1. పరిశోధన యొక్క ఉద్దేశ్యము- ఆవశ్యకత:

భారతదేశానికి అపురూపసంపదగా భావించే అనేక కళలలో మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే అతి ప్రాచీనకళ శిల్పకళ. శిల్ప కళలో ఉత్తర-దక్షిణ భారతదేశాల మధ్య వ్యత్యాసము కూడా ఎక్కువే! దక్షిణ భారతదేశ శిల్ప సంపదను దేశానికి అందించిన శిల్పకారులలో తెలంగాణ పరిసరప్రాంతాల శిల్పుల యొక్క కృషిని తెలియచెప్పడమే నా ఈ పరిశోధన ముఖ్య ఉద్దేశ్యము.

ఆవశ్యకత- ఇందుకు దారితీసిన పరిస్థితులు:

జీర్ణోధ్దరణ ఆలయాల పరిరక్షణపై లఘు చిత్రం తీసే ఉధ్ధేశ్యంతో విజయనగరం జిల్లాలొ మెంటాడ మండలానికి 15 కిలో మీటర్ల దూరములో గల జయతి అను గ్రామమును సందర్శించితిని. అక్కడ శిథిలావస్థలో గల ఒక ఆలయము కూలిపోగా పురావస్తుశాఖవారు ఆ ఆలయం యొక్క నిర్మాణమునకు ఉపయోగించిన రాతి ఇటుకలకు నెంబర్లు వేసి అదే ఆకారములో తిరిగి నిర్మించుటకు పూనుకొనిరి. అదే ఆకారములో నిర్మించుటకు మహబూబ్ నగర్ శిల్పులను, తెప్పిస్తున్నారని స్థానికులు తెలుపగా తెలంగాణ శిల్పుల యొక్క గొప్పదనాన్ని వారు వివిధ రాష్ట్రాలలో నిర్మించిన కట్టడాలను గురించి కొంత పరిశోధన చేసాను. నా ఈ చిన్ని పరిశోధనా ఫలితాలను ఇతర పరిశోధకులకు తెలియచేయడమే నా ఈ పరిశోధన యొక్క లక్ష్యము.

2. ఉనికి-భౌగోళిక పరిస్థితులు:

భారతదేశములో 29 వ రాష్ట్రముగా 2వ తేదీ జూలై 2014 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రము ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ ఘఢ్ రాష్ట్రములు తెలంగాణ రాష్ట్రమునకు సరిహద్దులుగా ఉన్నవి.గోదావరి, కృష్ణా, మంజీర, మూసీనదులు జలవనరులు. నల్గొండ, గోల్కొండ, తెలంగాణ, వరంగల్ ప్రాంతాలు పీఠభూములు పాఖాట్, సత్మల, అల్ బాక, జగితాల కొండలు పర్షియన్లు, మొఘలులు, కుతుబ్-షాహీ వంశస్తులు, నిజాం నవాబులు పాలకులు శాతవాహనులు, పల్లవులు, చోళులు, చాళుక్యులు, కాకతీయులు, హొయసాలులు, విజయనగర రాజ్యాల స్థాపకులు, ప్రభువులు.

3.శిల్ప కళ ఆవిర్భావం-శిల్పకారుల నిబధ్ధత:

మానవ మనోల్లాసానికి సృష్టించుకున్న అనేక కళలలో శిల్పం కూడా ఒకటి. అరువది నాలుగు కళలలో ఒకటిగా పేర్కొనబడినప్పటికీ సంగీతం, సాహిత్యం, శిల్పం, చిత్రలేఖనం, నృత్యం ఒకదానిపై ఒకటి ఆధారపడిన ప్రముఖ కళలు.

శిల్ప కళ పుట్టుక:

భారతదేశంలో వేదకాలం నుంచీ శిల్పకళ వెల్లివిరిసింది. అధర్వణ వేదంలో ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, కట్టడాలు మొదలైన నిర్మాణ విషయాలు తెలుపబడ్డాయి.

