AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

ISSN: 2583-4797
Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-12 | November 2022| ISSN: 2583-4797

4. యార్లగడ్డ వారి ద్రౌపది నవల : ద్రౌపది పాత్రచిత్రణ

జి. ఓబులకృష్ణ

ఎం.ఏ. టి.పి.టి., టి.వెలమవారిపల్లి, వేంపల్లె, కడప.
Cell: 6303924949, E-Mail: gondikotakrishna@gmail.com


Keywords:  మహాభారతం, ద్రౌపది, పాత్రచిత్రణ, యార్లగడ్డ, నవల.

ఉపోద్ఘాతము:

మహాభారతం ద్వారా ఆనాటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక మొదలైన విషయాలను తెలుసుకోవచ్చు. అంతేకాక ఆనాటి సమాజాన్ని దర్శించవచ్చు. ఆనాటి సమాజంలో స్త్రీల విషయంలో విలాస వస్తువుగా, తల్లిగా, చెల్లిగా, భార్యగా, భక్తురాలుగా మొదలైన కోణాలతో దర్శించవచ్చు. అంతేకాక ఆమె సుఖ దుఃఖాలకే పరిమితం కాక, కోపానికి ఆవేశాలకు ప్రతీకలుగా నిలిచే పాత్రలు పంచమ వేదంలో ఉన్నాయి. అలాంటి పాత్రలలో ద్రౌపది ఒకటి. ఆమెలో ఉండే ధర్మనీతి, ధైర్యం, వ్యక్తిత్వం ఆమెకు సాటిలేని వనితలు ఉండరు. మహాభారతంలో ఎంతమంది నాయకులు ఉన్నా ప్రధాన నాయిక ద్రౌపది.

గొప్ప వ్యక్తిత్వంగల ద్రౌపదిని ఎంతో ఇష్టపడి ‘ద్రౌపది’ అనే నవల రాశారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. అందుకోసం పలు గ్రంథాలను సేకరించి, చర్చించి రాశారు. ఈ నవలలో కవిత్రయభారతంలో లేని కొన్ని వాస్తవాలను చర్చించే ప్రయత్నం చేశారు. పురుష సమాజంలో స్త్రీల స్థానం, వారికి ఒక గౌరవం తెచ్చినది ఈ నవల. కవిత్రయ భారతం, యార్లగడ్డ వారి ద్రౌపది నవల ఆధారంగా చేసుకొని పునర్మూల్యాంకనం ఈ వ్యాసం చేస్తుంది.

రచయిత పరిచయం:

ద్రౌపది అనే పౌరాణిక నవలాకర ‘పద్మశ్రీ’ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఈయన కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర ‘వానపాముల’ అనే గ్రామంలో 1953 నవంబరు 24న జన్మించారు. సాహిత్యవేతగా, ఉద్యమనాయకుడిగా, అనువాదకుడుగా, రాజ్యసభ సభ్యులుగా తన సేవలందించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ హిందీ శాఖకు, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ అధ్యక్షులుగా ఉంటూ తెలుగు-హిందీ సాహిత్యాలకు వారథిగా నిలిచారు. తెలుగు కే ఆధునిక కవి బైరాగి, కవిరాజ్ త్రిపురనేని కేదో పౌరాణిక్ నాటక్, ఆత్మహత్య మొదలైనవి హిందీ రచనలు. తెలుగులో కెరటాలు, సప్తస్వరాలు, తమస్, వేదనాభరితం, యయాతి, ద్రౌపది మొదలైన రచనలు రాశారు. వారు రాసిన తమస్ నవలా అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ద్రౌపది పౌరాణిక నవలకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. యయాతి నవలా అనువాద స్పూర్తితో మహాభారతంలో తాను ఎక్కువగా అభిమానించే ద్రౌపది పాత్రను నవలా రూపంగా సృజనతో రాశారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడు శ్రీ కొండుభట్ల శ్రీరామచంద్రమూర్తి సహకారంతో వెలువడింది. సాహిత్యలోకంలో పెను సంచలనం సృష్టించింది.

