి”…….. అంటూ తన మనోవేదనను విన్నవించుకున్నాడు కవి.ఆశల సౌధాలూ పూలపాన్పులూ ఊహాలోకాలు భావకవిత్వపు ఆలంబనలు. అటువంటి ఆలంబనలను హృదయముతో చక్కగా చిత్రించిన ఊహాచిత్రం.

”ప్రార్థన”కవితలో ఇలా దర్శింపజేశారు తిలక్.”ఆశల వెచ్చని పాన్పు మీద స్వప్నాల పుష్పాలు జల్లుకుని ఆదమరచి కాసేపు విశ్రమించడానికి అనుమతించు తండ్రీ!”…అంటూ తన వేదనను విన్నవించుకుంటాడు. స్మృతి కవిత్వమనేది భావకవిత్వంలో ఒక ప్రధాన భూమికగా దర్శనమిస్తుంది.కవి తనకు ఆప్తులూ,మిత్రులు,మరణించినపుడు లేదా దూరమైనప్పుడు వేదనతో పలికినది స్మృతి కవిత్వంగా చెప్పవచ్చు.తిలక్ కవిత్వంలో స్మృతి కవిత్వపు భావనలు మనకు దర్శనమిస్తాయి.“కొనకళ్ళకు అక్షరాంజలి”,“నెహ్రూ””దుర్మరణవార్త” మొదలైన కవితల్లో ఆయా వ్యక్తులపట్ల తిలక్ యొక్క భావ వ్యక్తీకరణ దర్శనమిస్తుంది.”అక్షర లోకంలో మీరు వారగా నిలబడి పువ్వుల్ని పూస్తున్నప్పుడు ఆ పక్క నుంచి వెళుతూ ఆఘ్రాణించి హాయి పొందిన వారిలో నేనొకణ్ణి కృత్రిమమైన మనసులు మాటలు కిచాటుగా నిండిపోయిన లోకంలో నిజాయితీగా నిండుగా పలికే గొంతు నిజంగా ఎంతో అవసరం….. అంటూ హృదయం ఉన్నవాడువు అదునూ పదునూ ఎరిగినవాడువు కథతో కవితతో తెలుగుదనం,వెలుగుదనం కలిపి పంచిన వాడవు”…. అంటూ కొనకళ్లకు అక్షరాంజలి చేశాడు .

తిలక్.భారత దేశ ప్రధమ ప్రధానమంత్రి, బాలల నేస్తం అయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరణ వార్త యావత్ దేశాన్నీ ఎలా దుఃఖ సాగరంలోకి నెట్టివేసిందో తెలియజేస్తూ అశ్రుతాంజలి ఘటించిన తీరు”నెహ్రూ”కవితలో దర్శనమిస్తుంది..”ఈ వేళ పువ్వులన్నీ రాలిపోయిన రోజు ఏకాంతంలో భూమి ధ్రువగళాలెత్తి ఏడ్చిన రోజు తెల్లని పావురం ఎండలో సొమ్మసిల్లి పోయింది తల్లి లేని పిల్లలని నీడలోకి పిలిచేవాళ్ళు లేరు”……. అంటూ యావద్దేశం తల్లి లేని బిడ్డలా మారిందని చెబుతూ నెహ్రూ మరణాంతర పరిస్థితులను ఎంతో భావుకతతో చిత్రించాడు.నెహ్రూ నిత్య యవ్వనుడని,తన కీర్తి దిగంతాల వరకు వ్యాప్తి చెందిందని చెబుతూ”ఆ తోటలో పువ్వులెప్పుడూ పూస్తాయి అక్కడ నిత్య వసంతం గడిచిన శిశిరాన్ని తలుచుకుని గజగజ వనకదాచెట్టు అతడు నిత్య యవ్వనుడు”…….. అంటూ తదనంతర పరిస్థితులను కూడా భావుకతతో ఊహించి తన కాంక్షను తెలియచేస్తాడు.ప్రణయమూర్తి అయిన కవి తన ఊహలో దర్శిస్తూ ప్రకృతి ఒడిలో పరవశించిన తీరు తన కవితల్లో తిలక్. ప్రకృతీ ప్రణయం కలిసే విధంగా తిలక్ తన రచనల్లో ఎంతో చక్కగా చిత్రించినతీరు”వానలో నీతో”కవితలో దర్శనమిస్తుంది.

