ఉపోద్ఘాతం:

ఆంధ్ర వాఙ్మయంలో, కావ్య ప్రక్రియలలో శతకం ఒకటి. భారతీయ భాషల్లో ఎందులోనూ లేని ప్రక్రియ మన తెలుగులో ఉండడం విశేషం. కాలక్రమంలో శతకం విశిష్ట ప్రక్రియగా రూపొందింది. తెలుగు సాహిత్య చరిత్రలో అప్పుడు, ఇప్పుడు నిరంతరం జీవిస్తున్న ప్రక్రియ శతకం. సమాజానికీ, వ్యక్తికీ మధ్య తలెత్తిన వైరుధ్యమే శతక రూపానికి కారణం. తెలుగు సాహిత్యంలో బలమైన ఆత్యాభివ్యక్తి సాధనంగా శతకం తయారైంది. ఇక తెలుగుకు సజాతీయులైన కన్నడ, తమిళము, మలయాళము భాషలలో వెలువడిన శతకాల సంఖ్య అతి తక్కువ. కన్నడ భాషలో శతక రచన తెలుగు భాష కంటే ముందు ప్రారంభమైనను ఆ భాషలో శతక సాహిత్యానికి ప్రాధాన్యత ఎంత మాత్రం లేదు. తెలుగుకు మాతృకయైన సంస్కృతంలో ఇన్ని శతకములు లేవు. తెలుగులో మాత్రమే శతక సాహిత్యం ప్రత్యేకతను చాటుకున్నది. క్రీ.శ. 12 వ శతాబ్దంలో శతక సాహిత్యం తెలుగులో ఆవిర్భవించింది. శతకాన్ని ఒక ప్రక్రియగా పేర్కొన్న సంస్కృతాలంకారికుల్లో 13 వ శతాబ్దంలో అమృతానందయోగి మొదటివాడు. తెలుగు లాక్షణికులలో విన్నకోట పెద్దన, అనంతుడు శతక ప్రక్రియను పేర్కొన్నారు. “శతేన శతకం ప్రోక్తమ్” అనే నియమాన్ని అనుసరించి శతక కర్తలు శతసంఖ్యగల శతకాలు రచించారు.  నూరు పద్యాలు గలది శతకం. కాని 108 పద్యాలతో, 116 పద్యాలతో శతకాన్ని రాయడం జరిగింది. ఐతే సంస్కృత వాఙ్మయంలో వంద అనే అర్థంలో కాకుండా అనేకమైన అర్థాలలో కూడా వాడబడింది. మొదటగా భక్తి శతకాలలో పాటించిన ఈ సంఖ్యానియమం క్రమంగా తర్వాత వచ్చే శతకాలకు సామాన్య లక్షణంగా మారిపోయింది.

"ఆంధ్ర వాఙ్మయమున శాఖోపశాఖలుగా వికాసమునందిన కావ్య ప్రక్రియలలో శతకమొకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రాచనమారంభమై, కాలక్రమమున విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందినది. తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకమావిర్భవించినది. ఈ ఎనిమిది వందల యేండ్లలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లిస్వరూపంలోనూ స్వభావంలో ఎంతో మార్పు నొందినది. భారతీయ భాషలలో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్ట్యమునొందలేదు. నేటికీ ఏ మూలనో ఒకచోట శతకం వెలువడుతూనే ఉన్నది. సజీవ స్రవంతివలె అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్నది శతకమే" అని శతక సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్య కె. గోపాలకృష్ణరావు అభిప్రాయం.

ప్రాచీన సంస్కృత శతకాలలో కొన్నింటిలో మకుట నియమాన్ని పాటించినా అనంతరకాలంలో వచ్చిన శతకాలలో ఈ నియమం కొంతవరకు సడలిందనే చెప్పుకోవచ్చు. తెలుగు శతక కవులు భక్తి శతకాలలోనే కాక, మిగిలిన శతకాలలో సైతం మకుటాన్ని నియంతగా పాటించినట్లు తెలుస్తుంది. 

తెలుగు శతకంలో వృత్తనియమం పాటించారు. అవి చంపకమాల, ఆటవెలది, కంద, సీస పద్యాలలో ఎదో ఒకే ఛందస్సులో శతకమంతా నడుస్తుంది. శతకంలో పద్యాలు ముక్తకాలు. ఏ పద్యానికి, ఆ పద్యమే విడిగా ఉంటాయి. వేటికవే స్వతంత్రాలు.

