AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-7 | July 2022

2. పర్యావరణ పరిరక్షణకు ‘చెట్టంత మనిషి' (నాటిక)

డా. పులపర్తి శ్రీనివాసరావు

అసిస్టెంట్ ప్రొఫెసర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,
బొమ్మూరు, రాజమహేంద్రవరం.
చరవాణి: 8309742248. ఈమెయిల్: telugu.bujji@gmail.com


సంక్షిప్త పరిచయం:

‘హితేన సహితం సాహిత్యం’ అన్నారు. సమాజానికి హితం చేకూర్చేది సాహిత్యం అని దాని అర్థం. ఆధునిక సాహిత్యం చాలా వరకూ ఈ కోవలోనే ఉంది.అయితే నేటి కాలంలో సమాజానికి హితం చేకూర్చే అంశాలలో పర్యావరణం ఒకటి. పర్యావరణ పరిరక్షణ అత్యంత ఆవశ్యకం. పర్యావరణ కాలుష్యానికి మానవ తప్పిదమే అధిక కారణం.దీన్ని గుర్తెరిగి పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకం. అందుకే ఈ మధ్య కాలంలో కవులు, రచయితలు తమ తమ రచనల్లో పర్యావరణాన్ని వస్తువుగా తీసుకుని వివిధ ప్రక్రియల ద్వారా సమాజంలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్‌ లో కూడా పర్యావరణం పట్ల ప్రజలకు శ్రద్ధ కలిగేటట్లు రచనలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్దేశ్యంతో కవి రచయిత అయిన ద్విభాష్యం రాజేశ్వర రావు గారు ‘చెట్టంత మనిషి’ అనే నాటికను రాసి కొన్ని సార్లు ప్రదర్శింపచేశారు. ఈ నాటిక ద్వారా పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ఏవిధంగా తెలియజెప్పాడో తెలపడమే కాకుండా పాఠకులలో దీని పట్ల అవగాహన  కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ నాటికను విశ్లేషించి వ్యాసరూపంలో అందిస్తున్నాను.

సాహిత్య ప్రక్రియల్లో నాటకం అత్యంత శక్తివంతమైన సాధనం. జన హృదయాలను సూటిగా స్పందింప చేసే శక్తి ఒక్క నాటకానికే ఉంది.  ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కవిత్వం, నవల కథానికలవలె నాటక వాఙ్మయం కూడా సాంఘిక ప్రయోజనం పరమావధిగా అవతరించింది.  తెలుగువారి సామాజిక జీవితాన్ని  బహుకోణాల్లో నాటకం ప్రదర్శించింది. ఒక శతాబ్ధి కాలంలో, తెలుగు సమాజంలో వచ్చిన అనేక పరిణామాలను ఎప్పటికప్పుడు చిత్రిక పట్టింది నాటకం. సంఘజీవితంలో ఏర్పడిన అనేకమైన ఎగుడుదిగుడులను విమర్శనాత్మకంగా, పరిశీలనాత్మకంగా, ప్రయోగాత్మకంగా  చిత్రిస్తూ సంఘపురోగమనానికి అడ్డుపడే దౌష్ట్యాలను, సంఘజీవితాన్ని విచ్ఛిన్నం చేసే క్రౌర్యాలను బయటపెట్టింది నాటక ప్రక్రియ.కాబట్టే ప్రచీన కాలంలో సమాజంలో ఏదైనా అంశం గురించి అవగాహన తీసుకురావడం నాటికనే ఎక్కువగా ఉపయోగించుకునేవారు. సంఘ సంస్కరణ దృక్పథంలో  కవులు ఈ ప్రక్రియకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ద్విభాష్యం రాజేశ్వరరావు గారు కూడా పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడం కోసం ఈ నాటిక ప్రక్రియనే ఉపయోగించుకున్నారు.

