AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

ISSN: 2583-4797
Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-12 | November 2022| ISSN: 2583-4797

6. అక్షరాన్ని ఆయుధంగా మలుచుకున్న మహాకవి గురజాడ

శ్రీమతి జి. యమునారాణి

సహాయాచార్యులు, తెలుగుశాఖ,
శ్రీసత్యసాయి అత్యున్నత విద్యాసంస్థ (SSSIHL),
అనంతపురం, ఆంధ్రప్రదేశ్.
సెల్: 8985556576 Email: gyamunarani@sssihl.edu.in


Keywords:  గురజాడ, సంఘసంస్కరణ, మానవతావాదం, పాత్రచిత్రణ, కన్యక, పూర్ణమ్మ, కన్యాశుల్కం.

ఉపోద్ఘాతం:

"బ్రతికి చచ్చియు ప్రజలకెవ్వడు / బ్రీతి గూర్చునొ వాడే ధన్యుడు" అన్న మాటలు గురజాడ జీవితంలో అక్షరసత్యాలుగా నిలుస్తాయి. ఈయన సమాజహితాన్ని కాంక్షిస్తూ, ఆనాటి సామాజిక రుగ్మతలను ఎత్తిచూపే ప్రయత్నంలో అక్షరాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. 1862 సెప్టెంబర్ 9వ తేదీన విశాఖజిల్లా ఎలమంచిలి తాలూకాలో జన్మించారు. మనం గురజాడ  సాహిత్యం 19వ శతాబ్దంలో చదివినట్లయితే ఈయన 20వ శతాబ్దానికి చెందిన కవిలా కనిపిస్తారు. మనం 20వ శతాబ్దంలో చదివినట్లయితే 21వ శతాబ్దానికి చెందిన కవిలా అనిపిస్తారు. ఇలా గురజాడ  ఆయన రచనలతో కాలానికన్నా ముందు నడిచారన్నమాట సత్యదూరం కాదు.

గురజాడ దృష్టిలో స్త్రీ:

"ఆధునికమహిళ మానవచరిత్రను తిరగరాస్తుంది" అన్న మాటలనుబట్టి చూస్తే ఆయన ఎంత దూరపుచూపు ఉన్నవారనేది అర్థమవుతుంది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక దురాచారాలను తన రచనల ద్వారా అందులో ఎంచుకున్న పాత్రల ద్వారా చెప్పించి పాఠకుల హృదయంలోకి చొచ్చుకొని పోయే విధంగా చిత్రించారు. మొదటగా స్త్రీకి  సమాజంలో ఒక మంచి స్థానాన్ని కల్పించాలనో, ఆనాటి సమాజపరిస్థితులను బట్టి సంస్కరణ మొదట స్త్రీ నుండి మొదలవ్వాలనో గురజాడ తన రచనలన్నింటిలోనూ స్త్రీ పాత్రధారి చేత తన భావాలను సూటిగా చెప్పించగలిగారు.

పాత్రలు – వైశిష్ట్యం:

గురజాడ  ఎంచుకున్న పాత్రలు, వస్తువులు జీవిత వాస్తవాలకు సంబంధించినవిగా ఉండటమే కాక, ఈనాటికీ ఈ పాత్రలు మన మధ్యనే తిరుగుతున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందులో ముఖ్యంగా గురజాడ "కన్యాశుల్కం"లోని మధురవాణి, "దిద్దుబాటు"లోని కమలిని, "సంస్కర్త హృదయం"లోని సరళ ఈనాటికీ సజీవపాత్రలుగా నిలిచిపోయాయి. అంతేకాకుండా తన ఆలోచనలను సులభంగా పాఠకప్రపంచంలోకి తేవడానికి ముత్యాలసరాలు ఛందస్సుకు ప్రాచుర్యం కల్పించారు. ఇంకా "కన్యక", "పూర్ణమ్మ"ల గురించి మాట్లాడినట్లయితే గురజాడ వారి ముత్యాల సరాలలో ఎంతో విలువైనవిగా ఈ రెండింటిని చెప్పుకోవచ్చు.

