1. ఉపోద్ఘాతం: 

          హరచూడా హరిణాంక వక్రతయుఁ, గాలాంతస్ఫురచ్చండికా

          పరుషోద్గాఢపయోధర స్ఫుటతటీ పర్యంతకాఠిన్యమున్‌,

          సరసత్వంబును సంభవించె ననఁగా సత్కావ్యముల్‌ దిక్కులం

          జిరకాలంబు నటించుచుండుఁ గవిరాజీగేహరంగంబులన్‌!

ఆంధ్రభారతీ ప్రత్యక్షావతీర్ణస్వరూపుడైన మహాకవి శ్రీనాథుడు తన ‘భీమేశ్వర పురాణము’ అవతారిక (1-11) లో ఉత్తమశ్రేణి కావ్యలక్షణాలను నిర్వచించిన అద్భుతావహమైన పద్యమని పేరుగాంచిన రచన ఇది. కావ్యత్వాపాదకములైన అంతఃప్రకృతులన్నింటికీ హృద్యశబ్దార్థనిబంధం కలిగిన వక్రతయే ప్రధానధర్మమని, సందర్భోచిత రీతీ మహితమైన గ్రథనకౌశలం, వస్తుధ్వన్యలంకారములతోడి రసాత్మకత ఉత్తమ కావ్యలక్షణాలని నిరూపిస్తున్న ఈ నిర్వచనం నిజానికి శ్రీనాథుని వైయక్తిక కవిత్వాదర్శమేనని, ఇందులోని అక్షరాక్షరం శ్రీనాథుని కవిత్వానికే అనువర్తనీయమని చిరకాలంగా విమర్శకలోకంలో పేరెన్నిక గన్నది. 1901లో భీమేశ్వర పురాణమును వ్రాతప్రతుల నుంచి తొలిసారి పరిష్కరించి ముద్రించిన శ్రీ ర. వేంకట సుబ్బయ్య ఎమ్.ఏ గారు, శ్రీ క్రొత్తపల్లి వేంకట పద్మనాభశాస్త్రి గారు ఈ పద్యంలోని మొదటి దళానికి –

“హరచూడా హరిణాంక వక్రత = శివుని జటాజూటమందుండు చంద్రునివలె వక్రముగలట్టియును. అనగా గేవలప్రౌఢకవీశ్వరాంగీకృతమయి సామాన్యకవిజనానవబోధమగు రహస్యములని యర్థము.”

అని అధోజ్ఞాపికలో వివృతిని వ్రాశారు. “హరచూడా హరిణాంక వక్రత” అంటే “శివుని జటాజూటంలోని చంద్రుని యొక్క వంపు” అని ఒక పౌరాణికార్థమూ; “అమేయమైన శబ్దాధికారం గల ప్రౌఢకవులచే ప్రయోగింపబడి అనధికారులైన కవులకూ, పాఠకులకూ దురవగాహమైన రచన” అని వేరొక సాహిత్యార్థమూ ఇందులో ప్రతీయమానములని మొదటిసారిగా ప్రతిపాదించారు.

1958లో భీమేశ్వర పురాణమును టీకాతాత్పర్యసహితంగా ప్రకటించిన తర్కాచార్య, భాషాప్రవీణ శ్రీ కంభంపాటి రామగోపాలకృష్ణమూర్తి గారు దీనిని మరికొంత వివరిస్తూ –

“హరచూడా హరిణాంక వక్రతయున్ = శివుని తలమీది చంద్రకళ యొక్క వంకర; కాలాంతస్ఫురచ్చండికా, పరుషోద్గాఢ పయోధర స్ఫుటతటీ పర్యంత కాఠిన్యమున్ = ప్రళయకాలచండిక యొక్క స్తనకాఠిన్యమును; కవిరాజీగేహరంగంబులన్ = కవులనెడి వాకిళ్లలో.”

అని అర్థవివరణను కూర్చారు. వీరు సాహిత్యార్థాలను వివరింపక మొదటి రెండు దళాలకూ కేవలం పౌరాణికార్థాలను మాత్రమే చెప్పినప్పటికీ అవికూడా పరిశీలకులు లోతుగా ఆలోచింపదగినవే.

శ్రీనాథ కవితాభిమానులలో అగ్రేసరులైన శ్రీ చిలుకూరి పాపయ్యశాస్త్రి గారు 1959లో ప్రకటించిన తమ ‘శ్రీనాథుని కవితా సమీక్ష’ (పుటలు 11-12) లో ఈ పద్యోదాహరణ వద్ద -    

“పరమేశ్వరుని జటాజూటమున కలంకారమైన చంద్రునియం దుండెడివక్రత, ప్రళయ కాలమున విజృంభించు చండికాదేవి కఠినస్తనపర్యంతమునం దుండెడికాఠిన్యము, సరసత్వము జతగూడె ననువట్టు సత్కావ్యములను గూర్చిన నవి కవిపాళీగృహరంగములందు నాట్యము సేయుచుండు ననినాఁడు. శ్రీనాథుఁడు తనరచనలో నేయేకవిత్వాంశముల నాయోజింపఁదలఁచునో, వాని కేదియోయొకరీతిని సూచన సేయుచునేయుండును ... అందుల కుపక్రాంతమైన దీపద్యము. తనరచనలో వక్రోక్తిచమత్కారము, కాఠిన్య యుక్తపద సంయోజనము జతగూడి, రచనకు సరసత్వము నాపాదించి, కవులరసనారంగమున నర్తనముసేయు భావసంపద యేర్పడియుండు నని శ్రీనాథుఁ డీపద్యమునఁ దెలిపి యున్నాఁడు.”         

 అని వివరణను వ్రాశారు. వీరు పద్యప్రతిపాదితములైన మూడు అంశాలలో –

          1) “పరమేశ్వరుని జటాజూటమునందలి బాలేందు వక్రత”లో వక్రోక్తి చమత్కారము,  

          2) “చండికా పయోధర కాఠిన్యము”లో భావప్రౌఢిని కలిగిన శబ్దసంయోజనము,  

          3) “సరసత్వము”లో రససిద్ధిహేతుకములైన కావ్యార్థముల తోడి లక్షణ సంగతి.

అన్న మూడు కవిత్వ దృగ్విషయాలను ఆవిష్కరించి, కవి హృదయాన్ని సలక్షణంగా సమీక్షించే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి శ్రీ పాపయ్యశాస్త్రి గారి ఈ వ్యాఖ్య ప్రాజ్ఞప్రతిజ్ఞాతమై విమర్శకలోకంలోనూ, విద్యాలయాలలో పఠనపాఠనాలలోనూ ప్రసిద్ధికెక్కింది.

శ్రీనాథుని ఈ పద్యం రచితమైన తొలినాళ్లలో వ్రాతప్రతులలో ఏ విధంగా ఉండినదో మనకిప్పుడు తెలియదు. తొలుత చాటువుగా వెలువడి ఆ తర్వాత పాఠాంతరాలను సంతరించుకొని గ్రంథంలోనికెక్కినదేమో నిశ్చయించేందుకు సైతం అనువైన సాధనాలేవీ ఇప్పుడు అందుబాటులో లేవు. రచితమైన అనతికాలంలోనే ప్రసిద్ధికి వచ్చిందన్న విషయం మాత్రం స్పష్టం. శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి రాధామాధవ కవి తన రాధామాధవ ప్రబంధములో దీనిని అనుకరిస్తూ - శ్రీనాథుని పదబంధాలతోనే శ్రీనాథునికి భక్తిపూర్వకంగా అంజలించాడు:  

          సూనాస్త్రప్రమదా మదస్ఫురిత వక్షోజాతకాఠిన్యముం

          బూనం జాలు వచోవిలాసముల నింపుల్ మీఱఁ గర్ణాటక

          క్ష్మానాథేంద్రు సభం గవిత్వవిజయోత్సాహంబుఁ గైకొన్న మా

          శ్రీనాథుం, గవిసార్వభౌముఁ గొలుతున్ సేవాంజలుల్ గీల్కొనన్.                              (1-13)   

అని. శ్రీనాథుడు వర్ణించిన “కాలాంతస్ఫురచ్చండికా, పరుషోద్గాఢపయోధర స్ఫుటతటీ పర్యంతకాఠిన్యమున్‌” అన్న సమాసాన్నే యాథాతథ్యంతో స్వీకరించి, త్రిలోకీ సౌందర్యాధిదేవత అయిన పరమేశ్వర కుటుంబిని స్థానంలో తరుణ వయోఽవస్థామదోత్కట అయిన మన్మథ పత్నిని ప్రవేశపెట్టి ఆమె యౌవన మదాన్ని వక్షోజాత కాఠిన్యానికి సంస్ఫోరకంగా చిత్రీకరించాడు. ఆ కాఠిన్యాన్ని ఆవహింపగలిగిన వచో విలాసములతో “ఇంపుల్ మీఱ”టాన్ని వర్ణించటం వల్ల శ్రీనాథుడు చెప్పిన సరసత్వమూ అందులో అంతర్భవించింది. కొంచెం ఇంచుమించుగా భీమేశ్వర పురాణము రచనకు సమీపకాలంలో దక్షిణాధీశుడైన ప్రౌఢదేవరాయల ముత్యాలశాలలో ఆ కవిసార్వభౌమ బిరుదాభిరామునికి దీనార టంకాల తీర్థస్నానంతో జరిగిన గౌరవప్రాప్తిని కవిత్వ విజయోత్సాహంగా అభివర్ణించటంతో మహాకవి జీవితసాకల్యాన్నీ సరసంగా సమీక్షించినట్లయింది.            

