AUCHITHYAM | Volume-3 | Issue-7 | July 2022
3. ఆధునిక జానపదగేయం - భావచిత్రణ
'మానవతాకవి' రుద్రపాక జితేంద్రకుమార్
అసిస్టెంట్ ప్రొఫెసర్, పి.బి. సిద్ధార్థకళాశాల, విజయవాడ.
చరవాణి: 7993818667. ఈమెయిల్: kalagalam@gmail.com
పరిచయము:
అమ్మభాష తెలుగుభాషాసాహిత్యాన శిష్ట సాహిత్యంతో సమానముగా విస్తృత స్థాయిలో జానపదులు ఊసుపోక సృష్టించుకున్న సాహిత్యము, మౌఖిక రూపాన తరతరాల నుండి వారసత్వముగ సంక్రమిస్తున్న జానపదసాహిత్యము ఎంతో విలువైనది. సామెతలు, పొడుపుకథలు, వీరగాథలు, ఐతిహ్యాలు, జానపద కథలు, కథా గేయాలు, జానపద గేయాలు వంటి ప్రక్రియలు జానపద సాహిత్యం నందు ప్రకాశిస్తున్నాయి. ఇంతటి ఆమూల్యమైన జానపదసాహిత్యంలో తెలంగాణప్రాంతమందు బొల్లేడుపాల్ పోగుల రాజ్‌కుమార్, మాట్ల తిరుపతి వంటి జానపదరచయితలు వ్రాస్తున్న ఆధునిక జానపదగేయాల్లో కనిపిస్తున్న ఆధ్భుత భావకవిత్వ విలాసమును పరిశీలిద్దాము.
నేటి తెలంగాణ జానపద గేయాలు - భావకవిత్వ విలాసము:
తెలంగాణ ప్రాంతంలో విపుల ప్రచారంలో ఉన్న జానపదగేయాలు ఆధునిక సౌకర్యాలవల్ల వివిధ మాధ్యమలలో అందుబాటులో ఉన్నాయి. ఆ మాధ్యమాల సహాయంతో కొన్ని ముఖ్యగేయాలను ఎంపికచేసుకున్నాను. మౌఖికసాహిత్యం కాబట్టి గేయాన్ని పూర్తిగా ప్రస్తావిస్తున్నాను. వాటిని ఈ క్రింది విధంగా విశ్లేషించుకోవచ్చు.
1. "అత్తగారింటికి .... కొత్తగ .. ఓతున్న" జానపద గేయము:
ఈ తెలంగాణ జానపద గేయాన్ని రచించినది బొల్లేడు పాల్. గానము చేసినది శిరీష, గడ్డం రమేష్. ఎంతో ప్రసిద్ధి చెందిన జానపద గేయమిది .
పడుచు: అత్తగారింటికి కొత్తగ ఓతున్న.............. ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో......
గుత్తంగా నా రైక కుట్టాలో టైలరు .......... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో......
అహ సూపులకేమో సుందరాగినంట ....... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో......
సూసి సూడంగానే నాబావ మెచ్చాల......... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో.....
టైలరు: పేరుగల్ల వాణ్ణి ఫేమస్సు టైలరు ............ ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో........
పదునైన సూదితొ కుట్టేస్తనే పిల్ల ........... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో........
టైలరు: సిల్కుజాకెట్టుకు సీతద్దమేస్తానె ......... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో........
సూడంగ నీబావ సూపులకు అందేను.......... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో.......
పడుచు: గాజులు గాజులని మోజుగ అమ్మేటి......... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో........
మంచిగాజుల పెట్టు గాజులల్ల పిల్లగ......... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో........
మోచేతివరకు మెరవాలెగాజులు......... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో........
సూసిసూడంగానె నాబావ మెచ్చాలె........ .ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో.......
గాజులవ్యాపారి: గజ్వేలిగాజులు గట్టిగుంటాయ్ పిల్ల........ ఉయ్యాలో..... టుంగుటుయ్యాలో........