కశ్యప ఋషిచే చెప్పబడినదిగా భావించబడుతున్న కాశ్యప శిల్ప శాస్త్రంలో 22 అధ్యాయాల్లో, 307 రకాల శిల్పాలను గూర్చి (101) విగ్రహాలను కూలంకషంగా తెలిపారు. ఆలయాలు, రాజభవనాలు, సభామందిరాలు, చావడులు మొదలైన నిర్మాణ విషయాలు వాస్తుశాస్త్ర రీతులలో తెలుపబడినవి. ఇదే శాస్త్రంపై వరాహమిహురిని బృహత్ సంహిత, మయుడు రాసిన మాయామత వాస్తుశాస్త్రం, విశ్వకర్మ రాసిన విశ్వకర్మ వాస్తు శాస్త్రం, భోజమహారాజు ఆస్థానశిల్పి రాసిన సమరాంగణ సూత్రధార, ప్రశ్నోత్తరాల రూపంలో ఉన్న అపరాజిత పృచ్చ గ్రంథం, శిల్ప- చిత్రలేఖనాలకు విజ్నాన సర్వస్వం అనబడే విష్ణు ధర్మోత్తర మొదలైనవి ప్రఖ్యాత గ్రంథాలు. వీరేకాక విశ్వామిత్రుడు, మారుతి, చాయాపురుషుడు మొదలగువారు కూడా అనేక విషయాలు తెలిపారు.

విశ్వకర్మ పంచముఖాలనుంచీ వెలువడ్డ సానగ, సనాతన, అహభున, ప్రశ్న, సువర్ణ అనబడే ఐదుగురు ఋషుల మూలంగా శిల్పకళ ఏర్పడిందనీ, దానిని ఒక వృత్తిగా స్వీకరించిన వారు విశ్వబ్రాహ్మణులుగా ఏర్పడ్డారు.

శిల్పికి ఉండవలసిన లక్షణాలు:

-శిల్పకళపై శిక్షణను ప్రముఖ గురువుల వద్ద అభ్యసించడం
-శిల్పశాస్త్రంతో పాటు వాస్తు, ఆగమ శాస్త్రాలు, ఆలయ నిర్మాణాలమెలకువలు కూడా తెలిసిఉండాలి.
- శిల్పానికి ఉపయోగపడే శిల గురించిన అవగాహన
-కళలు దైవదత్తమని అనుకుంటే శిల్పికి దార్శనికత అవసరం. `
-నిరంతర పరిశ్రమ, దీక్ష, సునిశిత కళా నైపుణ్యం.
అతి ప్రాచీన కాలంలో ఆలయాలు నిర్మించిన రాజులపేర్లు, దానములిచ్చిన భూముల వివరాలు శాసనాలుగా చెక్కిన శిల్పకారునికి తన నామరూపాలకు శాశ్వతత్త్వాన్ని కోరుకోని త్యాగి. శిల్ప నిర్మాణ యజ్నంలో సమిధగానే తప్ప తన ఉనికిని చిరస్థాయి చేసుకోలేదు. పదవ శతాబ్దం తరువాత పరిస్థితి మారింది.

శిల్పకళలలో వైవిధ్యం:

దక్షిణ భారతదేశంలో శిల్పకళకు ప్రామాణికమని ప్రచారంలో ఉన్న నాట్యరీతులు కూచిపూడి, భరత, ఒడిస్సీ, కథాకళి, కథక్, ఆంధ్ర నాట్యం మొదలగునవి సంస్కృతీ సంప్రదాయాల సమ్మేళనంగా నృత్యరీతులు ఆవిష్కరింపబడినవా? లేక ఆలయ గోపురాల పైన, కుడ్యాలపైన నెలకొన్న భంగిమల ఆధారంగా నాట్యశాస్త్రం పుట్టిందా ? అనే ప్రశ్న కలుగక మానదు.

చెట్టుముందా? విత్తుముందా? అన్నట్లు ఇవన్నీ దైవీదత్తమైన కళలుగా భావించవలసినదే!

నాట్యశాస్త్ర పితామహుడైన భరతముని రచించిన నాట్యశాస్త్రము గ్రంథములో గల 36 అధ్యాయాలలో అభినయం ఆధారంగా 1.సాత్విక, 2.ఆంగిక, 3.వాచికాభినయాలూ మరియూ 4. ఆహార్యము అను నాలుగు విభాగాలు చేసారు.

