ఉపోద్ఘాతం:

వెయ్యి సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్రలో ప్రక్రియలను పరిశీలిస్తే ఇతిహాసం, పురాణం, కావ్య, ప్రబంధం, పద కవిత్వం , యక్షగానం, శతకం, నవల, కథ కథానిక , మొదలైన ప్రక్రియలుగా ప్రాచీన, ఆధునిక ప్రక్రియలు తెలుగు సాహిత్యంలో కనిపిస్తున్నాయి.

ప్రాఙ్నన్నయ యుగం తో ప్రారంభమైన తెలుగు సాహిత్య యుగ విభజనలో శ్రీనాథయుగం (క్రీ.శ. 1350- 1500) ఆరవది. దీనికి కావ్య యుగమని పేరు. ఈ యుగం తెలుగు సాహిత్యంలో ప్రత్యేకతను సంతరించుకుంది. భారతీయ సంస్కృతికి మూల స్తంభాలలో ఒకటైన మహాభాగవతం ఈ యుగంలోనే వచ్చింది. ప్రక్రియా వైవిధ్యంతో క్షేత్ర మాహాత్మ్యా లు, కథాకావ్యాలు, వీరకావ్యాలు, పురాణాలు, ద్విపద కావ్యాలు వంటివి చాలా ఈయుగంలో వెలుగుచూశాయి. వాటిని ఈ పరిశోధనా పత్రం లో పరిచయం చేస్తున్నాను.

1. ఇతిహాసం:

ఒక కాలమున ఒక రాజ వంశమునకో, ఒక జాతికో సంబంధించిన చారిత్రకాంశము గలది ఇతిహాసము (పింగళి లక్ష్మీకాంతం నా రేడియో ప్రసంగాలు) . రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. "ఇతి" -"హాస" అంటే ఇలా జరిగింది అని అర్థం. ఇది ఒకప్పుడు చరిత్రకు పర్యాయపదంగా వాడారు.

 

కావ్యయుగం - రామాయణ సంబంధ కావ్యాలు:

"శ్రీనాథుడు రామాయణము పాట రాశాడనీ, కానీ అది అలభ్య గ్రంథమని బూదాటి వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు" (తెలుగు సాహిత్య ప్రక్రియలు- ధోరణులు పుట 43).  ఈ రామాయణ పాట గురించి ఇతర వివరాలు ఏవీ అందుబాటులో లేవు.

ఇదే యుగంలోని విశిష్ట కవి, సంకీర్తనాచార్యుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ద్విపద రామాయణం రాశాడని ప్రతీతి. కానీ అది కూడా అలభ్యం. ( జి నాగయ్య తెలుగు సాహిత్య సమీక్ష మొదటి భాగం పుట 576). అన్నమయ్య జీవిత చరిత్రను సమగ్రంగా ద్విపదలో రాసిన అతని మనుమడు చిన్నన్న, "ప్రవిమల ద్విపద ప్రబంధ రూపమున నవముగా" రామాయణాన్ని అన్నమయ్య రాశాడని చెప్పాడు. (తాళ్ళపాక చిన్నన్న అన్నమయ్య చరిత్ర (ద్విపద) పుట 45).

అంతేకాకుండా అన్నమయ్య వాల్మీకి రామాయణాన్ని సంకీర్తనాత్మకంగా తెలుగులో రచించాడట. ఇది ద్విపద రామాయణాల కంటే భిన్నమైంది. ఈ రెండు రచనలు ప్రస్తుతం అలభ్యాలు (జి. నాగయ్య తెలుగు సాహిత్య సమీక్ష మొదటి భాగం  పుట. 576).

శ్రీనాథ యుగంలో  రామాయణేతివృత్తంతో "వాసిష్ఠ రామాయణం", "మైరావణ చరిత్ర" అనే కావ్యాలు వచ్చాయి.

వాసిష్ఠ రామాయణం:

శ్రీనాథయుగం లో రామాయణానికి సంబంధించిన కావ్యాల్లో మొదటిది వాసిష్ఠ రామాయణం. దీన్ని మడికి సింగన రాశాడు. పద్మపురాణం ఉత్తరఖండం భాగవత దశమ స్కంధం (ద్విపద), తెలుగులో మొట్టమొదటి సంకలన కావ్యమైన సకల నీతి సమ్మతం సింగన ఇతర రచనలు.

