ఉపోద్ఘాతం:

చతుర్దశవిద్యలు అంటే నాలుగు వేదములు - ఆరు అంగములు, మీమాంసా – న్యాయశాస్త్రము పురాణము – ధర్మశాస్త్రములు ఇవి. దీనిలో పురాణములు చేర్చుటను బట్టి వైదికవాజ్మయం వెలసిన తరువాత వేదముల యందలి ఉపాఖ్యానములు విస్తృతముగా, నీతిబద్ధముగా, ఆకర్షణీయంగా, మిత్ర సమ్మితంగా, వ్రాయబడినవి వురాణములు. “వురాపి నవం యత్ తత్పురాణమ్" ప్రాచీనముగా కథ కన్పించి నప్పటికి నూతనముగా భాసించుటచే పురాణము అందురు. పురాణమునకు సామాన్య లక్షణము – “సర్గశ్చప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ - వంశానుచరితం చైవ వురాణం పంచలక్షణమ్” అని చెప్పబడినది.

మొదట సృష్టి - స్థితి - లయములు - మరల సృష్టి - వంశచరిత్రము అనగా దేవతల -మరియు - ఋషుల వంశ వర్ణనము, మన్వంతరకథా వర్ణనము, నూర్య చంద్రవంశరాజుల వర్ణనము మొత్తము అయిదులక్షణములు కల్గినగ్రంథములు పురాణములు అని భావము. అయితే పురాణములలో ఈ లక్షణాలు పూర్తిగా సమపాళ్ళలో లేకపోయిన ఒక పురాణంలో సూక్ష్మంగా చెప్పిన విషయం మరొక పురాణంలో విపులంగా ప్రస్తావింపబడుతుంది. ఈ పురాణములన్నీ వేదవ్యాసునిచే వ్రాయబడినవి అని సుప్రసిద్ధముగా ఉన్నది.

పురాణములు - ప్రాచీనత:

14వ శతాబ్ది ఉత్తర భాగమునందున్న శ్రీనాథమహాకవి కాశీఖండములో వేదవ్యాసునితో - కాశీ అన్నపూర్ణాదేవి అన్నట్లు ఒక పద్యముకలదు అది “ఎట్టు పురాణముల్ పదియునెన్మిది జెప్పి...ఒక్క పూటకు పొట్టకులేక తిట్టదు పుణ్యగుణంబుల రాశికాశికన్” ఇత్యాది ప్రాచీనవచనములు వేదవ్యాస విరచితములే - పురాణములు అని తెలుపుచున్నది. విమర్శలోకమున ఈ ఏకకర్తృత్వము అనగా ఈపురాణముఅన్నియు ఒకరే వ్రాసిరనుటకు అవకాశములేదు అని, ఈ పురాణములు అన్ని ఒకే కాలమున ఆవిర్భవించినవియని, వేరువేరు కాలములందు ఉద్భవించినవి అని రెండువాదములుకలవు.

ప్రస్తుతం ఈ పురాణ శబ్దము ఇదివరకు వైదిక వాజ్మయంకన్న పూర్వమే పురాణములు ఉన్నవి అనుభ్రాంతి కొందరికి కలదు కాని వేదములందు చెప్పబడిన పురాణ శబ్దము పురాతన కథాపరము కాని, వ్యాసకృతముగా చెప్పబడుపురాణములు అని అర్ధముకాదు.

పురాణములు - పరిధి :

ఈ పురాణ శబ్దము ఇతిహాసముగా చెప్పు భారతమును గూడ గ్రహించుచున్నది. కాని పురాణము పద్దెనిమిది పురాణములయందేవర్తించును. కాని భారతమందు అంతగా లోకప్రసిద్ధి లేదు. అంతేకాక “ఇతిహాస పురాణాభ్యాం వేదం సముబృంహయేత్" అను ప్రాచీనవచనమునుబట్టి వేదము యొక్క అర్ధమును తెలుసుకొనుట (పోషించుట), సమన్వయ పరచుకొనుట, ఇతిహస (మహాభారత) పురాణములచే చేయవలయును అని అర్ధము. ఇందులో పురాణ శబ్దము కంటే వేరుగానే భారతము పేర్కొనబడినది. కావున పురాణ శబ్దము భారతమునకు ప్రసిద్ధముకాదు. ఈవురాణములు కర్మ - భక్తి - జ్ఞానములను సులభముగా ఉపదేశించుచు నాస్తికత్వమును పోగొట్టుచు, విగ్రహారాధన విస్తరింపజేసినవి. యాగములందు ఎక్కువగా ప్రాధాన్యం పొందిన ఇంద్ర - అగ్ని- చంద్ర మొదలగు దేవతలు పురాణ వాజ్మయంలో అప్రధానులై శివ - కేశవ - బ్రహ్మదులే ప్రాముఖ్యమును పొందిరి.