భరతముని నిర్వచించిన 24 అసంయుత హస్తముద్రలూ, నందికేశుడు నిర్వచించిన అభినయ దర్పణములో చెప్పిన ఇతర అసంయుత హస్తముద్రలూ, ఆలయగోడలపై దర్శనమిస్తాయి. భరతుడు చెప్పిన 13 సంయుత హస్త ముద్రలూ, నందికేశుడు, తెలిపిన 13 సంయుత హస్త ముద్రల కూడా మనకూ ఆలయగోడలపై దర్శనమిస్తాయి.

వీటన్నింటినీ చిత్ర రూపంలో తెలియచేసిన భారతీయ చిత్రకళా వైభవము ప్రపంచానికే అబ్బురము.

శ్లో: గీతం వాద్యంచ నృత్యంచ త్రయం సంగీతముచ్యతే

అని పెద్దలు చెప్పినట్లు నృత్యానికీ, సంగీతానికీ కూడా వాద్యపరికరాలు అవసరం. వాటిని చిత్రకారుడు చిత్రీకరిస్తే శిల్పి తన శిల్పంలో ఉపయోగిస్తాడు. అందువలన శిల్పకళ నాట్యము, సంగీతమూ, చిత్రలేఖనమూ పై ఆధారపడియున్నది.

ఈ మూడింటినీ ఉపయోగిస్తూ శిల్పకళను 7 భాగాలు చేసుకున్నారు.

1. దేవతా విగ్రహాలు 2. ఉపదేవతా విగ్రహాలు 3. జంతువులు; పక్షులు; 4. అలంకరణ విగ్రహాలు 5. కలశము లాంటి శుభసూచక విగ్రహాలు 6. మిధున శిల్పాలు 7. విడి శిల్పాలు

ఆలయాలకు సంబంధించి కుడ్యశిల్పం, స్తంభశిల్పం, ఆలయాలలో కప్పుశిల్పం, ద్వారబంధశిల్పం, తోరణ శిల్పం, ప్రాకారశిల్పం, కప్పు శిల్పం,

శిల్పి తీసుకొనిన వస్తువు:

పౌరాణిక కథలను తన ఊహలకు అనుగుణంగా శిల్ప రూపంలో సజీవతను సాక్షాత్కరింప చేసిన శిల్పులు మహా పండితులో, ధనధాన్య సంపన్నులో కాకపోవడం నేటికీ ఆశ్చర్యం కలిగించే విషయం. నిర్మాణంలో ఈనాటి ఆధునిక యంత్రాలైన క్రేన్లు, బుల్డోజర్లు, సిమెంటు, ఇనుము ఉపయోగించకుండా ఇప్పటికీ ఆ శిల్పసౌందర్యాలు వీక్షకులకు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తూనే ఉన్నాయి. వీరి కల్పనలో హేతుబధ్ధతకు లొంగని సాధారణ జ్నానానికి అంతుచిక్కని భావచిత్రణలు, ఉపమానాలు, ఉత్ప్రేక్షలు, అలంకారాలుతో కూడి శిల్పానికి దైవత్వాన్ని ఆపాదించేటట్లు చేస్తుంది.

శిల్పకారుల నైపుణ్యానికి అబ్బురపరిచే ఉదాహరణలు:

ఆంధ్ర ప్రదేశ్ లోని లేపాక్షి వీరభద్రేశ్వరుని ఆలయం ముఖమంటపం వద్దగల ఒక విచిత్రమైన స్థంభం చూసి తీరవలసిందే! అది నేలపై ఆనుకోకుండా పై కప్పు నుంచి వేలాడే స్థంభం! ఆ స్థంభం బరువును దూలం భరిస్తుంది. స్థంభం మీద దూలాన్ని రూపొందించిన తరువాత స్థంభానికీ, దూలానికీ మధ్య ఏర్పడే కోణాకార స్థలంలో ఒక ఊతకమ్మీని అమరుస్తారు. ఈ కమ్మీని బ్రాకెట్ లేక నాసిక అంటారు. ఈ రకమైన నాసికా శిల్పాలు కాకతీయ శిల్పుల ప్రతిభ. ఇచ్చటనే గల నంది విగ్రహం కూడా శిల్పకారుని ప్రతిభకు పరాకాష్ట.

