AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-5 | May 2022

5. మడికి సింగన కృతులు - పరిచయం

డా. రాంభట్ల వేంకటరాయ శర్మ

పరిశోధకుడు, సాహితీవేత్త సెల్: 7989110805.



ఉపోద్ఘాతం:

మానవుల నాగరికత నదీతీరాల్లోనే వెల్లివిరిశాయి. నదులు జనజీవనానికి ముఖ్యమైనవి. భారతదేశంలో పవిత్రతకు మూలాధారాలైన మహా విషయాలలో నదులకు ప్రత్యేకత ఉంది. నదీ తీరాలలో నాగరికత తో పాటు రాజ్యాలు పెరిగాయి. నదీ జలాలతో రాజ్యం లో పంటలు పండి ప్రజలు ఆనందంగా ఉండటం తో రాజ్యం సుభిక్షంగా ఉండేది. అలాంటి రాజులతో పాటు మంత్రులు దండనాథులు చిరురాజోద్యోగులు కవిత్వాన్ని ఆస్వాదించేవారు, కవులను ఆదరించేవారు.

దక్షిణ భారతదేశంలో అతి పెద్ద జీవనది గోదావరి. గోదావరిని గంగ అనీ, దక్షిణ గంగ అనీ, గౌతమి అనీ, సప్త గోదావరి అనీ వివిధ నామాలతో మనకవులు పిలిచారు. తొలి తెలుగు కావ్యేతిహాసమైన మహాభారతం కూడా నన్నయ్య చేతుల మీదుగా గోదావరి తీరంలోనే ప్రారంభించబడింది. గోదావరి తీరం కవులకు పుట్టినిల్లు. ఈ తీరంలో పుట్టి ఇక్కడే కవిత్వం చెప్పిన వారు కొందరైతే, ఎక్కడో పుట్టి ఇక్కడకు వచ్చి స్థిరపడి కవిత్వం చెప్పిన వారు మరికొందరు. అంతేకాకుండా ఇక్కడ పుట్టి వివిధ కారణాలతో మరో ప్రాంతానికి వలస వెళ్లి అక్కడ కవిత్వం చెప్పి బిరుదులను బహుమానాలను పొందిన వారు కూడా ఉన్నారు. అలాంటి కోవకు చెందిన మహాకవి మడికి సింగన. మడికి సింగన పరిచయం చేసి అతని కావ్యాలను సంక్షిప్తంగా ఈ పరిశోధనా వ్యాసంలో పరిచయం చేస్తున్నాను.

మడికి సింగన శ్రీనాథ యుగంలోని కవి. ప్రాఙ్నన్నయ యుగంతో ప్రారంభమైన తెలుగు సాహిత్యం యుగ విభజనలో శ్రీనాథయుగం(క్రీ.శ 1350 -1500) ఆరవది. దీనికి కావ్య యుగమని పేరు. ఈ యుగం తెలుగు సాహిత్యంలో ప్రత్యేకతను సంతరించుకుంది. భారతీయ సంస్కృతికి మూలస్తంభాలలో ఒకటైన భాగవతం ఈ యుగంలోనే వచ్చింది. ప్రక్రియా వైవిధ్యంతో క్షేత్ర మహాత్మ్యాలు, కథాకావ్యాలు, వీరరస కావ్యాలు, పురాణాలు, ద్విపద కావ్యాలు, శాస్త్ర లక్షణ గ్రంథాలు వంటివి ఈ యుగంలో వెలుగుచూశాయి.

సింగన- జీవిత పరిచయం:

మడికి సింగన 15వ శతాబ్దికి చెందిన కవి. నియోగి బ్రాహ్మణుడు. భారద్వాజ గోత్రుడు. ఈయన తండ్రి నివసించిన తూర్పు గోదావరి జిల్లా మడికి గ్రామ నామమే వీరి ఇంటిపేరయ్యింది. మడికి సింగన తండ్రి తొయ్యేటి అనభూపాలుడి దగ్గర మంత్రిగా ఉన్నాడు. తండ్రి పేరు అయ్యల మంత్రి. గోదావరికి ఉత్తరదిక్కున పెద్దమడికిలో స్థిరమైన తోటలూ, పొలాలు చాలా ఆర్జించి అఖిల జగత్తుకు అన్నదాత అనే పేరుతో జీవించాడు. ముసునూరి కాపయ నాయకుడి ప్రతినిధిగా అనపోతానాయకుడు రాజమహేంద్ర వరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. తొయ్యేటి అనపోత భూపతిని చోడ భక్తి రాజు క్రీ.శ 1355 లో వధించాడు. ఆ సంవత్సరం నుండి రాజమండ్రి ప్రాంతాలు చోడభక్తి రాజు స్వాధీనంలో ఉన్నాయి. అంతవరకు రాజమహేంద్రవరంలో మంత్రులుగా ఉన్న మడికి వంశంవారు రామగిరి దుర్గానికి వలస వెళ్ళవలసి వచ్చింది. అది తెలంగాణలో నేటి కరీంనగర్ జిల్లాలో ఉంది. అప్పటికి రామగిరి దుర్గం రాజధానిగా సబ్బినాడుని పాలిస్తున్న ముప్పు భూపతి వారు. వాళ్ల దగ్గర మంత్రులుగా ఉన్న వాణస వారు మడికి వంశస్తులకు బంధువులయ్యి స్నేహం చేశారు.

మడికి సింగన కందన మంత్రి పేర "నీతితారావళి" రాసినట్లు ఉంది. కానీ అది అలభ్యం. కందనమంత్రికి తాను రచించిన పద్మపురాణోత్తర ఖండాన్ని, ద్విపద భాగవత దశమ స్కంధాన్ని అంకితమిచ్చాడు.

మడికి సింగన రచనలు:

పద్మ పురాణోత్తరఖండం, భాగవత దశమ స్కంధం, జ్ఞాన వాసిష్ఠ రామాయణం, సకలనీతి సమ్మతం అనే నాలుగు మడికి సింగన ప్రముఖమైన రచనలు..

1). పద్మ పురాణోత్తరఖండం:

మారన తర్వాత పురాణ రచనకు ఉపక్రమించిన కవి మడికి సింగన. మూల రచనకు సమయోచితంగా అర్ధవంతంగా కథానువాదంగా, వ్రత కథలు దశావతార కథలు విషయాలుగా ఉన్నాయి. పురూరవ చరిత్ర , సుందోపసుందులు కథ, మాఘ స్నానం కూడా చోటు చేసుకున్నాయి. మూడవ ఆశ్వాసంలోని 67 పద్య గద్యాలతో ఉన్న అహల్యా సంక్రందనం, చిన్న ప్రంబంధమని చెప్పవచ్చును. మనోహర వర్ణనలతో అలరించే ఈ కావ్యంలో శ్రీకృష్ణుని కథలతో పాటు అనేక వర్ణనల్లో కవితా స్పర్శ గోచరిస్తుంది. ఇది ఇది వైష్ణవ మత ప్రతిపాదితమైన గ్రంథం. ఇందులో రామాయణ భాగవత కథలు ఎక్కువగా ఉన్నాయి. 11 ఆశ్వాసాల ఈ పద్మపురాణాన్ని సింగన 1420 లో ముగించాడని ఈ పద్యం వలన తెలుస్తోంది.

మంగళమహాశ్రీ:
ఆకర యుగానల మృగాంక శకవత్సరములై పరగు శార్వరీని బుణ్య
ప్రాకటిత మార్గశిర పంచమిని బొల్చు నుడుపాల సుత వాసరమునందున్
శ్రీ కరముగా మడికి సింగన తెనుంగున రచించెదగ బద్మసుపురాణం
బాకమల మిత్ర శిశిరాంశువుగ గందసచివాగ్రణికి మంగళమహాశ్రీ!

దీనిని బట్టి (కర= 2 యుగ=4 అనల=3 మృగాంక=1) శాలివాహన శకము 1342 వ సంవత్సరానికి సరైన క్రీస్తుశకం 1420 వ శార్వరి సంవత్సరంలో మార్గశీర్ష శుద్ధ పంచమి బుధవారం నాడు పద్మపురాణం ముగించబడిందని తెలుస్తోంది. మడికి సింగన చేసిన స్త్రీ వర్ణనలలో ఔచిత్యం భావుకత తొణికిసలాడుతుంటాయి.

శూర్పణఖ రావణుడికి సీత సౌందర్యాన్ని ఇలా వర్ణించింది.