అష్టాదశ పురాణములు - సంక్షిప్త పరిచయము :

ఈ పురాణములు మహాపురాణములు - ఉప పురాణములు అని రెండు రకములుగా విభజింపవచ్చును ఈ మహాపురాణములలో వాయు పురాణము ఉన్నదని కొందఱు - కాదు బ్రహ్మండపురాణమున్నదని కొందఱు అనుచున్నారు. ఈ పురాణములు అనఁదగినవి ఏవి అనుదానికి ప్రాచీనులు ఒక శ్లోకమును చెప్పిరి. అది

భద్వయం - మద్వయంచైవ - బ్రత్రయం వచతుష్టయం |

అ.నా.ప.లిం.గ.కూస్కాని పురాణాని విదుర్బుధాః||

భద్వయం అనగా భకారముతో ఆరంభమైన పేరుగల పురాణములు రెండు భాగవత పురాణము, భవిష్యపురాణము.

(1) భాగవతము:

మహవిష్ణు అవతారకథలను మరియు అత్యద్భుతంగా శ్రీకృష్ణతత్త్వము ప్రతిపాదించినది. ఇందలి శ్లోకముల సంఖ్య 18,000 (పద్దెనిమిదివేలు). ఇందు శ్రీశుకయోగీంద్రుడు - గంగాతీరమందుముని శాపగ్రస్తుడై ప్రాయోపవిష్ణుఁడైన పరీక్షిన్మహారాజుకు శ్రీ మద్భాగవతము చెప్పెను అని కథా సందర్భము.

(2) భవిష్యపురాణము:

వ్యాసమహర్షి శిష్యుడైన సుమంతుడు శతానీకునకు ఉపదేశించిన ధర్మ సారయుక్తమైనగ్రంథము. ఇందు రాబోవుకాలములో జరుగువివరీతములుమొ||నవి చెప్పబడినవి. ధర్మముగూర్చి అనేకవిషయమలు సోదాహరణముగా నిరూపంపఁబడినవి. ఇందలి శ్లోకముల సంఖ్య – 14,500 (పదునాలుగు వేల అయిదు వందలు).

మద్వయం - మకారంతో ప్రారంభం అయ్యే పురాణములు రెండు.

(3) మత్స్వపురాణము:

ఇందు సోమకాసుర సంహరమెనర్చి వేదరక్షణచేసిన మత్స్యరూపి అయిన శ్రీ మహావిష్ణువు, వైవస్వత మనువునకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు. ఇందులో 14,000 (పద్నాలుగువేల)శ్లోకములు కలవు.

(4) శ్రీమార్కేండేయపురాణము:

ఇది జైమిని మార్కండేయుల సంవాద ప్రధానమైనది. ఇందు దేవీ మాహాత్మ్య ప్రతిపాదకస్తోత్రములు కూడా కలవు. దుర్గాదేవి మాహాత్మ్యము చెప్పబడినది.

బ్రత్రయం- అనగా ’బ్ర’ అను అక్షరముతో ప్రారంభమైన పేరుగల పురాణములు మూడు.

(5) బ్రహ్మపురాణము:

ఈ పురాణము అన్ని పురాణములకంటే ప్రాచీనమైనది. ఇందు మరీచికి బ్రహ్మదేవుడు ధర్మము మొదలగు విషయములను గూర్చి చెప్పుట కలదు. ఇందలి శ్లోకముల సంఖ్య 10,000 (పదివేలు).

(6) బ్రహ్మాండ పురాణము :

ఇందు బ్రహ్మ - బ్రహ్మండము యొక్క గొప్పతత్త్వము, బ్రహ్యండవర్ణము, లోకవర్ణనములు మొదలగు అనేక విజ్ఞాన ప్రధాన విషయములు ఇందులో చెప్పబడినవి – ఈ పురాణములో జరిగిన విషయముల వర్ణనమేకాకుండా రాబోవు యుగముల కల్పముల వృత్తాంతము కూడ చెప్పబడినది. ఇందు భౌతిక విజ్ఞానము ఎక్కువగా చూపబడినది ఇందలి శ్లోకములు 12.200 పన్నేండువేల రెండువందలు.

