ఉపోద్గాతం:

ఆంధ్ర ప్రయోగ రత్నాకరానికి ప్రస్తుతం మూడు ప్రతులు దొరుకుతున్నాయి.  రెండు ప్రతులు తంజావూరు, సరస్వతి మహాలు గ్రంథాలయంలోనున్న తాళపత్ర గ్రంథాలు. ఒకటి తెలుగు లిపిలో పద్యరూపంలో ఉన్న 50 ఆకులు గల ఆంధ్ర ప్రయోగ రత్నాకరం, సంఖ్య D.696/B. 10009 . ఇంకొకటి 55 ఆకులతో గూడిన తాళపత్ర గ్రంథం. సంఖ్య D.695/B.10008, మరొకటి తిరుపతి ప్రాచ్య పుస్తక భాండాగారంలో ఉన్న కాగితపు ప్రతి, సంఖ్య  7484 .

ఇప్పటి వరకు పై మూడు ప్రతులను పరిష్కరించినట్లుగ తెలియలేదు. ప్రస్తుత వ్యాసం తంజావూరు సరస్వతి మహాలు గ్రంథాలయంలో ఉన్న ఆంధ్ర ప్రయోగ రత్నాకరం తాళపత్ర  గ్రంథం.  సంఖ్య D.696/B.10009.  ఈ పరిష్కరణ పత్రాన్ని - కవికాలాదులు ఈ క్రింది క్రమాన అమర్చుకోబడింది.

1. గ్రంథ రచనా ఉద్దేశం

2. గ్రంథ నిర్మాణం

3. గ్రంథ రచనా విధానం

4. గ్రంథ పరిష్కరణాంశాలు

1. కవి కాలాదులు :

ఆంధ్ర ప్రయోగ రత్నాకరాన్ని గణపవరపు వెంకటకవి తాను రచించినట్లు గ్రంథంలో ఎక్కడా కూడా చెప్పుకోలేదు.  ప్రబంధ రాజ వెంకటేశ్వర విలాసంలోని అవతారికా పద్యం వలనను, ఈ గ్రంథమందు అచ్చటచ్చట వెంకటకవి తన ఇతర కృతులలోని పద్యములను ఉదాహరించుట వలనను ఈయనే యీ గ్రంథమునకు కర్తయని నిర్ణయింపవచ్చు (గిరిప్రకాశ్.టి.యస్ : పుట - 97)

ప్రయోగ రత్నాకరం క్రీ.శ. 17వ శతాబ్దం. ఇది ఆముద్రతము. తంజావూరు సరస్వతి మహాలులో ఉంది.  దీని కర్త గణపవరపు   వెంకటకవి. ఇది ప్రాసాదిచ్ఛందో భేదాలకు, వ్యాకరణ రూపాలకు కవిప్రయోగాల్ని చూపిన గ్రంథం (వెంకటేశ్వర్లు బూదాటి : పుట - 100)

గణపవరపు వెంకటకవి ఆంధ్ర ప్రయోగ రత్నాకరము లక్షణ గ్రంథములలో ఒక ప్రయోగమే. ఇది యతి ప్రాసాదిచ్ఛందో భేదములకు, వ్యాకరణ రూపాలకు, కవి ప్రయోగములను ఏర్చి కూర్చి, చేర్చి చూపిన లక్షణ గ్రంథము.  ఇది ఆముద్రతము.  దీని ప్రతులు తంజావూరు సరస్వతి మహాలునందు కలదు. (No.D 695/B.10008)  ఈ గ్రంథారంభ పద్యం దీని ప్రశస్తిని ప్రకటిస్తుంది(జి.లలిత : పుట: 133). పైన పేర్కొన్న విషయాలనుబట్టి ఆంధ్ర ప్రయోగ రత్నాకరము గణపవరపు వెంకట కవి కృతమని చెప్పవచ్చు.  అంతేకాకుండా పూర్వ లాక్షణికుల యతిప్రాసా లక్షణాల్ని క్రోడీకరించి చెప్పుటవలన ఇది ఒక సంకలన గ్రంథంగా భావించవచ్చు.