చం.
పసిడి సలాక పూవిలుతు బాణము సోగ సుధారసంబుపై
మిసిమి దలంప వెన్నెలల మీగడ జేసిన బొమ్మ కందులో
నుసిమిన చంద్రలేఖ బెళుకొందని కారు మెరుంగుతీగ యా
శశిముఖి రాముదేవి సడి సన్నది యొప్పున రాక్షసేశ్వరా! (ప.పు.ఉ.ఖం. 8వ ఆ, 168 వ పద్యం)

శూర్పణఖ ముక్కు చెవులు, రాముడే కోసినట్లుగా పద్మపురాణం ఉత్తరఖండంలో వర్ణించబడింది.

2)భాగవత దశమ స్కంధం:

పోతనాదులు కన్నా ముందుగానే తొట్టతొలి భాగవత భాగాన్ని అనువాదం చేసిన కవి మడికి సింగన. అయితే ద్విపద ఛందస్సులో విరచితమైన ఈ దశమస్కంధం పూర్తిగా అలభ్యం. కాండ విభాగాలుగా మధుర, కళ్యాణ ,జగదభిరక్ష కాండలున్నాయి. అక్రూరుడు శ్రీ కృష్ణుని స్తుతించే ఘట్టం నుండి శిశుపాలవధ వరకు కథనాలు గోచరిస్తాయి. ఈ రచనలోని వర్ణనలు తరువాతి కవులకు మార్గదర్శమైయ్యాయి. "సలలిత రసభావ శబ్ద గుంభనల"శ్రీకృష్ణుని లీలలను వీనులవిందుగా రచింతునని సింగన గ్రంథావతారికలో తెలియజేశాడు.

ఎఱ్ఱన భారతంలో శారదను శారద నీరదగా శ్వేత వస్త్ర ధారిణిగా వర్ణించినట్లు ఈ కవి చీకటిని నల్లని ఉపమానాలతో వర్ణించాడు. ఇతని కథాకథన విధానం సూటిగా నన్నయ్య ప్రసన్న కథా కవితా యుక్తిగా సాగుతుందనడానికి కళ్యాణ కాండలోని ఈ ద్విపద ఉదాహరణ.

నరకాహ్వమందు దానవ కులేశ్వరుడు
పరశక్తి మహిమ దుర్వార సత్వమున
ధరణి పై గల రాజమాత నెల్లనోర్చి
తన శాసనంబుల దగ నిల్పియంత
దనివోక యతి బలోదగ్రుడై నడిచి
మమరాధిపుంగెల్చి మగ్పినోడించి
శమనుని గెలిచి రాక్షసు పారద్రోలి (కల్యాణకాండ)

ప్రాస నియమం తో వరుసగా 3 ఇంద్ర గణాలు ఒక సూర్య గణం కలిగి మొదటి గణంలోని ప్రథమాక్షరానికి యతి కూర్చడం ద్విపద లక్షణం. ఈ లక్షణాలన్నీ పాటిస్తూనే నరకుడి వీర విహారాన్ని సలక్షణంగా వర్ణించాడీ ద్విపద పాదాల్లో.

అలాగే జగదభి రక్ష కాండలో-

మేలైన కృష్ణుని మేఛాయవోలే
నెరినొప్పు కాళింది నీరంబు వోలె
తరచైన తేటుల దాటుల వోలే
పెనుపైన నీలాల పేరుల వోలె
లలినొప్పు నీలోత్పలంబులవోలె
దలమారి చీకటి దట్టమైన పేర్చె!

అంటూ కృష్ణుని మేని చాయలా, కాళింది మడుగు నీరులా! తుమ్మెదల్లా నీలాల పేరు లా, నల్లని కలవల్లా, (నిలోత్పలాలు), నల్లని శిరోజాల కొప్పుల చీకటి దట్టంగా వ్యాపించినట్లు వర్ణించాడు. అయితే ద్విపద పాదంలోని ప్రాస నియమాన్ని విడిచి కొన్ని పంక్తులను మంజరీ ద్విపదలుగా మలచి స్వతంత్రించాడు. "ఆంధ్ర కవుల చరిత్రము" లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు, "సింగన కృత భాగవత దశమ స్కంధము నాకు లభింపలేదు" అని అన్నారు. (ఆం.క.చ.ప్ర.భా.పుట. 378). తర్వాత వాసిష్ఠ మహాదేవ శాస్త్రి గారు పరిష్కరించి 1950లో ముద్రించారు.