2. శబ్దసంయోజనలో ఔచిత్య విచారం:

అయితే శ్రీనాథుని పద్యాన్ని యుక్తాయుక్తపాఠపరిశీలనదృష్టితో సావధానంగా విమర్శించే పాఠకులకు ఇందులో తీరని సందేహాలనేకం స్ఫురిస్తాయి. అసలు “సత్కావ్యముల్‌ దిక్కులం, జిరకాలంబు నటించుచుండుఁ గవిరాజీగేహరంగంబులన్‌” అన్న దళానికి భావప్రతీతి ఏమిటి? అని సంశయం కలుగుతుంది. ‘ఆనుపూర్విని కలిగిన శ్రేణి’ అన్న అర్థంలో ‘రాజీ’ శబ్దాన్ని ప్రయోగించాడు. “రాజీ రేఖాయాం పఙ్క్తౌ చ” అని హేమచంద్రాచార్యుని హైమకోశము. గేహము అంటే ఇల్లు. అందువల్ల “కవిరాజీగేహరంగంబులన్” అంటే “కవులనెడి వాకిళ్లలో” అని శ్రీ కంభంపాటి రామగోపాలకృష్ణమూర్తి గారు వ్రాసినది సరికాదు. గేహరంగము అంటే గృహద్వారం కాదు. గేహరంగము అన్న పదబంధానికి ఇక్కడ సార్థకంగా పొందుపడే అన్వయం లేదు. రంగమంటే నటించేందుకు యోగ్యమైన నాట్యస్థానమనీ, గేహరంగమంటే నాట్యయోగ్యమైన ఇంటి వాకిలి అనీ మాటవరసకు అంగీకరించినప్పటికీ, గేహరంగాలలో సత్కావ్యాలు నటించటం ఎట్లా జరుగుతుంది?

శ్రీ చిలుకూరి పాపయ్యశాస్త్రి గారు తమ విమర్శలో సత్కావ్యాలు కవిపాళీగృహరంగాలలో నర్తిస్తుంటాయని చెప్పినది కూడా అటువంటిదే. అంతే గాక, సత్కావ్యాలు కవిపాళీగృహరంగాలలో చిరకాలం నటిస్తుంటాయి అని చెప్పిన తర్వాత పద్యంలో “దిక్కులన్” అని కవిపాళీగృహరంగాలకు విశేషణం కాని నిష్ప్రయోజకమైన ఆ వ్యపదేశానికి చోటుండదు. అసలు సత్కావ్యాలు దిక్కులందలి కవులనెడి వాకిళ్లలో (లేదా, ఇళ్లలో) నటించటం ఎందుకుంటుంది? లేదా, దిక్కులందలి సత్కావ్యాలు కవుల గేహరంగాలలో నటించటం మాత్రం ఎందుకు జరుగుతుంది? పోనీ, కవుల గేహరంగాలలోని సత్కావ్యాలు దిక్కులలో నటించటం ఎట్లా సాధ్యపడుతుంది?

ఒక్కొక్కప్పుడు కావ్యసౌందర్యసమాధాయకమైన సామగ్రినంతటినీ నిక్షేపించి ఎంతో శక్తిసంపదతో కవి రచించిన కావ్యం పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఇంటిలోనే ఉండిపోయి, సూర్యాలోకానికి నోచుకొనే అదృష్టం లేక ఆయన ప్రతిభ లోకానికి వెల్లడి కాకపోవటం జరుగుతుంటుంది. ఇంకొకరి రచనమైతే అదృష్టవశాన ఏ కొద్దిమంది మంచి మిత్రుల ఇళ్లకో చేరి తత్తత్సమావేశాలలో చర్చల మూలాన, గోష్ఠీకృతసద్విమర్శల వల్ల పరిమితమైన ప్రచారానికి పాత్రం కాగలుగుతుంది. వేరొకరి కావ్యమో? విశ్వదర్శనకుతూహలంతో బయలుదేరినట్లుగా ప్రయాణం మొదలుపెట్టి, దశదిశలలో సంచరిస్తూ, రసజ్ఞులైన పండితులనే గాక అంతగా చదువుకోనివారి హృదయాలను సైతం ఆకట్టుకొంటూ, వారివారి ముఖరంగాలపై వారివారికి నచ్చిన పదబంధాలను, పద్యబంధాలను ప్రకాశింపజేస్తూ యావత్కాలమూ చరిత్రలో నిలిచిపోతుంది.

కావ్యాంగవిద్యను నేర్చుకొంటున్న అభ్యాసకుల కారయిత్రీ శక్తివిశేషాన్ని వివరిస్తూ ‘కావ్యమీమాంస’ (4-10) లో మహాలాక్షణికుడైన రాజశేఖరుడు చెప్పిన శ్లోకం ఇది:

          ఏకస్య తిష్ఠతి కవే ర్గృహ ఏవ కావ్య

          మన్యస్య గచ్ఛతి సుహృద్భవనాని యావత్

          న్య స్యావిదగ్ధవదనేషు పదాని శశ్వత్

          కస్యాపి సఞ్చరతి విశ్వకుతూహలీవ.

అని. అంతే కాదు. కవియొక్క కావ్యాన్ని కేవలం తన ఒక్కని మనస్సులో దాచుకొని ఉంచుకోక దశదిశల వ్యాపింపజేయటం భావుకుని కర్తవ్యం అని కూడా అదే అధ్యాయం (4-16) లో రాజశేఖరుడు నిర్దేశించాడు.

ఈ శ్లోకార్థాన్ని ముందుంచుకొని మహాకవి శ్రీనాథుడు “సత్కావ్యముల్ (“కావ్యమ్”) దిక్కులన్ (“విశ్వకుతూహలీవ”), చిరకాలంబు (“శశ్వత్”) నటించుచుండు (“సఞ్చరతి”) కవిరాజీగేహరంగంబులన్ (న్యస్య అవిదగ్ధవదనేషు”)” అని చెప్పివుంటాడని అన్వయించేందుకు వీలులేకుండా పద్యంలోని వాక్యనిర్మాణం ఉన్నది.

అర్థబోధకై పాఠ పరిష్కరణావశ్యకత: 

అందువల్ల, అర్థాన్వయం లేని ఈ దళాన్ని మనము “సత్కావ్యముల్‌ దిక్కులం, జిరకాలంబు నటించుచుండుఁ గవిరాడ్జిహ్వాగ్రరంగంబులన్‌” అని దిద్దుకోవాలన్నమాట. వ్రాతప్రతులలో “కవిరాడ్జిహ్వాగ్రరంగంబులన్” అన్నది లేఖనదోషం మూలాన “కవిరాజీగేహరంగంబులన్” అని మారి ఉంటుంది. వాగీశ్వరీ వ్యక్తస్వరూపములైన సత్కావ్యములు దిగ్దిగంతాలలోని కవిరాజుల రసనాగ్రములపైని శాశ్వతంగా నర్తిస్తుంటాయని భావం.

