ఉపోద్ఘాతం:

కర్మ అంటే చేయబడేది అని అర్ధం. 'క్రియతే ఇతి కర్మ' అని వ్యుత్పత్తి, సమస్త ప్రాణుల జన్మకీ జీవన నిర్వహణకి దేహం నుండి జీవుని ఉత్క్రమణకి కూడా హేతువు కర్మయే. వేదం భారతీయ విజ్ఞాన సర్వస్వానికీ మూలం. ఆ వేదంలో కర్మ, జ్ఞానం అనే రెండు విషయాలు ప్రతిపాదింప బడ్డాయి. స్వర్గ మోక్షస్వరూపుడైన పరమాత్మ కర్మకాండ, జ్ఞానకాండ అనే రెండింటి చేతనే పొందదగ్గవాడు.

కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే

స్వర్గాప వర్గ రూపాయ యజేశాయ నమో నమః

కర్మాచరణం వల్ల స్వర్గం లభిస్తుంది. జ్ఞానం వల్ల ముక్తి ప్రాప్తిస్తుంది.

పక్షులు తమ గమనాన్ని చేరుకోడంలో వాటికిగల రెండు రెక్కలు కారణంగా నిలుస్తాయి. అలాగే పరమగతిని పొందడానికి జ్ఞానం, కర్మ అనే రెండూ పరమోపాయాలు.

ఉభాభ్యామేవ పక్షాభ్యాం యథా భే పక్షిణాం గతిః

తథైవ జ్ఞాన కర్మాభ్యాం నియతా పరమాగతిః

కర్మమార్గాన్ని అవలంబించిన జనకుడు అశ్వపతి మున్నగువారు ముక్తిపొందేరు. "కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః" (3. 20) అని భగవద్గీత కర్మాచరణ ప్రాశస్త్యాన్ని తెలుపుతోంది.

కర్మతత్త్వం - శ్రీమద్భగవద్గీత:

కర్మతత్త్వానికి సంబంధించిన పెక్కు విషయాలని శ్రీమద్భగవద్గీత ఎంతో నిశితంగా విశ్లేషించి స్పష్టంగా నిరూపిస్తోంది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:

1) లోకంలో ఒక్క క్షణంకూడా కర్మని ఆచరించకుండా ఏ ప్రాణీ ఉండదు.

"న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్" (3-5)

 2) భగవద్విషయంకంటే ఇతరమైన కర్మచేత ఈలోకం బంధింపబడింది.

 "యజ్ఞార్థాత్కర్మణో న్యత్ర లోకోయం కర్మబంధనః" (3-9) కర్మచేతనే లోకం నడుస్తోందని తాత్పర్యం.

 3) తన ప్రకృతికి చెందిన సత్త్వరజస్తమోగుణాలకి వశుడై ప్రతివ్యక్తీ కర్మని ఆచరిస్తూ ఉంటాడు.

“కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణై:” (3-5)

 4) కర్మని ఆచరింపకపోతే జీవనం గడవదు.

“శరీర యాత్రా పిచతే న ప్రసిద్ధ్యేదకర్మణః” (3-8)

5) ప్రకృతికి సంబంధించిన సత్వరజస్తమోగుణాలచేతనే ప్రతివ్యక్తి అన్ని విధాల కర్మని ఆచరిస్తాడు. కాని అజ్ఞానంతో నిండిన మనస్సుగలవాడై నేనే ఆచరిస్తున్నాను, నేను కర్తని అని భావిస్తూయుంటాడు.

“ప్రకృతేః క్రియమాణాని గుణై: కర్మాణి సర్వశః

అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే॥“ 3.27.

6) ఈశ్వరుని కోసమే కర్మని ఆచరించాలి. ఫలాపేక్ష పొందకుండా కర్మ నిర్వహించాలి.

“తదర్థం  కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర” (3-9)

7) ఫలమందు ఆసక్తిని వీడి కర్మ ఆచరించినవాడు మోక్షాన్ని (పదాన్ని) పొందుతాడు.

“అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః” (3-19)

8) కర్మని ఆచరించడంలోనే నీకు అధికారం ఉన్నది. ఏనాడూ ఫలమందు నీకు అధికారం లేదు. ఫలానికి నీవు హేతువు కాకూడదు. అట్లని కర్మని విడిచి పెట్టడంలో ఆసక్తిని పొందకు.

 కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన

మా కర్మఫలహేతుర్భూః మాతే సంగో స్త్వకర్మణి (2-47)

ఫలాపేక్షతో కర్మని ఆచరించరాదు. ఫలమందు ఎవ్వరికీ అధికారంలేదు కాబట్టి ఈ కర్మ నేను చేస్తున్నాను అనే దృష్టితో కర్మ ఆచరిస్తే ఫలం తప్పకుండా అతనికి చెందుతుంది. అది క్రమంగా జన్మపరంపరకి ఆధారమౌతుంది. కాబట్టి కర్త్మత్వాస్త్రి పొందకూడదు. అప్పుడు కర్మఫలానికి తాను కారణం కాదు. కర్మ ఆచరిస్తే, ఫలం ప్రాప్తిస్తుంది, దానివల్ల జన్మ లభిస్తుంది. కాబట్టి కర్మ ఆచరించకుండా. ఉంటాను అనే ఆలోచన కల్గకూడదు. అంటే అకర్మయందు ఆసక్తి కల్గకూడదు.

9) కోరికలు పొందడం కోసం చేసే కర్మలు కామ్యకర్మలు. అవి తప్పక విడువదగ్గవి. కాని యజ్ఞం దానం తపస్సు అనేవి మాత్రం తప్పక ఆచరింపదగ్గవి. ఆ కర్మలు బుద్ధిమంతులకి చిత్తశుద్ధిని కల్గిస్తాయి. పవిత్రమైనవి.

యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్

యజ్ఞో దానం తపశ్చైన పావనాని మనీషిణామ్ (18-5)

10) యజ్ఞదానాది కర్మలు చేయదగ్గవే అయినప్పటికీ ఆ కర్మలని నేను చేస్తున్నాను. అనే భావన పొందకూడదు. కర్తృత్వాన్ని విడిచిపెట్టి ఫలాన్ని ఏ మాత్రం కూడా అపేక్షించకుండా ఆ కర్మలని ఆచరించాలి. అది స్థిరం ఉత్తమం అని నా నిశ్చయం.

ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ

కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్ (18-6)

ఈ అభిప్రాయాలు అన్నీ బాగా ఆలోచించి మనస్సులో స్థిరంగా నిల్పుకోదగ్గవి. జీవితంలో అడుగడుగునా అనుసరింపవలసిన మార్గాలు, ముక్తి పథ సోపానాలు.

కర్మతత్త్వం - సుభాషితాలు: 

కర్మ ఎంతో బలీయమైనది. అందరూ కర్మకు అధీనులే. ఎవ్వరూ కర్మబంధాన్ని త్రెంచుకొని తప్పించుకోలేదు. భర్తృహరి కర్మయొక్క శక్తి ఎంత మహత్తరమైనదో ఇలా చమత్కరించేడు.

బ్రహ్మా యేన కులాలవన్నయమితో బ్రహ్మాండ భాండోదరే

విష్ణు ర్యేన దశావతార గహనే క్షిప్తః సదా సంకటే

రుద్రో యేన కపాలపాణి పుటకే భిక్షాటనం కారితః

సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణే

బ్రహ్మ కుమ్మరి వలె బ్రహ్మాండం అనే కుండమధ్యలో ఉంచబడ్డాడు. విష్ణువు పది అవతారాలు అనే దుర్భరమైన కష్టమందు విసరివేయబడ్డాడు. రుద్రుడు దొప్పవంటి చేతిలో కపాలం పట్టుకుని బిచ్చమెత్తుతున్నాడు. సూర్యుడు ఆకాశంలో నిత్యమూ తిరుగుతూనే ఉన్నాడు. బ్రహ్మాదులు ఆయా అవస్థలు అనుభవించడానికి కర్మయే కారణం. అంతటి శక్తి గల కర్మకు నమస్కారం అని తాత్పర్యం. బ్రహ్మాదులని కూడా దుర్భరమైన అవస్థలలో ఉంచే శక్తి కర్మకు ఉన్నదని భావం.

పుట్టిన ప్రతి ప్రాణికీ సుఖదుఃఖాల అనుభూతి కల్గక తప్పదు. సుఖం లభించినప్పుడు తన ప్రజ్ఞా వైభవంచే పొందుతున్నట్లు గర్విస్తాడు. దుఃఖం ప్రాప్తించినప్పుడు ఎవరివల్లనో అది సంక్రమించినట్లు ఇతరులని నిందిస్తాడు. తాను ఇంతకుముందు ఆచరించిన కర్మయే సుఖదుఃఖ రూపంలో అనుభవింపబడుతోందని గుర్తించడు. ఇది లోక సహజం. అటువంటి వారి కోసం భర్తృహరి అద్భుతంగా ఈ శ్లోకం రచించేడు.

సుఖస్య దుఃఖస్య న కో2పి దాతా

పరో దదాతీతి కుబుద్ధి రేషా

అహంకరో మీతి వృథాభిమానః

స్వ కర్మసూత్ర గ్రథితో హి లోకః

సుఖానికి దుఃఖానికి దాత ఎవ్వడూ లేడు. ఇచ్చేవాడు ఎవడో ఉన్నాడు అనుకోడం చెడుతలంపు, కర్మని చేసేటప్పుడు ‘నేను చేస్తున్నాను’ అని కర్తృత్వాన్ని భావించడం వ్యర్ధమైన అహంకారం. లోకం తన కర్మ అనే త్రాడుతో గ్రుచ్చబడి ఉంటుంది అని భావం. తానాచరించిన కర్మవల్లనే సుఖాన్నో దుఃఖాన్నో ప్రతివ్యక్తీ అనుభవిస్తాడని తాత్పర్యం.

కష్టాలని అనుభవిస్తున్నప్పుడు ’అది పూర్వం ఆచరించిన కర్మఫలం, దాన్ని అనుభవిస్తేగాని తీరదు’ అని భావించినప్పుడు మనస్సుకి ఊరట లభిస్తుంది. బాధ ఉపశమిస్తుంది. ’సత్కర్మ ఆచరణవల్లనే సుఖాన్ని అనుభవిస్తున్నాను’ అని తలంచినప్పుడు నిత్యమూ సత్కర్మని ఆచరించాలన్న సంకల్పం కల్గుతూ ఉంటుంది. దుష్కర్మలని దూరంగా ఉంచడానికి వీలుపుతుంది.

నన్నయ్య భారతం - కర్మతత్త్వ విచారణ:

నన్నయ, తిక్కన, ఎఱ్ఱాప్రగ్గడ అనే కవిత్రయం తమ భారతాంధ్రీకరణలో పెక్కు సందర్భాలలో కర్మతత్త్వాన్ని వివేచించి విశదీకరించారు. కథాగతంగా వారు గావించిన కర్మతత్త్వోపదేశం అందరూ గ్రహించి జీవితంలో ఆచరింపదగ్గది.

 ఆదిపర్వం: 

1. మాండవ్యుడు అనే మహర్షి గొప్ప తపస్సంపన్నుడు. అకారణంగా ఆ నగర ప్రభువు అతనికి శూలప్రోత శిక్షని విధించేడు. ఊరి అవతల శూలానికి శరీరాన్ని గ్రుచ్చియుంచడం శూలప్రోతశిక్ష అనిపించుకొంటుంది. ఆ మాండవ్యముని ఆ శిక్షని అనుభవిస్తున్నప్పుడు రాత్రులపూట కొందరు మహర్షులు పక్షుల రూపంలో చేరి "ఓ మునీంద్రా! నీవు భూరి తపోధనుడవుగదా, నీకు ఈ కష్టాన్ని ఎవరు కల్గించేర” అని ప్రశ్నిస్తారు. దానికి అతడు వారితో ఇలా అంటాడు.