3 జ్ఞాన వాసిష్ఠ రామాయణం:

సంస్కృత యోగవాసిష్ఠాన్ని మడికి సింగన వాసిష్ఠ రామాయణంగా రచించాడు. వేదాంత ప్రబోధకమైన ఈ ప్రబంధంలో 5 ఆశ్వాసాల ఉన్నాయి. ఇది అహోబిల నరసింహ స్వామికి అంకితమివ్వబడింది. పదహారేళ్ళ వయసు లోనే సంసారం మీద విరక్తి కలిగిన శ్రీరాముడికి వశిష్టుడు విశ్వామిత్రుడి కోరిక మీద జ్ఞాన బోధ చేయడమే ఇందులో కథాంశం. ఇందులో లో వైరాగ్యము, ముముక్షువు, ఉత్పత్తి, స్థితి ఉపశమనము, నిర్వాణము అనే ఆరు ప్రకరణలు ఉన్నాయి. జటిలమైన ఆధ్యాత్మిక విషయాలను సింగన సుకుమారమైన కవిత్వంతో సుబోధకంగా చెప్పాడు.

వాసిష్ఠ రామాయణం ద్వారానే సింగన వంశావళీ వివరాలు తెలుస్తున్నాయి. అంతేకాకుండా పద్మపురాణోత్తరఖండాన్నీ, భాగవత దశమ స్కంధాన్ని రచించినట్లు గా ఇందులోనే పేర్కొన్నాడు. వాసిష్ఠ రామాయణాన్ని తెలుగులో పద్యంతో కాకుండా సంస్కృత శ్లోకంతో ప్రారంభించాడు. తెలుగు పూర్వకవులలో నన్నయ్య తిక్కనలను మాత్రమే స్తుతించాడు.

రఘువంశ గురువైన వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి చేసిన ధర్మ ప్రబోధమే ఈ ప్రబంధం.! జగన్మిథ్య ఆత్మ సత్యం అనే ధర్మదీక్షా కర్తవ్యంలో దాశరథికి కర్తవ్యోన్ముఖుని చేసే సందర్భంలో...

కం.
తన బుద్ధి వికల్పనమున
జనియించు జగంబు! దాని సంక్షయమున నా
శన మొందును సంసారం
బని మదిగను మిదియె నిశ్చితార్థము పుత్రా! (వా. రా. 1 ఆ. 139వ పద్యం )

శుక మహర్షి వేదవ్యాసుని కొడుకు. మహాజ్ఞాని. లోక గతి ఆత్మతత్వం తెలిసినవాడు. అయినా ఆత్మజ్ఞానం గురించి సందేహం వచ్చి తన తండ్రి వ్యాసుణ్ణి అడిగిన సందర్భంలోనిదీ పద్యం. మడికి సింగన రచించిన ఈ వాశిష్ఠ రామాయణంలో మొత్తం 39 ఆఖ్యానాలున్నాయి. ఇందులో అంతా జ్ఞానోపదేశమే. ఇందులోని లవణోపాఖ్యాణాన్నే గురజాడ అప్పారావు గారు లవణరాజు కలగా ముత్యాల సరాలు గా ఆధునికాంధ్ర సాహిత్యానికి అందించారు.

4) సకలనీతి సమ్మతం:

జ్ఞాన వాశిష్ఠ రామాయణం కంటే ముందే వెలువడిన సకలనీతి సమ్మతం దైవాంకితం. తొలి తెలుగు సంకలన గ్రంథం. ఇది రాజనీతి పద్యాల సంకలనం. అర్థశాస్త్రం, రాజాశ్రితులు, రాజభృత్యులు, షోడశ సంధులు, సప్త ఉపాయాలు, సప్త వ్యసనాలు మొదలైన అంశాలున్నాయి. భారతం పంచతంత్రం కేయూరబాహు చరిత్రం శ్రీగిరి శతకం బద్దెన నీతి మొదలైన కావ్యాల నుండే కాకుండా కామందకం, పురుషార్థసారం, చారుచర్య ఇతర శాస్త్రాల నుండి పద్యాలు ఇందులో సంకలితాలు. చాటువులతోపాటు స్వియ పద్యాలు కూడా ఉన్నాయి.
"సకల నయశాస్త్ర మతముల సంగ్రహించి
గ్రంథ మొనరింతు లోకోపకారకముగను" అని సంకల్పించిన ఈ గ్రంథంలో అయిదు ఆశ్వాసాలకు మూడు మాత్రమే లభ్యం.

