AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

ISSN: 2583-4797
Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-12 | November 2022| ISSN: 2583-4797

2. ధర్మజుని ఔన్నత్యం

పిన్నోజి నరేశ్

తెలుగు ఉపన్యాసకులు, సిద్ధిపేట,
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం.
సెల్ : 80741 37379,, email: pinnojinaresh@gmail.com


Keywords:  కవిత్రయభారతం, ధర్మం, ధర్మరాజు, వ్యక్తిత్వం, ఔన్నత్యం.

ఉపోద్ఘాతము:

కవిత్రయభారతంలో కథానాయకుడు ధర్మరాజు. స్థిరత్వమునకు పరాకాష్ట ధర్మజుని వ్యక్తిత్వం. భారతములో దీర్ఘముగా విస్తరించిన పాత్రలలో ధర్మజుని పాత్ర కూడా కలదు. విభిన్న సమయాలలో ధర్మజుని నడవడిని, మాటకారితనాన్ని పరిశీలిస్తే ధర్మజుని ఔన్నత్యం తెలుస్తుంది. ఇక కవిత్రయం ధర్మజుని అసలైన ఆంధ్ర గృహస్తుగా, లౌక్యము తెలిసిన యజమానిగా, మెత్తనిపులిగా చిత్రీకరించి ధర్మజుని తెలుగు వారందరికీ దగ్గర చేశారు.

స్థితప్రజ్ఞత:

ధర్మపరాయణత్వం, పాలనాదక్షత అనే సుగుణాలతో అలారారు ధర్మజునికి బాల్యముననే పితృవియోగము కలుగుతుంది. ఇంటికి పెద్దవాడైన కారణంగా బాల్యమున ఉన్నప్పటికిని తన తమ్ములను సంరక్షించాల్సిన గురుతరబాధ్యత ధర్మరాజు పైన పడుతుంది. అట్టి విపత్కర పరిస్థితుల్లో తన తల్లిని వెంటబెట్టుకుని తమ్ములతో సహా హస్తినకు చేరుతాడు ధర్మజుడు.

రాజ్యలోభము గల అసూయవృక్షము ధృతరాష్ట్రుడు. అతనికి అనుంగు పుత్రుడు దుర్యోధనుడు. ఇలాంటి అసూయాపరుల నడుమ ధర్మరాజు తన వారితో సహా బ్రతకవలసి వస్తుంది. వాస్తవానికి కురుమహాసామ్రాజ్యానికి ఉత్తరాధికారి ధర్మజుడే అయినా పెద తండ్రిని రాజ్యమిమ్మని అడిగి తొందరపడుట, బలవంతము చేయుట వంటి ఆతృత ధర్మజునిలో కనిపించదు. తనకు దన్నుగా నిలిచే భీష్మద్రోణాది ధార్మికుల అభిమానాన్ని, ప్రజల అనురాగాన్ని దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా నడుచుకుంటూ తన సమతా దృక్పథాన్ని ప్రదర్శిస్తూ హస్తినకు యువరాజు అవుతాడు. 

ధీరోదాత్తత:

ఉదాత్తగంభీరమైన ఆకారమున, ఉత్తమోత్తమమైన ప్రజ్ఞకు అపారమైన ప్రజానురాగముతో పాటు పదవి కూడా తోడవడం చేత ధర్మజుని యశస్సు దిగంతములకు వ్యాపిస్తుంది. యువరాజపట్టాభిషేకం తరువాత ధర్మజుడు తన సోదరులు, తల్లితో కలిసి వారణావతం వెళతాడు. అక్కడ దుష్టచతుష్టయం లాక్షగృహాన్ని నిర్మించి అందులో పాండవులను దహించాలనే కుట్రను పన్నుతారు. ఆ ప్రమాదం నుండి బయటపడిన తర్వాత ధర్మరాజు సంయమనాన్ని కోల్పోకుండా “అహింసా పరమో ధర్మః” అనే సూత్రానికి కట్టుబడి కౌరవుల పైన తిరుగుబాటు చేయక మిన్నకుంటాడు. ఇంతటి సంయమనాన్ని పాటించిన ధర్మరాజు ద్రుపదునితో బంధుత్వము కలుపుకుంటాడు. తర్వాతి కాలంలో ఇంద్రప్రస్థానికి ఏలికగా మారి నూతన రాజ్యాన్ని నిర్మించి అనతి కాలంలోనే రాజసూయ యాగము నిర్వహించి రాజలోకంలో తన ఔన్నత్యాన్ని స్థాపించుకుంటాడు. ఇలా అహింసను నమ్ముకుని ముందుకు వెళ్తాడు ధర్మరాజు.  