వాసిష్ఠ రామాయణానికి "యోగవాసిష్టం" అనే నామాంతరం. వేదాంత ప్రబోధకమైన ఈ ప్రబంధంలో ఐదు ఆశ్వాసాలు ఉన్నాయి. దాదాపు 1200 పద్యాలు. ఇది అహోబల నరసింహ స్వామికి అంకితం. పదహారేళ్లకే సంసారం అంటే విరక్తి కలిగిన శ్రీరాముడికి, విశ్వామిత్రుడు కోరిన విధంగా, వశిష్టుడు జ్ఞానబోధ చేయడం ఇందులో కథాంశం. వైరాగ్యం, ముముక్షువు, ఉత్పత్తి, స్థితి, ఉపశమనం, నిర్వాణం, అనే ఆరు ప్రకరణాలు ఇందులో ఉన్నాయి. జటిలమైన ఆధ్యాత్మిక విషయాలను సుకుమారమైన కవిత్వంతో, సుబోధకంగా సింగన ఈ కావ్యంలో చెప్పాడు.

కం. తన బుద్ధి వికల్పనమున

జనియించు జగంబు! దాని సంక్షయమున నా

శన మొందును సంసారం

బని మదిగను మిదియె నిశ్చితార్థము పుత్రా!  

(వా. రా. 1 ఆ. 139 వ పద్యం)

మైరావణ చరిత్ర:

కావ్య యుగంలో రామాయణ కథా సంబంధ కావ్యాలలో లభిస్తున్న వాటిలో రెండవది మైరావణ చరిత్ర. దీని కర్త మాడయ కవి. ఇందులో 3 ఆశ్వాసాలు ఉన్నాయి.మాడయ కవి దీన్ని అబ్బయ్య గారి గోప మంత్రికి అంకితం చేశాడు. మైరావణుడు రావణుడి మేనమామ. రామాయణంలో మైరావణుడు రామ రావణ యుద్ధ సమయంలో మాత్రమే కనిపిస్తాడు.

రామలక్ష్మణులను తీసుకురావడానికి పాతాళ లంక కు వెళ్ళిన హనుమంతుడికి మత్స్యవల్లభుడు అనే కొడుకు ఉన్నాడని తెలుసుకున్న తరువాత,

తే.గీ  తండ్రి బిడ్డలు తమలోన తగవు తప్పి

కలహ మెక్కించ  గారాదు గాన నాకు

బుత్ర నిను జూచి మోహంబుపుట్ట దొడగె

నలిగి పోరాట జిత్తంబు గొలుపదింక       

(మై.చ. 2 ఆ. 102 వ పద్యం)

భారత కథా సంబంధ కావ్యాలు:

శ్రీనాథ యుగంలో భారత కథకు సంబంధించి 3 కావ్యాలు లభిస్తున్నాయి. పిల్లలమర్రి పినవీరభద్రుడు రాసిన శృంగార శాకుంతలం, జైమినీ భారతం అనే రెండు కావ్యాలు భారత సంబంధ కథలే. అలాగే తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క రాసిన "సుభద్రా కల్యాణాని"కి కూడా భారత కథే మూలం.

ధనంజయ విజయం శ్రీనాథుడి అలభ్య రచనల్లో ఒకటి. ధనంజయుడు అంటే అర్జునుడు. కాబట్టి ఈ రచన కూడా భారత కథ సంబంధిగా  ఊహించవచ్చును. "బాల భారతం" వచనం అనే గ్రంథాన్ని 15వ శతాబ్దం ఉత్తరార్థంలో ఉన్నా "ప్రోలుగంటి చెన్నశౌరి" రాశాడట. అదికూడా అలభ్యం.

 తే.గీ. "భారత ప్రోక్త కథ మూల కారణముగ

గాళిదాసుని నాటక క్రమము కొంత

తావ కోక్తికి నభినవ శ్రీ వహింప

 గూర్మి కృతిసేయు నాకు శాకుంతలంబు"     

(శృం.శా. 1 ఆ. 27వ పద్యం)

భారతంలోని మూలకథకు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం లోని కొంత కథను కలిపి కావ్యంగా రాసి తనకు అంకితమిమ్మని చిల్లర వెన్నయామాత్యుడు పిన వీరభద్రుణ్ణి కోరాడు. వీరన ఈ రెండు కథలను కలిపి తగిన విధంగా తన ప్రబంధానికి అనుకూలంగా ఉపయోగించుకున్నాడు.

