ఉపోద్ఘాతం:

దక్షిణాంధ్రయుగ సాహిత్యంలో(క్రీ.శ.1600-1775) చేమకూర వెంకటకవి రచించిన విజయ విలాసం ఒక అపూర్వ సృష్టి. ఆంధ్ర పంచ మహా కావ్యముల కోవలో చేరవలసిన గ్రంధ రాజము “విజయ విలాసము” అని తిరుపతి వేంకట కవులచే కొనియాడబడినది. ప్రబంధ ప్రక్రియాలక్షణ విధేయంగా అంటే అష్టాదశ వర్ణనా సంయుతంగా, శృంగార రస ప్రధానంగా సాగిన రచన విజయవిలాసము. ’విలాస’ శబ్దము కేవలం శృంగారానికి పరిమితం కాదు. ఆ పదానికి లీలా, మాహాత్మ్యములన్న అర్థాలు కూడా ఉన్నాయి. చేమకూర అటు ప్రబంధ యుగ చైతన్యాన్ని, ఇటు శ్లేష కావ్యప్రవృత్తిని "విజయవిలాసం" లో ప్రతిఫలింప చేశారు. ప్రతిపద్య చమత్కృతి వేంకట కవి రచనాప్రవృత్తి. శబ్ద, అర్థ అలంకారములను సార్థకంగా వాడటం, శ్లేషోక్తికి వక్రోక్తిని అండగా నిలపడం, మాటల ఒడుపులతో, విరుపులతో, కుదుపులతో చమత్కార నయగారాలు ఒలకబోయడం ఈ కవి విశేషలక్షణం.

చేమకూర వేంకట కవి తంజావూరు పాలించిన రఘునాథ నాయకుని ఆస్థాన కవి. చేమకూర వేంకట కవి ఆశ్వాసాంత గద్యము -

“శ్రీ సూర్య నారాయణ వర ప్రసాద లబ్ధ ప్రసిద్ధ సారస్వత సుధా సార జనిత యశో లతాం కుర చేమకూర లక్ష్మణామాత్య తనయ వినయ ధురీణ సకల కళా ప్రవీణ అచ్యుతేంద్ర రఘునాథ భూపాల దత్త హస్తముక్తా కటక విరాజమాన వేంకట కవిరాజ ప్రణీతంబయిన విజయవిలాసంబను మహాప్రబంధము.”

ఈ గద్యను బట్టి ఇతని పేరు చేమకూర వేంకట కవి. తండ్రి పేరు లక్ష్మణామాత్యుడు సూర్య నారాయణుల దయచే ఇతనికి కవితా శక్తి కల్గినది. ఇతడు అచ్యుతారాయల కుమారుడైన రఘునాథరాయల ఆస్థాన కవి. అతనిచే బహుకృతుడు. విజయవిలాస కర్త.

ఇతని గురించి మూడు ప్రశస్త వాక్యములు ప్రచారమునందున్నవి.

1. ఇంటి పేరు నస - కవిత్వం పస.
2. చేమకూర పాకాన పడింది.
3. చక్కెర మడిలో అమృతం పారించి పండించిన చేమకూర.

పైవన్నియు ప్రత్యక్షర సత్యాలు. అసామాన్య కవిరాజయిన రఘునాథరాయలు చేమకూర కవినుద్దేశించి “క్షితి లో నీ మార్గమెవరికిన్ రాదు సుమీ” అని మెచ్చుకున్నాడు.

నస కల చేమకూరను చక్కగా సాహిత్య పాకానుకూలము చేసిన సాహిత్య నల భీమ పాకము చేమకూర కవిత్వము. పైవి రెండును ఇంటి పేరును తీసికొని చేసిన చమత్కారాలే. సాహిత్య కేదారమనే చక్కెర మడిలో అమృత రసం పారించి తీయని కావ్యాలనందించిన కవిమాన్యుడు చేమకూర.

“విజయ విలాసము” నకు పిల్ల వసుచరిత్ర అని పేరు. వసుచరిత్ర సంస్కృత పద శ్లేష యమకములతో వైచిత్రి సాధించబడెను. విజయ విలాసమున తెలుగు మాటల చే తెలుగు పదబంధములచే యమక విన్యాసము చేసిన కవి చక్రవర్తి చేమకూర. ఈ కవి శేముషీ వైభవాన్ని మెచ్చని వారుండరు.

“తారస పుష్టిమై, ప్రతిపదమ్మున జాతియు వార్తయు చమ
త్కారము నర్థగౌరవము కల్గ ననేక కృతుల్ ప్రసన్న గం
భీరగతిన్ రచించి మహి మించినచో యిక శక్తులెవ్వర
య్యా రఘునాథ భూప రసికాగ్రణికిం చెవిసోక చెప్పగాన్. 

- డా. ద్వా. నా. శాస్త్రి

“ఏగతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా” - అని తన జీవితము లోని బాధ చేమకూర వ్యక్తీకరించినాడు. మహాకవులకును ఇది తప్పదు. ఈయన యమక చక్రవర్తి యనుట లో సందియము లేదు.

- కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ.

“విజయ విలాసము”లోని అచ్చతెలుగు పదాలరాశి లో మచ్చుకు ఒక గుప్పెడు చూద్దాం. ఒరిమ = పొత్తు ,భక్తి; అంకిలి = మర్మం; నచ్చికము = కొరత; పింజ పింజ గాగ = పుంఖానుపుంఖంగా; రా కొట్టడం = రా అని తక్కువ చేసి పిలవడం; ఢక్కగొను = పోటీకి ప్రేరేపించు ఇట్లాంటి అచ్చ తెలుగు ప్రయోగాలు కోకొల్లలు.

జాతీయాలు, సామెతలు, పదబంధాలలో కొన్ని:-

చెప్పగిప్పరాదు = చెప్పడానికి కాదు కదా కనీసం అందుకు ప్రయత్నం కూడా అసాధ్యమే.

లేదు బంతను=సహపంక్తి భోజన అర్హత లేదు.

త్రోసి రాజను = చదరంగపు ఆట లోని పారిభాషిక పదం. బంటును ముందుకు త్రోసి రాజును కదలనీయకుండా చేయడం.

“అట్టి సవ్యసాచిన్ ఇంద్రోపల రోచి చూచి తలయూచీ ఉలూచి రసోచితంబుగన్” అని చేమకూర యమకమా అని భ్రమింప చేయు శబ్దానుప్రాసల సవ్యసాచిత్వము చూపెను. ఇంద్రనీలమణుల శరీర కాంతి కల అర్జునుని చూచి తల ఊచి, ఉలూచి రస + ఉచితంబుగన్ ఇట్లనుకొనెను.

“కమ్మని జాళువాఒరవ గల్గిన చెక్కుల టక్కువాడు చొ
క్కమ్మగు జాతి కెంపు వెల గాగొను మోవి మెరుంగు వాడు స
త్యమ్మగు రూప సంపద ధనాధిపసూనుని ధిక్కరించు వా
డమ్మక చెల్ల! నా హృదయ మమ్మగ చెల్లదు వీనికియ్యెడన్.”

ఓహో !ఆశ్చర్యము !మేలిమి బంగారమునకు ఒరపు పెట్టెడు చెక్కుల టెక్కు గల అచ్చమైన జాతి కెంపును వెల యిచ్చి కొనగల అరుణారుణాధరములతో ప్రకాశించువాడు ,కుబేర కుమారుడైన నలకూబరుని రూప సంపద యందు మించువాడునూ అయిన ఈ విజయునికి నా మనమును అర్పింపక తప్పదు అని ఉలూచి అర్జునుని మాయతో నాగలోకమునకు కొనిపోయెను.

అర్జునుడు మేల్కొని ఉలూచి సౌందర్యము నిట్లు మెచ్చెను:-

అన్నన్న! మొగము వెన్నుని
అన్నన్న జయించు, కన్నులన్నన్ నలినా
సన్నములు! నడుము మిక్కిలి
సన్నము! మాటలు సుధారస ప్రసన్నములెన్నన్!!

అన్ను = భార్య.

“కడు హెచ్చుకొప్పు, దానిన్
కడవన్ చనదోయి హెచ్చు, కటియన్నిటికిన్
కడు హెచ్చు, హెచ్చులన్నియు
నడుమే పస లేదు గాని నారీమణికిన్"

ఈ పద్యంలో హెచ్చు అని అంత్యప్రాసలు వాడి సుభద్ర ఔన్నత్యమును చేమకూర చెప్పెను. కాని నడుము మాత్రము సన్నము అదియునందమే! వ్యాజస్తుతి అలంకారము.

ఆమె చెవులను “జలరుహగంధి వీనుల పసల్ నవసంఖ్య నదేమి లెక్కను” అని వర్ణింపబడింది. ఆమె చెవులు తొమ్మిది అంకె కంటే ఆకార సౌష్టవం కలిగి ఉన్నాయని భావం.

డాలు వాలు చూపు:

సుభద్ర చూపును అంగజు డాలు వాలు చూపుంగవ” అని వర్ణింపబడినవి. వాలు చూపు గవ = సోగ కన్నుల జంట; అంగజు= మన్మథుని ;డాలు = కేతనం; మీన కేతనం; సాధారణార్థం. అంగజు డాలు = వాలు = మీనం అని కూడ ధ్వని. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.

ముక్తాయింపు:

విజయ విలాసం లోని భాషా సౌందర్య మర్మములను త్రవ్వినకొద్ధి చవులూరిస్తూనే ఉంటాయి. శాలీ పులాక న్యాయంగా పాఠకుల ముందుంచడం జరిగినది. ఔచిత్యము ననుసరించి మనకందించిన వారసత్వపు భాషా నిధులను సాహితీ విజయ భవనాన్ని సంరక్షించు కోవాల్సిన బృహత్తర కర్తవ్యం మనందరిది.