ఉపోద్ఘాతం:

సృష్టిలో మరే జీవులకు లేని విశిష్టత మానవుడికి కలగడానికి కారణం అతని జ్ఞానమే. అంతటి జ్ఞానం పుష్కలంగా ఉన్నా మానవులందరూ కవులు కాలేరు. కవితా కౌశలం కలగటానికి కొన్ని హేతువులు ఉండాలి. వీటినే సంస్కృత లాక్షణికులు కావ్య హేతువులు అని పేర్కొన్నారు.

శక్తి ర్నిపుణతా లోక శాస్త్ర కావ్య ద్య వేక్షణాత్
కావ్య జ్ఞ శిక్ష యాభ్యాస ఇది హేతు స్తదుద్భవే!!

అని కావ్య ప్రకాశంలో మమ్మటుడు ప్రతిపాదించాడు. శక్తి వ్యుత్పత్తి అభ్యాసాలు మూడింటినీ కలిపి కావ్య హేతువులు అంటారు. కావ్య హేతువులనే "కావ్య సామాగ్రి" అని వ్యవహరిస్తారు. శక్తినే ప్రతిభ అంటారు. కవిత్వం అలవడడానికి స్వయం జనితమైన ప్రతిభ అవసరం. ప్రతిభతో చెప్పిన కవిత్వమే పది కాలాల పాటు నిలిచి ఉంటుంది. ఆ ప్రతిభే వ్యుత్పత్తిని పెంచుకునే విధంగా ఉంటుంది. భామహుడు "నవనవోన్మేష శాలిని" అయిన ప్రజ్ఞే ప్రతిభ అని వక్కాణించాడు. ఈ ప్రజ్ఞ ఉన్న కవి లోకోత్తరమైన కవిత్వం అందించగలడు. ఇది లేకపోతే మిగిలిన గుణాలు ఎన్ని ఉన్నా ఉత్తమ కవిత్వం అనిపించుకోదు. అందుచేతనే "కావ్యంతు జాయతే జాతు కస్య చిత్ప్రతి భావతః" అని భామహుడు అన్నాడు.

అనంత సాహిత్య పరిణామంలో ఎన్నో ప్రక్రియలు రూపుదిద్దుకున్నాయి. వాటిలో అవధానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అవధానం రూపకం ఈ రెండు కేవలం ఆంధ్రుల సొత్తుగా వివరించబడ్డాయి. అవధానం సమాధానం ప్రణిధానం తదైవచ అని అమరసింహోవాచ. "చిత్తైకాగ్ర్యం అవధానం", అన్నది దీని వ్యుత్పత్తి. ఆంధ్ర పురాణ కర్త మధునాపంతుల సత్యనారాయణ గారు సివి సుబ్బన్న శతావధాన ప్రబంధం అనే గ్రంథ పీఠిక రాస్తూ, వెనుకటి కవుల చిత్తైకాగ్ర్యం ప్రధానత, దేని యం దో దాని యందే నేటి శతావధాన ప్రక్రియ యొక్క తల్లివేరు. ఇది అచ్చంగా తెలుగు జాతిదే కానీ, విజాతి ది కాదు. ప్రపంచ సాహిత్యంలో ఇట్టి ఒకటి ఉన్నదని ఎవ్వరునూ చెప్పినది కాదు. ఈ అవధాన విధానం ఆంధ్ర సరస్వత్యుప్రజ్ఞము. ఆ మాటకు వచ్చినచో సంస్కృత భాషా పండిత కవులకు కూడా ఈ తెలుగు ప్రక్రియ ఆచార్య కమగుచున్నది. అని అన్నారు. ఈ వాక్యాలను బట్టి ఈ అవధాన విద్య ప్రాచీనత, తెలుగు లోనే పుట్టి ఇతర భాషల్లోకి వెళ్లిందని అర్థం అవుతోంది.

అవధాన పద నిర్వచనం:

"అవ" పూర్వక (డు) దాజ్- ధారణ పోషక యోః అనే ధాతువు నుండి అవధానం అనే పదం పుట్టింది. సామాన్యార్థం లో అవధానం అనే మాటకు "ఏకాగ్రత" అని అర్థం. ఇంగ్లీషులో దీనిని అటెన్షన్ అని అంటారు. అవధానాలలో సాహిత్య అవధానాల ని సాహిత్యేతరవధానలని ఉన్నాయి. సాహిత్య అవధానాలలో అష్టావధానం శతావధానం సహస్రావధానం మొదలైనవి ఉండగా, సాహిత్యేతర అవధానాలలో కొన్ని ఉన్నాయి. ఇందులో కొన్ని ధారణ సంబంధ వధానాలు, ధారనేతరావధానాలు ఉన్నాయి.

వేదావధానాలు:

శతావధాని చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారు కథలు గాథలు అనే గ్రంథంలో అవధానం వేదాన్ని అధ్యయనం చేసే వారి పని అని రాశారు. ఇది మొట్టమొదట వేదవ చేయం చేసిన వారు చేసే పనిగా సంప్రదాయజ్ఞులవల్ల వింటాము. వేదంలో ఘన, మాల శిఖ ఇత్యాది భేదాలున్నాయి. వాటికి సంబంధించిన అవధానాన్ని వారు చేసేవారని వినికిడి.

స్వరావధానం - అక్షరావధానం:

స్వరా వధానం, అక్షరావధానం అనేవి వేదావధానాలు గా ప్రసిద్ధి పొందాయి. వీటి గురించి డా. రాళ్లబండి కవితా ప్రసాద్ గారు అవధాన విద్య- ఆరంభ వికాసాలు అనే తన సిద్ధాంత గ్రంథంలో 11వ. పుటలో తెలియజేశారు.

స్వరావధానం:

ఇందులో అంగుష్ఠ తర్జని మధ్యమ అనామిక కనిష్ట అనే ఐదు వేళ్లను నియమబద్ధంగా కదుపుతూ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలను సూచిస్తూం డేవారు. వేద స్వరానికి అనుగుణంగా వేళ్ళ కదలిక ఉండేది. వేళ్ల కదలికలు సూచిస్తూ స్వరాన్ని చెప్పడం స్వరం ఆలపిస్తే వేళ్ల కదలికలు చూపించడం స్వరా వధాన ప్రదర్శన లో ఉండేది.

