ఉపోద్ఘాతం:

ఆధునిక సాహిత్యంలో 19వ శతాబ్దం ఒక విధంగాను, 20వ శతాబ్దం ఒక విధంగాను, 21వ శతాబ్దం మరొక విధంగాను మహిళలు సాధికారత సాధించే దిశదశ మారింది. ఈ మార్పులో అనేక అంశాలున్నాయి. శాస్త్ర, సాంకేతిక, విద్య, వైజ్ఞానిక, సాంఘిక, ఆర్థిక కారణాలు అనేకం. ఇవన్నీ ఆధునిక సాహిత్యంలో ముడిపడి మహిళలను ఆలోచింపచేశాయి. మనిషిని ప్రశ్నింప చేసాయి. 19వ శతాబ్దంలో వేష భాషల్లోను, విద్యా విజ్ఞానంలోనూ, సంస్కృతి, సంప్రదాయాల్లోనూ, సాహిత్యంలోను చాలా మార్పులు వచ్చాయి. ఆ కారణంగా ప్రాచీన సంప్రదాయాలలోను, సాహిత్యంలోను చాలా మార్పులు వచ్చాయి. ఆ కారణంగా ప్రాచీన సంప్రదాయాలు, సంస్కృతులు పాత చదువులు పక్కకు వెళ్లడం, అసలు నిజాలు తెలుసుకోవడం, మూఢత్వాన్ని నిర్మూలించడం, సంఘ సంస్కరణల ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి. ఆ క్రమంలో సంఘ దురాచారా లపై సాహిత్యం ఎన్నో మార్పులు తెచ్చే ప్రయత్నం చేసింది. మన ఆధునిక కవులు ముఖ్యంగా కందుకూరి, గురజాడ, చలం ఇలా ఎంతోమంది ఉన్నారు. వారి రచనలు మహిళల్లో ఉత్తేజాన్ని తెచ్చిపెట్టాయి. బాల్య వివాహాల నిరసన, వితంతు వివాహాల ప్రోత్సాహం, కన్యాశుల్క దురాచారాల ఖండన ఇలా ఎన్నో మహిళా సమస్యలను ఖండించి కలాన్ని ఆయుధంగా చేసుకొని మహిళా సాధికారత కోసం ఎన్నో రచనలు చేశారు.

20వ శతాబ్దంలో మహిళా సాధికారత సరికొత్త పుంతలు తొక్కింది. ఇది మహిళా లోకంలో ఒక సరికొత్త విప్లవం. ఈ శతాబ్దంలో స్త్రీలలో విద్యాధికుల శాతం గణనీయంగా పెరిగింది. దానితోపాటు స్త్రీలపై అరాచకాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. అణచివేత, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, కుల దూషణలు, లింగ వివక్షత, అశ్లీల, అసభ్య పదజాల విషం సంస్కృతి, వరకట్న దురాచారం, ఇంటా బయట రాష్ట్ర రాష్రే ్టతర ఇలా అన్నిచోట్లా రకరకాల వేధింపులు ఒక ప్రక్క అయితే, మరో ప్రక్క గృహహింసలు విపరీతంగా పెరిగాయి. అందుకే స్త్రీలు 20వ శతాబ్దం నుండి తమ హక్కులను తామే రక్షించుకోవాలనే దృఢ సంకల్పంతో, కలాన్ని గళాన్ని ఆయుధంగా చేసుకొని తమకోసం తామే రచనలు చేసుకొంటూ మహిళా సాధికారత సాధించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సాహిత్యమే స్త్రీవాద సాహిత్యం. స్త్రీవాద సాహిత్యాన్ని స్త్రీలే సృష్టించుకొని వారి సమస్యలను వారే పరిష్కరించే దిశలో అనేక రచనలు చేస్తున్నారు.

స్త్రీవాద కవిత్వం వచనంతోనే పదునెక్కి ఎర్రదనాన్ని సంతరించుకొంది. స్త్రీవాద కవయిత్రులలో ముఖ్యంగా చెప్పుకోతగ్గవారు సాధికారిత సాధించే దిశగా ప్రయాణిస్తున్నవారువారిలో ఓల్గా, జయప్రద, సావిత్రి, విమల, కొండేపూడి నిర్మల, మైలవరపు హేమలత, ఘంటసాల నిర్మల, రావులపల్లి సునీత, పాటిబండ్ల రజని, కె. గీత, ఎస్‌. జయ, మెహజబీన్‌, శిలాలోలిత, చల్లపల్లి స్వరూపారాణి, షాజాహానా, మోసా ప్రభావతి, శారదా అశోకవర్ధన్‌, చిల్లర భవానీదేవి, భార్గవీరావు, శరత్‌జోత్స్నారాణి మొదలైనవారు రచనలు చేస్తున్నారు.