నీతి సీస శతకం - పరిచయం:

భక్తి తర్వాత ఎక్కువగా కనిపించేవి నీతి శతకాలు. రాజనీతి, గృహనీతి, లోకనీతి, స్త్రీ సంబంధమైన నీతి, బాలబాలికలను ఉద్దేశించిన ప్రత్యేక నీతి శతకాలున్నాయి. వ్యంగ్యంగా, అధిక్షేపంగా రచించిన నీతి శతకాలున్నాయి. అన్యాపదేశంగా, దున్నపోతునో, పిల్లినో, ఏదో దానిని సంబోధిస్తూ చెప్పిన నీతి శతకాలున్నాయి. వేమన, సుమతి, భాస్కర, కుమారీ, పిల్లీ, కుక్కుటేశ్వర, సిరిసిరి మువ్వ, శంభో, చక్కట్ల, దాశరథీ మొదలైన శతకాలు ఈ కోవకు చెందినవి. ఇలాంటి నీతి శతకాలలో పెదతిరుమలాచార్యులు రాసిన నీతి సీస శతకం ఒకటి. ఇందులో నీతికి సంబంధించిన పద్యాలున్నాయి. కావ్యాలలో కవి తన భావాలను, ఉద్వేగాలను కథా పరంగా, పాత్రల పరంగా ఆవిష్కరించవలసి ఉంటుంది. కవి తనను తాను ఏ దాపరికం లేకుండా ఆవిష్కరించుకోడానికి శతకం దోహద పడుతుంది. కవి మనోభావాలను, ఆంతరంగిక సమస్యలను, ముఖాముఖి చెప్పుకోవడానికి ఒక శ్రోతను ఎన్నుకుంటాడు. శ్రోతగా తిరుపతి వేంకటేశ్వరుని ఎంచుకొని 16వ శతాబ్దంలో పెదతిరుమలాచార్యులు నీతి సీస శతకం రాశారు. అందులో           

కలిత లక్ష్మీశ సర్వజగన్నీవేశ!

విమలరవికోటిసంకాశ వేంకటేశ!

అని సంబోధించాడు. ఆ సంబోధనే శతక పద్య మకుటమయ్యింది. ఈ శతకం ప్రధాన ప్రయోజనం లౌకిక సామాజిక నీతిని బోధించండం, దానినే ఆదర్శంగా చూపాడు కవి. కవి వేంకటేశ్వరుని సాక్షిగా పురుష ప్రపంచం ఆచరించవలసిన, లౌకిక ధర్మాలను, సామాజిక నీతులను బోధించే ప్రయత్నం చేశాడు. అందువల్ల తాళ్ళపాక పెద తిరుమలాచార్యుని నీతి సీస పద్య శతకం ప్రత్యేకంగా పరిశీలించదగింది. ఇది పూర్తిగా సామాజిక లౌకిక నీతులను ప్రబోధిస్తుంది. వేంకటేశ్వరుని సంబోధించే ఈ శతకంలోని గీత పద్య భాగాలు కొన్ని స్తుతి ప్రాయంగా అక్కడక్కడ ఉన్నాయి. మిగిలిన పద్యాలన్ని నైతిక సామాజిక వర్తనానికి సంబంధించినవి. కుటుంబం నుంచి రాజు వరకు అందరూ మెలగ వలసిన తీరును, నిలుపుకోవలసిన విలువలను, వదిలించుకోవలసిన దుర్గుణాలను, భార్య భర్తతో మెలగవలసిన విధానాన్ని, భర్త భార్యతో ఉండవలసిన విధానాన్ని గురించే కాక,  ఇందులో నీతికి సంబంధించిన అంశాలు అనేకం విస్తృతంగా చర్చించారు.

ధర్మాన్ని, సత్యాన్ని, న్యాయ నియమాలను, దాక్షిణ్యాలను, శాంతం, పాపచింతన, అభిమానం, వినయ విధేయతలను, భక్తిని, మోక్షాన్ని ఇలా అనేక సద్గుణాలను మనిషి జీవక్రమంలో అలవరచుకోవాలని పదే పదే ప్రతి పద్యంలో గుర్తుచేశారు. అలాగే అబద్దాలను, అన్యాయాలను, పరదూషణను, కోపాన్ని, ద్వేషాన్ని, మొండితనాన్ని, లోభాన్ని, క్రూరత్వాన్ని దరిచేరనీయరాదని ఈ శతకంలో సూచించారు.