చెట్టంత మనిషి - కథా పరిచయం:

చిదంబర స్వామి ఒక సంఘసేవకుడు. ఏ ఉద్యోగం లేకపోయినా సామాజిక బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతూ ఉంటాడు. కనబడిన వారికల్లా మొక్కలిస్తూ పర్యావరణాన్ని కాపాడమని సూచనలిస్తాడు. ఒక రోజు గౌరమ్మ అనే ఒక పేదరాలిని తీసుకొని బ్యాంకుకు వెళ్ళే సరికి బ్యాంక్‌ మేనేజర్‌ పిలిచి మీకేం సహాయం చేయాలని అడిగితే నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నా దగ్గరున్న బంగారాన్ని తీసుకుని కొంత సొమ్మును మీ బ్యాంకులో అప్పు ఇప్పించగలరని గౌరమ్మ వేడుకుంటుంది. బ్యాంక్‌ మేనేజర్‌ లోను ఇస్తాడు. చేసిన సహాయానికి మేనేజర్‌కి రెండు వేప మొక్కలిచ్చి నీళ్ళుపోసి పెంచమంటాడు. మొక్కలను ఆ బ్యాంకు ఆవరణలోనే నాటిస్తాడు. కొంతకాలం తర్వాత బ్యాంకు మేనేజర్‌ని కలిసి వేప మొక్కలు బాగా పెరిగాయి. ఇంకో రెండు చింత మొక్కలు ఇస్తాను. వెనకాల జాగాలో నాటించండని చెప్తాడు. అదే సమయంలో పరిశ్రమల వల్ల ఉధృత మవుతున్న కాలుష్యం గురించి ఇద్దరూ చర్చించుకుని బాధ్యతగా మొక్కలు నాటాలని అనుకుంటారు.

కొన్ని రోజుల తర్వాత బ్యాంకుకొచ్చిన చిదంబరం మీ బ్యాంకులో ఒక రూపాయి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తాను. ఇరవై యేళ్ళకు ఎంత అవుతుందని అడుగుతాడు. సుమారు పదిరూపాయలకు పైనే అవుతుందని చెప్పిన మోహన్‌తో ఒక రూపాయి ఇరవై యేళ్ళలో యాభైవేల రూపాయలు అయ్యే మార్గం చెప్పనా అంటూ మొదలుపెట్టి ఒక టేకు మొక్క ఇస్తాను దాన్ని మీ ఇంట్లో పాతిపెడితే ఇరవై యేళ్ళ తర్వాత యాభైవేల రూపాయలనిచ్చే కలప వస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు.

చిదంబరంతో వచ్చిన గౌరమ్మ మోసకారి అని తెలుసుకుని దీనికి కారణ చిదంబరమే అని రిక్షా వాళ్ళందరూ కలిపి కొట్టారని విశాఖ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిసి బ్యాంక్‌ మేనేజర్‌ గాంధీ వెళతాడు. పరామర్శలు అయిన తర్వాత టేబుల్‌ మీద రెండు అంకుడు మొక్కలు ఉన్నాయని తీసుకెళ్ళి కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడతాయని చెప్తాడు. గాంధీ వాటిని తీసుకుని వెళ్తాడు.

కొన్నిరోజుల తరవాత గాంధీకి దూరపు బంధువు రామానుజం కనిపిస్తే చిదంబరం గురించి అడుగుతాడు. కొంతమంది జీవితాలు విచిత్రంగా ఉంటాయి. చిదంబరం జీవితం కూడా అటువంటిదే. అని చెప్తూ వాళ్ళ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో మొక్కల మధ్యలో ఉన్న గుడిసెను చూపి అదే చిదంబరం ఇల్లు అని చెప్తాడు. ఆ ప్రాంగణం అంతా మొక్కలు, చెట్లతో నిండి ఉంటుంది.చిదంబరం వ్యక్త్తిత్వం గురించి అడిగితే అతనిలోని మంచితనం అతనిని అలా తయారు చేసిందని పల్లెటూరి నుండి వచ్చిన ఓ యువతి తన భర్తకు క్యాన్సర్‌ అని చెప్పడంతో నగల విషయంలో బ్యాంకుకు తీసుకెళ్ళి అప్పు ఇప్పించి సహాయం చేశాడు. నిజానికి అవి గిల్టు నగలని చిదంబరానికి తెలీదు. చివరకు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.అంతే కాకుండా జైలుకెళ్ళిన చిదంబరం జైలుని కూడా మొక్కలతోటగా మార్చేశాడు. తోటి ఖైదీలకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించాడని చెప్తాడు.

