పరిచయం:

సాహిత్యంలో ఆధునికత ఎప్పుడూ రెండు వ్యవస్థల ఘర్షణలోంచి రూపొందుతుంది. ఆ ఘర్షణ ఎన్నో రంగాల్లో, ఎన్నో రూపాల్లో ఉండవచ్చు. వ్యవస్థాత్మకమైన ఈ ఘర్షణయే సాహిత్య అభివ్యక్తిలో ఎన్నో మార్పులను తెస్తుంది. కొంచెంగానో, ఎక్కువగానో ఈ ఆధునికత అనేది ఏ కాలం సాహిత్యంలోనైనా ఉంటుంది. ఒక స్థిర రూపంలో ఉన్న వ్యవస్థలో మౌలికమైన మార్పులు వచ్చే దశలో ఆ మార్పులను వేగవంతం చేయడానికి సాహితీపరుల రచనల్లో పరుచుకున్నది ఆధునికత.

ఆధునికత కాలాన్ని గురించిన శబ్దం కాదనీ, భావాలకు సంబంధించిన పదమనీ సాహితీ విమర్శకుల అభిప్రాయం. ఒక రాచరిక భూస్వామ్య వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చే దశలో రూపొందిందని ఒకరు, సంప్రదాయాలను, సాంప్రదాయకమైన విశ్వాసాలనూ, ఆచారాలనూ నిర్మమకారంగా విసర్జించి ప్రతి సమస్యను ఆధునిక విజ్ఞానశాస్త్రాల సహాయంతో, హేతుబద్ద దృష్టితో పరిశీలించడం(రారా)అని మరొకరు, సామాజిక వ్యవస్థను ఆశ్రయించుకున్న బౌద్ధిక విశేషమేగాని, నిరాధారమైన భావవిశేషం కావడానికి వీల్లేదు(కె.వి.ఆర్.నరశింహం) చెప్పిన వారంతా కాలం గురించి కాక కాలంలో వచ్చిన మార్పుల గురించి చెప్పారు.

ఏమైనా ఆంగ్లేయుల ప్రేమేయం లేకుండా ఇక్కడ ఆధునికత రాలేదు. స్వరూపంలో భారతీయులుగా, స్వభావంలో ఆంగ్లేయులుగా ఈ దేశ ప్రజలను మార్చే ప్రగాఢ లక్ష్యంతో మెకాలే ప్రారంభించిన ఇంగ్లీష్ విద్యయే దీనికి ప్రారంభం. విభజించి పాలించడం ఇంగ్లీషు వారికి వెన్నతో పెట్టిన విద్య. భౌతికంగా పోరాడి విజయం పొందిన తరవాత పూర్తిగా బానిసత్వం సాదించడానికి విద్యాపరమైన ఆధిపత్యం ముఖ్యమైన సాధనమని ఆనాడే కనిపెట్టారు. భారతదేశ మధ్యతరగతి ఇంగ్లీషు భాషను, సాహిత్యాన్ని బాగా ఒంటబట్టించుకొన్న మేధావులు కొద్ది సం. లలోనే అసంఖ్యాకంగా రూపొందారు. ఇలా విద్యావంతులైన వారికి భారతదేశ్ వ్యవస్థలో ఉన్న లోపాలన్నీ బాగా అవగాహనకు వచ్చాయి. ఈ లోపాలకు వ్యతిరేకంగా పోరాడలనే ఉద్దేశ్యంతో వారు సాహిత్య ప్రక్రియలన్నింటినీ చేపట్టారు. అది ఆధునిక సాహిత్యమైంది.

గురజాడ - ఆధునికతకు బీజాలు:

19వ శతాబ్ది చివరి పాతిక సంవత్సరాలూ, 20వ శతాబ్ది మొదటి పాతిక సంవత్సరాలు సుమారుగా ఆధునిక సాహిత్య బీజాలు బలపడిన కాలం. రాజారామ్మొహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మసమాజం సంస్కర్తలందరినీ ఆకర్షించింది. అది మానవోద్యమంగా పేరు పొందింది. కులభేదాలు, అనేక దేవతారాధన, మతభేదాలు, స్త్రీల వెనుకబాటుతనం మొదలైన దురాచారాలన్నింటిని రూపు మాపే లక్ష్యంతో బ్రహ్మసమాజ భావాలు వ్యాప్తి పొందాయి. సాహిత్యంలో ఆధునికతకు మూలస్తంభాలుగా ఉన్న గురజాడ, వీరేశలింగం ఈ భావాలన్నిటికీ రచనా ప్రతిఫలనాలు. అందులోనూ గురజాడది సమగ్రమైన ఆధునిక దృక్పథం.