అక్షరావధానం:

అక్షరావధానం గురించి, కవితాప్రసాద్ గారిలా చెప్పారు. వేదంలోని అక్షరం ఉన్న స్థానాన్ని ధారణ ద్వారా గుర్తించడమే అక్షరావధానం. వేదంలోని కాండ సంఖ్య, అనువాక సంఖ్య, పాఠ సంఖ్య, అక్షర సంఖ్య చెబితే అక్షరం చెప్పడం అక్షరావధానం. అలాగే అక్షరం చెబితే అది ఉన్న స్థానం గుర్తించడం కూడా ఇందులో భాగమే. దీనికి సంబంధించిన విధానం తైత్తిరీయ ప్రాతి శాఖ్యం లో ఉన్నది. క్రమ పూర్వకంగా వేదమంత్రాలను, వర్ణాలను పాఠం చేసే 8 పద్ధతులు శైఖరీయ శాఖలో ఈ విధంగా చెప్పబడ్డాయి.

జటా క్రమ మాలా శిఖా ధ్వజ దండోరధోఘనః అనేదాని ప్రకారం 8 వేద పాఠాలు ఉన్నాయి. ఈ పద్ధతులన్నీ నేర్చుకున్న వాడు వేదావధాని. వేద వధానులు కొందరు ఉన్నారు.

సాహిత్యేతర రంగంలో అవధానాలు:

ద్విశతావధాని డా. రాళ్లబండి కవితా ప్రసాద్ గారు సాహిత్యేతర రంగంలో అవధానాల ను నాలుగు విభాగాలుగా విభజించి వాటి గురించి సిద్ధాంత గ్రంథంలో వివరించారు.

అవి: 1. ధారణ మాత్ర సంబంధ అవధానాలు, 2. సాంకేతిక అవధానాలు, 3. శాస్త్ర సంబంధ అవధానాలు, 4 కళా సంబంధ అవధానాలు.

ఇందులో ధారణ మాత్ర సంబంధ అవధానాలలో 1. భగవద్గీత అవధానం, 2 సహస్రనామావధానం.3 రామాయణావధానం 4 శతకలశావ ధానం.5 శబ్దా వధానం ఉన్నాయి.
నేత్రావధానం , అక్షరముష్టికావధానం, అంగుష్ఠ అవధానం, గమనావధానం , ఖడ్గావధానం, ఘంటావధానం పుష్పావధానం భూజావధానం, తృణావధానం,శుష్కావధానాలు, సాంకేతిక అవధానాలు విభాగంలోకి వస్తాయి.

గణితావధానం, జ్యౌతిషావధానం, వైద్య అష్టావధానం, అక్షర గణితావధానం అనేవి శాస్త్ర సంబంధ అవధానాలు. నాట్యావధానం, సంగీత అష్టావధానం, సంగీత గేయధార, ధన్యవధానం అనేవి కళా సంబంధావధానాలు. (అవధాన విద్య - ఆరంభ వికాసాలు. పుట 95-96). సంగీత నవ అవధానం కూడా ఇటీవలి కాలంలో డా మీగడ రామలింగస్వామి గారు చేస్తున్నారు. పైన చెప్పినవన్నీ సాహిత్యేతర అవధానాలు. ఇప్పుడిక సాహిత్య అవధానాల గురించి పరిచయం చేస్తాను.

సాహిత్యంలో అవధాన విద్య అనేక విధాలుగా విలసిల్లుతోంది. అష్టావధానం, ద్విగుణితాష్టావధానం, శతావధానం ,ద్వి శతావధానం, పంచ శతావధానం పంచమహా శతావధానం సహస్రావధానం, బృహద్వి సహస్రావధానం పంచ సహస్రావధానాలుగా పృచ్ఛక సంఖ్యను అనుసరించి విభజించుకోవచ్చు.

అవధాన అంశాలైన సమస్య దత్తపది మొదలైన వి సంస్కృత తెలుగు సాహిత్య చరిత్రను తరచి చూస్తే, పూర్వకవులు అక్కడ అక్కడ ఆశువుగా చెప్పిన ఆధారాలున్నాయి. శ్రీ రాంభట్ల జగన్నాథశాస్త్రీ మొదలుగా, శ్రీ దోర్బల ప్రభాకర శర్మ ఇత్యాదులు పరంపరగా సంస్కృతంలో అష్టావధానాలు నిర్వహించారు. తెలుగులో అవధానులు శ్లోకం లేదా భాషాంతరీకరణం అనే అంశంలో సంస్కృతానికి స్థానం కల్పించారు.

ఈ అవధాన విద్యకు మూలాలను కనుగొనే ప్రయత్నం చేస్తే జక్కన కంఠోక్తిగా చెప్పిన సీసమాలిక లో అవధానపు పోలికలు కనిపిస్తున్నాయి. భట్టు మూర్తి గా ప్రసిద్ధుడైన రామరాజభూషణుడి శత గ్రంధ కల్పనం, అలాగే చిత్ర భారత కర్త చరిగొండ ధర్మన్న శత లేఖిన్య వధాన పద్య రచనా సంధ మొదలైనవి గ్రాంథికాధారాలుగా కనిపిస్తున్నాయి. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో కొలచెలమ మల్లినాథ సూరి శతావధాని నని అని చెప్పారు. అలాగే పటమట సోమనాథ సోమయాజి, నెల్లూరి వీరరాఘవ కవి, మధురవాణి , మరింగంటి సింగరాచార్యులు శత ఘంటావధానులు అని చెప్పుకున్నారు. వరాహ నృ సింహ పురాణాలను తెనిగించిన హరిభట్టు తాను అష్టావధాన విశిష్టత బిరుదును కలిగిన వాడినని చెప్పుకున్నాడు. ఆధునికకాలంలో కృష్ణా జిల్లా లోని నూజివీడు సంస్థానం విద్వత్ కవులు అభినవ పండితరాయలు బిరుదాంకితుడైన విద్వాన్ మాడభూషి వెంకటాచార్యులు గారు ప్రప్రధమంగా అష్ట శతావధానాలు కు లక్షణాలు ఏర్పరిచి స్వయంగా అష్టావధానాలు, శతావధానాలు చేశారు. ఆయన్ని అనుసరించి తిరుపతి వేంకట కవులు కూడా అష్టావధాన శతావధాన లకు లక్షణాలు తెలియజేశారు.

శా. పౌరాణోక్తి కవిత్వ పుష్ప గణనావ్యస్తాక్షరుల్ లౌక్య గం
భీరోక్త్యంచిత కావ్య పాఠన కళావిద్భాషణంబుల్ మదం
బారంగా చతురంగఖేలనము నీ యష్ట ప్రచారం బు లో
ప్యారున్ శంకర! ఏక కాలముననే యష్టావధానమ్మునన్!

1. ఆకాశ పురాణం, 2. కవిత్వం, 3. పుష్ప గణనం, 4. వ్యస్తాక్షరి, 5. అప్రస్తుత ప్రశంస, 6. కావ్య పాఠం, 7. శాస్త్ర చర్చ, 8. చతుర రంగం ఆడటం అనే ఎనిమిది అంశాలు అష్టావధానంలో ఉన్నాయి.

