AUCHITHYAM | Volume-3 | Issue-7 | July 2022
4. రంగస్థల నటుడిగా ‘ఆచార్య పింగళి లక్ష్మీకాంతం’
నలసాని రాం ప్రసాద్
రీసెర్చ్ స్కాలర్, తెలుగుశాఖ, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్
చరవాణి: 9502847494. ఈమెయిల్: ramnalasani@gmail.com
పింగళి లక్ష్మీకాంతం జీవితం:
తెలుగు సాహిత్యంలో సాహిత్య చరిత్రకారుడిగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా, కవిగా బహుముఖ ప్రజ్ఞా పాటవాల్ని ప్రదర్శించిన వారిలో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం ఒకరు. ఈయన క్రీ.శ.1894 వ సంవత్సరం జనవరి పదవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా బందరు తాలూకా ఆర్తమూరులో పింగళి కుటుంబమ్మ, వెంకటరత్నం దంపతులకు లక్ష్మీకాంతం జన్మించారు. ఈయనకు ఇద్దరు తమ్ముళ్ల, ఒక చెల్లెలు. వారి పేర్లు వరుసగా నరసయ్య, వీరయ్య సుందరమ్మ. పింగళి వంశస్తులు, గౌతమ గోత్రస్తులు. వీరు నియోగి బ్రాహ్మణులు, సూర్యోపాసకులు, శ్రీ వేంకటేశ్వరస్వామి ఇలవేల్పు. అందుకే వీరి రచనల్లో సూర్య భగవానుని, శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామిని ప్రత్యేకంగా భక్తిపూర్వకంగా, ఆధ్యాత్మీకంగా పూజించారు.
బాల్యం, విద్యాభ్యాసం:
పింగళి లక్ష్మీకాంతం చిన్నతనం నుంచి చాలా చురుకుగా ఉండేవారు. చిన్నతనం నుంచి పద్యాలు, పాటలు నేర్చుకోవడం, అందరి ముందు భయం లేకుండా మాట్లాడేవారు. బందరు హిందూ హైస్కూల్లో తెలుగు పండితునిగా చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు పాఠాలు బోధించేవారు. అక్కడ పింగళి లక్ష్మీకాంతం తెలివితేటలను, ప్రతిభను చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు గుర్తించారు. తన శిష్యుడిగా పింగళి లక్ష్మీకాంతాన్ని దగ్గరకు తీసుకొని ప్రోత్సహించారు. పింగళి వారు గురువు గారి దగ్గర మంచి విద్యార్థిగా పేరు సంపాదించుకున్నారు.
రంగస్థల నటుడిగా పింగళి లక్ష్మీకాంతం:
ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారి పేరు స్మరించగానే తెలుగు సాహిత్య చరిత్రలో కవిగా, అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా, వ్యాసకర్తగా అందరికి తెలిసిందే. ఆయన నటుడిగా కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన తన జీవిత తొలి దశల్లో నటుడిగా, అవధానిగా, కవిగా కనిపిస్తారు. ఆయన ఒకవైపు నాటకాలలో పాత్రలను పోషిస్తూ మరోవైపు తిరుపతి వేంకట కవులతో, కాటూరి వేంకటేశ్వరరావుగారితో కలిసి అవధానాలు చేసేవారు. ఈ నేపథ్యంలో ఆయన నాటక ప్రక్రియ పట్ల ఆకర్షితులౌతూనే, ఆనాటి నాటక సంస్థలతో కలిసి పలు నాటకాల్లో ఎన్నో పాత్రలను పోషించారు. అలా నాటక ప్రక్రియను చేపట్టడం ద్వారా ఆయనలో నిక్షిప్తమై ఉన్నా నటనా కౌశల్యాన్ని, నాటక కర్తగా ఆయన సాధించిన అపూర్వ పరిణితిని నాటక విమర్శకులు ప్రశంసించారు. ఆయన నాటకాల్లో పోషించిన వివిధ పాత్రల తీరు తెన్నులను ఆయన సమకాలికులు గుర్తించి ఆ విశేషాలను రికార్డు చేశారు. ఈ కోవలోనే పురాణం సూరి శాస్త్రి గారు పింగళి వారి నటనా ప్రదర్శనను అత్యంత దగ్గరగా వీక్షించారు. పింగళి వారి నటనను, వాచికాన్ని, అభినయాన్ని ప్రదర్శించిన తీరు తెన్నులను తెలుసుకోవడానికి ‘నాట్యాంబుజము’ అనే గ్రంథం ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాకుండా ఆచార్య పింగళి వారి స్మారక సంచికలో, పింగళి వారి శత జయంతి సంచికలో, పింగళి వారి జీవిత చరిత్రలో ఆయన నాటక సాహిత్యం గురించి, నటన గురించి కూడా వ్యాస కర్తలు ప్రస్తావించారు. దీని ఆధారంగా కూడా పింగళి వారి నాటక సాహిత్యం పట్ల ఉన్న గౌరవం, ఆసక్తి అవగతమౌతుంది. కనుక నాటి నాటక కర్తలకు ఏ మాత్రం తీసిపోరని పింగళి లక్ష్మీకాంతంగారి నటన కౌశల్యం తెలుస్తుంది. కనుకనే తెలుగు సాహిత్యంలో పింగళి వారు నాటక రంగంలో ఒక నటుడిగా ఆయన ప్రస్థానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.
పింగళి లక్ష్మీకాంతంగారు నాటకాలలో భిన్నమైన పాత్రలను పోషించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. గయోపాఖ్యానంలో ‘శ్రీకృష్ణుడి’ పాత్రను, పాదుకాపట్టాభిషేకంలో ‘భరతుడి’ పాత్రను, కంఠాభరణం నాటకంలో ‘శ్రీకృష్ణుని’ పాత్రను, రసపుత్రవిజయం నాటకంలో ‘రాజసింహుడి’ పాత్రను, ప్రతాపరుద్రీయం నాటకంలో ‘విద్యానాధుడి’ పాత్రను, చిత్రనలీయం నాటకంలో ‘బాహుకుడి’ పాత్రను, ముద్రారాక్షసం నాటకంలో ‘రాక్షసమంత్రి’ పాత్రను, మృచ్ఛకటికం నాటకంలో ‘చారుదత్తుడి’ పాత్రలను వేషాలను వేసి ప్రదర్శనలు ఇచ్చారు.