చిదంబరాన్ని కలిసిన గాంధీ ఎలా ఉన్నారని అడగగా పరిస్థితిని వివరిస్తాడు. ఉద్యోగం మానేసిన అబ్దుల్లాకి, వైద్యం చేయించినా బ్రతకని భర్తను పోగొట్టుకున్న గౌరమ్మకి ఆశ్రయం కల్పించడం గాంధీకి ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకే ఆయన చెట్టంత మనిషయ్యాడు. అబ్దుల్లా గౌరమ్మలు ఆ నర్సరీని బాగా చూసుకుంటున్నారు. అందుకే తన తర్వాత ఆస్తి అంతా వీళ్ళిద్దరకూ చెందేలా వీలు రాసి ఆఖరి కోరికగా చెప్తాడు. ఇది నాటికలోని కథ.

చెట్టంత మనిషి - పర్యావరణ ఆవశ్యకత:

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకీ విస్తరించడంతో పల్లెలు కూడా పట్టణాలుగా మారి పూర్వపు శోభను కోల్పోతున్నాయి.దీంతో పాటు పర్యావరణం విపరీతంగా దెబ్బతింటుంది. ప్రపంచీకరణ, పట్టణీకరణ, సరళీకరణ వంటి విధానాలతో చెట్లను నరికి పల్లెను స్మశానాలుగా మార్చేస్తున్నారు. ప్రకృతిని నాశనం చేస్తూ మనిషి తన మనుగడను సందిగ్ధంలోకి నెట్టుకుంటున్నాడు. ఇటువంటి సందర్భంలో ‘చెట్టంత మనిషి’వంటి నాటికల ద్వారా ప్రజలలో పర్యావరణం పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా  ఉంది. ఆ ఉద్దేశ్యంతో ద్విభాష్యం రాజేశ్వరరావుగారు రాసిన ఈ నాటిక ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడిరది.

వ్యక్తిగత బాధ్యత కన్నా సామాజిక బాధ్యత పట్ల ప్రతీ మనిషి ఆలోచించాల్సి ఉందని ఈ నాటికలో స్పష్టంగా తెలియజేశారు రచయిత. పర్యావరణ పరిరక్షణ గురించి పాఠశాల స్థాయి నుంచి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ నాటికలో చెప్పాడు.

వసంత ధరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తన పాఠశాలలో మొక్కలు నాటించే కార్యక్రమం పెట్టదలచి తండ్రి గాంధీతో కలిసి చిదంబరం ఇంటికి వస్తుంది. అక్కడ చిదంబరం ఇచ్చిన సందేశం వాళ్ళకే కాకుండా యావత్‌ ప్రపంచానికి బాధ్యతను తెలియజేసేలా ఉంటుంది. ‘‘పర్యావరణ పరిరక్షణ ఓ ఉద్యమంలా సాగాలి. ప్రజలలో చైతన్యం తీసుకురావాలి. ప్రజలు తమవంతు బాధ్యత గుర్తెరిగి తమ కర్తవ్యం నిర్వహించాలి. వృక్షో రక్షతి రక్షిత: … నువ్వు చెట్టును కాపాడితే చెట్టు నిన్ను పాకాడుతుంది... నిన్నే కాదు నీ పిల్లల్ని... పాపల్ని... ముందు తరాన్ని కాపాడుతుంది...  ఈ పుడమి తల్లినే కాపాడుతుంది...’’ 1 అంటాడు.

చిదంబరం మాటల్లో పర్యావరణం నశించిపోతుందనే ఆవేదన చాలా ఎక్కువగా కనబడుతుంది. అయితే సామాజిక బాధ్యతగా తానొక్కడే దీనికి బాధ్యుడుగా ఉంటే సరిపోదు. మిగిలిన లోకమంతా ఆలోచించాలి. అదే ఆలోచన చిదంబరం చేశాడు. ప్రజలకు వారి వారి బాధ్యతను గుర్తుచేశాడు. వృక్షాలను కాపాడితే అవి మనల్ని తిరిగి కాపాడతాయని చెప్పి ప్రకృతి కాపాడేందుకు అందరూ కట్టుబడి ఉండాలని విన్నవించినట్లుంది.