“ఎఱిఁగి యెఱిఁగి నన్నడుగంగనేల

దీని సుఖము దుఃఖంబు ప్రాప్తించుచోట నరుఁదు

దగిలి తన కర్మ వశమునఁ దనకుఁ దాన

కర్తగా కన్యులకు నేమి కారణంబు” (4-267)

మీరు జ్ఞానులు సర్వం తెలిసినవారు. నన్ను ఇలా ఎందుకు అడుగుతారు? సుఖంగాని, దుఃఖంగాని ప్రాప్తిస్తే దానికి కర్త తానే అవుతాడు. తాను పూర్వం ఆచరించిన కర్మ వెంటదగిలి వస్తుంది. కాబట్టి ఆ సుఖ దుఃఖాల అనుభవానికి తానే కర్త గదా. ఆ సుఖదుఃఖానుభవానికి ఇతరులు ఎట్లు కర్తలవుతారు? అని భావం.

సంస్కృత భారతంలో వ్యాసభగవానుడు "దోషతః కం గమిష్యామిహిమే. పరాధ్యతి" అని రచించినాడు. మాండవ్యముని ఆ తపోధనులతో ఎవనియందు దోషాన్ని ఆరోపిస్తాను? నాకు అపరాధం చేసినవాడు ఎవ్వరూ లేదు అని చెప్పినాడని భావం.

తాను పూర్వం ఆచరించిన కర్మ తన వెంటననుసరించి సుఖాన్నో దుఃఖాన్నో కల్గిస్తుంది. తన సుఖదుఃఖాలకి తానే కర్త అని నన్నయ స్పష్టంగా ఉపదేశించాడు. వ్యాసుని ఆశయాన్ని విశదీకరించేడు.

అనంతర కథలో ఆ మాండవ్యముని యమధర్మరాజుని చేరుతాడు. అతణ్ణి "బ్రాహ్మణుడైన నాకు ఈ శూలారోపణ శిక్ష ఎందుకు విధింపబడింది?" అని ప్రశ్నిస్తాడు.

 

అప్పుడు యముడు కారణాన్ని ఇలా వివరిస్తాడు.

సొలయక తూనిగలం గొ

ఱ్ఱల బెట్టితివి నీవు చిఱుతకాలము త

త్ఫల మిప్పుడనుభవించితి

తొలఁగునె హింసాపరులకు దుఃఖ ప్రాప్తుల్ (4-271)

 

చిన్నతనంలో నీవు ఏమాత్రమూ వెనుకంజ వేయకుండా తూని (రీ) గలని కొఱ్ఱుకి గ్రుచ్చే వాడివి. ఆ పాపఫలాన్ని ఈ శిక్షారూపంలో అనుభవించేవు. హింసయందు ఆసక్తిగల వారికి దుఃఖం ప్రాప్తించక తప్పదు. ఏ విధంగానైనా ఆ దుఃఖ ప్రాప్తి తొలగదు అని భావం.

 

వ్యాస భారతంలో ధర్మదేవత చెప్పిన సమాధానం ఇలా ఉన్నది.

పతంగికానాం పుచ్చేను త్వయేషినా ప్రవేశితా

కర్మణస్తస్య తే ప్రాప్తం ఫలమేతత్ తపోధన!

స్వల్పమేవ త్వయా దత్తం దానం బహుగుణం భవేత్

అధర్మ ఏవం విప్రర్షే! బహుదుఃఖ ఫలప్రదః (107-11, 12)

 

“ఓ తపోధనా! తూనిగల వెనుకభాగాలని దర్భతో గ్రుచ్వేపు దాని ఫల ఇది" అని చెప్తూ యముడు "స్వల్పంగా ఎవరికైనా దానం ఇస్తే ఎక్కువ ఫలం లభిస్తుంది. అట్లే అధర్మం స్వలంగా ఆదరించినప్పటికీ ఎంతో దుఃఖాన్ని కల్గిస్తుంది" అని హెచ్చరించినట్లు వ్యాసుని రచనం.

2. ఒక చోట ఋషి దంపతులు లేళ్ల రూపాన్ని ధరించి గాఢమైన అనురాగం క్రీడిస్తూంటారు. వేటయందు మిక్కుటమైన ఆసక్తిగల పాండురాజు ఆ లేళ్లపై ఐదు బాణాలు ప్రయోగిస్తాడు. అవసానదశలో నున్న ఆ మృగం ఆ మహారాజుని "నీపు ప్రియాసంగమం చేసినపుడు మరణిస్తావు" అని శపిస్తుంది. అప్పుడు పరమనిర్వేదం పొందిన ఆ పాండు మహారాజు ఇలా అనుకొంటాడు.

 

ఎట్టి విశిష్ట కులంబునఁ

బుట్టియు సదసద్వివేకములు గల్గియు మున్

గట్టిన కర్మ ఫలంబులు

నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్! (5-58)

 

“మహామహుల జన్మకి ఆధారమైన విశిష్టమైన వంశంలో జన్మించినప్పటికీ, స్వయంగా మంచిచెడ్డల వివేచన చేయగల సమర్థులైనప్పటికీ తమకు సంక్రమించిన పూర్వజన్మ కర్మఫలాలని అనుభవించకుండా మనుష్యులు తప్పించుకోలేరు. అనుభవించి తీరవలసిందే” అని భావం. "ఆవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్" అనే వాక్యానికి ఈపద్యం వివరణ ప్రాయం.

