డా. రాంభట్ల వేంకటరావు మెమోరియల్ ట్రస్ట్


స్థాపన:

24, నవంబర్‌ 2007 (కార్తీక శుద్ధ పౌర్ణమి), స్థలం : శ్రీ లలితాపీఠం, విశాఖపట్నం.

సందర్భం :

కీ.శే. డా.రాంభట్ల వేంకటరావు (కుప్పిలి డాక్టరు) గారి 108వ జయంత్యుత్సవం.

ప్రారంభ కార్యవర్గం :

వ్యవస్థాపక అధ్యక్షులు : శ్రీమతి, శ్రీ రాంభట్ల లక్ష్మీనృసింహ సోమయాజులు, సూర్యకాంత కామేశ్వరి దంపతులు, ఇతర కుటుంబీకులు.
అధ్యక్షులు : 'దహరానందనాథ' శ్రీశ్రీశ్రీ రాంభట్ల వేంకటసోమయాజులు.
ఉపాధ్యక్షులు : రాంభట్ల పార్వతీశ్వర శర్మ (సీనియర్‌)
కార్యదర్శి : 'అష్టావధాని' రాంభట్ల పార్వతీశ్వర శర్మ
కోశాధికారి : రాంభట్ల వేంకటరాయ శర్మ

ప్రస్తుత కార్యవర్గం :

అధ్యక్షులు : రాంభట్ల సూర్యకాంత కామేశ్వరి
కార్యదర్శి : 'శతావధాని' డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ
కోశాధికారి : డా. రాంభట్ల వేంకటరాయ శర్మ

సభ్యులు : 1. రాంభట్ల సుబ్బలక్ష్మి 2. టి.వి.ఎల్‌.నర్సింగరావు.

డా. రాంభట్ల వేంకటరావు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆశయాలు - విధులు:

డా. రాంభట్ల వేంకటరావు మెమోరియల్‌ ట్రస్ట్‌ సంస్థ కార్యక్రమాలు ప్రారంభ కాలంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే సంస్థ వ్యవస్థాపక దినోత్సవంనాడు ఉండేవి. ఈ విధానం సుమారు 2012వరకు కొనసాగింది. తరువాత కాలంలో నెలకు ఒక సాహిత్య కార్యక్రమం చేసేవిధంగా పూనుకొని ప్రస్తుతం ప్రతినెల మూడు లేక నాలుగో ఆదివారం కార్యక్రమాలు జరుపుతోంది.

ఈ సంస్థ నిర్వహించే కార్యక్రమాలలో సాహితీ ప్రియులతోపాటు సాహిత్యేతర ప్రముఖులను ఆహ్వానించడం జరుగుతుంది. ఎందుకంటే సాహిత్యంపట్ల ఏమాత్రం అవగాహన లేనివారికి కూడా ఆసక్తిని కల్పించుటకు ఈ ప్రయత్నం చేస్తున్నాం.

ఆచార్య నిమ్మా వెంకటరావు, (ఆంధ్ర విశ్వకళాపరిషత్,) డా. ఎస్‌.వి. ఆదినారాయణ రావు (ప్రేమ హాస్పిటిల్‌ ఎం.డి) శ్రీవాడరేవు సుబ్బారావు (మేనెజర్, లలితాపీఠం, విశాఖ) మొదలైనవారు సంస్థ ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ముఖ్యాతిథులుగా పాల్గొంటూ చేయూతనిస్తున్నారు.

సాహితీ ప్రముఖులుగా ఆహ్వానింపబడ్డవారిలో ముఖ్యంగా:-

1. మహాసహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు 2. ఆచార్య సార్వభౌమ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి 3. ఆచార్య కోలవెన్ను మలయవాసిని 4. డా. డి.వి. సూర్యారావు, 5. డా. గన్నవరపు వరాహ నరసింహమూర్తి (యు.ఎస్‌.ఎ.) వీరంతా ఈ సంస్థ నిర్వహించబడే కార్యక్రమాలకు హాజరై ఉపన్యసించి సత్కారాలు పొందారు. ఇంకా వారితోపాటు విలువైన ఉపన్యాసాలిచ్చి సన్మానించబడ్డవారిలో సినీ హాస్యనటులు శ్రీ కళ్ళు చిదంబరం, అష్టావధాని “పండిత” నేమాని రామజోగి సన్యాసిరావు మొదలైన వారున్నారు.

విశాఖ జిల్లాలో ముఖ్యంగా నగరంలో అవధానాలను జరిపిస్తూ అవధాన ప్రక్రియకు ఒక గుర్తింపునిచ్చే సంస్థగా ఎన్నో సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కవితాగోష్ఠులు, సాహిత్య, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, గ్రంథ సమీక్షలు, కవిసమ్మేళనాలు మొదలైన ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.