సాత్వికవిషయాలు:

ధర్మం, దయ, సత్యం, నియమం, సంపద, దాక్షిణ్యం, భక్తి, నిగ్రహం మొదలైన గుణాలతో జీవిస్తే సుఖంగా ఉండవచ్చని ఈ కింద పద్యంలో గమనించవచ్చు.

“ధర్మంబు గలచోట దలకొను జయమెల్ల దయ గలచో సుకృతంబు నిలుచు!

సత్యంబు గలచోట సమకూరు శుభములు నేమంబు గలచోట నిలుచు సిరులు!

పాడి గల్గినచోట బంతంబు లీడేఱు దాక్షిణ్య మున్నచో దగులు మైత్రి!

భక్తి గల్గినచోట ఫలమిచ్చు దైవంబు మనసు నిల్పినచోట మలయు సుఖము!

లలితమగుచోట వెదకిన నేలయుండు!

సొరిది నీ దైవకృప గలచోట గాక!......” (2)

ధర్మ గుణం ఉంటే నీకు జయం కలుగుతుంది. దయాగుణంతో జీవిస్తే మంచి జరుగుతుంది. సత్యవాక్యాలు పలికితే శుభాలు జరుగుతాయి. నీతి నియమాలు కలిగివుంటే, సంపద కలుగుతుంది. న్యాయం ఉన్న చోట పంతాలకు తావులేదని అని చెప్తూ, మన ప్రవర్తన సక్రమంగా ఉంటే దైవకృప ఎల్లప్పుడు ఉంటుందనే విషయం ఈ పద్యం ద్వారా తెలుస్తుంది.

సామాజిక విషయాలు:

మనిషిని సామాజిక జీవిగా చేసేది, ధైర్యాన్ని నిలిపేది మానవ సంబంధాలే. ఆ సంబంధాలు రక్త సంబంధాలు కావచ్చు, బంధుత్వ సంబంధాలు కావచ్చు. అందువల్ల నిరపేక్షంగా వాటంతట అవే మనుషుల మధ్య సంబంధాలు ఏర్పడవు. ఆయా సంబంధాలకు సహజమైన స్వభావాలు, నిర్ధిష్టమైన ధర్మాలు ఆచరణలో ఉంటేనే అవి నిజమైన సంబంధాలని ఈ కింది పద్యంలో తెలియజేశాడు.

“కులమువారల కియ్యకో లైన దిల్లాలు వరుసతో రక్షించువాడు దండ్రి!

ప్రియముతో జన్నిచ్చి పెంచినయది తల్లి తనకు దోడగువాడు దమ్ముడరయ!

నాపద బెడబాపు నాతండు బంధుడు వంచన సేయనివాడె భటుడు!

మోక్షమార్గము సూపు ముఖ్యుండె యాచార్యుడాత్మకు నిష్టమౌనతడు సఖుడు!

ఎఱిగి వీరలతో బొందు నెఱపవలయు!

గుఱు తెఱింగిన సద్వివేకుల నెల్ల!”.... (6) ...

అని  కుటుంబ పెద్దకు, అతని భార్య అంగీకారానికి తగినదిగా ఉండాలి. అలాగే తల్లిదండ్రులతో, పిల్లలతో, అన్న దమ్ములతో, బంధు మిత్రులకు ఉండే అవసరాలను గురించి తెలుసుకొని, వాటిని బట్టి వారి పట్ల ఆ ఇంటిపెద్ద ప్రవర్తన సక్రమంగా ఉండాలని తెలుపుతుంది ఈ పద్యం.

“ఆచార వంతుడౌనతడే విప్రోత్తముండఖిలంబు రక్షంచునతడు రాజు!

వరుసతో గార్యనిర్వాహకుండే మంత్రి రుచిరవర్తనుడ పురోహితుండు!

గడుదిడ్డ దీవింపగలవాడె సత్కవి యమృతహస్తుడ వైద్యుడఖిలదిశల!

బోటజ్జ యెఱిగిన పురుషుండు దళవాయి గణితజ్ఞుడగువాడ కరణమరయ!

పురుష రత్నంబులని యండ్రు బుధులు వీరి!