2. రచనా ఉద్దేశము :

గ్రంథకర్త తనకు ముందున్న ఛందస్సు గ్రంథాలన్నిటిని కూలంకషంగ పరిశీలించి వాటిలోని జాతి రత్నాలవంటి ప్రాస యతుల లక్షణాలను తెలిపే పద్యాలను ఏర్చి, కూర్చి వాటికి ఉదాహరణలు ఇచ్చి, ముందరి గ్రంథాలలో చెప్పని కొన్ని యతి ప్రాస లక్షణాలను చేర్చి మొత్తం మీద దీనినొక సంకలన గ్రంథంగా కూర్చాలన్నదే ఈయన ఉద్దేశంగా కనబడుతుంది.

ఈ గ్రంథ ప్రారంభంలో చెప్పిన ఈ పద్యమే దీనికి తార్కాణం.

శ్రీ మదాదిమ కవి శేఖరుల్ చెప్పిన

                 మునుపటి లక్షణమ్ములును ఛంద

ములు చూచి యందుగల వన్నియు గూర్చి

                 బాగుగా నాంధ్ర ప్రయోగ రత్నాకర

మను కృతి సేసి దీనను మునుపటి

                 కావ్యాళి సుప్రయోగము లెన్ని గలవన్ని

యరసి ప్రామాణిక మౌటకతన

                 సత్కవుల కెల్ల నుపకార సరణిగాగ

వరుస వ్రాసితిని యతి వాంఛతెలియు

నాతడె మహాకవి యనంగ నవని (బరగు

పంకజాతాప్త నీకాశ వెంకటేశ (1A)

3. గ్రంథ నిర్మాణం:

          ఆంధ్ర ప్రయోగ రత్నాకర తాళపత్ర గ్రంథ నిర్మాణాన్ని  గనుక పరిశీలించినట్లయితే అందులో తక్కిన లక్షణ గ్రంథాలలో చూపినట్లు ఆశ్వాసాలుగాని, పరిచ్ఛేదాలుగాని లేవు. పద్యాల మధ్య అక్కడొకటి ఇక్కడొకటి అన్నట్లుగ వచనాలు కనబడుతున్నాయి. చెప్పవస్తున్న విషయాలను శీర్షికల ద్వార ముందు చెప్పి, వాటిక్రింద వివరాలు చెప్పబడ్డాయి. శీర్షికలుగా చెప్పిన విషయాలను బట్టి గ్రంథకర్త అనుసరించిన నిర్మాణాన్ని ఇలా చెప్పకోవచ్చు –

గ్రంథ ఉద్దేశం

ప్రాస యతి భేద రకాలు

ప్రాస యతి రకాలకు పూర్వలాక్షణికుల లక్షణాలు

లక్షణాలకు తగిన ఉదాహరణ పద్యాలు

ఉపసర్గలు - వాటికి ఉదాహరణలు

వర్గాక్షరాలు - వాటికి ఉదాహరణలు

కొన్ని పదాలు - వాటికి ఉదాహరణ

చివరిగ గ్రంథకర్త అభిప్రాయం

4. గ్రంథ రచనా విధానం :

            గ్రంథ కర్త గ్రంథారంభంలో పూర్వ లాక్షణికుల ప్రాస యతి రకాలను తెలిపి, తర్వాత తాను సర్వ లక్షణ శిరోమణిలో మొదటి ఉల్లాసములో చెప్పిన ప్రాస మరియు యతి రకాలను  "యింకను నే జెప్పిన సర్వ లక్షణ శిరోమణి మొదటి యుల్లాసములోని ప్రాసములకు యతులకున్ను ఉద్దేశము" అని ఒక శీర్షికనిచ్చి అందులో సీసమాలిక పద్య రూపంలో ౫౨ పాదాలలో ప్రాస యతుల రకాలని తెలిపి తర్వాతి నాలుగు పాదాలలో -

"------ పూర్వ ప్రకృతులలోన

వెలయు లక్షణల లక్ష్యములు వీనికెల్లను

సొరిదిగ వ్రాసి నా చూడు డింక "

అని తాను చెప్పిన ప్రాస యతుల రకాలను ఇతర లాక్షిణికులు చెప్పిన లక్షణాలను పేర్కొని, అటు పిమ్మట తాను వెంకటేశ్వర విజయ విలాసములోని మొదటి ఆశ్వాసములో చెప్పిన ప్రాస యతులను వివరించారు.