ఇప్పుడు పద్యం ప్రథమార్ధానికి వద్దాము. “హరచూడా హరిణాంక వక్రత” అన్న దళానికి అర్థం “పరమేశ్వరుని జటాజూటంలో అలంకరింపబడి ఉన్న చంద్రుని యొక్క వంపు” అనుకొన్నాము. చంద్రుడు శుక్లపక్షపు తిథ్యనుసారం క్రమంగా అమావాస్య నుంచి పౌర్ణమి వరకు దినదినప్రవర్ధమానుడై ఉండటమూ, కృష్ణపక్షపు తిథ్యనుసారం పౌర్ణమి నుంచి అమావాస్య వరకు క్షీణచంద్రుడై ఉండటమూ లోకదృశ్యం అయినప్పటికీ పరమేశ్వర జటాజూటంలో సమలంకృతుడై అలరారుతున్నప్పటి రూపం మాత్రం బాలేందుఖండం ఒక్కటే అని కవిసమయసిద్ధం. “హరచూడా హరిణాంక వక్రత” అని పేర్కొనక “హరచూడా హరిణాంకుడు” అని చెప్పినా శివుని శిరస్సుపైని నెలవంకను మాత్రమే గ్రహింపవలసి ఉంటుంది కాని, “హరచూడా హరిణాంక వక్రత” అని ప్రత్యేకంగా అనటం వల్ల కవి దృష్టిలో సాహిత్యప్రస్థానంలోని వక్రతా రూపమైన సాహిత్యార్థం ఒకటి ప్రతిపాద్యమానమై ఉన్నదని సులభంగానే ఊహింపవచ్చును. ఈ వక్రతనే రాజానక కుంతకుడు తన వక్రోక్తి జీవితము ద్వితీయోన్మేషం (2-35) లో –

వక్ర తైకత్ర బాలేన్దుసున్దరసంస్థానయుక్తత్వం ఇతరత్రోక్త్యాదివైచిత్ర్యమ్

           అన్నాడు. “సంస్థానము” అంటే శరీరావయవముల యొక్క అందమైన అమరిక. అష్టమి నాడు ఎనిమిది కళలు నిండిన వేళ వెన్నెల వెలుగులను విరజిమ్ముతున్న చంద్రుడు సర్వాంగసౌష్ఠవమును కలిగి సమార్ధభాగుడై వంపు తిరిగినప్పటి అనన్య రోచిష్ణు రూపరేఖతో అందాలు కొలువుతీరి ఉండటమే బాలేందుసుందరసంస్థానయుక్తత్వం అన్నమాట. కావ్యార్థగతమైనప్పుడు వక్రత కూడా అటువంటి మంగళకర శోభామయమై విరాజిల్లుతుంటుంది.

కవితా భణితి వైచిత్య్రం:

రుయ్యకుని అలంకార సర్వస్వము వ్యాఖ్యాతలలో ముఖ్యుడైన క్రీస్తుశకం 1300 నాటి సముద్రబంధ పండితుడు రససిద్ధిదాయకమైన ఈ వక్రతనే “భణితివైచిత్ర్యమ్” అన్నాడు. భణితి అంటే వాక్కు. ఈ భణితివైచిత్రీ స్వరూపాన్ని ప్రతిష్ఠిత లాక్షణికోక్తుల నుంచి గ్రహించి శ్రీనాథుడు భీమేశ్వర పురాణము (1-11) లో “హరచూడా హరిణాంక వక్రత” అని; ఆ తర్వాత రచించిన కాశీఖండము (1-13) లో దానినే ఎఱ్ఱాప్రగడ గారి కృతులకు అన్వయించి “పరిఢవింతు ప్రబంధపరమేశ్వరుని ఠేవ, సూక్తివైచిత్రి నొక్కొక్కమాటు” అని తెలుగువారికి నేర్పగా – కావ్యలక్షణ సర్వజ్ఞులైన పోతన గారు ‘సుకుమార మార్గం’, ‘విచిత్ర మార్గం’, ‘మధ్యమ మార్గం’ అని విహితమై ఉన్న ఆ విదగ్ధ మార్గజాతంలో సముద్దీప్తమైన భావనాప్రకర్షను కలిగిన విచిత్ర మార్గాన్ని అవలంబించి, తన శ్రీమహాభాగవతము స్కంధాంత గద్యలలో “ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర” అని; కావ్యంలో “శ్రీహరి నామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం బయ్యు శ్రీకరమై యుండదు (1-96)” అని - బహుభంగుల పేర్కొన్నది ఈ భణితి వైచిత్రినే. ఈ వైచిత్రి లోకోత్తర చమత్కార కారకమని కూడా కుంతకుడన్నాడు.

కుంతకుని దృష్టిలో వైచిత్రి చిత్తాహ్లాదానికి, రసాత్మకతకు పర్యాయపదం. కావ్యనిర్మాణకౌశలానికి సంబంధించిన కవివ్యాపార వక్రత. కవి వ్యాహార సౌందర్యం. రసాదిప్రయోజనయోగ్యతను కలిగిన ఆ వక్రత పౌరాణిక భావభావనతో సంశ్లిష్టమైనప్పుడు అదే హరచూడా హరిణాంక వక్రత.

కాలాంత శబ్దవిచారం:   

ఇక రెండవ దళం సంగతి: జాగ్రత్తగా చూచినట్లయితే, ఎంతటి ప్రాథమికదృష్టికైనా “కాలాంతస్ఫురచ్చండికా, పరుషోద్గాఢ పయోధర స్ఫుటతటీ పర్యంత కాఠిన్యము” అన్నప్పుడు సమాసంలోని పదాలకు అర్థసంగతి గాని, ఉత్తరోత్తరాన్వయం గాని లేవన్న సంగతి స్పష్టమే. “కాలాంతము” అంటే వ్యాఖ్యాతలు చెబుతున్నట్లు “ప్రళయ కాలము” అన్న అర్థప్రతీతి లేదు. కాలాంతము అంటే జీవికి మరణం ఆసన్నమైన అవసాన కాలం అని మాత్రమే అర్థం. “కాలా త్స్రవన్తి భూతాని, కాలా ద్వృద్ధిం ప్రయాన్తి చ, కాలే చాస్తం నియచ్ఛన్తి, కాలో మూర్తి రమూర్తిమాన్” అని మైత్రాయణీయం (6-14) అంటున్నది. చరాచరాత్మకమైన భూతజాతం సమస్తం కాలము నుండి ఆవిర్భవించి, కాలమునందే ప్రవృద్ధమై, కాలమునందే అస్తంగమిస్తున్నది. ఆ విధంగా సర్వపదార్థములను తననుండి కల్పించి, మళ్ళీ తనలో కలుపుకొంటుంది కనుక సర్వసమాకలనాత్మకమైన కాలమే భగవత్స్వరూపమని పెద్దలన్నారు. ఆ కాలము అఖండమూ, ఆదిమధ్యాంతరహితమూ, నిర్విశేషమూ కాబట్టి ప్రారబ్ధకర్మవశులై లింగశరీరధారులైన జీవులకే గాని కాలానికి అంతం ఉండదు.

పోనీ, ఒకానొక కవిచే ప్రయుక్తమై క్వాచిత్కంగా ఎక్కడో కనబడింది కాబట్టి “కాలాంతము” అంటే భూతసృష్టికి అంతకాలమైన ప్రళయకాలమని అర్థం ఉన్నదనుకొన్నా, కాలాంత = ప్రళయకాలమునందు, స్ఫురత్ = ప్రకాశిస్తున్న, చండికా = (ప్రళయస్వరూపిణియై ఉన్న) చండిక (పార్వతీ దేవి) యొక్క, పరుష = నిష్ఠురమైన, ఉద్గాఢ = అతిశయించిన, పయోధర = వక్షోజయుగ్మము యొక్క, స్ఫుట = విశదమైన, తటీ = ప్రదేశము, పర్యంత = వరకు (గల), కాఠిన్యము = కఠినత్వము – అంటే ఉద్దేశింపబడిన భావం ఏమిటి?