వ్యక్తిత్వం - లోకజ్ఞత:

ఇంతటి ఉత్తమ వ్యక్తిత్వముగల ధర్మరాజులో జూదము అనే వ్యసనము ఉంటుంది. ఈ వ్యసనం వల్ల తన రాజ్య సర్వస్వాన్ని తన భార్యను, తమ్ములను కోల్పోవలసి వస్తుంది. ఈ అంశాన్ని పరిశీలిస్తే ఎంతటి ఉదాత్త గుణములు కలిగిన వ్యక్తిలో నైన ఒక అవలక్షణమున్నా అది అతన్ని దిగజారుస్తుందని గ్రహించాలి. ఇంతటి వ్యసనలోలత్వం కల ధర్మరాజును భార్య, తమ్ములు కూడా సహించారంటే దానికి కారణం అతని వ్యక్తిత్వమే.

అటు పిమ్మట ధర్మజాదులకు అరణ్యవాసము, అజ్ఞాతవాసము అనుభవించాల్సి వస్తుంది. శత్రువులు పెట్టే బాధలు అనుభవించినప్పుడు ఆవేశపరులు తొందరపడే అవకాశం ఉంది. ఇలా తొందరపాటుతో వ్యవహరించడం వల్ల నష్టము కలిగే అవకాశం ఉంది. అందువల్ల ధర్మజుడు ఆచితూచి అదను చూచి శత్రువుల పైన విజృంభించి స్థిరవిజయమును, చిరకీర్తిని పొందవచ్చని భావించి ఆ కష్టములన్నింటినీ దిగమింగుకొని కాలానికి ఎదురీదుతాడు.

ఇక ఘోషయాత్ర సమయంలో దుర్యోధనాదులను గంధర్వుల బారి నుండి రక్షించి వారికి ప్రాణభిక్ష పెట్టినా అంతకుమించిన మానసికశిక్షణ విధించాడు. ఈ సన్నివేశంలో ధర్మరాజు శత్రువులను కంటికి కనిపించని దెబ్బ కొట్టాడని తెలుస్తుంది. అట్లే సైంధవునికి కూడా ప్రాణభిక్షను పెట్టి అతని ప్రాణాలను నిలబెట్టిన ధర్మమూర్తిగా ధర్మజుడు కనబడతాడు. అయితే ధర్మరాజు నడవడిలో ఒక పక్కన ధర్మము మరొక పక్కన లౌక్యం రెండూ కనబడతాయి.

రాజనీతిజ్ఞత:

అజ్ఞాతవాససమయంలో చక్రవర్తిగా రాచలోకంలో మన్ననలు పొందిన ధర్మరాజు విరాటరాజుకు సేవకునిగా వ్యవహరించడం ధర్మరాజు యొక్క స్థిరత్వానికి పరాకాష్టగా కనిపిస్తుంది. విరాటరాజు సభలో ధర్మరాజు మాటతీరు, ప్రవర్తన ఆదర్శవంతమైన ఉద్యోగి ఏ విధంగా ఉండాలి అనే లక్షణాలను ప్రతిబింబించే విధంగా ఉంటుంది. ఇక సంధి ప్రయత్నాలలో భాగంగా అర్థరాజ్యానికి బదులుగా, ఐదు ఊర్లు ఇచ్చినా చాలని అనడంలో ధర్మరాజు ఔచిత్యం కనబడుతుంది. ఇక శ్రీకృష్ణుని తమ రాయబారిగా కురుమహాసభకు పంపే ముందు శ్రీకృష్ణునితో మాట్లాడిన మాటల్లో అతని వాక్చాతుర్యము కనబడుతుంది. యుద్ధము వల్ల నష్టం కలుగుతుందని పలుకుతూనే దుర్యోధనునితో పొసగదని అంటుంటాడు. ఇక్కడ అసలైన ఆంధ్ర గృహస్తుగా ధర్మజుడు కనిపిస్తాడు.

అజాతశత్రుత్వం:

భారతయుద్ధసమయంలో పెద్దల వద్ద ఆశీర్వాదము గైకొనడం, యుద్ధానంతరము భీష్ముని వద్ద ఉపదేశాన్ని పొందడము, ‘అజాతశత్రువు’ అనే సార్థకనామాన్ని కలిగి ఉండటం అనేవి ధర్మజుని ఔన్నత్యాన్ని రుజువు చేస్తాయి. ఇలా భారతమంతా విస్తరించిన ధర్మరాజు పాత్రలో ‘ధార్మికత’ అనే సుగుణము కనబడుతుంది. ఈ విషయమునే తెలుపుతూ ద్రౌపది పలికే పద్యం-

సీ. ఎవ్వాని వాకిట నిభమద పంకంబు

            రాజభూషణ రజోరాజి నడఁగు!