ఈ సంస్థ చేసే కార్యక్రమాలను కొంచెం దగ్గరగా పరిశీలిస్తే :

2007 నవంబరు 24న శ్రీలలితా పీఠంలో జరిగిన డా.శ్రీ రాంభట్ల వేంకటరావుగారి 108వ జయంత్యుత్సవం సందర్భంగా 'రాంభట్ల వేంకటీయం' అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అలాగే 2009 నవంబరులో 2010 సంవత్సరం క్యాలెండర్‌ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీమతి మలయవాసిని, విశిష్టాతిథిగా శ్రీ ఎస్‌.వి. ఆదినారాయణ రావు మొదలైన ప్రముఖులు ఆహ్వానించ బడ్డారు. అయితే ఇదే కార్యక్రమంలతో డా. గరికపాటి నరసింహారావుగారి చేత 'అష్టావధానసభ' నిర్వహించబడింది. ఈ అవధానానికి సంచాలకలుగా శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి వ్యవహరించారు.

2010లో ఈ సంస్థ 4వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిపారు. 2010 నవంబరు 24న లలితాపీఠంలో జరిగిన ఈ సభలో ముఖ్యఅతిథిగా డా.జె.వి.వి.ఎన్‌. మూర్తి ప్రిన్సిపాల్, డా. వి.ఎస్. కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారు విలువైన ఉపన్యసించారు. అలాగే 2011లో క్యాలెండర్‌న ఆవిష్కరించి తొలి ప్రతిని “సహజ జ్యోతిష పండిత” శ్రీ టి.వి.ఎల్‌. నర్సింగరావు గారికి అందజేసాం. ఈ సభలోనే శ్రీ శంకర భగవత్పాదుల వారి 'మనీషా పంచకం' పై ప్రసంగాన్ని ఏర్పాటు చేసాం. దీనిపై ప్రసంగించినవారు సుప్రసిద్ధ అష్టావధాని “పండిత” శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు గారు.

2012 ఫిబ్రవరి 12న “ఆచార్యసార్వభౌమ” వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అధ్యక్షతన విశాఖ శ్రీ లలితాపీఠంలో జరిగిన సాహితీ కార్యక్రమం నగరంలో ఒక ప్రత్యేకతను సంతరింపచేసింది. ఈ కార్యక్రమంలో జరిగిన అష్టావధానం అందరిమన్ననలను పొందింది. ముఖ్యంగా అవధాని అయిన శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ (జూనియర్) అద్భుతమైన అవధాన నిర్వహణలో ఈ సభ నడిచింది. ఈ సభకుసాహితీ ప్రముఖులందరూ విచ్చేసి కవితా రసభరితమైన అష్టావధానాన్ని చూసి ఆనందించి లలితా మాతృకృపామృతాన్ని పొందారు.

2012 డిశంబరులో ఆరవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరిపాం. ఈ కార్యక్రమంలో పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీ చక్ర పీఠం వారు శ్రీ రాంభట్ల వేంకట సోమయాజులుగారు వ్యవహరించారు. ముఖ్యాతిధిగా డా.ఎస్‌.వి.ఆదినారాయణరావు విశిష్టాతిధిగా డా. నిమ్మా వెంకట్రావు హాజరయ్యారు, ఈ సాహిత్యసభలో 'సాహిత్యము - సమాజము' అనే అంశంపై ఆచార్య సార్వభౌమ శ్రీవేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి ఉపన్యసించారు. సభా వ్యాఖ్యాతగా శ్రీ రాంభట్ల నృసింహశర్మ వ్యవహరించారు. ఈ సభా సమావేశం లలితా పీఠంలో ఘనంగా నిర్వహించబడింది.

2013లో శ్రీశ్రీశ్రీ “దహరానంద నాథ” రాంభట్ల వేంకటసోమయాజులు గారి జీవిత విశేషాలు, 'ఆర్ష విజ్ఞాన విశిష్టత' గ్రంథ వైభవం పై సమీక్షా సమావేశం జరిపించారు. ముఖ్యవక్తగా విచ్చేసిన శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి అద్భుత ప్రసంగంతో సాహితీ ప్రియులందరి మన్ననలను ఈ సంస్థ పొందింది.