20 వ శతాబ్ది ప్రారంభంలో సంస్కరణదారితమైన ఆధునిక కవిత్వంతోపాటు, ఆంగ్లదేశంలో అప్పటికి వందేళ్ళ క్రితం ప్రచలితమైన కాల్పనిక కవిత్వం ఇక్కడ భావకవిత్వంగా రాయప్రోలు చేత ప్రారంభమైంది. భావకవిత్వాన్ని ఆధునిక సాహిత్యంగా ప్రారంభించిన కొందరు, జాతీయోద్యమం, ఆంధ్రోద్యమం, ప్రేమ, ప్రకృతి సౌందర్యం మొదలైన వాటినన్నిటిని భావకవిత్వంలో భాగాలుగానే స్వీకరించడం జరిగింది. భావకవిత్వంలో ప్రధాన ధోరణి ఆత్మాశ్రయత్వం. గురజాడ మొదలైన వారి లక్ష్యం ప్రజలు, ప్రజా ఉద్యమాలు, సమాజ నిర్మాణంలోని లోపాలను సరిచేయడం. ‘నాది ప్రజల ఉద్యమం’ అని గురజాడ అన్నది ఇందుకే.

గురజాడ-ముత్యాలసరాలులో రాచరిక భూస్వామ్య భావదారాలను ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క కవితలో ఖండించి, ప్రజాస్వామ్య భావాలకు నాంది పలికాడు. ‘ప్రజలు’ చరిత్ర నిర్మాతలనే దృష్టికి దగ్గరైన దృక్పథం గురజాడది. రాచరికపు అహంకారాన్ని ‘కన్యక’ కథలో ఎదిరించాడు.

“రాజు తలచిందేను ధర్మం

రాజు చెప్పిందెల్ల శాస్త్రం

రాజులకు పేరైన పద్ధతి

కాద గాంధర్వం’’

‘లవనరాజుకల’ లో కులభేదాలను నిరసించాడు.

“మలిన వృత్తుల మాలవారని

కులములేర్చిన బలియురొక దే

శమున కొందరి వెలికి దోసిరి

మలినమే మాల’

కవిత్వంలో కల్పన స్థానంలో వాస్తవికతను తెచ్చినవాడు గురజాడ. అందుకే ఆనాడు సాహసంగా ఇలా అనగలిగాడు.

“కవుల కల్పన కలిమి నెన్నో

వన్నె చిన్నెలు గాంచు వస్తువు

లందు వెర్రి పురాణ గాథలు

నమ్మ జెల్లునె పండితుల్”

గురజాడకు ఉన్న లక్ష్యాల్లో ముఖ్యమైంది ఈ ముసుగులు లేని మానవుణ్ణి ప్రతిష్టించడం. దానికి మతం, కులం, మరో విధమైన ఆదిపత్యం - ఏదీ ఆటంకం కారాదు. సంస్కరణ లక్ష్యంతో పాటు, మానవతా పూర్వకమైన ఈ భావన గురజాడను మహోన్నతున్ని చేస్తుంది.

“మతములన్నియు మాసిపోవును

మనిషి యొక్కడె నిలిచి వెలుగును”

‘మానవుడే నా సందేశం’ అన్న శ్రీశ్రీ కి నేపథ్యంలో గురజాడ మానవతా భావన ఉంది. ఈ భావనతోనే గురజాడ స్త్రీ పురుష సంబంధాలను కూడా నిర్ణయించాడు. ఆనాడు ఎవరూ చెప్పలేని సత్యాన్ని చెప్పాడు.

“మరులు ప్రేమని మదిదలంచకు

మరులు మరులును వయసుతోడనె

మాయమర్మము లేని నేస్తము

మగువలకు మగవారి కొక్కటే

ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును

ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును”

ఆధునిక దాంపత్య వ్యాఖ్యానమంతా ఇందులో ఉంది. ఈ నాటికీ పై భావాలకు సంబంధించిన స్పృహ లేకపోవడమే సమాజ పతనానికి కారణమవుతోంది.

గురజాడ ‘దేశభక్తి’ గీతంలో ఆధునిక సమాజానికి కావలసిన భౌతిక దృష్టిని, దేశీయతను అందించాడు.

