ఉపోద్ఘాతం:

నరమేధము అంటే నరుడు బలిపశువుగా చేయబడిన యజ్ఞము. వినడానికి గగుర్పాటు కలిగిస్తుంది. వాజపేయిసంహిత 30-31 అధ్యాయములో పురుషమేధవిధి పేరుతో నరబలి విధివిధాన ముంది. ప్రక్షిప్తము కావచ్చు. జంతు, నరబలి పరిశీలించదగ్గ విషయాలున్నాయని ఈవ్యాసము మనవి.

వైదికాంశాలు:

యజ్ఞపశువుగా యూపస్థంభానికి ఉత్తమ, మధ్యమ, అథమ దేవతాయోగ్యతనుబట్టి పురుషులను మాత్రమేకాదు… స్త్రీలను కూడ సోమయాగము పేరిట నరబలికిఎంపికుండేది. నరమేధము తంతు ఐదురోజులపాటు సాగేదన్నవేదవాక్కు ప్రశ్నింపబడి ఆసక్తి కలిగిస్తుంది.

వేదములలో పేర్కొనబడిన హరిశ్చంద్రుడు, గాంథి మహాత్ముని కాదర్శప్రాయుడైన లోకవిఖ్యాత హరిశ్చంద్రమహారాజు వాస్తవానికి ఒక్కరే. కాని వాసాప్రభావతి పరిశోధకురాలు సిద్ధాంతవ్యాసము ప్రకారము వేదహరిశ్చంద్రుడు సత్యవంతుడుకాదు. భార్యాబిడ్డలకోసము ఆలుబిడ్డలనమ్మలేదు.

శునశ్శేపునికథగ ఐతరేయబ్రాహ్మణములో ఉంది. హరిశ్చంద్రుడు జలోదరమనే రోగమును తగ్గించు కోవడానికి రోహితుడను కన్నకుమారుడిని వరుణిడికి నరమేధంగా సమర్పిస్తానని మాట తప్పాడు. అందుకు బదులుగా అజీగర్తుడనే బ్రాహ్మణుడి కుమారుడిని శునశ్శేపుడనువానిని క్రయానికి కొని నరబలికి సిద్ధము చేసిన పుత్రవ్యామోహి. అసత్యవాదిగ హరిశ్చంద్రుడు జమదగ్ని అనేపేరుగల ఋషి పర్యవేక్షణలో నరమేధఏర్పాట్లు చేశాడు.

వరుణప్రీతిగా జరప నిర్దేశించిన యాగమది. కాని శునశ్శేపుని బలిపశువుగా నరకడానికి మునులు ముందుకు రాలేదు. జుగుప్సాకరంగా మరో వందగోవులిస్తే తానే తలనరుకుతానని శునశ్శేపుని కన్నతండ్రి ముందుకురావడం విశ్వామిత్రుని కలచివేసింది. విశ్వామిత్రుడు చూపిన చొరవ శునశ్శేపుని రక్షించింది. ఇంద్ర, వరుణ, అగ్ని దేవతలు ప్రసన్నులై నరమేధాన్ని నిరశించారనికథనం. శునశ్శేపుని విడిపించి అతనిని దత్తపుత్రునిగ విశ్వామిత్రుడు స్వీకరించాడు. అంగీకరించని కారణాన కన్నకుమారులను శపించిన తండ్రిగా విశ్వామిత్రుడు కనిపిస్తాడు. శపింపబడిన వారిలో ఆంధ్రులు ఉన్నారని రామాయణముకూడ చెబుతుంది. మహాభారతముకూడ శునశ్శేపునికథ కలిగి ఉంది.

నరమేధము కొరకు యజ్ఞపశువులా కొడుకును అమ్మినవాడు ఒక కన్నతండ్రి, పుత్రప్రేమతో బలిపశువుగా వేరొక తండ్రికుమారుని కొనుక్కున్నవాడు ఒకతండ్రి. ఈ అనాగరికము ‘సత్యమేవజయతి’ హరిశ్చంద్రుడు కథ ఆవశ్యకతగ శునశ్శేపనరమేధ కథ పురాణగాథగ మారిపోయింది.

