ఉపోద్ఘాతం:

కథాసాహిత్యం భారతదేశంలోనే కాక, అమెరికాలోనూ కూడా ఎక్కువ ప్రచారంలో ఉన్న ప్రక్రియ. 20వ శతాబ్దంలో తెలుగు కథాసాహిత్యాన్ని లోతుగా పరిశీలిస్తే అమెరికా తెలుగు కథకి కొన్ని దశబ్దాల చరిత్ర ఉన్నట్టే కనిపిస్తోంది. ఈ శతాబ్దంలో అమెరికాలో తెలుగు సాహిత్యానికి వికాసోదయం కలిగింది. తెలుగు కథాసాహిత్యంలో అమెరికా తెలుగు కథ పెద్దపీటను ఆక్రమించుకుంటుంది. 1964 నుంచి చూసినట్లయితే ఒకప్పుడు అమెరికా తెలుగు కథలు రాసేవారు బహుతక్కువ. తర్వాత రాను రాను అనేక మంది కథా రచయితలు పుట్టుకొచ్చారు. ఇప్పుడు అమెరికా తెలుగు కథా రచయితలు తెలుగులో కథలకంటే విభిన్నంగా రాస్తున్నారు. అమెరికా తెలుగు కథా సాహిత్యం అప్పుడూ, ఇప్పుడూ రెండు భిన్న సంస్కృతులతో బలంగానే సాగుతుంది. ఒకప్పుడు పత్రికలలో మనదేశంలో అమెరికా తెలుగు కథలు అతితక్కువగా ముద్రించేవారు. కాని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు అంతర్జాలంలో పత్రికలు వచ్చాయి. అనేక పత్రికలను ఆన్ ‌లైన్ ద్వారా మనకందరికి అందిస్తున్నారు. ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్కసారి అమెరికా తెలుగు కథలను మన తెలుగు పత్రికల్లో వేస్తున్నారు. దీనితో అమెరికాలో మన తెలుగువారు రాసిన కథాసాహిత్యం మనందరికి అందుతుంది.

ప్రవాసాంధ్రులు ఎక్కడున్నా తమ భాషాసంస్కృతులను మరచిపోరు అన్నమాట వాస్తవం. ఆంధ్రదేశపు సరిహద్దులు దాటి భారతదేశంలో అనేక రాష్ర్టాలలో స్థిరపడిన ఆంధ్రుల జీవన విధానాన్ని పరిశీలిస్తే ఈ మాట తేటతెల్లమవుతుంది. పదివేల మైళ్లు దూరం వెళ్ళి అమెరికాలో స్థిరపడిన ఆంధ్రులకు కూడా తెలుగు భాష, సంస్కృతులపై మమకారం ఏమాత్రం తగ్గిపోలేదు. ఉత్తర అమెరికాకి వలస వచ్చి స్థిరపడిన మనవాళ్ళు తమ జీవన విధానం గురించి ఫోటోలు, వీడియోలు, ఉత్తర ప్రత్యుత్తరాలు...మొదలైన వాటిద్వారా అనేక రకాలుగా రికార్డు చేసుకుంటూ ఉంటారు. సాహిత్యరూపకంగా అవి పదిలపరచినప్పుడు వాటికి శాశ్వతమైన విలువ కలుగుతుంది. అమెరికా ఆంధ్రుల జీవితాల్లో తరుచు తారసపడే పరిస్థితులనీ, సమస్యలనీ, వాటి పరిష్కారాలనీ నవలలుగా, కథలుగా, కవితలుగా రాస్తున్న రచయితలు అభినందనీయులు.

1960 లో వచ్చి స్థిరపడినవారు 1970 ల నాటికి కొంచెం తమ భాషా సంస్కృతుల పరిరక్షణకై ఆలోచనలు ప్రారంభించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వెలువడిన మొట్టమొదటి తెలుగు పత్రిక “తెలుగు భాషా పత్రిక ”. పెమ్మరాజు వేణుగోపాలరావు ప్రధాన సంపాదకులుగా, గవరసాని సత్యనారాయణ మేనేజింగ్ ఎడిటర్‌గా మొదటి సంచిక ఏప్రిల్ 1970 లో వెలువడింది. ఈ పత్రికలో ప్రచురించిన మొట్టమొదటి తెలుగు కథలు శ్రీమతి చెరుకూరి రమాదేవి “పుట్టిల్లు”, కోమలా దేవి “పిరికివాడు”, కస్తూరి రామకృష్ణారావు “యవ్వన కుసుమాలు వాడిపోతే” మొదలైనవి. ఉత్తర అమెరికా రాత ప్రతిగా ప్రచురించబడిన మొట్టమొదటి తెలుగు పుస్తకం శ్రీశ్రీ గారి “సిప్రాలి” 1981 హ్యూస్టన్ లో వెలువడింది. తెలుగు కళాసమితిచే నడపబడుతున్న తెలుగుజ్యోతి పత్రికలో అమెరికా తెలుగు కథలు ఎక్కువగా ప్రచురించబడ్డాయి. కె. వి. యస్. రామారావు తొలి సంపాదకులుగా అమెరికాలో ప్రారంభించిన మొట్టమొదటి అంతర్జాల సాహిత్య పత్రిక “ఈ మాట”.