(7) బ్రహ్మవైవర్త పురాణము:

చతుర్ముఖ బ్రహ్మదేవుని సృష్టి క్రమమును గూర్చి వివరించు ఈగ్రంథమును వసిష్ఠమహర్షి అంబరీష చక్రవర్తికి ఉపదేశించినట్లున్నది. ఇందులో అంబరీషునకు వైష్ణవభక్తుల నియమములు - ధర్మములు - మొదలగు విషయములు కూడా ప్రతిపాదించబడినవి. ఇందలి శ్లోకముల సంఖ్య - 12000 పన్నేండు వేలు.

వచతుష్టయం - వకారముతో ప్రారంభమైన పేరుగల పురాణములు 4 కలవు.

(8) వరాహపురాణము:

విష్ణుమూర్తి భూదేవికి వరాహవతార మాహాత్మ్యమును గురించి చెప్పుట ఇందలి ప్రధానవిషయము. ఇందలి శ్లోకములు - 24000 (ఇరవైనాలుగు వేలు.)

(9) వామన పురాణము:

ఈ గ్రంథమున త్రివిక్రముని అనగా వామనమూర్తి (మూడు అడుగుల చేత వ్రవంచమును ఆక్రమించినవాడు కావున త్రివిక్రముడను పేరు) మాహాత్య్మము - మరియు ధర్మ - అర్ధ - కామ - పురుషార్ధముల వర్ణనము బ్రహ్మ - విష్ణు - మహేశ్వరుల మహిమ మొదలగు విషయములు చెప్పిన్నట్లున్నది. ఇందు శ్లోకముల సంఖ్య - 14000 (పద్నాలుగు వేలు).

(10) విష్ణుపురాణము:

ఇందు మనోహరమైన అనేక ఉపాఖ్యానములతో ధర్మమును ఉపదేశించుట ప్రధానవిషయము. నారదవృత్తాంతము, సంసారి అగుట మొదలగు ఉపాఖ్యానములు ఎంతో ఆశ్చర్యముగా అహ్లాదముగా ఉండుట ఈగ్రంథమునకు శ్రీ మధ్భాగవతమునకు వ్యాఖ్యానము వ్రాసిన శ్రీధర పండితుఁడు వ్యాఖ్యానము వ్రాసెను. అట్లే విష్ణుభక్తాగ్రేసరుడైన విష్ణుచిత్తుడు కూడ ఈ విష్ణుపురాణమునకు వ్యాఖానమురచించెను. ఈ శ్లోకముల సంఖ్య 6000 ఆరువేలు. కాని ఈ పురాణ శ్లోకసంఖ్య విషయంలో చాలా అభిప్రాయభేదములు కన్పిస్తున్నది. కొందఱు 9000 మరి కొందఱు 24000 అని ఈ విధంగా చెప్తున్నారు. కానీ తరువాత వ్యాఖ్య వ్రాసిన శ్రీధర-విష్ణుచిత్తులు ఇద్దరు 6000 శ్లోకములచే

విష్ణుపురాణమునకు వ్యాఖ్యచేయుటనుబట్టి అదియే సరియైనదని భావింపవలయును.

కొందరు విష్ణుపురాణము - విష్ణుధర్మోత్తరపురాణము - ఒకే విషయము (ధర్మభోధకము) అగుటచే విష్ణుధర్మోత్తరపురాణమును 18 పురాణములలో వేఱుగా పేర్కొనరు.

(11) వాయుపురాణము:

ఈ పురాణ విషయమలో అనేక వివాదములున్నవి. ఇది మహాపురాణములలో చేరదని కొందఱివాదన. కాని ఇది మహాపురాణముగనే పరిగణించఁదగినది. ఎందుకంటే ఈ పురాణము అధ్యాయముల- ఖండములచివర “ఇతి శ్రీ మహపురాణే వాయుప్రోక్తే ద్వాదశసాహస్ర్యాం” ఇత్యాదివచనము ననుసరించి" మహాపురాణమని" యే చెప్పవలెను. అయితే ఈ వాయుపురాణము మొదట 24,000 ఇరవై నాలుగు వేల శ్లోకములనియు, మిగిలిన భాగములు లభింపని కారణముచేతనో ఏమో 12000 శ్లోకములు మాత్రమే ఉన్నట్లు చెప్పబడినది. ఇక ఈ వాయుపురాణమే “శివమహపురాణమని" తెలియుచున్నది. దానికి ప్రమాణము-

