AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-5 | May 2022

1. రాజశేఖరచరిత్ర – సమీక్ష

డా. శ్రీమతి మాడ్గుల ప్రఫుల్ల

తెలుగు సహాచార్యులు & డీన్ (ఎడ్యుకేషన్),
భాషాసాహిత్యశాఖ, శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్,
అనంతపురం – 515001. ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
Cell: 9440285985, Email: mpraphulla@sssihl.edu.in


తెలుగులో  నవలాసాహిత్యప్రక్రియకు శ్రీకారం  చుట్టినవారు కందకూరి వీరేశలింగం పంతులు గారు. రాజశేఖర చరిత్ర తొలి తెలుగు నవల అనే విషయం ఇక్కడ చర్చనీయాంశం కాదు కనుక ఆ వాదనల జోలికి వెళ్ళడం లేదు.

రాజశేఖరచరిత్ర ఆలివర్ గోల్డ్-స్మిత్ వ్రాసిన "వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్" ప్రభావంతో  వ్రాయబడింది. రాజశేఖర చరిత్రలోని కొన్ని ప్రధాన సంఘటనలు ఆంగ్ల నవలలోని ఇతివృత్తాన్ని పోలి ఉన్నాయి. అందుకే రచయిత గాని, విమర్శకులు కాని దీనిని అనువాదనవలగా పరిగణించలేదు.

కందుకూరి వారే మొదటి కూర్పులో ఈ విషయాన్ని గూర్చి"ఈ గ్రంథము యొక్క కథను కల్పించుటలో గోల్డ్ స్మిత్తను ఇంగ్లీషు కవీశ్వరుని గ్రంథసాహాయ్యమును కొంత పొందినను, దానికిని దీనికిని విశేష సంబధమేమియు యుండదని, దీనియందు వ్రాయబడిన విషయము లన్నియును నూతనములే అనియు గూడ విన్నవించుచున్నాడను"[1] అని చెప్పుకున్నారు. రాజశేఖరచరిత్ర వ్రాయడానికి గల కారణములేవి? అన్న విషయాన్ని కూడా రచయిత స్పష్టం చేశారు. "ఆంధ్రభాషలో జనుల ఆచార వ్యవహారాలను తెలుపుచు నీతిబోధకములుగా నుండు వచనప్రబంధము లేకపోవడం వల్ల, ఆ లోపమును తొలగించుటకు"[2] దీనిని వ్రాశారు. నిజానికి ఇక్కడ చెప్పిన ఆచార వ్యవహారాలు, నీతిబోధకాలతో  కూడి ఉంటుంది సాహిత్యం అంతా. అది పద్యరూపమయినా, గద్యరూపమయినా. కనుక ప్రాచీనసాహిత్యానికి, క్రొత్త సాహిత్యప్రక్రియకు భేదాన్ని తెలియజేయడానికి  రచయిత ప్రత్యేకించి దీనిని వచనప్రబంధమన్నారు. ఈ  మాటను వారు ఆంగ్లంలోని "నవల" అన్న పదానికి సమానార్థకంగా ఉపయోగించారు.

రాజశేఖర చరిత్ర ద్వారా రచయిత అందిచాలనుకున్న సందేశమేమి? అని ఆలోచిస్తే కందుకూరి వారికి ప్రధానంగా సంఘసంస్కరణ మీదే దృష్టి ఉంటుంది. వారి రచనల్లో సాధారణంగా తర్కానికి నిలువని, శాస్త్రప్రమాణాలు లేని ఎన్నో విషయాలను సున్నితంగానో, గాఢంగానో అధిక్షేపించడం కనిపిస్తుంది. ఏ సాహిత్యప్రక్రియను తీసుకున్న వారు తమ ఆశయాన్ని అందులో పొందుపరిచారు.

రాజశేఖర చరిత్రలో రచయిత ప్రజల ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, నాటి సమాజంలోని ప్రజల జీవన విధానాలు, ఆడంబరాలు, మోసాలు, స్వార్థ ప్రయోజనాలు వీనికి కారణమైన వారి మనస్తత్త్వాలు, ఆశయాలు, ఆదర్శాలు మొదలయిన వాటికి ప్రాధాన్యమిస్తూ కథను నడిపించారు.