అమెరికా తెలుగు కథ - పరిణామం:

ఎందరో తెలుగువారు మనదేశాన్ని వదలి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు, ఇకముందు కూడా వెళ్తారు. బర్మా, మలేషియా, ఫిజీ, ఇండోనేషియా, దక్షిణ అమెరికా, మారిషస్, సింగపూర్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఒకటేమిటి - ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఉన్న మన తెలుగువారు తరతరాలుగా ఇతరదేశాలలో నివసిస్తూనే ఉన్నారు. అలాగే ఉత్తర అమెరికాకి తెలుగువారు 1960లో వచ్చారు. వలస వచ్చి ఇక్కడే స్థిరపడిపోవడం 1970లో నుంచి ప్రారంభమైంది. వారంతా ప్రవాసాంధ్ర కథా రచయితలుగా పేరు పొందారు.

అమెరికా తెలుగు కథాపరిణామాన్నే అమెరికా తెలుగు సాహిత్య పరిణామంగా చెప్పవచ్చు. అమెరికా తెలుగు కథ పుట్టు పూర్వోత్తర వికాసాలను పరిశీలిస్తే 1965 ప్రాంతపు తొలిదశలో అమెరికా గడ్డపై కాలుమోపిన తెలుగువారు, ఆ సరికొత్త వ్యవస్థలో సర్ధుకుపోలేక విపరీతమైన ఒత్తిళ్ళకులోనై సాహిత్యం జోలికిపోలేదు. కాని 1970 ప్రాంతంలో ఈ పరిస్థితులు మారి సాహిత్య సృజనకు అనుకూలమైన వాతావరణం ఏర్పచుకున్నారు. 1970 నుండి అమెరికాలో ప్రతీ ప్రాంతం నుంచి స్థానికంగా కొందరు రచయితలు, సాహితీవేత్తలూ తమకు తోచిన విధంగా రచనలు చేస్తున్నారు. 1990 ప్రాంతంలో అమెరికాలోని తెలుగువారిలో వర్గబేధాలు అంతకు ముందుకంటే ఎక్కువగా చోటు చేసుకున్నాయి. అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న తెలుగు రచయితల పరిస్థితి అటూ ఇటూగా ఉంది. ఆ పరిస్థితులలో “వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” అనే సంస్థను వంగూరి చిట్టెన్ రాజు హ్యూస్టన్, టెక్సాస్‌లో స్థాపించారు. దీనికి ప్రధాన సంపాదకులుగా పెమ్మరాజు వేణుగోపాలరావు, గౌరవ సంపాదకులుగా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఉన్నారు. ఈ వంగూరి పౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ పేరుతో అనేక కథా సంకలనాలు వెలువడ్డాయి. అందులో 1995 లో “అమెరికా తెలుగు కథానిక” అనే పేరుతో మొదటి సంకలనం వెలువడింది. ఇప్పటివరకు ఈ సంస్థ నుండి 12 సంకలనాలు వచ్చాయి. ఈ సంకలనాలలోని కథా నేపథ్యాలు విభిన్న కోణాలతో రాయబడ్డాయి. దీంతో అంతకుముందు రచనా వ్యాపకం కలిగిన వారేకాక కొత్తవారు కూడా కలంపట్టి తమ సంఘర్షణలను కథలుగా మలచడం ప్రారంభించారు.

