పరిచయం :

''రాజు మరణించే నొక తారరాలిపోయే
కవియు మరణించే నొక తార గగనమెక్కె
రాజు జీవించే రాతి విగ్రహములందు
సుకవి జీవించే ప్రజల నాల్కలయందు'' (ఫిరదౌసి)

అన్న సుకవి జాషువా వాక్కు నిజంగా ప్రజల నాల్కులలో కలదు. ''జీవితం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నా గురువులు ఇద్దరు. ఒకటి పేదరికం, రెండు కులమత భేదం. మొదటిది నాకు సహనాన్ని నేర్పితే, రెండోది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే గాని బానిసగా మాత్రం మార్చలేదు. దారిద్య్రాన్ని, కులభేదాన్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలచాను'' అన్న కవి జాషువా.

ఇరవయ్యో శతాబ్దపు తెలుగు సాహిత్యంలో సుస్థిరస్థానం సంపాదించుకున్న విశిష్ట కవి. సొంత గొంతుకని తన కవిత్వంలో బలంగా వినిపించిన కవి జాషువా. పద్యాన్ని సామాజిక ప్రయోజనం కోసం వాడిన గొప్పకవి జాషువా. ఇతను 1895, సెప్టెంబరు 28వ తేదీన గుర్రం వీరయ్య, లింగమాంబలకు జన్మించాడు. ప్రాథమిక ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగారు. కవికోకిల, కవితా విశారద, మధుర శ్రీనాథ, నవయుగ కవి చక్రవర్తి మొదలైన బిరుదలతో పాటు కళాప్రపూర్ణ, పద్మభూషణ సత్కారాలను పొందారు. ఇంకా జాషువా అనేక రచనలు రాశారు. అందులో ఫిరదౌసి కావ్య ఒకటి. దీని గురించి, ఇందులోని సామాజిక స్పృహను గల అంశాలను తెలుసుకుందాం.

ఫిరదౌసి ఇతివృత్తం :

ఫిరదౌసి ఫారశీక కవి. ఇతను తూసు పట్టణంలో నివాసముంటాడు. గజని మహమ్మదు చక్రవర్తి ఒకనాడు నిండు కొలువులో ఫిరదౌసిని పిలిపించాడు. తన వంవ చక్రవర్తుల చరిత్రను గురించి కావ్యం రాయమన్నాడు. అలా 'షానామా'లో ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు రూక బహుమానం ఇస్తానన్నాడు. అందుకు కవిరాజు రారాజుతో సరేనని కావ్య రచనకు పూనుకున్నాడు. దాదాపు 30 సంవత్సరాలు శ్రమించి, 60వేల పద్యాలతో 'షానామా' సర్వాంగ సుందరంగా తయారైంది. తర్వాత దానిని రాజసభలో చదివి వినిపించాడు. పండిత పరిషత్తు ప్రశంసించింది. ప్రభువుకు సమర్పించి వెళ్ళాడు. గజని మహమ్మద్‌ రాజు మాటతప్పి బంగారు రూకలకు బదులుగా వెండి నాణెములను పంపించాడు. కవి ఆశలు ఆడియాసులైంది. నిరాశ నిలువెల్లా వ్యాపించింది. కవిని తీరని బాధ బాధించింది. బాధాదగ్ధహృదయుడై నిందా - స¬క్తికంగా పద్యాలు రాసి పంపాడు. అందుకు రాజు నిప్పు మీది ఉప్పులా చిటపటలాడాడు. శివమెత్తి చిందులు వేశాడు. ఫిరదౌసిని పట్టి వధించండని రాజ భటులను పంపాడు. ఫిరదౌసి సతీసుతాసమేతంగా తూసు పట్టణానికి పయనమయ్యాడు. దారి మార్గంలో భీకరమైన కారడవుల్లో కాళ్లీడ్చుకుంటూ దినమొక యుగంగా ప్రాణగండంగా నడిచి, నడిచి ఎట్టకేలకు తన సొంత గ్రామానికి చేరుకున్నాడు.

మహారాజు మనస్సు మార్చుకున్నాడు. కవి ఋణం తీర్చాలనుకున్నాడు. అరవైవేల దీనారిల్ని వీరభటులతో పంపించాడు. దీనారులు తూసు పట్టణ తూర్పుగవిని చేరాయి. ఫిరదౌసి శవం పడమటి గవి నుండి శ్మశానం చేరింది. బంగారాన్ని స్వీకరించమని భటులు కవి కుమారిని బ్రతిమాలాడారు. నా తండ్రిని కన్నీటి నింపిన ఈ నీచధనమేలా? అని నిరాకరించింది. ఈ దుర్వార్తను విన్న మహమ్మదు మరెంతో చింతించాడు. పశ్చాత్తాపం చెందాడు. ఈ ద్రవ్యంతో ఫిరదౌసి పేరుతో తూసులో ఒక సత్రం కట్టించాడు. కవికి కీర్తి, రాజుకు అపకీర్తి మిగిలింది. ఇరువురు కాలగర్భంలో కలిసిపోయారు. ఇది ఫిరదౌసి కన్నీటికథ. కవి శ్రమను దోచుకున్న తురుష్కరకు భూతి కసాయి కథ. ఇటువంటి గుండెలు పిండే ఇతివృత్తాన్ని జాషువా తీసుకొని ఫిరదౌసి కావ్యాన్ని 1930 ప్రాంతంలో రచించాడు. అయితే 1932లో ముద్రితమైంది. దీని కృతిపతి సంగరాజు లక్ష్మీనారాయణ గారు.