ఒకవేళ ‘కాలాంత’ శబ్దానికి మనము ‘కాలస్య అన్తః యేన (కృతః) సః’ అని ఏదో విధంగా కాలాంతకుడు పరమేశ్వరుడన్న అర్థాన్ని సాధించినప్పటికీ, “కాలాంతస్ఫురచ్చండికా, పరుషోద్గాఢ పయోధర స్ఫుటతటీ పర్యంతకాఠిన్యము” అన్న సమాసానికి ఆ ప్రకారంగానూ అర్థసంగతి సాధ్యం కాదు. కాలాంతుడైన పరమేశ్వరుని అర్ధనారీశ్వరత్వహేతువు చేత ఆయన శరీరంలో సగభాగమై స్ఫురత్ = ప్రకాశిస్తున్న; చండికా = పార్వతీదేవి యొక్క; పరుషోద్గాఢ = పరుషము ఉద్గాఢము అయిన; పయోధర = పయోధరముచేత; స్ఫుట = ప్రస్ఫుటమైన; తటీ = ప్రాంతమున; పర్యంత = ఆవరించియున్న; కాఠిన్యము = కఠినత్వము అని అన్వయించటం సాధ్యం కాదు. పార్వతీదేవి ఆయన వామభాగాన్ని ఆక్రమించి ఉన్నప్పుడు హరవిలాసము (1-27) లో “హృదయంబు పొరువున హృదయముండుట లేదె యేకీభవించిన యిరువురకును” అన్నట్లు ఇరువురి హృదయభాగాలు ఏకస్థలానుగతములై ఉన్నప్పుడు తత్పర్యంతమందలి పరమశివుని వక్షఃస్థలము యొక్క కాఠిన్యము అని సహృదయ విమర్శకులు ఊహించిన విధంగా అన్వయించే వీలుండదు. “హరచూడా హరిణాంక వక్రతయు” అని పద్యాదిని కర్తృనిర్దేశం ఉన్న తర్వాత మళ్లీ “కాలాంత-స్ఫురత్” అని మరొక కర్తృనిర్దేశాన్ని చేయవలసి ఉండదు. ఎన్ని విధాల ఆలోచించినా అర్థగతి సరిపడని సమాసం ఇది.

కాలాంతము : దేహార్ధము:

అర్థాన్వయం పొందుపడనందువల్ల “హరచూడా హరిణాంక వక్రతయు” అన్న దళానికి తర్వాత “కాలాంత” శబ్దానికి మారుగా “దేహార్ధ” అని చదువుకొన్నా అన్వయసిద్ధి ఉండదు. “హరచూడా హరిణాంక వక్రతయు దేహార్ధస్ఫురచ్చండికా, పరుషోద్గాఢ పయోధర స్ఫుటతటీ పర్యంత కాఠిన్యమున్” అని అనుకొంటే, దేహార్ధమునందు వెలుగొందుతున్న చండిక యొక్క పరుషము, ఉద్గాఢము అయిన పయోధరము అనెడి స్ఫుటతటికి (విశదమైన స్థలమునకు) పర్యంత (సమీప సంగతమైన) కఠినత్వము అని సైతం అర్థప్రతీతి వీలు కాదు.                

కాలాంతము : కల్పాంతము:

పోనీ, అక్కడ ఉండవలసిన పాఠం “కాలాంతము” కాదు, “కల్పాంతము” అని అనుకొన్నా, “కల్పాంతస్ఫురచ్చండికా, పరుషోద్గాఢపయోధర స్ఫుటతటీ పర్యంత కాఠిన్యమున్” అన్న దళంలో ప్రళయకాలం నాటి చండిక యొక్క పయోధరములకు “పరుషములైన”, “గాఢములైన” (లేదా, “ఉద్గాఢములైన”) అన్న విశేషణాలు ఏ విధంగా అన్వయిస్తాయి? పరుషము, గాఢము (లేదా, ఉద్గాఢము) అన్నవి పయోధరములకు అనువర్తనీయములైన ధర్మములు గాని, వ్యాప్యములైన గుణములు గాని కానందువల్ల “పరుష పయోధరములు”, “గాఢ (లేదా, ఉద్గాఢ) పయోధరములు” అని విశేషించి చెప్పటం ఉండదు. సౌందర్య సమాధాయకములైన కావ్యములలో నఖశిఖపర్యంత స్త్రీ వర్ణన ప్రసక్తమైనప్పుడు పయోధరములను వయోధర్మం మూలాన కమలకోరకాలతో; ఘనిష్ఠత మూలాన బదరీ తాళ జంబీర ఫలములతో, ఫలస్తబకాలతో; ఉబ్బు దృఢత్వము బింకము వట్రువతనము నిండుతనము ఇత్యాదుల మూలాన కలశములతో, హైమ ఘటములతో, పర్వతములతో, మిట్టలతో, హస్తికుంభములతో; మిథున భావం వల్ల చక్రవాకములతో, ఇంకా తత్తత్ప్రకరణానురూపమైన ఉపమా సామగ్రితో పోల్చిచెప్పటమే గాని పరుషోద్గాఢతలను స్వాభావిక విశేషణములుగా కూర్చటం సాహిత్యంలో ఏనాడూ కవిసమయసిద్ధమై లేదు. ఆపై పరుషోద్గాఢ పయోధరముల యొక్క “స్ఫుట (విశదమైన) – తటి (ప్రదేశము)” అంటే ఏమని అర్థం చెప్పుకోవాలి? ఆ స్ఫుటతటీ సామీప్య సంగతమైన కాఠిన్యము అన్నప్పుడు “పర్యంత” శబ్దానికి ఏమని అర్థం చెప్పుకోవాలి? “పర్యంత మందార పారిజాతకవనీ, రమమాణనిర్జరీసముదయంబు” అని భీమేశ్వర పురాణము (1-88) లోనిదే అయిన శ్రీనాథుని ప్రయోగం. అక్కడ పర్యంత శబ్దం సార్థకంగా అన్వయించినట్లు ఇక్కడ అన్వయింపకపోవటం స్పష్టమే.                 

“కాలాంత = ప్రళయకాలమునందు, స్ఫురత్ = ప్రకాశించు, చండికా = చండిక యొక్క, పరుష = కఠినమై, ఉద్గాఢ = అధికమైన, పయోధర = పాలిండ్ల యొక్క, స్ఫుట తటీ పర్యంత = స్పష్టమైన ప్రదేశములందలి చుట్టువారిన మేరగల ప్రాంతములందలి, కాఠిన్యమున్ = గట్టిదనమును.”  

అని డా. గుండవరపు లక్ష్మీనారాయణ గారు 1997లో ప్రకటించిన తమ భీమేశ్వర పురాణము యొక్క ‘దక్షిణ కాశికా వ్యాఖ్య (పు.13) లో వ్రాశారు. ఇదీ యథాయోగ్యంగా సంతరించిన అన్వయమే కాని, క్రమపరిగతితో చూచినప్పుడు పొందుపడదు. “పయోధర స్ఫుటతటీ పర్యంత కాఠిన్యము” అంటే, “పాలిండ్ల యొక్క స్పష్టమైన ప్రదేశములందలి చుట్టువారిన మేరగల ప్రాంతములందలి గట్టిదనము” అని ఉన్న వీరి వివరణ స్థితగతిచింతనమే కాని సవిమర్శకం కాదు.  

అదీగాక, ప్రాకృతిక ప్రళయ సమయంలో మహదహంకార పంచతన్మాత్రలు ఉపశమించి, బ్రహ్మాండోపసంహారం జరుగుతున్నప్పుడు “కాలాంతస్ఫురచ్చండికా, పరుషోద్గాఢ పయోధర స్ఫుటతటీ పర్యంత కాఠిన్యము” ఒక లాగానూ, విరాట్తత్త్వము యొక్క మాయాంశయోగం వల్ల పునఃసృష్టి జరుగుతున్నప్పుడు “కాలాదిస్ఫురచ్చండికా, పరుషోద్గాఢ పయోధర స్ఫుటతటీ పర్యంత కాఠిన్యము” ఒక లాగానూ ఉండవు కాబట్టి ఆ వర్ణనలో వర్ణనీయ సమయప్రసిద్ధి గాని, ఔచిత్యస్ఫూర్తి గాని లేవు.