విద్యార్థి దశలో నాటక ప్రదర్శన:
పింగళి వారు తొలి సారిగా నాటకంలో వేషాలు వేయడానికి వీరి ఆర్థిక పరిస్థితియే కారణం. ఈ నేపథ్యాన్ని గూడూరి నమశ్శివాయ గారు ఈ విధంగా తెలియజేశారు.‘‘ఐదవ ఫారం చదువుతూండగానే ఆయన నాటకాలలో చిన్నచిన్న వేషాలు వేయడం ఆరంభించారు. కాని ఆర్థిక మైన యిబ్బందుల వల్ల పాఠశాల చదువు వారికి చాలా కష్టమే అయింది. నాటకాలలో వేషాలు వేస్తూనే స్కూలు ఫైనల్ పూర్తి కావించారు’’ (శ్రీ పింగళి లక్ష్మీకాంతం జీవిత చరిత్ర, 1991, పుట: 5,6)
పింగళివారి నాటక ప్రవేశం:
ప్రముఖ కవి విశ్వనాధ సత్యనారాయణగారి షష్టిపూర్తి సన్మాన సభలో పింగళి లక్ష్మీకాంతంగారు తన నాటక ప్రవేశమును గురించి ఈ విధంగా చెప్పుకుంటూ... ‘‘నాటకరంగంలో ప్రవేశం తొలుత నాకు గురుపాదులైన శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారి మూలంగానే కలిగింది. శాస్త్రిగారు తాము ఏ వూళ్లో అవధానం చేసినా అచట తమ నాటకాలను గూడా తమ శిష్యులచేత ప్రదర్శింపచేస్తూ ఉండేవారు. శిష్యులకు కవిత్వములోనే గాక నటనలో కూడా ఆయన తరిఫీయతు(శిక్షణ) ఇచ్చేవారు. నాటకాలలో వేషాలు వేసేవారిని ఆ కాలంలో ఒక విధంగా చిన్నగా చూడడం ఉండేది. కాని వేంకటశాస్త్రిగారు తమ శిష్యుల చేతనే వేషాలు వేయిస్తున్నారనే సరికి నాటక కళకు, నటులకు గూడ గౌరవం ఏర్పడింది’’ అని(గూడూరి నమశ్శివాయ, శ్రీ పింగళి లక్ష్మీకాంతం జీవిత చరిత్ర,1991,పుట:13) అన్నారు.
తొలిసారి ధర్మరాజు పాత్ర ప్రదర్శన:
పింగళి లక్ష్మీకాంతంగారు నాటకంలో ధర్మరాజు పాత్రను ఏ పరిస్థితుల్లో ప్రదర్శించాల్సి వచ్చిందో చెబుతూ ‘‘శ్రీ చెళ్లపిళ్ల వారి ఆధ్వర్యాన ఒక ఊళ్లో పాండవోద్యోగ విజయముల నాటకం ప్రదర్శించవలసి వచ్చిందట. ధర్మరాజు పాత్రధారి జబ్బుచేసి రాలేక పోయాడు. శాస్త్రిగారు ఆ పాత్రను లక్ష్మీ కాంతంగారిని ధరించవలసినదిగా ఆదేశించారట. లక్ష్మీకాంతంగారు ఆపాత్రను ధరించటం, పెద్దల మెప్పుపొందడం జరిగింది. అప్పటి నుండి ఆ పాత్రను వారే ధరించి నటిస్తూ వచ్చారు’’ (శ్రీ పింగళి లక్ష్మీకాంతం జీవిత చరిత్ర,1991, పుట:10) అని గూడూరి నమశ్శివాయ అన్నారు.
పాండవోద్యోగ విజయం (ధర్మరాజు):
తెలుగు నాటక సాహిత్యం గురించి మాట్లాడేవారికి చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారు తెలియనివారుండరు. ఆయన రాసిన ‘పాండవోద్యోగవిజయం’ ఆనాటి నాటకకర్తలందరినీ ప్రభావితం చేసింది. నాటక సాహిత్యంలో అంత గొప్ప నాటకం పాండవోద్యోగ విజయం. కనుక ఈ నాటకాన్ని కూడా పింగళి వారు ప్రదర్శించారనడానికి కొందరు విమర్శకులు ప్రశంసించిన తీరే నిదర్శనం. దీనిని శ్రీ గొడవర్తి సూర్య నారాయణ గారు ఈ విధంగా తెలియజేశారు. ఒ‘‘1917లో రాజమండ్రిలో పాండవోద్యోగ విజయం నాటకంలో పింగళి వారు ధర్మరాజు పాత్రధారి. ఇందులో పింగళి సోదరుడు పింగళి నరసింహుడు భీముడు పాత్రను వేశారు. వీరి పాత్రల ప్రదర్శనాన్ని వడ్డాది సుబ్బారాయుడుగారు పింగళి వారితో ‘ఎవరయ్యా వీరు అన్నదమ్ములా’ అన్నారు. అప్పుడు వీరు రంగస్థల మీదికివచ్చి ఆశువుగా కింది పద్యాన్ని చదివినారు.
"వీర రసావతారుడని విశ్రుతికెక్కిన నాటకుండు వా
క్శూరుడు మా నృసింహునకు కూరిమి తమ్ముడ వీర శోక శృ
గార రస ప్రధానముల నాయక వేష ధరుండ సత్కవిన్
పేరునకేను కాంతుడ పవిత్రపు పింగళి వంశజాతుడన్ ’’
(ఆచార్య పింగళి లక్ష్మీకాంతం స్మారక సంచిక: 1974, పుట:4)
దీన్ని బట్టి పింగళి లక్ష్మీకాంతం పింగళి వంశానికి చెందిన వాడిననీ, తాను వీర రస పోషణలో ప్రసిద్ధి చెందాననీ, నాటకాల్లో పండితుడునని అన్నారు. తన అన్న నరసింహుడు వీర, శృంగార రసాల్లో అమితంగా నాయకుడి పాత్రలను వేసి మంచి పేరు పొందారని చెప్పారు. శ్రీ గొడవర్తి సూర్య నారాయణ గారు పింగళి వారి శిష్యుడు.
అనేక నాటకాల్లో ధర్మరాజు పాత్ర:
పింగళి వారు భారత నాటకం ప్రదర్శించారు. అందులో ధర్మరాజు వేషాన్ని వేశారు. ఆయన ధర్మరాజు పాత్రలో చూపిన శాంత స్వభావం, వినయం, పెద్దల పట్ల గౌరవం, మాట తీరు, పద్య పఠనం, రసం మొదలైన లక్షణాలు కనిపించాయి. ‘‘లక్ష్మీకాంతముగారు గొప్ప పాటకుడుగాదు. కాని పద్యమునకు రసపుష్టినొసంగు గానకౌశల్యమేర్పడియున్నది. వెంకటశాస్త్రిగారి తరువాత నీయూరిలో పద్యముల నర్థవాహకవైశద్యముతో, స్పష్టముగ రసభావయుక్తముగ నుచితమగు సంగీతముతో శ్రవణానందముగ జదువనేర్చినవాడీ లక్ష్మీకాంతమే’’ అని (తొలినాటి తెలుగు నాటక విమర్శ పురాణం సూరి శాస్త్రి, ‘నాట్యాంబుజము’ (సంపా), ఆచార్య మొదలి నాగభూషణ శర్మ, 2011, పుట:105) లో పింగళి లక్ష్మీకాంతం గారు భారత నాటకంలో ధర్మరాజు అనే పాత్రలో నటించి ఆయన వాచికాన్ని అభినయించిన తీరు తెన్నులను పురాణం వారు విశదీకరించారు. పురాణం వారే మరోచోట పింగళి వారు వేసిన ధర్మరాజు పాత్ర గురించి ఇలా పేర్కొన్నారు. ‘‘లక్ష్మీకాంతము తన నిత్యజీవన పద్ధతులకనుకూలమైన పాత్రలనే యెక్కువ సామర్థ్యముతో నిర్వహించగలడు గాని లక్ష్మణ స్వామి ఘమేరుసింగు భీభత్సమును, నాగరాజారావు పఠాను మతి భ్రమణమును, రాఘవాచారి రామదాసు భక్తి నిశ్చేష్టతను, సంబంధం మొదలియారయాగో కౌటిల్యమును, గోపాలర్సు శకారశ్యాలకతత్వమును ప్రకటించునట్లు నిజస్వభావమును సంపూర్ణ విరుద్ధముగనుండు నాటక పాత్రలతో గుణ రూప సాదృశ్యమొంది యభినయించలేదు’’ (తొలినాటి తెలుగు నాటక విమర్శ పురాణం సూరి శాస్త్రి, ‘నాట్యాంబుజము’ (సంపా), ఆచార్య మొదలి నాగభూషణ శర్మ, 2011, పుట:20).