జైమిని భారతం:

శకుంతలా పరిణయము కన్నా జైమిని భారతానికే ఎక్కువ ప్రశస్తి ఉంది. జైమిని భారతాన్ని పిన వీరన సాళువ నరసింహరాయలకు (1485-93) అంకితం చేశాడు. భారత అశ్వమేధపర్వ కథే జైమినీ భారతంలో ఉంది. దీన్ని సంస్కృతం నుండి తెనిగించాడు. జైమిని భారతం ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధం. అందులో అద్భుతమైన వృత్తాంతాలెన్నో ఉన్నాయి. సంస్కృతంలో 5179 శ్లోకాలు, 68 అధ్యాయాలున్నాయి. దీన్ని 1479 గద్య పద్యాలలో ఎనిమిది ఆశ్వాసాలలో అనువదించాడు.

 

ఉ. దుర్జయ రాజమండల విధుంతద మూర్తి యుధిష్ఠిర క్రతూ

త్సర్జితమైన యీ హయవతంసము త్రిమ్మర  నంగరక్షగా

నర్జును డేగుదెంచె నిటలాక్షుని గెల్చిన జోదు విక్రమో

పార్జిత లీల బట్టుడు రయంబున శూరులు ధాత్రిగల్గినన్"  

(జై. భా. 4ఆ. 7 వ పద్యం).

 

ధర్మరాజు అశ్వమేధయాగం చేస్తూ యాగాశ్వం నుదుటన పత్రం మీద ఈ పద్యం రాసి పంపిస్తారు.

 

సుభద్రా కళ్యాణం:

అర్జునుడి తీర్థయాత్రతో కావ్యం ప్రారంభమై, అంగ వంగ కళింగ బంగాళా దేశాలు తిరిగి, తీర్థాలలో స్నానం చేసి యాత్రలు చేస్తూ, ఉలూచిని, చిత్రాంగదను, సుభద్రను అర్జునుడు పెళ్లి చేసుకోవడం కథాంశంగా కలిగిన మంజరీ ద్విపద కావ్యం సుభద్రా కళ్యాణం. తాళ్ళపాక తిమ్మక్క స్త్రీ జనోపయుక్తంగా, శృంగార రసోపేతంగా రాసింది. ఉలూచి అనే నాగకన్య కు "ఇరావంతుడు" అనే కొడుకు పుట్టాక అర్జునుడు-

అనగ ధర్మ స్థితి కాత్మమోదించి

అచట పుత్రునిగాంచి ఆనాతి కొసగి

మనమున నుప్పొంగి మరునాడు వెడలే    ( సు.క. పుట 5)

2. పురాణ ప్రక్రియ:

వేదాలు ప్రభు సమ్మితాలయితే, పురాణాలు మిత్ర సమ్మితాలు. అంటే మిత్రుల్లాగా హితాన్ని చెబుతాయని అర్థం. అధర్వణ వేదంలో "ప్రాచీన కథ" లేక "పూర్వ కథ" అనే అర్థంలో పురాణ శబ్దం  రూఢికెక్కింది. పురాణ శబ్దాన్ని అనేకులు అనేక రకాలుగా నిర్వచించారు. "అలౌకిక ములను అద్భుతములను అయిన భవల్లీలా కథనములతో నిండినది పురాణము", 6( పింగళి లక్ష్మీకాంతం నా రేడియో ప్రసంగాలు పుట 133) 1.సర్గ 2. ప్రతిసర్గ, 3 వంశం, 4. మన్వంతరం.5 వంశానుచరిత్ర అనే ఐదు భాగాలు పురాణాల్లో ఉంటాయి.

అష్టాదశ పురాణాలను తెలిపే శ్లోకం:

 "మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వ చతుష్టయం

అనాప లింగ కుస్కాని పురాణాని నవ ద్వయం"

 

శ్రీనాథయుగంలో ప్రఖ్యాతమైన నాలుగు పురాణాలను కవులు అనువదించారు. భాగవతాన్ని పోతన, పద్మపురాణాన్ని మడికి సింగన, వరాహపురాణాన్ని జంటకవులు నంది మల్లయ ఘంటసింగయలు, విష్ణుపురాణాన్ని వెన్నెలకంటి సూరనలు చక్కని శైలితో ఆంధ్రీకరించారు.