అవధానంలో ప్రశ్నలడిగే వారిని పృచ్ఛకులు అని అంటారు. వారు అడిగే సంస్కృత తెలుగు చందస్సులో వస్తువును స్వీకరించి వంద మందికి మొదటి పాదం చెప్పి తరువాత ఎవ్వరూ గుర్తు చేయకుండా మిగిలిన మూడు పాదాలు వరుసగా చెప్పటమే శతావధానం. ఈ విధంగా అవధానం నిర్వహణ వలనే కవిత్వం ప్రజా సామాన్యానికి చేరువై ప్రసారం జరుగుతుందనే రహస్యాన్ని తెలిసిన తిరుపతి వెంకట కవులు పల్లె పల్లెకు పల్లకిలో అవధాన కవిత్వాన్ని తీసుకువెళ్లారు. ఈ కవుల అవధానాలు చూసిన నిరక్షరాస్యులు అక్షరాస్యులు అయ్యారు. అక్షరాస్యులు కవిత్వం చెప్పటం నేర్చుకున్నారు. కవులు అవధానం, ఆశుకవిత్వం చెప్పనా రంభించారు.

వేలూరి వారు అవ్వారి వారు చిదంబర శాస్త్రి గారు మొదలైన వారందరూ తిరుపతి వెంకట కవుల ప్రభావంతో అవధానులు గా ఆంధ్ర కవిత్వాన్ని కొత్త బాటలో నడిపించారు. అవధానంలో జంటకవుల హవా బాగా విస్తృతమైన రోజుల్లో కొప్పరపు సోదర కవులు వేంకట పార్వతీశ కవులు వేంకట శేష కవులు మొదలైన వారెందరో అవధాన విద్య లో ఆరితేరి పల్లెపల్లెలో పద్య సరస్వతిని ఊరేగించారు. ఈ పరంపరలో శ్రీ సి.వి సుబ్బన్న శతావధాని నాటి నేటి అవధానులు అందరికీ ఆరాధ్యుడు. తిరుపతి వెంకట కవులు కొప్పరపు సోదర కవులు అవధాన ప్రస్థానంలో ప్రాతఃస్మరణీయులు గా కీర్తించబడుతున్నారు.

సాహిత్యానికి సంబంధించిన అవధానాలలో అష్టావధానం ప్రధానమైనది. ఇందులో ఎనమండుగురు పృచ్చకులుంటారు.16 మంది పృచ్ఛకులతో ద్విగుణితా ష్టావధాన మనీ, 24 మంది పృచ్ఛకులతో త్రిగుణితం అని 32 మంది పృచ్చకులతో చతుర్గుణితా ష్టావధానం అని అంటారు.80 మంది పృచ్చకుల తో బృహద్విసహస్రావధాని శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు అనంతపురంలో దశ గుణిత అష్టావధానం చేశారు.128 మంది పృచ్చ కుల తో పంచ సహస్రావధాని శ్రీ మేడసాని మోహన్ గారు విజయవాడలో చేశారు. ఇదే కాక ప్రత్యావృత్త పరిపూర్ణ అష్టావధానాలు కూడా వీరు చేశారు.

అలంకార అష్టావధానం అనే ఒక అష్టావధాన ప్రక్రియ ఉంది. ఇందులో 8 అలంకారాలు అంటే రూపక, ఉపమ, ఉత్ప్రేక్ష. అర్ధాంతరన్యాసము మొదలైనవి 8 అలంకారాలు పృచ్ఛకుడు కోరిన వాటితో అవధాని అలంకార అష్టావధానము చేస్తారు. 1996లో రాళ్లబండి కవితా ప్రసాద్ గారు మచిలీపట్నంలో ఈ అవధానం చేశారు.

అలాగే దశావధానం అవధాన ప్రక్రియలో ఒకటి. ఇందులో పదిమంది పృచ్చకులు 10 అంశాలను ఇవ్వగా వాటిని పృచ్ఛ కుల కోరిన విధంగా అవధాని సమాధానాలు ఇస్తాడు.

అవధాన ప్రక్రియలో అష్టాదశావధానం ఒకటి. ఇందులో 18 మంది పృచ్ఛకులు 18 అంశాలతో అవధానిని ప్రశ్నిస్తారు. అవి 1. సమస్య, 2. దత్తపది. 3. నిషేధాక్షరి, 4. సద్యో వర్ణన 5. న్యస్తాక్షరి. 6 చంద స్సంభాషణ, 7. కావ్య అనుకరణం, 8. ఆకాశ పురాణం, 9. ఆశువు, 10. కావ్య వ్యాఖ్య, 11 నిర్దిష్ట భావానువాదం, 12. వచన కవిత/ మినీ కవిత/ 13. నిషిద్ధ గమన కథనం, 14. అక్షర విన్యాసం, 15. వార గణితం, 16. మనో గణితం, 17. ఘంటా గణనం, 18. అప్రస్తుత ప్రసంగం అనే 18 అంశాలు ఉంటాయి. ఈ అష్టావధానంని శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు 1998 అక్టోబరులో ఖమ్మం జిల్లా పాల్వంచలో మొదటిసారిగా చేశారు తర్వాత చాలా పట్టణాల్లోనూ హైదరాబాద్లోనూ చేశారు.

అవధానాల్లో నే సాహిత్య ప్రక్రియ అవధానం ఒకటి. ఈ అవధానంలో విభిన్న ప్రక్రియలు అంటే పద్యం, వచన కవిత ,మినీ కవిత, కథ, వ్యాసం విమర్శ గేయం తో పాటు అప్రస్తుత ప్రశంస అనే అంశాలు ఉంటాయి. దీన్ని కూడా రాళ్లబండి కవితా ప్రసాద్ గారు 1996లో వరంగల్లో నిర్వహించారు.

ఇక వచన కవితా అవధానము అనే ప్రక్రియలో వంద మందికి పైగా వచ్చిన కవుల ఖండికల ను ధారణ చేసి వాటిని వృచ్ఛకుడు కోరిన విధంగా అప్పజెప్పడం ప్రక్రియగా యానాం శ్రీ పి ఆర్ ఎల్ స్వామి గారు చేస్తున్నారు.
వెయ్యికి పైగా ప్రాచీన ఆధునిక కవుల పద్యాలను ధారణ చేసి పద్యం మొదలు చెప్పగానే ఆ పద్యం అప్పజెప్పే ధారణావధానాన్ని తిమ్మ సముద్రానికి చెందిన డా. వొలుకుల శివ శంకర రావు గారు చేస్తున్నారు.

