ఉపోద్ఘాతం:

'కాల్పానికత కవిత్వం యొక్క ప్రధాన గుణములను డా. సి.నారాయణరెడ్డి తన 'ఆథునికాంధ్ర కవిత్వం సంప్రదాయాలు, ప్రయోగాలు' గ్రంథంలో ప్రకృతిప్రీతి, గత వైభవ పునరుద్ధరణము, ప్రణయతత్వము, ఆత్మాశ్రయత్వము, అద్భుతత్వము, సాహసప్రయత్యము అని వివరిస్తారు. ఆంగ్ల సాహిత్యంలో ప్రారంభమయిన కాల్పానికోద్యమమును భావ కవిత్వంగా కూడా పేర్కొంటారు. భావ కవిత్వంలో కూడా ప్రకృతి ప్రీతి, స్వేచ్ఛా ప్రణయత్వం, ప్రణయం - ఊహాసుందరి - విరహం - వేదన - భక్తి, దేశభక్తి, సంఘ సంస్కరణాభిలాష, మార్మికత - సూఫీతత్వం, స్త్రీ ఉదాత్తచిత్రణ, దేశభక్తి, సామాజిక స్పృహ, స్మృతి - వంటి లక్షణాలును విమర్శకులు వివరిస్తారు. గురజాడ అప్పారావు, విశ్వనాథ సత్యన్నారాయణ, రాయప్రోలు, దువ్వూరి, పింగళి - కాటూరి, కవికొండల, తిరుపతి వెంకట కవులు తదితరులు రచనలు పరిశీలిస్తే పై అంశాలన్నీ కనిపిస్తాయి.

జాషువా - భావకవిత్వం:

జాషువా కవిత్వంలో భావ (కాల్పానికత) కవిత్వ భావాన్ని సహితం తనదైన శైలిలోనే వినియోగించుకున్నారు. సుమారు 1920 నుంచి 1970 వరకు జాషువా కవితా రచన చేసారు. మారేకాలం, మారుతున్న సమాజ స్థితిగతులు ఆయన అవగాహనలో ఉన్నాయి. వాటిని విస్మరించలేదు. ఆ ఐదు దశాబ్ధాల కాలంలో ఓ సమగ్రమైన సామాజిక రూపుదిద్దుకుంది. సాహిత్యంలో సహితం ఓ క్రొత్త రూపు, చూపు ప్రారంభమయింది. జాషువా కాలానికి తన 'కలం' జోడించి రచనలు చేసారు. 'జీవితం నాకు ఎన్నో నేర్పింది. నా గురువులు ఇద్దరు పేదరికం, కులమత బేధం. ఒకటి నాకు సహనాన్ని నేర్పితే రెండవది నాలో ఎదురించే శక్తిని పెంచింది కాని బానిసగా మాత్రం మార్చలేదు. చివరి వరకు తన కవితా విశ్వరూపంలో ఈ శక్తిని ప్రదర్శిస్తూనే వచ్చారు. 'నా కత్తి కవిత' అని కూడా అన్నారాయన.

'నా కవితా వధూటి వదనమ్ము నెగాదిగ చూచి రూపరే

ఖా కమనీయ వైఖరులు గాంచి, భళీ భళి యన్నవారే.............'

అనే పద్యంలో కవిత్వానికి జీవితానుభూతి ఎంతగా ఉపకరిస్తుందో ఆవేదన భరితంగా చెప్పారు జాషువా. రాయప్రోలు, గురజాడ, కృష్ణశాస్త్రి వంటి వారి భావకవితా వాదం జాషువా పైన ప్రభావం చూపినా, ఆయన 'వారి' 'భావన'లను తన 'భాష'లోకి తర్జుమా చేయలేకపోయారు. 'ప్రేయసి' అనే ఊహాసుందరికి తన కవిత్వంలో స్థానం కల్పించలేదు, అంతమాత్రాన జాషువా కవిత్వంలో 'ప్రకృతి' 'ఆత్మీయత' ‘ఆవేదన’ లేవని చెప్పరాదు. కాని అతను 'దు:ఖానికి' తావివ్వలేదు. 'నా కొరకు చెమ్మగిల్లని నయనమ్ము లేదు' అనే తత్వాన్ని కవిత్వంలో వివరించలేదు. కాని... సరళమైన భాషలోనే క్లిష్టమైన అన్వయాల్ని ప్రజానుభాషలో 'సాధారణంగా'నే వ్యక్తీకరించారు. అద్దేపల్లి వారు అన్నట్టు 'ప్రతీ పదాన్ని భావ విర్భరంగా ప్రయోగించడం, ప్రజాలక్షణమైన హృదయ స్పందనలో భాగం చెయ్యడం' వంటివి జాషువా తన కవిత్వం ద్వారా సాధించారు. EZRA Pound చెప్పినట్లుగా “Great Literature is simply language charged with meaning to the utmost possible degree” అనే సూత్రం జాషువా కవిత్వానికి అన్వయిస్తుంది.