కాఠిన్యము : కావ్యప్రౌఢి:

అన్వయింపని పౌరాణికార్థాన్ని అటుంచి, అన్వయింపదగిన సాహిత్యార్థాన్ని పరిశీలిద్దాము. “కఠినస్తనోపరిగ్రైవేయమణికాంతి కర్ణతాటంకంబు గాడిపఱుప” అని రామాయణ కల్పవృక్షము (బాల. అవతారిక-25) లో విశ్వనాథ వర్ణించినట్లుగా కేవలం కాంతా స్తనములకే గాక - సందర్భౌచితిని బట్టి ఆ కాఠిన్య భావం కాంతాసమ్మితములైన కావ్యాలకు సైతం వర్ణనీయమే. ‘కఠిన’ అంటే దీర్ఘసమాసభూయిష్ఠమై, మహాప్రాణాక్షరబహుళమైన ప్రౌఢ కావ్యరీతి అని, అది గౌడదేశంలోని పండితులకు అభిమానపాత్రమని లాక్షణికోక్తి. “అతిదీర్ఘసమాసయుతా బహులై ర్వర్ణయుతా మహాప్రాణైః, కఠినా సా గౌడీ యే త్యుక్తా త ద్దేశబుధమనోజ్ఞత్వాత్” అని రసార్ణవ సుధాకరము (1-239) లో సర్వజ్ఞ సింగభూపాలుడు నిర్వచించాడు. శృంగార నైషధము రచనోపక్రమణానికి మునుపటి నుంచే సర్వజ్ఞ సింగభూపాలుని రచనతో పరిచయం ఉన్నందువల్ల శ్రీనాథుడు ఆ కాఠిన్య రీతిని తన పద్యంలో అర్థవంతంగా ఉద్దేశించాడని అందామంటే, “కాలాంతస్ఫురచ్చండికా, పరుషోద్గాఢపయోధర స్ఫుటతటీ పర్యంత కాఠిన్యము” అన్న దళంలో “కాఠిన్యము” అన్న ఒక్క పదానికే గాని, తక్కిన పదాలకు సాహిత్యార్థంలో సార్థకమైన అన్వయం ఒకటున్నట్లు కనుపింపదు. అది పరమేశ్వర శిరోఽలంకృతుడైన హరిణాంకుని యొక్క వక్రత వంటి వక్రతను కలిగిన వాగ్వైచిత్రి; ఆ వాగ్వైచిత్రీ ప్రౌఢిమల మూలాన కావ్యాత్మరూపమైన రసము యొక్క సిద్ధి సంభవిస్తుందని మొత్తానికి ఏదో ఒక విధంగా సరిపెట్టుకోవాలి. అప్పటికీ, వక్రతా ప్రతీయమానమైన వక్రోక్తి, కాఠిన్య గమ్యమానమైన ప్రౌఢిమ, సరసత్వ పరిణామమైన రససిద్ధి “సంభవించటం” ఏమిటని ఉత్థాపనీయమైన సందేహం ఉండనే ఉంటుంది. ఈ గంధర్వగోళమంతా ఎందుకని మొత్తంమీద పాఠకులు ఇందులో 1) వక్రోక్తి, 2) కాఠిన్యము, 3) రసవత్త సంభవించెను (ఒక్కచోటే ఉప్పతిల్లాయి) అనఁగా (అన్నట్లుగా) - సత్కావ్యములు దిగ్దిగంతాలలోని కవుల యొక్క జిహ్వాగ్రరంగములపై నాట్యం చేస్తుంటాయని తాత్పర్యార్థం చెప్పుకోవాలి. ఇంతకీ “సరసత్వము”నకు సాహిత్యార్థమే చెప్పుకొన్నాము కాని, మొదటి రెండు దళాల లాగా దానికి సుప్రతీతమైన పౌరాణికార్థం ఏదీ లేనందువల్ల ఆ ప్రస్తావనను విడిచివేయవలసి ఉంటుంది. శ్రీనాథుడే భీమేశ్వర పురాణమునకు మునుపు రచించిన శృంగార నైషధము (2-102) లోని –

         

సరసత్వంబు, నిగూఢకార్యఘటనాచాతుర్యసంపత్తియుం,

          బురుషార్థైక పరాయణత్వమును, నభ్యుత్థానలీలాధురం

          ధరతాప్రౌఢియునుం, గృతజ్ఞతయు, వాత్సల్యంబు, సద్భావమున్

          సరసీజాసనవాహనాహ్వయవతంసా! హంస! నీ కందముల్.

అన్న పద్యంలో ‘సరసత్వము’, ‘ప్రౌఢి’ అన్నవి రెండూ ఉన్నప్పటికీ, భీమేశ్వర పురాణము పద్యంలోని శ్లిష్టార్థాన్ని అక్కడ అన్వయించే అవకాశం లేదు.

3. కుంతకుని వక్రోక్తి జీవితము : శ్రీనాథుని పద్యానుసరణ విషయ విమర్శ:

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు 1992లో ప్రకటించిన ‘తెలుగు సాహిత్య చరిత్ర’ (ద్వితీయ భాగము) లో శ్రీనాథుని కవితారీతులను అధికరించిన ప్రస్తావం (పుట.123) లో ఈ విధంగా వ్రాశారు:

          “ఇది సత్కావ్యలక్షణము. ఇందలి హరచూడాహరిణాంకవక్రత”, “సరసత్వంబును కుంతకుని వక్రోక్తిజీవితములోని శ్లోకమునకు అనుసరణము:

          “వాగ్వల్ల్యాః పదపల్లవాస్పదతయా యా వక్రతోద్భాసినీ

          విచ్ఛిత్తిః సరసత్వసమ్పదుచితా కాప్యుజ్జ్వలా జృమ్భణే

          తా మాలోచ్య విదగ్ధషట్పదగణై ర్వాక్యప్రసూనాశ్రయం

          స్ఫారామోదమనోహరం మధురవోత్కణ్ఠాకులం పీయతామ్.  35 శ్లో. 2 ఉన్మే. 

వక్రతచే మిక్కిలి ప్రకాశించునదియు, సరసత్వసంపదకు సముచితమైనదియు, సముజ్జ్వలమైనదియు అగు వాక్కు అనెడు వల్లి యొక్క పదపల్లవములను ఆశ్రయించిన విచ్ఛిత్తిని వివేచించి, విదగ్ధు లనెడు తుమ్మెదకదుపులు వాక్యపుష్పములలోని మహాసౌరభముచేత మనోహరమైన మకరందమును నూతనోత్కంఠతో ఆస్వాదించును గాక అని తాత్పర్యము.

వక్రత అనగా బాలేందుసుందరసంస్థానమని కుంతకుని వ్యాఖ్య. శ్రీనాథుని పద్యములోని హరచూడాహరిణాంకసాదృశ్యము తదనుసారియే. సరసత్వమన శృంగారాదివ్యంజకత్వమని కుంతకుని వ్యాఖ్య. కాఠిన్యమన ప్రౌఢిమ.

భరతమునిప్రోక్తమైన రసము, కుంతకప్రతిపాదితమైన వక్రోక్తి శైలీపరిణతమైన ప్రౌఢిమ సత్కావ్యలక్షణములని శ్రీనాథుని సిద్ధాంతము. ఈ మూడును తన కవితారీతులని శ్రీనాథుని ఋజుముఖప్రకటనము.”

కుంతకుని శ్లోకంలో “వాగ్వల్లి” అన్న రూపణం వల్ల వాక్కు పరంగా ఒక అర్థమూ, వల్లీపరంగా ఒక అర్థమూ చెప్పబడి ఉన్నాయి. “సరసత్వము” అంటే ‘వక్రోక్తి జీవితము’ నకు ఆయనే స్వయంగా వ్రాసిన వృత్తిలో –

  • స్వసమయసమ్భవి రసాఢ్యత్వమ్ – స్వసమయ సమ్భవి = వర్ణనీయాంశాలు తత్తదుచితస్థానములలో సమయోచితంగా నివేశింపబడినందు వల్ల, రసాఢ్యత్వమ్ = శృంగారాది రసములను కలిగి ఉండటం - అని వాక్కు పరంగానూ;
  • స్వసమయ సమ్భవి = పుష్పించే ఋతువు ఆసన్నమైనప్పుడు, రసాఢ్యత్వమ్ = ఆ పూవుల యందు నిండుగా మకరందమును కలిగియుండుట - అని వల్లీపరంగానూ  రెండర్థాలను వివరించి చెప్పాడు.   