అమెరికాలో తొలి తెలుగుకథ:

తొలిదశలో అక్కడికి వచ్చినవారు వేరు వేరు సంవత్సరాలలో రావడం చేతనో, వేరు వేరు ప్రాంతాలలో స్థిరపడటం చేతనో, మెుదటిలో వారి మధ్య పరిచయాలు అంతగా లేకపోవడం చేతనో అమెరికాలో వెలువడిన తొలికథ ఏది? తొలి కథకులు ఎవరు? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం చెప్పడం వీలు కాదు. కాని అమెరికాలో తొలి తెలుగుకథ ఉత్తర అమెరికా తెలుగు కథారచయిత “స్వర్గీయ పులిగండ్ల మల్లికార్జునరావు” కెనడాలో “వాహిని” ఆంధ్ర సచిత్ర వారపత్రిక ఏప్రిల్ 24, 1964 సంచికలో ముద్రించబడింది. ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చినవారు “రచన” శాయిగారు.

అమెరికాలో తరువాతి తెలుగు కథలు:

రెండో కథ 1966 లో దోతంశెట్టి వీరభద్రరావు రాసిన కథ “గోడమీద గడియారం” ఆంధ్రసచిత్ర వార పత్రికలో ముద్రించారు. 1969 లో సీయస్సీ మురళి రాసిన కథ “మనిషి” భారతి మాసపత్రికలో ప్రచురించారు. 1970 లో చెరుకూరి రమాదేవి “పుట్టిల్లు” తెలుగు భాషా పత్రిక- అట్లాంటా నుంచి ప్రచురించారు. 1970 లో వేమూరి వేంకటేశ్వరరావు “గోలిదోషం” ఆంధ్ర సచిత్రవారపత్రిక, 1971 లో వేమూరి వేంకటేశ్వరరావు “భూతద్దాలు”ఆంధ్రపత్రిక సచిత్రవారపత్రిక, 1973లో కోమలాదేవి “జవాబు లేని ప్రశ్న” తెలుగుభాషా పత్రిక, అట్లాంటా, 1975 లో వంగూరి చిట్టెన్ రాజు “జులపాల కథ” మధురవాణి హ్యూస్టన్, 1975 లో భావరాజు “కొనేమనిషి” ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక, 1977 లో మాచిరాజు సావిత్రి “దయ్యంపట్టింది” మొదటి తానా వార్షిక సంచిక – న్యూయార్క్, 1978 లో శిష్ట్లావిజయ “ఊరుమారినా...” తెలుగు అమెరికా- చికాగో, 1979 లో అయ్యగారి రమామణి “కలనుండి ఇలకు” రెండవ తానా వార్షిక సంచిక – డెట్రాయిట్, 1979 లో కడప శైలజ “మళ్ళీ పెళ్ళి” రెండవ తాన వార్షిక సంచిక, 1979లో వేమూరి చంద్రావతి “పిలుపు తెచ్చిన పేచీ” తెలుగువెలుగు –న్యూయార్క్ , 1980 లో అరుణ గల్లా “తలక్రిందులైన” తెలుగు అమెరికా – చికాగో, 1981 లో చెరుకూరి రమాదేవి “శ్యామ”-మూడవ తానా వార్షిక సంచిక –చికాగో, 1981 లో కృష్ణప్రియ “న్యూయార్క్ చేరిన నా అనుభవం” తెలుగు అమెరికా – చికాగో, 1983లో అరుణ గల్లా “అమెరికా సిటిజన్” తెలుగు వెలుగు – చికాగో, 1983 లో నళిని “అదితం హరిణి” తెలుగు వెలుగు – చికాగో, 1983 లో రాణీ సంయుక్త “చింతం వంచన” నాలుగో తానా వార్షిక సంచిక – వాషింగ్టన్, 1984 వేణుగోపాలరావు “కలపటపు అన్వేషణ” మధురవాణి – హ్యూస్టన్, 1984 లో వసంత లక్ష్మీ పుచ్చా “అంతరంగంలో అలలు” మధురవాణి – హ్యూస్టన్, 1985 లో వేలూరి వేంకటేశ్వరరావు “మెటమార్ఫసస్ (మార్పు)” ఐదో తానా వార్షిక సంచిక – లాస్ ఏంజల్స్, 1986 లో నిర్మలాదిత్య – భాస్కర్ పులికల్ అసలుపేరు “సైబీరియన్ క్రేన్స్” ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక, 1986 లో వంగూరి చిట్టెన్ రాజు “అమెరికా వాహన యోగం కథ”- మధురవాణి – హ్యూస్టన్, 1987 లో కోలగట్ల సూర్యప్రకాశరావు “గ్రంథచౌర్యం” ఆరవ తానా వార్షిక సంచిక – సెయింట్ లూయిస్. 