మహిళలు పడుతున్న బాధలు గుర్తు చేస్తూ వారి ఆవేదనను 'ఆమె' అనే కవితలో సి. వేదవతి ఇలా అంటారు.

''హలాహాలాన్ని కుత్తుకబంటీగ నిలుపుకొని
దావాలనాన్ని గుండెల నిండుగా మడుపుకొని
వదనంలో వసంతాలు పూయిస్తుంది
కనులలో కారుణ్యం పలికిస్తుంది.''( ఆమె)

అలాగే నేటి వివాహ వ్యవస్థలో ఉన్న లోపాలను చూసి సావిత్రి 'బండిపోట్లు' అనే కవితలో భర్త పెట్టే ఆగడాలను తట్టుకుంటూ స్త్రీ స్వేచ్ఛ లేకుండా ఉందని ఆమె ఎలా భరిస్తోందో అని చెపుతూ

''పెళ్లంటే పెద్దశిక్షని
మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని
మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
మమ్మల్ని విభజించి పాలిస్తోంది ... ''అంటారు.

ముస్లీం స్త్రీల ఆవేదనను వివరిస్తూ షాజహానా అనే కవయిత్రి 'ఖబడ్డార్‌' అనే కవితలో బురకాను నిరసిస్తూ మత చాందస వాదాన్ని ఎండగడుతుంది.

''మేము ఎందుకు కొరగానివాళ్లం
మందలు మందలుగా మాసం ముద్దలుగా
శరీరాన్ని చేసినట్లు మనసులకే ముసుగులేసుకొని
రంగు రుచి వాసన లేని బతుకీడుస్తున్న గబ్బిలాలు ..........'' అని ఆక్రందన వ్యక్తం చేశారు.

ఇలా అనేకమంది స్త్రీవాద రచయిత్రులు, కవయిత్రులు అనేక సమస్యలను కవితా వస్తువుగా చేసుకొని సాధికారతకోసం ప్రయత్నిస్తున్నారు. సమాజంలో స్త్రీలకు జరిగే అన్యాయాలను, అణచివేతను, ఇంకా అనేక ఘోరాలను సాహిత్యం ద్వారా సమాజానికి తెలియచేస్తూ అందరిని ఆలోచింపు చేస్తున్నారు. ఇదే కోణంలో ఉత్తరాంధ్ర రచయితలు కూడా స్త్రీ ని వస్తువుగా చేసుకుని కవితా సంకలనాలు వెలువరించారు.

మనది పురుషాధిక్యత సమాజం. పితృస్వామ్య సమాజం. మన భారతీయ సంస్కృతిలో స్త్రీ గడప దాటని సంప్రదాయం అనాది నుండీ పాఠించబడుతోంది. స్త్రీకి కొన్ని కట్టుబాట్లున్నాయంటూ ఆమెను మానసికంగా, శారీరకంగా నియంత్రించడం జరిగింది. ఆమె బాల్యం, వివాహం, వార్థక్యం అన్నీ నిరాదరణకు గురయ్యాయని అంటున్నారు రచయిత్రి కన్నెపల్లి కళ్యాణి. 'నువ్వు మనసారా నవ్విందెప్పుడు' శీర్షికలో స్త్రీయొక్క జీవన గమనంలో సమస్యలను చర్చించారు.

'’అధోజగత్తుకు చెందిన ఓ అబలా
నవ్వు మనసారా నవ్విందెపుడు
దిక్కుతోచని బాల్యం
దీనంగ ఏడ్చింది
కలలు పెంచిన యౌవనం
కట్న విపణిలో విలపించింది
బరువు బాధ్యతల కౌమారం
బాధగా నిట్టూర్చింది వయస్సు మళ్ళిన వార్ధక్యం
నిరాదరణ మునుగులో మూలిగింది
ఓ అబలా
నువ్వు మనసారా నవ్విందెపుడు?''