సంపూర్ణ భారతము:
తెలుగు నాటక చరిత్రలో తిరుపతి వేంకట కవుల స్థానం ప్రత్యేకమైంది. చెళ్లపిళ్ల వేంకటశాస్ర్తిగారి శిష్యుల్లో పింగళి లక్ష్మీకాంతంగారిది అగ్రస్థానం. అంతేకాదు తిరుపతి వేంకట కవులు రాసిన నాటకాల్లో వివిధ పాత్రలను వేశారు. బందరులోని ‘రాయల్ థియేటర్’ అనే నాటక సంస్థకు చెళ్లపిళ్ల వేంకటశాస్ర్తిగారు అధ్యక్షులుగా ఉండేవారు. ఒకసారి పాండవోద్యగ విజయం నాటకాలన్నింటిని కలిపి ‘సంపూర్ణ భారతమ’ను పేరుతో ప్రదర్శించడానికి పింగళి వారిని మద్రాసు నుండి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ వివరాలను శ్రీనివాస చక్రవర్తిగారు ఈ విధంగా ప్రస్తావించారు. ‘‘1929 సంవత్సరంలో రాయల్ థియేటర్ వారు బందరు మినర్వాహాలులో తిరుపతి వేంకట కవుల పాండవోద్యగ విజయం నాటకాలన్నింటిని కలిపి ‘సంపూర్ణ భారతమ’ను పేరుతో ప్రదర్శించిరి. లక్ష్మీకాంతముగారు మద్రాసు నుండి వచ్చి నాటక ప్రదర్శనలో పాల్గొనిరి. ఆనాటి ప్రదర్శినం చాక్షుషక్రతువు చూచే భాగ్యం నాకు కలిగింది’’ అని (ఆచార్య పింగళి లక్ష్మీకాంతం స్మారక సంచిక,1974, పుట: 26) దీని ద్వారా తాను పింగళి వారి నాటకాన్ని ప్రత్యక్షంగా చూసి ఆ విశేషాలను తన మాటల్లో వెలుబుచ్చారు. ఇంకా పింగళి లక్ష్మీకాంతంగారు వివిధ నాటకాల్లో ప్రదర్శించిన తీరు తెన్నులను సోదాహరణంగా ఉటంకించారు.
1929 సంవత్సరంలో సంపూర్ణ భారతం నాటకాన్ని ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. లక్ష్మీకాంతంగారి శిష్యవాత్సల్యం చాలా దొడ్డది. యోగ్యతకల విద్యార్థులకు ఆర్థిక కారణాలవల్ల చదువు ఆగిపోయే పరిస్థితి వస్తే వాళ్లని ఎట్లాగైనా ఆదుకొనే వారు. ఆ అనుభవాలు తనకు కలిగాయి కదా. ఆయన ఆదుకొన్న వారిలో కమలాకర వెంకటరావు ఒకరు. (ఈయన ప్రఖ్యాత సినీ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు సోదరుడు). ఆయనకు కాలేజీ చదువు సాగే అవకాశం లేకపోయింది. ఆయనకు ఆర్థిక సహాయం చేయటానికే ఆ నాటకమాడారు. ఆ ‘బెనిఫిట్ షో’ వల్ల వచ్చిన పైకాన్ని వెంకటరావుగారి కిప్పించి, బి.ఏ., చదువు పూర్తి చేయించారు. ఆ తరువాత ఆయనకి ముట్నూరి కృష్ణారావుగారితో చెప్పి “కృష్ణాపత్రిక” లో ఉద్యోగం ఇప్పించారు’’ అని పింగళి సూర్య సుందరం, పింగళి లక్ష్మీకాంతం అనే గ్రంథంలో (2010, పుట: 36) రాయడాన్ని బట్టి పింగళి వారి ఔదార్యంప్రత్యేకంగా తెలుస్తుంది. ప్రత్యేకంగా ఆయనకు శిష్యులపై అపారమైన వాత్సల్యం ఉందని, అది ఆయన వ్యక్తిత్వంలో కనిపించే ఒక గొప్ప లక్షణమని తెలుస్తోంది. మరోవైపు ఆయన విద్యార్థులకు సహాయం చేయడానికే నాటకాలను ప్రదర్శించి వచ్చిన ధనాన్ని ఆ విద్యార్థికి ఇచ్చేవారు. తన దగ్గర చదువుకున్న పేద విద్యార్థులకు, ఇతర విద్యార్థులకు ఆర్థిక విషయాలలోను, విద్యాభ్యాసానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించే దృక్పథం ఆయనలో కనిపించే ఒక గొప్ప విశేషం. అందుకనే నాటి విద్యార్థులు అనేక మంది పింగళి లక్ష్మీకాంతంగారిని అనుసరించారని స్పష్టంగా కనిపిస్తుంది.
ధర్మారాజు పాత్రపై ప్రశంసలు:
బందరులో రాయల్ ధియేటర్ ఆధ్వర్యంలో లక్ష్మీకాంతంగారు పాండవోద్యోగ విజయాల్లో ధర్మారాజు పాత్రను వేసి నటించేవారు. ధర్మరాజు పాత్రను పింగళి వారు ఏ విధంగా అభినయించేవారో గూడూరి వారి మాటల్లో విందాం. ‘‘వారా పాత్రను ప్రత్యేకమైన్యా విమర్శనా దృష్టితో స్టడీ చేసి అభినయించేవారు. లక్ష్మీకాంతంగా ధర్మజ పాత్ర చూస్తూంటే! ఎంతటి పక్కా లౌకికుడు కాకపోతే యుద్ధరంజీ సమయంలో శత్రు సేనల మధ్య తాతగారికి భీష్మాచార్యులు నమస్కరించుకు ఆశీస్సుల నొంది మరీ యుద్ధారంభము చేస్తాడు! ఈ విషయములన్నీ పరిశీలన చేస్తే పింగళివారి ధర్మరాజు పాత్ర ఎంత శ్రద్ధగా విశ్లేషించుకొనే వారో ఊహించవచ్చు. పింగళి వారి పద్య పఠనము చెళ్లపిళ్ల వారి ఫక్కీలో మనోహరంగా ఉండేది. ఆ నాడు బందరులో పద్యం బాగా చదివేవారిద్దరే’’ (శ్రీ పింగళి లక్ష్మీకాంతం జీవిత చరిత్ర,1991, పుట:8).