హాస్య అవధానము అనే కొత్త ప్రక్రియను శంకర్ నారాయణ గారు సృష్టించారు. ఇందులో ఎనిమిది మంది పృచ్ఛకులు జోక్స చెప్తుండగా, అవధాని ప్రతిస్పందిస్తూ తానొక జోక్ చెప్తుంటారు.

కావ్యావధాన ప్రక్రియలో ప్రబంధాలను ధారణ చేసి అందులోని పద్యాలను వచనాలతో సహా ప్రారంభం నుండి చివరి వరకు పరిశీలకుల మచ్చ పొల్లుపోకుండా అప్ప చెబుతారు. రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు లో తెలుగు విశ్వవిద్యాలయ విద్యా పీఠంలో ఉద్యోగి స్తున్న ఆచార్య శ్రీ కర్రీ నాగార్జున శ్రీ గారు వసు చరిత్ర మొత్తం కంఠస్థం చేసి ఈ కావ్యావధానం ప్రదర్శించారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో నివసించిన శ్రీ వెంపరాల ప్రభాకర్ సుబ్రమణ్యం గారు ఎల్ఐసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ఉద్యోగం చేసి మనుచరిత్రను యథాతథంగా భీమవరంలోని పాలకొల్లులోనూ హైదరాబాద్లోనూ అప్పజెప్పి కావ్యావధానిగా పేరు పొందారు.

తెలుగులో అష్టావధానం తర్వాత విశిష్టమైనది శతావధానం. వీటి లక్షణాల గురించి ముందుగా ప్రస్తావించాను. శతావధానంలో సాధారణంగా 1. సమస్య 2. దత్తపది 3 వర్ణన 4 అనువాదం అనే అంశాలతో సంస్కృతాంధ్ర భాషల్లో 19వ శతాబ్దం ఉత్తరార్ధం వరకు అవధానాలు నిర్వహించారు. ఇప్పుడు శతావధానాలు లో సమస్య దత్తపది వర్ణన ఆశువు అప్రస్తుత ప్రసంగం అనే అంశాలు ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధమైన ఎంతోమంది శతావధానులు ఉన్నారు. శతావధానం చేయడానికి ఇంచుమించు మూడు రోజుల కాలం పడుతుంది. అయితే అత్యద్భుత శతావధానం కావించిన కవులు వేంకట రామకృష్ణ కవులు. వీళ్లు పిఠాపురం సంస్థానం కవులు.

ఈ వేంకట రామకృష్ణ కవులు పిఠాపురం రాజా ఆస్థానంలో ది 13-3-1909 వ తేదీన సాయంకాలము 3 గంటల 45 నిమిషాల నుండి 07:50 మధ్య నాలుగు గంటల్లో శతావధానం పూర్తి చేశారు. ఈ శతావధాని కి అత్యద్భుత శతావధానం అని నామకరణం చేసి వేంకట రామకృష్ణ కవులు అత్యద్భుత శతావధానాలు గా పిఠాపురం రాజావారు గుర్తించి తమ ఆస్థాన కవులుగా నియమించుకున్నారు. ఈ కవుల నే ఏ కథను 100 పద్యాల్లో చెప్పమని రాజావారు కోరుకోగా 14-3-1909 వ తేదీన ప్రహ్లాద చరిత్రము చెప్పి సత్తా విధానం అనే పేరు పెట్టారు. ఆ తరువాత శత ప్రాసము అనే మాలిక ర"కార ప్రాసతో చెప్పారు.

కాకినాడ సూరి కళామందిరంలో 1997 ఆగస్టు 9, 10 తేదీలలో మహా సహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు కవితా ఖండిక శతావధానం చేశారు ఇందులో పది మంది పృచ్ఛకులు మాత్రమే ఉంటారు. ఒక్కొక్క పృచ్ఛకుడు ఒక్కొక్క విషయం మీద పది పద్యాలు చెప్పవలసిందిగా అవ దానిని కోరుతాడు అవధాని ఆ పద్యాలను ఆరుగురు పతివ్రతలు చెబుతాడు ఇది పది ఖండికల తో కూడిన ఒక ఖండకావ్యంగా రూపొందుతుంది. ఇలా పది ఖండకావ్యాలు ఆవిష్కరించబడ్డాయి.

ద్వి శతావధానంలో రెండు వందల పద్యాలు ఉంటాయి అందులో 50 సమస్యాపూరణలు 50 దత్తపదులు 50 వర్ణనలు 50 ఆశువులు ఉంటాయి. ఈ అవధానానికి నాలుగు లేక ఐదు రోజులు పడుతుంది. శ్రీయుతులు మాడుగుల నాగఫణి శర్మ గారు హైదరాబాద్ రవీంద్రభారతిలో 23 4 19 95 నుండి 27 4 19 95 వరకు ది శతావధానం చేశారు. గరికపాటి నరసింహారావు గారు ఏలూరులో 8-11-96 నుండి 12-01-96 వరకు చేశారు శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు పాలకొల్లు లోనూ విజయవాడ లోనూ రెండు ది శతావధానాలు చేశారు. బృహత్ శతావధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు 2003 డిసెంబర్లో లో లలిత కళా తోరణంలో పంచ శతావధానం చేశారు.

ఆంధ్ర సాహిత్య చరిత్రలో 20వ శతాబ్దానికి పూర్వం సహస్రావధానం సహస్రావధాని పేర్లు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 1995 ఐదు సంవత్సరాల మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సహస్రావధానం జరుపబడతాయి.

1. శ్రీ మేడసాని మోహన్ గారి తిరుపతిలో 19 96 జనవరి 4 నుండి 22వ తేదీ వరకు 19 రోజులు సహస్రావధానం చేశారు ఈ అవధానంలో 231 సమస్యలు దత్తపదులు 233 వర్ణనలు 234, అసువులు 90 నిషిద్ధాక్షరి 19 అప్పుడు సూర్య సంఘాలు కలిపి 1215 అంశాలుగా ఉన్నాయి.

2. శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు హైదరాబాద్ నాంపల్లిలోని లలిత కళా తోరణంలో 1020 అంశాలతో 19 96లో ఫిబ్రవరి 2 నుండి 24 వరకు సహస్రావధానం చేశారు.

3. గరికిపాటి నరసింహారావు గారు కాకినాడలో ఇరవై రెండు రోజుల పాటు 19 90 6 మే 15వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు సహస్రావధానం చేశారు.

4. శ్రీ వద్దిపర్తి ప్రభాకర్ గారు ఏలూరులో 2003 మే 10వ తేదీ నుండి పదిహేడు రోజులు మే 26వ తేదీ వరకు సహస్రావధానం. ఇది త్రిభాషా సహస్రావధానం.

