ఉపోద్ఘాతము:

శాక్యవంశ శుద్ధోధనుని కుమారునిగ గౌతమబౌద్ధమతము భారతదేశములో పుట్టినది. కాని ఈగడ్డదాటి చైన, జపానువంటి దేశములలో వ్రేళ్ళూనుంది. విష్ణ్వావతారముగ హిందూ పురాణ ములలో బుద్ధావతారము చేర్చబడింది. కాని పురాణ బుద్ధుడు వేరు. 6వశతాబ్ది నాటి చారిత్రిక బుద్ధుడు వేరు. ఇద్దరికీ సంబంధము లేదు. పురాణ, చారిత్రిక బుద్ధుడు భగవదంశలుగ కవులకు కావ్య వస్తువులయాయి. విష్ణువు అవతారముగా లేదా భగవదంశగ విశ్వవ్యాప్త బౌద్ధమతస్థులు తో సమానముగ తెలుగువారుఆరాధిస్తారు. నన్నయభారతము వెలుగులోకి వచ్చేవరకు బౌద్ధమతము కూడ అవలంబించారు. ఈ శాక్యముని సిద్ధాంతమునకు పద్య సాహిత్యగౌరవము కలిగించారు. వాటిలో ఆధునిక పద్యకావ్యముగ కరుణసౌగతము పరిశీలన ఈ వ్యాసోద్దేశము.

మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామ, పరశురామ,బలరామ, కృష్ణ, కల్కి అవతా రములుగ దశావతారములు ప్రసిద్ధి. కాని 8వ అవతారమునుబలరామకృష్ణులను ఏకావతారముగ పరిగణించి కృష్ణావతారమన్నారు.9వ అవతారముగ బుద్ధునిచేరుస్తున్నారు. భగవంతుని ఏకవింశ్యతి అవతారములను భాగవతము చెప్పింది. విష్ణువు బుద్దుడుగ అవతరించిన తరువాత కల్కిని 10వఅవతారముగపేర్కొంది.

అగ్నిపురాణములోని కథాసంవిధానముతో నామసామీప్యము తప్ప, ఆ పురాణములోని ఇతివృత్తము చారిత్రిక గౌతమబుద్ధునికి సరిపోలదు. హరివంశము లో కూర్మ, బుద్ధా వతారముల ప్రసక్తిలేదు. ప్రాచీన పురాణాలకథనం ప్రకారం త్రిపురాసురులశక్తి వారిభార్యల పాతివ్రత్యములో ఉంది. త్రిపురాసుర సంహారసమయంలో శివునికి సహాయము కోసము బుద్ధుడిరూపు విష్ణువు దాల్చాడు. త్రిపురాసురుల భార్యల పాతివ్రత్యము భంగము చేసిన రూపమది. ఈ విషయము మనకు అన్నమయ్యకీర్తన… పురసతులమానముల సొల్లచేసిన చేయి’’ ….అన్నకీర్తనగ, ఆపన్నివారక స్తోత్రము, “దైత్యస్త్రీమనభంజినే’’ లో ఉదహరింపబడింది(‘బుద్ధుడు’వికీపీడియానుంచి)

(భాగవతముప్రథమస్కంధములో ఏకవింశ్యతి అవతారములలో బుద్ధావతారముంది. పురాణబుద్ధుడు తండ్రి కూడ శుద్ధోధనుడు.. కల్క్యవతారానికి ముందు దేవతలకోరికపై బుద్ధుడిగ అవతరించి దైత్యులను బౌద్ధమతము స్వీకరించేలాచేశాడని అగ్నిపురాణము (146పే అవంచి సత్యనారాయణ… బుద్ధ కల్క్యవతారము) .. చెప్పింది. ఈబుద్ధుడు తిరిగి కల్కిగా అవతరిస్తాడన్నది కథనం.)

6వశతాబ్దములో బౌద్ధమతము పుట్టింది. 11వశతాబ్ది వరకు హిందువులపై ప్రభావము చూపింది. చారిత్రిక బుద్ధుని తండ్రిపేరుకూడ శుద్ధోధనుడని బుద్ధచరిత్రలు చెబుతాయి. చైనాభాషలోకి కూడ అనువదింపబడిన అశ్వఘోషుని (2ndcentury A.D) సంస్కృత బుద్ధచరిత్ర, సౌందరనందము ఆధారముగ తెలుగులో వచ్చిన చారిత్రిక బుద్ధుని రచనలు  పరిశీలించదగ్గవి. చరిత్రకు అందిన బుద్ధుడు స్థాపించిన బౌద్ధమతము, బుద్ధుడు బోధనలు గురించిన సాహిత్యమునకు, పురాణమార్గము ననుసరించిన సంప్రదాయకవులు మక్కువచూపిన ఈ విషయము విస్మరించరానిది.