'ఆరిపోవని నీదు శరీర శోభ

దీపమైనది కాళింది తిన్నియలకు

మంజులంబైన నీ సౌకుమార్యమెల్ల

పంచుకొన్నవి తన్నదీ పంకజములు'

ఎంత అందమైన రసాత్మక భావ నిర్మాణమో ద్యోతకమవుతుంది. జాషువా 'పదాల'లోని 'భాష'లోని సౌకుమర్యానికి 'అందం' అద్దిన అక్షరాలు ధన్యం.

చంద్రుణ్ణి వర్ణించే వేళ...

'వెన్నెల వెండి నీట పృధి వీరలయంబు మునింగె రాత్రికిన్‌

కన్నులు వచ్చె మింటనధికారమము చేసే నిరంకుశంబుగన్‌

పున్నమ చందమామ, జగమున్‌ కనుమోడిచె '

వెన్నెల రాత్రికి కళ్ళలా ఉందనే ఉపమానం రసస్ఫూర్తి సూత్రం. పరిస్థితులను లోబరుచుకొనే ఆర్ద్రత జాషువా కలానిది.

'గిజిగాడు' వర్ణనలో...

'జిలుగుం బంగారు రంగు రంగులకు మేల్‌చిన్నారి పూగుత్తిసొ

మ్ములు గీలించిన తుమ్మ కొమ్మలకు, నీవున్‌ నీ సతీరత్నము....'

అని ప్రకృతిలోని 'గిజిగాడి' కళా నైపుణ్యాన్ని తన కవిత్వంలో ఎంతో హృద్యయంగా చెబుతారు.

1920 - 1950ల మధ్య భావ కవిత్వం తనదైన ముద్రను 'కవిత్వం' లో వేసుకుంది. జాషువా తన 'సంప్రదాయ కవిత్వం'లో భావుకతను 'ప్రక్కకు తప్పించే సమయం వచ్చిన సందర్భమది. కాని జాషువ భావ కవిత్వాని వ్యతిరేకించారు. జాషువా ధృక్పధానికి భావకవిత్వపు నడకకు నప్పదు. అయితే 'భావ కవిత్వం' (కాల్పానిక కవిత్వం) లోని 'అనుభూతి' 'ఆవేశం' వంటివి జాషువా మౌళికాంశములు.

'కవి సమయంబు తప్పి నుడికారపు సొంపును పాడు చేసి నీ

వెవతక కోసమో కుమలి ఏడ్చుచు చక్కని కైత కాయువులు కుదించి'

అని భావ కవిత్వంలో అస్పష్టతను 'అవాస్తికత'ను కూడా ఎత్తిచూపారు జాషువా. జాషువా తనలోని 'కాల్పానికావేశాన్ని' తన సొంత ముద్రగా 'కవిత్వ' సృజన చేసారు. అలాగని జాషువా కవిత్వంలో 'భావుకత' లేదని చెప్పకూడదు. ఆయన తన అభిప్రాయాల్ని 'సౌందర్యవంతం' చేయటంలో సిద్దహస్తులు. 'సాలీణ్ణీ' కూడా అందంగా వర్ణించగలరాయన.

"తలపన్‌ పున్నమినాటి వెన్నెలల దిద్దంజాలు నీ నూలు పో

గుల సింగారము చూడవచ్చి అసువుల్‌ కోల్పోయెడిన్‌ ప్రాణులు ఓ

తులుగా! నెత్తురు క్రావు నేతపనులెందుంజోడము..."