శునశ్శేపుడు వరుణదేవునికి, అలాగే నాచికేతుడు, యమదేవతకు… వేదగాధలలో నరపశువులుగా సమర్పింప బడ్డారు . రక్షింపబడ్డారు. యజ్ఞవాటికలలో యూపస్తంభాలకు బలిపశువులవలె కట్టబడిన నరబలి అగిపోయింది. విశ్వామిత్రుడివంటివారిచే నిరసింపబడింది. సత్యహరిశ్చంద్రుడికథపుట్టింది. కాని సౌఖ్యజీవితానికి వరాలివ్వగల దేవతాప్రీతికి మూఢనమ్మకముగా నరబలి ఆనవాళ్ళున్నాయా?

జానపదాంశాలు:

యజ్ఞపరంగా ఆగిపోయాయేమోగాని నరబలులు జరిగాయని సాక్ష్యాలు చూపుతున్నారు. తెలుగు జానపదగేయాలు సిద్ధాంతగ్రంథములో నాయనికృష్ణకుమారి (సూత్రారాధనాంశములు236పేజిలో) నరబలిగురించి చెప్పారు. చోటానాగపూర్ బ్రహ్మపుత్రలోయలో ఆటవికజనులు పంట అక్షయమవాలని పరదేశి ప్రజలను, ముఖ్యంగా బ్రాహ్మణ బాలురను దొంగిలించి బలియిచ్చిన విషయంప్రస్తావించారు. పంటలకోతల సమయంలో ఈఆచారమును గురించి J.G.FRAZER…THE GOLDEN BOUGH కూడ పేర్కొన్నాడని ఆమె చెప్పారు.. ఇది వేదకాలమునాటి శూలాగవ యాగము వంటివానిలో వృషభవధ లాంటిదని పేర్కొన్నారు. కాత్యాయనస్రౌతసూత్ర ప్రకారము నరబలి ఉత్కృష్టమనిప్రచారమైందన్నది సంస్కృతవిద్వాంసుల మాట విచారణీయము.

కౌశంబి పట్టణములో బయటపడిన ఒకయజ్ఞవేదిక నరమేధము జరిగిందనడానికి సాక్ష్యమని జి.ఆర్. శర్మ అనే పురాతత్త్వశాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు(Roshan Dalal…Hinduismm} కౌశంబి నేడు చారిత్రిక స్థలము. యమున ఒడ్డున అలహాబాదుకు సమీపములో ఉత్తరప్రదేశ్ రా ష్ట్రములో ఉంది.

కౌశంబి నేడు కుగ్రామముగా కనిపిస్తుంది. కౌశంబి ఒకప్పటి మహాభారత, రామాయణాది పురాణ ప్రసిద్ధ పట్టణము. బౌద్ధ, జైనగ్రంథాలలో కూడ కౌశంబి పేరు ఉంది. 6వ శతాబ్ది వరకు గొప్ప పట్టణముగా ఈ ప్రాచీన కౌశంబి విరాజిల్లిందన్నది చారిత్రికసత్యము.. పురావస్తు శాఖ జరిపిన త్రవ్వకాలలో ఇక్కడ లభించిన యజ్ఞవేదిక పురుషమేధము ఆనవాళ్ళను చూపుతోందని పురాతత్త్వ శాస్త్రవేత్త శర్మ అభిప్రాయము.

శ్యానాకృతి అంటె గ్రద్ద ఆకారపు అగ్నిచయనము{హోమకుండము} వేదికగుర్తుగ ఈవేదికను గుర్తించారు. బలిచేయబడిన ఇతర చతుష్పాదావశేషాలు వలె, మానవకపాలములు ఈ అగ్ని చయన ములో లభ్యమవడాన్నిబట్టి సమంత్రకముగా నరమేధమును జరిపేవారనడానికి సాక్ష్యమని కొట్టిపారేసే వీలులేదని పురాతత్త్వశాస్త్రవేత్త భావించడం సబబని అనలేము. ఆధారాలు కావాలి.