గయోపాఖ్యానం (అర్జునుడిగా):
తిరుపతి వేంకట కవులు గయోపాఖ్యానం అనే నాటకాన్ని రచించారు. పింగళి లక్ష్మీకాంతంగారు తిరుపతి వేంకట కవుల నాటకాలను ప్రదర్శించి వాటికి విశేషమైన ప్రచారాన్ని తెచ్చారు. గయోపాఖ్యానం నాటకాన్ని లక్ష్మీకాంతంగారి ప్రదర్శించిన నేపథ్యం ఇది. పింగళి నరసయ్య గుంటూరు జిల్లా, రేపల్లె దగ్గర ‘పెదపులివర్రు’ అనే గ్రామంలో నివసించేవారు. ఆ గ్రామంలో ఒక నాటక సంస్థను స్థాపించారు. దీనిలో పింగళి లక్ష్మీకాంతంగారిని చేర్పించి నాటకాలలో వేషాలు వేసేవారు. ‘‘గయోపాఖ్యానంలో లక్ష్మీకాంతం గారు అర్జునుడిగా , నర్సయ్య గారు గయుడిగా, నటించేవారు. నరకాసుర వధిలో శ్రీకృష్ణుడిగా లక్ష్మీకాంతం గారు, నరకాసురుడిగా నర్సయ్య గారు నటించారు’’(గూడూరి నమశ్శివాయ, శ్రీ పింగళి లక్ష్మీకాంతం జీవిత చరిత్ర,1991, పుట:8).
నరకాసురవధ నాటకం (మాణిభద్రుని పాత్ర):
పింగళి లక్ష్మీకాంతం నాటక రంగంలో ప్రమేయం లేకపోయినా ఆయన నటనకు మెచ్చని వారు లేరనే చెప్పాలి. మునిమాణిక్యం నరసింహారావు, మిక్కిలినేని రాధాకృష్ణ, బలిజేపల్లి లక్ష్మీకాంతం మొదలైన వారంతా నాటక రంగంలో లబ్ధ ప్రతిష్ఠలు. ‘‘ గుంటూరులో ‘నరకాసుర వధ’ నాటకంలో కృష్ణ పాత్రకు పోటి జరిగింది. ఆ నాటకానికి శ్రీ బుర్రారాఘవచార్లుగారు తదితరులు పోటీచేశారు. ‘‘నరకాసుర వధ’ నాటకంలో పింగళి లక్ష్మీ కాంతంగారు ‘మాణిభద్రుడి’ పాత్రలో నటించారు. బుర్రా రాఘవాచార్లు ఈ నాటకంలో బంగారు పతకాన్ని సంపాదించుకొన్నారు. ఈ నాటకానికి న్యాయ నిర్ణేతగా ప్రముఖ నాటక కర్తలు హరిప్రసాద రావుగారు, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గార్లు వ్యవహరించారు. నరకాసుర వధ నాటకంలో మాణిభద్రుని పాత్రకు అద్భుతంగా నటించిన పింగళి లక్ష్మీకాంతంగారికే స్వర్ణపతకాన్ని ఇవ్వాలని న్యాయనిర్ణేతలు ప్రకటించారు. దీని ద్వారా మాణిభద్రుని పాత్రలో కొత్త శైలిలో నటించారని, ఆ పాత్రను ఎంతో బాగా నటించినవారు నాటక కర్తలలో ఇంతవరకు ఎవ్వరు లేరనీ వారి నటన పరమాద్భుతమని ఇద్ధరు న్యాయ నిర్ణేతలు ప్రశంసించారు. అయినా కూడా జరిగిన ఈ పోటిలో కృష్ణ పాత్రకు కాబట్టి బుర్రా రాఘవాచార్లుగారికి సువర్ణపతకం ప్రకటించారు. చిన్న తనంలోనే చిన్నచిన్న పాత్రలు ధరిస్తూనే చెప్పనటుడనే ప్రఖ్యాతి సంపాదించుకొన్నారు’’ అని గూడూరి నమశ్శివాయ, శ్రీ పింగళి లక్ష్మీకాంతం జీవిత చరిత్ర (ప్రచురణ: 1991, పుట: 7)లో పేర్కొన్నారు.
సారంగధర (సారంగధరుడి పాత్ర):
లక్ష్మీకాంతంగారు కూడా వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రామ చంద్రపురం తాలూకాలోని ‘పసర్లపూడి’ అనే గ్రామంలో ఒక నాటకం కంపెనీ స్థాపించి నర్సయ్యగారిని ఆహ్వానించారు. ఈ కంపెనీ ఆధ్వర్యంలో పింగళి లక్ష్మీకాంతంగారు ‘సారంగధర’ ఆయన తనతోబాటు లక్ష్మీకాంతం గారిని కూడా చేర్పించారు. లక్ష్మీకాంతంగారు ప్రసిద్ధ నటీమణి రానాబాయిని తీసుకు వెళ్లి కంపెనీలో చేర్పించారు. సారంగధరలో రాంభాయి చిత్రాంగి, లక్ష్మీకాంతం గారు సారంగధరుడు, నర్సయ్యగారు రాజరాజుగా నటించి ఆ కంపెనీకి మంచి పేరు తెచ్చారు. కృష్ణుడు, అర్జునుడు పాదుకాపట్టాబిషేకంలో భరతుడు వేషాలు వేశారు. బొబ్బిలిలో బుస్సీ రంగారావు కంఠాభరణంలో కృష్ణారావు, చిత్రనళీయంలో బాహుకుడు లక్ష్మీకాంతంగారు వేషాలను పోషించారు.( గూడూరి నమశ్శివాయ, శ్రీ పింగళి లక్ష్మీకాంతం జీవిత చరిత్ర,1991, పుట: 8).
పాదుకాపట్టాషేకం( భరతుడి పాత్ర):
పురితెఱగు గనిన మంగళ
విరహితమై తోచు, జనులవిన్నదనంపుం
దెఱగుగనుగొనిన, హృదయము
మఱగెడు వచియింపు నేమమా! రాజునకున్
సర్వసామంతరాజనశస్తమకట
వందనమ్ములు గల యూచియందుకొనెడు
ధ్వజమెగురదేల బురుజుల పైన నేడు
ఆనతమౌని చంద్రుడన హంకృతచిత్తుడుగాది పుత్రశి
క్షాని పుణీకృతాత్మబల సారుడు మారఘరాముడేలగా
నైన యయోధ్యయల్ప విషయాత్మకుడే భరతుండు పూనగ
ర్ణానినదప్రకంపిత ధరాధరగహ్వర భూవిహారి పం
చానన భోగ్యమైన భయదాట విజంబు కమాస సేయునే ?