మొక్కల పెంపకం అనేది కాలుష్యాన్ని అరికట్టడానికి అన్ని రకాలు గానూ ఉపయోగపడుతుంది. దీన్ని గుర్తించక మనిషి అనాదిగా చెట్లను నరికేస్తున్నాడు. రచయిత సమాజంలోని మనిషే. కాబట్టి దీన్ని గుర్తించి చిదంబరం పాత్ర ద్వారా అద్భుతమైన సందేశాలను అందించాడు. దెబ్బలు తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిదంబరాన్ని చూడటానికి గాంధీ వెళ్ళినపుడు మంచి చెడు మాట్లాడటం మానేసి ఇలా అంటాడు.

‘‘నేను లేవలేను సార్‌... అదిగో... ఆ టేబుల్‌ మీద రెండు అంకుడు మొక్కలు ఉన్నాయి... తీసుకెళ్లండి... కాలుష్య నివారణకు... పర్యావరణ పరిరక్షణకు అంకుడు చెట్లు విరివిగా పెంచమని అటవీశాఖవారు చెప్తున్నారు.’’2 అని చెప్తాడు.

అటవీ శాఖ విధిగా అడవుల నరికివేతను అరికట్టడమే కాకుండా కొత్త మొక్కల పెంపకానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దీనిలో బాగంగానే వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను ప్రభుత్వ సహకారంతో వివిధ సంస్థల సహకారంతో నిర్వహిస్తుంది. దాన్ని ఆసరాగా తీసుకుని చిదంబరం అంకుడు మొక్కలు పాతమని చెప్పడం పర్యావరణ ప్రేమికుడుగా తన బాధ్యతను నెరవేర్చినట్లయింది.

ప్రకృతిని రక్షించే క్రమంలో ప్రతీ వ్యక్తి మొక్కలను నాటాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. దానిలో భాగంగానే ‘చెట్టు-నీరు’వంటి కార్యక్రమాలు పాఠశాలల్లోనూ, ప్రభుత్వ సంస్థల్లోనూ నిర్వహిస్తున్నారు. ఇటువంటి వాటి గురించి ప్రస్తావిస్తూ చిదంబరం పాత్ర ద్వారా రచయిత ప్రతి ఒక్కరికీ కొన్ని బాధ్యతలను గుర్తించాడు.

‘‘ఎవరి షాపు ముందున్న చెట్టు ఆ షాపువాళ్ళే పెంచి పోషించాలని పర్యావరణ పరిరక్షణ యెడల వ్యాపారస్తులు కూడా శ్రద్ధ చూపించాలని లేకపోతే చెట్టుకు 1000 రూపాయలు జరిమానా కట్టవలసి ఉంటుందని కోర్టు తీర్పిచ్చింది.’’3 అని గాంధీతో చిదంబరం పలికిన మాటలు పరిశీలిస్తే ఈమధ్యకాలంలో రోడ్ల పక్కన ఎన్నో చెట్లు రక్షణకు నోచుకోక, నీరు లేక చనిపోతున్నాయి. వాటి బాధ్యత ప్రభుత్వం వారు మినహా ఇంకెవరూ తీసుకోవట్లేదు. కానీ కోర్టు ఆదేశం మేరకు ఎవరి షాపు ముందు ఉన్న చెట్టు వారే పరిరక్షించాలని చెప్పడం వల్ల కొన్ని చెట్లైనా బ్రతికించుకోగలుగుతాం అనే ఆలోచన తీసుకురావడం కోసం కోర్టు తీర్పుని ఇక్కడ ఉదహరించినట్లైంది.