1987 లో మీర్ అబ్దుల్లా “ఓ మంచి రొమాంటిక్ కథ” – ఆరవ తానా వార్షిక సంచిక – సెయింట్ లూయిస్, 1987 లో విథున “ప్రభాలతీ –పారిజాతం” ఆరవ తానా వార్షిక సంచిక –సెయింట్ లూయిస్, 1987 లో నిడదవోలు మాలతి “నిజానికీ ఫెమినిజానికీ మధ్య” – ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రిక-సెయింట్ లూయిస్. 1989 లో దామరాజు లక్ష్మి “అనగనగా ఓ తెలుగు వెలుగు కథ” –మధురవాణి హ్యూస్టన్, 1989 లో పట్టిసపు రామజోగి గంగాధరం “అమెరికాలో గిరీశం” మధురవాణి – హ్యూస్టన్, 1989 లో పట్టిసపు శకుంతల “గంగాధరం” మక్షికం, “మహాలక్ష్మి”, “బాబాయి మహాశయుడు” మధురవాణి – హ్యూస్టన్, 1989 లో యడవల్లి రమణమూర్తి “అనుభవం” మధురవాణి – హ్యూస్టన్, 1990 లో కొమరవోలు సరోజ “ఉష్ణం ఉష్ణేణ శీతలః” తెలుగు జ్యోతి – న్యూజెర్సీ, 1990 లో మిర్తిపాటి వివేకానందరావు “ఇది కథ సుమా!” తానా వార్షిక సంచిక న్యూ ఓర్లియన్స్, 1990 లో సులోచన భండారు “స్వయంకృతం” తానా వార్షిక సంచిక - న్యూ ఓర్లియన్స్, 1991 లో అక్కినపల్లి సుబ్బారావు “వెన్నెల కురుసిన రాత్రి” ఎనిమిదవ తానా వార్షిక సంచిక – అట్లాంటా, 1991 లో మాలెంపాటి ఇందిరా ప్రియదర్శిని ఈ తరం కథ ఎనిమిదవ తానా వార్షిక సంచిక – అట్లాంటా, 1991 లో మరువాడ రాజేశ్వరరావు “కులంగాడు” ఎనిమిదవ తానా వార్షిక సంచిక – అట్లాంటా, 1992 లో ఏ. సుదర్శనరాజు “మమకారం – మరోజన్మ” తెలుగుజ్యోతి –న్యూజెర్సీ, 1992 లో కామేశ్వరీదేవి “తీర్పు” తెలుగు స్పందన – కెనడా, 1992 లో కొవ్వలి(కస్తూరి) జ్యోతి “గణేష్ బర్త్ డే” తెలుగు స్పందన – కెనడా, 1992 లో రామకృష్ణమూర్తి చిట్టి – “యదార్ధం ఇదికాదు” నాలుగవ ఆటా వార్షిక సంచిక – న్యూయార్క్, 1992 లో యార్లగడ్డ కిమీర “సభ లొస్తున్నాయి చిట్టి” – తెలుగు స్పందన – కెనడా, 1993 లో పెమ్మరాజు వేణుగోపాలరావు “దాంపత్యంలో అనుబంధం” తెలుగు జ్యోతి – న్యూజెర్సీ 1994 లో బేతన పల్లి జోస్ సుబ్బారావు “శోభనం ముహూర్తే” తెలుగుజ్యోతి – న్యూజర్సీ, 1994 లో పార్వతి పొన్నలూరి “ఇది కథ కాదు” తెలుగుజ్యోతి – న్యూజెర్సీ, 1994 లో వడ్లమాని పద్మావతి “ఒంటరి తనం” తెలుగు జ్యోతి – న్యూజెర్సీ, 1994 లో వై. రఘునాధరావు “కాళిదాసు” రచన మాసపత్రిక, 1995 లో జయప్రభ “శ్రీనివాసన్ తీర్మానం” ఐదవ తానా వార్షిక సంచిక – 1995 లో అపర్ణ మునుకుట్ల గునుపూడి “ఘర్షణ” తెలుగు పలుకు, 1995 లో కొమరవోలు సరోజ “మాతృదేవోభవ” తెలుగుజ్యోతి – న్యూజెర్సీ, 1995 లో శ్యామలాదేవి దశిక “ఆరోజు లే వేరు” తెలుగు జ్యోతి – న్యూజెర్సీ, 1995 పెమ్మరాజు వేణుగోపాలరావు “ఇంద్రప్రస్థంలో