2013 మార్చిలో 'ప్రపంచ కవితా దినోత్సవం' సందర్భంగా “స్వీయ కవితా పఠనం” జరిగింది. ఈ సభ సమన్వయకర్తగా “ప్రవచన కళానిధి” “విద్యాన్‌” తిరుమల పెద్దింటి నరసింహాచార్యులు వ్యవహరించారు. ఈ స్వీయ కవితా పఠనంలో చాలామంది కవులు పాల్గొన్నారు. వారిలో ముఖ్యంగా నేమాని రామజోగి సన్యాసిరావు, శ్రీ భాగవతుల కృష్ణారావు, పి.వి. కృష్ణయ్య, చింతా ప్రభాకర్‌, శేఖర మంత్రి ప్రభాకరరావు, కె.జి. వేణు, శ్రీమతి కందాళ కనకమహలక్ష్మి మొదలైనవారు పాల్గొన్నారు. ఈ సభా నిర్వహణ అష్టావధాని రాంభట్ల పార్వతీశ్వరశర్మ.

2013లో కులశేఖరాళ్వారు విరచితమైన 'ముకుందమాల' అనే అంశంపై ప్రసంగం నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిధిగా శ్రీ కళ్ళు చిదంబరం విచ్చేశారు. అలాగే 'శ్రీ లక్ష్మీ నరసింహ శతకం' పుస్తకంపై సమీక్ష చేశారు, సమీక్షకులుగా రాంభట్ల సత్యవతమ్మగారు వ్యవహరించారు.

ఈ విధమైన సాహితీ కార్యక్రమాలు మాత్రమే కాకుండా తెలుగు భాషాదినోత్సవం, మాతృభాషా దినోత్సవం, ప్రపంచ కవితా దినోత్సవంలాంటి ఎన్నో సందర్భాలను పురస్కరించుకొని నగరంలో ఘనంగా సాహితీ సమావేశాలను నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం జరిపించే వ్యవస్థాపక దినోత్సవానికి నగరంలో ఉన్న సాహితీసంస్థల నిర్వాహకులను పిలిచి సన్మానించడం క్రమంగా చేస్తున్నాం.

ఆవిష్కరణలు:

ఈ సంస్థ కార్యక్రమాలలో ముఖ్యమైనది పుస్తకావిష్కరణలు. ఈ ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యాన్నిస్తూ ఈ మధ్యకాలంలో పుస్తకావిష్కరణలు నిర్వహిస్తున్నాం. ఈ విధంగా ఆవిష్కరణలు చేసినవాటిలో అవధాన సుధాకర రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి 3 పుస్తకాలున్నాయి. డా. రాంభట్ల వేంకటరాయశర్మ పుస్తకాలు 2, అలాగే గేయగాంగేయం వంటి పుస్తకాలు ఆవిష్కృతమయ్యాయి.

1. శ్రీరాంభట్ల వెంకటీయం. ఇది కుప్పిలి డాక్టరు గారి జీవితచరిత్ర. దీన్ని 2007లో డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ రాశారు. ఇది లఘు పద్యకావ్యం. ఆయనవే మరో రెండు రచనలు
2. మొదటి మొగ్గలు - ఇది వచన కవితా వ్యాసంగం. - 2012
3. ప్రతిభా స్వరాలు – ఇది పద్యకవితా మాలిక. - 2012
4. గేయగాంగేయం - స్మృతి ఖండిక - 2014
5. సుధీరకథనాలు (కథా సంకలనం),
6. శ్రీ గురుస్తుతి శతకం - డా. రాంభట్ల వేంకటరాయ శర్మగారు రాసినవి. - 2016

ఈ విధంగా 2007లో విశాఖ జిల్లాలో స్థాపించబడిన ఈ సాహితీ సంస్థ అతి తక్కువ కాలంలోనే ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి సాహితీ విలువలను లోకంమంతటా ప్రచారం చేయడానికి కంకణం కట్టుకుందని చెప్పడంలో ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అయితే నగరం నడిబొడ్డున లలితా పీఠాన్ని వేదికగా ఏర్పాటు చేసుకోవటంలో ప్రధాన ఉద్దేశం ఆధ్యాత్మికతను ప్రోత్సహించడం.

ఈ విధంగా ఏ విధమైన కార్యక్రమాలు చేసినా అన్నీ సాహిత్యానికి సంబంధించినవేనని చెప్పాలి. సాహిత్యంలో ఉన్న వివిధ ప్రక్రియలలో కొన్నింటిని ఈ సంస్థ ప్రోత్సహిస్తూ సాహిత్య మాధుర్యాన్ని నెమరువేసుకొనేలా సహృదయులను ఆకట్టుకునేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అలాగే విశాఖలో ఉన్న వివిధ సాహితీ సంస్థలవలె ఈ సంస్థకూడా తనదైన శైలిలో ముందుకెళుతూ తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి పాటుపడుతోంది.