భాగవతం:

సంస్కృతంలో వ్యాస ప్రోక్తమైన భాగవత మహా పురాణాన్ని తెలుగులో పోతన మహాద్భుతమైన సుందరకావ్యంగా, మధురంగా, శబ్దాలంకారాలతో అనువదించాడు.

మ. ఒనరన్ నన్నయ తిక్కనాదికవులీ యుర్విం బురణావళుల్

తెనుఁగుల్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో

తెనుఁగుం జేయరు మున్న భాగవతమున్ దీనిన్ దెనింగించి నా

జననంబున్ సఫలంబు జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్

(భాగవతం మొదటి స్కంధం 21వ పద్యం)

 

నన్నయ ,తిక్కనలు నా పుణ్యం కొద్దీ భాగవతాన్ని తెలుగు చేయలేదు. నేను భాగవతాన్ని తెనిగించి పునర్జన్మ లేకుండా చేసుకుంటాను. అని పొంగిపోయాడు పోతన. తెలుగు సాహిత్యంలో అత్యంత జనప్రియమైన సహజకవి పోతన.

పద్మ పురాణం ఉత్తరాఖండాన్ని, ద్విపద భాగవత దశమ స్కంధాన్ని మడికి సింగన రచించాడు. రాచమల్లు కవులుగా పేరున్న నంది మల్లయ ఘంట సింగయలు వరాహ పురాణాన్ని అనువదించారు. విష్ణుపురాణాన్ని వెన్నెలకంటి సూరన రచించాడు.

3. కావ్య ప్రక్రియ:

భారతీయ సాహిత్యంలో కావ్యానికి ఒక విశిష్టత ఉంది. భాషలు నేర్చిన మానవుడు భావావేశంతో హృదయానుభూతుల్ని గానం చేసినప్పుడే కావ్య సంప్రదాయం పుట్టింది. తెలుగు సాహిత్యానికి లక్షణాలు సంస్కృతంలో ఉంటే లక్ష్యాలు తెలుగు లో ఉన్నాయి. శ్రీనాథ యుగం కావ్య యుగంగా పిలవడానికి కారణం, శ్రీనాథమహాకవి నిర్వహించిన కావ్య ప్రయోగ ప్రాబల్యం.

శ్రీనాథుడు కావ్య యుగంలో స్థిరపడటానికి ప్రధాన కారణం శ్రీనాథుడు కావ్య స్పృహను బ్రతికించి, పోషించి,నిర్వహించటం భావితరాలకు అందించటం. కావ్యం తరతరాలుగా జీవిస్తూనే ఉంది. సంస్కృత నైషధానికి, శ్రీనాథుడి అనువాదమైన శృంగార నైషధం అద్భుతమైన కావ్యంగా విలసిల్లుతోంది.

క్షేత్ర మాహాత్మ్య కావ్యాలు:

శ్రీనాథయుగంలో శ్రీనాథుడు రచించిన భీమేశ్వరపురాణ, కాశీఖండాలు క్షేత్ర మాహాత్మ్య కావ్యాలు. అలాగే భైరవ కవి రచించిన శ్రీరంగ మహాత్మ్యం కూడాను. శ్రీనాథుడి భగవద్భక్తి తత్పరతకు, సర్వశాస్త్ర విజ్ఞానానికి దర్పణాల్లాంటివి కాశీఖండ భీమఖండాలు.

మ: హరచూడా హరిణాంక వక్రతయు ,గాలాంతః స్ఫురచ్చండికా

పురుషోద్గాఢ పయోధర స్ఫుటతటీ పర్యంత కాఠిన్యమున్,

సరసత్వంబును,, సంభవించె ననగా,సత్కావ్యమున్ దిక్కులం

జిరకాలంబు నటించుచుండు, గవిరాజీ గేహరంగంబులన్!  ( భీ. 1- 11 పద్యం)

 

విలాస కావ్యాలు:

శ్రీనాథుడి హరవిలాస కావ్యం తోనే, తెలుగు సాహిత్యంలో విలాస కావ్య విజృంభణం జరిగింది. దొరుకుతున్న విలాస కావ్యాలలో "హరవిలాసం" మొదటిది. నన్నయ్య చాముండికా విలాసం, నన్నెచోడుని కళావిలాసం, నాచన సోముడు వసంత విలాసం హరి విలాసం అనే కావ్యాలు అలభ్యాలు. శ్రీనాథుడు హరవిలాసాన్ని అవచి తిప్పయ శెట్టికి అంకితం చేశాడు. విలాస శబ్దానికి శ్లేషణ క్రీడలు అనే అర్ధాలే కాకుండా లీలా మహాత్మ్యాలు అన్న అర్థం కూడా ఉంది.

శ్రీనాథయుగంలో నిశ్శంక కొమ్మన రచించిన శివలీలా విలాసం కూడా విలాస కావ్యమే. కొమ్మన శ్రీనాథుడి సమకాలికుడు. అష్టభాషా కవితా ప్రవీణుడు. శివలీలా విలాసంలో 36 శివలీలలు వర్ణించినట్లుగా నిశ్శంకకొమ్మన గ్రంథాదిలో చెప్పినా, లభించిన గ్రంథంలో 13 శివలీలలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇది దొడ్డారెడ్డికి అంకితం.

కం. బుధుల గమనీయ కవితాం

బుధుల గళావిదుల జారు పూర్ణేందు వచో

విధుల బ్రణుతింతు నెప్పుడు

నధునాతన కవుల మతిజితాంబర కవులున్        

(శి. వి. 1 ఆ. 13వ పద్యం).

ద్విపద కావ్యాలు:

పాడడానికి అనువైన ఛందస్సు ద్విపద. రెండు పాదాలు కలిగిన ఒక ప్రత్యేక చందస్సు తెలుగులో ద్విపదగా పరిగణింపబడుతోంది. శ్రీనాథయుగంలో చిన్నవి పెద్దవి కలిపి మొత్తం 12  ద్విపద కావ్యాలున్నాయి. తెలుగులో మొట్టమొదటి వీరగాథా కావ్యం పల్నాటి వీర చరిత్రను శ్రీనాథుడు మంజరీ ద్విపదలో రచించి చెన్నకేశవస్వామి అంకితమిచ్చాడు.

గౌరన రచించిన నవనాథ చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం, మడికి సింగన ద్విపద భాగవతం( దశమ స్కంధం), నాదెండ్ల ఉమాపతి మాయాచిదానంద మంజరి, కొలని గణపతిదేవుడి మనోబోధ, పిడపర్తి బసవన్న దీక్షాబోధ, పోశెట్టి లింగన నవచోళ చరిత్ర, తాళ్ళపాక అన్నమాచార్యుడి ద్విపద రామాయణం, శృంగార మంజరి, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం అనే కావ్యాలు కావ్య యుగం లో వచ్చిన ద్విపద కావ్యాలు.

రూపకాలు:

సంస్కృత నాటకాలను కావ్యాలుగా అనువదించటం ఈ యుగంలోనే ప్రారంభమైంది. సమకాలీన సామాజిక స్థితిగతులను, చక్కగా ప్రదర్శించే క్రీడాభిరామం వీధి ప్రక్రియ. త్రిపురాంతకుని ప్రేమాభిరామానికి అనువాదంగా చెబుతారు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలానికి, అనుకరణగా పిల్లలమర్రి పినవీరభద్రుడు శృంగార శాకుంతలం, కృష్ణ మిశ్రుడి ప్రబోధ చంద్రోదయాన్ని, అదే పేరుతో కావ్యంగా నంది మల్లయ ఘంట సింగయలు అనువదించారు.