(గూడూరి నమశ్శివాయ, శ్రీ పింగళి లక్ష్మీకాంతం జీవిత చరిత్ర,1991, పుట: 13)
రస పుత్ర విజయం (మంత్రి రాక్షసుడు):
పింగళి వారి నటన జీవితాన్ని గమనిస్తే ఆయనకు నాటి నాటక రంగ సంస్థలతో విస్త్రతమైన అనుబంధాలున్నాయి, దీని ద్వారా పింగళి వారి సాహిత్య జీవితంలో నాటక దశ ఎలా ఉందనే విషయాన్ని పురాణం సూరి శాస్త్రి గారు ‘‘మంత్రి రాక్షసుని గూర్చియు లక్ష్మీకాంతముగారి యభినయ కౌశలమునుద్దేశించియు నొక ప్రత్యేక విమర్శనమల్లియున్నాను. వీరు బాహుకవేషమును, అశ్వద్ధామ భూమికను మిక్కిలి సామర్థ్యముతో నభినయించినట్లు వింటినిగాని వానిని నేజూచి యుండలేదు. నేను చూచినవానిలో భారత నాటకములందు ధర్మరాజు వేషమును, రసపుత్ర విజయమునందు రాజసింహుని భాగమును మిక్కిలి చతురతతో నెరవేర్చిరి’’ (‘నాట్యాంబుజము’ (సంపా), ఆచార్య మొదలి నాగభూషణ శర్మ, 2011, పుట:105) అని వ్యాఖ్యానించారు.
రాజసింహుడిగా పింగళి లక్ష్మీకాంతం:
పింగళి లక్ష్మీకాంతంగారు ‘రసపుత్ర విజయం’ అనే నాటకంలో రాజసింహుడు అనే పాత్రను పోషించారు. వీరరసపుత్రగుణములను యధోచితముగ ప్రదర్శించి నాటక పరిషత్ వారి బంగారు పతకాన్ని సాధించారు. పింగళి వారు అధికంగా శాంత స్వభావంతో ప్రవర్తించే వ్యక్తి. ఈ ‘రాజసింహుడి’ పాత్ర చిత్రణలో వీర రసాన్ని, వీరావేశాన్ని ప్రదర్శించే గుణాలను కలిగి ఉంటుంది. అయితే పింగళి లక్ష్మీకాంతం ఈ వీర రసంతో అభినయించి పోషించిన పాత్ర కావడం వలన ఆయన నవరసాలను సమదృష్టిని పాటించారనీ స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాదు నాటకాల్లో ఇతివృత్తం, కథా సన్నివేశాలు ఏ విధంగా ఉన్నా వాటిని సహృదయతో స్వీకరించి ఆ పాత్రకు కావాల్సిన సమాచారాన్ని తనకు తగినట్లుగా సమన్వయం చేసుకోవడం ఆయన పాత్రలను పోషించారనే విషయం దృక్పథం కూడా తెలుస్తోంది.
ముద్రా రాక్షస ( మంత్రి రాక్షసుడి పాత్ర):
ముద్రారాక్షసంలో మంత్రి రాక్షసుడుగా నటించేవారని చెప్పారు. రాక్షసుడు మలయ కేతునకు మహామంత్రి. చాణక్యుడు మలయకేతుని తండ్రిని చంపించింది మంత్రి రాక్షసుడే. ఈ పని చేసినాడని అసత్య ప్రచారం చేయిస్తాడు. మలయకేతుమంత్రి రాక్షసుణ్ణి నిలవదీసి అడిగిన ఘట్టంలో అన్యాయంగా ఆ నింద నెత్తిన పడిందని, ఆసీనులో(నాటక పరిభాషలో అంకం) లక్ష్మీ కాంతం గారు నటించిన నటనా పద్ధతి లోకోత్తరంగా ఉంటుంది. రాక్షస మంత్రి పాత్ర నిర్వహణలో పింగళి వారి నటనా కౌశలం హిమాలయ స్థాయికి చేరుతుంది. పంచమ అంకంలో చివరలో మరలా రంగస్థల మీదకు వచ్చి ఈ పద్యాన్ని పాడతారు.
‘‘ఖడ్గమును గేలబూని యక్కటిక శత్రు
సైన్య మోపిన కొలదిగా జంపి చత్తు
నందునా, నే గృతఘ్నడ నగుదు బద్ధు
డైన చందన దాసు మోమరయకున్న’’
‘‘ కాలముకాదు కత్తికిది-ఘాతుకులన్ వధియించె ముందె, యే
కాలమునన్ జనించునొ! వికల్పఫలంబులు నీతి మార్గముల్
జాలము సేయగా దగదు చందనదాసుడు చచ్చు చుండె, నా
పాలిటి కింకనేనొనరు పందగినట్టిది దేహనాశమే”!
(గూడూరి నమశ్శివాయ, శ్రీ పింగళి లక్ష్మీకాంతం జీవిత చరిత్ర,1991, పుట: 12)
పింగళి వారి నటనలో వైవిధ్యం:
పింగళి లక్ష్మీకాంతం నాటకాల్లో విభిన్న పాత్రలను పోషించారని తెలుస్తోంది. ఆయన రంగస్థల నటుడిగా ఆ పాత్రల్లో అభినయించిన ప్రత్యేకతలను గుర్తిస్తే, ఆయన నటుడిగా ఏ విధంగా వివిధ రసాల ప్రదర్శించేవారో తెలుస్తుంది. నటుడిగా ఆయన అనేక సందర్భాల్లో శోకాన్ని, దుఃఖాన్ని కలిగించే సన్నివేశాలు ఎదురైనప్పుడు ఆయన హృదయం కరుణారస భరితంగా ఉంటుందనే విషయాన్ని కొందరు మంది విమర్శకులు తెలిపారు. అది వారి నటన కళలలో కనిపించే ఒక గొప్ప విశేషమని చెప్పవచ్చు. అలాంటి సన్నివేశాలను కొన్నింటిని చూద్దాం.
- సంపూర్ణ భారతం నాటకంలో అభిమన్యు వధ సందర్భమంతా కరుణరసభరితం. లక్ష్మీ కాంతం గారు ఆ ఘట్టంలో చూపిన విషాదం ప్రేక్షకులు శోకంతో విలపించేటట్లు నటించారు. ద్రోణ వధ ఘట్టంలో కృష్ణార్జునులు ధర్మరాజును అబద్ధమాడమని అడిగే సందర్భంలో ‘‘ఒడబడీ పృథా గ్రతనయం డనృతమ్ము వచింప... అంటూ కోపంతో లేచిపోయాడు. ఇది పింగళి వారిలో కనిపించే సత్యనిష్ఠ. దీన్ని చూసిన ప్రేక్షకులు ఆహా! ఇదే నటన’’ అని ఆ నాటి ప్రేక్షకులు అన్నారు.
- పాండవ విజయం షష్ఠాంకంలో ధర్మజార్జునుల సంవాదంలో పింగళి వారి నటన వారి నటనా చాతుర్యానికి పతాక స్థాయి వంటిది. ఆ అంకంలో ధర్మరాజు విభిన్న భావాలను వ్యక్తీకరణ చేయాల్సి ఉంటుంది.