కుంతకుని నిర్వచనానుసారం “వక్రత” అంటే ఉక్త్యాదివైచిత్ర్యమ్ = వక్రోక్తి అనెడి వైచిత్రీయుక్తమైన ప్రాణశక్తితో కూడిన - అని వాక్కు పరంగానూ; బాలేన్దుసున్దరసంస్థానయుక్తత్వమ్ = నెలవంక సోయగంతో అందంగా వంకలు తీరిన రూపురేకతో - అని వల్లీపరంగానూ అన్వయించుకోవాలి. “విచ్ఛిత్తి” అంటే కవికౌశల కమనీయత అని, సువిభక్తపత్రత్వము అని అర్థాలు. “ఉజ్జ్వలత్వము” అంటే సన్నివేశ సౌందర్య సముదయమని, పర్ణచ్ఛాయాయుక్తత్వమని అర్థాలు. “ఆమోదము” అంటే వేత్తలైనవారు గ్రహింపదగిన ఆహ్లాదకారిత్వము, పుష్పసౌరభము అని. “మధు” అంటే నిఖిల కావ్య కారణీభూతమైన లక్షణసంపత్సముదయమట. మధువు అంటే పువ్వుతేనె. ఈ విధంగా రెండర్థాలనూ గ్రహించాలి.

శ్రీనాథుని పద్యంలో శ్లేషాశ్లేషం ఈ ప్రకారంగా నిబద్ధమై లేదు. “బాలేన్దుసున్దరసంస్థానయుక్తత్వము” అన్న రూపణం “హరచూడా హరిణాంక వక్రత”కు మూలమని చెప్పలేము. “సరసత్వము” అంటే శ్లోకంలో వలె శృంగారాది రసయుక్తి అన్వయిస్తున్నది కాని, వల్లీపరమైన అర్థం ప్రసక్తింపబడలేదు. ఇక, “కాలాంతస్ఫురచ్చండికా, పరుషోద్గాఢపయోధర స్ఫుటతటీ పర్యంత కాఠిన్యము”నకు మూలమని చెప్పదగిన అంశం పై శ్లోకంలోనే గాక మొత్తం వక్రోక్తిజీవితంలోనే లేదు. రెండింటినీ ప్రక్కనుంచుకొని చదివే పాఠకులకు ఈ రెండింటిలో పారస్పరికత స్ఫురిస్తుందని చెప్పటం కష్టం. అందువల్ల శ్రీరామమూర్తి గారి ఈ అభ్యూహ అంగీకర్తవ్యం కాదని నిర్ణయింపవలసి ఉన్నది.

4. శంభుకవి కల్పన : శ్రీనాథుని అనువాద నైపుణి:

క్రీస్తుశకం 11-వ శతాబ్ది ఉత్తరార్ధం నాటి కాశ్మీర హర్షదేవుని ఆస్థాన సమలంకృతుడై సంస్కృత సాహిత్యంలో వక్రోక్తి ఘటనకు సుప్రసిద్ధుడై అతిమనోహరంగా ‘అన్యోక్తి ముక్తాలత’ను రచించిన శంభు మహాకవి యొక్క ‘రాజేంద్ర కర్ణపూరము’ లోని నాందీశ్లోకం ఇది:

          బద్ధస్పర్ధః క్షితిధరసుతాభ్రూలతావక్రతాయాం

          భూయా ద్భూత్యై తవ హరశిరశ్శేఖరో రోహిణీశః

          యం నిష్పీడ్య స్తనముఖనఖోల్లేఖరేఖాసు దేవ్యాః

          సమ్భోగాన్తే వితరతి సుధాస్యన్దమూర్ధేన్దుమౌలిః.

హరశిరోఽలంకృతుడైన ఏ అర్ధచంద్రునికి పార్వతీదేవి యొక్క కనుబొమ్మ వంపును చూసి (తనయొక్క వంపు కంటె అందమైనదని) స్పర్ధ కలిగిందో, అది గుర్తించి ఎవని నిష్పీడనముచే (చేతులతో ఒత్తుటచే) హరుడు రతిక్రీడాంతమునందు పార్వతీ స్తనాగ్రములపై  ఉల్లేఖించిన (నఖక్షతములనే అర్ధచంద్రాకార) రేఖలయందు అమృతరసాన్ని చిందింపజేశాడో, ఆ చంద్రుడు మీకు సర్వసంపదలను కలుగజేయును గాక! అని.  

చంద్రుడు పార్వతీ భ్రూలతికను చూచి బద్ధస్పర్ధుడైనట్లు చెప్పటం వల్ల భ్రూలత యొక్క వంపుకు, నెలవంక యొక్క వంపుకు వక్రిమాసాదృశ్యమూలకమైన బింబప్రతిబింబభావం ప్రతిపాదింపబడుతున్నది. ఇందులో రజ్జువునందు సర్పమును వలె పార్వతీ భ్రూలతా ధర్మములను అవి లేని చంద్రరేఖ యందు మిథ్యారోపితంగా ఆవిష్కరించటం జరగలేదు. ఇది ప్రకృతమైన చంద్రరేఖ, అప్రకృతమైన భ్రూలతల యొక్క అభేదనిశ్చయమని చెప్పటానికీ వీలులేదు. ఎందుకంటే, చంద్రరేఖా భ్రూలతల వక్రిమలు రెండూ ఇక్కడ ప్రకృతార్థములే. ఈ విధంగా ఆరోపాధ్యవసానములు లేని అర్థసంబంధమైన అభిన్నతను కలిగి ఉండటమే ఉపమాలంకారమును గర్భీకరించికొన్న నిదర్శన యొక్క లక్షణం. చంద్రునికి భ్రూలత యందు సహజమైన స్పర్ధ లేకున్నప్పటికీ స్పర్ధ ఉన్నట్లు అతిశయోక్తంగా అభివర్ణింపబడింది కనుక ఇది అసంబంధ సంబంధాతిశయోక్తి కూడాను. బియ్యంలో నువ్వులను కలిపితే ఆ రెండింటి యొక్క రంగు కాని, రూపం కాని ఒకదానిలో ఒకటి కలిసిపోక రెండింటికి రెండూ విడివిడిగానే కనబడినట్లు తిలతండుల న్యాయాత్మకమైన ఉభయాలంకార సంసృష్టి.      

మహావిద్వాంసుడైన శ్రీనాథుడు శంభుకవి రచనలను చక్కగా చదువుకొన్నాడని ఇంకా ఎన్నో సందర్భాలలో మనము చూడవచ్చును. అదొక ప్రత్యేకమైన పరిశోధనాంశం. ఈ ఒక్క పద్యాన్నే తీసికొన్నప్పటికీ, “అవ్యా త్స వ స్తాణ్డవవిభ్రమేణ, మౌలౌ విలీనా హరిణాఙ్కలేఖా, సా యస్య వామే కుచమణ్డలాగ్రే, కర్పూరపత్రాఙ్కురటఙ్కమేతి” అని శంభుకవి రాజేంద్ర కర్ణపూరములోని 2-వ శ్లోకంలో ప్రస్తావించాడు. “రాకాకాన్తకలాఙ్కురం కురు చిరం చణ్డీశ! చూడాన్తరే” అని, అందులోనిదే 22-వ శ్లోకం. శంభు మహాకవిని అధ్యయనించిన శ్రీనాథుడు ఈ శబ్దసంపుటిచే ప్రభావితుడు కావటం సహజమే కనుక ఈ శ్లోకాల ఆధారంగా పద్యాన్ని -

          హరచూడా హరిణాంక వక్రతయుఁ, (గేళ్యంత)స్ఫురచ్చండికా

          పరుషోద్గాఢ పయోధర స్ఫుట (నఖప్రక్షేప) కాఠిన్యమున్‌,

          సరసత్వంబును (సంఘటిల్లె) ననఁగా సత్కావ్యముల్‌ దిక్కులం

          జిరకాలంబు నటించుచుండుఁ గవిరా(డ్జిహ్వాగ్ర)రంగంబులన్‌!

అని పరిష్కరించటం సమీచీనమేమో పరిశీలింపవలసి ఉన్నది. పౌరాణికార్థంతోపాటు సాహిత్యార్థాన్ని కూడా జోడించిన హేతుమత్త్వం వల్ల శ్రీనాథునికి శ్లోకంలోని కల్పనను సాంగోపాంగంగా విస్తరింపవలసిన అవసరం లేకపోయింది. శంభుకవి మూలంలోని “క్షితిధరసుతాభ్రూలతావక్రత”ను పరిత్యజించి, “హరశిరశ్శేఖరో రోహిణీశః” అన్న దళాన్ని మాత్రం యథాతథంగా స్వీకరించి, దానిని “హరచూడా హరిణాంక వక్రత”లో అంతర్భవింపజేశాడు. ప్రళయకాలమన్న అర్థంలో అనన్వితమైన “కాలాంతము” తొలగింపబడి, శంభుకవి “సమ్భోగాన్తే” అని వర్ణించిన అర్థంలో పార్వతీ పరమేశ్వరుల రతిక్రీడాంతవేళా సూచకంగా వ్రాతప్రతులలోని పాఠానికి సన్నిహితమైన “కేళ్యంత”మును స్వీకరించటం జరిగింది.    

