headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను పూర్తిగా రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. ఇప్పటివరకు కేర్-లిస్ట్ లో ఉన్న అన్ని జర్నళ్ళు... ఇక పై "పీర్ రివ్యూడ్" జర్నళ్ళుగా కొన్ని ముఖ్యమైన "పారామీటర్లు" పాటిస్తూ కొనసాగాల్సి ఉంటుంది. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతుంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-10 | September 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

10. అన్నమయ్య ద్వాదశరాసుల కీర్తన: నాట్యశాస్త్ర అభినయహస్తాల సమన్వయం

నీలం ధనశ్రీ శ్రీనివాస్

పరిశోధకులు, లలితకళావిభాగం,
అన్నామలై విశ్వవిద్యాలయం, అన్నామలై నగర్, చిదంబరం.
కడలూర్ జిల్లా, తమిళనాడు.
సెల్: +91 9553510643, Email: dhanasreenivas143@gmail.com



ఆచార్య టి. అరుత్ సెల్వి

ప్రొఫెసర్ & డీన్, సంగీతవిభాగం,
అన్నామలై విశ్వవిద్యాలయం, అన్నామలై నగర్, చిదంబరం.
కడలూర్ జిల్లా, తమిళనాడు.
సెల్: +91 9894020154, Email: selvi70@gmail.com
Download PDF


సమర్పణ (D.O.S): 20.08.2024        ఎంపిక (D.O.A): 30.08.2024        ప్రచురణ (D.O.P): 01.09.2024


వ్యాససంగ్రహం:

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు తిరుమల వేంకటనాథుని ‘‘నాయకుడి’’గా, శ్రీ పద్మావతిదేవిని ‘‘దివ్యనాయిక’’గా చేసుకొని 32 వేల మంత్రపదపుష్పాలను రచించారు. అనేక పదరాసులలోని ఒక్క సంకీర్తనను శ్రీ పద్మావతిదేవి దేహసౌందర్యంతో, జ్యోతిష్యశాస్త్రంలోని ద్వాదశరాసులతో పోలుస్తూ వర్ణించారు. నాట్యానికి ప్రామాణిక గ్రంథమైన భరతుని నాట్యశాస్త్రంలోని నాయికానాయకులు అన్నమయ్య పదరాసులలో అంతర్గతమై ఉన్నారు. నందికేశ్వర విరచితమైన అభినయదర్పణంలో ద్వాదశరాసుల ప్రస్తావన ఉంది. నాట్యశాస్త్రంలోని నాయికానాయకులను, ద్వాదశరాసుల హస్తాలను అన్నమాచార్యులు రచించిన ఈ ద్వాదశరాసుల సంకీర్తనను నాట్యంలో అన్వయించి చెప్పటమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశ్యం. అన్నమాచార్యుల సంకీర్తనాసంపదపై సాహిత్యపరంగా, సంగీతపరంగా- నాట్యంపరంగా కూడా పరిశోధనలు జరిగాయి. నాట్యంపరంగా డా. అనుపమాకైలాష్‌ హైదరాబాద్‌, డా. శారదాపూర్ణ శొంటి అన్నమాచార్య కీర్తనలపై పరిశోధనచేసారు. సంగీతంలోని, మార్గీయ- దేశీయ అనే రెండురకాల మార్గాలను వివరిస్తూ, అన్నమాచార్యులకు పూర్వం మార్గీయ, దేశీయ సంగీతవివరణ ఇస్తూ, వారు రచించిన పదరాసులు ఏ సంప్రదాయంలో ఉన్నాయో వర్ణించి, వాటిని నాట్యసంప్రదాయంలోని అంశాలతో పోలుస్తూ వ్యాసరచన చేస్తున్నాను. అన్నమాచార్యుల సంకీర్తనలు 5వ సంపుటంలోని, ఒక్క 143వ కీర్తనను మాత్రమే తీసుకొని, నాట్యంపరంగా అన్వయించడం ఈ వ్యాసం పరిమితి. ఈ పరిశోధనకోసం భరతముని ‘నాట్యశాస్త్రం, డా. పప్పు వేణుగోపాల్‌ భానుదత్తాస్‌ రసమంజరి, ఆంధ్రవాగ్గేయకారచరితం, అభినయదర్పణం అనే పుస్తకాలు పరిశీలించాను. విషయసేకరణకు శ్రీ గంధం బసవ శంకరం, ఆచార్య సర్వోత్తమరావు, డా॥ వేదాంతం రామలింగశాస్త్రి, శ్రీ కల్లూరి శ్రీనివాస్‌ మొదలైన వారిని ఆశ్రయించాను.