తిరుపతి వేంకటకవులు బుద్ధచరిత్ర రాశారు. పింగళికాటూరి సౌందరనందము రాశారు. కరుణశ్రీ ప్రేమమూర్తి బుద్ధచరితమె. ఆకవులకోవలోనే సాగినరచనగ మానవతావాది బుద్ధుడుగ కరుణాసౌగతము అనే కరుటూరి సత్యనారాయణ గారి రచన ప్రయోజనపరిశీలన ఈవ్యాసము.

కవి కరుటూరి సత్యనారాయణగారు కరుణాసౌగతము పద్యకావ్యము బుద్ధునిగురించినది. మహాకవులు కొనియాడారు జ్ఞానపీఠ కవి విశ్వనాథకవివారు, రోచిరాంశనముపేరిట పీఠికలో ప్రశంసించారు.సరస్వతీపుత్ర పుట్టపర్తివారు అభివందనము అంటూ కొనియాడారు., కరుటూరివారి శైలిసహజత్వమదినిరుపమాన మన్నది మల్లంపల్లివారి పీఠిక. కరుటూరివారి కరుణాసౌగతమునకు అక్షరాంజలిగ. పద్యకవితాభిమానులను ఉన్మీఖరిస్తాయి. కరుణాసౌగతము, ఆద్యంతముచదివిన తరువాత  ఆధునికపద్య కావ్యముగ రసానుభూతి కలిగించగలిగిన పద్యకూర్పు అనిపించింది.

కరుణాసౌగతము పద్యకవితాప్రియులను అలరింపచేస్తాయి. 369పద్యముల ఈ ఖండకావ్యము మొదటి నుండి చివరిపద్యమువరకు అలవోకగా కాదు బుద్ధునిపట్ల ఆరాధనా భావముతో చదివింప జేస్తాయి. ఆనాడైనా, ఈనాడైనా శరణాగతబుద్ధుని కోకొల్లలు ప్రజలలో ఒకరిమవుతాము.

కరుణాసౌగతము ఆస్వాదించడము అంటే కారుణ్య మూర్తి బౌద్ధవిహారముగ లీనమవడము. రసప్లావితములై, శిలాహృదయములను ద్రవీభూతమొనర్చిన సుగతునిసూక్తులవి. రాజును, కింకరుడును పండితుడును పామరుడును, ధనిక-పేదవ్యత్యాసము లేకుండా మానవతా వాదిగా ఆకర్షించిన బుద్ధుని రూపకల్పన చేశానని కరుటూరివారుచెప్పుకున్నారు.. అక్షరసత్యములుగ తథాగతునికి శరణాగతము. చేయిస్తాయి.

కిటకిటలాడిపోయె పరికింపగ మార్గము- కాని –చీమయున్ ‘చిటుకనదింతయున్ బురికిఁ జేరువనున్న వనంబునందునన్--కుటజమునీడ శ్రీఘనుఁడు కూరిమి ప్రోవయి కూరుచుండె- నంతట జనులాస్థమై తలలఁదాల్చిరి తత్పదపద్మరేణువుల్’…బుద్ధుని మనకనులముందు సాక్షాత్కరింజేశారు సత్యనారాయణ. అంగుళిమాలుడు పాదాక్రాంతు డయ్యాడు. ఆమ్రపాలి దుఃఖమును మరిచి పోయింది. వృద్ధురాలిచ్చిన కానుక, తోటమాలి సుదాసుడు అర్పించిన పద్మము, కాటకమును దూరము చేసిన సుప్రియ కురిపించిన వర్షము, కిసగౌతమి వేదాంతభావన, అజాతశత్రుని తాపోప శమనము, కోరికతీరిన సునీతుడు, సుజాతవిందు, న్యాయవిచారణలో బుద్ధుని విశాల హృదయము---కుశినారలో మహాపరి నిర్వాణము వరకు బుద్ధుని కరుణాసౌగతము ప్రతిశీర్శికకు వచనములో కరుటూరివారు సన్నివేశ రూపకల్పన గురించిన వివరణ బుద్ధుని బోధనలుగ ఎవరియందైనను పరివర్తన కలిగించేవనడం అతిశయోక్తి కాదు అన్నారు పద్యములో.

