ఉపోద్ఘాతం: 

“కావ్యేషు నాటకం రమ్యమ్” అన్నారు ప్రాచీనులు. నాటి నాటకాల్లో పాత్రలు దేవతలు, రాజులు, కులీన స్త్రీలు ఉండేవారు. నేటి నాటకం అనేక ప్రయోగాలకు నిలయమై, సామాన్య మానవుని ఆవేదన, అస్తిత్వం, గుర్తించి  సామాజిక దర్పణంగా తనను తాను ఆవిష్కరించుకొంటోంది. అలాంటి ఒక నూతన ప్రయోగాత్మకమైన నాటకం  "మబ్బుల్లో బొమ్మ".

రచయిత పరిచయం:

ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా పని చేసి పదవీ విరమణ పొందిన డా. దీర్ఘాసి విజయభాస్కర్ అనేక సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేసినా నాటక రచనే ఆయనకు అభిమానమైన అంశం. అవార్డులు తెచ్చిపెట్టిన రంగం. ఆయనకు, ఆయన రాసిన నాటకాలకు ఎన్నో నంది అవార్డులు గృహంలోకి నడిచి వచ్చాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు (2010) పొందిన ఏకైక తెలుగు నాటక రచయిత ఆయన. ఇతర భాషల్లోకి అనువదించడం ఆయన నాటకాల ప్రాధాన్యతను తెలుపుతుంది. ఆయన చేసిన సాహిత్య కృషి మీద అనేక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. నేల విడిచి సాము చేయక సామాజిక అంశాలను సునిశితంగా పరిశీలించి కలం కదిపే సాహిత్య ద్రష్ట విజయభాస్కర్.

కథాసంగ్రహం – సంభాషణా చాతుర్యం:

ఈ నాటకం లోని కథాచిత్రణ, ప్రదర్శన నూతనమైన ప్రయోగం. ఒక నాటక ప్రదర్శనకు నాటక బృందం ఒక ఊరికి వెళ్తారు. 

"ఒక ప్రదర్శన చేస్తాం. మాటలు ఉండవు. వారి మధ్య ఏం జరిగిందో మీరు చెప్తే ఒక బహుమతి ఇస్తాం" అంటాడు దర్శకుడు. ప్రేక్షకులు మొదట ఆశ్చర్యపోయి, విసుకు పడినా తర్వాత ఒప్పుకున్నారు. చివర్లో ఆ అమ్మాయి మీద కిరోసిన్ పోయటంతో ఒక ప్రేక్షకుడు లేచి "ఇది మా ఇంటి దగ్గర లోనే జరిగింది. వరకట్న సమస్య కదా" అంటాడు. మళ్లీ వేస్తారు. ఈసారి ఇంకో ప్రేక్షకుడు లేచి "ఇది ఆస్తి గొడవ" అంటాడు. మూడో ప్రేక్షకుడు "ఇది పిల్లల గొడవ" అంటాడు. 

వారు ఆవేశంతో, కోపంతో "ఎవరీ డైరెక్టర్ ! ఎవరు రైటర్!" అనడంతో డైరెక్టర్ తెర మీదకి వస్తాడు. 

"నిజానికి మీరు చెప్పినదేదీ కాదు. ఇంకొక సమస్యని రాశాడు మా రైటర్. ఏదిఏమైనా ఆడపిల్లల్ని తగలబెట్టడమే చివరకు జరుగుతోంది" అంటాడు.

"ఈ సమాజంలో ఇదే జరుగుతోంది. నాటకంలో కూడా ఇదేనా" అని ప్రేక్షకుడు ఆవేశ పడతాడు.

"ఈ స్పందనే మాకు కావాలి.  ఆడపిల్లలని తగలబెట్టడం అనే సమస్య మీద తిరగబడటం అన్నది ముఖ్యం. ఇక్కడ ఉన్న వెయ్యి మందిని అడిగితే వెయ్యి సమస్యలు చెప్తారు. అంటే అందరి స్త్రీల వెనక ఏదో ఒక సమస్య ఉంది అనేగా! ఈ తగలబెట్టబోవడం ఘటన తర్వాత ఇంకా ఉంది. చూపిస్తాం" అని మళ్లీ నాటకం వేస్తారు. ఈసారి మాటలు వుంటాయి. 