Keywords: మార్గీయ సంగీతం, దేశి సంగీతం, ద్వాదశరాసులు, మంత్రపుష్పాలు, నాట్యవేదం.

1. అన్నమయ్య సారస్వత వివేచన:

పదము సంస్కృతమున బ్రాకృతమున దేశ
భాషనైనఁ బొసఁగ బలుక వలయుఁ
బ్రాసములును యతులును బద్యభంగినె చెల్లు
ననిరి భరత దత్తిళాది మునులు. (సంకీర్తన లక్షణం, ప. 27)

పదాలకు మూలపురుషుడైన 15వ శతాబ్దపు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు, భరతముని, దత్తిళులవారి పదములకు సంబంధించిన భాషానియమాలను అనుసరించి, తిరుమల వేంకటనాథుని, నాయకునిగా, ఆ నాథుని పట్టపురాణిని నాయికగా చేసుకొని 32 వేల పదాలను, శ్రీ వేంకటనాథునికి సమర్పించారని అన్నమాచార్యులవారు తాను స్వయంగా సంస్కృతంలో రచించిన ‘‘సంకీర్తన లక్షణ’’ గ్రంథానికి వీరి మనుమడు తాళ్ళపాక చినతిరుమలాచార్యుల వారు ‘‘సంకీర్తన లక్షణం’’ తెలుగు అనువాద గ్రంథంలో చెప్పియున్నారు.

వీరు మార్గీయసాహిత్యమైన సంస్కృతంలో వేంకటాచలమాహాత్మ్యం, వేంకటేశ్వర శతకం, అనేక పదరచనలు సంస్కృతంలో చేసియున్నారు. అన్నమయ్య మార్గీయ సాహిత్య, దేశి సాహిత్య అలంకార నియమాలను భరతుని నాట్యశాస్త్రం ప్రకారం అనుసరిస్తూనే దేశీ సాహిత్యానికి, సంగీతానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి, జనపదాలను జానపదాలుగా తనదైన శైలిలో దేశీసాహిత్య పదరచనకు శ్రీకారం చుట్టి తెలుగు తొలిపదకవితా పితామహులయ్యారు.

2. మార్గ-దేశి సంగీతరీతులు:

అన్నమయ్యకు పూర్వం సామవేదం నుంచి పుట్టిన ధాతు, మాతు సంయోగిత సంగీతం ఆదిభరతునిచే ప్రయోగితమైన నాట్యవేదంలో ఒక భాగమై, గాంధర్వపు ప్రవక్తలచే అంటే నారదతుంబురుల వంటి మహాపురుషులచే ప్రయోగింపబడిందని మార్కండేయపురాణంలో చెప్పబడింది.

‘‘గీతం, వాద్యం తథానృత్యం
త్రయం సంగీత ముచ్యతే’’ (శారఙ్గదేవుడు)

అను 13వ శతాబ్దపు శారఙ్గదేవుని శ్లోకం ప్రకారం, గీతాన్ని తీసుకొంటే ధాతు, మాతు కలయికయే గీతమని అంటారు. గీతమనగా సంగీతమని అంటారు. మాతువు అంటే సాహిత్యం, ధాతువు అంటే స్వరం. సాహిత్యానికి వివిధ స్వరాలతో కూడిన రాగాలను కూర్చి చెప్పబడేదే  మార్గీయ సంగీతము. భరతుల వారి నియమ నిబంధనలతో కూడిన మార్గీయ సంగీత, అలంకార సాహిత్యము సంస్కృతమున వ్రాయబడినది. ఈ మార్గీయ సాహిత్యమైన సంస్కృతము వ్యాస, వాల్మీకి, కాళిదాసుల రచనలకు మాతృక ఐనది. మార్గీయసంగీతం భరతముని నిబంధనలతో ప్రాచీనసాంప్రదాయాన్ని అనుసరిస్తే, దేశీసంగీతం ఆయా ప్రాంతీయసంస్కృతిని, స్థానికతపై ఆధారపడి జనపదాలుగా నిర్దేశించబడింది. 