          ఆంధ్ర ప్రయోగ రత్నాకరమును గురించి గణపవరపు వెంకటకవి తన ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసం అవతారికలో 51వ పద్యంలో మొదటి పాదంలో -"ప్రాసములిర్వదేబది యతుల్లక్షణంబున సీస మాలి(బూన్వ వశమె" అను నొక పాఠాంతరము కానవచ్చుచున్నది. దీనిని బట్టి గణపవరపు వెంకటకవి ఆంధ్ర ప్రయోగ రత్నాకరంలో డెబ్బది యతి ప్రాసలను వివరించినట్లు చెప్పెను (గిరిప్రకాశ్.టి.యస్. పుట : 97)

గణపవరపు వెంకటకవి తన ఇతర కృతుల్లో చెప్పిన యతి ప్రాసల్ని ఆంధ్ర ప్రయోగ రత్నాకరంలో చూపినవి వాటిని క్రింది పట్టికలో చూపబడ్డాయి.

1. ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసములోనివిగ పేర్కొన్న ప్రాస, యతులు :

ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము

ప్రాసలు

యతులు

చతుః ప్రాససుకరప్రాసదుష్కర ప్రాసఅంత్య ప్రాసబిందు ప్రాసలాటాను ప్రాసఛేకాను ప్రాస

ఘఙ్ యతిసంయుక్త యతివికల్ప యతిఅభేద యతిరీ/రి యతిప్రాకృతాదేశ సరస యతి

 

2. రసమంజరీ :

అర్ధబిందు ప్రాస

3. యవక శతకం

వృత్యను ప్రాస 

గ్రంథంలో ప్రయోగించిన ఇతర లాక్షిణికులు చెప్పిన ప్రాసలు యతులు :

ప్రాసలు : 24

            అంత్యప్రాస, ద్వంద్వప్రాస, త్రిప్రాస, చతుః ప్రాస, ప్రాది ప్రాస, బిందుప్రాస, అర్ధబిందు ప్రాస, అభేదప్రాస, సంయుక్తప్రాస, వర్గ్యప్రాస, త్రివర్ణప్రాస, సంధిగతప్రాస, వికల్పప్రాస, ప్రాసమైత్రి, ఉభయప్రాస, సమాన లఘుప్రాస, సమపదప్రాస, వృత్యనుప్రాస, లాటానుప్రాస, ఛేకానుప్రాస, శకార ప్రాస, సుకరప్రాస, దుష్కరప్రాస, ఋకారప్రాస. వీటిలో ముందరి లాక్షణికులు చెప్పని చివరి మూడు ప్రాసలు గ్రంథకర్త చెప్పినవి.

యతులు - 42

స్వరయతి, కాకుస్వరయతి, ఫ్లుతయతి, వృద్ధియతి, నఙ్సమాస యతి, ప్ర్రాది స్వర యతులు, భిన్నయతులు, నిత్య సమాస యతులు, ఉద్దేశ్య యతులు, మకార యతులు, వికల్పనామ యతులు, బిందుయతులు, నిత్య యతులు, నసమాస యతులు, ఆదేశ యతులు, ప్రభునామ అఖండ స్వర యతులు, ఘఙ్ యతులు, శకంధు యతులు, సంయోగ యతులు, విభాగపు స్వర యతులు, అద్వికల్ప ప్రాస యతులు, వృద్ధి యతులు, సంయుక్త యతులు, వికల్ప యతులు, అవికల్ప యతులు, ప్రాస యతులు, చక్కటి యతులు, స్వరల్కార యతి, గుణితాఖ్య యతి, సరస యతి, వర్గ్యప్రాస యతి, సమలఘు ప్రాస యతి, అభేద యతి, అభేదప్రాస యతి, యొక్కటి యతి, రీయతి, ఋయతి, ప్రాకృతాదేశ సరస యతి, పోలిక వడి, సంయుక్తపు ప్రాస యతి, త్రిప్రాస యతి, అఖండ యతి.