విశిష్టమైన కులంగానీ, విజ్ఞానం గానీ కర్మఫల అనుభవాన్ని తప్పించలేవు. ఫలాన్ని అనుభవింపవలసిందే అని తాత్పర్యం. ఉత్తమ కులంలో పుట్టిన వారు కూడా దుర్గతిని పొందుతారని వ్యాసమహర్షి ఇలా ప్రవచించినాడు.

 

సతామపి కులే జాతాః కారణా బత దుర్గతిమ్

ప్రాప్నువంత్య కృతాత్మానః కామజాల విమోహితాః (118-2)

 

వ్యాసులవారి వాక్కు సూత్రప్రాయంగా ఉన్నది. నన్నయది వివరణాత్మకంగా ఉన్నది. నన్నయగారి పద్యంలోని "సదసద్వివేకములు గల్గియున్" అనేది అమూలకం. వ్యాసుడు చెప్పనిది. చేసిన కర్మయొక్క ఫలాన్ని సదసద్వివేకములు కల్గినప్పటికీ అనుభవించక తప్పదు అనే నన్నయగారి సందేశం తప్పక గ్రహింపదగ్గది.

3. దుర్యోధనాది కురుకుమారులతో భీముడు గంగయందు జలక్రీడ సలిపి అలసి ప్రమాణకోటియందు నిద్రపోతాడు. అప్పుడు పాపబుద్ధియైన దుర్యోధనుడు అతణ్ణి లతాపాశాలతో బంధింపజేసి గంగమడుగులోనికి త్రోయిస్తాడు. భీముడు తెలివినొందిన తర్వాత గట్టిగా నీల్గగా లతాపాశబంధాలు తెగిపోతాయి. అతడు నీటి నుండి బైటకువస్తాడు.

కర్మబంధాలు తొలగగా పుణ్యగతికి వెడలిన పురుషునివలె భీముడు లతాబంధాలు తెగిపోగా బైటకు వచ్చినాడని నన్నయ ఇలా పేర్కొన్నాడు.

 

కర్మ బంధనములు గ్రక్కునఁ బాయుడుఁ

బుణ్యగతికి నేఁగు పురుషునట్లు

బంధనంబు లెల్లఁ బాయుడు భీముండు

నీరిలోననుండి నెగయుదెంచె (5-173)

పుణ్య పాపకర్మల ఫలములు బంధాలు. అవి ఉన్నంతకాలం జీవుడు జనన మరణ రూపమైన సంసారంలో మునుగుతూ తేలుతూ ఉంటాడు. వివిధములైన అవస్థలు అనుభవిస్తూంటాడు. ఆ కర్మబంధాలు తొలగినపుడు పుణ్యలోకాలు పొందుతాడు. కర్మబంధాలు ఉత్తమలోక ప్రాప్తికి ప్రతిబంధకాలు. "కర్మబంధాలు ఒక్కసారిగా తొలగగా పుణ్యలోకానికి వెళ్లే పురుషునివలె” అనే పోలిక అమూలకమైన కల్పన. వ్యాస భారతంలో లేనిది.  కర్మతత్త్వాన్ని నన్నయ చక్కగా ఆవిష్కరించినాడు.

4. లక్క ఇల్లు కాలిన తర్వాత పాండవులు సొరంగం ద్వారా మహాటవిలో ప్రవేశిస్తారు. ఒక మట్టిచెట్టు క్రింద ఉంటారు. అప్పుడు వ్యాసమహర్షి వచ్చి ఓదారుస్తూ వారికి కలిగిన దుఃఖానికి గల కారణాన్ని ఇలా వివరిస్తాడు.

"మీకు బాంధవ వియోజనంబైన ఈ కర్మంబు పురాకృతంబు. దీనికి శోకింప వలవదు. కొండొక కాలంబునకు మీరును బాంధవులునుంగలిసి యెప్పటియట్ల రాజ్యంబు సేయుదురు” (6-23)

“బంధువులని విడిచిపెట్టడం అనే ఈ కర్మ మీరు పూర్వం చేసుకొన్నదే. దీనికి దుఃఖింపరాదు. తిరిగి కొంతకాలానికి బంధువులని కలుస్తారు. పూర్వంవలె రాజ్యాన్ని పాలిస్తారు” అని వ్యాసుని ఓదార్పు.

మూలమైన వ్యాసభారతంలో "మయేదం వ్యసనం పూర్వం విదితమ్" అంటాడు. మీకు కలిగే ఈ కష్టం నాకు ముందుగానే తెలుసు అని అర్ధం. నన్నయ దీన్ని మార్చి "ఈ బంధువియోగం అనే కర్మ మీరు పూర్వం చేసుకొన్నదే. దీనికి శోకింపవలదు" అని రచించినాడు. పూర్వం ఆచరించిన కర్మయొక్క ఫలం అనుభవింపక తప్పదని దానికి దుఃఖింపవలసిన అవసరంలేదని అనుభవించి తీరవలసిందేయని లోకానికి నన్నయ చక్కగా ఉపదేశించినాడు. కర్మ ఫలానుభవ నిరూపణకి నన్నయ ప్రాధాన్యమొసంగినాడు.

5. పాండవులు ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట బ్రాహ్మణరూపం ధరించి కొంతకాలం గడుపుతారు. ఒకనాడు ఆ ఇంటి యజమానుడు ఆ ఊళ్లో ఉన్న బకాసురునికి ఆహారంగా వెళ్లవలసివస్తుంది. కుటుంబంలోని వారు అందరూ దుఃఖంలో మునిగిపోతారు. అప్పుడు అందరూ వింటూండగా కుంతి సమక్షంలో ఆ విప్రుడు ఇలా అంటాడు.