తెలుగులో మొట్టమొదటగా మార్గీ, దేశి భేదాలను క్రీ.శ. 1145లో ఒక శాసనంలో తెలియజేసియున్నారు అని “ద టూరన్స్‌ ఆఫ్‌ డివినిటి” (సంకీర్తన లక్షణంలో) చెప్పియున్నారు.1 13వ శతాబ్దపు శారఙ్గదేవుడు, జాయపసేనాని సంగీత, నాట్యాలపరంగా మార్గీ, దేశి పదాలను ఉపయోగించియున్నారు.2

12వ శతాబ్దపు కృష్ణమాచార్యుల వారు సింహగిరి వచనాలను దేశీభాషలో చేసియున్నారు. కాని వీటిని వచనాలుగా మాత్రమే చెప్పుకోగలం తప్ప కీర్తనలుగా పాడుకోలేము. వీరు గద్యప్రబంధాలకు ఆద్యుడని, కావున వీరిని తెలుగు తొలి వాగ్గేయకారుడని అంటారని బాలాంత్రపు రజనికాంతరావు “ఆంధ్రవాగ్గేయకారచరితం”లో చెప్పియున్నారు.3

అదే శతాబ్దం చివరలో వెలసిన పాల్కురికి సోమనాథుడు, పండితారాధ్యచరిత్రలో, నన్నెచోడుడు కుమారసంభవములో ఉపయోగించి ఉన్నారని తాళ్ళపాక చినతిరుమలాచార్యులు తెలుగు అనువాదగ్రంథం ‘‘సంకీర్తనలక్షణం’’లో చెప్పియున్నారు.

ఏది ఏమైనప్పటికీ సామవేదం నుంచి ఆవిర్భవించిన వైదిక లేదా మార్గీయ సంగీతం కంటే ప్రాచీనమైనది దేశి సంగీతం.
ఆనాటి దేశపాలకులు అడవులకు, కొండలకు చెందిన గిరిజనులు తమ నిత్య జీవితంలోనేకాక విందులు, వినోదాలలో పాడుకొని పల్లెపదాలు, దేశీసంగీతం, ఏదిఏమైనప్పటికి అన్నమాచార్యులవారు పండిత, పామరులు పాడుకొని, జీవాత్మ, పరమాత్మలో కలియుటకు నవవిధ భక్తిమార్గాల్లో ఒక్కటైన సంకీర్తన మార్గాన్ని ఎన్నుకొని తన పదసంకీర్తనలతో జీవన్ముక్తిని పొందుటకు మోక్షమార్గాన్ని ప్రపంచానికి అందించారు.

3. అన్నమయ్య పదసాహిత్యం- నాట్యశాస్త్రసమన్వయ యోగ్యత:

భరతుని నాట్యశాస్త్రంలో చెప్పబడిన చతుర్విధాభినయాలలో, వాచికాభినయ ప్రాధాన్యత అంటే ధాతు, మాతృసంయోగిత, సంగీతం, శారఙ్గల వారి ప్రకారం సంగీతంలో లయ, నాట్యము సమ్మిళితమైయున్నది.

కాబట్టి భరతముని నియమ నిబంధనలు అనుసరించిన అన్నమాచార్యుల వారి దేశిపదాలు నూటి నూరుపాళ్ళు నాట్యానికి యోగ్యమైనది.

ఏడుకొండలను, ఏడు స్వరాలుగా అన్నట్లు అన్నమయ్య ఆ తిరుమలరాయని, లక్ష్మీదేవిని నాయక, నాయికలుగా భావించి శృంగార, వైరాగ్య తత్త్వాలతో పద సంకీర్తనలను కూర్చారు. వీరి కథావస్తువు భాగవత, రామాయణ, మహాభారతాలు, ప్రపంచంలో ఏ వాగ్గేయకారుడు వర్ణించ నలవికాని రీతిలో ఒక అంశాన్ని వివిధ ఊహాగానాలతో పదరచనలు చేసియున్నారు. మచ్చుకకు ఒక్క దశావతార అంశాన్ని డోలాయాంచల, డోలయాంచల అంటూ స్వామివారిని తన కీర్తనలతో డోలలూగిస్తూ, దశావతార వర్ణన చేసియున్నారు. మరియొక కీర్తనలో ‘‘ఇందరికీ అభయంబులిచ్చు చేయి’’ అంటూ వివిధ అవతారాలలో తన అభయహస్తముతో లోకకళ్యాణాన్ని సలిపినట్లు వర్ణించి, అదే అభయహస్తము భూకాంత కౌగిలించిన చేయి అని, ఇలా 35 దశావతార కీర్తనలను వివిధ రీతులలో వర్ణించారు. 