స్త్రీల సమస్యలను విశ్లేషించిన కవిత ఇది. విశాలజగుత్తులో స్త్రీ మనుగడను అథఃపాతాళానికి తొక్కేశారు. శారీరకంగా తను పురుషునికన్నా బలహీనమైనది కనుక మానసికంగా కూడా ఆమెను ఆధీనంలోనికి తెచ్చుకుంది పురుష ప్రపంచం. స్త్రీ శక్తి స్వరూపిణి అని, ఒకవైపు దేవతారూపమని పొగుడుతూనే వాస్తవంగా మాత్రం హీనంగా చూడటం మొదలు పెట్టారు. స్త్రీ ఇల్లుదాటి బయటకు కదలరాదని దాదాపు బందీని చేశారు. ఆంక్షల వలయంలో ఆమెను అణిచి ఉంచారు. మనసులోని ఏ మాటను స్వేచ్ఛగా చెప్పే అవకాశం ఆమెకు ఎప్పుడూలేదు. చివరకు నవ్వు విషయంలో కూడా పెదవి దాటని నవ్వును ఆమెకు నిర్దేశించారు. 'నవ్వు నాలుగు విధాలా చేటు' అని నూరి పోశారు. వీటన్నింటినీ గమనించిన రచయిత్రి ఓ అబలా నువ్వు మనస్ఫూర్తిగా నవ్విందెప్పుడమ్మా! అంటూ ఆమె దీనస్థితిని పై కవితలో తెలియజేశారు. అంటే స్త్రీకి నవ్వుకునే హక్కు కూడా లేదని, ఆమె సమస్యను ఈ కవితలో ఉద్ఘాటించారు.

ప్రాచీన కాలాన్ని పరిశీలిస్తే, ఆడదానికి చదువెందుకంటూ చదువును దూరం చేశారు. ఆడపిల్ల ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదనే ముద్రను ఆమెకు తగిలించారు. పుట్టగానే పరాయిని చేసినా, బాల్యంలో దిక్కుతోచని పసిమనసు దీనంగ ఏడ్చింది. చివరకు ఆడపిల్ల ఏడుపు ఇంటికి అరిష్టం అంటూ మనసారా ఏడ్చే స్వేచ్ఛను కూడా రద్దు చేశారంటూ గత కాలం నాటి స్త్రీల సమస్యలను రచయిత్రి తెలపడం చూస్తే, ఆమెకు జీవితంలో స్వేచ్ఛ అనేదే లేదని తెలియవస్తుంది.

ఆధునిక ప్రపంచాన్ని పరిశీలిస్తే స్త్రీ జీవనంలో పెద్దగా ఏ మార్పు రాలేదనిపిస్తుంది. యవ్వనం కలల లోకంలో పంచకళ్యాణిలా విహారిస్తుంది. ఎంత అందం ఉన్నా, అణకువ ఉన్నా, చదువు, పదవి ఉన్నా కట్నాల మార్కెట్‌లో ఆమె రేటు చెల్లించి ఇల్లాలుగా అత్తింట అడుగు పెట్టల్సిందే. కట్న కానుకలెన్ని సమర్పించుకున్నా సూటిపోటు మాటలతో బరువు బాధ్యతలు మోయాల్సిందే కలల కౌమారం కన్నీరై కరిగిపోవాల్సిందే. పుట్టింట్లో ఒక విధమైన నిర్భంధం, అత్తింట్లో మరో విధమైన నిర్భంధం ఎదురవుతుందని చెప్పడం వెనుక నేటి సమాజ స్థితిగతులను ఉదహరించినట్లేనని చెప్పాలి.

రచయిత్రి ఒక స్త్రీగా ఆమె లోతైన పరిశీలన చేశారనిపించింది. బ్రతుకులో నిర్భంధాలు తప్పనివేనంటూ బాధతో నిట్టూర్చింది వయసు మళ్ళిన వార్థక్యంలో ఆడమనసు. అక్కడా నిరాదరణే కనిపించింది స్త్రీకి. ఆమె ఒక పనిచేసే యంత్రంగానే సమాజంలో చూడబడింది. అక్కడ తండ్రి, మరో చోట భర్త, ఇక్కడ కొడుకూ అన్నీ మగమహారాజుల పుట్టుకలే. కూతురిగా, భార్యగా, అమ్మగా అబలకెపుడూ నిరాదరణల ఛీత్కారాలే. అందుకే రచయిత్రి నువు మనసారా నవ్విందెప్పుడు అని స్త్రీ ్త జీవనంలో దశలు మారినా, దిశమారని దీనత్వం గురించి వేదనగా పలకడంలో స్త్రీకి జీవితాంతం సమస్యలేనని చెప్పకతప్పదు.