ఉపసర్గలు : 22

క|| ప్రపరాపస మను సుప్ర

త్యపి నిర్థురధి న్యు పాభ్యుదాజ్ వృత్య

వ పరర్యు పగ్గ వింశతి కీవ

ళ్ళు పరి స్వర యుక్తియైనను భయము జెల్లున్ (12A)

గీ||  ప్రాదులిర్వదియును నాదిపైనియున్న

యతులు రెండును చెల్లునయ్యచ్చుహల్లు

నుల్లసిత మదనాంబురుహుండనంగ

పూర్వదేవాహితు(డు శుభోదయుcడన్ (12A)

గ్రంథ కర్త ఆంధ్ర ప్రయోగ రత్నాకరములో ప్రాతి స్వర యతులకు 22 ఉపసర్గలకు ఉదాహరణ పద్యాలను  చూపినట్లుగ కనబడుతుంది. కాని పై పద్యంలో ప్రాదులు ఇరువది అని చెప్పడం జరిగింది.  వాటి వివరాలు -

ఆంధ్ర ప్రయోగ రత్నాకరము

సంఖ్య

ఉపసర్గలు

సాహిత్య ఉదాహరణలు

1

ప్ర

నాచనసోముని హరి వంశం, పాండురంగ మహాత్మ్యం

2

పర

భైరవుని శ్రీరంగ మహాత్మ్యం, ద్రోణపర్వం

3

అప

అనుశాసనికం,  ఆదిపర్వం

4

సం

అనుశాసనికం, ఆదిపర్వం

5

అను

ఆదిపర్వం, కవి మాధవుని బ్రహ్మాండ పురాణం

6

సు

అరణ్యపర్వం

7

ప్రతి

భీమన నరసంహ పురాణం, అరణ్య పర్వం

8

అపి

పెద్దిరాజు హరికథాసారం, సోము హరవిలాసం

9

నిన్

రాజశేఖర చరిత్ర

10

నిర్

శ్రీనాథుని నందనందన చరిత్ర

11

దుర్

భైరవుని శ్రీరంగ మహాత్మ్యం, భీమన

12

అధి

నీతిసారం

13

నీ

హుళక్కి భాస్కరుని సునందనోపాఖ్యానం

14

ని

హుళక్కి భాస్కరుని సునందనోపాఖ్యానం

15

ఉప

జైమిని భారతం, దశకుమార చరిత్ర, అల్లసాని పెద్దిరాజు హరికథాసారం

16

అభి

భాస్కరుని నందనోపాఖ్యానం, విజయ విలాసం

17

ఉత్

మను చరిత్ర, పెన్మయ సింగధీమణి శతకం, అరణ్యపర్వం, సోము విలాసం

18

అజ్

పెద్దిరాజు హరికథాసారం, రాఘవ పాండవీయం, నాచనసోము హరవిలాసం

19

వి

మనుచరిత్ర, సభాపర్వం

20

అతి

బ్రహ్మాండ పురాణం, భారతం

21

అవ

భీమన నరసింహపురాణం, రంగనాథుని మిత్రవిందా పరిణయం

22

పరి

ప్రౌఢకవి మల్లన రుగ్మాంగద చరిత్ర

వర్గాక్షరాలు :

ఈ గ్రంథంలో ఉపసర్గల తర్వాత వర్గాక్షరాలకు కూడ ప్రత్యేకంగ సాహిత్య గ్రంథాల నుండి ఉదాహరణలు చూపబడ్డాయి.

కొన్ని ఉదాహరణలు -

1. యింకా బిందు ప్రాసానికే భీమన నరసింహ పురాణ మారో ఆశ్వాసం :- కవర్గమునకు

2. యిందుకే తవర్గమునకు నంది సింగన వామన పురాణం

3. యీ ప్రాసానికే సరస్వతీ విలాస లక్ష్యం టవర్గమునకు

పదాలకు ఉదాహరణలు :

ఈ గ్రంథాంతంలో కొన్ని పదాలకు మాత్రం ఉదాహరణలు చూపబడ్డాయి. అవి :-

నిత్యసమాస యతికి ఉదాహరణగ -

1. యిందుకే ‘రత్నాకర’ శబ్దం హల్లుకు

2. యిందుకే ‘రసాయన’ శబ్దం హల్లుకు

3. నిత్య సమాస యతికే హల్లుకు నంది సింగయ వామన పురాణం :- ‘యేకాంత’ శబ్దం

‘4. స్త్నాన’ శబ్దానకు సూత్రం (వర్ణక్రమ నిర్ణయమ్ము ప్రాతిశాఖ్య సూత్రం

గ్రంథకర్త ఆంధ్ర ప్రయోగ రత్నాకరమునందు ప్రయోగించిన పూర్వ లాక్షణికుల ఛందసు గ్రంథాలు, ప్రాస యతుల పేర్లు, ఉదాహరణలుగ చూపిన సాహిత్య, శాస్త్ర గ్రంథాలు, వాటి వివరాల్ని క్రింది పట్టికల్లో చూపబడింది. 