సంఘసంస్కరణాత్మక ప్రబోధం:

సంఘసంస్కరణలో భాగంగా మొదటగా స్త్రీలు విద్యావంతులు కావాలన్న తన ఆలోచన లోంచి జన్మించిన కథానిక "దిద్దుబాటు". ఇందులో 'కమలిని' పాత్ర ద్వారా వ్యసనాలకు బానిసైన తన భర్తను మార్చుకొని కుటుంబాన్ని నిలబెట్టుకోవడంలో ఒక చదువుకున్న యువతి ఎంత చాకచక్యంగా వ్యవహరించి, తన సమస్యను తానే ఎంత ఉపాయంతో పరిష్కరించుకోగలిగిందో చెబుతారు. మహిళలు విద్యావంతులైతే కుటుంబానికి నష్టం జరుగుతుందని ఆలోచించే ఆనాటి పరిస్థితుల్లో దిద్దుబాటు ద్వారా ఆ ఆలోచన తప్పని నిరూపించే ప్రయత్నం చేశారు గురజాడ.

కాసులకు ఆశపడి పసిబిడ్డలైన తమ కూతుళ్లను ముసలి వాళ్లకి ఇచ్చి పెళ్లి చేసే సంఘటనలు ఆనాడు విరివిగా జరిగేవి. ముసలి మొగుడితో పడుచు పెళ్ళాలు పడే బాధలను, అలాంటి పెళ్లిళ్ల వలన వివాహవ్యవస్థ అనేది రాక్షసంగా మారిపోతుంది అన్న భావాన్ని పాఠకుల మెదడులోకి ఎంతో సున్నితంగా చొప్పించే ప్రయత్నం చేశారు 'మెటిల్డా' కథ ద్వారా. ఇదే విషయాన్ని గురజాడ  "నర మాంసవిక్రయం" అన్నారు "కసాయి వాడు ఎక్కడో పుట్టిన మాంసము విక్రయిస్తాడు. కానీ నీవు కడుపున పుట్టిన శిశు మాంసమును విక్రయిస్తున్నావు నీ వ్యాపారం కంటే వాడిదే మంచిది." అంటూ కన్యాశుల్కవివాహాల కసాయితనాన్ని ఎత్తిచూపుతున్న ఈ మాటలు కన్యాశుల్కం నాటకంలోని సంభాషణలే అయినప్పటికీ, ఈ నాటకంలోనే ప్రతి పాత్ర ద్వారా ఆనాటి వాస్తవవిషయాలను ప్రతిబింబించే విధంగా పాత్రలకు జీవం పోశాడు.

కాబట్టే ఈనాటికీ కన్యాశుల్కంలోని మోసతనం ఉన్న వ్యక్తులను గిరీశం గానూ, వారి చేతుల్లో మోసపోతున్న అమాయకులైన అనేకమంది స్త్రీలు బుచ్చమ్మలుగాను, తమ పరిస్థితుల రీత్యా బతకలేక చస్తూ బతుకుతున్నా, సమాజంలో చీదరింపులకు గురి అవుతున్న మహిళలు మధురవాణులుగాను వ్యవహరింపడుతన్నారు. ఇందులో  గురజాడ  తన మనసులోని భావాలైన మాటల్ని "మగాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి" అని మధురవాణి పాత్ర ద్వారా చెప్పించడం జరిగింది.

'పూర్ణమ్మ', 'కన్యక' లను పరిశీలించి చూస్తే గురజాడ ఈ పాత్రలను తీర్చిదిద్దిన విధానం ఆయన స్త్రీని ఎంత ఉన్నతంగా, ఆదర్శంగా, సంస్కారవంతంగా, సుగుణవంతంగా చూపించాలి అనుకున్నారో అర్థమవుతుంది.