మరో కవితలో బతుకు రైలుబండి వంటిదే. ఎప్పటికీ కలవని పట్టాలపై ఎక్కడా ఆగని బతుకుబండి. తనకేం పట్టనట్లు గమ్యంవైపు దూసుకుపోతూ ఉంది. 'అమ్మచూపు'' కవితలో రైలు పట్టాలై అమ్మ బతుకుబండి నడవడానికి నిరంతరం కష్టపడు తోందని తల్లి గురించి చెప్తున్నారు రచయిత చింతా అప్పల నాయుడు. స్త్రీ జీవితంలో కష్టపడే తత్వం ఆమెకు చిన్ననాటి నుండే అలవాటై కుటుంబ శ్రేయస్సుకై కష్టపడటాన్ని రచయిత వివరించారు.

''బతుకు రైలుబండి
పరుగెత్తడానికి అమ్మ
పగలంతా పొలంలో
పచ్చజెండాలు నాటేది!
బుగత పొలాన పొద్దస్తమానం
ఎద్దులతో పోటీపడిన అయ్య
పొద్దు వాలేక బురద వొళై ్ళ
మత్తుగా తేలిన సారాగా అయినప్పుడు
ఎదిరించిన పాపానికి -
అమ్మ వీపుమీద తేలిన తట్ల జ్ఞాపకాలు
కట్ల పాముల్లా యిప్పటికీ -
నా దేహాన్ని పాకుతాయి!.....''

ఒక స్త్రీ అమ్మగా ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న సమస్యలను ఈ కవితలో సూచన ప్రాయంగా తెలియజెప్పారు రచయిత. అమ్మ ఆప్యాయతలకు నెలవు. తను కష్టపడినా తన కుటుంబ సంతోషంగా ఉంటే చాలనుకునే అల్ప సంతోషి. సంసార బాధ్యతను నిర్వహిస్తూనే పగలంతా పొలంలో పచ్చని పైరునాట్లలో మునిగిపోయేది అమ్మ. యజమాని పొలంలో ఎద్దులతో పోటీపడిన నాన్న బురద ఒంటితో సారామత్తుతో తూలిపోతూ పొద్దుపోయాక ఇంటికొచ్చేవాడని గుర్తు చేసి, అతనికి చేసిన సపరిచర్యలు లెక్కలేనివని, ప్రతీ పేద కుటుంబం నిత్యం జరిగే తంతు ఇదేని వ్యక్తం చేసి స్త్రీకి ఎక్కడా ప్రశాంతత లేదని రచయిత వాపోయిన విధానం పురుష జనాన్ని ఆలోచింపచేసేలా ఉంది. యజమాని కోసం రెక్కలు ముక్కలు చేసుకోవడం, భార్యాబిడ్డలను మరచి మత్తుకు అలవాటుపడి వ్యసనాల పాలవడం చూస్తూనే ఉంటాం. అతని వ్యసనం అతని కుటుంబాన్ని మరింత బాధల్లోకి నెట్టేస్తుంది. మత్తులో తనేంచేస్తున్నాడో కూడా తెలియనితనంతో భార్యను చితకబాదుతాడు. ఆ విషయాన్నే ఈ కవితలో చెప్తున్నారు రచయిత.

నాన్న కొట్టిన దెబ్బలకు అమ్మ వీపు చిట్లి పైకి తేలిన చేతి అచ్చులు, కట్ల పాముల్లా తేలిన అమ్మ వీపుమీది గుర్తులు గుర్తచేసుకుంటే ఇప్పటికీ రచయిత ఒంటిన పాకి జలదరిస్తోందని చెప్పడంలో పురుషులు చేసే ఆగడాలను తప్పుబట్టారని గ్రహించవచ్చు. భర్త కొట్టిన దెబ్బలు స్త్రీని బాధపెట్టినా కుటుంబం కోసం అన్నీ భరిస్తుంది. తన పరిస్థితులకు క్రుంగి కష్టాల కడలిని చూసి బాధపడదు. అన్నీ తానై నిండైన మాతృరూపంగా దర్శనమిస్తుంది. ఈ సృష్టిలో స్త్రీ అంత సహనశీలి మరెవరూ లేరని 'అమ్మ' నిరూపిస్తోందని ఈ కవితా ముఖంగా రచయిత తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు.