సీమంతం” తెలుగు జ్యోతి – న్యూజెర్సీ, ఎం. ఎస్. ప్రకాశరావు “వైకుంఠ పాళి” తెలుగు జ్యోతి – న్యూజెర్సీ, 1996 లో శ్యామ్ సోమయాజుల “గణపతి బొప్పా మౌరియా” అమెరికా తెలుగు కథానిక, 1997 లో కనక ప్రసాద్ “గులాబీ బేరం” పదకొండవ తానా వార్షిక సంచిక లాస్ ఏంజల్స్, 1997 లో పాలన కలంపేరు అసలు పేరు పారనంది లక్ష్మీ నరసింహం “జానకత్త – జంబూద్వీప యాత్ర” పదకొండవ తానా వార్షిక సంచిక, లాస్ ఎంజిల్స్, 1998 లో మంగళ కందూర్ “అల్టిమేటం” ఐదవ ఆటా వార్షిక సంచిక – డెట్రాయిట్. 1998 లో సుదేష్ణ కలంపేరు అసలు పేరు సుదేష్ణారెడ్డి సోమ “ఆలంబన” అమెరికా తెలుగు కథానిక – ఐదవ సంకలనం, 1998 లో ఊటుకూరి విజ్ఞానేశ్వర కుమార్ “పోయిరా మాయమ్మ” రచన మాసపత్రిక, 1998 లో సాయి బ్రహ్మనందం గొర్తి “వలసజీవితం” ఆంధ్రభూమి, 1999 లో ఆరిసీతారామయ్య “సాహసం – సహవాసం” పన్నెండవ తానా వార్షిక సంచిక – సిన్సినాటి, 1999 లో గిరిజా శంకర్ చింతపల్లి “సుబ్బారావు రిటైరై పోలేదు” తానా రీజనల్ – డాలాస్, 1999 లో లక్ష్మీ కె. గౌడ్ “ముత్తైదువు” పన్నెండవ తానా వార్షిక సంచిక – సిన్సినాటి, 1999లో మాచిరాజు సావిత్రి “బొచ్చుకుక్క” పన్నెండవ తానా వార్షిక సంచిక, సిన్సినాటి, 1999 లో పిప్పిళ్ళ సూర్యప్రకాశరావు “ఎయిడ్స్ పాజిటివ్” పన్నెండవ తానా వార్షిక సంచిక సిన్సినాటి, 1999 లో “రవిశర్మ” కలం పేరు పూడిపెద్ది రవీంద్రనాధ శర్మ అసలుపేరు, “దేవలుడు బాబుకథ” అమెరికా భారతి, 1999 లో శ్రీనివాస ఫణికుమార్ డొక్కా “నేనూ – నాలేఖినీ” పన్నెండవ తానా వార్షిక సంచిక - సిన్సినాటి, 1999 లో సూర్యకాంతం పప్పు “అమెరికా ప్రయాణం” పన్నెండవ తానా వార్షిక సంచిక – సిన్సినాటి, 1999 లో వేలూరి వెంకటేశ్వరరావు “ఒక వంద గుంజీల గురించి” - ఈ మాట పత్రిక , 1999 లో విశ్వనాధ అచ్యుత దేవరాయలు “కథ కాని కథ” పన్నెండవ తానా వార్షిక సంచిక – సిన్సినాటి, 1999లో రాయుడు వృద్ధుల “మగతనిద్ర” తానా రీజినల్ – డాలస్, 2000 లో అక్కినపల్లి సుబ్బారావు “రైలు వెళ్ళిపోయింది” విపుల మాసపత్రిక, 2000లో దామరాజు సచ్చిదానందమూర్తి “మహాసభలు” మా వూరి కథలు, 2000 లో కలశపూడి శ్రీనివాసరావు “పిలుపు” ఆటా వార్షిక సంచిక – అట్లాంటా, 2000 కమల చిమట “భాషకందని మనిషి” ఆటా వార్షిక సంచిక – అట్లాంటా, 2000లో పూడిపెద్ది శేషుశర్మ “ఎండమావులు” ప్రవాసాంధ్రుల ఆశాకిరణం, 2000లో పుచ్చా అన్నపూర్ణ “ఆశయం”ఆటా వార్షిక సంచిక – అట్లాంటా, 2000 లో రాధిక నోరి “అబ్బాయి పెళ్ళి” ఆటా వార్షిక సంచిక – అట్లాంటా, 2000లో సాయిలక్ష్మీ కాళ్ళకూరి “ఇ, ఆ పెళ్ళి” ఆటా వార్షిక సంచిక – అట్లాంటా, 2000లో శ్యాంసుందర రావు పప్పు “పెళ్ళిమాటలు” ఆటా వార్షిక సంచిక – అట్లాంటా, 2000 లో వంగూరి చిట్టెన్ రాజు “చేగోడి కంప్యూటర్ కథ” మధురవాణి – హ్యూస్టన్ ఇలా అనేక కథలు వెలువడ్డాయి.