“యత్ర తద్వాయవీయంస్యాత్ రుద్రమాహాత్మ్య - సంయుతమ్ |

చతుర్వింశత్సహస్రాణి పురాణం శైవముచ్యతే ||”

అనఁగా వాయు ప్రోక్తముగా పరమశివమాహత్మ్మము ప్రధానముగా వర్ణింపఁబడునో అట్టి ఇరువదినాలుగు వేల శ్లోకముల మహాగ్రంథమే శివ పురాణము అని మత్స్య పురాణములోని శ్లోకము. మొదట 12,000 శ్లోకగ్రంథము వాయుపురాణముగా తరువాత లభించిన పూర్ణ గ్రంథమును బట్టి "శివ పురాణ"ముగా నిర్ణయింపబడినది.

(12) అగ్ని పురాణము :

ఇది భృగుమహర్షిచే "చయనము" అను యజ్ఞవిశేషము నందలి వేదికలకు ఇటుకలు సమకూర్చుట మొదలగు యజ్ఞవిశేషములను ఎక్కువగా ప్రతిపాదించిన 8,000 (ఎనిమిది వేల) శ్లోకములు కల గ్రంథము.

(13) నారదపురాణము:

ఋషీశ్వరులకు నారుదుడు బృహత్కల్పమునందలి ధర్మములుపదేశించుట ఇందలి విషయము. భక్తిని గూర్చి కూడ ఇందెక్కువగా నిరూపంచబడినది. ఇందలి శ్లోకములు 25,000 ఇరువది ఐదువేల శ్లోకములు, కాని మత్స్య పురాణయునందు ఈ పురాణ శ్లోక సంఖ్యలను నిర్ణయించునపుడు ఈ నారద పురాణము 23,000 ఇరువది మూడు వేల శ్లోకములుగా నిర్ణయింపబిడినది. 2000 శ్లోకములు ప్రక్షిప్తములై ఉండవచ్చును.

14) పద్మపురాణము:

ఇందు నదుల యొక్క క్షేత్రముల యొక్క కాలము యొక్క మహాత్మ్యము ప్రధానముగా వర్ణింపబడియున్నది. ఇందలి శ్లోకముల సంఖ్య 50,000 ఏబదివేలు.

(15) లింగపురాణము:

నందీశ్వరుడు, ఈశ్వరమహాత్మ్యము, అర్చన – కల్పము మొదలగు శివ - లింగ తత్త్వ ప్రతిపాదకమగు ఈగ్రంథమున 11 వేల శ్లోకములు కలవు (11,000).

(16) గరుడపురాణము:

సృష్టి క్రమములో యుగములు అనంతములు. అట్టి యుగములు అనేకములైనచో ఒక మహాయుగము. అట్టి మహాయుగములు కొన్ని ఒక కల్పము. అట్టి కల్పములలో గరుడ కల్పము ఒకటి. గరుడుడు ప్రధానుడైన కల్పములో బ్రహ్మాండమంతయూ గరుడునినుండే జన్మించునని గరుడుని మహాత్మ్యము శ్రీ మహావిష్ణువు ద్వారా చెప్పబడు ఈ పురాణమునందు 16,000 పదహారువేలశ్లోకములు కలవు.

(17) కూర్మ పురాణము:

కూర్మరూపమున అవతరించిన శ్రీ మహావిష్ణువు ఇంద్రుని సన్నిధియందున్న ఋషులకు ధర్మార్థ కామ మోక్ష రూప చతుర్విధపురుషార్ధములను బోధించు ఈగ్రంథమునందు (6,000) ఆరువేల శ్లోకములు కలవు.

(18) స్కందపురాణము:

ఈ పురాణము అన్ని పురాణముల కన్న చాలా పెద్దది. ఇందు కుమారస్వామి పరమేశ్వరుని ధర్మములు శివ మహాత్మ్యము వర్ణించుట ప్రధానముగా ఉండు విషయము. ఇందు 50 ఖండములు ఉన్నవి. ఇందు శివక్షేత్రములు విపులముగా నిరూపింపబడినది. "కాశీఖండము"| నందు కాశీ క్షేత్రము యొక్క ప్రస్తుతి ఒక ఉదాహరణము. ఇట్లే "రేవాఖండము" ఇందే “సత్యనారాయణస్వామి వ్రతకల్పము" మొదలగు అనేక వ్రతములను గూర్చి చెప్పబడినవి. ఇందలి శ్లోక సంఖ్య "లక్ష".