ఇక, “ఉద్గాఢ” శబ్దమునకు “లోతైన” అని ఇక్కడ ప్రాకరణికార్థం. “గాఢకాన్తదశనక్షతవ్యథా సఙ్కటా దరివధూజనస్య యః, ఓష్ఠవిద్రుమదలా న్యమోచయ న్నిదర్శ న్యుధి రుషా నిజాధరమ్” అని మమ్మటుడు కావ్యప్రకాశము (4-53) లో ఎవరిదో శ్లోకాన్ని స్వతస్సంభవిగా అలంకారముచేత అలంకారము ధ్వనిస్తున్నందుకు ఉదాహరణగా ప్రదర్శించాడు. విశ్వనాథ కవిరాజు సాహిత్య దర్పణము (4-9) లోనూ ఇది ధ్వనిభేదప్రకరణంలో కనుపిస్తుంది. యుద్ధవేళ రాజుకు శత్రురాజులపైని క్రోధావేశంలో దష్టాధరత్వం సంభవించింది. కోపంలో ఉన్నప్పుడు క్రింది పెదవిని కొరుక్కోవటం జరిగిందన్నమాట. అందువల్ల పెదవిపై గాఢమైన (లోతైన) గంటు పడింది. యుద్ధమైతే గెలిచాడు కాని, అతని పెదవిపై గంటు వల్ల శత్రురాజుల భార్యలకు మేలే జరిగింది. రిపుకాంతల కెంపువన్నె పెదవులపై భర్త ముద్రించిన దంతక్షతముల బాధ ఇతని మూలాన మళ్ళీ సంభవించే అగత్యం తొలగిపోయిందని భావం. మహావిద్వాంసులు శ్రీ కృష్ణమోహనశాస్త్రి గారు సాహిత్య దర్పణ లక్ష్మీ వ్యాఖ్యలో ఈ చోట “గాఢా = తీవ్రా” అని అర్థాన్ని వ్రాశారు. శ్రీనాథుని పద్యంలో చండికా పయోధరముపై పరమేశ్వర కృతమై పరుషము, ఉద్+గాఢము (తీవ్రతమము) అయిన నఖక్షతము సంభవించిందని అన్వయం. రత్యున్ముఖీకరణవేళ ఉల్లేఖింపబడిన ఆ నఖరేఖ రతిక్రీడాంతసమయాన విస్ఫుటమై కానవచ్చిందని ప్రతీయమానం. అందువల్ల శంభుకవి రచనలోని “స్తనముఖనఖోల్లేఖరేఖా” రచన శ్రీనాథుని పద్యంలో “పయోధర స్ఫుట నఖప్రక్షేపము”గా పరిష్కరింపబడింది. ఎంత పరుషోద్గాఢమైనప్పటికీ ఆ నఖోల్లేఖరేఖ సైతం అర్ధచంద్రాకృతము కనుక హరచూడా హరిణాంకము వలె వక్రిమా సాదృశ్యమును కలిగినదే.  

అంతే కాదు. “క్షితిధరసుతాభ్రూలతా వక్రతా” అన్న దళంలోని క్షితిధరసుతను తెలుగుచేసేటప్పుడు మహాకవి “కేళ్యంత స్ఫురత్ పార్వతీ, పరుషోద్గాఢ పయోధర స్ఫుట (నఖప్రక్షేప) కాఠిన్యమున్” అని చేయక, “కేళ్యంత స్ఫురచ్చండికా, పరుషోద్గాఢ పయోధర స్ఫుట (నఖప్రక్షేప) కాఠిన్యమున్” అని “చండికా” శబ్దాన్ని ప్రయోగించాడు. చడి = కోపనే అని ధాతుపాఠం. చణ్డతి కుప్యతి ఇతి చణ్డికా. ఆమె కోపన. “చణ్డీ కాత్యాయనీ దేవ్యాం హింస్రకోపనయోషితోః” అని. ప్రణయకుపితయై ఉన్నది. నాయికతోడి ప్రథమ సమాగమ వేళ, నాయకుడు దూరప్రయాణం చేసివచ్చినప్పుడు, లేకుంటే దూరప్రయాణార్థమై వెళ్తున్నప్పుడు, మద్యపానాదులను సేవించిన మత్తులో ఉన్నప్పుడు, నాయిక కోపనయై ఉన్నప్పుడు (“క్రుద్ధప్రసన్నాయామ్”) ఆమెను సుముఖీకరించుకొనేందుకు స్తనాగ్రభాగ స్తనపృష్ఠ నఖోల్లేఖము ప్రయోక్తవ్యమని వాత్స్యాయన సూత్రం (2-4-2). “నాయకేన ప్రసాదితా సతీ హర్షా ద్వివృద్ధరాగా భవతి” అని యశోధరుని జయమంగళ వ్యాఖ్య. నాయికా రతినిర్వృతినైమిత్తికములైన ఆ నఖక్షతములు మృదు - మధ్యమ - అతిమాత్రత్వములచే మూడు విధాలు. రాగాధిక్యమూలకమై పరమేశ్వర కృతమైన అతిమాత్ర విలేఖనముచేత అది పరుషము, ఉద్గాఢము అయింది. ఆ విధమైన పరుషోద్గాఢ నఖక్షతానికి ‘ఆచ్ఛురికము’ అనిపేరు. అది స్తనముఖనఖోల్లేఖమని శంభుకవి చెప్పినందున అర్ధచంద్రాకృతమని గమ్యమానం. “స్తనపృష్ఠే చ వక్రో నఖపదనివేశోఽర్ధచన్ద్రకః” అని వాత్స్యాయనుడు (2-4-14). పరుషోద్గాఢము కాబట్టే పయోధరముపైని నెలవంక తీర్పుతో ప్రస్ఫుటమై కానవచ్చింది.            

శంభుకవి వర్ణించిన ‘అమృతస్యందము’ ఆ అర్థంలోనే శ్రీనాథుని కృతిలో ‘సరసత్వము’ అన్న శబ్దంలో లీనమైంది. శంభుకవి రూపించిన కల్పన యొక్క స్వరూపము తెలియనివారికి సైతం శ్రీనాథుని పద్యం స్వతంత్రంగానే అన్వయిస్తుంది. హరచూడా హరిణాంకుని యొక్క వక్రత వంటి వక్రోక్తి యందు, కేళ్యంతస్ఫురత్ చండికా పరుషోద్గాఢ పయోధర స్ఫుట నఖప్రక్షేపము యొక్క కాఠిన్యమునందు “కావ్యామృతరసేన అన్తశ్చమత్కారో విద్యతే” అని కుంతకుడు చెప్పిన (1-5) అమృతస్యందిత చిత్తవిస్తార రూపమై, కేవలానుభవానందస్వరూపమై గోచరీభవిస్తుందని ఈ సరసత్వము యొక్క తాత్పర్యాన్ని గ్రహించాలి. నఖప్రక్షేప కాఠిన్యము సైతం చండికా సౌముఖ్యరూపమైన ఆనందపర్యవసాయి కావటం వల్ల అది సరసత్వముగా పరిణమించిందని జ్ఞాయమానమై ఉన్నది. ఇందులోని వక్రతా కాఠిన్య సరసత్వముల సన్నివేశానికి స్ఫోరకంగా ‘కూర్పు’ అన్న సదర్థంలో సార్థకమైన ‘సంఘటిల్లెను’ అన్న రూపం స్వీకరింపబడింది.

“సంభవించెను” అన్నప్పుడు “సంఘటిల్లెను” అన్న అర్థం కూడా అందులో నిహితమై ఉన్నది కాబట్టి ఆ మార్పు ఇష్టం లేనివారు “సంభవించెను” అన్న పూర్వరూపాన్ని ఉన్నదున్నట్లుగా స్వీకరింపవచ్చును.   

“కవిరాజీగేహరంగంబులన్” స్థానంలో “కవిరాడ్జిహ్వాగ్రరంగంబులన్” అని చేసిన సవరణ గురించి ముందే చెప్పాను.  