- పింగళి వారు పరాభవాన్ని ఓర్చుకోలేడు. దీన్ని నాటకంలో ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. ధర్మరాజు భీమార్జునులతో సంభాషిస్తూ ‘భీమాదులను గాక నన్ను కూడా పరాభవించెనని వినియు వానిని జంపక నా సేమం బరయ వచ్చితివా?’ అంటూ పింగళివారు చూపులో పరాభవ క్లేశం, కోపం, ఆశ్చర్యం ఇంకెన్నో భావాలను వ్యక్తం చేశారు.
- పింగళి వారు ముద్రా రాక్షస నాటకంలో రాక్షస మంత్రి పాత్ర నిర్వహణలో హిమాలయాల స్థాయికి చేరింది. దీన్ని పింగళి వారు నటించిన వేషాలను చూసి కథలుగా చెబుతారు.
(ఆచార్య పింగళి లక్ష్మీకాంతం స్మారక సంచిక,1974,పుట:27)
పాత్రలను పోషించిన విధానం:
ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారికి పాశ్చాత్య నాటక సాహిత్యంపై అవగాహన ఉండడమే కాకుండా, దాన్నెలా అభినయించాలో తెలిసిన నటులని చెపుతూ పురాణం సూరిశాస్త్రి గారిలా రాశారు. ‘‘వీరు ఆంగ్ల విద్యయందు నాటక విమర్శన మెరింగిన యనూనావకాశము కలవారగుటయేగాక చక్కని లౌకికజ్ఞానము, మానసవ్యాపార విమర్శనశక్తియు కలిగి తామభినయించు పాత్రములు సంప్రదాయమును పురాణేతిహాసముల నుండి గ్రహించి విమర్శించి పాత్రస్వభావమును వివిధములగుపట్టులలో మనుష్యులకుండు గుణములను లెస్సగ బరికించి యభినయింతురు’’ (తొలినాటి తెలుగు నాటక విమర్శ పురాణం సూరి శాస్త్రి, ‘నాట్యాంబుజము’ (సంపా), ఆచార్య మొదలి నాగభూషణ శర్మ, 2011, పుట:106).
పాత్రల్లో పోషించిన రసాలు:
పింగళి వారు నటించిన నాటకాలలో భిన్నమైన పాత్రలను పోషించాలనీ ఆయన జీవితాన్ని, సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వలన తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన సాహిత్య జీవితంలో తొలి దశలో నాటక ప్రక్రియ పట్ల ఆకర్షితులయ్యారనీ, అలా ఆకర్షితులైన నాటకాల్లో పాత్రలను వేసి నటన పట్ల మరింత ముందుకెళ్లారు. దీన్ని బట్టి ఆయన నాటకాన్ని ఎంతగా విశ్వాసాన్ని కలిగి ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. మరో విధంగా చూస్తే చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారి ప్రభావంతో పాటు చెళ్లపిళ్ల వారి ‘పాండవోద్యోగ విజయం’ అనే నాటక ప్రదర్శన ప్రభావం కూడా కావచ్చు.
రసపోషణ:
లక్ష్మీకాంతంగారి వ్యక్తిత్వంలో ప్రధానంగా సత్వ గుణాలు కనిపిస్తాయి. దీని వలన ఆయనకు సహనం, శాంతి, ఓర్పు లక్షణాలు సంక్రమిస్తాయి. వీటి వలన పింగళి వారిలో ఒక ఉదాత్తమైన స్వభావాన్ని, దృష్టిని కలిగి ఉండేవారు. ఈ లక్షణాలను ఆయన తన జీవితంలో అనుసరించారనే విషయాన్ని పురాణం సూరిశాస్త్రి గారు వివరిస్తూ ‘‘లక్ష్మీకాంతము రసోద్వేగమునమైమరచి భావసాంకర్యమును విపరీతచేష్టలను చూపగల నటుడు కాడు. తెలివి, శాంతము, విమర్శకశక్తి, కరుణాప్రవృత్తులు, ప్రధాన లక్షణములై యితర రసములక్షణికావేశములను జెందు మేధాసంపన్నుల గుణవిశేషములు చక్కగ నభినయింపగలడు’’ అని (తొలినాటి తెలుగు నాటక విమర్శ, పురాణం సూరి శాస్ర్తి, ఆచార్య మొదలి నాగభూషణశర్మ,2011, పుట:106) ప్రశంసించారు.
పింగళి వారు నాటకాల్లో పాడిన సంగీత రాగాలు:
నాటకానికి, నటనకు, నటులకు సంగీత ప్రవేశం ఉంటే ఆ నాటక కళ శ్రవణ భరితంగా, రసభరితంగా, విన సొంపుగా, లయాత్మకంగా ఉంటుంది. నాటక కళకు సంగీతమే మౌలిక లక్షణం. సంగీతభరితమైన నాటకాలకు ప్రేక్షకాదరణతో పాటు సామాజికులకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాంటి నాటకాలలో చెళ్లపిళ్ల వారి నాటకాలకు ఒక ప్రత్యేక స్థానం ఉందని ఎంతో మంది విమర్శకుల అభిప్రాయపడుతున్నారు. చెళ్లపిళ్ల వారి పద్యాలు రాగయుక్తంగా పాడడానికి అనుకూలంగా ఉంటాయి. సంగీతానికి అనుకూలంగా, లయాత్మకంగా ఉంటాయి. ఈ సంగీత లయాన్ని పింగళి వారు అనుసరించిన విధానాన్ని శ్రీనివాస చక్రవర్తి వివరిస్తూ ‘‘పింగళివారి పద్య పఠనం చెళ్ళపిళ్ళ వారి ఫక్కీ మనోహరంగా ఉండేది. పద్యం చక్కగా విరిచి చదువుతూంటే అర్థం ఇట్టే అర్థమయ్యేది. వాచికాభినయంలో పింగళివారు సాధించిన ఘనవిజయం ఇదే: పద్యంతో రాగం ఆగిపోయేది. సంగీతం పెద్దగా లేదనే లోటు కనిపించేది కాదు. వారి పద్యపఠనా చాతుర్యంలో దానికి తగ్గ నటనలో ప్రేక్షకులు తలమున్కలు వేసి ఆనందించేవారు. లక్ష్మీకాంతంగారు దేవ గాంధారి, మోహన, కేదారగౌళ రాగాలు బాగా పాడేవారు’’ (ఆచార్య పింగళి లక్ష్మీకాంతం స్మారక సంచిక,1974, పుట: 26) అని పింగళి లక్ష్మీకాంతంగారు నాటకాల్లో పాడే పద్య పఠన విశేషాల గురించి పేర్కొన్నారు.