అన్నమయ్య యోగశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రంపై రచనలు చేసియున్నారు. ద్వాదశ రాసులను 12 భాగాలుగా విభజించబడిన ఖగోళంగా కూడా చెబుతారు. ఈ బ్రహ్మాండంలో చెలయు 108 నక్షత్రాలకు నిలయమైన ద్వాదశరాసులు శ్రీలలితాదేవి నుంచి వచ్చినవని దేవిభాగవతంలో, శ్రీమహావిష్ణువు (కాలపురుషుడు) యొక్క నుదుటి భాగం నుండి పాదం వరకు ద్వాదశరాసులు అంతర్గతమైయున్నవని జ్యోతిష్యశాస్త్రంలో చెప్పియున్నారు. ఈ రాశి నక్షత్రాల సమూహాలను ఊహారేఖలతో కలిపి, ఆ ఆకారం పోలికను అనుసరించినవని ఋషులచేత నిర్ణయింపబడినవే మేషము, మీనము మొదలగు రాసులు.

4. అన్నమయ్య ద్వాదశరాసుల కీర్తన - జ్యోతిశ్శాస్త్రం:

వేదాంగములు వేదాన్ని తెలుసుకోవటం కోసమే అంటే దేవుని చేరుకొనే మార్గాన్ని తెలుసుకోవటమన్నమాట. వేదాంగములో జ్యోతిష్యశాస్త్రాన్ని నేత్రాలతో పోలుస్తారు. జ్యోతిష్యశాస్త్రం అంటే కేవలం భవిష్యత్తును తెలుసుకొనే శాస్త్రము కాదు, జ్యోతిష్యశాస్త్రమనె వెలుగుతో భగవంతుని చేరుకొని మార్గం అని చెబుతారని శ్రీనివాస శర్మ, జ్యోతిష్యశాస్త్ర నిష్ణాతులు, పండితులు, కొత్తగూడెం చెప్పియున్నారు.4 అంతేకాకుండా ఒక్కొక్క రాశి యొక్క లక్షణ, విశిష్టతలను వారివద్ద విని తెలుసుకొన్నాను. 

అన్నమాచార్యులు వ్రాసినటువంటి 5వ సంపుటంలోని 143వ కీర్తన ద్వాదశరాసులను శ్రీ పద్మావతిదేవి రూపసౌందర్యంతో పోలుస్తూ రచించారు. వీరు జ్యోతిశ్శాస్త్రంలో కూడా అంతే పాండిత్యాన్ని కలిగి ఉంటారేమో. వారు వర్ణించిన తీరు ఆ లలితా అమ్మవారి నుంచి వచ్చిన ఈ ద్వాదశరాసుల కథాసారాంశాన్ని వింటే తెలియచున్నది.
నాట్యపరంగా తీసుకొంటే భరతుని నాట్యశాస్త్రంలో చెప్పబడిన చతుర్విధాభినయాలలో, వాచికాభినయ ప్రాధాన్యత అంటే సంగీతంలోని మాతు, శారఙ్గల వారి ప్రకారం సంగీతం అంటే గీతము, వాద్యము, నాట్యము. కాబట్టి నాట్యము, సాహిత్యము ఒకదానిలో ఒకటి కలిసి ఉండే కళ.

5. అన్నమయ్య పదాలు- అష్టవిధనాయికలు:

నవరసాలలో రసరాజు అయిన శృంగారరసం అతిప్రధానమైనది. సృష్టికి మూలమే ఈ రసరమ్య శృంగారం, జయదేవుని అష్టపదులలో నాయక, నాయికల కలయిక కోసం ఒకటవ సర్గ నుంచి వివిధ విరవో అవస్థలైన, అష్టవిధనాయికా అవస్థలను ప్రస్ఫుటిస్తూ, దూతి, చెలికత్తెలతో రాయబారాలు సలిపి, చివరికి తన 12వ సర్గతో రాధామాధవుల ప్రణయపు కలయికను అత్యద్భుతంగా వర్ణించారు. భరతుని నాట్యశాస్త్రములోని అష్టవిధనాయికలు, చతుర్విధ నాయికలు అన్నమాచార్యుల వారి కీర్తనలలో అంతర్గమైయున్నారు. ఈ కీర్తనలో నాయుడు సర్వోత్తముడైన శ్రీ వేంకటపతిని దక్షిణ నాయకుడితో పోల్చి అంటే ఒక స్త్రీనే తన నాయికగాకాక, పలువురి నాయికలను కలిగి ఉండి, అందరి నాయికల పట్ల సమాన ప్రేమాభావం కలిగిన నాయకుడు దక్షిణ నాయకుడు. అంటే శ్రీ వేంకటేశ్వరస్వామికి శ్రీదేవి, భూదేవి అని లేక అలుమేలుమంగ, పద్మావతిదేవి అను ఇరువురి భార్యలని చెబుతారు. కాబట్టి స్వామివారిని ఇక్కడ దక్షిణ నాయకుడిగా చెప్పవచ్చు.  ఇద్దరి నాయికాభేదాలు చెప్పవచ్చు. ఒకరు కన్నె, ఇంకొకరు స్వాధీనపతిక.5