6. శ్రీయుతులు కడిమిళ్ల వరప్రసాద్ కోట వెంకట లక్ష్మీ నరసింహం గారు జంటగా కడిమిళ్ల కోటా కవులు అని పేరు తణుకులో 2004 మే 9వ తేదీ నుండి 25వ తేదీ వరకు 17 రోజులు సహస్రావధానం చేశారు. జంట సహస్రావధానం ఇది.

7. శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు హైదరాబాదులో 1997 డిసెంబర్ 6 నుండి 1998 జనవరి 11వ తేదీ వరకు 37 రోజులు బృహత్ ద్విసహస్రావధానం రెండు వేల అంశాలతో తో చేశారు.

8. 18-2-2007 వ తేదీన హైదరాబాదు పబ్లిక్ గార్డెన్స్ లో సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ గారు పంచ సహస్రావధానం ప్రారంభించి 20. 3. 2007 వ తేదీన ముగించారు. ఇందులో 1000 సమస్యలు 1000 దత్తపదులు 1000 వర్ణనలు 1000 ఆశువులు 500 చందో భాషణములు 500 సంస్కృత సంభాషణలు కలిపి పద్యాలు శ్లోకాలు కలిపి చేశారు .

ఇప్పటివరకు సాహిత్య అవధానం లోని రకాలను పరిచయం చేశాను. ఇప్పుడు ఇందులోని అంశాలను కొన్నిటిని ఉదహరిస్తాను.

సమస్యా పూరణం:

అవధానాలలో సమస్యను 16 విధాలుగా పూరించి వచ్చని డాక్టర్ సివి సుబ్బన్న శతావధాని గారు అవధాన విద్య అనే తమ గ్రంధంలో పేర్కొన్నారు. అవధానం శాలలో సమస్యలు నిర్వహించే పృచ్ఛకుడు ఒక పద్య పాదాన్ని భావ వైరుధ్యం తో ఇస్తాడు. అంతేకాదు అవధానాలలో ఇచ్చే సమస్యలు చాలా చిత్రంగా ఉంటాయి. దుష్కర ప్రాస తో నో యతి భంగం చేసో లో పద్యపాదంలో ఉండాల్సిన అక్షరాలు కన్నా కొన్నింటిని ప్రారంభంలో తగ్గించు లేదా అచ్చును ప్రాసాక్షరంలో ఉంచో సమస్యను అత్యంత క్లిష్టంగా తయారు చేసి అడిగే అవకాశం ఉంటుంది.

ఒకసారి కొప్పరపు సోదర కవులు ఇచ్చిన సమస్య కుక్కుట గృహమందు కాక ఘూకములుండెన్.... అంటే కోడి ఉండేచోట గంప కింద కాకి గుడ్లగూబలు కూడా ఉన్నాయని విరుద్ధంగా ఇచ్చారు దీనిని సహజ సుందరంగా కొప్పరపు జంట పూజించే విధానం చూడండి.

ఒక్కడగు బోయ పక్షుల
నక్క జముగ నెన్నొ జాతులనదగు వానిన్..
కక్కురితి దెచ్చి యొక్కడ
కుక్కుట: గృహమందు కాక ఘూకములుండెన్.

కుక్కుటం నో కోడిఅనే అర్థంలో కాకుండా కుక్కడం అనే అర్థ సాధనతో సమస్య పూరించ బడింది. అలాగే ఇటీవలే అంటే 2015లో యువ అవధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ విశాఖపట్నంలో చేసిన శతావధానంలో- “కామిని పాద నూపురము ఖంగున మ్రోగదు హేతువేమొకో!” అనే సమస్యను చావలి ఆంజనేయ మూర్తిగారు ఇచ్చి పూరించమన్నారు.

ఉ. ఆమని వచ్చే ననుచునయ మారగ నెచ్చెలి వెంటరాగ సం
ధ్యా మయ దీప్తులన్ వన విహారము చేయ సరోవరంబునం
దామె పదంబులుంచి జత నాడుచు పాడుచునుండ - స్పష్టమే
కామిని పాద నూపురము ఖంగున మ్రోగదు హేతువేమొకో!

ఈ సమస్యలు పూరించడానికి కవితా సరోవరాన్ని కల్పించిన అవధాని చక్కని పూరణ చేశాడు. ఇందులో ఒక స్త్రీ కాలికి ఉన్న నూపురం ఖంగని మ్రోగ లేదెం దుకు అని ప్రశ్నిస్తే, వసంత విహార వేళలో, సరస్సులో కాలు పెట్టడం వలన అది మ్రోగ లేదు. అని పురాణ. సాహిత్య అవధానంలో ఇలాంటి పూరణలు కోకొల్లలు.

దత్తపది:

సమస్యా పూరణం తర్వాత దత్తపది విషయానికొస్తే ఇవ్వబడే పదాలు కాబట్టి దత్తపది అంటున్నాం. నాలుగు పదాలను పృచ్ఛకుడు అవధానికి ఇచ్చి అంశాన్ని నిర్దేశిస్తూ ఆ పదాలు పద్యంలో వచ్చేలా నిర్బంధిస్తూ ఒక్కోసారి ఆ పదాలకు అర్థం రాకుండా నియంత్రిస్తూ కూడా పద్యం చెప్పమని అడగవచ్చు.

విశాఖ శతావధానంలో అవధానికి సచిన్ ,ధోని, విరాట్, వార్న్ అనే నాలుగు పదాలను ఇచ్చి భారతార్థంలో పద్యం చెప్పమని అడిగారు. ఈ నాలుగు పదాలు ప్రఖ్యాతమైన క్రికెటర్ల పేర్లు. వీటికి భారతానికి సంబంధమే లేదు. అవధాని చెప్పిన పద్యం ఇదిగో.

తే.గీ. వ్యాస! చిన్మయ రూప నీ వ్రాత మహిమ
రమ్యముగా గంటి నేను విరాట్ స్వరూపు
చాలు నదియ !యధో నిధులేల? ననుచు
నిష్ట జైమిని వేద వార్నిధి మధించె!

ఈ పద్యం లో వ్యాస చిన్మయ విరాట్ స్వరూపు, అధోనిధులు, వేద వార్నిధి అనే పదాలతో భారత అర్థంలో పద్యాన్ని చెప్పారు.

నిషిద్ధాక్షరి:

అవధానంలో అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా నిషిద్ధాక్షరి పేరొందింది. పృచ్ఛకుడు ఉద్దేశించిన విషయాలు అనుసరించి అవధాని పద్యం లో మొదటి అక్షరం ప్రారంభిస్తే పుచ్చ కుల ఇండక్షన్ ఊహించి అది వాడకూడదు నిషేధం అంటారు అప్పుడు అవధాని తిరిగి అనుకున్న భావం చెడకుండా ప్రత్యామ్నాయ అక్షరాలను వేసుకుంటూ అడుగడుగునా పృచ్చ కుల అడ్డుపడుతున్న పద్యం పూరించాలి. సాధారణంగా ఇది కంద పద్యం లో చేస్తారు.