విద్వన్మాన్యులు, కవిశిరోమణి శ్రీమాన్ తిరుమల కృష్ణదేశికాచార్యుల వారు దయతో ఈ వ్యాసం ప్రకాశన పూర్వపు ప్రతిని చదివి, ముద్రిత ప్రతులలో కానవస్తున్న ‘రాజీ’ శబ్దాన్ని పరిరక్షించేందుకు “కవిరాజీవక్త్రరంగంబులన్” అన్న సవరణను సూచించారు. దానిని చూచినప్పుడు నాకు వక్రోక్తిజీవితము (1-1) లో కుంతకుడు వ్రాసిన “కవీన్ద్ర వక్త్రేన్దు లాస్యమన్దిరనర్తకీమ్” అన్న పంక్తి జ్ఞాపకానికి వచ్చి ఎంతో సంతోషమైంది. శంభుకవి కూడా “సత్కావ్యం వదనే” అని రాజేంద్ర కర్ణపూరములో మరొకచోట (54-వ శ్లోకంలో) అన్నాడు. నేను ‘కవిరాజు’, ‘కవిసార్వభౌముడు’ మొదలైన ఉపలక్షణాలకు సూచకంగా ఉంటుందని “కవిరాట్ జిహ్వాగ్రరంగంబులన్” అని ఊహించాను. అయితే, “కవిరాట్ జిహ్వాగ్రరంగంబులన్” అన్న పాఠం కేవలం కవిరాజ కవిసార్వభౌమాదులకు మాత్రమే అన్వయిస్తుందని, “కవిరాజీవక్త్రరంగంబులన్” అన్న పాఠం సర్వకవిజనానువర్తనీయమైన విశాల కథితకథంతను కలిగినదని భావించే ఆభిమానికులు దానిని స్వీకరింపవచ్చును.    

పద్యార్థం ఇది: కవిరాడ్జిహ్వాగ్రరంగంబులన్ – కవిరాట్ = కవిరాజులయొక్క, జిహ్వా+అగ్ర = నాలుక కొస లనెడి, రంగంబులన్ = నాట్యవేదికలపై, (లేదా, కవిరాజీ = కవిశ్రేణియొక్క, వక్త్ర = ముఖములనెడి, రంగంబులన్ = వేదికలపైని), హరచూడా హరిణాంక వక్రతయున్ - హర = పరమేశ్వరుని యొక్క, చూడా = సిగయందలి, హరిణాంక వక్రతయున్ = హరిణాంకుని (చంద్రుని) యొక్క వక్రత వంటి వక్రతయును (వక్రత అను వైచిత్రీ రూపమైన ప్రాణశక్తియును), కేళ్యంతస్ఫురచ్చండికా ... కాఠిన్యమున్‌ - కేళీ+అంత = రతికేళి యొక్క అంతమున, స్ఫురత్ = వెలుగొందుచున్న, చండికా = కోపించి ఉన్న చండిక యొక్క, పరుష = నిష్ఠురమును, ఉద్గాఢ = లోతైనదియు అగు, పయోధర స్ఫుట నఖప్రక్షేప - పయోధర = వక్షోజముపైని, స్ఫుట = విశదముగా కనబడుచున్న, నఖ = గోటిచే, ప్రక్షేప = (నెలవంక గుర్తును) ఉంచుట యందలి, కాఠిన్యమున్ = కఠినత్వమును (‘కఠిన’ అను గౌడీ రీతియును); సరసత్వంబునున్ = కేళ్యంతమున ఆమె మనస్సు నిర్వృతిరూపమైన సారస్యమును కలిగియుండుటయు (వక్రతచే వక్రోక్తి అనెడి ప్రాణశక్తియు, కాఠిన్యముచే ప్రౌఢిమయును, సరసత్వము = రసాత్మకత మూలమున అమృతస్యందితయును); సంఘటిల్లెను = ఒక్కచో సమకూడెను, అనఁగాన్ = అనునట్లుగా (భాసిల్లునట్టి), సత్కావ్యముల్‌ = ఉత్తమ కావ్యములు, దిక్కులన్ = దెసల యందు, చిరకాలంబున్ = శాశ్వతముగా, నటించుచుండున్ = నర్తించుచుండును – అని.

ఈ వక్రతయే కవిసార్వభౌముని కవిత్వాదర్శం. ఆలంకారికులు ఈ వక్రోక్తిని పరిపరివిధాల నిర్వచించారు. ఇది శబ్దాలంకారమా? అర్థాలంకారమా? అన్న విషయమై మహామహులలోనే అనేక భేదాభిప్రాయాలున్నాయి. అలంకార మహోదధిలో నరేంద్రప్రభా సూరి, అలంకార శేఖరములో కేశవ మిశ్రుడు, కావ్యప్రకాశములో మమ్మటుడు, కావ్యానుశాసనములో హేమచంద్రుడు, కావ్యాలంకారములో రుద్రటుడు, కావ్యాలంకార సారసంగ్రహములో భావదేవ సూరి, శృంగార ప్రకాశములోనూ సరస్వతీ కంఠాభరణములోనూ భోజరాజు, వాగ్భటాలంకారములో ద్వితీయ వాగ్భటుడు, సాహిత్య దర్పణములో విశ్వనాథుడు దీనిని శబ్దాలంకార ప్రభేదంగా పరిగణించారు. శ్లేష వక్రోక్తి యందు గల సభంగ శ్లేష వక్రోక్తి, అభంగ శ్లేష వక్రోక్తి, కాక్వాక్షిప్తమైన వక్రోక్తి అన్న మూడు ప్రభేదాలు శబ్దాశ్రితములు కాబట్టి ఇది పరివృత్త్యసహిష్ణుకమైన శబ్దాలంకారమని వీరి మతమనుకోవాలి. కావ్యమీమాంసను బట్టి రాజశేఖరుడు భామహుని వలె ఔక్తిక (ఉక్తిగర్భ) వాది అనే వ్యాఖ్యాతలు ఊహించారు. అలంకార సర్వస్వములో రుయ్యకుడు, ఏకావలిలో విద్యాధరుడు, కావ్యవిలాసములో చిరంజీవుడు, కువలయానందములో అప్పయ దీక్షితుల వారు, చంద్రాలోకములో జయదేవుడు, నంజరాజ యశోభూషణములో నరసింహ పండితుడు, ప్రతాపరుద్రీయములో విద్యానాథుడు, సాహిత్య రత్నాకరములో మల్లాది లక్ష్మణసూరి, సుబోధాలంకారములో సంఘరక్షితుడు దీనిని అర్థాలంకార శ్రేణిలో పఠించారు. అలంకార మణిహారములో శ్రీకృష్ణ బ్రహ్మతంత్ర పరకాల యతీంద్రుల వారు వక్రోక్తిని శబ్దశ్లేషమూలకము, అర్థశ్లేషమూలకము అన్న భేదప్రభేదాల అత్యంత సూక్ష్మవిచారంతో సోదాహరణంగా వివరించారు. ఇది శ్లేషానుప్రాణితమని అంగీకరించినప్పటికీ ఉభయపక్షాలకు తటస్థులై నిలిచినవారు అనేకులున్నారు. “పరోక్తస్య శ్లేషేణ కాక్వా వాఽన్యథోక్తి ర్వక్రోక్తిః” అని కావ్యానుశాసనములో ప్రథమ వాగ్భటు డన్నాడు. అలంకార మంజరిలో వేణీదత్తుడు, కావ్యాదర్శములో దండి, కావ్యాలంకారములో భామహుడు ముక్తాముక్తంగా వెలిబుచ్చిన అభిప్రాయాలను బట్టి దీని స్వరూప నిరూపణను మరింత లోతుగా చర్చింపవలసి ఉంటుంది.

ముగింపు:    

వక్రోక్తిని హేమచంద్ర విద్యానాథాదులు పేర్కొన్న కావ్యాలంకారవిశేషమాత్రముగా కాక కుంతకుడు నిరూపించిన కావ్యజీవితముగా భావించినప్పటి అనువర్తిత సర్వాంగీణ విమర్శకు కవిసార్వభౌముడు శ్రీనాథుని సాహిత్యజీవితమంతా ఉదాహరణీయమే కాగలదు. ఆ విషయమై విపులమైన విమర్శ వెలువడవలసి ఉన్నది. నిర్దోషము, సగుణము, సార్థకము అయిన పద్య పరిష్కారం అందుకు ప్రాగ్భూమిక అవుతుంది.