ఘల్లుఘల్లున సప్పుడొస్తాయె పిల్ల......... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో........
మట్టిగాజులుగావు గట్టిగాజులుపిల్ల...... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో........
సూడంగ నీబావ సూపులకు అందేను..... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో.......
పడుచు: దిద్దులు బుట్టలు చేసేటి కంసాలి....... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో........
అద్దినట్టు నాకు సొమ్ములు జెయ్యాలె....... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో........
ముక్కుకు బేసర మురిపంగ బెట్టాలె....... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో........
సూసిసూడంగానె నాబావ మెచ్చాలె......... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో.......
కంసాలి: పిల్లా బంగారంవంటి సింగారపువన్నె ....... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో........
పోతవోసి కొత్తబొమ్మను జేస్తనె....... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో........
సెవులకు కమ్మలు ముక్కుకు ముక్కెర....... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో........
సూడంగ నీబావ సూపులకు అందేను..... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో.......
పడుచు: అహ.. బొట్టుపెట్టె చేసే వడ్లబ్రహ్మచారి..... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో.......
అద్దాలపెట్టెను అందంగా జెయ్యాలె..... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో.......
పస్పుకుంకం పదికాలాలు వుండాలె..... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో.......
సూసిసూడంగానె నాబావ మెచ్చాలె.........ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో.......
వడ్రంగి: ఇగ బూరుగచెక్కతో బుద్ధిగ జేస్తానె........ ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో.......
బొట్టుబిళ్ళ కాటు కెట్టుకోయె పిల్ల........ ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో.......
బుజ్జమ్మబుజ్జమ్మ బుద్ధిగ పొయ్ రావె......... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో.......
సూడంగ నీబావ సూపులకు నచ్చేవు..... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో.......
నాబావ సూపులకు నచేట్టు నేబోతా..... ఉయ్యాలో....... టుంగుటుయ్యాలో.......
ఈ జానపద గేయంలో కొత్తగ పెళ్ళైన ఆడపిల్ల తొలిసారి అత్తగారింటికి వెళ్ళే సమయంలోతన గ్రామంలోని టైలరు, గాజులవ్యాపారి, కంసాలి, వడ్రంగి, వృత్తుల వారిని కలిసితనకు కావలసిన వస్తువులు అందంగా చేసివ్వమన్నప్పుడు ‘‘వివిధవృత్తులు చేసే వ్యక్తులు,మనం పోగొట్టుకున్న ఆనాటి వాతావరణం మనల్ని కంటతడి పెట్టిస్తాయి’’ ఈ గేయం ద్వారా గతకాలపు వృత్తులను ఆనుభూతి పొందవచ్చును. స్మృతికవిత్వ ఛాయలలో వస్త్వాశ్రయ రీతిని ప్రతిబింబిస్తూ, పల్లెల్లో పరిమళించే మానవతా సంబంధాలను చాటిచెప్పే చక్కని గేయముగ ఈ గేయాన్ని పేర్కొనవచ్చు.
2. "పొద్దు మీద పొద్దాయె" జానపద గేయము:
ఈ తెలంగాణ జానపద గేయాన్ని రచించినది పోగుల రాజ్ కుమార్. గానము చేసినది శిరీష . ఎంతో ప్రసిద్ద్ధి చెందిన జానపద గేయమిది.