ప్రతి అక్షరం కాకుండా కొన్నిసార్లు పద్యం మొత్తంగా ఒకే అక్షరం లేదా ఒక వర్గాల్లో నిషేధించే సంప్రదాయం ఉంది. శ్రీ నేమాని రామజోగిసన్యాసి రావు గారి అష్టావధానంలో "క" అనే అక్షరం పద్యాలు ఎక్కడ రాకుండా కంద కూర గురించి కంద పద్యం చెప్పమన్నారు. పూరణ చూడండి.

కం. తొలి హల్లును పూర్ణంబును
వలపలను ద వర్ణ ముంచ వచ్చెడి దుంపన్
పులుసావలతో వండిన
బళి బళి రుచి నెన్న వశమే పప్పన్నమ్ముతో.

పద్యాలు ఎక్కడ *క* వర్ణం వాడకుండా కంద కూర గురించి చెప్పడం జరిగింది. మొత్తం పద్యాన్ని ఒకేసారి చెప్తే ఆశుపద్యం. ఇది అవధాని ధారా శుద్ధి మీద ఆధారపడి ఉంటుంది.

వ్యస్తాక్షరి:

వ్యస్తాక్షరి అంశంలో వృచ్ఛకుడు ఏదైనా పద్యపాదంలోనో పాటలోనూ వాక్యంలోనూ అక్షరాలను చిన్న చిన్న కాగితం ముక్కల మీద రాసి అస్తవ్యస్తంగా అప్పుడప్పుడు ఆ కాగితం ముక్క లను అవధానికి అందిస్తే చివరకు సరైన క్రమంలోఆ అక్షరాలను గుర్తుంచుకుని ధారణ సమయంలో వరస తప్పకుండా సభకు -ఇచ్చిన అక్షరాలను అప్పజెప్పాలి. ధారణా బ్రహ్మ రాక్షసుడు అయిన గరికిపాటి నరసింహారావు గారికి వ్యస్తాక్షరి గా ఈ పద్యపాదం ఇవ్వబడింది." విడ్జ్యా లుడ్భ్రమ లుట్ట్ర యట్ప్ర వసుధాడడ్గ్ర డ్గ్ర డ్గ్ర హా" అన్న కాళిదాసు శ్లోకంలో మూడో పాదాన్ని ఇవ్వడం జరిగింది.

విషయం ఉద్దేశించి పృచ్చకుడు నాలుగు అక్షరాలు ఎంచుకుని ఒక్కో అక్షరాన్ని పద్యంలో ఒక్కో స్థానంలో ఉంచమని నాలుగు అక్షరాలు నాలుగు పాదాల్లో ఎక్కడ న్యస్తం చేయాలో చెబితే, అది న్యస్తాక్షరి. ఇది క్లిష్టమైన అంశంగా అందరూ పరిగణిస్తారు. ఘంటా గణనం పుష్ప గణనం, మొదలైనవి అవధాని ఆలోచనాత్మకమైన సమయంలో ఆటంక పరుస్తూ ధారణ ను పరీక్షించే అంశాలు.

వారగణనం:

వారగణనం అనే పేరుతో గణితానికి సంబంధించిన అంశం ఒకటి అవధానాలలో చోటుచేసుకుంది సంవత్సరం నెల తేదీలను చెప్పి ఆ రోజు ఏ వారం అవుతుంది అడిగే అంశం ఇది. ఇంకా అవధాని కున్న ప్రాచీన కావ్య ఇతిహాస ప్రబంధ పురాణ పరిజ్ఞానాన్ని పరీక్షించే అంశమే ఆకాశ పురాణం. పృచ్ఛకుడు అడిగిన పద్యం ఏ గ్రంథంలో ది కవి వివరాలు ప్రతిపదార్థ తాత్పర్యాలు, అవధాన సభకు వివరించడం తరచుగా కనిపించే అంశం. అవధాని ఆలోచనల్ని భగ్నం చేసే పరిపూర్ణమైన పరిపుష్టమై న అంశం అప్రస్తుత ప్రశంస. అవధాని లోని చమత్కృతి ని పాండిత్యాన్ని సభకు తెలియజేసేలా సభా రంజకంగా ఈ అంశం అన్ని అంశాల కన్నా విలక్షణంగా కనిపిస్తుంది. ఇలా అవధాన సుధా రస సాగరంలో ఒక్కో అంశం ఒక్కో కోణాన్ని ఆవిష్కరిస్తూ అవధాని ప్రతిభ విత్తం అయ్యేలా చేస్తుంది.

సమస్య స్ఫురణను, దత్తపది భాషా పటిమను, వర్ణన కల్పనా శక్తిని, వర్ణన నైపుణ్యాన్ని నిషిద్ధాక్షరి మేధో బలాన్ని వ్యాకరణ జ్ఞానాన్ని న్యస్తాక్షరి వ్యస్తాక్షరి ఘంటా గణనం పుష్పగణనం వారగణనం మొదలైనవి ధారణా శక్తి ని, ఆశువు ధారా శుద్ధిని, అప్రస్తుత ప్రశంస సమయస్ఫూర్తిని వెల్లడి చేస్తాయనడంలో సందేహం లేదు.
ఇంతటి ప్రత్యేకతను, విశిష్టతను కలిగిన అవధాన ప్రక్రియ ప్రసారమాధ్యమాల్లో ను తారసపడుతుంది.

ప్రసార మాధ్యమాలు - అవధానం:

ప్రసార మాధ్యమాలు స్థూలంగా రెండు రకాలు. శ్రవ్య ము అంటే రేడియో, దృశ్యము అంటే టీవీ ప్రసార మాధ్యమాలు.20వ శతాబ్దంలో వచ్చిన నూతన ఆవిష్కరణలు ఇవి కీలకమైనవి.1936 లో ఆల్ ఇండియా రేడియో గా మార్చబడిన ఆకాశవాణిలో 1948 నుంచి విజయవాడ కేంద్రంలోనూ, 1950 నుంచి హైదరాబాద్ కేంద్రంలోనూ కవిసమ్మేళనాలు అష్టావధానాలు సమస్యాపూరణలు ప్రసారమవుతున్నాయి. మొట్టమొదటిసారిగా హైదరాబాద్ కేంద్రంలో శ్రీ ప్రసాదరాయ కులపతి గారి అష్టావధానం ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ తరువాత 1973లో మద్రాసు ఆకాశవాణి కేంద్రం వారు శ్రీ నరాల రామారెడ్డి గారి అష్టావధానం ఏర్పాటు చేశారు. ఇందులో పుచ్చ కుల గా నిషిద్ధాక్షరి కి శ్రీ శ్రీ ,సమస్యకు ఆరుద్ర , ఆశువు కు డా. మాడభూషి నరసింహాచార్య, వర్ణనలకు కొంగర జగ్గయ్య ఇంకా పలువురు పాల్గొన్నారు. (రేడియో చమత్కారాలు వ్యాసం ఏల్చూరి మురళీధరరావు).