ఈ విధముగా 18 పురాణములు దేవతారాధన బోధకములుగా ఉపాసనాబోధకములుగా కర్మలను నిరూపించునవిగా భక్తిని ప్రబోధించునవిగా, ధర్మమును ఆచరింపఁజేయునవిగా భరతఖండమందు "ఆస్తికమతము" స్థిరపడుటకు కారణములైనవి.

పురాణములు - అభిమతములు

లౌకిక సంస్కృత వాఙ్మయము నాటక రూపముగా కావ్యరూపముగా పలురకములుగా ఆవిర్భవించుటకు ఈ పురాణేతివృత్తములే మూలమైనవి అను విషమయు అందరకు తెలిసినదే. ఇక్కడ తెలుసుకొనవలసినవిషయము ఇంకొకటికలదు. ఈ పద్దెనిమిది పురాణాలలో ఒకటిగా చెప్పబడుచున్న శ్రీమద్భాగవతము మహపురాణముకాదని దేవీభాగవతము మహాపురాణమని కొందఱు చెప్పినారు. "శాక్త" మతావలంబులు అనఁగా దేవీ పూజాతత్పరులు దేవిభాగవతమే మహావురాణమని వైష్ణవులు శ్రీమద్భాగవతమే మహాపురాణమని మతాభిమానుల కలహముతో నేది మహాపురాణముగా గ్రహింపవలెనో సందేహమేర్పడుచున్నది. దీనిని గూర్చి ప్రాచీన కాలమునుండి ఖండన, ప్రతి ఖండనములు బయలు దేరినవి కానికొన్ని ఉపపురాణములు ఈ రెంటినీ మహాపురాణములలో చేర్చినవి కాని విమర్శ దృష్టితో చూడగా శ్రీ మద్భాగవతమే ప్రాచీనము దేవీభాగవతము తరువాత వెలసినది. ఈ రెంటికి వేదవ్యాస మహర్షియే కర్త అని చెప్పవలయును.

ఈ పురాణములలో - బ్రహ్మకైవర్తము - బ్రహ్మవైవర్తము అని కూడ మహాపురాణములో పేరు కన్పించుచున్నది. ఈ రెండు పేర్లు ఒక్క పురాణమునకేగాని రెండు పురాణములని భావింపకూడదు.

(1). ఈ 18 పురాణములను సాత్త్వికములు - రాజసములు - తామసములు అని మూడు రకములుగా కొందఱు విభజించి ఉన్నారు. అవి శ్రీ మన్నారాయణ మహిమవర్ణన ప్రధానంగా కలవి విష్ణు - నారద - భాగవత - గరుడ - పద్మ - వరాహ పురాణములు - సాత్వికములు. ఇవి మోక్షమునిచ్చుగ్రంథములు.

వాణీ - చతుర్ముఖ బ్రహ్మ, అగ్ని దేవతల మహిమ ప్రధానముగా ఉన్న పురాణములు రాజసములు. స్వర్గఫలమునిచ్చుగ్రంథములు. మిగిలిన పురాణములు తామసములు అని చెప్పిరి ఇది పారాశర “ఉపపురాణములో చెప్పబడినది".

(2). ఈ మహాపురాణములలో మొత్తము 4 లక్షల శ్లోకములు కలవు. ఇందులో శివ - భవిష్య - మార్కండేయ - లింగ - స్కంద - వరాహ - వామన- మత్స్య - కూర్మ - బ్రహ్మాండ పురాణములు 10 శివతత్త్వ ప్రతిపాదికములు. వీటన్నింటిలో కలిపి 3,00,000 శ్లోకములు మూడు లక్షల శ్లోకములు. విష్ణు - భాగవత - నారద - గరుడ పురాణములు విష్ణు మహిమను వర్ణించునవి. బ్రహ్మ - పద్మ - పురాణములు బ్రహ్పదేవుని వర్ణించునవి. అగ్ని పురాణము అగ్నిదేవుని - బ్రహ్మకైవర్మము (లేక బ్రహ్మ వైవర్తము) సూర్యుని చెప్పుచున్నవి అని స్కందపురాణములో చెప్పబడినది.

ఆధారగ్రంథాలు:

1. శ్రీ మన్మహాభాగవతము, వ్యాసప్రణీతము - శ్రీధరీయవ్యాఖ్య.

2. శ్రీ మద్దేవీభాగవతము, వ్యాసప్రణీతము.

3. అష్టాదశపురాణాలు

4. కాశీఖండము - శ్రీనాథ మహాకవి