పరిశ్రమల కారణంగా కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని ఇటువంటి సమయంలో చెట్లు పెంచడానికి ప్రతిఒక్కరూ పాటుపడాలని చెప్తూ రచయిత తన ఆలోచనను పాత్రముఖంగా వెల్లడిరచాడు. చిదంబరం గాంధీతో మాట్లాడుతూ- ‘‘సార్‌... విశాఖ మహానగరంలో పరిశ్రమలతో పాటు కాలుష్యమూ పెరిగిపోతుంది. గడిచిన నాలుగైదు సంవత్సరాలలో నగర జనాభా కూడా విపరీతంగా పెరిగింది. దానితో రోడ్డు మీద తిరిగే వాహనాలు హెచ్చయిపోయాయి. ఆ వాహనాలు వదిలే కార్బన్‌ మోనాక్సైడ్‌, కార్బన్‌ డై ఆక్సైడ్‌ లాంటి విష వాయువులు అధికమైపోయాయి. గాంధీగారూ ఈ కాలుష్యం తగ్గాలంటే నగరంలో చెట్లు విరివిగా పెంచక తప్పదు. మీ బ్యాంకులు చెట్లు పెంచడానికి తోడ్పడాలి. పెంచేవారికి ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రతీబ్యాంకు ఉద్యోగి తన వంతుగా నెలకొక మొక్క నాటి, పెంచేలా చూడాలి. అది చాలు”4 అని వేడుకుంటాడు. చెట్లు పెంచడం వల్ల ప్రకృతి సోయగంతో పాటు ప్రాణ వాయువైన ఆక్సిజన్‌ అధిక మొత్తంలో దొరుకుతుంది. మనిషి మనుగడకు ఇది ఎంతో ఉపయోగం. అభివృద్ధి కోసం పరిశ్రమలుండటం అవసరం. అలాగని పెరుగుతన్న కాలుష్యాన్ని అలాగే వదిలేస్తే మనిషి ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. దీన్ని గుర్తించిన రచయిత చిదంబరం పాత్ర ద్వారా ప్రతీ ఉద్యోగి తన వంతుగా నెలకొక మొక్క నాటాలని చెప్పి వారిలో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే బాధ్యత పట్ల అవగాహన తీసుకురావాలని సూచించాడు.

ప్రస్తుత కాలంలో అవసరాలకు మించి కాగితం వాడకం బాగా పెరిగింది.  పేపర్‌ తయారీకి అవసరమయిన కలపంతా చెట్లనుంచే తయారు చేస్తారు. అందువల్ల ముడి పదార్థం కోసం అడవులను నరికి వేస్తున్నారని చెబుతూ రచయిత ఇలా అంటున్నాడు. ‘‘కాగితం అవసరమే. కాగితం పరిశ్రమల వాళ్ళు ఏడాదికి ఇన్నివేల ఎకరాలలో కొత్తగా మొక్కలు నాటి పెంచాలని, వాళ్ళ ముడిపదార్థానికి సంబంధించిన కలప వాళ్ళే సమకూర్చుకోవాలని ప్రభుత్వం చెబుతుంది. కానీ ప్రభుత్వం అరుపులు అరణ్య రోదనమే అయిపోతున్నాయి.అరణ్యాలు మాత్రం అంతరించి పోతున్నాయి. అడవుల నాశనం వలన వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. వార్షాలు తగ్గిపోతున్నాయి. వణ్యప్రాణులు అంతరించి పోతున్నాయి. పక్షి సంతతి రూపు మాసిపోతుంది. కాబట్టి కాగితం పొదుపుగా వాడటం ఈవాళ నుండే ఆరంభించాలి.  ఇటువంటి కరపత్రాలు చింపి బుట్టలో పారేయకుండా రెండో పక్కన తెల్లగా ఉన్న భాగం రాయడానికి వాడుకోవాలి”5 అని చెప్పాడు.

ఈ వాక్యాల్లో నిత్యావసరాల్లో కాగితం కూడా ఒకటిగా మారిందని, అయితే దాని తయారీకి అడవుల నరికివేత సరికాదని, దీనివల్ల వర్షాలు తగ్గి పంటలు పండకపోవటమే కాకుండా వాతావరణ సమతుల్యత దెబ్బతిని వన్యప్రాణులు అంతరించి పోవడానికి కారణం అవుతుంది. కాబట్టి కాగితాన్ని పొదుపుగా వాడాలని రచయిత సూచన చేసి సమాజ పరిరక్షణకు పాటుపడ్డాడనిపించింది.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పెంచి ధరిత్రిని కాపాడాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుతుంది. దీన్ని పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు మొక్కలను నాటే కార్యక్రమాలని చేస్తున్నారు. ఈ నాటికలో ఈ విధమైన చైతన్యం కలిగిన మరో వ్యక్తి వసంత. ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని మా కాన్వెంటులో మొక్కలు నాటించాలని తండ్రితో చెప్పినపుడు, ‘రియల్లీ గుడ్‌ ఐడియా’ అని అంటాడు. దీనికి ప్రతి స్పందనగా వసంత ‘‘ ఈ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రతీ పౌరుడు ఒక మొక్క నాటితే దేశానికి ఎంతో మేలు చేసినవారవుతారని పేపరు వాళ్ళు సంపాదకీయం రాసారు. అందుచేత ఈ వేళ మా కాన్వెంట్‌ పిల్లల చేత ఓ వంద మొక్కలు నాటిస్తాను’’6 అని అంటుంది.

సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించేవాళ్లు నేటి కాలంలో చాలా తక్కువ. వసంతలాంటి వ్యక్తుల వల్ల సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుందనటంలో ఏ విధమైన సందేహం లేదు. ప్రకృతి, పర్యావరణం, కాలుష్యం వంటి వాటిపట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా వసంత కనిపించడమే కాకుండా విద్యార్థుల్లో వీటి పట్ల అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకొచ్చి పర్యావరణ పరిరక్షనకు పాటుపడే పాత్రగా తీర్చిదిద్ది సమాజానికి ఆదర్శంగా నిలిపాడు రచయిత.

ముగింపు:

ఈ విధంగా రచయిత పర్యావరణ పరిరక్షణ ధ్యేయంతో తనవంతు కృషిని అందించాలనే దృక్పథంతో ‘చెట్టంత మనిషి’ నాటిక ద్వారా పాఠకులకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించి వారిని పర్యావరణాన్ని కాపాడే బాధ్యులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారనిపించింది. ఈ నాటిక ద్వారా కొందరైనా పర్యావరణం గురించి ఆలోచించకపోతారా అని నా అభిప్రాయం. అంతేకాకుండా ప్రతీ పాత్ర ద్వారా వెల్లడిరచిన అంశాలు నేటికాలపు మనుషులలో కొంతమేరకైనా ఆలోచన తీసుకువస్తాయని అనిపించింది.అలాగే  నాటికను పూర్తిగా పరిశీలిస్తే వ్యక్తిగత బాధ్యతతోపాటు సామాజిక బాధ్యత అత్యంతావశ్యకం అని పూర్తిగా అవగతం అయింది.

అంత్య సూచికలు:

  1. చెట్టంత మనిషి ` ద్విభాష్యం రాజేశ్వరరావు :పట - 25
  2. చెట్టంత మనిషి ` ద్విభాష్యం రాజేశ్వరరావు :పుట - 18
  3. చెట్టంత మనిషి ` ద్విభాష్యం రాజేశ్వరరావు :పుట - 24
  4. చెట్టంత మనిషి ` ద్విభాష్యం రాజేశ్వరరావు :పుట - 10
  5. చెట్టంత మనిషి ` ద్విభాష్యం రాజేశ్వరరావు :పుట - 12
  6. చెట్టంత మనిషి ` ద్విభాష్యం రాజేశ్వరరావు :పుట - 20

ఆధార గ్రంథాలు:

1. భవాని, డా॥ బి., ద్విభాష్యం రచనలు: సుచరిత పబ్లికేషన్స్‌, చినవాల్టేర్‌, విశాఖపట్న - 03,2018.

2. మోహనరావు, ఆచార్య సజ్జా., : సాంఘికోద్యమరూపకాలు, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌, విశాఖపట్నం - 03, 2015.

3. రాజేశ్వరరావు ద్విభాష్యం: చెట్టంత మనిషి, రాము, పల్లాపు.: మేఘ మందిరం, శ్రీ కృష్టవంశీ క్రియేషన్స్‌, నెల్లూరు, 2010.

5. సత్యవాణి, డా॥ జొ. వెం. : తెలుగులో ప్రకియ వైవిధ్యం - మదనపల్లి - చిత్తూరు 1985.

6. సిమ్మన్న. వెలమల : తెలుగు సాహిత్య విమర్శ సిద్దాంతాలు, విశాఖపట్నం, 2005

7. సుబ్రహ్మణ్యం.జి.వి : సమాలోచనం, ఆధునికాంధ్ర సాహిత్య ప్రక్రియలపై సమీక్ష, యువభారతి, హైదరాబాద్‌, 1980.