రాజశేఖరచరిత్రను గూర్చి ఆంగ్ల పండితులు “Written by native gentleman of refinement and education, the book is fine and invaluable as an impartial study of native character as seen by native eyes”[3] అన్నారు.

విశేషమైన విషయం ఏమంటే కందుకూరి వారి రాజశేఖరచరిత్రను రాబర్ట్ హచిన్ సన్ ఫార్చూన్స్ వీల్ అను పేరుతో ఆంగ్లంలోనికి అనువదించారు.

       రాజశేఖరచరిత్రలో కథానాయకుడు రాజశేఖరుడు ధనవంతుడు. చెల్లెలు, భార్య, ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు - ఇది ఆయన కుటుంబం. రాజశేఖరుడు ముఖస్తుతులకు పొంగిపోయి, చేతికి ఎముక లేకుండా దానధర్మాలను చేసే మనస్తత్త్వమున్న మనిషి. మనుషులను సులభంగా నమ్మే అమాయకుడు. స్వానుభవంతో తప్ప తోటి వారి బుద్ధులను తెలుసుకోలేక పోయాడు. రాజశేఖరుని అన్నదానం తీరు, అమాయకత్వం ఎలా ఉందో ఈ వాక్యాలలో మనకు స్పష్టమవుతుంది.

"రాజశేఖరుడు గారింటికి నిత్యము బంధువులు నలువది తరము గడచిపోయినను, వంశవృక్షములు సహితము చూచుకోనక్కర లేకుండా తమ బంధుత్వము జ్ఞాపకముంచుకొని రాజశేఖరుడు గారి మీది ప్రేమచేత ఆతనిని చూచి ఆదరించి పోవలెనను ఉద్దేశముతో వచ్చి నెలల కొలది నుండి, తిని పోవుచు, వస్త్రములు మొదలగు వానిని బహుమానములుగా పడయుచుందురు. ఊరనుండు పెద్దమనుషులు, సుపరిచితులయిన వారు కూడా రాజశేఖరుడు గారింట వంట దివ్యముగా చేయుదురని శ్లాఘించుచు నెలకు సగము దినములచ్చటనే భోజనములు చేయుదురు"[4]. ఆకలితో అలమటించే వానికి, భోజనం సమయానికి ఇంటికి వచ్చే వానికి భోజనం పెట్టడం ధర్మం. కానీ రాజశేఖరుని మంచితనాన్ని అడ్డం పెట్టుకుని తినిపోయే వారే ఎక్కువ.

“కూర్చుని తింటే కొండలయినా కరిగిపోతా”యని సామెత. అందుకే ఉన్న దాన్ని రెట్టింపు చేసుకోవాలన్న ఆశతో బైరాగి చేతిలో మోసపోయాడు రాజశేఖరుడు. ఉన్న ఆస్తి పోగా నిత్యం పలకరించే వారు కూడ ముఖం చాటేస్తున్నప్పుడు తెలిసింది తన చుట్టూ చేరిన వాళ్ళ మనస్తత్త్వం.

లోకంలో డబ్బున్న వారికే గౌరవ మర్యాదలుంటాయన్న విషయాన్ని ఈ పాత్ర ద్వారా తెలియ చేశారు రచయిత. డబ్బు వల్లనే కీర్తి, ప్రతిష్ఠలు కలుగుతాయన్న విషయాన్ని వంట బ్రాహ్మణుడొకడు రాజశేఖరునితో అంటాడు. "కీర్తికేమి? దానిని కొనుటకయి ముందుగా ధనము సంపాదించిన ఎడల తరువాత నిమిషములతో కావలసినంత కీర్తిని కొనవచ్చును"[5]

ఇదే లోకం తీరు. కందుకూరి వారి కాలంలోనయినా, ప్రస్తుతమయినా, రాబోయే కాలంలో అయినా మనుషుల ఆలోచనావిధానం, వ్యవహారం ఇలాగే ఉంటాయి.

మనకు "రామాది వత్ వర్తితవ్యం, నతు రావణాది వత్" అన్నది రామాయణ సందేశమయితే, రాజశేఖరచరిత్రలో కథారంభంలోని రాజశేఖరుని విధంగా ఉండవద్దని, కధాంతంలోని రాజశేఖరుని విధంగా వివేకంతో ఉండమని రచయిత ఉద్బోధగా అనిపిస్తుంది.