      నెవ్వాని చారిత్ర మెల్ల లోకములకు

            నొజ్జయై వినయంబు నొరపు గఱపు!

      నెవ్వాని కడకంటి నివ్వటిల్లెడు చూడ్కి

            మానిత సంపద లీనుచుండు!

      నెవ్వాని గుణలత లేడు వారాసుల

            కడపటి కొండపైఁ గలయ బ్రాఁకు!

తే. నతడు భూరిప్రతాప మహాప్రదీప

      దూర విఘటిత గర్వాంధకారవైరి

      వీరకోటీరమణిఘృణివేష్టితాంఘ్రి

      తలుఁడు! కేవలమర్త్యుఁడే ధర్మసుతుడు!

(ఆంధ్రమహాభారతం, విరాటపర్వం 2-191)

మహారాజు వాకిట వున్న గజరాజుల మదధారలవలన నేలంతా బురదయిపోతే – రాజదర్శనానికి వచ్చిన సామంతరాజుల రద్దీ కారణంగా వారి శరీరాల మీది భూషణాల్లోని రత్నమాణిక్యాలు ఒకటొకటి రాచుకున్నందువలన – రాలిన వజ్రాల పొడి ఆ బురదను అడగిస్తున్నదట. అతని శీలం సర్వలోకాలకూ ఉపాధ్యాయకమై వినయంలో పాఠాలు నేర్పిస్తున్నదట. అతని కడకంటి చూపు సోకిన చోట మహా సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయట. అతని సద్గుణాల చర్చ సప్తసముద్రాల అవతలి పర్వతాల మీదకి ప్రాకుతాయట. అటువంటి ధర్మజుడు వైరివీరుల గర్వాంధకారాన్ని దూరానికి తరిమివేసే గొప్ప దీపం లాంటి ప్రతాపంతో శత్రువుల చేత కాళ్ళు మ్రొక్కించుకునే ధర్మజుడు – కేవలం మర్త్యుడేనా? అని దీని అర్థము. దీనిని బట్టి ధర్మజుని ఔన్నత్యం తెలుస్తుంది.

ముగింపు:

“ధర్మరాజు అజాతశత్రువు, ధర్మపరాయణుడు, లజ్జావినయాలంకారభూషితుడు. కనకనే జూదంలో మోసం జరిపి మనం పరాభవించినా నియమానికి కట్టుబడి వీరిని విడిచి పెట్టాడు. ఒక్క ధర్మరాజు పేరు చెపితే నాకు కలిగే భయం ఎంతటిదో చెప్పలేను. బహ్మచర్య దీక్షతో, తపోనిష్టతో ఉండే ధర్మజునికి క్రోధం కలిగిందంటే అది ఎదుటివారిని నాశనం చేసి తీరుతుంది…” అని ధృతరాష్ట్రుడంతటి వాడు సంజయున్ని రాయబారానికి పంపుతూ ధర్మరాజు గురించి చెప్పిన మాటలు యుధిష్ఠిరుడి ఔన్నత్యాన్ని పేర్కొంటున్నాయి. ఈ విధంగానే భీష్మాది గురువృద్ధజునుల నుండి శ్రీకృష్ణపరమాత్మవరకు అందరూ ధర్మజుని ఔన్నత్యాన్ని గుర్తించి అభినందించినవారే. వ్యాసభారతంలోనూ, ఆంధ్రమహాభారతం లోనూ వివిధ ఘట్టాలలో ఈ ధర్మజుని పాత్ర ఎంతో ఆదర్శనీయంగా ఉంటుంది.

ఉపయుక్త గ్రంథాలు:

  1. ఉమాదేవి, ముదిగొండ, (2018). మహాభారత ఉపఖ్యానములు.
  2. సుబ్రహ్మణ్యం, జి.వి., (సంపా.) (2013). కవిత్రయ మహాభారతము, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
  3. వెంకట సుబ్బయ్య, అప్పజోడు, (2012), భారతీయుడా మహాభారతం చదివావా, శ్రీమతి ఏ. సరోజినీదేవి, గూడూరు.
  4. వెంకట సుబ్బయ్య, అప్పజోడు (2019). మహాభారతం - మానవ స్వభావచిత్రణము, శ్రీమతి ఏ. సరోజినీదేవి, గూడూరు.
  5. షణ్ముఖశర్మ, సామవేదం, (2020). ఇదీ యథార్థ మహాభారతం, ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్.
  6. ఉషశ్రీ, భారతం, (1981). తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
  7. కామేశ్వరరావు, తెలుగు పద్యం బ్లాగు, http://telugupadyam.blogspot.com/