 

“ఆదిని సంయోగ వియో

గాది ద్వంద్వములు దేహియగు వానికి సం

పాదిల్లక తక్కవు పూ

ర్వోదయ కర్మమున నెట్టియోగికి నయినన్” (6-247)

పూర్వజన్మలో చేసిన కర్మయొక్క ప్రభావంవల్ల శరీరంపొందిన ప్రతీవ్యక్తికీ కలియడం విడిపోవడం వంటి జంటలు పుట్టినప్పటినుండి సంభవింపక తప్పదు. అతడు యోగి అయినా సరే. ఈ సంయోగ వియోగాలూ, సుఖదుఃఖాలూ మొదలైన ద్వంద్వాలు అతనికి తప్పక ప్రాప్తిస్తాయి. ఆ అనుభవం నుండి ఎవ్వడూ తప్పించుకోలేడని తాత్పర్యం.

బ్రాహ్మణుడు పల్కిన ఈ మాట సంస్కృత భారతంలో మృగ్యం. నన్నయ మాత్రమే రచించినాడు. కర్మానుభవాన్ని ఎవ్వడూ తప్పించుకోలేదని లోకానికి ఉపదేశించడం కోసమే నన్నయ అమూలకంగా ఈ పద్యాన్ని రచించినాడు. “వియోగం సంభవిస్తే అది కర్మఫలంగా భావించాలి. తీవ్రంగా క్షోభ పొందకూడదు. ఊరట పొందాలి” అని నన్నయగారి ఉపదేశం.

అంతేగాదు ఆ బ్రాహ్మణుడు "నేనూ ఈ సంతానమూ ఈ ధర్మపత్నీ ఏ యుపాయంచే ఈ విపత్తుని దాటగల్గుతాము? ఇప్పుడు చేయవలసింది ఏమున్నది? ఇక్కడ మనం ఉండకూడదు. ఎక్కడకైనా పోదామని ఇంతకు మునుపు ఎంతగానో చెప్పినప్పటికీ ఈమె (భార్య) వినలేదు. ఇట్టి భయంకరమైన కష్టాన్ని ఈ విధంగా విధి కల్గించడానికి నిశ్చయించినపుడు ఎలా తప్పించుకోగల్గుతాము? కర్మఫలం పండినప్పుడు ఎవడు దాన్ని అతిక్రమించగలడు?" అని ఇలా విలపిస్తాడు.

 

ఏనును బ్రజలును నీ ధర్మపత్నియు నేయుపాయంబున నిబ్బారిఁగడవ

గానేర్తుమెయ్యది గర్ణమిందుండఁగా దేగుదమ యొందు గడకని ముంద

రేనెంత చెప్పిననెన్నండు వినద యిది యిట్టి దారుణమెమ్మెయిఁజేయ

గా నున్న విధియేల కడవంగనిచ్చు గర్మ విపాకంబు గడవంగ లావె (6-250)

పరిపక్వమైన కర్మఫలాన్ని ఎవడు దాటగలడు? ఎవ్వడూ అతిక్రమించలేదు. అనే భావం కూడా నన్నయగారి స్వీయమే. అమూలకమే. లోకానికి నన్నయ గావించిన ఈ ఉపదేశం ఆవశ్యం స్వీకరించదగ్గది. ఆచరణలో నిల్చుకోదగ్గది.

 

6. బకాసురుణ్ణి చంపడానికి భీముణ్ణి పంపాలని కుంతి నిర్ణయిస్తుంది. దానికి ధర్మరాజు బాధపడతాడు. "విప్రని రక్షణ కోసం కన్నకొడుకుని పంపడం లోక విరుద్ధం. భీముడు పంపదగ్గవాడా?" అని ఆమెతో అంటాడు. అప్పుడు కుంతి ఆ ధర్మరాజుతో "భీముడు బకాసురుణ్ణి చంపి రాక్షసబాధ నివారిస్తాడు" అని చెప్పి బ్రాహ్మణులకు ఇష్టమైన కార్యాన్ని ఆచరింపబూనడం పుణ్యకర్మల ఫలంగదా అని ఇలా అంటుంది.

 

“బ్రాహ్మణులకుఁ బ్రియము పాయక సేయంగ

గాన్ప చూవె పుణ్య కర్మ ఫలము”

బ్రాహ్మణులకి ఇష్టమైన కార్యాన్ని ఆచరించాలని సంకల్పించడం ఎంతో పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం అని నన్నయ గారి ఉపదేశం. ఇది కూడా అమూలకమే.

 

సభాపర్వం:

7. పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పణంగా అనుద్యూతానికి ధర్మరాజుని ఆహ్వానిస్తూ ధృతరాష్ట్రుడు ప్రాతిగామి ద్వారా వార్త పంపుతాడు. ధర్మరాజు సోదరులతో వచ్చి పందెంలో అధర్మంవల్ల శకునికి ఓడిపోతాడు. అప్పుడు నన్నయ ఇలా అంటాడు.

 

ధర్మసుతుఁ దొడ్డి శకుని క

ధర్మస్థితి నోటువడియె దైవము చెయిదిన్

నిర్మితమయిన శుభాశుభ

కర్మఫలంబెట్లు దేహిగడవఁగ నేర్చున్ (2-279)

 

అధర్మం యొక్క ప్రభావం వల్ల ధర్మరాజు విధివశాత్తు శకునికి ఓడిపోయేడు. శుభాశుభ కర్మఫలాన్ని మనుష్యుడు ఎట్లు అతిక్రమింపగలదు? అని భావం. దాటలేదు. అనుభవించ తీరవలసిందే అని తాత్పర్యం.

అనుద్యూతానికి ధృతరాష్ట్రుని ఆహ్వానాన్ని ప్రాతిగామి తెలుపగా ధర్మరాజు వింటాడు. అప్పుడు సోదరులతో అన్నమాటలని వ్యాసభగవానుడు ఇలా పేర్కొన్నాడు.