రాజశేఖర చరిత్రలో కనిపించే నమ్మకాలు, మూఢ నమ్మకాలు, గ్రహణ సమయంలో  పాటించే ఆచారాలు, సోది చెప్పించుకోవడాలు మొదలయినవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. జబ్బు పడినప్పుడు విభూతి మంత్రించిపెట్టడం, దిష్టి తీయడం, జాతకరీత్యా గ్రహాలు చాలవని గ్రహశాంతులు చేయించడం, బైరాగులను, సిద్ధాంతులను, సన్యాసులను ఆశ్రయించి వారి దివ్యశక్తులతోను, జ్యోతిశ్శాస్త్ర ప్రావీణ్యంతోను పరిస్థితులను, గ్రహస్థితులను చక్కబరచడం, భూతవైద్యం, తాయెత్తులు కట్టడం, గ్రహం గ్రామంలో ప్రవేశించిందని, దానికి ఆగ్రహం కలిగిందని శాంతి చేయడం, భేతాళుని పూజించడం, సిద్ధాంతి కూతుర్ని గతించిన మగడు ఆవహించి పీడుస్తున్నాడని గ్రహజపాలు, శాంతులు మొదలయినవి చేయించడం - ఇలాంటివి ఎన్నో సవివరంగా చెప్పారు రచయిత.

కాల గమనంలో మార్పులున్నాయి.  కాని ప్రజల మానసిక స్థితులలో నాటి సమాజానికి, నేటి సమాజానికి విశేషమయిన మార్పులు కనిపించడం లేదు. ఈ విషయంలో విద్యావంతులు, అవిద్యావంతులు, పండితులు, పామరులు, నగరవాసులు - గ్రామవాసులు అని తేడా లేదు. నిజం చెప్పాలంటే అయిన దానికి కానిదానికి ముహూర్తాలు, జాతకాలు చూడడం, గ్రహశాంతులు కాలక్రమంగా ఎక్కువవుతూనే ఉన్నాయి. ప్రజల నమ్మకాలను, మానసిక బలహీనతలను ఆసరాగా చేసుకొని సిద్ధాంతులు, బైరాగులు, భూతవైద్యుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గ్రహణవిషయమై రాజశేఖరుడు శాస్త్రీయమైన విషయాన్ని వివరించి చెప్పినా జనం అంగీకరించే స్థితిలో లేరు. "ఇండ్లు కాలుట గ్రహము చేతనే అయిన ఎడల ఒకసారి జాతర చేసి పంపిన గ్రహము మరల వచ్చుటకు కారణమేమని"[6] సుబ్రహ్మణ్యం ప్రశ్నించినప్పుడు సత్రం బ్రాహ్మణుడు సమాధానం చెప్పకపోగా కోపగించుకుంటాడు. వర్షకాలంలో పైకప్పు తడిగా ఉండడం వలన అగ్నిప్రమాదాలు జరగవనే సహేతుకమైన సుబ్రహ్మణ్యం సమాధానాన్ని అంగీకరించడు. ఇలాంటి నమ్మకాలను దృఢపరిచే ప్రయత్నాలే ఎక్కువగా ఉంటాయి సమాజంలో.

కందుకూరి వారి అధిక్షేపానికి ఒక ఉదాహరణ - సిద్ధాంతి భార్య సోమిదేవమ్మ. సాధారణంగా సోమయాగం చేసిన వారిని సోమయాజులు, వారి భార్యను సోమిదేవమ్మ అని వ్యవహరించేవారు. "స్వర్గ కామో యజేత" అన్నది శాస్త్రవాక్యం. ఈ వాక్యంలో స్వర్గం, కామం, యజ్ఞం అనే పదాలలోని అంతరార్థాన్ని చెప్పేవారు లేరు. యజ్ఞ యాగాదుల వల్ల స్వర్గ ప్రాప్తి కలుతుందని నమ్మకం. "సోమిదేవమ్మ తాత 34 శ్రావణ పశువులను బట్టి మరి రంభాదులతో స్వర్గ సుఖమనుభవింప బోయెను"[7] అన్న రచయిత మాటల్లో సున్నితమైన హాస్యం, అధిక్షేపం కనిపిస్తాయి.

