ఉపోద్ఘాతం :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్వహించిన 2017 నంది నాటకోత్సవాలలో ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా వెండి నంది, ఉత్తమ  ద్వితీయ రచన, ఉత్తమ నటుడు ఉత్తమ సంగీతం బహుమతులు పొందిన నాటకం వల్లూరు శివప్రసాద్ రచించిన "ఇంటింటి భాగోతం". ప్రముఖ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి రాసిన "మా ఇంటి రామాయణం" కథకి నాటకీకరణ ఇది.

ఇతివృత్తం :

సాధారణంగా అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోవటాన్ని   ఎక్కువగా కథల్లో సినిమాల్లో చూస్తాం. కానీ పురుషాహంకారం తో అత్తగారి పై దాష్టీకం చేసే మామగారికి గుణపాఠం చెప్పే కోడల్ని దీనిలో చూస్తాం. స్త్రీవాద దృష్టితో, ప్రగతిశీల భావాలతో ఎంతో ప్రతిభావంతంగా నాటకరచనగా మలిచారు శివప్రసాద్. గంగోత్రి సాయి అన్నట్లు-  ఇల్లే జీవితం, భర్తే దేవుడు అనుకుంటూ తనను తాను మరచి ఇంట్లో అందరికీ అన్నీ అమర్చి పెట్టే ఇల్లాలు ప్రపంచ జ్ఞానం ఉన్నా ఏమీ తెలియని జడ పదార్థంగా మిగిలిపోతుంది. భర్త ఏది చెప్తే అది చేయటం, అణిగిమణిగి ఉండటం, తన ఆలోచనకు విలువ లేకపోవడం స్త్రీని బాధించే అంశమే. ప్రతి వ్యక్తి జీవితం లో భార్య అడుగులో అడుగేసి జీవిత చరమాంకం వరకు నడుస్తూనే ఉంటుంది. ఇంట్లో అన్ని విషయాలను ఏ ఒడిదుడుకులు లేకుండా సమర్థించుకుంటూ క్షణం తీరిక లేని ఇలాంటి ఇల్లాండ్రను   అనేక మందిని చూస్తూనే ఉన్నాం. తన భావాలను గౌరవించాలని, విలువ ఇవ్వాలని, గుర్తింపు ఇవ్వాలని భార్య కోరుకుంటుందని ఎంత మంది మగవాళ్ళు గ్రహిస్తారు! నేను మగాడిని, సంపాదనాపరుడిని అన్న అహంతో విర్రవీగుతూ ఉన్నవారు ఎంతో అల్పులు అజ్ఞానులు అని తెలియజేస్తుంది ఈ నాటకం. మన జీవితాలలో పురుషాధిక్యత, పితృస్వామ్య లక్షణాలను ఎండగడుతూ, ఎంతో చైతన్యవంతమైన సంభాషణలతో చక్కిలిగింతలు పెట్టి, చివర్లో కళ్ళు చెమ్మగిల్లేలా నాటక ప్రదర్శన  ముగుస్తుంది.

రచయిత గురించి: 

కథ, నాటక రచయిత అయిన శివప్రసాద్ గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామం లో 27 ఆగస్టు 1955 న జన్మించారు. కథా రచయితగా వివిధ పత్రికలలో 70కి పైగా కథలు  ప్రచురింపబడ్డాయి. అనేక ప్రముఖ పత్రికలలో 25 కథలకు బహుమతులు లభించాయి. తాజ్ మహల్ (1987), కురిసిన మబ్బు  (1994) , ముందే మేలుకో (2011), నాగేటి చాలు (2014), కథాసంపుటాలు వెలువరించారు. 35 కథలు హిందీలోకి అనువదింపబడి 'తాజ్ మహల్ ఔర్ అన్య కహానియా' పేరిట ఒక సంపుటిగా ప్రచురించబడింది.  నాటక రచయితగా వానప్రస్థం,  ఏడుగుడిసెల పల్లె,  బహుజన హితాయ మొ.. నాటకాలు,  శ్రీ చక్రం, హింసధ్వని, ఎడారి కోయిల, మిస్సిడ్ కాల్, ధ్వంసరచన, క్షతగాత్ర గానం, ఒక మహా పతనం, పడుగు, రంకె మొ.. ముప్పై నాటికలు అనేక నాటికలు రచించారు. 25 నాటికలు,( 2018) సంపుటి వెలువడింది.