సమస్తజాతుల స్త్రీపురుషులు యాగపశువులుగా పేర్కొనబడ్డారన్న వ్రాతలు ప్రక్షిప్తమో నిక్షిప్తమో వాదవివాదాల పలుకుబడిగ వేదజ్ఞులు తప్పించుకుంటున్నారు. అందుచేత వేదకాలములో నరమేధ యజ్ఞ వేదికలు నిర్మింపబడ్డాయని భావించే కోణముంది. పరిశోధనగ ఊహాతీత జనితముగా పురాతన త్రవ్వకాలలో ఊపిరి పోసుకోవడం మాత్రం వినదగునెవ్వరుచెప్పిన కోణముగ సబబు అనిపించేలా ఉంటాయి.. పురుషమేధ విషయాలు ప్రక్షిప్తమనేకోణము వాదన బలంగా వినిపించబడలేదు.

యజ్ఞ పశువు చతుష్పాదము. మానవుడు ద్విపాదపశువు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, నపుంసకుడు, గుడ్డివాడు, చెవిటివాడు, గొడ్రాలు, చాకలివనిత, వైణికుడు, దివ్యాంగుడు (అవిటివాడు), బట్టతలవాడు…. ఇలా నరమేధార్హులైన 184మంది జాబితా ఉంది. కాని ఋక్సామ యజుస్సంహితలు లో నరమేధకర్తృత్వ ప్రస్తావనలేదు.

అయినా యజుస్సంహితలో ఋషిసమ్మతము లేనిది గాను, తైత్తరీయ బ్రాహ్మణములలో సమ్మతింప బడినదిగాను నరమేధవిధివిధానము మాత్రము పేర్కొనబడిందని సంస్కృత విద్వాంసు లంటారు. తైత్తరీయసంహిత(5-5-1)లో ఛాగ అంటే మేక అజజాతికి చెందిన పశుప్రశంస గమనించదగ్గది.

మేకకు పురుషుని వలె గడ్డముంది. కొమ్ములు లేవుకనుక గుఱ్ఱమువంటిది. నోటిలో క్రిందిభాగమున మాత్రమే పళ్ళుండుటచే గోవు వంటిది. చిన్నరెండుగిట్టలు కలిగి గొఱ్ఱె అనిపించుకుంది. అందుచేత అజ జాతిలోని వన్నీ ద్విపాద నర పశువులకు రూపాన్నిపోలి యజ్ఞ పశువులుగా బలికి ఏకగ్రీవ స్వీకారమై నరమేధతృప్తి కూడ కలిగించాయి నరుడు బలిపశువుగా మేలుజరుగుతుందన్న అంధ విశ్వాస అంగీకారమయ్యాడన్నది నిజమనిపిస్తుంది.. మరి స్త్రీలు? పురుషమేధములోకి ఎలా వస్తారు?

దక్షుడుకూడ మానవతల పోగొట్టుకున్నాడు. మేషములా వీరభద్రుని విజృంభణలో యోగయోగ్య తలగా నరబలికి పనికి వచ్చాడు. నరమేధముగ బలైనాడా? మేకశిరస్సు పొందడం ఆలోచన రేకెత్తిస్తుంది. యజ్ఞంలో ఇతరపశు జీవహింసజరిగింది. 21యూపస్తంభములకు జంతువులను యజ్ఞశాలలో కట్టిన దశరధుని యజ్ఞము వాల్మీకిరామాయణములో పుత్రకామేష్ఠిసమయాన వర్ణించబడింది..

కేవలం మేకను, జింకను మాత్రమే బలిపశువును చేయడం యజ్ఞాలులో సర్వసాధారణ మయింది. సోమయాజి అనిపించు కోవడముగ బ్రాహ్మణులకు యజ్ఞపరమార్ధము. తిక్కన ఇటువంటి యజ్ఞము చేసి సోమయాజి అయ్యాడు. ఇప్పుడదీఅంగీకార సాధ్యము కాలేదు. కనుక బ్రాహ్మణ, క్షత్రియ వటువుల ఉపనయన సమయాన గతకాల అవశేష మేక(జింక) తోలు జందెం తరతరాలది ఒకప్పటి యజ్ఞనిర్మాల్యముగా ఆసమయాన పురోహితుడు యాగతృప్తిగ యజ్ఞ మంత్రములో ధరింపజేసి సోమయాజి అనిపింపచేసి తీయించే సంప్రదాయముంది. క్షత్రియులు జింకను వేటాడితెచ్చేవారు.