ఛందసు గ్రంథాలు : 19

       పిన్నకోట పెద్దిరాజలంకారము, భీమన ఛందము, అధర్వణాచార్య ఛందము, అనంతుని ఛందము, కవి రాక్షసుని ఛందము, జయదేవ ఛందము, ఆంధ్ర శ్రీధర ఛందము, నీలకంఠ ఛందము, కవిజన సంజీవని, సర్వ లక్షణ శీరోమణి, లక్షణసారం, ఉత్తమగండ ఛందము, చింతామణి, ఆంధ్ర గోకర్ణ ఛందము, కవి కంఠాభరణం, భాస్కరదేవ ఛందము, సర్వదేవ ఛందము, భైరవ ఛందము, లక్షణ దీపిక.

సాహిత్య గ్రంథాలు :

            సాహిత్య గ్రంథాల్లో రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాలు, కావ్యాలు, ప్రాతిశాఖ్య, శతకాలు వీటినుండి పద్యాల్ని ఉదాహరణగ చూపబడ్డాయి. వాటి వివరణ -

రామాయణాలు : 7

యథావాల్మీకి రామాయణం, భాస్కర రామాయణం, రంగనాథ ద్విపద రామాయణం, శతముఖ రామాయణం, సంక్షేప రామాయణం, ఉత్తర రామాయణం, రామాయణంలో యుద్ధకాండం.  

భారతాలు : 4

జైమిని భారతం, అధర్వణాచార్యుల భారతం, మాయ(ర)న భారతం, భారతంలో ఆదిపర్వం, ఉద్యోగపర్వం, అరణ్యపర్వం, శాంతిపర్వం, ద్రోణపర్వం, విరాటపర్వం, కర్ణపర్వం, భీష్మపర్వం.

పురాణాలు : 6

నరసింహ పురాణం, కూర్మ పురాణం, వామన పురాణం, నృసింహ పురాణం, బ్రహ్మాండ పురాణం, పద్మ పురాణం

కావ్యాలు :

చరిత్ర అన్న పేరుతో ఉన్న కావ్యాలు : 15

రాజశేఖర చరిత్ర, రుగ్మాంగద చరిత్ర, సారంగధర చరిత్ర, వసుచరిత్ర, పరమ భాగవత చరిత్ర, తంతన చరిత్ర, అనంతయ శంతన చరిత్ర, మనుచరిత్ర, యయాతి చరిత్ర, బహుళాశ్వ చరిత్ర, చంద్రభాను చరిత్ర, శశి బిందు చరిత్ర, ఆళ్వారు చరిత్ర, అనిరుద్ధ చరిత్ర, కేయూర బాహు చరిత్ర

కల్యాణం/పరిణయం అన్న పేరుతో ఉన్న కావ్యాలు : 6

          మిత్రబిందాపరిణయం, లక్ష్మీ పరిణయం, సభదాల పరిణయం, సుభద్రా పరిణయం, గిరిజా కల్యాణం, అష్టమహిషి కల్యాణం

విలాసం అన్న పేరుతో ఉన్న కావ్యాలు : 7

          కళావిలాసం, సరస్వతీ విలాసం, లక్ష్మీరాక్షస విలాసం, హర విలాసం, వెంకటేశ్వర విలాసం, విష్ణు విలాసం, వసంత విలాసం.

అభ్యుదయం అన్న పేరుతో ఉన్న కావ్యాలు : 3

          వాసుదేవాభ్యుదయం, రామాభ్యుదయం, వాసవాభ్యుదయం.

విజయం అన్న పేరుతో ఉన్న కావ్యాలు : 3

          బలరామ విజయం, భట్టేంద్ర విజయం, ఇంద్ర విజయం.

