ఉపోద్ఘాతం:

వెయ్యేళ్ల  తెలుగు కవిత్వ చరిత్రలో ఆధునిక కవిత్వానికి నూట యిరవయ్యేళ్ళ చరిత్ర ఉంది. దాదాపు కవిత్వం వెనకే విమర్శ కూడా వస్తూనే ఉంది. కానీ నేడు కవిత్వాన్ని నిర్వచించినంత  ఎక్కువగా విమర్శ రాలేదు. బహుశా ఆధునిక కవిత్వానికి లక్షణాలను నిర్దేశిస్తూ సిద్ధాంత గ్రంథాలు లేకపోవడమే కారణమేమో.  రూపం శిల్పం గురించిన నిర్దేశిక మార్గాలను సూచించిక పోవడం కావచ్చు.

కొంతలో కొంత ఆ కొరతను తీర్చటానికి బిక్కి కృష్ణ గారు ఆంధ్రప్రభలో వ్యాసాలుగా రాసి తర్వాత 2018లో ’కవిత్వం డిక్షన్’ అన్న గ్రంథాన్ని తీసుకువచ్చారు. కవిత్వం రాసే వారికి ఇది ఒక మార్గదర్శిగా గైడ్ గా ఉపయోగపడుతుంది చెప్పవచ్చు. ఆయన స్వయంగా కవి, విమర్శకుడు కావడం వల్ల తనలోని రెండు కోణాలను సవివరంగా వ్యక్తీకరించారు. ఆంగ్ల సాహిత్యం అధ్యయనం బాగా ఉండటం వల్ల ఒక్క తెలుగులోనే కాక అన్ని భాషలలోనూ కవిత్వం యొక్క పరమార్థం ఏమిటి అని విశ్లేషించారు. అలిగిరి, మెటాఫర్, ఇమేజనరీ, సింబాలిజం వంటి పాశ్చాత్య విధానాల ఆవశ్యకత పట్ల కనీస అవగాహన లేని యువకులకు మార్గాన్ని నిర్దేశించి చూపారు. నిజానికి ఇది ఒక యజ్ఞం. దాన్ని నిర్విఘ్నంగా నిర్వహించి ఫలాన్ని కవి లోకానికి తాంబూలం సమర్పించారు.

ఆయనే అన్నట్లు -

"భావ సమాధిలో నిరంతరం

నిమగ్నమైన  కవి మాత్రమే

అక్షరాల రేకులపై ఆత్మ జలం

దృశ్యాలకు రంగులద్ది

కవిత్వ చిత్రపటాలను

గాల్లోకి ఎగిరే వేయగలడు"...

ఇలాంటి భావ సమాధిలోంచి భావాలను వెలికి తెచ్చారు కాబట్టి శ్రీశ్రీ తిలక్ శేషేంద్రశర్మ కుందుర్తి వంటి వారి కవిత్వం ఎప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అభివ్యక్తి నవ్యతకు k i i c formula  ఉండాలంటారు బిక్కి కృష్ణ -

1. సూక్ష్మ పరిశీలన (Keen observation)

2. అనుకరణ (Imitation)

3. ఊహ కల్పన (Imagination)

4. సృజన (Creativity)

మరి ఎంత మంది వీటిని అనుసరిస్తున్నారు? అనుసరిస్తే ఇన్నిన్ని పేలవమైన కవితా సంకలనాలు వస్తాయా? వీరు సూక్ష్మ పరిశీలన సూత్రాన్ని పాటించరు. ఏ శిల్పాన్ని అనుసరించరు. కొత్త ఇమేజరీ వైపు దృష్టిని మళ్ళించరు. అలా తమ కవితలను రాయటానికి ప్రయత్నించరు .ఇది దురదృష్టకరం.

కవిత్వం ఎలా ఉండాలి?

"కవిత్వం జీవిత పరమార్థాన్ని ఒక తాత్విక భూమిక తో అంతర్ముఖుడై అన్వేషణ చేసి సామాజిక దృక్పథంతో రాసిన అప్పుడే అది నిజమైన కవిత్వం అవుతుంది".

అలాంటి లక్షణాలు లేని అ కవితా రీతుల్ని  తీవ్రంగా ఖండించాల్సిందే. పేరున్న కవులు ఏది రాసిన అద్భుతం అనుకోవటం అవసరం లేదు. చిన్న కవి, కొత్తగా రాస్తున్న కవి రాసిన కవితలో ఆలోచనాత్మకమైన అనుభూతి ఉంటే దాన్ని మెచ్చుకోవడానికి ఏమాత్రం  వెనుకాడకూడదు. కవిత్వంలో భావం ప్రధానం . అభివ్యక్తి ఇంకా ప్రధానం . తెలుగు కవిత్వంలో వైవిధ్యం ఉన్నప్పటికీ ఇతర భాషల్లో వచ్చిన వైవిధ్యభరితమైన వస్తువుని అభివ్యక్తి గాని తీవ్రమైన అనుభూతి ప్రకటన కానీ తెలుగులో రాకపోవటం విచారించదగ్గ విషయం . అయితే దానికి కారణాలు కూడా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక వచన కవిత నిర్మాణ పద్ధతిని ఎక్కడ మన కవులు ఏది మిస్ అవుతున్నారో చేస్తున్నారో క్షుణ్ణంగా చెప్పాలి విమర్శకుడు. కలం పట్టిన ప్రతివాడు పుంఖానుపుంఖాలుగా - తాను కవిత్వం అనుకుంటూ - దేశం మీదికి ఒక కావ్యాన్ని వదులుతూ, వాక్యాన్ని నాలుగుగా విరిచి పాదాల పేర్చి తను కవి కులం లో చేరి పోతాను అని భ్రమ పడుతుంటే సాహిత్య ప్రేమికులు  వెలువరిస్తున్న ఆవేదన సరైనది అనిపిస్తుంది.