ప్రభుత్వ నంది నాటకోత్సవాలలో  ఉత్తమ ప్రదర్శనలుగా హింసధ్వని (1998), వానప్రస్థం, ధ్వంసరచన నాటికలు బంగారు నంది పొందాయి.  ఇంటింటి భాగోతం (2017) వెండి నంది, రంకె (2015),మధుపర్కాలు (2017) కాంస్య నంది బహుమతులు పొందాయి.  ఉత్తమ నాటక రచయితగా వానప్రస్తం (1999),  మిస్డ్ కాల్ (2005), ధ్వంసరచన (2007), రంకె, ఇంటింటి భాగోతం మధుపర్కాలు కు ఆరు సార్లు నంది బహుమతులు పొందారు. ఆకాశవాణి జాతీయ నాటకోత్సవాల్లో (2000)  సంవత్సరం ప్రథమ బహుమతి పొందింది.

ఇంటింటి భాగోతం:  

ఉన్నత మధ్య తరగతి కుటుంబంలో ప్రభుత్వోద్యోగం చేస్తున్న కుటుంబ పెద్ద కుటుంబరావు తనకు తాను ఒక 'యజమాని' గా స్వయం ప్రకటన చేసుకొంటాడు. పెళ్లయి 30 ఏళ్లయినా భార్యని "ఓయ్.. నిన్నే" అని అరుస్తూ, హుంకరిస్తూ పిలుస్తాడు. కాఫీ కప్పు కూడా తను వంగి కింద పెట్టడు. భార్య చేతికి అందిస్తాడు. "కాఫీలో తేడా వస్తే ముఖం మీద కొడతా" అంటూ షాకులు ఇస్తుంటాడు. కొడుకు పెళ్లయిన తర్వాత కోడలు కాపురానికి రాబోతుండగా కొడుకుతో - తన పెళ్ళాన్ని మొదటినుంచి అణిచి ఉంచానని, చనువిచ్చి నెత్తి నెక్కించుకోకూడదని,  లేకుంటే ఏకుమేకై  తయారవుతుందని పిత్రోపదేశం చేస్తాడు. పైగా "సంపాదించే కోడలికి మీ అమ్మ అడుగులకు మడుగులొత్తే  అవసరంలేదు నా విషయంలో మాత్రమే మీ అమ్మ భార్య. బయట ప్రపంచం దృష్టిలో గెజిటెడ్ ఆఫీసర్ భార్యగా స్టేటస్ మెయింటెన్ చేసుకోవాలి" అంటాడు. అంటే అతని దృష్టిలో అన్ని ఖరీదైన వస్తువులలాగే భార్య కూడా ఒక స్టేటస్ సింబల్.

భార్యకు కూడా "ఉద్యోగం చేస్తోందని నెత్తికెత్తుకోవద్దు.  కూర్చోబెట్టి పని చేయడం కాదు, నువ్వు కూర్చొని కోడలితో పని చేయించుకోవడం నేర్చుకో" అని ఉపదేశం చేశాడు. మంచి మనసు గల సరస్వతి  " మన ఇంటికొచ్చిన పిల్ల కూతురు లాంటిది"' అంటుంది.

ఆమె అదే మనసుతో కోడలు దుర్గని ఆదరిస్తుంది. దీనిలో ట్విస్ట్ ఏమిటంటే- ఆధునికభావాలు, ఆత్మాభిమానం గల కోడలు ఆ ఇంట్లో అత్తగారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకొని, ఆమెకి అండగా నిలవాలని, మామగారి పురుషాహంకారంపై దెబ్బతీయాలనుకుంటుంది. ఆ యింటి పెంపకంలో పెరిగి, అలానే  తయారైన తన భర్త రాంబాబుని మార్చటంతో తన కర్తవ్యం మొదలుపెడుతుంది. అతని పనులు అతనే చేసుకోవాలని తీర్మానం చేసి, రాంబాబు చిన్నప్పటి నుండి పెంచుకున్న భావాలని మార్చుతుంది. 