ధాతుర్నియోగాద్భూతాని ప్రాప్నువంతి శుభాశుభమ్

న నివృత్తి స్తయోరస్తి దేవితవ్యం పునర్వది||

 

అక్షద్యూతే సమాహ్వానం నియోగాత్ స్ధవిరస్య చ

జానన్నపి క్షయకరం నాతిక్రమితుముత్సహే|| (76- 3,4)

విధి అదేశంవల్ల సమస్త ప్రాణులు శుభాన్నీ అశుభాన్ని పొందుతూ ఉంటాయి. వాటి నుండి తప్పించుకోవడం సాధ్యంకాదు. వృద్ధుడైన ధృతరాష్ట్రుడు నియోగింపగా పాచికల జూదానికి ఆహ్వానం వచ్చింది. జూదం నాశనానికి హేతువు అని తెలుసు. అయినప్పటికీ తప్పించు కోవాలని తలంచడం లేదు అని భావం.

శుభాశుభ కర్మఫలాన్ని తప్పించుకోడం సాధ్యంకాదన్న విషయం సంస్కృతాంధ్ర భారతాలు రెండూ ఉపదేశిస్తున్నాయి. సంస్కృత భారతంలో అనుద్యూతానికి ఆహ్వానం రాగానే ధర్మరాజు తమ్ముళ్లతో ఆ విషయాన్ని చెప్పినట్లు వ్యాసుడు రచించినాడు. ధర్మరాజు జూదంలో ఓడిపోయిన తర్వాత కవిగా నన్నయ చెప్పినట్లు తెలుగుభారతంలో రచింపబడింది. సందర్భంలో ముందు వెనుకలు ఉన్నప్పటికీ రెండింట ఉపదేశం మాత్రం సమానమే.

అరణ్యపర్వం:

8. పాండవులు ద్వైతవనంలో అరణ్యవాస నియమాన్ని పాటిస్తున్న కాలంలో తన భర్తలు అనుభవిస్తున్న కష్టాలకి ద్రౌపది తీవ్రంగా పరితపిస్తుంది. ధర్మరాజుతో ఆమె కౌరవుల విషయంలో క్షమాగుణం ప్రదర్శించడం అనుచితమని ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తున్న కౌరవుల విషయంలో ధర్మపాలన గావించడం సముచితం కాదని సుదీర్ఘంగా ప్రసంగిస్తుంది. ఆ ఇరువురి వాదోపవాదాలలో కర్మతత్త్వానికి చెందిన అంశాలు ఎన్నో ముచ్చటింపబడ్డాయి.

ఆ సందర్భంలో ధర్మరాజు నాస్తికులవలె ధర్మదూషణ చేస్తున్నావని ఆమెను మందలిస్తాడు. ధర్మంయొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తాడు. కర్మల స్వరూపాన్ని ఇలా విశదీకరిస్తాడు.

“తపస్స్వాధ్యాయ బ్రహ్మచర్య (దానధర్మ) యజ్ఞంబులను పుణ్య కర్మంబుల ఫలంబులగునేని దీనినేల ఋషిగణంబులు సేవింతురు? నీ జన్మంబును దృష్టద్యుమ్ను జన్మంబును బుణ్య కర్మ ఫల సద్భావంబునకు నిదర్శనంబులు గావె? మణి పుణ్య ఫలంబులు గలట్లు పాపఫలంబులునుం గలవు, తొల్లి బ్రహ్మ తన పుత్రులకుం గర్మఫల సద్భావంబు సెప్పెనందుఁ గశ్యపుండు ధర్మ ప్రబోధంబునంజేసి పుణ్యఫల ప్రాప్తుండయ్యె విధాతృ నియోగంబునం బుణ్య పాపఫలంబు సంప్రాప్తంబగు విధాత్రననుగ్రహంబుననగాదె పుణ్యకర్మంబులు ప్రవర్తించి. మర్త్యులమర్త్యత్వంబును బొందుదురు" (1-230)

తపస్సు, వేదాధ్యయనం, బ్రహ్మచర్యం, దానం, ధర్మం, యజ్ఞం అనే పుణ్యకర్మలు ఫలాన్ని ఈయనివే అయితే వీటిని ఋషిగణాలు ఎందుకు సేవిస్తారు? నీ (ద్రౌపది) జన్మ, దృష్టద్యుమ్నుని జన్మకూడా పుణ్యకర్మల ఫలంగా చెప్పడానికి నిదర్శనాలు గదా. పుణ్యకర్మల ఫలం ప్రాప్తించేటట్లు పాపకర్మల ఫలంకూడా లభిస్తుంది. పూర్వం బ్రహ్మ తన కుమారులకి కర్మఫలంవల్ల కలిగే జన్మలని చెప్పినాడు. అందులో కశ్యపుడు ధర్మ జ్ఞానంచేత పుణ్యఫలాన్ని పొందినాడు. బ్రహ్మ నియోగంచేత పుణ్యపాప కర్మల ఫలం. కల్గుతూ ఉంటుంది. అతని అనుగ్రహంచేతనే మానవులు పుణ్యకర్మలు ఆచరించి దివ్యత్వాన్ని పొందుతారు. అని భావం.

ధర్మరాజు గావించిన ఈ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

1) తపస్సు వేదాధ్యయనం బ్రహ్మచర్యం దానం ధర్మం యజ్ఞం అనేవి పుణ్యకర్మలు. అవి సత్ఫలితాన్ని ఇస్తాయి. "యజ్ఞం దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్" (18-5) అని భగవద్గీతావచనం కూడా.

2) ద్రౌపది దృష్టద్యుమ్నుడు అగ్నికుండం నుండి అయోనిజులుగా జన్మించడంచేత పుణ్యకర్మలు ఆచరిస్తే తత్ఫలంగా ఉత్తమ జన్మ లభిస్తుంది.

(3) పుణ్యకర్మలు పాపకర్మలు రెండూ కూడా అనుగుణమైన ఫలాన్ని ఇస్తాయి.