చం. జనకుని పక్షపాతమున సంతతమున్ బలవంతుడై నమో

హుని భుజ విక్రమంబునకు నోర్వగలేక వివేకుడాజిలో

దన బలగంబు దానును యదాయదురై చని వృత్రుకోడి పో

యిన సురరాజు చందమున నెక్కడనో యణగుండె నంతటిన్

(ప్ర.చం. 1ఆ. 44వ పద్యం)

కథాకావ్యాలు:

శ్రీనాథయుగంలో వచ్చిన కథాకావ్యాలలో శ్రీనాథుడి మరుత్తరాట్చరిత్ర, జక్కన విక్రమార్క చరిత్ర, దూబగుంట నారాయణకవి పంచతంత్రం, కొఱవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక, అనంతామాత్యుని భోజరాజీయం, కూచిరాజు ఎర్రన సకలనీతి కథానిధానం, వెన్నెలకంటి అన్నయ షోడశకుమారచరిత్ర, ముఖ్యమైనవి. ఈ యుగంలో ఆరు కథాకావ్యాలు లభ్యమవుతున్నాయి. ఈ కథాకావ్యాలన్నీ, ఆనాటి మర్యాదలు, విద్యలను, ఆచారాలను, వినోదాలను తెలుసుకోవడానికి సాధనాభూతాలైన విజ్ఞానకోశాల వంటివి.

కం. చులకన జలరుహ తంతువు

చులకన తృణకణము, దూది చుల్కన సుమ్మీ!

యిలనెగయు ధూళి చుల్కన

చులకన మరి తల్లి లేని సుతుడు కుమారా!

(భోజరాజీయం 6-30)

శాస్త్ర గ్రంథాలు:

దోనయామాత్యుడి సస్యానందం( వర్షంశాస్త్ర గ్రంథం),కూచిరాజు ఎర్రన కొక్కోకం( కామశాస్త్ర గ్రంథం)మనుమంచి భట్టు అశ్వలక్షణసారం(హయ లక్షణ విలాసం), భైరవ కవి రత్నశాస్త్రం అనే గ్రంథాలు శ్రీనాథయుగం లో లభ్యమవుతున్న శాస్త్ర గ్రంథాలు.

కం. పొలుపగు నాషాఢంబున

తొలు పాడ్యమి మృగశిరంబుతో గూడి ఘనా

వలి యాకసమున బన్నిన

వెలి యుంధర బూర్వ సస్యవితతుల తరుచై         

( సస్యానందం 2.ఆ. 42 వ పద్యం)

లక్షణ గ్రంథాలు:

గౌరవ సంస్కృతంలో రాసిన లక్షణ దీపిక, అనంతామాత్యుడి ఛందోదర్పణం( అనంతుని ఛందం), రసాభరణం( అలంకార శాస్త్ర గ్రంథం), భైరవ కవి కవిగజాంకుశం, విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణి అనేవి ఈ యుగంలో  వచ్చిన లక్షణ గ్రంథాలు. అన్నమయ్య సంస్కృతంలో రచించిన సంకీర్తన లక్షణం ఇప్పుడు అలభ్యం. మడికి సింగన సకల నీతి సమ్మతం తొలి సంకలన కావ్యం.

పురాణ సంబంధ కావ్యాలు:

శ్రీనాథుడి శివరాత్రి మహాత్మ్యానికి స్కాంద పురాణంలోని ఈశాన సంహిత మూలం. అలాగే పోతన వీరభద్రవిజయానికి వాయుపురాణం, దగ్గుపల్లి దుగ్గన రాసిన నాసికేతోపాఖ్యానానికి వరాహపురాణం, గౌరన ద్విపదలో రాసిన హరిశ్చంద్రోపాఖ్యానానికి మార్కండేయ పురాణం, ప్రౌఢకవి మల్లన రుక్మాంగద చరిత్రకు నారద పురాణం, భైరవకవి రచించిన శ్రీరంగమాహాత్మ్యాని కి గరుడ పురాణం మూలం. శ్రీనాథుడి కాశీ ఖండ భీమ ఖండాలకు కూడా స్కాంద పురాణమే మూలం.

కం. ఖండిపుము సుతునటుగా

కుండిన వ్రతమైన మాని యుండుము నీ విం

దొండైన జేయ కూరక

ఖండించిన పరమ పదము గలదె నృపాలా!        

(రు.చ. 5 ఆ. 116వ పద్యం).

కల్పిత కావ్యం:

తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కల్పిత కావ్యం శ్రీనాథయుగం లో వచ్చిన ధనాభిరామం. నూతన కవి సూరన కృతికర్త. ( 1420-1475). ఇందులో మూడు ఆశ్వాసాల లో 328 గద్య పద్యాలు ఉన్నాయి. ధనాభిరామం దక్షారామ భీమేశ్వరునికి అంకితం.