శతకాలు : 9

నవకవుల శతకం, యుగపతి శతకం, రఘువీర శతకం, సుమతి నీతి శతకం, కాళహస్తి శతకం, వజ్రపంజర శతకం, పెమ్మయ సింగధీమణి శతకం, వెంకటేశ్వర శతకం, బద్ధ నీతి.

ఇతరములు : 29

          మదనసేనం, వారానం, హరివంశం, హరికథాసారం, ఆముక్తమాల్యద, రాఘవపాండవీయం, హరిశ్చంద్రకథ, జ్ఙాన వాసిష్ఠం, ప్రబోధచంద్రోదయం, ఆశ్రమవాసం, శాకుంతలం, త్రికవుల షష్ఠ్యం, కళాపూర్ణోదయం, పారిజాతం, పండితాభ్యుదయం, నైషధం, ఉత్తర హరివంశం, శ్రీరంగ మహాత్మ్యం, శ్రీశైల మహాత్మ్యం, భేతాళ పంచవింశతి, సాహిత్య చింతామణి, పంచతంత్రులు, కాదంబరి, భుజంగ ప్రయాతం, భాస్కరుని నందనోపాఖ్యానం, చాటువు, ప్రాతిశాఖ్య, అశ్వమేధము

5. గ్రంథ పరిష్కరణ :

‘ఆంధ్ర ప్రయోగ రత్నాకరము’ తాళపత్ర గ్రంథంలో ఈ క్రింది అంశాలు పరిష్కరించబడ్డాయి.  వాటిని ఉదాహరణ పూరకంగా వివరించడం జరిగాయి. గ్రంథ పరిష్కరణ స్థాయిలు :-

వర్ణదోషాలు, వర్ణ లోపాలు, వర్ణాధికం, వర్ణరూప మార్పు, వర్ణమార్పిడి, పూర్ణబిందు రూపాలు, లోపల చుక్క, ద్విరూప పద ప్రయోగాలు, వర్ణ ప్రయోగం, సంధి ప్రయోగం, విభక్తి ప్రయోగం

          పైన పేర్కొన్న పదనొకండు స్థాయిల్లో ఈ లక్షణ గ్రంథాన్ని పరిష్కరించడం జరిగింది.

1. వర్ణ దోషాలు:

‘ఆంధ్ర ప్రయోగ రత్నాకరము’ తాళపత్ర గ్రంథంలో చాలా చోట్ల అక్షర దోషాలు కనబడుతున్నాయి. వాటిలో కొన్నిటిని ఉదాహరణలుగా చూపి వాటికి సరియైన రూపాల్ని కుండలీకరణంలో చూపబడ్డాయి.

బ్దానకు (శబ్దానికి)

సుద్రా (సుభద్రా)

ఆంధ్రశీధర (ఆంధ్రశ్రీధర)

సంయ (సంశయ)

ప్లుతం (ఫ్లుతం)

స్త్రీనాదుడు (శ్రీనాథుడు)

నాము (సోము)

పొల్లనకారము (పొల్లునకారము)

రే (రేఫ)

ష్లసకారం (ఊష్మసకారం)

రోమాయాజి (సోమయాజి)

2. వర్ణలోపం :

గ్రంథంలో అక్కడక్కడ పదాల్లో అక్షర లోపాలు ఉన్నాయి. ఉదాహరణలు :-

రసయతి (రసయతి)

పానికే (ప్రాసానికే)

అచ్చెన హల్లైన (అచ్చైన హల్లైన)

భీమ (భీమ)

తాళ్ళపాచిన్నన్న (తాళ్ళపాచిన్నన్న

పారిజాతం (పారిజాత మహాత్మ్యం)

3. వర్ణాధికం :

చాలా కొద్ది చోట్ల పదాల మధ్య వర్ణాలు అధికంగా వచ్చిన రూపాలు కనబడుతున్నాయి. ఉదాహరణ -

చింతార్వమణి (చింతామణి)

బ్రంహ్మాండ పురాణం (బ్రహ్మాండ పురాణం)

నృసింహ పురాణం (నృసింహ పురాణం)

ర్గ్యయతి (వర్గయతి)

పై ఉదాహరణల్లో మొదటి పదంలో ‘ర్వ’ అనే అక్షరం, రెండవ పదంలో ‘పూర్ణబిందువు (౦)’ మూడవ పదంలో ‘ర’ అనే అక్షరం, నాలుగవ పదంలో ‘య’ అదనంగా చెప్పబడ్డాయి.