4) ధర్మజ్ఞానం చేత పుణ్యఫలం లభిస్తుంది.

5) భగవంతుని నియోగంచేతనే పుణ్యపాపకర్మల ఫలాన్ని అందరు అనుభవిస్తారు.

6) పుణ్య కర్మలు ఆచరించడంవల్ల మరణశీలంగల మానవులు దేవతలుగా కూడా అవుతారు.

ఉత్తమ జన్మప్రాప్తికీ దివ్యత్వం పొందడానికీ పుణ్యకర్మలు కారణం అవుతాయి. -కాబట్టి అందరూ వాటినే తప్పక ఆచరించాలని మహాభారతం ఉపదేశిస్తోంది.

ద్రౌపది పలుకులను తిరస్కరిస్తూ ధర్మంయొక్క ప్రాశస్త్యాన్ని ఉగ్గడిస్తూ భాషింపగా ఆమె పశ్చాత్తాపం పొంది అతనితో ఇలా అంటుంది.

 

కర్మఫలము లేదు కర్మ ఫలావాప్తికిఁ

కారణంబు విధియుఁ గాదనంగ

నంతయెఱుక లేనె యార్తనై విధిచెయ్దు

కలిసి పలికితిం బ్రియంబు దప్పి (1-231)

 

కర్మకు ఫలం లేదు. కర్మఫల ప్రాప్తికి విధి కారణం కాదు" అని చెప్పడానికి ఆమాత్రం తెలియని దాననా? పడుతున్న బాధ విరియొక్క ప్రేరణ కలిసేయి. ఆ కారణంగా అప్రియాన్ని ఆ విధంగా పలికేను" అని భావం. పూర్వం నీతి శాస్త్ర నిపుణులైన బ్రాహ్మణులు తన తండ్రికి వివరించగా తాను విన్నట్లు ద్రౌపది అకర్మ స్వరూపాన్ని ధర్మరాజుకి ఇలా విపులంగా విన్నవించుకొంటుంది.

 

"ఎఱుక గల వారికి గర్మంబు కర్తవ్యంబు

గర్మరహితులయి స్థావరంబుయట్లు జీవింపనేరదు.

అల్ప ఫలంబునైనను గర్మంబుఁ బ్రవర్తించుచున్న వారిం

జూచెదము. దైవమానుషంబులు గర్మఫల ప్రాప్తికి

నిమిత్తంబులు పురుషుందు మనంబున సరసిద్ధి

నిశ్చయించి కర్మంబునందుఁ గృతోత్సాహుందు గావలయు

నట్టివానికి దైవంబు సహాయంబు కర్మ సిద్ధిగావించు" (233)

 

అంతో ఇంతో జ్ఞానంగలవారు అందరూ కర్మని ఆచరించి తీరవలసిందే. కర్మ చేయకుండా చెట్లూ చేమలవలె ఎవ్వరూ జీవింపలేరు. ఫలం స్వల్పంగా లభిస్తున్నప్పటికీ ఆయా కర్మలు ఆచరిస్తున్నవారిని మనం చూస్తూనేయున్నాము కర్మఫల ప్రాప్తికి భగవదనుగ్రహమూ మనుష్య ప్రయత్నమూ కూడా కారణాలు. ప్రతివ్యక్తి ఏదో ఒక లక్ష్యాన్ని నిశ్చయించుకొని కర్మ ఆచరించడంలో ఉత్సాహం పొందాలి. ఆ విధంగా ఉత్సాహం పొందేవారికి భగవంతుడు సాయపడతాడు. కర్మఫలాన్ని తప్పక ఇస్తాడు అని భావం.

 

ద్రౌపది వాక్యాలలోని విశేషాంశాలు:

1) ప్రతి వ్యక్తీ కర్మ ఆచరించి తీరవలసిందే. జ్ఞానికూడా కర్మని అనుష్ఠించవలసిందే.

2) కర్మని ఆచరించకుండా రాయిరప్పవలె ఎవ్వడూ ఉండలేడు.

3) ఫలం స్వల్పంగా ఇచ్చేదే అయినప్పటికీ ఆ కర్మని ఆచరించడంలో కొందరు నిమగ్నులై యుంటారు.

4) కర్మఫలం పొందడానికి పురుష ప్రయత్నం దైవానుగ్రహం అనే రెండు కూడా అవసరం.

5) ప్రయత్నించే వారికి దైవానుగ్రహం తప్పక లభిస్తుంది.

 

కర్మని ఆచరించినప్పుడు ఫల ప్రాప్తికి దైవానుగ్రహం ఒక్కటే కారణం కాజాలదనీ, పురుష ప్రయత్నం కూడా ఎంతో ప్రాధాన్యం వహిస్తుందని దృష్టాంతం చూపుతూ ధర్మరాజుతో ద్రౌపది ఇలా పలుకుతుంది.

 

తిలలందుఁ బైలంబు గాష్టములయందుఁ దిరముగా నగ్ని

గలుగుటెఱిఁగి యుపాయపూర్వమునఁ గడఁగి తల్సిద్ధి

యలయక యుత్సాహవంతుడు వడయునట్లు నుత్సాహ

మొలసి దైవపరుఁడది వడయంగను నోపునె యెందు

 

నువ్వులయండు నూనె, కర్రలయందు అగ్ని ఉన్నట్లు తెలుసుకొని ఉపాయంతో పట్టుదల పొంది అలసిపోకుండా యత్నించిన ఉత్సాహపరుడు నూనెనీ అగ్నినీ ఆ రెండింటి నుండి పొందుతాడు. ఉత్సాహాన్ని విడిచిపెట్టి దైవమందే ఆసక్తి గలవాడు ఎక్కడైనా పొందగలడా? అని భావం.

కర్మఫలాన్ని పొందడానికి ఉపాయంతో ఉత్సాహవంతుడై ప్రయత్నించాలి. పురుషప్రయత్నం ఎంతో అవసరమని ద్రౌపది తెలుపుతోంది.