నితరులెల్లను సామాన్యు లెంచిచూడ!”....(15)

ఆచారవంతుడైన రాజు, కార్యనిర్వహకుడైన మంత్రి, సాటిలేని పురోహితుడు, కడుదిట్టయై దీవింపగలవాడే సత్కవి. అమృతహస్తం(హస్తవాసి) గల వైద్యుడు, యుద్దంలో స్థానమెరిగి ప్రవర్తించే సేనాధిపతి, లెక్కలు తెలిసిన కరణం. అలాంటి వారు రాజ్యంలో ఉండాలని తెలిపారు పై పద్యంలో.

స్త్రీ సంబంధ విషయాలు:

పరకాంతకోసం కీచకుడు మృతుడయ్యాడు, రాజ్యంకోసం దుర్యోధనుడు చనిపోయాడు, మహిని జూదంలో ధర్మరాజు ఓడిపోయాడు, క్రూర దండంతో పృధు చక్రవర్తి తండ్రి కూలిపోయాడు, రాక్షాస గురువు శుక్రాచార్యుడు బాణాలకు భయపడ్డాడు. పూర్వుల గతులను తెలుసుకొని వ్యసనాలు వదిలేస్తే మంచిదని ఈ కింద పద్యం ద్వారా చెప్పారు.

“పరికాంతకై సింహబలుడట్లు మృతుడయ్యె రాజ్యలోభమున గౌరవుడు వొలిసె!

బరుషోక్తులను శిశుపాలుండు హతుడయ్యె మహిని జూదమున ధర్మజుడు నొగిసె!

నలపాండురాజు వేటాడి శాపము నొందె మును రావణుడు చలమ్మునను సమసె!

గ్రూరదండంబున గూలెను వేనుండు జడిసె బానమున రాక్షసగురుండు!

ఘనవివేకులు వీరలగతులు దెలిసి!

వ్యసనములు మాని నడవంగవలయు నిలను!...(17)

స్త్రీ కోసం, రాజ్యంకోసం చనిపోయిన వారున్నారు, జూదమాడి ఓడిపోయిన వారు, శాపమును పొందిన వారు, ఇలా అనేకమంది రాజ్యాలు పోగొట్టుకున్నారు. ఈ విధంగా  వ్యసనాలకు బానిసలైన వారి గురించి ప్రస్తావిస్తూ మనం ఎదుట వారి చేతులలో బానిస కాకూడదని హెచ్చరించాడు.

తిరుమలాచార్యులు పురుషుడికి ఎలాంటి స్త్రీ భార్యగా వస్తే భాగ్యవంతుడవుతాడో ఈ పద్యంలో వివరించారు.

“పతికి మాఱాడక పలుమాఱు నేడ్వక యలుగక మిగుల గయ్యాలి గాక!

తను దిట్టికొనక కాంతాళించి గొణగక ముచ్చిలింపక పాపమునకు జొరక!

పొరిగింటి కేగక పరు నాత్మ దలపక కుపిత గాక పరానుకూల గాక!

యదువదాపక మర్మ మవ్వల జెప్పక బొంకక నిదురపోతు గాక!

కాపురము సేయు కామిని గలిగెనేని!

బలుకు లేటికి బురుషుని భాగ్యమహిమ!”.... (32)

భర్తకు ఎదురు చెప్పకుండా, ఊరికే ఏడ్వకుండా, అలుగకుండా, గయ్యాళికాకుండా, ఆమెను  తిట్టుకోకుండా, కోపించకుండా, గొణుక్కోకుండా, దొంగతనం చేయక, పాపంచేయక, పొరిగింటికి వెళ్ళకుండా, వేరే వ్యక్తిని తలచుకోకుండా, ఇతరులతో అనుకూలంగా లేక, రహస్యాలు దాచక, ఇంటి గుట్టు బయటకు చెప్పక, అబద్దమాడక, నిద్రపోతుకాకుండా, భర్తతో సుఖంగా కాపురం చేసే భార్య దొరికితే ఆ భర్త సంతోషానికి అవధులుండవు. ఈ పద్యం  పురుషుడి భాగ్య మహిమ చెప్పడానికి మాటలు చాలవని తెలుపుతుంది. పైన చెప్పిన లక్షణాలన్ని స్త్రీలలో ఉంటాయని ధ్వనిస్తుంది. అందుకే వాటిని స్త్రీలు మార్చుకోవాలని తెలుపుతూ రాశారు.