4. పద సాహిత్య ప్రక్రియ:

"పదం" అంటే "పాట" అనే సాధారణార్థం. పద కవులంతా పదం పాట శబ్దాలను ఒకే అర్థంలో వాడారు. పద్య విద్య తో కావ్యత్వానికి నన్నయ్య శ్రీకారం చుడితే, పద కవిత్వానికి పితామహుడై కీర్తి కెక్కాడు అన్నమయ్య. కృతి, కీర్తనగా ఈనాడు పిలవబడే సంగీత రచనను, అన్నమయ్య కాలంలో పదమని, సంకీర్తనమని వ్యవహరించేవారు. అన్నమయ్య కాలం క్రీ.శ.1408- 1503. అన్నమయ్య 32000 సంకీర్తనలు రచించాడని తెలుస్తున్నప్పటికీ వాటిలో దొరుకుతున్నవి సగమే. అన్నమయ్య రాసిన సంకీర్తనలలో అతి ప్రసిద్ధమైనవి శృంగార భక్తి వేదాంతాలు అవినాభావంగా రూపొందినవే.

ఇది గాక సౌభాగ్యమిదిగాక తపము మరి

యిదిగాక వైభవంబిక నొకటి గలదా?

కామ యాగము చేసె కలికి తన

ప్రేమకు దేవతా ప్రీతిగాను

వంటి కీర్తనలే ఇందుకు నిదర్శనం. అన్నమయ్య వంశంలో తరువాతి ఐదు తరాలవారు తమ సాహిత్యంతో శ్రీవేంకటపతి సమర్చించిన వారే.

5. యక్షగానం:

యక్షగానం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధమైన ఒక జానపద కళారూపం. రూపకానికి జానపద రూపమే యక్షగానం. పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్రలో యక్షగాన ప్రస్తావన ఉంది. శ్రీనాధుడు భీమేశ్వర పురాణంలో "కీర్తింతురెద్దాని కీర్తి గంధర్వులు- గాంధర్వము యక్షగాన సరణి" అంటూ గానాన్ని గురించి సూచిస్తాడు. శ్రీనాథయుగంలో సాళువ నరసింహరాయల కాలము వాడైన ప్రోలుగంటి చెన్నశౌరి (1485- 1512) సౌభరి చరిత్ర అనే జక్కుల కథను రాసినట్లుగా హరిభట్టు నారసింహపురాణ అవతారికను బట్టి తెలుస్తోంది. ఇప్పుడిది అలభ్యం.

6. దండక ప్రక్రియ:

తెలుగు సాహిత్యంలో కనిపించే మరొక సాహిత్య ప్రక్రియ దండకం. ఇది సంస్కృతం నుండి వచ్చిందే. నగణ ద్వయం పై కావాల్సినన్ని రగణాలు రాయటం, ఆపైన గురువు నుంచటం సంస్కృత దండక లక్షణం. త గణ దండకం తెలుగులో ఉంది. శ్రీనాథుడు నైషధంలో భారతీ స్తుతి, హరవిలాసంలో గణపతి దండకం, కాశీఖండంలో దక్షయజ్ఞ సందర్భంలో సతీదేవి చేసిన పరమేశ్వర స్తుతి సందర్భంలో ఒకటి, వివిధ లింగాల మహత్యాన్ని విశాలాక్షికి వివరించే సందర్భంలో మరొకటి- మొత్తం నాలుగు దండకాలను శ్రీ నాథుడు రచించాడు. పోతన వీరభద్ర విజయంలో వీరభద్రుని మునులు దేవతలు స్తుతించే సందర్భంలో దండకం ఉంది. భాగవతంలో తృతీయ స్కంధంలో శ్రీకృష్ణ స్తుతిలో శ్రీనాథా !నాథా! అంటూ ప్రారంభమయ్యే దండకం, దశమ స్కంధంలో అక్రూరస్తుతి దండకంలో 327 త గణాలు ఉన్నాయి. కొఱవి గోపరాజు సింహాసన ద్వాత్రింశికలో య,స, మ గణాల దండకం, నంది మల్లయ ఘంట సింగన వరాహపురాణంలో 3 దండకాలు, ప్రబోధ చంద్రోదయంలో ఒక దండకాన్ని రచించారు. దగ్గుపల్లి దుగ్గన నాసికేతోపాఖ్యానంలో బ్రహ్మదేవుడిపై దండకాన్ని రచించాడు.