”ఆకాశాన్ని మేఘం నల్లని కంబలిలా కప్పుకుంది. ఆనందం మనసులో మయూరబర్హంలా విప్పుకుంది ఆలోచనలెందుకు జవ్వనీ!విలోకించు వర్షాసంధ్యని సందేహం వదలి నా సందిటిని నిలిచి కళ్ళెత్తి చూడు”…… అంటూ ప్రకృతిలో ప్రణయాన్ని కలిపి పరవశించాడు. హృదయాంతరాలలోని బాధను వ్యక్త పరుస్తూ వేకువజాము వాతావరణంతో మమేకం చేసి”మంచు బొట్లు రాలిపడే మసక మసక వేకువ పోక చెట్ల కింద కన్నీటితో వెతికే వాణ్ని నన్ను కికురించిన కలకోసం నా కోర్కెల వెలుగుల వజ్రం కోసం…. అంటూ అర్ధరాత్రి వేళ ఊరి పొలిమేరలో తోటలో రాలిపడిన నక్షత్రాన్ని నిర్జరీ సురిచిర స్వప్నాన్ని ఏరుకొని జోబులో దాచుకుందామని ఎంత ప్రయత్నించే వాడిని……అని పలికి తాను పొందిన అనంతమైన ఆనందం దర్శంపజేశాడు.నిశాచరుడై రాత్రయితే చాలు తన ఊహా ప్రపంచంలో రాత్రంతా ఉయలలూగుతూ స్వప్నాల సౌధాలు నిర్మించుకుంటూ వాటిని కూల్చుతూ నిట్టూర్పుతో ప్రకృతితో తన ప్రపంచాన్ని విస్తృతి చేసుకున్న తీరు తిలక్ కవిత్వంలో దర్శనమిస్తుంది.

”నేను కానీ నేను”కవితలో ఒక నిశార్థ భాగంలో నక్షత్ర నివహగగనం ఓరగా భూమ్మీదకు వొంగి ఏదో రహస్యం చెబుతున్న వేళ ఒంటరిగా నా గదిలో నేను మేల్కొని….. అంటూ కవి తన ఆత్మాగతిని వ్యక్తపరచిన తీరు తెలుస్తోంది.”నువ్వు లేవు నీ పాట ఉంది”కవితలో కవి పొందుపరిచిన విరహం అసలైన భావ కవిత్వం రుచులను ఆస్వాదింప చేస్తుంది”సిగ్గిలిన సోగకళ్ళతో మల్లెపూల వాల్జడతో నువ్వు పాడిన పాట నా గుండెల దగ్గర తడబడుతూ ఏదో కొత్త భాషలో చెప్పి ఒక అందమైన రహస్యం విప్పి”…… అంటూనే నీ పాట హాయిగా గాల్లో తేలి మునిమాపు జేగురులతో కలసి దిక్కులను చుట్టి నీ మృదు చలాంగుళిచ్చవిలో కరిగి నా ఒంటిని నిమిరి”…. అంటూ పరవశం పొందుతాడు.

కవిత్వానికి వెన్నెల ఒక వస్తువు. సాధారణంగానే వెన్నెలను వర్ణించని కవి ఉండడనడంలో అతిశయోక్తి లేదు.మరి భావకవుల విషయంలో వెన్నెల ఉత్ప్రేరకం.తిలక్ వెన్నెల రాత్రులను దర్శింపజేసిన తీరు”వెన్నెల”కవితలో చక్కగా తెలియవస్తుంది.”చల్లని తెల్లని వెన్నెల అంతటా పడుతోంది మెత్తని పుత్తడి వెన్నెల భూమి ఒంటిని హత్తుకుంది…………అని పలుకుతూ ఈ వెన్నెల నా మనసులోకి జారుతోంది నా గుండె పగుళ్ళ నుండి కారుతోంది నా అంతరాంతర రంగస్థలాన”…….. అంటాడు తిలక్.

ముగింపు:

భావకవిత్వపు వస్తువులైన ఊహ,విరహం,వేదన కలగలిపి కవితరూపంలో పోతపోసిన తీరు“పోయిన వజ్రం కవితలో”నక్షత్రాన్ని కోసి సిగలో తురుముకుందా మనకున్న నా భార్య నఖక్షతాలైనా ఎరక్క రాత్రిళ్లు మేల్కొన్న నిట్టూర్పుల గాథలు……అంటూ తన అనుభూతులను చక్కగా తెలియజేస్తాడు.తిలక్ ఎంతటి అభ్యుదయ భావాలు కలిగినవాడో అంతే బావ గీతాలను చిత్రించిన చిత్రకారుడిగా దర్శనమిస్తాడు.”అమృతంపు సోనీ దోసిళ్ళతో తాగి తిరిగి వచ్చాను దుఃఖాన్ని చావుని వెళ్ళిపోమన్నాను కాంక్షా మధుర కాశ్మీరాంబరం తప్పుకున్నాను”….. అంటూ తాను పలికిన మాటలు అక్షర సత్యాలని చెప్పవచ్చు.భౌతికంగా తిలక్ లేకపోయినప్పటికీ తిలక్ కవితాపరిమళాలు సజీవంగానూ,ఎప్పటికప్పుడు నూతనంగానూ పరిమళిస్తాయని చెప్పవచ్చు.కవితామృతం తాగిన తిలక్ సాహిత్య లోకంలో యశఃకాయుడుగా నిలిచారు.

ఆధార గ్రంథాలు:

1. ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయలు ప్రయోగాలు – సినారె.
2. తెలుగు సాహిత్య ప్రక్రియలు-ధోరణులు - ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు.
3. అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి - దేవరకొండ బాల గంగాధర తిలక్.