‘కరుణాస్విన్నములైన బుద్ధకథలాకర్ణింప గ్రావమ్ములున్-- గరగున్, గుండెలఁ బీటపెట్టుకొను కార్కశ్యమ్ము, వైక్లబ్యమున్-- మరుగై, మానవతాప్రరోహములు ధర్మజ్యోతి దీపింపఁగా పరమోత్కృష్ట పథమ్ము లభ్యమగు నిర్వాణాధ్వ పాంథాళికిన్’

కరుణాసౌగతములో మొదటివాడు అంగుళిమాలుడు. మూఢభక్తిగల గురుదక్షిణగ కరాంగుళులను నూరింటిని నఱికి ఇవ్వాలనుకున్నాడు. దారికాసి జనులవి తొంభైతొమ్మిదింటిని అంగుళిమాలగా మెడలో ధరించాడు. నూఱవదానికి తల్లివ్రేలినే త్రుంపాలనుకున్న గజదొంగ. ‘అంగుళిమాలా, సోదరా’—అని బుద్ధుడు చేసిన సంబోధన, అంగుళిమాలునిలో తెచ్చిన మార్పు రసవత్తర ఘట్టము. తోటిమానవుల సద్భావనమె ముఖ్యము. పిచ్చినమ్మకములు క్షంతవ్యములు కావు. గురుదక్షిణగా దుష్టగురువు చేసిన మోసమిది. అటువంటి ఆచార్యుడు పూజార్హుడు కాడని బుద్ధుడు ప్రబోధించాడు. కనుల మాయాజాలము వీడిన అంగుళిమాలుడు బుద్ధుని చరణసేవన భాగ్యము కోరుకున్నాడు.

చిఱునవ్వొక్కటి శాస్త నేత్రములఁదోచెన్ మందమందమ్ముఁగా

గురియించెన్ దయ వానిశీర్షమును మూర్కొంచున్ గృపామూర్తియా

దరముంజూపుచు- తస్కరుండపుడు పాదాబ్జమ్ములన్ వ్రాల ‘సో

దర! లెమ్మంచు’ ననుగ్రహించె జినుడంతఃపూర్ణకారుణ్యుడై (32ప)

ఇక్కడొక పరిశీలనాంశము ఆవంత్స సోమసుందర్ లేవనెత్తారనికల్లూరి భాస్కరం సారంగసాహిత్య అంతర్జాల పత్రికలో వ్యాసము ప్రచురించారు. కల్లూరి భాస్కరం సంస్కృతకళాశాల (భీమవరం) అధ్యాపకులు కల్లూరి సుబ్రహ్మాణ్య్ దీక్షితులుగారి కుమారులు. కరుణాసౌగతము కావ్యరచయిత వాణిజ్యపన్నుల అధికారి. కాబట్టి నవంబరు 26, 2014 చాంబరాప్ కామర్సు భవనంలో కావ్యావిష్కరణ సభ ఏర్పాటు చేసుకున్నారు. ఆసభలో దీక్షితులుగారు ప్రసంగీకులు. ఆవంత్స సోమసుందర్ గారు సౌందరనందకావ్యమును ప్రశంసిస్తూ గురువులందరూ శిష్యద్రోహులే అన్నారటని ఆవ్యాసములో పేర్కొన్నారు. వివాదానికి దారితీస్తుంది.

అంగుళీమాలుడేకాదు, ఏకలవ్యుడుకూడ ద్రోణుడుచే వంచింపబడ్డాడుకద. కానినిజానికి ఏకలవ్యుడు వంచింప బడలేదు. ఏకల్వ్యుని కథ.. ఒకసందేహముఅని నాతెలుగు సాహిత్యములోధనుశ్శాస్త్రముముద్రిత గ్రంథములో 14వపేజిలో చెప్పనివిద్యకు ఉత్తమగురువుగ ద్రోణుడుగురుదక్షిణ కోరలేదు. ద్రోణరూపు విగ్రహము మన్నున మర్చిన సంతతాభ్యాసము స్వయంకృషికి ఒకగ్రంథమిచ్చి సహకరించాడని భావించాను. ఉప వేదమైన ధనుర్వేదము నిషాధునికందించాడన్న అపఖ్యాతి కన్న విషాదగాథగా ద్రోణుడు మిగిలాడన్నది నా భావన. మయసభవంటి సాంకేతిక విజ్ఞానము ద్రోణవిగ్రహనిక్షిప్తమా?