తమిళనాడులోని చోళరాజులచే నిర్మింపబడిన తంజావూరులోని బృహదీశ్వరాలయం:
ప్రపంచంలోని ఎత్తైన ఈ దేవాలయం సంవత్సరంలోని 365 రోజులలో ఏరోజూ కూడా దాని నీడ నేలపై పడదు. 216 అడుగుల ఎత్తైన గోపురం మీద దాదాపు 81 టన్నుల ఏకశిలా శిఖరం (అది అక్కడకు ఎలా చేర్చారు అన్నదానిపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలున్నాయి.) శిల్పుల నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యం.

పల్లవరాజులచే నిర్మింపబడిన మహాబలిపురంలోని శిల్ప సమూహం:

ఆలయానికి ప్రాథమిక రూపమైన గర్భగృహం - ముఖ మండపం- విమానం- గోపురం- ప్రాకారం- భావితరాలకు ఆదర్శం మరియు మార్గదర్శకులూ అయారు. కొండచరియలు తొలచి మండపాలను, గుహలలో నిర్మించారు. గంగావతరణం; ఏకశిలతో మలచిన పాండవుల రథాలు, కర్ణాటకలోని హొయసాలులు బేలూరులో నిర్మించిన చెన్నకేశవ ఆలయం, శ్రావణ బెళగొళలో నిర్మించిన అతి ఎత్తైన గోమఠేశ్వరుని విగ్రహం. (10 వ .శతాబ్దం.) ఒరిస్సాలోని కోణార్కలో గల సూర్య దేవాలయంలో గల రాతి చక్రం సూర్య గమనాన్ని అనుసరించి సమయాన్ని తెలియజేసే ప్రాచీన గడియారం.


శిల్ప శైలి:

శిల్ప కళ పట్ల అవగాహన ఉన్నవారు శిల్పాన్ని చూస్తూనే అది ఏప్రాంతపు శిల్పులు చెక్కినది. చెప్పగలుగుతారు. పల్లవులు, చోళులు, చాళుక్యులు, కాకతీయులు, హొయసాలులు, పర్షియన్లు, మొఘలులు, కుతుబ్ -షాహీలు అనుసరించిన పర్షియన్, మొఘల్, గాంధార శిల్పం.


4. పాలించినరాజ్యాలు-రాజవంశాలు-కోటలు-ఆలయాలు-ఇతరకట్టడాలు:

రాజుల సామంతులుగా కొన్ని సంస్థానాలూ- సంస్థానాధిపతులూ ఉండేవారు. వారు కూడా బలమైన కోటలు నిర్మించుకుని సైన్యంతో సిధ్ధంగా ఉండేవారు.అటువంటి వాటిలో గద్వాల్; సిధ్ధాపురం; అహోబిలం; ఆత్మకూరు; సిరిసిల్ల; మొదలగునవి. శిల్పులు ఆనాటి ప్రజల అవసరాలకు తగినట్లు ఎంతో అద్భుతంగా నిర్మించారు.

కాకతీయుల శిల్పులు శిల్పశాస్త్రానికి అనుగుణంగా తయారు చేసిన నల్ల గ్రానైట్; శిలను వాడి దానికి మెరుగు కోసమై అత్యంత ఖరీదైన క్వార్ట్జ్ పొడిని వాడేవారు. నాడు ప్రాచుర్యంలో ఉన్న దేశీయ , జానపద నృత్యాలకు ప్రాధాన్యం ఇచ్చారు. వీరి కాలంలో నిర్మించబడినదిగా చెప్పబడుతున్న కోటలు, ప్రాకారాలూ, తోరణాలూ, కోటలలోని రాజపరివారమునకై ఆలయాలు, మందిరాలూ, ఉద్యానవనాలలోని శిల్పాలు పేరెన్నికగన్నవి.