ప్రముఖుల ప్రశంసలు:
పత్రికల ప్రశంస:
తెలుగులో నాటకాలకు, నటులకు పత్రికలు విశేషమైన ప్రచారాన్ని కలిగించాయి. పత్రికల ద్యారా అనేక మంది నాటక కర్తల జీవితాలను, ‘‘జీవిక కోసం నాటకాలాడినారని ఎవరో పత్రికలలో వ్రాసింది యదార్థం కాదని ఆయన ఒక సారి నాతో( శ్రీ గొడవర్తి సూర్య నారాయణ) తనతో అన్నారనీ’’ (ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారి స్మారక సంచిక,1974, పుట: 4) గొడవర్తిగారు తన గురువు గురించి స్మరించుకున్నారు. దీన్ని బట్టి కూడా పింగళి లక్ష్మీకాంతం గారికి నాటక సాహిత్య పట్ల ఆసక్తిని కనపరిచేవారని స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక్కడ రెండు విషయాలు గుర్తించాలి. తొలిదశలో నిజానికి జీవిక కోసమే నాటకాల్లో నటించినా, తర్వాత కాలంలో తన ఇష్టమైన రంగంగా భావించి నాటకాల్లో నటించి ఉండొచ్చు. ఎందుకంటే గూడూరి నమశ్శివాయగారు అనేక సంవత్సరాలు పింగళివారిని దగ్గరనుండి గమనించిన వారు. ఆ అనుభవంతోనే పింగళివారి జీవిత చరిత్ర రాశారు. అందులోని అన్ని విషయాల్ని ఒప్పుకొని, కొన్నివిషయాల్ని ఎవరో వ్యతిరేకించడమో, తప్పుగా వ్యాఖ్యానించడమో కూడా కావచ్చు. అయినా ఎవరికైనా ఆర్థిక పరిస్థితులు బాగున్న తర్వాత నటించడం తనకున్న ఇష్టం వల్ల కూడా నటించవచ్చు. అప్పుడు ఆర్థికపరిస్థితుల ప్రభావం వల్లనే నటించడం లేదని చెప్పడం కూడా నిజమే అవుతుంది. ఆవిధంగా గొడవర్తివారి అభిప్రాయం కూడా పింగళివారి తర్వాత దశలోని అభిప్రాయంగా తీసుకుంటే సరిపోతుంది.
తెలుగు అకాడమీ ప్రశంస:
పింగళి లక్ష్మీకాంతంగారు కొంతకాలం పాటు ఆంధ్ర ప్రదేశ తెలుగు అకాడమీ కార్యవర్గంలో పని చేస్తూ సాహిత్యానికి సేవలను అందించారు. పింగళి వారి మరణానంతరం అకాడమీ తరపున డా.దివాకర్ల వేంకటావధానిగారు స్మారకోపన్యాసాన్ని ఇచ్చారు. ఆ ప్రసంగంలో దివాకర్ల వేంకటావధాని పింగళి వారి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, సాహిత్యాన్ని సమీక్షించారు. ఈ నేపథ్యంలోనే పింగళి లక్ష్మీకాంతంగారి నటన జీవితాన్ని, ఆయన నాటకాల్లో వేసిన పాత్రలను కూడా విశ్లేషిస్తూ ఈ విధంగా అన్నారు. ‘‘పాండవ విజయోద్యోగములలో వారు ధర్మరాజు పాత్ర నసాధారణ ప్రతిభతో నభినయించి గురువుల కీర్తి వల్లరి కనార్తవ విలాస వాల్లభ్యమును, సామాజిక మనోనురక్తి కపూర్వానంద సక్తిని కలిగించిన తీరు చూసినవారిప్పటికినీ చెప్పుచునే యుందురు’’ అని (ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారి స్మారక సంచిక,1974, పుట:14) దివాకర్ల వారు చెప్పడాన్ని బట్టి పింగళి లక్ష్మీకాంతం గారు నాటకాల్లో ధర్మరాజు పాత్రను ప్రదర్శించేటప్పుడు వారి అభినయాన్ని చూసిన ప్రేక్షకులు ఎంతో ఆనందించేవారని తెలుస్తుంది. దీని ద్వారా నాటి నాటకాలను ప్రజలు ఎంతో ఆదరించారనే విషయం తెలుస్తుంది.
విశ్వనాధ సత్యనారాయణగారి అభిప్రాయం:
విశ్వనాధ సత్యనారాయణ, పింగళిలక్ష్మీకాంతం, నాయనిసుబ్బారావు, కాటూరి వేంకటేశ్వరరావు, బందరు పాఠశాలలో సహా విద్యార్థులు. విశ్వనాధవారు ఉద్దండ పండితుడు, కవి, నాటక కర్త దీనితో పాటు నాటి కవులతో పరిచాయాలుండేవి. ఆయనకు లక్ష్మీకాంతంగారితో కూడా సన్నిహిత బంధం ఉండేది. కనుక పింగళి వారి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, సాహిత్యాన్ని, అతి దగ్గరగా చూశారు. దీని బట్టి పింగళి వారి వ్యక్తిత్వాన్ని అనేకమంది చూశారనీ బందరు ప్రజలు లక్ష్మీకాంతంగారి ఏ దృష్టితో చూశారో విశ్వనాధ సత్యనారాయణగారి మాటల్లో చూద్దాం. ‘‘లక్ష్మీకాంతం గారివలె పద్యంచదవలెనని, ఆయనవలె నడవలెనని, ఆయనవలె డ్రస్సుచేసికోనవలెనని బందరు వీధులలో యువకులు, యువకవులు-నటులు అభిలషిస్తూ ఉండేవారు. లక్ష్మీకాంతంగారిని అనుకరిస్తూ వారి వెంట తిరుగుతూ ఉండేవాణ్ణి’’ (గూడూరి నమశ్శివాయ, శ్రీ పింగళి లక్ష్మీకాంతం జీవిత చరిత్ర,1991,పుట:13).
గూడూరి నమశ్శివాయగారి అభిప్రాయం:
పింగళి లక్ష్మీకాంతంగారితో గూడూరి నమశ్శివాయగారికి సన్నిహితంగా మేలిగేవారు. పింగళి వారి జీవితం, వ్యక్తిత్వం, పెద్దలతో సంబంధాలు, దినచర్య, అభిరుచులు ఇలా అనేక విషయాల పట్ల గూడూరి వారికి ఎంతో అవగాహన ఉంది. కనుకనే గూడూరి వారు పింగళి లక్ష్మీకాంతం జీవిత చరిత్రను రచించారనపిస్తుంది. ‘‘ముద్ర రాక్షస నాటకములలో మంత్రి రాక్షస పాత్రను పింగళి వారు ఎంతో సమర్థవంతంగా నిర్వహించేది వారిని చూసిన ప్రేక్షకులు చెప్పేవారు పంచమాంకములో చందనదాసును రక్షించుటలో పడు ఆవేదనను పరమాద్భుతముగా నటించెడివారు. ధరించిన ప్రతి పాత్రను ప్రాణం ప్రతిష్ట గావించి, అందు తాను జీవించుటయే గాక రసజ్ఞలగు సదస్యులను రసజలధిలో వోలలాడించుట వీరి నటనలోని విశేషము’’ అని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలో (1991) పింగళి లక్ష్మీకాంతం గారి వ్యక్తిత్వము – సాహిత్యము అనే అంశంపై పిహెచ్.డి చేసిన డా. జి విశ్వనాథ నాయుడు గారు, గూడూరి నమశ్శివాయగారితో ముఖాముఖీ చేసిన ఇంటర్వ్యూలో తెలుసుకున్న అభిప్రాయాన్ని బట్టి తెలుస్తుంది.