6. అన్నమయ్య ద్వాదశరాసుల కీర్తన - అభినయదర్పణాంతర్గత ద్వాదశరాశిహస్త సమన్వయం:

అన్నమయ్య భరతుని నియమనిబంధనలను అనుసరించి వ్రాసిన దేశిసంగీతం కూడా ప్రదర్శనాయోగ్యమై, వివిధ నృత్యరీతులలో ప్రదర్శనగావిస్తున్నారు. అన్నమాచార్యుల వారు రాసిన ఈ ద్వాదశ రాసుల పదమును నందికేశ్వర అభినయదర్పణములో చెప్పబడిన ద్వాదశరాసుల హస్తాలతో అభినయించవచ్చు.

పల్లవి   : ఇన్ని రాసుల ఉనికి యింతి చెలువపురాశి
             కన్నె నీరాశి కూటమి గలిగిన రాశి

ఓ వేంకటేశ్వరా! నీ అలమేలుమంగలో అన్ని రాసులు ఉండటం వల్ల ఆమె అందాలరాశి. మీ ఇద్దరి జాతకాలు కలిసిపోయాయి అని అన్నమాచార్యులవారు వర్ణిస్తే, తిరుమల స్థలపురాణం ప్రకారం ఆకాశరాజు పుత్రిక శ్రీ పద్మావతిదేవి, శ్రీనివాసులకోసం వెతలు చెందినపుడు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరుడే ఎరుకులసానిలా మారి అమ్మవారి జాతకం, శ్రీనివాసుని జాతకం కలిసిపోయాయని జాతకం చెప్పాడు. ఇప్పుడు అదే సందర్భాన్ని అన్నమాచార్యులవారు చమత్కారంగా వర్ణించారు.

సమన్వయం:

నాట్యపరంగా పల్లవిలో కన్నె అని వర్ణించారు. కన్నె పరకీయలో ఒక భాగం అంటే ప్రియునికోసం ఉన్న కన్య అని అర్థం. అటువంటి స్వచ్ఛమైన కన్యలో అన్ని రాసులలోను కలిగిన సుగుణాలరాశి అని చెప్పవచ్చు.

6.1 ధను-మీన-కుంభ-సింహరాసులు:

చరణం :   కలికి బొమ విండ్లు గల కాంతులను ధనురాశి
                మెలయు మీనాక్షిని మీనారాశి
                కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
                చెలగు హరిమధ్యకును సింహరాశి

ధనుస్సురాశి:

ఆమె విలువంటి కనుబొమ్మలను ధనుస్సురాశితో పోల్చారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఉన్న చిత్రంలో ధనుస్సును పట్టుకొని పైకి ఎక్కుపెట్టినట్లు పూర్వార్థం మనిషి, ఉత్తరార్థం గుఱ్ఱం ఆకారంలో ఉంటుంది. జాతకచక్రం వేసినప్పుడు ఎడమవైపు మూల క్రిందభాగంలో ధనుస్సు, పైభాగంలో మీనం ఉంటుంది. అర్జునుడు ద్రౌపతీ స్వయంవరంలో గాండీవంతో మీనాన్ని కొట్టుటకు ఎక్కుపెట్టిన ధనుస్సు అన్నట్లు, ఇంకొక అర్థంలో అజ్ఞానం నుంచి వెలుగులోకి చూసినట్లు అనిపిస్తుందని జ్యోతిష్యశాస్త్ర వర్ణన. కాబట్టి అటువంటి కాంతులు కలిగిన తనకను బొమ్మలను ధనుస్సురాశితో పోల్చారు.

సమన్వయం: అభినయ దర్పణంలో ఈ ధనుస్సుకి అర్థచంద్రహస్తాలను వినియోగించవచ్చని, ధనుస్సు ఆకారంలో ఉంది కాబట్టి ఈ అర్ధచంద్రహస్తను నిటారుగా చాపి ధనుస్సువలె చూపవలెను.