హిందూ ఆలయాలలో భద్రాచలంలోని రాముని ఆలయం; బాసరలోని జ్నాన సరస్వతీ ఆలయం: యాదాద్రిగా పిలువబడే యాదగిరి నృసింహస్వామి; వేములవాడ రాజేశ్వరీ; ముస్లింలకు సంబంధించి చార్మినార్; ఖైరతాబాద్ మసీదు; మియాన్ మష్క్ మసీదు;స్పానిష్ మసీదు; బౌధ్ధ, జైన మతాలకు సంబంధించి నేలకొండపల్లి, ధూళి కట్ట; ఫణిగిరి; నాగార్జున కొండపై బుధ్ధుని జాతకకథలూ; క్రైస్తవులకు సంబంధించి మెదక్ లోని చర్చ్ నిర్మాణము తెలంగాణా శిల్పుల శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి.


5. సమకాలీన శిల్ప శైలి-వస్తువు సారూప్యత:

సమకాలీన ఆలయాలలోని శిల్పాలన్నీ ఆయా శిల్పకారుల ఆలోచనలకు ప్రతిరూపాలే! మహబూబ్ నగర్ కేంద్రంగా గల నాగర్ కర్నూల్, కొల్హాపూర్; వనపర్తి ప్రాంతాలలోని విశ్వ బ్రాహ్మణులు; వరంగల్లు జిల్లాకు చెందిన కురవి; జఫర్ గఢ్; మేడారం; సర్వాయిపాపడి; షావురం; మల్లంపల్లి; ఆత్మకూరు మొదలైనవి.కాకతీయులు నిర్మించిన ఏకశిలా నగరం దీనిని గురించి వినుకొండ వల్లభరాయలు (క్రీ.శ..1430) రచించిన క్రీడాభిరామంలో ఏకశిలా నగరాన్ని ఇలా వర్ణిస్తారు.

"తారకామండలస్తబకావతంసయై
కనుచూపుగొనని ప్రాకారరేఖ
పూజీభవించిన భువనగోళము భంగి
సంకులాంగణమైన వంకధార.....

అని వ్రాసారంటే ఆ శిల్పుల ప్రతిభాపాటవాలు మనకు అర్ధమౌతాయి.

హనుమ కొండలోని వేయిస్తంభాల గుడి నిర్మించిన స్థపతి పేరు తెలియాలంటే విస్తృత పరిశోధన జరగాలి. ప్రధాన మండపంలో ఏకశిలా నిర్మితమైన వేయి స్థంభాలు సర్వాలంకార భూషితలైన నాట్యకత్తెల వివిధ హొయలు ఒలికిస్తూ త్రిభంగి ఆకృతిలో స్థంభాలకు వేలాడుతూ దర్శనమిస్తారు.

కాకతీయుల కాలం నాటి రామప్ప ఆలయం హొయసాలుల ఆలయంలోని బాదామి చాళుక్యుల ఆలయాలలోని శిల్ప సంపదను గుర్తుకు తెస్తుంది. రేచర్ల రుద్రసేనాని క్రీ.శ. 1213 లో ప్రతిష్ఠ చేయగా ఆలయ ప్రధాన శిల్పి పేరుతో ఆలయం ప్రసిధ్ధి పొందడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రామప్పగుడిలోని నంది కాకతీయ శిల్పులకే ప్రత్యేకమైన ప్రతిరూపం. అంతేకాక ఆలయంలోని స్త్రీల విగ్రహాలు ముఖానికి పరదా వేసుకుని ధరించిన వస్త్రధారణ, ఆభరణాల అమరిక చుట్టుపక్కల గల బంజారా స్త్రీల పోలికలు కనిపిస్తాయి.

ఆలయాలకు చుట్టూ గల ఎత్తైన ప్రాకారాల చుట్టూ నిర్మించిన శిల్పాలు క్షీరసాగర మథనం-ఫోటో-1- పార్వతీ కల్యాణం- గజాసుర సంహారం వంటి శిల్పము ఆనాటి శిల్పుల శిల్పానికి ప్రాణమైన గతిశీలత. అంటే ప్రధాన శిల్పంతో పాటు మిగతా శిల్పాలు కూడా అంతే ప్రాధాన్యతతో వాటి భావాలను ఒలికించడంలో సజీవత ఉట్టిపడేటట్లు నవరసాలనూ శిల్పంలో ఒలికించేటట్లు శిల్పీకరింపగలరు.

ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆలంపూర్ కృష్ణా, తుంగభద్రా నదుల సంగమస్థానంలో ఉన్నది. పౌరాణికంగా అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఆలంపూర్ ఆలయం ఫోటో-2
సుమారు వేయి సంవత్సరాల క్రితం చాళుక్యులు నిర్మించిన ఈ ఆలయ నిర్మాణశైలి ఫోటో-3-

చాళుక్యులు కళింగపై దండయాత్రకు వెడలినపుడు ఒకేసారి నిర్మాణ పనులు ప్రారంభించిన జయతి, సారిపల్లి- ఫోటో-4-, గలావెల్లి- ఫోటో-5- , నారాయణపురం - ఫోటో-6-గ్రామాలలో గల వివిధపేర్లతో పిలువబడే ఈశ్వరాలయాలను పోలి ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంజిల్లాలోని నారాయణపురం ఆలయము కర్ణాటకలోని సంగమేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది. ఫోటో-7-

ఉత్తర తెలంగాణ ప్రాంతములో ఒక కొత్త శిల్ప సంప్రదాయం కనిపిస్తుంది.క్రీ.శ. 9 వ శతాబ్ద ఉత్తరార్ధానికి చెందిన వేములవాడ భీమేశ్వరాలయంలో చెక్కబడిన శిల్పాలలో మహిషాసుర మర్దిని విగ్రహం ప్రసిధ్ధమైనది.అష్ట భుజ దేవి మానవరూపంలో ఉన్న అసురుని తొక్కి వేస్తున్నట్లు మలచబడింది.చాచిన హస్తాలలో శంఖ, భేటక, శూల, ఖడ్గ, పాశములున్నవి.దేవి మేను సన్నగా ఉన్నప్పటికీ శరీరంలోని వంపు, తలవాల్చు, హస్తాల భంగిమ, చక్కని రూపమును చెక్కిన శిల్పి ప్రతిభకు ఉదాహరణ. ఆలంపురం ఆలయంలోని, ఎల్లోరాలోని శిల్పాలకూ దీనికీ పోలికలున్నాయి.

ప్రస్తుత నా పరిశోధనలో కూడా విజయనగరానికి చెందిన జయతి ఆలయ ప్రాంగణంలో గల నటరాజస్వామి మరియు మహిషాసుర మర్దిని విగ్రహాలు ఏక శిలపై చెక్కబడినవి. ఫోటో- 8

6.ముగింపు:

దక్షిణ భారత దేశములోని శిల్పకారులు తమ కళకు ఎంత ప్రాధాన్యతను ఇచ్చేవారంటే తాము నేర్చుకున్న విద్య సద్వినియోగమవుతుందని తలిస్తే ఎంత దూరమైనా వెళ్ళి తమ కళకు శాశ్వతత్త్వాన్ని కలిగించాలని భావించేవారు. అందుకే వారు నేర్చుకున్న శిల్పకళారూపాలు దేశమందెల్లెడలా మనకు దర్శనమిస్తూంటాయి. వారి జాతి నామాలు తెలియకున్నా వారి శిల్పము వారి గొప్పదనాన్ని తెలుపుతూ వారి జన్మ సఫలతనొందెనని దీవిస్తూంటుంది. ఇదే భారతీయుల ఏకత్వం!

పరిశీలించిన గ్రంథాలు:

1. శిల్ప దర్శనం- కళాప్రపూర్ణ కీ.శే. కొండూరు వీర రాఘవాచార్యులు
2. తొలి మధ్యయుగ ఆంధ్రప్రదేశ్- వాస్తు పధ్ధతి-
3. తెలుగు కళారూపాల సంక్షిప్త చరిత్ర- డా. అలేఖ్య పుంజల అనువాదం- డా. వాసుదేవ్
4. శిల్ప కళ- డా. కాశీభట్ల విశ్వనాథం
5. క్రీడాభిరామం- వినుకొండ వల్లభరాయలు
6. భారతీయ ప్రతిభా విశేషాలు- రామకృష్ణ మఠం
7. వివిధ , మాస, వార, దిన పత్రికలు
8. విజయనగర వైభవానికి దిక్సూచి- శ్రీలక్ష్మి చివుకులa