కందుకూరి వారి సంఘ సంస్కరణల్లో ప్రధానమయినవి స్త్రీ విద్య, వితంతువుల దీన, హీన పరిస్థితులను చక్కబరచడం.  ఈ విషయంలో కందుకూరి వారు కృతకృత్యులయినారు. పల్లెల్లో కూడ ఆడపిల్లలు చదువుకోవడం, వారికి ప్రత్యేక పాఠశాలలు, వితంతువులు నిరలంకృతులు కాకపోవడం వీరేశలింగం గారి చలువే.

నవలలో రాజశేఖరుడు స్త్రీవిద్యకు వ్యతిరేకి కాడు. ఆనాడు స్త్రీల విద్యాభ్యాసానికి అవకాశాలు తక్కువ. అయినా రాజశేఖరుడు “తమ కుమార్తె మీది ముద్దు చేత తానె రుక్మిణికి క్రొత్త పుస్తకమును అన్యసాహాయ్యము లేకుండ అర్థముచేసికొను శక్తి కలుగునంతవరకు విద్యను”[8] చెప్పినాడు.

ఈ విషయాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయినారు. రాజశేఖరుడు డబ్బున్నవాడు కాబట్టి ప్రశ్నించే ధైర్యం లేకుండాపోయింది. కానీ సహించలేని వారిలో ఒక  వృద్ధుడు  ధైర్యం చేసి అడిగినప్పుడు రాజశేఖరుడు  స్త్రీవిద్యకు అనుకూలమయిన స్మృతి వాక్యాలు చదివి వినిపించాడు. స్త్రీవిద్య శాస్త్రానికి వ్యతిరేకం కాదని సప్రమాణంగా నిరూపించినాడు.

రాజశేఖరుడు రుక్మిణిని చదివించడానికి కారణం కేవలం కుమార్తె మీది ప్రేమ మాత్ర కాదు. అతడు విద్యవలని లాభాలను ఎరిగినవాడు. స్త్రీవిద్య ఏ శాస్త్రములోను నిషేధింపబడకుండుట, పూర్వపు పతివ్రతలందరు విద్యావంతులయి ఉండుటను తెలిసిన వాడు కనుకనే స్త్రీ విద్యను ప్రోత్సహించినాడు.

రుక్మిణి భర్త మరణించినాడను వార్త విన్నప్పుడు రుక్మిణికి అలంకారములు తీసివేయడానికి రాజశేఖరుడు అంగీకరించ లేదు.

ఈ విధంగా రాజశేఖర చరిత్రలో నాటి సామాజిక జీవన విధానంతో పాటు రచయిత ఆశయాలు, ఆదర్శాలు కూడ చోటు చేసుకున్నాయి. కందుకూరి వారు పీఠికలో చెప్పుకున్న విధానం వారి రచనలో ప్రతిఫలించింది.

పాదసూచికలు: 

[1] రాజశేఖరచరిత్ర – పీఠిక, మొదటి కూర్పు  

[2]  రాజశేఖరచరిత్ర – పీఠిక, మొదటి కూర్పు  

[3] వీరేశలింగం పంతులు – సమగ్రపరిశీలన, పుట 146

[4]  రాజశేఖరచరిత్ర – పుట: 41

[5] రాజశేఖరచరిత్ర – పుట: 97

[6]  రాజశేఖరచరిత్ర – పుట: 92

[7]  రాజశేఖరచరిత్ర – పుట: 25

[8]  రాజశేఖరచరిత్ర - పుట : 29

ఆధారగ్రంథాలు:

  1. వీరేశలింగం, కందుకూరి, (1945) వీరేశలింగం రచనలు, మూడవ సంపుటం, నవలలు, స్వతంత్ర ఆర్ట్ ప్రింటర్స్, విజయవాడ.
  2. డా. రమాపతి రావు, అక్కిరాజు, (1972) వీరేశలింగం పంతులు సమగ్ర పరిశీలన, విశాలాంధ్ర ప్రచురణాలయం, విడయవాడ.