డెబ్భయ్యో దశకం నాటికి అమెరికాకు వచ్చే తెలుగువారి సంఖ్య క్రమంగా పెరగడంతో అక్కడి ముఖ్య నగరాలన్నింటిలోను తెలుగు సంఘాలు ఏర్పడటం, ఆ తర్వాత ఆ సంఘాలే చిన్నవో, పెద్దవో లిఖిత పత్రికలు ప్రచురించడం ఆరంభమైంది. ఆ తర్వాత కొంతకాలానికి అచ్చు పత్రికలు కూడా వెలువడ్డాయి. తెలుగు భాషా పత్రిక, మధురవాణి, తెలుగు ఆమెరికా పత్రికల్లో ఇక్కడున్న తెలుగు కథకుల కథలు ప్రచురించబడేవి. తొంబయ్యో దశక ప్రారంభంతో తెలుగు వెలుగు, తెలుగు పలుకు, ఇంద్ర ధనస్సు, తెలుగు వాణి, పత్రికలు వెలుగు చూసాయి. ఈ పత్రికలన్నీ అమెరికా తెలుగు కథకు అగ్రతాంబులాన్ని ఇచ్చాయి.

ముగింపు:

అమెరికా దేశం వలసవెళ్ళిన ప్రవాసాంధ్రులు వారి సమస్యలను ఎలా ఎదుర్కొని పరిష్కరించుకుంటున్నారో అమెరికా తెలుగు కథల్లో చిత్రించారు. పుట్టి పెరిగిన మట్టిమీద మమకారం, సంస్కృతుల మధ్య పౌరసత్వం, సప్త సముద్రాలను దాటి దేశంకాని దేశంలో పరాయీకరణలో మనవాళ్ళ జీవితాలను చిత్రిస్తూ అమెరికా తెలుగు కథలు మన సొంతగడ్డ మీద వస్తున్న కథల కంటే విభిన్నంగా అమెరికా తెలుగు కథకులు రాస్తున్నారు. అమెరికా దేశానికి వెళ్ళి అన్ని ప్రాంతాలకీ విస్తరించి అక్కడ వారి సమస్యలను, సుఖాలను, దుఃఖాలను అందుబాటులో ఉంచడానికి, ఆయా ప్రాంతాలలో స్థిరపడిన తెలుగువారి అనుభవాలను,అనుభూతూలను, చరిత్రను సాహిత్యరూపంలో పదిలపరచడమే కాక, భవిష్యత్ తరాలవారికి అందిస్తున్నారు ఇక్కడి రచయితలు. ఈ కథలపైన మరికొన్ని కొత్తవిషయాలతో పరిశోధనలు ఇంకా వస్తే మంచిదని నా సూచన.

ఆధార గ్రంథాలు:

1. వేణుగోపాలరావు, పెమ్మరాజు, 20వ శాతాబ్దంలో అమెరికాలో తెలుగు కథానిక మరియు అమెరికా తెలుగు సాహితీ వేత్తల పరిచయ గ్రంథం - వంగూరి పౌండేషన్ ఆఫ్ అమెరికా పబ్లిషింగ్, అమెరికా -2009.
2. కళ్యాణ్ కుమార్, తన్నీరు, చిట్టెన్ రాజు వంగూరి, అమెరికా తెలుగు కథా సాహిత్యం - ఒక సమగ్ర పరిశీలన - వంగూరి పౌండేషన్ ఆఫ్ అమెరికా పబ్లిషింగ్, అమెరికా. -2014.
3. అమెరికా తెలుగు కథలు - సామాజిక విశ్లేషణ.
4. అమెరికా తెలుగు కథలు - ఒకటవ సంకలనం.
5. అమెరికా తెలుగు కథలు - రెండవ సంకలనం.
6. అమెరికా తెలుగు కథలు - మూడవ సంకలనం.
7. అమెరికా తెలుగు కథలు - నాల్గవ సంకలనం.
8. అమెరికా తెలుగు కథలు - ఐదవ సంకలనం.
9. అమెరికా తెలుగు కథలు - ఏడవ సంకలనం.
10. అమెరికా తెలుగు కథలు - ఎనిమిదవ సంకలనం.