4. వర్ణరూప మార్పు :

శ్రుతి (శృతి)

వర్ణ రూపంలో ఒకచో మార్పు కనబడుతున్నది. అది ‘శృతి’ అని రాయడానికి బదులుగా గ్రంథ కర్త ‘శ్రుతి’ అని అక్షర రూపాన్ని మార్చి రాసారు.

5. వర్ణమార్పిడి :

గ్రంథంలో చాలా చోట్ల పదాల్లో అక్షరాల్ని మార్చి ప్రయోగించినట్లు తెలుస్తున్నది.

ఉత్తమగుండ (ఉత్తమగండ)

యెఱ్ఱాపేగడ/యెఱ్ఱాపెగడ (ఎఱ్ఱా ప్రగడ)

భేతాపంచవింశతి (భేతాళ పంచవింశతి)

మాయగారి మల్లన (మాదయగారిమల్లన)

6. పూర్ణబిందు రూపాలు :

కొన్నిచోట్ల పదమధ్యలో పూర్ణానుస్వారం  ప్రయోగించబడింది.

ఉదాహరణలు -

నాంగ (నా(గ)

తెలుంగు (తెలుగు)

నూంది (నూ(ది)

7. లోపలి చుక్క :

అక్షరం లోపల చుక్క పెట్ట వలసిన చోట్ల కొన్ని చోట్ల చుక్కను, చాలాచోట్ల చుక్క లేకుండాను ఉన్న రూపాలు అధికంగ ఈ గ్రంథంలో కనబడుతున్నాయి. ఉదాహరణలు -

చుక్క పెట్టిన రూపాలు నీలకం

చుక్కపెట్టని రూపాలు :

శ్రీనాదుడు (శ్రీనాథుడు)

రంగనాదుడు (రంగనాథుడు)

దావాల్మీకి రామాయణం (యథావాల్మీకి రామాయణం)

8. ద్విరూప పద ప్రయోగాలు :

చాలా కొద్ది చోట్ల ఒకే పదాన్ని రెండు రూపాలుగా ప్రయోగించబడ్డాయి. ఉదాహరణ -

క్రచ్చఱ / క్రచ్చర

మదనసేన/మదనశేన

కవుల షష్ఠం/కఱల షష్ఠం

9. వర్ణ స్థాన మార్పిడి :

పదాల్లో వచ్చే అక్షరాల స్థానాన్ని మార్చి రాసినట్లు కనబడుతున్నది. ఉదాహరణకు -

గౌర - గౌ

వ్యాకరణం :

ఈ గ్రంథంలో అక్కడక్కడ వ్యాకరణ దోషాలు కనబడుతున్నాయి. అవి :- వర్ణ ప్రయోగాలు, సంధి ప్రయోగాలు, విభక్తి ప్రయోగాలు మొ||

1. వర్ణ ప్రయోగాలు :

"యకారంబును వు వూ వొ వో లును తెలుగు మాటలకు మొదట లేవు (సంజ్ఞా :౧౭) అన్న చిన్నయ సూరి సూత్రాన్ని గనుగ ఈ గ్రంథానికి పాటించినట్లయితే ఇందులో పదాది యకారం చాలా చోట్ల కనబడుతున్నది.

యింకా, యింక, యిందుకే వంటి ఇకారంతో కూడిన యకార రూపాలు, యేకాంతం ఏ కారంతో కూడిన యకారం కనబడుతుంది.

‘యొకటి కరసున్న గలిగి మూటికదిలేక’ అన్న పద్యపాదంలో మొదటి పదాదిలో అచ్చు ‘ఒ’ కారానికి బదులుగ

ఒకారంతో కూడిన యకారం (యొ) కనబడుతుంది. అట్లే ఎక్కటి యతి అని రాయడానికి బదులుగ యెక్కటి యతి అని ఎకారంతో కూడిన యకారాన్ని వాడడం జరిగింది. చాలా చోట్ల ఇటు వంటి ప్రయోగాలు కనబడుతున్నాయి.