ఆంధ్రదేశంలో బ్రాహ్మణులు మాత్రమే హిందూదేవతలను ఆరాధించారు. వ్యాపారస్తులు, రైతులు బౌద్ధమతాన్ని అభిమానించారు. రాజులైన శాతవాహనులు ఉభయులను సమదృష్టితో చూసేవారు. గౌతమీపుత్రశాతకర్ణి తల్లి బౌద్ధులకు అనేకదానధర్మాలు చేసింది (మతకులవ్యవస్థ 25పేజి… ఆంధ్రుల సంక్షిప్తచరిత్ర,, ఏటుకూరు బలరామ మూర్తి) బి.ఎస్.ఎల్ హనుమంతరావు గారి ఆంధ్రుల చరిత్ర ప్రకారం, .. భర్త వైదిక మతము అవలంబిస్తే భార్య బౌద్ధ, జైనములలో ఏదోఒకటి ఆచరించేది.

‘నలువకు నాల్గునాల్కలట,నర్తన మాడెడు నీతనూప్రభల్

తలకొకదారి వింతగతులన్, మొరయించిన మోసపోయివా

దులుగొని మచ్చరింతురు బుధుల్, తదుదగ్రరుషాతమమ్ముపై

వెలిగెడు నీదుచిర్నగవు వెన్నెల పండువు మాకు భారతీ!’ (సారంగ సాహిత్యపత్రిక)

కరుణాసౌగతము ఆవిష్కరణ సభలోచెప్పిన ఈ సుబ్రహ్మణ్యదీక్షితులిగారి పద్యమును కల్లూరిభాస్కరం గారి వ్వడంసముచితముగా ఉందని బ్రాహ్మణ,బ్రాహ్మణేతరులందరికీ దైవస్వరూపుడిగ బౌద్ధమతము, బుద్ధుడు ఆదరణీయమైన కథాంశములతో పద్యకావ్యముగ కరుటూరివారి కరుణాసౌగతము సర్వజనామోద రసానుభూతినే కలిగిస్తుంది. రసమా?భావమా? అన్నచర్చకు తావులేదు.

ఆమ్రపాలికి సౌందర్యమే శత్రువైంది. నగరవేశ్యగా మారిపోవలసి వచ్చింది. ఆమ్రపాలి బింబిసారుని వల్ల విమలుడనే కుమారుని కన్నది. ఆమెసోదరుడు ఆనందునితోబాటు కొడుకు విమలునికూడ బుద్ధుడు బౌద్ధభిక్షువులుగా మార్చాడు. కొడుకువిమలుడు తల్లివద్దకు భిక్షకు వచ్చాడు. తల్లడిల్లిన మాతృహృదయము బుద్దుని ప్రశ్నించిన పద్యము అద్భుతము. ‘గుండెలో నింగలమున్ రగిల్చితి’ వంటుంది.

అందములోన సుందరులనందఱి పందెమువైచిగెల్వగా

పొందికలుండియున్ జనకుఁబూనికకుందలయొగ్గి సంఘమా

నందము నంద నేనపుడు నర్తకినైతి- కుటుంబజీవితం

బుందలపోయ కీపగిది పూజ్యుడ! నాయెడ కూడ వైరమా!

అనివాపోయి-‘దైత్యునివోలె సోదరుడు దాపురమై-మమువేఱుచేసె’  నావంతను మాన్పకే సుతుని వంచన దూరము చేసినాడవే --- కన్నులముందు భిక్షువుగఁ గాంచుచుఁ గాలముఁ బుచ్చుచుంటిగా — నీకిపుడర్థమౌనె-ఈ తల్లియెడంద- చెప్పెదవు ధర్మము లోకమునుద్ధరింపగా అని వెలిబుచ్చిన ఆవేదన వ్యక్తనను వర్ణించినతీరులో నిరుపమాన పద్యశైలి కనబరచిన ఆర్ద్రత మాటలకందనిది. కాని బుద్దుని సాంత్వవచనములతో ఆమె సేదతీరింది. అవి చదివితీరాలి. ఉదాహరణకు ఈ పద్యము చూడండి.

సాదరపేశలమ్ములగు సాంత్వన వాక్యములాలకించి, జ్ఞా

నోదయమై ప్రభాత పవనోర్మికలన్ మనసెల్ల నిర్మలం

బైదమితార్తియై హృదయభారము తీఱఁగ మ్రొక్కె శాస్తకున్

గాదిలిపట్టిమీఁది మమకారము విశ్వపరీతమైచనన్

- బుద్ధుని మహత్వవర్ణన ఈపద్యము.

నిస్వార్థజీవితవృద్ధస్త్రీ బుద్ధునికి సమర్పించిన దానిమ్మపండు అమూల్యమైన ధనవంతుల కానుకకన్న గొప్పది. శబరిని ఆదరించిన రామకథ గుర్తుకువస్తుంది. తథాగతుడు ఆమెను ఎదురుగాబోయి నలతపోగొట్టి మృదూక్తులాడాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ‘ముసలితల్లి భక్తినర్పించు దాడిమీ ఫలముతోడ కావలెనుసుండు నిస్వార్థజీవితములు’అని అందరినీ ప్రబోధించాడు.