గేయం:
పొద్దు మీద పొద్దాయె....పొద్దు గడవదాకాయె, పొద్దంత నీధ్యాసే .... చెప్పలేనిదీ ఘోసే
హొయ్..హొయ్..హొయ్.. నీ సూపుల సెగలు... నా మనసునేమొ తాకె వెచ్చానిఊహలు
హొయ్..హొయ్..హొయ్.. నీ సూపుల సెగలు... నా గుండెలోనదాగె సిత్రాల అలకలు
పులిచింత చెట్టు కింద... కొలమారినట్టాయె, పులకింతల నాఈడుకి.. కవ్వింపులుమొదలాయె
హొయ్..హొయ్..హొయ్.. నీ నవ్వుల విల్లు... నా ఒంటి పైన కురిసెతేనేల జల్లు
హొయ్..హొయ్..హొయ్.. నీ నవ్వుల విల్లు... నాగుండెలోన విరిసే రంగులహరివిల్లు
దొరగారి తోటలోన...దోరజామ పండుపైన, సిలకలపలుకులు వింటే... నీమాటలు యాదుకొచ్చె
హొయ్..హొయ్..హొయ్.. నీమాటల సడులు... నా మదిలోన యెటసేసె యెని గాయాలు
హొయ్..హొయ్..హొయ్.. నీమాటల సడులు... నా ఈడునేమో మత్తగొలిపె కొంటె పలుకులు
మాపటేలి గంగవ్వ... ఇంటి ముందుముచ్చట్లు, నీపేరేపొగడంగ ... నా పాణం జడపంగ
హొయ్..హొయ్..హొయ్.. నీఊసుల సుడులు...నాఈడునేమో కమ్మేసె సిగ్గుల వలలు
హొయ్..హొయ్..హొయ్.. నీఊసుల సుడులు...నా ఊపిరేమో ఆపే నీ రూపురేఖలు
సుదీర్ఘంగా సాగే ఈజానపద గేయంలో ప్రకృతి, ప్రణయ కవిత్వములు విడదీయ లేనంతగ కలసివుండటము, వస్త్వాశ్రయ రీతి ప్రధానంగ కనిపిస్తున్నది. చక్కని భావుకత, ప్రణయము, ప్రకృతిలోఐక్యం, ఇత్యాది అంశాలతో సాగే ఈ గేయం శ్రోతలను వేరేలోకాలకు తీసుకువెళ్ళే మంత్రదండం వంటిది అని చెప్పవచ్చు.
3. "ఎరుపు రంగు సీరగట్టి" జానపద గేయము:
ఈ తెలంగాణ జానపద గేయాన్ని రచించినది మాట్ల తిరుపతి .గానము చేసినది శిరీష . ఎంతో ప్రసిద్ద్ధి చెందిన జానపద గేయమిది .
గేయం:
అరె ఎరుపురంగు సీరగట్టి.. యెములాడ బొతాంటె, ఎరుపు రంగటు.. నా పాణమంతిటు
యెటుబడితటు నువ్వెటుబొతటు 2
ఏరికోరి ఎంబడొస్తె ఓయ్ పిల్లగ... గట్ల దొరకకుండ ఉర్కు తావు యేంది పిల్లగ
టిక్కు టాకు టిక్కు నీకెందుకంత టెక్కు 2
అరె పచ్చరంగు సీరగట్టి.. పట్నాము నేనుబోతె, పచ్చరంగటు .. నా పాణమంతిటు
యెటుబడితటు .. నువ్వెటుబొతటు 2
పడుసుదాన్ని నేనుగాద ఓయ్‌పిల్లగ... గంత గడుసుదనము యెందుకోయ్ నాపిల్లగ
టిక్కు టాకు టిక్కు నీకెందుకంత టెక్కు 2
ఆ నలుపురంగుసీర కట్టి .. నల్లగొండ నేను బోతే,నలుపు రంగటు నా పాణమంతిటు
యెటుబడితటు .. నువ్వెటుబొతటు 2
సుక్కోలున్న నన్నుసూసి ఓయ్‌పిల్లగ.. గట్ల ముక్కుమూతి తిప్పుడేంది నాయ్‌పిల్లగ
టిక్కు టాకు టిక్కు నీకెందుకంత టెక్కు 2
అబ్బ సిల్కు సీర గట్టుకుని... సిరిసిల్ల నేబోతే, సిల్కుసీరటు నా పాణమంతిటు