కౌలు కూలీ రైతు జీవితం, అతని కుటుంబానికీ ఒక శాపం వంటిదే ఎంత కష్టపడినా ఫలితంలేని శ్రమజీవిగా మిగిలిపోవలసిందే. అలాంటి కుటుంబంలోని ఇల్లాలి పరిస్థితి మరీ దారుణం తలకీ కాలికీ అందని జీవితంతో అటు ఆకలి కష్టాలూ, ఇటు జీవన పోరాటంచేసి అలసిపోతుంది. బిడ్డని గమ్యానికి చేర్చే రైలుపట్టాల వంటిది అమ్మ అని, తాను పట్టాలై నలిగిపోయినా బిడ్డని గమ్యానికి చేర్చే పచ్చజెండాగా ఆ స్త్రీమూర్తిని అభివర్ణించారు రచయిత. ఈ కవితా పంక్తులను పరిశీలిస్తే-

''......నాచిరుగుల బాల్యం చుట్టూ
అమ్మకోక ముక్కైచుట్టుకొనేది!
అమ్మ తనే రెండు కమ్ములుగా మారి
నన్ను రైలు బండిని చేసింది!
నన్ను గమ్యానికి చేర్చే పచ్చజెండా
ఎప్పటికే అమ్మచూపే''

ఒక స్త్రీగా తల్లి అనుభవించే బాధలను తెలిపిన తరవాత, తల్లి ఆమె దృక్పథాన్ని వెల్లడించారు రచయిత. ఈ కవితలో పేదరికంలో మ్రగ్గిపోతూ చిరుగుల బట్టల బాల్యాన్ని అమ్మ కోకముక్కై చుట్టుకునేది. బిడ్డను పేదరికపు బాధ ఉండకూడదని తానే అడ్డుగా ఉండి ఆ బాధను భరించేదేకానీ ఎప్పుడూ బిడ్డబాగునే కోరేది. ఎందులోనూ తన పేదరికపు అశక్తతను బిడ్డ ముందుంచేదికాదని స్త్రీ యొక్క మాతృహృదయం యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పాడు. అమ్మ మనసు ఎంత భారాన్ని మోయాల్సి వచ్చినా తను ఎప్పుడూ చలించలేదు. బిడ్డ బ్రతుకే ఆమెలో ఆ సై ్థర్యాన్ని నింపింది. అందుకే అమ్మ గొప్పతనాన్ని గురించి రచయిత చెప్తూ అమ్మ తనే రెండు కమ్ములుగా మారి నన్ను రైలు బండిని చేసింది అంటున్నారు. ఆ పోలిక వెనుక దాగినలోతుని లెక్కింపలేమనేది రచయిత ఉద్దేశ్యంగా అర్థం చేసుకోవచ్చు.

చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ మనసుని గట్టి పరచుకొని నిరంతరం బిడ్డను గమ్యానికి చేర్చడానికి పాటుపడుతుంది తల్లి. నేనున్నా నువు ధైర్యంగా ముందుకెళ్ళు అంటూ అమ్మే పచ్చజండాలా నిలబడి ప్రోత్సహిస్తుందని, ఆమెలో ఉన్న ఔదార్యం గురించి చెప్పి, ఆ వెనుక దాగిన ఆమె ఆవేదన మాత్రం లెక్కగట్టలేనిదని ఈ కవితలో పరోక్షంగా వెల్లడించారు. అమ్మ చూపు చల్లనిది, అందుకే బిడ్డజీవితం పచ్చగా ఉండాలని పరితపిస్తుంది. చిరుగుల బాల్యానికి తానే అతుకుగా మారి బిడ్డను కాపాడుకుంటుంది. రక్షణ వలయమై నిలుచుంటుంది. తీగకు పందిరిలాగా బిడ్డ ఎదుగుదలకు పాటుపడుతుంది. తను కృంగిపోయినా బిడ్డకు ఏ మాత్రం తెలియకుండా పునాదిగా నిలబడుతుంది. భూమాతకన్న సహనం ఉన్న మాతృ మూర్తి స్త్రీమాత్రమేనని బయటకు ఆమె త్యాగాలను చెప్పి, లోలోపల రచయితగా స్త్రీల బాధలను తలచుకుంటూ వారి పట్ల సానుభూతి వ్యక్తం చేశాడు రచయిత.