ఈ నవలలో కురుక్షేత్రయుద్ధం తర్వాత కథ ప్రారంభం అవుతుంది. ఇందులో కవిత్రయభారతంలో లేని చాలా విషయాలు చర్చించారు.

ద్రౌపది నవ్వు:

రామాయణ యుద్ధానికి కారణం సీత కాగా, మహాభారత యుద్ధానికి కారణం ద్రౌపది. సుయోధనుని పరాభవం చూసి ద్రౌపది నవ్వింది. ఆ నవ్వే ద్రౌపది సజీవ పాత్రగా నిలవడానికి కారణమని నన్నయ, భారతంలో కలదు. భారత యుద్ధం జరగడానికి ద్రౌపది కర్ణులే కారణం అంటూ యార్లగడ్డ వారు నన్నయను సమర్థించారు. కాని వ్యాసభారతంలో ద్రౌపది లేదు. నవ్వింది పాండవులు మాత్రమే. నన్నయ మూలంలో లేని ద్రౌపదిని బాధ్యురాలిగా చేయడంలో కథను రక్తి కట్టుటకే. కౌరవుల కోపానికి, మాత్సర్యాలకు బీజం వేసింది భీముడే అని నా అభిప్రాయం.

స్త్రీవాదిగా ద్రౌపది:

భారతంలో కనిపించే ప్రధాన స్త్రీ పాత్ర ద్రౌపది. ఆమె అందరికంటే ఎక్కువ కష్టాలను, అవమానాలను, భర్తల నిరాదరణ అనుభవించింది. కవిత్రయ భారతంలోను, ద్రౌపది నవలలోనూ గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ద్రౌపది కనిపిస్తుంది. అంతేకాక ఆమెలో స్త్రీవాద ఛాయలు కనిపిస్తున్నాయి. ఆదిపర్వంలో మొదట ఉలుకు పలుకు లేని బొమ్మగా ఉంటుంది. స్వయంవరంలో కర్ణుని చూసి సూతుత్రుడను వరించను అనడంలో ఆమెలో మాట్లాడే ధైర్యం, భర్తలను ఎన్నుకోవడం స్వేచ్చ కన్పిస్తాయి.

కురుసభలో, విరాటుని కొలువులో భర్తల అసమర్థతను గుర్తుచేస్తూ ప్రశ్నించే తత్త్వం ఉంది. అంతేకాక స్త్రీ విషయంలో పురుషులు ఎప్పుడూ అనాగరికులే... కాలం మారినా ప్రతి స్త్రీకి తానొక ఆటవిక సమాజంలో ఉన్నట్లు చెప్పడంలోను, ధర్మరాజు తనను ఫణంగా పెట్టడానికి ఏమి హక్కు ఉందని ప్రశ్నించడంలో ద్రౌపదిలో స్త్రీవాద ఛాయలు ఉన్నాయి. ఈమెను ఆదర్శంగా తీసుకొని ఆధునిక మహిళ ఎలా ఉండాలో ఈ నవల తెలియజేస్తుంది.

ఆరవ భర్తగా కర్ణుడు:

మహాభారత యుద్ధం జరగడానికి ద్రౌపది, కర్ణులు కారకులు. మొదటి నుంచి కర్ణుడంటే తిరస్కరణ భావం ఉండే ద్రౌపదికి ఆరవ భర్తగా ఆమె స్వయంగా అంగీకరించడం ఈ నవలలో కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు ద్రౌపది కర్ణుని ఆరవ భర్తగా స్వీకరిస్తుందని చెప్పడంతో ఆమెపై పూర్తి అధికారం ఉన్నవాడుగా కనిపిస్తాడు. అంతేకాక జానపదుల 'పండు పాట' ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. తిక్కన భారతంలో ద్రౌపది ఈ విషయంపై కృష్ణునితో చాలా నిష్ఠూరంగా మాట్లాడుతుంది.