యెటుబడితటు .. నువ్వెటుబొతటు 2
తుంటరెషాలుమాని ఓయ్ పిల్లగ... జరజంటగూడుదాము రారా నాయ్ పిల్లగ
టిక్కు టాకు టిక్కు నీకెందుకంత టెక్కు 2
తెల్లరంగు సీరగట్టి... తెర్లుమద్ది బోతాంటె, తెర్లుమద్దటు నా పాణమంతిటు
యెటుబడితటు .. నువ్వెటుబొతటు 2
కన్నెపిల్లమనసుపడితె ఓయ్‌పిల్లగ... గట్ట కసురుకుంటవేంది నాయ్ పిల్లగ
టిక్కు టాకు టిక్కు నీకెందుకంత టెక్కు 2
కథాకథనశైలిలో సాగే ఈ జానపద గేయంలో పల్లెయువతి తనప్రియుడి పై ఆలపించె ఈ గేయంలొ పదాలను మనం పరిశీలిస్తే ఎరుపురంగు / ఎములాడ, పచ్చరంగు / పట్నాము, నలుపురంగు / నల్లగొండ, సిల్కుసీర / సిరిసిల్ల, తెల్లరంగు / తెర్లుమద్ది ఇలా ప్రాస పదాలతొ హాస్యధోరణిలో, వస్త్వాశ్రయ కవితాశైలిలో, ప్రణయకవిత్వ ప్రాధాన్యతతో భావకవిత్వమూలంతో మాట్ల తిరుపతి చక్కగ రచించారు. అద్భుత భావుకత ఈ గేయంలో మనకు కనిపిస్తుంది.
4. "రాములో.... రాములా" జానపద గేయము:
ఈ తెలంగాణ జానపద గేయాన్ని రచించినది మాట్ల తిరుపతి. గానము చేసినది మౌనికయాదవ్. ఎంతో ప్రసిద్ద్ధి చెందిన జానపద గేయమిది.
పల్లవి:
మందు పెట్టినావురొ... రాములో .. రాముల, ఏం మాయజేసినావురో... రాములో .. రాముల
నీవలలొ సిక్కిన సేప పిల్లలా.. కొట్టుకుంటున్న గిలగిలగిల
మందు పెట్టినావురొ... రాములో .. రాముల, ఏం మాయజేసినావురో... రాములో .. రాముల
చరణం:
నిన్నేమన్న అంటిన, నీసొమ్మెమన్న తింటిన, పల్లెత్తు మాట అంటిన, పదిమందిలొనిన్ను సూతిన
కనికట్టెదో సేసి రాములో .. రాముల, సుట్టూ దిప్పు కుంటివిరో... రాములో .. రాముల
చరణం:
బడబడ బదమాషు గాళ్ళకె దొరకాలేదు, ఇరకాలేదు, ఎవ్వడన్న
నా ఎంబడపడితె బొక్కాలిరిసి సేతిలోపెడితి
నువు కలిసిన నుండి ... రాములో .. రాముల నాకథె మారెరొ... రాములో .. రాముల
ఈ జానపద గేయంలో భావకవిత్వ ధోరణిలో ఆత్మాశ్రయకవితా రీతిన సాగుతూ బడ, బదమాషు, వంటి పరభాషా పదాలు ప్రయోగింపబడుతూ మనల్ని మైమరపించె చక్కని గేయం.
ముగింపు:
నేటి తెలంగాణ జానపదగేయాలలో చక్కని భావుకత, వర్ణనాశైలి, పదప్రయోగం (పరభాషా పదములు పొదిగినతీరు), ఆత్మాశ్రయ, వస్త్వాశ్రయ కవితాధోరణులు, భావకవిత్వ వైవిధ్యరీతులైన ప్రకృతి, ప్రణయ, స్మృతి కవితారీతులు ఒదిగిపోయిన వైనం మనకు కనిపిస్తుంది. అద్భుతభావ జగత్తును శ్రోతలకందిస్తూ, తెలుగు భాషను, భావగతిని సుసంపన్నం చేస్తున్న ఏ ప్రాంత జానపదగేయమైన మనం ఆదరించాలి.
ఆధార గ్రంథాలు / ఆకరాలు:
- తెలుగు జానపద గేయ సాహిత్యము, ఆచార్య బి. రామరాజు.
- గేయసేకరణ: సాంఘిక మాధ్యమము.