అలా అయితే కేవలం పురుష ప్రయత్నం చేతనే కర్మ ఫలిస్తుందా? అంటే ఫలించదు. దైవానుగ్రహం కూడా ఉంటున్నప్పుడే ఫలం లభిస్తుందని కూడా ద్రౌపది దృష్టాంత పూర్వకంగా ఇలా వివరిస్తోంది.

“కడునిమ్ముగా దున్ని బీజములు సల్లి కర్షకుండున్న

దడయక వర్షంబు గురిసి కావించుతత్ఫల సిద్ధి

నడుమ పర్జన్యుఁ డనుగ్రహింపని నాఁడేమి సేయుఁ

గడఁగి చేయంగలదానిఁ జేయునుగాక కర్షకుడు.” (235)

 

కర్షకుడు భూమిని దున్ని విత్తనాలు చల్లుతాడు. వర్షంపడడం వల్ల ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. క్రమంగా పెరిగి ఫలాన్ని ఇస్తాయి. మేఘుడు అనుగ్రహించకపోతే. ఆ వ్యవసాయదారుడు ఎంత శ్రమపడినప్పటికీ ఫలం లభించదు. కాబట్టి కర్మఫలం పొందడానికి దైవానుగ్రహం కూడా ఎంతో అవసరం అని తాత్పర్యం.

ధర్మరాజుకి యుద్ధోత్సాహాన్ని కల్గించడానికి ద్రౌపది అతనితో "మనస్సులో కోరికలు లేనివాడై కేవలం దైవపరుడైన వాడు కర్మఫలాన్ని పొందలేడు" అని కూడా ఇలా సూచిస్తుంది.

“కర్మఫలంబులు దైవమానుష నిబద్ధంబులయిననుం బురుషోత్సాహ సముపార్జితంబులయినవి సుస్థిరంబులయి సురక్షితంబులయి వర్తిల్లు. అనీహమానుండయి కేవలము దైవపరుండయిన వాఁడు నీరిలోని యాన పాత్రంబును బోలె నవసన్నుండగును” (236)

కర్మఫలములు మానుషయత్నాలచే సిద్ధిస్తాయి. పురుషుని ఉత్సాహంతో పొందబడ్డ కర్మఫలాలు మిక్కిలి స్థిరంగా ఉంటాయి. చక్కగా రక్షింపబడతాయి. ఇది పొందాలి. ఇది కావాలి అనే కోరికలేనివాడై దైవాన్నే నమ్మి కర్మ ఆచరించినవాడు నీటిలో నావికుడులేని తెప్పవలె నశిస్తాడు అని భావం. ద్రౌపది చెప్పిన మాటలలోని రెండు ముఖ్య విషయాలు.

1) పురుష ప్రయత్నంచేత సంపాదింపబడ్డ కర్మఫలం స్థిరంగా సురక్షితంగా నిలుస్తుంది.

2) కేవలం దైవం మీద భారంవేసి కాలు కదపకుండా కూర్చుంటే కర్మఫలం నీటిలో నడిపేవాడులేని తెప్పవలె అస్థిరంగా ఉంటూ చివరకి నశిస్తుంది. ఈ సందర్భంలో వ్యాసభారతంలో ద్రౌపది ధర్మరాజుకి కర్మతత్త్వసారాన్ని ఎంతో విపులంగా వివేచించి నిరూపించినట్లు ముప్పై రెండవ అధ్యాయంలో రచింపబడింది.

ఆ విషయాలలో కొన్ని ముఖ్యమైనవి :

1) జంతవః కర్మణా వృత్తి మాప్నువంతి (4)

ప్రాణులు కర్మని ఆచరించడంచేత జీవితాన్ని గడుపుతారు.

2) అకర్మణాం హి భూతానాం వృత్తిః స్యాన్న హి కాచన

కర్మచేయని ప్రాణులకి జీవనం సాధ్యపడదు.

3) ఉత్సీదేరన్ ప్రజాస్సర్వా నకుర్యుః కర్మ చేద్భువి

తథాహ్యేతే న వర్థేరన్ కర్మచే దఫలం భవేత్

కర్మ ఆచరించకపోతే జనులందరు నశిస్తారు. కర్మఫలాన్ని ఈయనిదే అయినా ఈ ప్రజలు వృద్ధిపొందరు.

4) అతి చాప్యఫలం కర్మ పశ్యామః కుర్వతో జనాన్

నాన్యథా హ్యపి గచ్ఛంతి వృత్తిం లోకాః కథంచన

ఫలాన్ని ఈయనిదే అయితే జనులు కర్మని ఎందుకు ఆచరిస్తారు?. కర్మచేస్తున్న వాళ్లని మనం చూస్తున్నాం గదా. కర్మ ఆచరించకుండా ఉన్నట్లయితే జనులు జీవనం పొందలేరు.

5) ఏవం హఠాచ్చ దైవాచ్చ స్వభావాత్ కర్మణస్తథా

యాని ప్రాప్నోతి పురుషస్త త్ఫలం పూర్వ కర్మణామ్

హఠాత్తుగానో దైవవశంచేతనో తన ప్రయత్నం చేతనో కర్మచరించడం వల్ల పురుషుడు ఏవైనా పొందితే అవన్నీ తాను పూర్వం ఆచరించిన కర్మఫలంగా వాటిని పరిగణించాలి.

6) కర్తవ్యమేవ కర్మేతి మనోరేష వినిశ్చయః

ఏకాంతేన హ్యనీహో2యం పరాభవతి పూరుషాః

కర్మ తప్పక చేయదగ్గదని స్మృతి కర్తయైన మనువుయొక్క నిశ్చయం. ఒంటరిగా ఏ కోరికా లేకుండా ఉండే పురుషుడు పరాభవం పొందుతాడు.