(అర్థచంద్ర-ధనుస్సు రాశి)

మీనరాశి:

మెలయు మీనాక్షికిని మీనరాశి. ఆమె కనులను చేపకనులతో పోల్చారు. ఈ రాసులన్నీ శ్రీ లలితాదేవి నుంచే ఉద్భవించినవి అని దేవి భాగవతంలో చెప్పబడినది. లలితా సహస్రనామంలో-

ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః

అంటే ఆమె ఒక నిమిషంలో కళ్ళు తెరచినప్పుడు సృష్టి జరుగుతుంది. అదే కనులు మూసినప్పుడు సృష్టినాశనమౌతుంది. ఇక్కడ జ్యోతిష్యశాస్త్రంలో మీనరాశిని రెండు చేపలు వాటి పుచ్ఛాన్ని వెనుకభాగము ఒక దానితో ఒకటి తాకినట్లు కనబడుతుంది. అంటే ఇవి సృష్టికి, ప్రతి సృష్టికి కారకాలు. శాస్త్రం ప్రకారం తీసుకొన్న భూమిమీద మొట్టమొదటి జీవి కూడా చేపనే. ఆ జీవి జలంలో పుట్టి జలంలోనే అంతమౌతుంది. సృష్టికూడా ఈ జలంతోనే మొదలై జలంలోనే అంతమౌతుందని ‘‘మంత్రపుష్పం’లోనే ఉన్నది. సృష్టికి మూలమైన ఆమె కన్నులను మీనరాశితో పోల్చటం సమంజసం. 

సమన్వయం: మీనరాశికి హస్తాభినయం మృగశీర్షహస్తం. ఈ హస్తాన్ని పట్టి ఉత్ప్లవనం చేస్తూ అంటే నీటిలో దూకుతూ ఉన్న చేపను చూపించి కన్నులకు కర్తరీముఖ హస్తాలు పట్టాలి అంటే మీనాక్షి అని చూపడం. 

(మత్స్య-మీన రాశి)

కుంభరాశి:

కుచకుంబములను కుంభరాశితో పోల్చారు. యావత్‌ జగానికి జగన్మాత, హృదయంలో దాగిన ప్రేమ సర్వజనులకు సమానం. అటువంటి తల్లి స్తనాలను కుంభాలతో పోల్చగా-

సమన్వయం: అభినయ హస్తాలైన కపోతహస్తాన్ని కలశాకారంలో చూపించి, తల్లి వాత్సల్యాన్ని బిడ్డకు పంచినట్లు అభినయిస్తూ నాట్యం చేయవలెను.

(కపిత్థ హస్తం - కుంభరాశి)

సింహరాశి:

చెలంగు హరిమధ్యకును సింహరాశి. ఆమెయొక్క నడుముని సింహతోపోల్చి సింహరాశిగా చెప్పారు. సింహానికి మించిన శక్తిని కలిగిన లక్ష్మీశక్తి సింహవాహినియై చెలుగుతోంది. 

సమన్వయం: నాట్యంపరంగా ‘‘మృగశీర్ష హస్తాలు’’ సింహరాశికి వర్తిస్తుంది. సింహవాహినిలా నర్తించడం అన్నమాట.

(సింహముఖం-సింహరాశి)

6.2 మకర-కన్య-తులా-వృశ్చికరాసులు:

చరణం :   చిన్ని మకరపు పయ్యెద చెడకు మకరరాశి
                కన్నెపాయపు సతికి కన్నెరాశి
                వన్నెయై పైడితులతూగు వనితకు తులారాశి
                తిన్నని వాడిగోళ్ళ సతికి వృశ్చికరాశి

మకరరాశి:

మన్మథుడి జెండా మొసలి గుర్తులతో ఉన్న ఆమె పైటలో మకరరాశి అని చెప్పగా, జ్యోతిష్యశాస్త్రంలో మకరరాశి ఆకారం పూర్వార్థం సింహపుతల, ఉత్తరార్థం మొసలితల, మన్మథుడి తండ్రియైన శ్రీ వేంకటేశ్వరునితో చెలుగు నాయక ఆ జగన్మాతగా చెప్పవచ్చు. 

సమన్వయం: గజేంద్రమోక్ష గట్టాన్ని నాట్యంలో చూపవచ్చు. 

(పతాక హస్త స్వస్తికాలు-మకర రాశి)

కన్యారాశి:

కన్యారాశి నిత్యయవ్వనవతియైన ఆ పతివ్రత మాతను కన్యారాశిగా చెప్పారు. ఇక్కడ కూడా పరకీయలోని కన్య నాయికగా చెప్పవచ్చు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కన్యారాశి ముందువరకు లింగభేదాలు లేవు. కన్యారాశి తరువాతి నుంచే లింగభేదాలు వచ్చాయని శ్రీనివాసశర్మ ఈ వ్యాసకర్తకు చెప్పారు.