కవి హృదయ వేదన :

కవి రాజులకు సమాజంలో జరుగుతున్న 'శ్రమదోపిడి' అనే అన్యాయానికి నిలువెత్తుగా నిలిచిన నిదర్శనం. బలవంతుల దోపిడీకి ప్రబలమైన ఉదాహరణం - ఫిరదౌసి కావ్యం. సంఘపరంగా ఏ అన్యాయం జరిగినా కవి కలం ఊరుకోదు. కవి గళం మూగబోదు. సామాజిక న్యాయం జాషువా ధ్యేయం. ఆ లక్ష్యశుద్ధితో రచన సాగించాడు. అంత వరకు పోరాటం చేశాడు. ఆ పోరాటానికి కవితను కత్తిగా వాడుకున్నాడు. సంఘంలోని అన్యాయాలమీద అధర్మాల మీద ఆ కత్తిని ఝళిపించాడు. సాటి మానవునికి సాయం చేయాలని తలచి, తన పరిధిలో తాను సాధించాడు. అందుకే జాషువా కవితకు సమాజంలో నేటికీ సమున్నత స్థానం వుంది. సమాజ కవిగా పేరు నిలిచింది. సామాజిక న్యాయ విధాతగా, సమసమాజ స్థాపనకు తన కలాన్ని, గళాన్ని, బలాన్ని ధారాదత్తం చేసిన కీర్తి దక్కింది. దానినే క్రింది పద్యంలో వ్యక్తపరుస్తున్నాడు.

'ఒక్కొక్క పద్ధియంబునకు నొక్కొక్క నెత్తుర బొట్టు మేనిలో
తక్కువగా రచించితి వృథాశ్రమయయ్యె గులీనుడైన రా
జిక్కురణిన్‌ మృషల్వలుకునే? కవితాఋణమీయకుండనే
నిక్కమెఱుంగైతి గజని సులతాను మహమ్మదగ్రణీ'

ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క నెత్తురు బొట్టును ఇమిడ్చాడంట. ఎన్ని నెత్తురు చుక్కలు ఖర్చు అయ్యాయ్యో - అన్ని పద్యాలు వెలువడ్డాయట. 60 వేల పద్యాలకు 60 వేల రక్త బిందువులు ఆహుతి అయ్యాయి. అయితే అంతగా శ్రమపడినా ఫలితం లేక ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఒక్కోసారి 'నా సర్వస్వము దొండిలించి' అంటూ బోరుమనీ బావురమనీ నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకున్నాడు. ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇలా ఫిరదౌసి కవికి కలిగిన దుఃఖపు తెరలు పొరలు కొని వచ్చాయని జాషువా కవి క్రింద విధంగా తెలియపరుస్తున్నాడు.

''ఎన్నో కొండలు గుండెలు గరగి పో
యెన్‌, వార్ధి సంతానముల్‌
గన్నీరయ్యె, సమస్త లోకము నిరా
కార స్థితిం బొల్చెను
త్పన్నంబయ్యె విషాద మేఘపటల
ధ్వాంతౌఘమా, శాలత
ల్సున్నాలయ్యె, నగాధ కూపజల రా
సుల్‌ దోచె ఫిర్దౌసికిన్‌''

ఎన్నో కొండలు గుండెలో కరిగిపోయాయట. కన్నీటి సముద్రాలు జాలువారాయి. ఎటు చూసినా విషాద మేఘాలే వ్యాపించాయి. అంతా నిరాశే మిగిలింది. ఈ పట్టున ఫిరదౌసి కవికి లోతైన దిగుడు బాబులు కనిపించాయట. పైన చెప్పిన విధంగా ఫిరదౌసి కవి విలపించాడట. ఇంకా

''ముత్యముల కిక్కయైన సముద్రమున
టెక్కుమూఱులు ముస్కలు వేసినాడ
భాగ్య హీనుడ ముత్యమ్ము వడయనయితి
వనధి; ననుమ్రింగ నోరు విచ్చినది తుదకు''

ముత్యాలకోసం సముద్రంలో మునిగితే ఆ సముద్రమే ఫిరదౌసి కవిని ముంచినట్లయిందని జాషువా కవి హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాడు.