కన్యక:

ఆనాటి సంఘంలోని పురుషుడు దురహంకారిగా వ్యవహరించిన తీరు, అధికార వ్యామోహంతో మహిళల పట్ల ప్రవర్తించిన విధానం, నిస్సహాయులైన తల్లిదండ్రుల దీనత్వం ఈనాటికీ పునరావృతమవుతూనే ఉన్నాయి. ఆనాటి పరిస్థితుల దృష్ట్యా కన్యక తనను కాపాడుకొనే క్రమంలో మగవాడి దురహంకారాన్ని, అధికార దుర్వినియోగాన్ని, ఎండగడుతూ పలికిన పలుకులు ఈనాటికీ నిత్య సత్యాలుగా నిలుస్తాయి.

"వీర్య మెరుగక విద్యనెరుగక / బుద్ధి మాలినచో కలుగవ ఇక్కట్లు" అంటూ విద్యావంతులు కానీ, బుద్ధిహీనులైన వారికి అధికారం కట్టబెడితే కష్టాలు రాక మానవని చెబుతూ... "పట్టమేలే రాజు నీవైతే పట్టునన్నిప్పుడూ..." అంటూ రాజు అధికార దర్పం అవిరైపోయే విధంగా వాడి దురాక్రమణ ను విఫలయత్నం చేస్తుంది. తాను ఆనాటి పరిస్థితులకు విధిలేక ఆత్మాహుతి చేసుకున్నా, ఈనాటి మహిళలకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రతిఘటించమని సూచిస్తుంది.

పూర్ణమ్మ:

కాసులకాసపడి కన్నబిడ్డల్ని అమ్ముకుంటున్న తల్లిదండ్రులకు, తోబుట్టువులకు కనువిప్పు కలిగించే పాత్ర పూర్ణమ్మ. ఇందులో గురజాడ  పూర్ణమ్మ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా, ఆదర్శప్రాయంగా మహిళల యొక్క అతి సహజత్వం దర్శించగలిగేలా తీర్చిదిద్దారు. ఇందులో తల్లిదండ్రులనే కాక సమాజాన్ని, దుర్గా దేవిని  కూడా ప్రశ్నించేలా ఉంటాయి పూర్ణమ్మ పలుకులు. ముసలి మొగుడి వెంట కాపురానికి వెళ్లడం ఇష్టం లేని పుత్తడి బొమ్మ మానసిక స్థితిని, హృదయస్పందనని పాఠకులకు హత్తుకునేలా చిత్రించారు. అందులోనూ ఆడపిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల, తోబుట్టువుల పట్ల ఎంత ఆదరణతో ఉంటారన్నది కూడా పూర్ణమ్మ మాటల్లో స్పష్టం చేశారు.

"చిన్నలనందరు కౌగిట చేర్చుకు

కంటను పెట్టెను కన్నీరు

అన్నల తమ్ముల నప్పుడు పలికెను

పుత్తడి బొమ్మా పూర్ణమ్మ!

అన్నల్లారా! తమ్ముల్లారా!

అమ్మను అయ్యను కానండీ!

బంగరు దుర్గను భక్తితో కొలవండ

మ్మల కమ్మాదుర్గమ్మ!"

తనకు అన్యాయం చేసిన తల్లిదండ్రుల క్షేమాన్ని కాంక్షిస్తూ, తన వారి మధ్యనే ఉండాలని తన కోరికను ఎంతో సున్నితంగా బయట పడుతుంది. అదేవిధంగా నిత్య పూజలతో కొలిచిన ఆ దేవత దుర్గాదేవి కూడా తన పట్ల అన్యాయం చేసిన ఏ కల్మషం లేకుండా దుర్గను పూజించమని తనవారికి చెప్పే విధానం పాఠకుని హృదయాన్ని ద్రవింప చేస్తుంది.