జ్యోతిషాంశాలు:

వాస్తుపూజాదికములలో ఆజింకను బలిచ్చేవారు. శ్రీరాముడు పర్ణశాలను నిర్మించినపుడు ఒకజింకను బలిచ్చిన ఆచారము అభిలిషితార్థ చింతామణి(ప్ర.1.అధ్యాయము3) లో ఉంది. ఆంధ్రులసాంఘిక చరిత్రలో సురవరంవారు కూడ ఈ విషయాన్ని ఉదహరించారు.

పౌరాణికాంశాలు:

జీవహింస, జీవకారుణ్యము గురించి భారతములో ధర్మవ్యాధుడు జంతు మాంసవిక్రేతగ కౌశికునకు వివరణ ఇచ్చాడు. ద్వైతవనంలో మృగసమూహము ధర్మరాజుకు బీజప్రాయంగా మిగిలిపోతున్నామని జీవకారుణ్యము చూపి జీవకారుణ్యముగ వేటాడవద్దని ప్రాణిసంతతిని రక్షించమని కోరుకున్నాయి.

జరాసంధుడు సాటిశత్రు రాజులను బలిపశువులుగా నరమేధాలు చేసేవాడని భారతములో ఉంది. పురాణం రాక్షసజాతి నరమాంస భక్షకులను పేర్కొంటుంది. అయినా నరమాంసభక్షకుడి చెల్లెలు హిడింబను భీముడు వివాహమాడాడు. నరబలి ప్రోత్సాహకుడిగా క్షమార్హుడు కాడని కృష్ణుని జరాసంధవధ సమర్ధనము. మహాభారతకాలంలో నరబలిహింసకులు, నరభక్షకులు శిక్షార్హులు. నరబలి, జంతుబలి కలిగిన యజ్ఞాలపట్ల విరక్తి యుగకాల విభజనలో వేగవంతమయ్యాయని చెప్పవచ్చు.

వేదవిధికర్మలు పురాణకాలానికి మార్పులు పొందసాగాయి.. కృతయుగంలో ఉన్న ప్రాముఖ్యము త్రేతాయుగములో తగ్గింది. తపస్సుకు ప్రాధాన్యత పెరిగింది. అహింసధర్మముగా మునులు హింసాయుత బలియజ్ఞములకు మొగ్గు చూపడం క్రమేణా మానేశారు. వృక్షసంబంధి పదార్ధముచేత బీజనాశనము కాదు. బలిపశువులు జీవకారుణ్యమునకు నోచుకున్నాయి.

వృక్షసంబంధ పదార్ధయజ్ఞప్రీతి అధికమై యజ్ఞహింసకు దూరమవడం నాగరికత పరిణామము. హింసాప్రవృత్తి, మానవత్వము చర్చలకు రాసాగాయి. రాక్షస ప్రవృత్తి, మానవప్రవృత్తి మధ్య స్పష్ట్టమైన విభజన రాసాగింది. బలవన్మరణంతో కూడిన పశుయజ్ఞం లేని సకలప్రాణుల క్షేమాన్ని కాంక్షించే వ్యవస్థకే మొగ్గు చూపారని స్వాయంభువు మనువు కాలములో జరిగిన కథ వేదాలలో ఉంది.

జంతుబలితో ప్రాణిసమూల నాశనము జరుగుతుంది. అందుచేత ప్రత్యామ్నాయంగా శ్రేష్ష్ట్ట మైన వృక్షబీజముతో జరిపే యజ్ఞాలు నిలద్రొక్కుకున్నాయని వేదములోని ఈ అపూర్వగాథ ‘’అహింసాత్సర్వ భూతాని, అగ్నీషీమీయం పశుమూలభీత’’ అనే శ్రుతివచనం.గ నిలద్రొక్కుకుంది. అశ్వమేధము మాత్రము రాజులు చేయడము చరిత్రకందింది.