 కరుణాసౌగతము కానుక గురించిన వివరణఖండిక 28వపద్యము మరపురానిది. సుదాసుడనే తోటమాలి తాను పూయించిన పద్మమును బుద్దునికే అర్పించాలనుకున్న మనోగతము 32 పద్యాలు. సుప్రియ పేదరాలు. ఆమె ప్రతివారినీ యాచించి ధనము, వస్తుసంభారములు సంపాదించి క్షామ విలయతాండవము నాపుతానన్నది. వర్షముకురిపించిన ఆమె ప్రజాక్షేమభావన ఏసంపదలకూ అందనిది.

లెక్కకెక్కువైనమిక్కిలిసిరిగల్గి - ప్రోదిసేయుపొలము,పుట్రఁగల్గి

బిచ్చగత్తెపాటికచ్చింపనేరక - సిగ్గుపడిరి ధనికులెగ్గుగొనుచు - సార్వకాలీనప్రబోధము ఈ పద్యము.

దుఃఖములేని ఇంటినుండి గుప్పెడు ఆవాలు తేలేకపోయింది లోకములో విధినిర్ణయములకు శాంతి కలిగించే ప్రక్రియ వేదాంతము కిసగౌతమి కథ. సుగతుని పద్యబోధనలో భారతగాథను గుర్తుతెచ్చింది. అజాతశత్రువు, సునీతుడు బుద్ధుని ఆగమ నిరీక్షణలో..ఒకొక్కపద్యము ఒకొక్క రసగుళిక.

పతితపావనమూర్తి! నాపసిహృదయము -  వేచియుండె ప్రబోధమ్ము వినగనేడు

మంచిసమయము -- జన్మతరించుటరిదె?- జాలిచూపుము – నాయెడశాక్యసింహ!

ఈపద్యములో కరుటూరివారి కరుణాసౌగత తాదాత్మ్యము కనిపించింది. ఇకసుజాత ఒక సామాన్య స్త్రీ. భగవదార్పణము అంటె ఆకలిగొన్నవానికి అన్నమిడడమనే మేలుకొలుపుగ బుద్ధుడని హృద్య పద్యము లలో వర్ణించారు. బుద్ధుడంతటివాడు న్యాయవిచారణ ఎదుర్కొన్నాడన్న వృత్తాంత పద్యములు కరుణా సౌగతమునకు అపూర్వరచనగా పద్య ప్రియత్వమును చాటాయి. మహాపరి నిర్వాణము పద్యములు హృద్యము. సర్వజనప్రియముగ బుద్ధుని అభిప్రాయము జినదేవుని కరుణా సౌగతము ఈక్రిందిపద్యము.

పరినిర్వాణము మాట నేనెఱుగుదున్ భావమ్ము సంపూర్ణమై

వఱలున్ మీకిసుమంతచెప్పినయెడన్ బాధించు నీసంగతుల్

తరమా మాన్పగ- నేడు సాలవనమధ్యంబందు నీరీతిగా

జరుగున్ దప్పక మోహబుద్ధి విడి వైశద్యమ్మునన్ సాగుడీ

నేపొనరించెడు కార్యము

లీపుడమినిలేవు, ప్రాణహితమొనరింపన్

తీపునుమాపు ప్రబోధం

బేపుఁ గావింపవలయు నెప్పుడు మీరల్

మనసునందలి తిమిరము మాయచేసి, శీర్ణపర్యము తనువు త్యజించినను, బుద్ధ నిర్వాణ దుఃఖము చీకటిగా భావించవద్దు. తిమిరములో నిండుపున్నమి వెన్నెలై ప్రకాశిస్తుంది. కరుణసౌగతము నింగి నేల అంతటా వెన్నెలై వ్యాపించిఉంది. అజ్ఞాన తిమిరాన్ని ప్రారదోలుతుంది.

వ్యాసరచనకు సహకరించినవి:

1. పోతనభాగవతము, ప్రథమస్కందము, TTD Publications.

2. అగ్నిపురాణము, victory publications, 2008, ఆవంచిసత్య నారాయణ.

3. సారంగి అంతర్జాల సాహిత్య పత్రిక, 2014 నవంబరు.

4. ధనుశ్శాస్త్రము, 2002, జొన్నలగడ్డ మార్కండేయులు.

5. ఆంధ్రులసంక్షిప్తచరిత్ర, విశాలాంధ్రపబ్లికేషన్స్, ఏటుకూరుబలరామ మూర్తి.