2. సంధి ప్రయోగం :

గ్రంథంలో చాలా చోట్ల సంధి అవసరంలేని చోట్ల సంధి చేసిన రూపాలు అధికంగ కనబడుతున్నాయి. ఉదాహరణలు -

యింక చతుః ప్రాసానకుత్తమ గుండ చంధోలక్షణము, చాలా చోట్ల ‘ప్రాసానికి ఉత్తమ గుండ’ అని విడదీసి చూపిన రూపాలు కనబడుతున్నాయి.

త్రివర్ణ ప్రా(సా)సలక్షణాన కంధ్ర శ్రీధర ఛందం (లక్షణానికి ఆంధ్ర శ్రీధర ఛందం)

దేశ్యయతికే అచ్చు క్రచ్చఱ కుధ్యోగ పర్వం (దేశ్యయతికే అచ్చుక్రచ్చఱకు ఉద్యోగపర్వం)

సమస్తోభయ యతికే భాస్కని కొడుకు కేతన కాదంబరి.

3. విభక్తి ప్రయోగం :

గ్రంథ కర్త విభక్తి ప్రత్యయాల్ని ప్రయోగించినప్పుడు పలు రూపాల్ని వాడారు.

ఉదాహరణలు కు/కి అనే ప్రత్యయాన్ని -

యింకా అభేద ప్రాసానికి ఉత్తమ గుండ చంధో లక్షణం

అభేద ప్రాసానకు కవి రాక్షస చంధో లక్షణం

అర్థబిందు ప్రాసానికే నన్నయభట్టు లక్షణసారంలోని లక్షణం

ప్రాసక (ప్రాసకు)

పై నాలుగు ప్రయోగాలలోను నాలుగు విధాలుగ చతుర్థి విభక్తి ప్రత్యయాన్ని ప్రయోగించినట్లు తెలుస్తున్నది.

చివరిగ గ్రంథకర్త అభిప్రాయం :

తాళపత్ర గ్రంథంలోని చివరి పద్యంలో ఈ గ్రంథాన్ని గురించి

క|| "భువి ప్రాసములకు యతులకు

       నవిరళముగ జెప్పినా(డ నాఖ్యలటువలెన్

       కవులనవలె కాదను వా

       రవివేకులు వాదమేలయ్యల్పులతోన్"

అని చెప్పుకున్నాడు.

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ మంగళ మాస్త్రిం జేయున్, లేఖరి చిన్న సుబ్బయ్య వ్రాసిన పుస్తకం, వెంకటాచలపతి సహాయం, శ్రీ గోపాల కృష్ణ శ్రీ రామస్వామి సహాయం శ్రీ శ్రీ శ్రీ అని ముగించబడియుంది.

చివరి మాటలు :

          ఈ తాళపత్ర గ్రంథంలో గ్రంథకర్త ఉదాహరణలుగ చెప్పిన అనేక అరుదైన గ్రంథాలు తెలుగు సాహిత్య లోకంలో మరుగు పడిపోయాయి అన్న విషయం తేటతెల్లమవుతుంది.  ఇది ఒక మహాద్భుత లక్షణ గ్రంథం. ఇందులో ఇంకా పరిష్కరించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. సరియైన పద్ధతిలో ఈ గ్రంథాన్ని గనుక  పరిష్కరించి ముద్రించినట్లయితే ఇంతవరకు దీని ప్రశస్తిని తెలుసుకోలేనివారు తెలుసుకోగలుగుతారు. పైగా భావి పరిశోధకులకు ఈ గ్రంథం ఎంతో ఆధారపూరకంగా ఉంటుంది.

ఆధార గ్రంథాలు :

1. గిరిప్రకాశ్.టి.యస్ : గణపవరపు వెంకటకవి కృతులు, సవిమర్శక పరిశీలనము, గాయత్రి పబ్లికేషన్స్, శ్రీకాకుళం. 2018

2. మల్లియ రేచన : కవిశిరోభూషణం, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి. 1996

3. వెంకటేశ్వర్లు.బూదాటి : సంప్రదాయ తెలుగు వ్యాకరణములు, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం

4. లలిత.జి : తెలుగు వ్యాకరణముల చరిత్ర, వెలగపూడి ఫౌండేషన్స్, మద్రాసు. 1996

5. మోహనరావ్.సజ్జా : అథర్వణుని కృతులు - సమీక్ష, విక్టరీ ప్రస్, విజయవాడ. 1992.