ప్రజాస్వామ్యపాలన మొదలై మన భారతదేశంలో యాభై ఎనిమిది సంవత్సరాల కాలమైంది (రచయిత కవితను రాసే నాటికి) స్వతంత్ర భారతంలో దుర్భర జీవితంలో అసమానతలు, స్త్రీహింస అధికమయ్యాయి. స్త్రీమాన ప్రాణాలకు రక్షణలేకుండా పోయింది. అంగడి సరుకుగా స్త్రీని మార్చారు. ఇదంతా సామ్రాజ్యవాద ఫలితమని స్త్రీస్థానం, సమాజంలో ఏ విధంగా దీన స్థితిలో ఉందో 'పురోగమనంతో తిరోగమనం' శీర్షికలో వివరించారు రచయిత సార్వకోటి ధనుంజయరావు.

''....58 వసంతాల ప్రజాస్వామ్య పాలనా భారతం
దుర్భర జీవిత అసమానతలకు పరిమితం
ఆశల ఆకాంక్షలకు జీవన ప్రమాణాల దర్పణం!
క్రూర హింసలకు మ్రగ్గుతున్న మహిళలు
సామాజిక రక్షణ కోల్పోతున్న అబలలు
స్త్రీని ఒక సరుకుగా మారుస్తున్న సామ్రాజ్యవాదులు!
లౌకిక రాజ్యంలో రాబందుల మారణహోమాలు
మత విద్వేషంలో
మానవత్వం మాడి మసవుతున్న సాక్ష్యాలు
మానప్రాణాలకు లెక్కచేయని ప్రజా దోపిడీ విన్యాసాలు!''

సామ్రాజ్యవాదం ప్రపంచీకరణ తర్వాత కొత్తరూపంలో జడలు విప్పిందని చెప్పడానికి ఈ కవితను చెప్పడమే కాకుండా, అది స్త్రీల ఉనికిని ఎలా నాశనం చేసిందో వివరించారు. స్వాతంత్య్రం వచ్చాక భారతదేశం ప్రజాస్వామ్యదేశం అయినా అభివృద్ధి మాటున సామ్రాజ్యవాదం ప్రవేశించింది. దీని ప్రభావం సమాజంలో స్త్రీలమీద బాగా పడింది. స్రీ ్తని చిన్నచూపు చూసే తత్వం మొదటి నుండీ మన సమాజంలో పాతుకుపోయింది. స్త్రీ జీవితమెపుడూ దుర్భర పరిస్థితిలోనే ఉంది. అది స్వాతంత్య్రం రాక ముందైనా, వచ్చిన తర్వాతైనా స్త్రీ జీవితం ఎప్పుడూ అసమానతల మధ్యే నలిగిపోతుంది. మన పితృస్వామిక దేశంలో స్త్రీ అంటే చులకన. పురుషులకో న్యాయం, స్త్రీలకోన్యాయం అనే పరిస్థితులు ఎప్పుడూ ఉన్నాయి. ఇలాంటి అసమానతలతో స్త్రీ ఎప్పుడూ బందీ జీవితాన్నే గడుపుతోందంటున్నారు రచయిత.

స్త్రీల ఆశలు, ఆకాంక్షలు బాల్యం నుండీ త్రుంచివేయబడినవి. ఆమె కలలకు, కోరికలకు ఎప్పుడూ అడ్డుకట్టే ఉంది. సమాజంలో స్త్రీకి రక్షణలేదు. 'అర్థరాత్రి స్త్రీ ఒంటరిగా వీధులలో తిరగగల్గిన నాడే మనకు అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు' అన్నారు గాంధీజీ. కానీ నాటి నుండీ నేటి వరకు స్త్రీకి ఎలాంటి రక్షణాలేదు. పగటిపూటే ఒంటరి స్త్రీకి రక్షణలేదు. మరి రాత్రి సంగతి చెప్పనక్కర్లేదు. ఇదంతా గమనిస్తే స్త్రీల జీవన ప్రమాణాలెంత హీనంగా ఉన్నాయో, సమాజంలో స్త్రీ స్థానమేంటో అర్థం అవుతుంది.