సకల నీతి సమ్మత సారం, ప్రాజ్ఞనన్నయ యుగంలోని ప్రాకృత కవితా సంకలనం గాథాసప్తశతి క్రీ.శ. 1వ శతాబ్దం తర్వాత తెలుగులో వెలువడిన కవితాసంకలన గ్రంథం. దీనిని కేశవమంత్రి ప్రతిష్ఠించిన కేశవస్వామికి అంకితం ఇచ్చాడు. ఇందులో మూడు ఆశ్వాసాలు మాత్రమే లభ్యం అవుతున్నాయి. ఇది ఒక ప్రాచీన నీతి మంజరి. భవ్యకవితా పారిజాతం, ఇది 6 మంది అజ్ఞాత కవుల రచనల సంకలనం." అల్లకల్లోలమైన పాల సముద్రాన్ని చిలికి దేవామృతాన్ని వెలికి తీసిన విధంగా, గంధకారుడు ముందు గల వస్తువులను అందంగా కూర్చి సుగంధం జత చేసినట్లు, అడివి పువ్వుల తేనె తుమ్మెద జున్ను పట్టు విధముగా; ముత్యాలను పరిమాణం వారీగా గుచ్చి హారం చేసినట్లుగా ఈ గ్రంథం చేసాను" అని సింగన సంకలనానికి ముందుమాటలో రాసుకున్నాడు. అతను ఏఏ గ్రంథాల నుండి తీసుకున్నాడో వరుసగా- అ) అజ్ఞాతము, ఆ) కామందకము, ఇ) కుమార సంభవము నన్నె చోడుడు, ఈ) కేయూరబాహు చరిత్ర మంచెన, ఉ) చాటువు, ఊ) చారుచర్య అప్పనమంత్రి, ఎ) ధృతరాష్ట్ర నీతి తిక్కన, ఏ) ధౌమ్యనీతి తిక్కన, ఐ) నీతి తారావళి కందనామాత్యుడు ఒ) నీతిభూషణం ఆంధ్ర భోజుడు, ఓ) నీతిసారం రుద్రదేవుడు, ఔ) పంచ తంత్రి, అం) పద్మ పురాణము మడికి సింగన, అః) పురుషార్థ సారము శివదేవయ్య, క) బద్దెన నీతి బద్దెన, ఖ) భీష్మ పర్వం తిక్కన, గ) మదీయము మడికి సింగన, ఘ) మార్కండేయము మారన, జ్ఞ) మిత్రనీతులు, చ) ముద్రమాత్యము క్షేమేంద్ర లక్కా భట్టు, ఛ) విదురనీతి తిక్కన, జ) శాంతి పర్వము తిక్కన, ఝ) శాలి హోత్రము, ఇ) శ్రీగిరి శతకము శ్రీగిరి, ట) శ్రీ రామాయణము, ట) సభాపర్వం, నన్నయ, డ) సౌప్తిక పర్వము తిక్కన.

ఈ నాలుగు మడికి సింగన రచనలు. ఈ నాలుగు వేటికవే తమ స్థానాన్ని పదిల పరుచుకుంటూ మడికి సింగనను ఉత్కృష్టమైన కవిగా తెలుగు సాహిత్యంలో విశిష్టంగా నిలబెట్టాయి.

ఉపయుక్త గ్రంథ సూచి:

1. ఆంధ్ర కవుల చరిత్రము-కందుకూరి వీరేశలింగం పంతులు
2. తెలుగు సాహిత్య సమీక్ష భాగము 1 - ఆచార్య జి.నాగయ్య
3. పద్మ పురాణోత్తరఖండం -2 భాగాలు మడికి సింగన
4. భాగవత దశమ స్కంధం (ద్విపద)- మడికి సింగన
5 వాసిష్ఠ రామాయణం - మడికి సింగన
6. సకలనీతి సమ్మతం మడికి సింగన
7. సచివోత్తములు-కోన వెంకటరాయ శర్మ