‘’మేవాజినం పరితిష్యంతి పర్వం’’ అనే ఋక్కునుబట్టి అశ్వమేధముతప్ప జంతుహింస కలిగిన యజ్ఞాలకు ప్రాముఖ్యము పూర్తిగాకాదుకాని చాలావరకు తగ్గిందనే చెప్పాలి. రాజుమాత్రం రాజసూయ యాగము పేరిట అశ్వాన్ని వధించి ఆమాంసము తిన్నాడు. ఆ అశ్వమేధయజ్ఞ విధానము కూడ వెగటు కలిగించింది. యాగదీక్ష సమయాన అశ్వమేధయాగ దీక్షితుడు చతురక్షమనే శునకమును వధించడము, అశ్వసంభోగము ఇతరవిధానము వెగటుపుట్టిస్తుంది.40 అధ్యాయాల శుక్లయజుస్సంహిత లో సౌత్రామణీ యాగ మంత్రాలతో కూడిన 21వఅధ్యాయంతరువాత అశ్వమేధ మంత్రాలున్నాయి. కాశీలోని దశాశ్వమేధ ఘట్టముపేరు అశ్వమేధాలు జరిగాయా?అనే ఊహకు బలమిచ్చింది. .

ముగింపు:

జీవహింస మహాపాపముఅని అందరూ నిర్వచించారు. గ్రామదేవతలు సంస్కృతిలో బలులను ప్రోత్సహిస్తూనే ఉన్నారు.. జంతుబలులు,నరబలులు కథలు ప్రచారప్రభావమది.

కాళిక నరబలి కోరుతుందని జనులు నమ్మారు. ఆమె చేతిలో రక్తమోడుతున్నట్లుగా మానవశిరస్సు విగ్రహంలో కనిపిస్తుంది. శక్తి సంబంధ విగ్రహాలన్నీ మెడలో పుర్రెలమాల ధరించినట్లుగా విగ్రహాలు నరబలి నమ్మకాలకు సాక్ష్యమవుతున్నాయి. ఖండించిన శిరస్సు చేతిలోగల విగ్రహములుగ నరబలిలో నరబలిగా తలకు ప్రాముఖ్యముందా? తలవంచడము అవమానము. తలకొట్టేసినట్లుంది అనడం వింటూంటాము. తలతాకట్టు, తలతీసి మొలేస్తాడా? వంటి పలుకుబడులు తలను కాచుకోమనే సంకేతాలు నరమేధమంత హెచ్చరికలుగా భావించడం నేటికీ ఉంది. నరహంతక రాక్షసులను సంహరించే దుర్గా పండుగ జయజయహే మహిసాసురమర్ధినిగ రామలీల విజయదశమి సంస్కృతైంది.

జంతువుకైనా, మనిషిదైనా తలనరకడము వీరోచిత కార్యక్రమము. కృష్ణదేవరాయల కాలంలో విశ్వనాథనాయకుడు ఒక్కవేటుతో ఎనుబోతుతలనరికాడు.. శిరస్సు ప్రధానాంగము. కోటగుమ్మానికి తలలు వ్రేల్లాడగట్టడం, సహస్రశిరశ్ఛేద చింతామణికథలుగ ఖండితశిరస్సే ప్రాధాన్యము వహించింది. నరబలిలో విధివిధానముగ కూడ శిరస్సే పూర్ణాహుతి అగ్ని కుండములో వేశారన్నది వేదవచనం.

సంస్కృతవాజ్మయ రచయిత మల్లాదివారు తైత్తరీయ సంహిత5-1-8 లోనిదని ఒక శ్లోకమునుదాహరణగా యజ్ఞములో మానవశిరస్సుకు యోగయోగ్య ఆహుతి ప్రాధాన్యముందని నరశిరస్సు గురించి చెప్పారు.

