ఆధునిక కాలంలో విద్య ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చింది. వేరు వేరు విషయాలలో ఉన్నత చదువులు అభ్యసించిన వారు కవులూ, రచయితలూ అయ్యారు. తెలుగు సాహిత్యం ప్రత్యేకంగా చదువుకున్నవారే కాక, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, తెలుగు, లేదా తెలుగేతర సాహిత్యాలు బోధించే టీచర్లు, లెక్చరర్లు, బోధనేతర ఉద్యోగులు వివిధ ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు. పత్రికల్లో వీరందరి రచనలు అచ్చుకావాలంటే గతంలో సాధ్యమయ్యేది కాదు. పత్రికలకు ఆర్థిక వనరుల పరిమితి ఉండేది. కాబట్టి వాటికి పుటల పరిమితి ఉండేది. కానీ, నేడు ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలు వచ్చిన తరువాత రచనలు చెయ్యగలిగిన ప్రతి ఒక్కరూ ఎలాంటి పుటల పరిమితి లేకుండా, పత్రికా సంపాదకులు తమ రచనను ప్రచురిస్తారో లేదో అనే జంకులేకుండా సామాజిక మాధ్యమాల్లో తమ రచనలను ఉంచుతున్నారు. గతంలోనైతే ఒక రచన మీద పాఠకుల స్పందన, విమర్శ రావాలంటే చాలా కాలం పట్టేది. ముందు ఆ రచన పుస్తకరూపంలో అచ్చుకావాలి. ఆ పుస్తకం పాఠకులను చేరాలి. దీనికి ఎంతో కాలం పట్టేది. సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ పరిస్థితి మారిపోయింది. ఏదైనా ఒక కవిత, లేదా కథ, లేదా నవల ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమంలో అప్లోడ్ అయిన వెంటనే కామెంట్ల రూపంలో పాఠకుల స్పందన, విమర్శ క్లుప్తంగానైనా వస్తోంది. అయితే, ఈ విమర్శలో నిజాయితీ ఎంత ఉంటుందో, శాస్త్రబద్ధత ఎంత ఉంటుందో చెప్పడం కష్టమే.

సామాజిక మాధ్యమాల పుణ్యమా అని తెలుగు సాహిత్య రంగంలో పెరిగిన రచయితల సంఖ్యకు అనుగుణంగా విమర్శకుల సంఖ్య పెరగలేదు. పరిశోధకుల సంఖ్య పెరగలేదు. విశ్వ విద్యాలయాల సంఖ్య పెరిగినా, తెలుగు సాహిత్యం చదువుకునే వారి సంఖ్య పెరిగినా విశ్వ విద్యాలయాల్లో ఉండే సీట్ల పరిమితి వల్ల పరిశోధకుల సంఖ్య తగినంతగా పెరగలేదనే చెప్పాలి. విశ్వ విద్యాలయాలకు వెలుపల కూడా కొందరు ప్రామాణిక పరిశోధకులూ, విమర్శకులూ ఉన్నారు. అయితే, విశ్వ విద్యాలయాల్లోని పరిశోధకులూ, విశ్వ విద్యాలయాలకు వెలుపల ఉన్నపరిశోధకులూ రాసే విమర్శలనూ, వారి పరిశోధన పత్రాలనూ ప్రచురించే పత్రికలు తగినన్ని లేవు. అనేక కారణాల వల్ల పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు ప్రచురించే పరిశోధన పత్రిక ‘‘వాఙ్మయి’’; తెలుగు అకాడమి, హైదరాబాదు ప్రచురించే ‘‘తెలుగు’’ మాసపత్రికలు తాత్కాలికంగా మూలకుపడ్డాయి. ఈ ప్రతికల పునః ప్రారంభం ప్రశ్నార్థకమే. వివిధ విశ్వ విద్యాలయాల తెలుగు శాఖలు ఆర్థిక వనరుల కొరత కారణంగా ఎలాంటి పరిశోధన, విమర్శ పత్రికలు వెలువరించడం లేదు. అంతర్జాల తెలుగు పత్రికలు సృజనాత్మక రచనల ప్రచురణకు ఇచ్చినంత ప్రాధాన్యం విమర్శ వ్యాసాలకూ, పరిశోధన వ్యాసాలకూ ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఇటువంటి పరిస్థితిలో కేవలం ప్రామాణికమైన తెలుగు పరిశోధన వ్యాసాల, విమర్శ వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా, సుప్రసిద్ధ సాహిత్య సేవా సంస్థ "రాంభట్ల వేంకటరావు మెమోరియల్ ట్రస్టు, విశాఖపట్టణం" వారు ఈ దసరా పండుగ సందర్భంగా 25-10-2020 తేదీన ‘‘ఔచిత్యమ్.కామ్’’ అనే అంతర్జాల తెలుగు మాస పత్రికను ప్రారంభించడం హర్షణీయం. అభినందనీయం. ఔత్సాహిక తెలుగు పరిశోధకులకూ, విమర్శకులకూ ఈ పత్రిక ఎంతో అవసరం. ఔచిత్యమ్. కామ్ సంపాదకవర్గం తమ పత్రికకు నన్ను గౌరవ సలహాదారునిగా ఉండమని ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని అంగీకరిస్తూ వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నాను. ఈ అంతర్జాల తెలుగు మాసపత్రిక ప్రామాణికమైన పరిశోధన వ్యాసాలనూ, విమర్శ వ్యాసాలనూ ప్రచురిస్తూ చిరకాలం కొనసాగాలని ఆశిస్తున్నాను.