ద్రౌపది జన్మ రహస్యం:

ద్రౌపదికి పాంచాలి, యజ్ఞసేనాని, కృష్ణ అని పేర్లు ఉన్నా అసలు పేరు తెలియదు. ఈమె జన్మరహస్యం నన్నయ చెప్పిందే చెబుతూ అసలు విషయాన్ని తెలియజేశారు యార్లగడ్డవారు. ద్రౌపది నేను హిమాలయాల్లో సంచరించే జాతులలో జన్మించాను. నన్ను సుఖపెట్టలేక పోయారు మౌద్గల్యుడు, యజుడు. ద్రుపదుడు చేసే పుత్రకామేష్టి యాగానికి వచ్చిన యజుడు ఈమె యజ్ఞంలో జన్మించినట్లు తెలియజేశాడు. అసలు జన్మ రహస్యం వ్యాసునితో ద్రౌపది చెప్పినట్లుగా ఈ నవలలో తెలియజేశాడు.

సుభద్ర పెళ్లి:

నన్నయ భారతంలో అర్జునుడి తీర్థయాత్రలో భాగంగా ద్వారకలో సుభద్రతో పెళ్ళి జరిగింది. ఈ విషయం ద్రౌపదికి ఇంద్రప్రస్థంలో ఉన్నా ముందుగానే తెలిసిందని చెప్పాడు. అందుకే

“పంకజాక్షి! నీపతి ప్రతిపక్షవీర విజయుడయ్యెడు..........”

ఇక్కడ విజయుడు అంటే అర్జునుడే కదా! కాని యార్లగడ్డ వారి ద్రౌపది నవలలో ద్రౌపదికి వీరి పెళ్ళి గురించి తెలియదు. అందుకే ద్రౌపది సుభద్రను ఎవరు నీవు అని ప్రశ్నిస్తుంది. ద్వారకలో జరిగిన పెళ్ళి ద్రౌపదికి ముందుగా తెలియదని స్పష్టం చేశారు యార్లగడ్డ వారు.

ముగింపు:

స్త్రీ పాత్రల విషయంలో సీతకు, ద్రౌపదికి ఎంతో వ్యత్యాసం ఉంది. రామాయణ యుద్ధానికి సీత కాగా, భారత యుద్ధానికి ద్రౌపది కారణం. సీత లాగా ద్రౌపది బొమ్మకాదు. ఈమెలో మహోన్నత వ్యక్తిత్వాన్ని, ప్రశంసనీయమైన ఆత్మవిశ్వాసంతో మహిళాలోకానికే మకుటంగా ఈ నవలలో చిత్రించారు. తిక్క లాగా స్త్రీని ఒక సంభోగవస్తువుగా కాక తల్లిగా, చెల్లిగా, ఇల్లాలుగా, భక్తురాలుగా నిలబెట్టి అనేక కోణాలతో యార్లగడ్డ వారు ఈ నవలను రాశారు.

ద్రౌపది పాత్ర ఆధునిక స్త్రీవాదులకు ఆదర్శంగా నిలబెట్టాడు. మహాభారత యుద్ధానికి కేవలం ద్రౌపదిని కారకురాలుగా చేయకుండా దాయాది మత్సరాలతో కూడి జరిగిందని ఈ నవల ద్వారా తెలుసుకోవచ్చు.

ఆధార గ్రంథాలు:

  1. లక్ష్మీప్రసాద్, యార్లగడ్డ (2006). ద్రౌపది (న‌వ‌ల‌), లోక‌నాయ‌క్ ఫౌండేష‌న్‌, విశాఖ‌ప‌ట్నం.
  2. సుబ్రహ్మణ్యం, జి.వి., (సంపా.) (2013). కవిత్రయ విరచిత శ్రీమదాంధ్రభారతం, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుప‌తి.