మరణించినవాడిశవంది తలచాలు. 21 మినుపగింజలు ఆకస్మికముగా మరణించిన వానితలపై ఉంచాలి. అప్పుడు ఆ శవముశిరస్సును ఖండించాలి. ఆశవము ఖండితతల స్థానములో అతనిశరీరానికి పుట్టమట్టిగడ్డ తల అతికించాలి. తరువాత ఖండించిన శిరస్సుతీసుకువచ్చి యజ్ఞ క్రియ జరపొచ్చు. సజీవపురుషుడు మాత్రము వధించబడాలని చెప్పలేదు. తలమాత్రం ఆహుతి చెయ్యాలి. ఇది కపాలమోక్షప్రాధాన్యతగల నేటిఅనాధప్రేతసంస్కారమునకు కోటియజ్ఞఫల సమాన ప్రేరణ నిలిపిందా?

వేదకాలమునాటి శతపథ బ్రాహ్మణము, శ్రౌతసూత్రాలు, కాత్యాయనశ్రౌతి వంటివి నరుడు బలిపశువుగా అతని ఖండితతలను యాగకుండములో వేసినవాడు సర్వజనోత్కృష్టుడుగా వాసిగాంచుతాడని ప్రలోభపెట్టాయి. దశాశ్వమేధఘట్టములాగే వేదకాలము, ఆ తరువాతి కొంతకాలము యూపస్తంభాలు కలిగిన పశుయజ్ఞవాటికలులో నిర్మింపబడి పూర్ణాహుతిసమయ ఖండిత నర,జంతుశిర కపాలముల ఉనికిని చాటాయా? అదే కౌశంబిలో బయటపడిందా?

చతుష్పాద జంతుబలులు ముఖ్యముగా కేవలము హయ, అజమేధములుమాత్రము జరిగినా హోమగుండంలో తలనుపడవేసి ఆహుతి చేయడము యజ్ఞము లేదా యాగపరిసమాప్తి. పురాతన యజ్ఞ కుండము అగ్నిచయముగ కౌశంబిత్రవ్వకాలలో బయటపడిన మానవకపాల అవశేషము నరమేధమన్న సందేహానికి తావిచ్చి ఉంటుందని నా అభిప్రాయము.

శరీరంలోని ప్రాణపంచకాన్ని1. శ్వాస వాయుదేవునికి, 2.మనస్సు చంద్రునికి, 3.శ్రోత్రములు దిక్కులకు, 4.నేత్రాలు సూర్యునికి, 5.జీవాత్మ ప్రజాపతికి యజ్ఞపశువై అర్పించుకునే సోమయాగముగ జంతుబలి దూరమైంది. నేడువృక్షసంబంధిపూర్ణాహుతి పవిత్రయజ్ఞముగా మారింది. అందుచేత నర యజ్ఞపశువుల నిర్ధాక్షిణ్య్వధ గతకాలపు నిందాచర్చ కన్న కబేలాలలో వధింపబడుతున్న జంతుహింస ఆగిపోయి జీవకారుణ్యముతో అకారణహింస మానాలి. మూఢత్వాన్ని విడిచి వివేచనాజ్ఞానముతో మనకు నచ్చనిదానిని వ్యర్ధ ప్రసంగముగా కాక సందేశాత్మకతను కూడ వెతికి ఆచరించాలని చెప్పడమే ఈ వ్యాసోద్దేశము..

ఆధార గ్రంథాలు:

1. ROSHEN DALAL...THE VEDAS

2,వాసాప్రభావతి....'తెలుగుసాహిత్యములో హరిశ్చంద్రోపాఖ్యానములు

3. మల్లాది సూర్యనారాయణ్శాస్త్రి.... సంస్కృత వాజ్ఞ్మయచరిత్ర1&2...

4.సురవరంప్రతాపరెడ్డి ...ఆంధ్రుల సాంఘిక చరిత్ర

5. నాయని కృష్ణకుమారి...తెలుగు జానపదగేయాలు

6.ఏటుకూరిబలరామ మూ ర్తి... ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర.

7.జొన్నలగడ్డ మార్కండేయులు... అపూర్వగాథలు