సమన్వయం: అభినయదర్పణంలో కన్యరాశికి మృగశీర్ష హస్తాన్ని చెప్పారు. సాధారణంగా నాట్యంలో ఆడవారిని అంటే తల్లి, కన్య అంటే మృగశీర్ష హస్తాలతోనే సూచిస్తారు.

(మృగశిర్షం-కన్యారాశి)

తులారాశి:

తులారాశిని అమ్మవారిని బంగారంతో సరిసమానమైనదిగా అభివర్ణించారు అన్నమాచార్యుల వారు. ఏదైనా సరిసమానమైన రెండు పదార్థాలు గాని, వ్యక్తులు గాని ఉన్నప్పుడు మాత్రమే పోల్చి చెప్పగలం. సిరులతల్లిని పసిడితో పోల్చారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం లింగభేదాలు తులారాశి తర్వాత నుంచే ఉద్భవించాయట.

సమన్వయం: అభినయ దర్పణంలో తులారాశికి ముష్ఠహస్తాలను చెప్పియున్నారు. నాట్యంలో ఘనమైన ఏ పదార్థానికైనా ముష్ఠి హస్తాలతో అభినయిస్తారు. బంగారంతో సమానమైన తల్లిని గర్వంగా, ఘనంగా వీరలక్ష్మి అని అభినయించడం అన్నమాట.

(ముష్టి హస్తం-తులారాశి)

వృశ్చికరాశి:

వృశ్చికరాశిని అమ్మవారి గోర్లతో పోల్చియున్నారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం వృశ్చికరాశి అధిపతి కుజగ్రహం. యుద్ధకారకుడు, అమ్మవారి గోర్లే ఆయుధంగా చెప్పవచ్చు. నకులీదేవి గోళ్ళతో సర్పాలపై యుద్ధం చేసినట్లు బండసుర కథలో ఉంది. 

సమన్వయం: ఈ ఘట్టాన్ని నృత్యరూపక ఘట్టంగా చేయవచ్చు. వృశ్చికరాశికి అభినయదర్పణంలో సుఖతుండ హస్తాలను చెప్పియున్నారు.

(శుకదుండం - వృశ్చికరాశి)

6.3 వృషభ-కర్కాటక- మేష- మిథునరాసులు:

చరణం :   ఆముకొను నొరపుల మెరయు నతివకు వృషభరాశి
                గామిడి గుట్టుమాటల సతికర్కాటకరాశి
                కోమలపు చిగురు మావికోమలి మేషరాశి
                ప్రేమ వేంకటపతి కలిసె ప్రియమిథునరాశి

వృషభరాశి:

అమ్మవారి పలుకులు వృషభరాశితో పోల్చారు. సప్తస్వరాలలో రిషభము వృషభ యొక్క అరుపు నుంచి పుట్టింది అని నాట్యశాస్త్రంలో చెప్పబడింది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మానవుని శరీరంలో కూడా ఈ రాసులు అంతర్గతమై ఉంటాయట. వృషభరాశి నోటిని సూచిస్తుందట. అన్నమాచార్యుల వారు జ్యోతిషశాస్త్ర చాతుర్యంతో అమ్మవారి వాక్కులను వృషభరాశితో పోల్చారు. 

సమన్వయం: నాట్యంలో వృషభరాశికి శిఖరహస్తాన్ని చెప్పియున్నారు. ‘‘సరస్వతీసూక్తంలో తురీయం వాచకం’’ ఈ సృష్టియంతా అమ్మవారి యొక్క వైఖరీవాక్కు అని వాచికాభినయ ప్రాధాన్యత చూపుతూ నాట్యం చేయవచ్చు.

(శిఖరం-వృషభం)

కర్కాటకరాశి:

కర్కాటకరాశిని ఆమె ప్రౌఢమైన రహస్యపు మాటలతో గుట్టుగా మాట్లాడడం వలన ఆమెలో ఈ రాశి ఉండి అని చెప్పారు. 

సమన్వయం: ఇక్కడ కూడా అమ్మవారి వాక్కు యొక్క ప్రాధాన్యతను అభినయించవలెను. అభినయదర్పణంలో కర్కాటక రాశికి హంసాస్య హస్తములు చెప్పియున్నారు.