స్త్రీని ఒక విలాస వస్తువుగా ఎంచి అంగడి సరుకుగా మార్చేస్తున్నారు సామ్రాజ్యవాదులు. స్త్రీని విలాసాలకోసం వాడుకుని ఆమె జీవితాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ఈలౌకిక రాజ్యంలో స్త్రీ రక్తమాంసాలను పీక్కుతినే రాబందులున్నాయని పురుషాధిక్యతను పరోక్షంగా తప్పుబట్టినట్లు కవిత అర్థమవుతుంది. మారణహోమాలు, మత విద్వేషాలలో మాడిపోతున్న మానవత్వం, మాడి మసవుతున్న జీవితాలు, ఇలాంటి సమయాలలో స్త్రీ పరిస్థితి మరింత హీనంగా తయారైంది. ఆమె మానప్రాణాలకు విలువేలేదు. ఆమెపై శారీరక మానసిక దోపిడీ విన్యాసాలు చేసే ప్రజామూకలు పశువుల్లా ప్రవర్తిస్తున్నాయి. స్త్రీ అబలకాదు సబల. స్త్రీ ఆదిశక్తి రూపం లాంటి మాటలు నేటి స్త్రీ సమాజానికి పనికిరాని పైపైమాటల పూతలేని ఈ కవిత జోష్యం చెబుతున్నదాన్నిబట్టి నిజాన్ని అందరూ అంగీకరించాల్సిందేనని రచయిత అభిప్రాయంగా గ్రహించవచ్చు. ఆమెను అందలం ఎక్కిస్తున్నట్లుగానే చూపుతూ కాలిక్రింద అణచిపెట్టే ధోరణి మాత్రమే సమాజంలో కొనసాగుతుందని, ఇలాంటి పరిస్థితులు ఎప్పటికి మారుతాయోనన్న రచయిత వేదనను ఈ అక్షరాలు కవిత ద్వారా ప్రతిబింబిస్తున్నాయి. స్త్రీ దుస్థితిపట్ల రచయిత సానుభూతిని చూపుతూ సమానతలను కాంక్షిస్తున్నారని అక్షర సాక్ష్యంగా చెప్పొచ్చు.

ముగింపు:

ఈవిధంగా ఉత్తరాంధ్ర రచయితలు, రచయిత్రులు తమ కవిత్వంలో స్త్రీ జీవనానికి ప్రాధాన్యతనిస్తూ, ముఖ్మంగా స్త్రీల సమస్యను చిత్రించి, స్త్రీల పక్షాన నిలబడి వారికి సంఘీభావం తెలుపుతున్నారని అనిపించింది.

ఉపయుక్త గ్రంథసూచిక:

1. ఆరుద్ర - సమగ్రాంధ్ర సాహిత్యం (1,2 సంపుటాలు) - ఎం. శేషాచలం అండ్‌ కంపెనీ, మద్రాసు, 1965.

2. కాత్యాయని విద్మహే, ఆధునిక తెలుగు సాహిత్యం స్త్రీవాద భూమిక, స్త్రీ జనాభ్యుదయ సంస్థ, వరంగల్లు, 2006.

3. కుందుర్తి - కుందుర్తి వ్యాసాలు, కె. సత్యమూర్తి, యం.సి.5, మలక్‌పేట కాలనీ, హైదరాబాద్‌, 1987.

4. ద్వానాశాస్త్రి - తెలుగు సాహిత్యచరిత్ర, విశాలాంధ్ర పబ్లిషింగ్‌హౌస్‌, హైదరాబాద్‌, 2001.

5. మంజులత, ఆవుల (సం.) - తెలుగులో కవిత్వోద్యమాలు, తెలుగు అకాడమీ, హైదరాబాద్‌, 2003.

6. సత్యనారాయణ, యస్వీ - స్త్రీ వాద వివాదాలు, అరసం ప్రచురణ, 1972.

7. సిమ్మన్న, వెలమల - తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, విశాఖపట్నం, 2005.