రంగస్థల నటుల పట్ల పింగళి వారి వ్యక్తిత్వం:
సాధారణంగా మానవులను, వారి గుణ గణాలు చూసి గౌరవించడం ఒక సంప్రదాయం. ఈ కోవలోనే పింగళి వారు కూడా తన నటన జీవితంలో అనేక మంది నటులను గౌరవించారనీ, ఆదరించారనీ పింగళి వారి వ్యక్తిత్వం గురించి ప్రస్తావించినప్పుడు కొందరి అభిప్రాయం ఆధారంగా కనిపిస్తాయి. సరిగ్గా ఈ విషయాన్ని శ్రీనివాస చక్రవర్తి గారు పింగళి వారి ప్రవర్తనను, మాట తీరు తెన్నులను ఇతర గుణాల గురించి చెబుతూ... ‘‘గొప్పవారు ఇంకొకరి గొప్పతనాన్ని గుర్తించి మెచ్చుకోవడం అరుదు. పెదవి విరుస్తూనే ఉంటారు. కాని గొప్పవారిని గొప్పవారిగా గుర్తించి మెచ్చుకోవడంలో లక్ష్మీకాంతం గారిది ముందడుగు’’ (ఆచార్య పింగళి లక్ష్మీకాంతం స్మారక సంచిక,1974, పుట: 28) అని పింగళి లక్ష్మీకాంతంగారి గుణగణాలలో కనిపించే లక్షణాలను విశదీకరించారు.
నాటకం పట్ల పింగళి వారి అభిప్రాయం:
నాటకాల్లో పద్యాలు ఉండాలనే విషయంలో పింగళి లక్ష్మీకాంతం గారి అభిమానులను గమనిస్తే ఆయన నాటకం పట్ల ఉన్న సహృదయ విమర్శ ధోరణులను స్పష్టంగా కనిపిస్తుంది. ‘‘నాటకంలో పద్యాల విషయంలో వీరిది ఉదారవాదం. నాటకాల్లో పద్యాలు ఉండాలనే వీరి నిశ్చితాభిప్రాయం. అయితే శుద్ధ గద్య నాటకాలంటే విముఖులు కారు. వైవిధ్యం కోసం నిర్వచన ప్రబంధమును శుద్ధ గద్య నాటకములు ఉండవచ్చు. వాని వలన ఏ కీడును రాదు. పద్యములుండరాదని వాదించే వారివలె గద్య నాటకములుండరాదని నేను వాదించను’’ అని (ఆచార్య పింగళి లక్ష్మీకాంతం స్మారక సంచిక,1974, పుట:28) శ్రీనివాస చక్రవర్తి గారు పింగళివారన్నారు. దీన్ని బట్టి నాటకాలను ప్రదర్శించడానికి అనువుగా ఉండాలని, దాని కోసం నటులు రాగయుక్తంగా పాడడానికి వీలవుతుందని అన్నారు. మరోవైపు నాటక విమర్శకులు భావించిన అభిప్రాయాలను గౌరవించి తనకు నటన పట్ల, నాటక సాహిత్యం పట్ల సరైన అవగాహన ఉందనే విషయాన్ని ప్రస్తావించారని తెలుస్తోంది. అంతేకాకుండా నాటకాల్లో శుద్ధ నాటకాలుండవచ్చని, అవన్నీ కూడా నాటక సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తాయని అన్నారు. శుద్ధ నాటకాలను విమర్శించే వారి అభిప్రాయాలతో నేను (పింగళి) ఏకీభవించననీ, అలాగే అలాంటి వారిని విమర్శించననీ, ప్రశంసించననీ సమదృష్టితో చూస్తాననీ తన విమర్శ దృక్పథాన్ని ప్రకటించుకున్నారు.
కనుకనే బందరు ప్రజలే కాకుండా యావత్ ఆంధ్ర నాటక ప్రేక్షకులు పింగళి లక్ష్మీకాంతంగారి నటనా ప్రతిభను కొనియాడారనడానికి ఈ కింది పద్యమే నిదర్శనంగా కనిపిస్తోంది.
‘‘ విచ్చి పంజాజూలులు విదలించి గర్జించు
నీమని లక్ష్మణ స్వామి యొకడు
భారతోద్యోగ జయారంభచణ సూత్ర
ధారికృష్ణయముంజులూరి యొకడు
సాహితీ వైద్యగ్ధ్య సహిత నాటక కళా
శోభి పింగళి ధర్మసూనుడొకడు
బహుపాత్రధారణ ప్రాగల్భ్యనటనాతి
కుశలుండు దేవరకొండ యొకడు
తెలుగునాట గప్పురపు దాపులు వేలార్చు
వెలుగు కంబాలు వాణి కర్పింపలేదో!
పఱ్ఱగాదోయి! బందరు పత్తనమ్ము
పురిటి గడ్డోయి! నటకుల భూషణులకు! ’’
(గూడూరి నమశ్శివాయ, శ్రీ పింగళి లక్ష్మీకాంతం జీవిత చరిత్ర,1991, పుట:14)
ఈ విధంగా ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం తెలుగు నాటక సాహిత్యంలో నటుడిగా విభిన్న పాత్రలను పోషించారు. ఈ నేపథ్యంలోనే చెళ్లపిళ్ల వారి నాటకాలను ఆదరించి గురువు పట్ల భక్తిని, గౌరవాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా నాటి నటులకు, నాటక సంస్థలకు, నాటక ప్రేక్షకులను ఎంతో స్పూర్తిని కలిగించారు.
ఆధార గ్రంథాలు:
1. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం స్మారక సంచిక ‘నటుడుగా శ్రీ పింగళి’ అనే వ్యాసం శ్రీ శ్రీనివాస చక్రవర్తి, తెలుగు అకాడమీ, హైదరాబాద్, 1974.
2. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం స్మారక సంచిక, ‘రూపు రేఖలు’ అనే వ్యాసం, శ్రీ గొడవర్తి సూర్యనారాయణ, తెలుగు అకాడమీ, హైదరాబాద్, 1974.
3. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం స్మారక సంచిక, ‘ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి ప్రశంస’ అనే వ్యాసం, దివాకర్ల వేంకటావధాని, తెలుగు అకాడమీ, హైదరాబాద్, 1974.
4. జి. విశ్వనాథ నాయుడు, ‘పింగళి లక్ష్మీకాంతం గారి వ్యక్తిత్వం – సాహిత్యం’ పిహెచ్ డి సిద్ధాంత గ్రంథం (అముద్రితం), శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, 1991.
5. గూడారి నమశ్శివాయ ‘పింగళి లక్ష్మీకాంతం జీవిత చరిత్ర’ చార్మినార్ ఆర్ట్ ప్రింటర్,సికిందరాబాద్, 1991.