కాల్పానికత కవిత్వంలో ప్రధానమయిన అంశం ప్రణయ భావన. ఒక లోతైన ఆత్మాశ్రయమైన అనుభూతి. సౌందర్యాన్ని వ్యక్తం చేయడంలో జాషువాకు ఓ ప్రత్యేకమైన 'భాషా నిర్మాణం' ఉందనిపిస్తుంది. అందులో ఓ 'చమత్కారం' మెరుపు ప్రాయమవుతుంది. మగ నెమలి నాట్యంతో 'ఆడ నెమలి' ఆనందాన్ని మానవ స్వభావానికి అన్వయిస్తూ...

'భర్త హోంబట్టు జిలుగుటంబరము దాల్చి

విపిన వీధులలో తాండవించు చుండ

చేరువను నిల్చి, మాసిన చీరగట్టి

మురిసికొను పతివ్రతవు సుందరులలోన'

అని ఎంతో సామాజిక, రాజకీయ వేదనకు అక్షర రూపం ఇస్తారు జాషువా. 'శిశువు'లో శైశవ దశను 'ప్రకృతి' లోని ప్రధాన వస్తువుగా స్వీకరించిన విధం... బొటవ్రేల ముల్లోకములు చూచిలోలోన నానందపడు యోగితల్లిదండ్రుల తనూవల్లరీ ద్వయికి వన్నియ( బెట్టు తొమ్మిది నెలల పంట.....' వివర్ణిస్తారు.

'వికుంజము' అనుఖండికలో మధుమాసాన్ని ఆద్మాంతంగా ఆవిష్కరిస్తారు.

'భోగముసానులై కుసుమపుంజిఱునవ్వుల చిమ్ముతేంట్లకున్‌

ద్రాగుడు నేర్పుచుందురు కదా? వనకన్యలు....'

'నెల బాలుడు' లో చందమామను అందంగా వర్ణిస్తారు.

'పున్నమి నాడు నీవు పరిపూర్ణ శరీరుడవై సుధావిలా

సోన్నతి నవ్వుచుం బొడముచుందువులోకము సంతసింపనో

క్రొన్నెల బాల..........................'

'నెమలినెలత', 'తమ్మెద పెండ్లికొడుకు' 'శ్మశానవాటిక' 'సాలీడు' 'అర్ధరాత్రము' 'తుఫాన్‌' 'హెచ్చరిక' 'చీకటి' 'అఖండగౌతమి' 'లోకభాంధవుడు' 'మాతృప్రేమ' ఇలా ఈ జాబితా పెద్దదే ఉంది.

ముగింపు:

జాషువా ఏ రచన చేసినా, ఏ 'కవిత్వ పంధా'ననుసరించినా 'పీడితుల' కోసమే తన 'ఏకీభావన' అనేది సత్యం. సమాజంలో 'తాను అనుభవించిన' చూసిన సమాజాన్ని అన్వయించుకోవడంలో 'అనుభూతి చెందిన' దానిని మాత్రమే అక్షరీకంచడం సహజం. జాషువా రచనల్లోనూ ఇదే సూత్రం కనిపిస్తుంది. వైముక్తికమైన 'అనుభూతి' సామాజికమైన ఆవేశం జాషువా సహజాత సూత్రం. జాషువా 'ప్రాచీన సాహిత్య అధ్యయన శీలి' అన్ని రకాల కవిత్వాలు ఆయనను ప్రభావితం చేసాయి. అన్నింటిని తాను ప్రభావితం చేసాడు. ఆయా 'కవితారీతుల'ను అనుసరిస్తూనే తనదైన సొంత ముద్రను నిర్మించుకున్నారు జాషువా. ఆయనే అన్నట్లుగా ఆయన విశ్వనరుడు.

ఆధార గ్రంథాలు:

1. డా|| రామారావు, అద్దేపల్లి, మహాకవి జాషువా.

2. జాషువా కృతులు - తెలుగు అకాడమీ ప్రచురణ

3. నారాయణరెడ్డి, సి. ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయాలు - ప్రయోగాలు.