భేదాలు - తారతమ్యాలు:

ఏ విషయంలోనైనా మంచి చెడ్డలు యంచడానికి మనం సరిపోం. కాని ప్రతి విషయంలో మంచిచెడ్డలు యంచేవారు ఉంటారు. మనుష్య ప్రపంచంలో అధికులు, అధములనే వారువుంటారు. అసమసమాజంలో ఇలాంటి తారతమ్యాలు మనకు కనిపిస్తాయి. ఎక్కువ, తక్కువలు సామాజిక వ్యవస్థా లక్షణాలుగా రూపొందింపబడ్డాయి. అలాంటి వారికి బుద్ధిచెప్పడానికి సరిపోయో పద్యమిది.

“ఎనుగులావెంత యిలమావటీ డెంత తిమిరంబు బలిమెంత దీపమెంత!

ఘన సముద్రం బెంత కర్ణధారకుడెంత బహుకాననం బెంత పరశువెంత!

పాఱెడు నీరెంత పర్వంతం బదియెంత హరుడెంత మృదులపుష్పాస్త్ర మెంత!

భీకరఫణి యెంత వాకట్టు వేరెంత బహురాజ్యమెంత భూపాలుడెంత!

యెప్పటికి దొడ్డు గొంచెంబు లెంచరాదు!

నడచు నిటువంటి వెల్ల నీ నాటకములు!”.....(46)

ఏనుగు లావు ఎంత ఉన్నా దానిపై ఎక్కి నడిపించేది మనిషి. చీకటి బలమెంత ఉన్నా దీపం దాన్ని జయిస్తుంది. సముద్రం ఎంత ఉన్నా ఓడనడిపేవాడు ఎంతటివాడు. అడవి ఎంత ఉన్నా గొడ్డలితో నరకబడుతుంది. పారే నీరు ఎంత, పర్వతమెంత. భయంకరమైన పాము ఎంతయైన వేరుతో బంధించవచ్చు. రాజ్యం ఎంత పెద్దదైన దాన్ని పాలించేవాడు రాజు మాత్రమే. ఎదుటివాళ్ళను చూసి మంచి చెడ్డలు యంచరాదు. నేనే గొప్ప నాకు ఎవరు సాటిరారు అనుకుంటూ, వాడు ఎంత వీడు ఎంత అని మాట్లాడతారు కొందరు. అలాంటి వారికి చురకపెట్టిన పద్యం ఇది. వారి వారి మనస్తత్వాన్ని బట్టి తెలుసుకోవాలేగాని, మంచి చెడ్డలు ఎంచరాదని ఆధిక్యత భావాలతో బ్రతకరాదని ఈ పద్యంలో తెలిపారు.

ముగింపు:

ఈ విధమైన సామాజిక నీతి దృక్పధంతో ఈ నీతి సీస శతకం రాయబడింది. చెడిపోతున్న మనిషిని రక్షించాలి. చనిపోవాలనుకున్న వాడిని బ్రతికించే ప్రయత్నం చేయాలి. మోసకారి నుంచి తప్పించుకొనే మార్గం వెతుక్కోవాలి. ఆశ, ధనం, పరహింస, భోగం, పరాధీనత, మగువ మొదలైన వాటిని నిగ్రహించుకుంటే మనుషులు జీవితమంతా సుఖంగా జీవించవచ్చు. కోపాన్ని అనుచుకుంటే అందరి మన్ననలను పొందవచ్చు. పలుమాఱు శపధాలు పలికేవాడు నేరవేర్చకపోతే అతనికి ప్రయోజనం చేకూరదు. ఎదుటి మనుషులను పీడించుకు తింటే చెడిపోవడం తప్ప మరేమి మిగలదని నిర్భయంగా ఈ భావాలను పెద తిరుమలాచార్యుడు వ్యక్తీకరించాడు. 

ఆధార గ్రంథాలు :

1. నీతి సీస శతకం –  పెదతిరుమలాచార్యుడు

2. శతక సాహిత్యం - పరిశోధన   -   ఆచార్య కె. గోపాలకృష్ణరావు

3. శతక సాహిత్యం – వికీపీడియా

4. కబుర్లు కాకరకాయలు – మే 2015 ఆన్ లైన్ పత్రిక.