మానవతా దృక్పథం :

సుల్తానును నిందిస్తూ ఫిరదౌసి రాసిన లేఖను చూసిన గజనీమహ్మద్‌ కోపంతో కవిని పట్టి చంపుడని భటుల్ని ఆజ్ఞాపించాడు. వారు ఫిరదౌసి కోసం గాలిస్తున్నప్పుడు సరసకవిపూజా పరతంత్రుడు ఒకడు సుల్తాను ఆజ్ఞాపించిన వార్తను ఫిరదౌసికి వినిపించాడు. ఇది జాషువాలోని మానవత్వానికి మచ్చుతునక. ఎందుకంటే ఆ విషయాన్ని అతను తెలపకుంటే ఫిరదౌసి కవి వారిచేతిలో హతమయ్యేవాడు. ఇంకొక నిషాదుడు సైనికులు ఫిరదౌసి కోసం వెతుకుండేది గమనించి కవిని సురక్షిత మార్గం వైపు మరలిస్తాడు. కావున నిషాదునిలో కూడా మానవత్వమున్నది. ఇది కూడా జాషువా కవిలోని మానవత్వానికి ప్రబలమైన ఉదాహరణ.
ఫిరదౌసి కవి సకుటుంబంగా అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఒక నిషాదుడు పెద్ద చెరువును చూపించి, కేలూతమోసగి సహాయం చేశాడు. కనుచూపు మేరలో గల ప్రమాదకరమైన జంతువుల్ని చెప్పాడు. అట్టే మంచి మార్గమేదో కూడా చెప్పాడు. ఫిరదౌసి కవికీ, అతని కుటుంబీకులకు ఆ నిషాదుడు చక్కని ఉపశమనాన్ని కలిగించాడు. అందుకే ఫిరదౌసీ కవి - ఆ నిషాదునిలోని మానవత్వాన్ని ప్రశంసించాడు.

''నరులు గడించి పెటిన వినాశన సూచకమైన పాప మీ
ధరణి కసహ్యమై బహు వివిథంబుల మూలుగుచున్నదన్న, ఈ
శ్వరుని క్రుధావిలోకన దవానలముల్‌ వినువంటి వారికై
వెఱచి దహింపకున్న వనిపించె మనంబు నిషాద వల్లభా!”

"నాదు తనూ పటుత్వమును, నా కవితా తపనీయ రాశి భూ
మీదయి తుండొకండు బలిమింగొని నన్ను వధింపజూచె, నీ
నీదు మనంబు లేతనపనీతము ముందె కరంగెం జాపులన్‌”

కఠిన శిలలు కరుగుదలకు గురికావడమే జరిగిందంటే - ఇక మానవుల సంగతి వేరుగా చెప్పనవసరం లేదు. నిషాదుని చిత్తం 'లేతనవనీత'మని చెప్పబడింది. అందుకే అతనిది అచ్చమైన మానవతాగుణం. ఫిరదౌసికి సహాయం చేశాడు.

జాషువా జీవితంలో ఎక్కువగా కరుణరసమే చోటు చేసుకున్నది. కారణం అతని కులం, పేదరికం, ఈ రెండు జీవితాంతం వెంటాడటమే. అట్లే ఫిరదౌసి కవి కూడా పేదరికంతో బాధపడుతూ షాదూషాచేత వంచనకు గురై శ్రమ నిష్పలమై తనువు చాలించాడు. ఇప్పటికి గజనీ పురవీధుల్లో ఫిరదౌసి పేర ఒక నక్షత్రశాల ఉందట! అది గజనీ మహ్మద్‌ నిర్మించాడు. అతని ప్రేతాత్మ అక్కడ సంచరిస్తుందంట! జాషువా కవిలో కూడా ఇలాంటి ఘట్టాలు చాలా చోటు చేసుకోవడం వల్లనే అతని కవితాత్మ మిక్కిలి స్పందించింది. జాషువాకు కృతఘ్నత అంటే సరిపోదు. ఫిరదౌసి కవికి కూడా అంతే.

ఓయి కృతష్నుడా! భవ మహో దధిలోనిక దేలియాడు మా
హా! యపమ ధరతలము నంతయు గావ్యసుధాస్త్రవంతిలో
హాయిగ నోలలాల్చిన మ హామహుడౌ ఫిరదౌసి తోడ స్వ
ర్గీయసుఖంబు నీకు దొట గెన్‌ మనుపీనుగువై చరింపుమా!

- అనే ఈ పద్యం జాషువా ఆత్మీయతకు నిదర్శనం.

ముగింపు :

ఇలా శ్రమశక్తిని కవితాశక్తిని దోచుకోవడమే ఫిరదౌసికి జరిగిన అన్యాయం. అధర్మం. అందుకే సమాజంలో న్యాయంకోసం ధర్మంకోసం కవిత్వం ఉపకరించాలంటూ ఉదాత్త ఆశయాన్ని వ్యక్తం చేస్తాడు. ఈ తీరును 'ఫిరదౌసి'లో సామాజిక స్పృహ అనే కవి అభిలాష అంతర్వాహినిలా ప్రవహిస్తూ ఉంది.