కులవ్యవస్థపై నిరసన:

సాహిత్యం సామాజిక ప్రయోజనం కోసం కాబట్టి  గురజాడ అప్పారావు సాహిత్యం సామాన్యులను చేరుకోవాలనుకున్నారు.

"మలినదేహుల మాలలనుచును

మలిన చిత్తుల కధిక కులముల

నెల వొసంగిన వర్ణధర్మమధర్మంబే

మంచి చెడ్డలు మనుజులందున

యెంచి చూడగ, రెండే కులములు

మంచి యన్నది మాలయైతే - మాలనే అగుదున్."

కులభేదాన్ని విస్మరించాలని, సంఘంలోని మాలిన్యాన్ని కడిగి వేయాలనే సంఘసంస్కరణ అభిలాష వీరి రచనల్లో స్పష్టమవుతుంది.

మానవతావాదం:

గురజాడ మానవతావాదానికి నిదర్శనం 'మనిషి' గేయం.

"మనిషి చేసిన రాయరప్పకి

మహిమ కలదని సాగి మొక్కుతూ

 మనుషులంటే రాయరప్పల కన్న కనిష్టం

గానూ చూస్తా వేల బేలా?

దేవుడు డెక్కడో దాగినంటూ

కొండ కోనల వెతుకులాడే వేలా?

కన్ను తెరిచిన కాపనబడడో? మనిషి మాత్రుడు యందు లేడో

యెరిగి కోరిన కరిగి యీడో ముక్తి."

అంటూ సాటి మనిషిలో దేవుణ్ణి చూడమంటూ, మానవసేవే మాధవసేవ అనే సందేశానికి బలాన్ని చేకూర్చే విధంగా చెప్పడం జరిగింది.

విశ్వమానవసౌభ్రాతృత్వం:

గురజాడ తన రచనల ద్వారా విశ్వ శ్రేయస్సు కాంక్షించారు.

"యెల్లలోకము వొక్కయిల్లై

వర్ణభేదము లెల్లకల్లై

నేల నెరుగల ప్రేమ బంధము

వేడుకలు కురియ

మతములన్నియు మాసిపోవును

జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును

అంతస్వర్గ సుఖంబులున్నవి"

అంటూ "ముత్యాల సరాలు" కవితా ఖండికలో క్రాంతదర్శిగా ఎలుగెత్తి చాటారు.

ముగింపు:

"సుకవిజీవించు ప్రజల నాలుకల యందు" అని గుర్రం జాషువా అన్నట్లుగానే తెలుగు సాహిత్యం ఉన్నన్నాళ్లు ప్రజల నాలుకల మీద నిలిచి, సమాజంలో జనుల హృదయాలలో చిరంజీవులై జీవిస్తారు గురజాడ అప్పారావు.

గురజాడ జయంతి సందర్భంగా, వర్థంతి సందర్భంగా సభలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం ఎంతో ముదావహమైన విషయమే. ఈ సమావేశాలతో పాటు వారి ఆశయాలను, లక్ష్యాలను, సాహిత్యమార్గంలో  చూపిన ఆదర్శాలను పాటించవలసిన బాధ్యతను కూడా ఈనాటి సాహిత్యపరులకు, ఈ తరానికి గురజాడ అప్పగించారన్న విషయం విస్మరించతగనిది.

ఉపయుక్తగ్రంథాలు:

  1. "ఆధునికాంధ్ర సాహిత్యవికాసం". ఎం.ఏ. తెలుగు దూరవిద్య పాఠ్యసామగ్రి, యస్.కె.యు., అనంతపురం.
  2. శాస్త్రి, ద్వా.నా., (2016). తెలుగు సాహిత్యచరిత్ర, ప్రగతి పబ్లికేషన్స్, హైదరాబాద్.
  3. రాంబాబు, వేదగిరి. ఆర్.వి.రమణ మూర్తి (సంపా.) (2012). "ఆధునిక ధ్రువతార". ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సాంస్కృతిక శాఖ.