"అన్నం తిన్న కంచం నీవే తీసుకెళ్ళు. సింక్ లో వేయి. మా పనులు మేము చేసుకుంటున్నాం. మీరెందుకు చేసుకోరు" అని రాంబాబుతో స్పష్టంగా చెప్పడంతో- మళ్లీ ఈ వయసులో తను చెప్పించుకోవడం ఎందుకని కుటుంబరావు తనే కంచం తీస్తాడు.

అత్తగారితో " మీ జీవితం మూడు అలుగ్గుడ్డలు, ఆరు ముగ్గుబుట్టలు గా సాగిపోతూవచ్చింది. ఇల్లలుకుతూ పేరు మర్చిపోయిన ఈగలా మారకండి అత్తయ్యా. మీకంటూ ఒక పేరు ఉంది. మిమ్మల్ని సరస్వతి గా నేను చూడాలి'" అంటుంది.  ఎందుకంటే స్త్రీల ఈ పరిస్థితికి  కారణం కేవలం పురుషులదే తప్పు కాదు. 'మంచి ఇల్లాలు' అన్న పేరు సంపాదించుకోవడం కోసం తనను తాను విస్మరించుకునే స్త్రీలు ఎందరో ఉన్నారు.      

అత్తగారి మనసులో బయటకు వెళ్లాలని, ముఖ్యంగా బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లాలని వున్న చిన్న కోరిక కూడా మామ గారి వల్ల తీరదని తెలిసి, తనే చొరవ తీసుకుని మొదటిసారిగా విమానం ఎక్కించి పెళ్లికి పంపించి ఆమెకి ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ వత్తిడులతో అనారోగ్యం పాలైన మామగారికి అత్తగారితో పాటు తనకూ చేతనైనంత సేవ చేస్తుంది. భార్య విలువ ఆయన గుర్తించేలా చేస్తుంది.

చివరికి కుటుంబరావులో మార్పు వచ్చి " ప్రతి పిలుపులోను ఒక సభ్యత, సంస్కారం, గౌరవం ఉంటుంది అని తెలుసుకున్నాక నిన్ను 'సరస్వతి' అని తప్ప మరో రకంగా పిలువలేను. ప్రతి మగాడు భార్యను 'బిడ్డని కని పెంచే యంత్రం'గానే చూస్తాడు. భర్త కష్టాల్లో ఉన్నప్పుడు తన బిడ్డల్లో ఒక బిడ్డగా చూసుకుంటుంది అన్న జ్ఞానం ఎంతమంది మగాళ్ళ కుంటుంది. నా కష్టాల్లో నన్ను ఒక బిడ్డగా ప్రేమించి సేవలందించిన నీలో నా తల్లిని చూసుకుంటున్నాను. నీ సేవలకు చేతులు పట్టుకొని కృతజ్ఞతలు కాదు చెప్పుకోవాల్సింది, చేతులు జోడించి నమస్కారం అనిపిస్తుంది" అని మనస్ఫూర్తిగా అంటాడు.

స్త్రీ వాద భావచిత్రణ :

నాటకంలో మధ్యమధ్య పాత్రల చేత హాస్య సంభాషణలు పలికించినా, ఇది హాస్య నాటకం కాదు. స్త్రీ వాదాన్ని స్పష్టంగా  ప్రకటించే ప్రబోధాత్మకమైనదని చెప్పాలి.

స్త్రీల తరుపున వకాల్తా పుచ్చుకొని, స్త్రీ వ్యక్తిత్వాన్ని ప్రకటించేలా మంచి సంభాషణలు రాసి, తన ప్రయత్నంలో కృతకృత్యులయ్యారు వల్లూరు శివప్రసాద్.

ఉపయుక్త గ్రంథ సూచి:

1. ఇంటింటి భాగోతం - శ్రీ వల్లూరు శివప్రసాద్

2. తెలుగు నాటకం - సామాజిక చైతన్యం - ఆచార్య యన్. గంగప్ప

3. స్త్రీవాదం : పురుష రచయితలు - డా. సిహెచ్. సుశీల

4. తెలుగు నాటకరంగం : నూతన ధోరణులు - డా. కందిమళ్ళ సాంబశివరావు