దండకాన్ని ప్రత్యేకమైన కావ్యంగా రచించే సంప్రదాయం తెలుగులో పోతనతోనే ప్రారంభమైంది. "భోగినీ దండకం" ప్రత్యేక కావ్యంగా కనిపించే మొదటి దండకం. భోగిని సింగభూపాలుడి వలపు ఇతివృత్తంగా కలది భోగినీ దండకం.

ఉ. పండిత కీర్తి నీయుడగు బమ్మెర పోతన యా సుధాంశు మా

ర్తాండ కులాచలాంబునిధి తరకమై విలసిల్ల భోగినీ

దండకమున్ రచించె బహుదాన విహర్తకు రావు సింగ భూ

మండల భర్తకున్ విమత మానవనాథ మదాపహర్తకున్.

7. శతక ప్రక్రియ:

తెలుగులో మకుటాయమానంగా విలసిల్లుతున్న సాహిత్య ప్రక్రియ శతకం. మకుట ప్రధానంగా,ముక్తకాలుగా ఉండే శతకంలో వందపద్యాలు పైన ఎన్నైనా ఉండవచ్చును. శ్రీనాథుడు ముట్టుకోని ప్రక్రియ శతకం. కావ్యయుగంలో వెన్నెలకంటి జన్నయ్య దేవకీనందన శతకం,అయ్యలరాజు త్రిపురాంతకుని రఘువీర శతకం , పోతన నారాయణ శతకం, అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర శతకం ముఖ్యమైనవి. అన్నమయ్య మొత్తం 12 శతకాలు రచించాడట. తెలుగు సాహిత్యంలో తొలి శృంగార శతకం అన్నమయ్య రచించిన వేంకటేశ్వర శతకం.

చ. కిలకిల నవ్వు నవ్వి తిలకించితి మంచి సుధారసంబు నీ

పలుకులతేనెలన్ విభుని బట్టము గట్టితి నీదుకౌగిటన్

వలదని చెప్పినన్ వినవు వద్దు సుమీ యలమేలుమంగ నీ

కెలవు లటంచు నెచ్చెలులు కీర్తన సేతురు వేంకటేశ్వరా !  

(వెంకటేశ్వర శతకం)

ముగింపు:

150 సంవత్సరాల నిడివి కలిగిన శ్రీనాథయుగంలో 28 మంది కవులు, రచించిన 30 కావ్యాలు, మిగిలిన ప్రక్రియలకు ఇది పరిచయం. ఈ ప్రక్రియలు తదనంతర కాలంలో ప్రత్యేక శాఖలుగా అభివృద్ధి చెందాయి.

ఉపయుక్త గ్రంథ సూచి:

  1. నా రేడియో ప్రసంగాలు- పింగళి లక్ష్మీకాంతం
  2. తెలుగు సాహిత్య ప్రక్రియలు ధోరణులు- బూదాటి వెంకటేశ్వర్లు.
  3. తెలుగు సాహిత్య సమీక్ష - మొదటి భాగం - జి నాగయ్య
  4. పోతన భాగవతం- మూడవ సంపుటం టిటిడి ప్రచురణ
  5. పద్మ పురాణం ఉత్తరఖండం- ద్వితీయ భాగం -మడికి సింగన
  6. జైమిని భారతం- పిల్లలమర్రి పినవీరభద్రుడు
  7. వాసిష్ఠ రామాయణము- మడికి సింగన
  8. మైరావణ చరిత్ర -మాడయ కవి
  9. శృంగార శాకుంతలం- పిల్లలమర్రి పినవీరభద్రుడు
  10. సుభద్రా కళ్యాణం- తాళ్ళపాక తిమ్మక్క
  11. భీమేశ్వర పురాణం- శ్రీనాథుడు
  12. శివలీలా విలాసం- నిశ్శంక కొమ్మన
  13. ప్రబోధ చంద్రోదయం- నంది మల్లయ ఘంట సింగయ
  14. భోజరాజీయం- అనంతామాత్యుడు
  15. రుక్మాంగద చరిత్ర( ఏకాదశి వ్రత మహత్యం)- ప్రౌఢకవి మల్లన
  16. భోగినీ దండకం - పోతన.