భర్త వల్ల పిల్లలు కలగరని తెలిసి, మరొకరి ద్వారా గర్భం ధరించమని బలవంతపెడుతూ, ఆమె ఒప్పుకోకపోవడంతో తగలబెట్టబోతారు. యువతి గింజుకొని ఒక్కసారి భద్రకాళి లా విజృంభించింది. 

"గుండెల్లో పెట్టుకొని కాపాడాల్సిన భర్తవి నువ్వే నాకు సమాధి కట్టాలని చూస్తావా! డబ్బు కోసం నన్ను నాశనం చేద్దామనుకున్నావు. నిన్ను క్షమిస్తే మానవత్వాన్నే అవ మానించినట్లు. నైతిక విలువలకు నీళ్ళు వదిలిన నిన్ను వదల కూడదు. భర్తనే స్థానానికి, అసలు మనిషిగా ఉండటానికి కూడా అర్హత లేదు" అని ఆ ఇద్దరినీ చితకబాదు తుండగా ఫ్రీజ్ అయింది.

ప్రయోక్త వస్తాడు. "చింతామణి నాటకం చూసి ఎంతమంది చీకటి తప్పులు చేయటం మానేశారు? సత్య హరిశ్చంద్ర నాటకం చూసి ఎంతమంది అబద్ధాలు చెప్పడం మానేశారు? - అని వితండవాదం చేసే చాలామందికి మీలాంటి స్పందించిన ప్రేక్షకులే సమాధానం. మా నాటకం పేరు "మబ్బుల్లో బొమ్మ". మబ్బులని మనం ఎలా ఊహించుకుంటే అలా కనపడతాయి. స్త్రీ జీవితం కూడా ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనపడుతుంది. ఆమెను మనం సమాన దృష్టితో భావించి, గౌరవించాలి. ఆడదానిని తల్లి, చెల్లి, భార్య ఇలా రకరకాల రూపాలుగా మాత్రమే చూస్తాడు పురుషుడు. కానీ మనిషిగా చూడడు. ఆడదానికి పూజలు కాదు చేయాల్సింది.  గౌరవం ఇవ్వాలి. స్త్రీలు  ఉండాల్సింది గుడిలో కాదు. గుండెల్లో. స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారని అంటారు, కానీ ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు అవసరమే లేదని నా ఉద్దేశం. ఈ రోజు స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో, ఎన్నెన్నో. ఆ సమస్య నేను చెప్పింది కావచ్చు, మీరు చెప్పింది కావచ్చు. ఎక్కడైనా ఒక్కో ప్రేక్షకుడు ఒక్కో విధంగా చెప్పవచ్చు. కానీ వీటన్నిటికీ బలి అయ్యేది మాత్రం స్త్రీ.  స్త్రీ తనను తాను ఎలా కాపాడుకోవాలి అని చెప్పడమే నా ఉద్దేశం" అంటాడు.

ప్రయోగాత్మకత – విశిష్టత:

ఈ నాటకం మొదటి ప్రదర్శనకే  నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత రచన, దర్శకత్వం, నటన - అన్ని రంగాల్లోనూ అనేకసార్లు అవార్డు తీసుకున్న సరికొత్త నాటకం ఇది.   ప్రేక్షకున్ని నాటకంలో ఇన్వాల్వ్   చేయటం ఇందులో ఒక నూతనత్వం. ఓకే దృశ్యాన్ని మళ్లీమళ్లీ ప్రదర్శిస్తే వేరే వేరేగా అర్థం చేసుకోవటం కొత్త ప్రయోగం. దీనిని హిందీ, తమిళం భాషల్లోకి అనువదించారు. ఈ నాటకాన్ని కన్నడంలోకి అనువదించారు, ప్రదర్శించారు కూడా.

ముగింపు:

"మబ్బుల్లో బొమ్మ" స్త్రీ ప్రాధాన్యతని తెలిపే నాటకం. ఒక స్త్రీ హృదయావేదన, అల్లకల్లోలమైన జీవితంలోంచి స్థిరమైన, కృతనిశ్చయంతో ఎదురుతిరిగిన స్త్రీని చిత్రించారు ఈ నాటకంలో.  స్త్రీవాదంతో "సహ అనుభూతి" చెందే పురుష రచయితగా విజయభాస్కర్ గుర్తించవచ్చు.

ఉపయుక్త గ్రంథ సూచి:

1. తెలుగు నాటక వికాసం – డా. పోణంకి శ్రీరామ అప్పారావు

2. తెలుగు నాటక సాహిత్యం - (సం) డి. ఎస్. ఎన్. మూర్తి