అలాగే ప్రముఖ అష్టావధాని శ్రీ ఆశావాది ప్రకాశరావు గారి అవధానాలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. డా. రాళ్లబండి కవితా ప్రసాద్ గారి అవధానం విజయవాడ కేంద్రంగా ప్రసారమైంది. ఇందులో గణితావధానం ఉండటం వీటి ప్రత్యేకత. అలాగే 1998 లో వరంగల్ కేంద్రం నుండి డాక్టర్ కోవెల సుప్రసన్నాచార్య గారు అప్పటికప్పుడు అవధానం నిర్వహించారు. అలాగే విద్యార్థుల కోసం నడుస్తున్న జ్ఞాన వాణి విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా యువ అష్టావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ 29-8-2012 వ తేదీన తెలుగుభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని అవధానం చేశాడు. అందులో ఇచ్చిన సమస్య.

భాషకు కీడు చేయుటకు పండితులందరు కూడిరీ సభన్.

పూరణ:

వేషము వేయు వారలను వేయి విధమ్ముల స్వచ్ఛమౌ కళా
పోషణ చేయు వారలను ముచ్చట గొల్పెడు ముద్దుగుమ్మలున్,
భాషకు స్పష్టత న్ గనిన భవ్య లు మాన్యలొక్కటైరి దు
ర్భాషకు కీడు చేయుటకు పండితులందరు కూడిరీ సభన్!

ఈ పూరణలో దుర్భాష అయింది. అలాగే అవధానాల్లో ముఖ్యమైన సమస్యా పూరణం అనే కార్యక్రమాన్ని ఆకాశవాణి ప్రసారం చేసేది చేస్తోంది. విజయవాడ కేంద్రం నుండి 1960 ప్రాంతంలో ప్రారంభమైన సమస్యా పూరణం ఆంధ్రదేశమంతటా కవులను సాహిత్యం వైపు తిప్పుకుంది అలాగే ఆ తరువాత 1994 లో విశాఖపట్నం కేంద్ర ఆకాశవాణి కేంద్రం కవన విజయం శీర్షికన ప్రతి రెండు నాలుగు శనివారాల్లో సమస్యాపూరణ కార్యక్రమం పక్షానికి ఒకసారి ప్రసారం అవుతోంది.

ఇక దృశ్య మాధ్యమాల్లో అవధాన సాహిత్య విషయానికొస్తే మొట్టమొదటిసారిగా 1977 అక్టోబర్ 23న దూరదర్శన్ తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 2003 ఏప్రిల్ 2 నుండి డిడి సప్తగిరి గా పేరు మార్చారు ఇందులో సాహిత్య అంశాలైన సమస్యా పూరణం అష్టావధానం చాలా రోజులు నిరాఘాటంగా, హృద్యంగా సాగిన పద్యాల తోరణం చెప్పుకోదగ్గవి.ఆంధ్ర వ్యాస శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య సారథ్యంలో నడిచిన పద్యాల తోరణం ఆంధ్ర దేశంలోనే కాకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా తెలుగు వారిని ఆకర్షించింది. ఇది పద్యాలతో అంత్యాక్షరి. ఒకరు చెప్పిన పద్యం చివరి అక్షరం తో తర్వాత వారి పద్యం చెప్పాలి. ఇలా ప్రారంభమైన ఈ కార్యక్రమం అనంత రామయ్య గారి తరువాత మహా సహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు కొన్ని రోజులు నిర్వహించారు. ఇలా 1996 వరకు టీవీలలో దూరదర్శన్ అగ్రభాగంలో నిలిచింది. ఆ తర్వాత ఆశువుగా అవధానం శీర్షికతో ప్రత్యక్ష ప్రసారం లో ప్రేక్షకులు ఫోన్లో అడిగినప్పుడు అంశంపై అప్పటికప్పుడు ఆశువుగా అవధాని పద్యాలలో సమాధానం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం 23-1-2015 నాడు ప్రారంభించారు. శతావధాని పార్వతీశ్వర శర్మ ఇందులో విషయ నిపుణులు గా పాల్గొంటున్నారు.

7-7-2008లో టీటీడీ ఆధ్వర్యంలో ప్రారంభించబడిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ అవధానులు చేత వారం వారం అవధానాలు చేయించి ప్రసారం చేసేవారు ఈ కార్యక్రమం ప్రతి బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రసారమయ్యేది. 30-7-2014 నాడు ప్రసారమైన అవధానంలో రసవంతమైన పద్యాలు ఆవిష్కరించారు. అలాగే ప్రముఖ ద్విశతావధాని మరడాన శ్రీనివాసరావు గారి అవధానం, మహిళా జంట కవయిత్రులు లేనా శ్రీమతి బులుసు అపర్ణ కుమారి కొల్లా పట్ల శాంతిస్వరూపల అష్టావధానం ఇంకా పలువురు ప్రముఖుల అష్టావధానాలు ప్రసారమయ్యాయి వీటికి ప్రముఖ అష్టావధాని ఇందారపు కిషన్రావు గారు సంచాలకులుగా వ్యవహించేవారు.

8-4-2016 నాడు ఉగాది సందర్భంగా పంచ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ గారి అష్టావధానం ప్రత్యక్ష ప్రసారం చేశారు. అలాగే శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది సందర్భంగా అప్పటికప్పుడు అవధానం చేయమని పార్వతీశ్వరశర్మను టీవీ5 విలేఖరులు కోరితే, రాజకీయ అవధానం పేరుతో అష్టావధాని ఆశువుగా చేశాడు ఇందులో అన్ని ప్రశ్నలు రాజకీయానికి సంబంధించినవే ఉంటాయి. సమస్య దత్తపది ఆశువు వర్ణన ఇలా అన్ని రాజకీయ సంబంధం ఉన్నవే.