‘అన్ని దేశాల్ క్రమ్మ వలెనోయి

దేశసరుకులు నమ్మవలెనోయి

డబ్బుతేలేనట్టి నరులకు

కీర్తి సంపద లబ్బవోయి!’

ఇందులో ‘దేశి సరుకులు’ అనే మాట కీలకం. దేశీయమైన ఉత్పత్తులు పెంచి, విదేశాలకు అమ్మి దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని గురజాడ కోరుతున్నాడు.

పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయిక రచనలో చట్రాన్ని తలకిందులు చెయ్యడమే ఆధునికత చేసిన పని. ఈ విషయంలో కట్టమంచి తన ‘కవిత్వతత్వ విచారం’ లో చేసిన విమర్శ ఆధునికతకు బీజం వేసిన వాటిలో బలమైంది. ప్రాచీన సాహిత్య ద్వేషంతో ఆయన ఆ గ్రంథం రాయలేదు. కాని భావం చుట్టూ అల్లుకున్న కృత్రిమమైన గోడలన్నీ తొలగిపోవాలనీ, అలంకార నిర్మాణంకాక అలంకార సృజన జరగాలనీ, కవికి సొంతమైన భావనాశక్తి లేకపోతే వ్యర్థమనీ ఆయన తన విశ్లేషణల ద్వారా నిరూపించాడు.

బ్రహ్మసమాజ భావాలను తీవ్రంగా అమలుపరచడంలో కందుకూరి మహాయోధుని పాత్ర వహించారు. స్త్రీవిద్య కోసం తపించాడు. వితంతు వివాహాలను అమలులోకి తెచ్చాడు. ఏకేశ్వరోపాసనను ప్రోత్సహించాడు. లంచగొండితనం మొదలైన అనేక రుగ్మతలను రూపుమాపే ప్రయత్నం చేసాడు. ఆయన పద్యాలు రాసినా, వాటిని ప్రజాపరం చేసే ప్రయత్నం చేశాడు. ప్రాచీన పద్యాల్లోని వక్రమార్గాలను అపహాస్యం చేశాడు. ‘సరస్వతీనారాద విలాపం’ ఇందుకు నిదర్శనం.

‘తెలియదు సుమ్మిప్పుడు నా

పలుకుల అర్థంబునాకే భావములేమిక’

అని పదాడంబరముతో భావం మాసిపోయే విధానాన్ని నిరసించాడు. కథలు, వ్యాసాలు, ప్రహసనాలు, జీవితచరిత్రలు, సాహిత్య చరిత్రలు, పత్రకలు - ఇలా ఎన్నో ప్రక్రియల్లో రచించి, కొన్ని ప్రక్రియలకు ఆద్యుడైఆధునికత విషయంలో ప్రముఖ స్థానం పొందాడు.

ముగింపు:

సమాజం గతితార్కిక గమనంతో మారుతుంది. ఆ మార్పే సామాజిక రంగంలోనూ, సాహిత్య రంగంలోనూ ఆదునికత అవుతుంది. 20వ శతాబ్ది ప్రారంభంలో వచ్చిన ఆధునికత, దేశ సంస్కృతి మూలాలను విస్మరించిన ఆధునికత కాదు. సమాజంలోని చెడును నిర్మూలించి, ప్రగతిశీలతను రక్షించుకోవాలనే ఆధునికత వారిది. ఈనాడు ‘ఆధునికత’ అంటే అర్థం ‘అమెరికా అనుకూలత’ అని మారింది. మౌలిక సంస్కృతిని ధ్వంసం చేయడంగా మారింది. అందువల్ల మన సాహిత్య నిర్మాతలు, ఆధునికతా సృష్టి కర్తలు ఎలాంటి సమాజాన్నీ, సాహిత్యాన్నీ కోరుకున్నారో తెలుసుకోవడం చాలా అవసరం.

ఆధార గ్రంథాలు

1. ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయాలు ప్రయోగాలు - ఆచార్య. సి. నారాయణరెడ్డి.

2. ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రక్రియలు, ధోరణులు - తెలుగు అకాడమి, హైదరాబాద్.

3. తెలుగు వైజ్ఞానిక మాస పత్రిక - తెలుగు అకాడమి, హైదరాబాద్.

4. తెలుగు సాహిత్య చరిత్ర - డాక్టర్. ద్వానాశాస్త్రి.