"గుండె గొంతుకలోన

కొట్లాడుతాది

కూకుండ నీదురా

కూసింతసేపు"...

అంతగా మనసులో భావాలు వేదనాత్మకంగా, నైరూప్యంగా, అల్లకల్లోలం అవుతుంటే.... వాటిని కవితారూపంలో ప్రదర్శించినప్పుడే ధన్యత చెందుతుంది.

ఆది కవి ఆవేదన నుంచి, శోకం నుండి అప్రయత్నంగా వెలువడిన "మానిషాద..." కదా శ్రీమద్రామాయణంగా లోకానికి అందింది. ఎదుటి వ్యక్తి కష్టానికి సమాజంలోని అనేక సమస్యలకి స్పందించకుండా "నేను నా ఊహలు" అంటే.. అదేకవిత్వం... అంటే అంగీకరించాల్సిన అవసరం లేదు. "గుండెల్లో నుంచి రావాలి", "సమాజం పట్ల బాధ్యత ఉండాలి" హృదయం లేని కవిత్వానికి ప్రయోజనం ఏమిటి? నవ్య ప్రయోగాలు లేకుండా - అవి పదాలు కావచ్చు, భావాలు కావచ్చు చర్విత చర్వణం,  చెప్పిందే చెప్పి పాఠకుల్ని వెర్రివారిగా భావించి, తన కవిత్వానికి జ్ఞానపీఠ అవార్డు రాలేదే అని వాపోవడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మంచి కవిత్వాన్ని చదివి ఆనందించాలని అన్వేషించే పాఠకులు ఉంటాడని, మంచి కవిత్వాన్ని చదివి ముగ్ధుడై మురిసిపోయే పాఠకుడు ఉంటాడని వారు పట్టించుకోరు. తన ధోరణిలో సమాజానికి దూరంగా ఎవరో మహాకవి 'దిగిరాను దిగిరాను దివినుండి నేను' అన్నాడు కదాని - దాని అర్థం తెలుసుకోకుండా, ఎవరికీ అర్థం కాని రాతలు రాసి అదే కవిత్వమని చలామణి అయ్యే కవులు పెరిగిపోతున్నారు.

అవి సుమపరిమళాలు కావచ్చు, అగ్నికణాలు కావచ్చు, కానీ ఒకసారి కవి తన కవిత్వాన్ని వెలువ రిస్తే ...అది ప్రజల సొంతమవు తుంది. వారి గుండెల్ని తాకుతుంది. అదే నిక్కమైన కవిత్వమవుతుంది. అసలు ఏదైనా రాయటానికి ముందు బాగా చదవాలి, విస్తృతంగా చదవాలి.

ముగింపు:

ప్రాచీన సాహిత్యాన్ని చదవకపోవడం ఒక పెద్ద లోపం. కనీసం సమకాలీన సాహిత్యాన్ని చదవక పోవడం క్షమించరానిది. చదివి ఆకళింపు చేసుకుంటే ఆలూరి బైరాగి అన్నట్టు "ప్రతి అక్షరం ఒక భటుడు, ప్రతి పదం ఒక శగటు, ప్రతి ఊహ ఒక వ్యూహం" గా మంచి కవిత్వం రాయవచ్చు. ప్రతి ఊహను ఒక జోహన్ గా కవిత నిర్మాణం చేపట్టడానికి యువకులు కవితా నిర్మాణంలో తనదైన శైలిని సాధించడానికి ఎంతో శ్రమ నైపుణ్యం సాధించాలి. పుట్టుకతో ఎవరు కవి కారు తన రచనలు ఆర్ద్రత సాంద్రత గుండెతడి తీవ్ర భావోద్వేగం అభివ్యక్తి తీవ్రత ఉన్నప్పుడు మాత్రమే అతను మంచి కవి అవుతాడు అది మంచి కవిత అవుతుంది. కాలగమనంలో భావనలు, 'వస్తువులు' ఎలా మారుతున్నాయో, భావుకత ఎలా కొత్త కొత్త ప్రతీకలని సంతరించుకుంటూ ఉంటుందో తెలుసుకోవాలి. అప్పుడే పాఠకుని హృదయానికి తాకే మంచి కవిత్వం వస్తుంది.

 ఉపయుక్త గ్రంథాలు:

1. లో చూపు - ఆచార్య అనుమాండ్ల భూమయ్య

2. కవిత్వం - డిక్షన్ - బిక్కి కృష్ణ

3. మానసోల్లాసము (సాహిత్య వ్యాస సంపుటి) డాక్టర్ కడియాల రామమోహనరాయ్

4. సాహిత్యం - సౌందర్యం - డా.బి. సూర్య సాగర్