ఇందులోసమస్య- : ప్రతిపక్షమే మేలు గూర్చు పాలన కెపుడున్

క. ప్రతిపక్షమనిన యర్థము
ప్రతి పనిలోనడ్డుతగులు పరమార్థ మేగా
అతి చేయు నాయకులకు ను
ప్రతిపక్షమే మేలు గూర్చు పాలనకెపుడున్... ( రాజకీయ అష్టావధానం టీవీ ఫైవ్)

ఇది కంద పద్యం ప్రతిపక్షాలు పాలకులకు మేలు కలిగిస్తాయని అర్థం.21 3 2015 నాడు ప్రసారం అయ్యింది.

అలాగే మొట్టమొదటి అంతర్జాల అవధానాన్ని 20-10-2012 నాడు వాని మనోహరి అనే పేర తిరుపతి వాస్తవ్యులైన, అష్టావధాని శ్రీ మాడుగుల అనిల్ కుమార్ గారు గూగుల్ వేదికగా మాలిక పత్రిక వారు నిర్వహించారు. ఇందులో పుచ్చ కులు, అవధాని సంచాలకులు ఎవరు ఇళ్లవద్ద వాలే ఉండి ఇంటర్నెట్ ఆధారంగా కంప్యూటర్లో చేసిన అవధానం ఇది.

ఇందులో ఒక నిషిద్ధాక్షరి రెండు దత్తపదులు 3 సమస్యలు ఒక వర్ణన ఒక అప్రస్తుత ప్రసంగం అంశాలుగా ఉన్నాయి.. ఇందులో దత్తపది గా చేప మేక కోడి పంది అనే పదాలతో మాంసాహారం కాకుండా శాకాహారాన్ని వండి పెట్టమన్నారు.

పూరణ: చేపడితి నూనె గిన్నెను
వేపుడు నమమేకమౌచు వేయించి తిగా
రూపొందే పకోడి ఒకటి
ఆపం దినుసులను తినుట అన్యములెరుగన్ !

అన్ని పదాలు శాఖాహారం వచ్చాయి. ఇది అంతర్జాల అవధానం. ఆ తర్వాత అంతర్జాలంలో ఫేస్బుక్ వేదికగా పలు గ్రూపుల్లో సమస్యాపూరణలు దత్తపదులు వర్ణనలు ఇబ్బడిముబ్బడిగా పూరి పడుతూనే ఉన్నాయి. 2017 జనవరి 1 నుండి ప్రజా పద్యం పేరుతో ఏర్పడిన ఒక గ్రూపులో పద్యం పట్ల ప్రజలను ఆకర్షించడానికి పద్య పక్షం అనే పేరుతో 15 రోజులకు ఒకసారి అంశాన్ని ప్రకటించి పద్యాలు రాయించారు. ఇప్పుడది సామాజిక పద్య ప్రబంధ స్థాయికి చేరుకుంది. ఇవి ప్రసారమాధ్యమాల్లో సామాజిక మాధ్యమాల్లో కొన్ని అవధాన ప్రస్థానాలు.

అవధానాల పై పరిశోధనలు:

తెలుగులో అవధాన శిల్పం అనే పేర సివి సుబ్బన్న శతావధాని, అవధాన విద్య ఆరంభ వికాసాలు అనే పేరు రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు సిద్ధాంత గ్రంథాలను సమర్పించారు. అంతేకాకుండా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న అవధాన రంగం మీద ఉభయ రాష్ట్రాలలోనూ విశ్వవిద్యాలయ స్థాయిలో ఇప్పటివరకు పరిశోధనలు జరిపి 12 మంది డాక్టర్ పట్టాలను పొందారు. ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

పురస్కారాలు:

శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారు తెలుగు భాషా సాహిత్యాలను వివిధ ప్రక్రియల లో ప్రతి ఏటా ఆయా అంశాలలో ప్రఖ్యాత సాహితీవేత్తలకు ప్రతిభా పురస్కారాలను అందిస్తున్నారు ఈ పురస్కారాల ప్రసిద్ధ అష్టావధానాలు శతావధానాలు సహస్రావధానలకు 1986 నుండి ప్రసాదించడం జరుగుతోంది.

గౌరవడాక్టరేట్లు:

171 అవధానాలు చేసిన అవధానం ఆచారి ఆశావాది ప్రకాశరావు గారికి తెలుగు విశ్వవిద్యాలయం రెండువేల సంవత్సరంలో గౌరవ డాక్టరేట్ ప్రసాదించింది. 150 అవధానుల పై ధారావాహిక గా వ్యాసాలు రాసిన రాపాక ఏకాంబరా చార్యులకు 2009లో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రసాదించింది.

ముగింపు:

ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసాల తో నేటి కాలపు అవధానాలు పండితుల మెప్పును పొందుతూ అందరిని అలరిస్తుండటంతో పాటు యువకులను కూడా అవధానాల వైపు ఆకర్షిస్తుండటం చెప్పుకోదగిన విశేషం. విద్యార్థులు ఉత్సాహంతో ఆశువుగా పద్యాలు చెప్పడంతోపాటు అవధానాలు చేయడం కూడా ప్రారంభించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాలలో కూడా అవధానులు తయారవుతున్నారు అంటే అవధాన కవిత్వ ప్రాముఖ్యాన్ని గుర్తించవచ్చును. వందల్లో అష్టావధానులు, పదుల్లో శతావధానులు, సహస్రావధానులు నేడు అందుబాటులో ఉన్నారు. ఇది నవ్యాంధ్ర సాహిత్యంలో అవధాన కవిత్వ ప్రస్థానం.

ఉపయుక్త గ్రంథ సూచి:

1. అమరకోశం - అమరసింహుడు
2. మొదటి మొగ్గలు - పార్వతీశ్వర శర్మ రాంభట్ల
3. ప్రతిభా స్వరాలు - పార్వతీశ్వర శర్మ రాంభట్ల
4. శతావధాన భారతి - పార్వతీశ్వర శర్మ రాంభట్ల
5. అవధాన విద్య - సుబ్బన్న సివి.
6. అవధాన విద్య - ఆరంభ వికాసాలు - కవితా ప్రసాద్ రాళ్ళబండి
7. అవధాన విద్య సర్వస్వము - ఏకాంబర చార్యులు రాపాక
8. రేడియో చమత్కారాలు, వ్యాసం - మురళీధరరావు ఏల్చూరి
9. పత్రికా రచన - ఆచార్య యోహన్ బాబు
10. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు (ధ్వని ముద్రితం)
11. జ్ఞాన వాణి ఇగ్నో ఎడ్యుకేషనల్ ఎఫ్ఎమ్ - ధ్వని ముద్రితం
12. ప్రసార ప్రముఖులు - డాక్టర్ ఆర్ పద్మనాభరావు
13. కులపతి సాహితి మహేంద్రజాలం - ప్రసాదరాయ కులపతి
14. తెలుగు పరిశోధన - ఆచార్య వెలుదండ నిత్యానందరావు