(కర్కట-కర్కాటక రాశి)

మేషరాశి:

మేషరాశిని మృదువైన లేత ఆకులవలె ఉన్న పెదవులలో ఈ రాశి యున్నదని చెప్పారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినపుడే సృష్టి మొదలౌతుందట. మొక్కలో మొట్టమొదట మొదలయ్యే పచ్చటిభాగము లేత చిగురుటాకులే కదా! సూర్యుడి సమీక్షంలో కిరణజన్య సంయోగక్రియ అనే అతిముఖ్యమైన జీవనప్రియులు మొదలుపెట్టి పెరిగి పెద్దలై మానులౌతాయి.

సమన్వయం: ఇలా సృష్టికి మొదలు అమ్మవారి పెదవులు అని చూపుచూ నాట్యం చేయవచ్చు. మేషరాశికి అభినయ దర్పణంలో హంసాస్వహస్తములను చెప్పియున్నారు. తాడేపల్లి పతంజలి6 వారు మేషవాహనుడైన అగ్ని ఎరువు కాబట్టి, ఆమె పరువులు ఎరుపువర్ణంలో ఉన్నవి కాబట్టి ఆమె పెదవులలో మేషరాశి అని చెప్పియున్నారు. మేషవాహనుడు అగ్ని అని చూపుచూ అమ్మవారి పెదవులు రక్తవర్ణమని అభినయించవచ్చును.

(హంసాస్య హస్తం-మేషరాశి)

మిథునరాశి:

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం అర్ధనారీశ్వరతత్త్వం కలిగిన రాశి మిథునరాశి. అంటే స్త్రీ, పురుషుల ఏకరూపం మిథునరాశి.

ఇన్ని రాసులు కలిగిన నీవు ప్రేమతో వేంకటేశ్వరుని కలువమ్మా అని అన్నమాచార్యుల వారు వర్ణించారు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు, లక్ష్మిదేవులు ఈ కలియుగంలో శ్రీనివాసుడు, పద్మావతిదేవిగా మానవరూపం ధరించి ప్రేయసీప్రియులవలె ఒకరికోసం ఒకరు అన్నట్లు భువిపై అవతరించినట్లు కళ్యాణం సలిపారు. అటువంటి రూపకాన్ని వర్ణిస్తూ, మిథునరాశికి వీరు ప్రతీక అని నాట్యము చేయవచ్చు.

సమన్వయం: అభినయ దర్పణంలో మిథునరాశికి అర్ధపతాక హస్తములు చెప్పియున్నారు. నాట్యములో రెండు శిఖరహస్తములను స్వస్తికంగా పట్టి త్రిప్పినయెడల అది శృంగారకేళిగా చెప్పబడుతుంది. ఇక్కడ వేంకటేశ్వరస్వామిని తన రూపగుణములతో తన ఆధీనములో ఉంచుకొన్న దివ్యనాయిక శ్రీలక్ష్మీదేవి. కాబట్టి ఈమె స్వాధీనపతిక అవుతుంది.

(అర్ధపతాకం-మిథునరాశి)

7. ముగింపు: 

  • నాట్యంలోని వివిధ అంశాల రాసులలో ఒకటైన హస్తాభినయంతో చేసిన ఈ ద్వాదశరాసులు అభినయదర్పణంలోని నందికేశ్వరులు వర్ణించియున్నారు.
  • జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఈ ద్వాదశరాసుల లక్షణాలు దేవతలలోనే కాదు, జీవరాసులన్నిటిలోను ఉంటాయి. కావున అన్నమాచార్యుల వారికి జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఎంత పాండిత్యమున్నదో ఈ కీర్తన ద్వారా తెలియుచున్నది.
  • జ్యోతిష్యశాస్త్రము వేదాంగము, నాట్యము పంచమవేదము. ఇవన్నీ వేదములోని భాగములు. ఏ వేదమైనా దేవుని చేరుకొను మార్గాలే. 
  • అన్నమయ్య పదరాసులలో జీవాత్మపరమాత్మను చేరుటకు వేదాలసారాన్ని నిక్షిప్తం చేసియున్నారు.

8. సూచికలు:

  1. సంకీర్తనలక్షణం,  పుట. 23
  2. ఆంధ్రవాగ్గేయకార చరితం-2, పుట. 133
  3. ఆంధ్రవాగ్గేయకారచరితం- 2, పుట. 149.
  4. శ్రీనివాస శర్మ, ప్రముఖజ్యోతిష్కులు, కొత్తగూడెం వారందించిన సమాచారం.
  5. రసమంజరి ఆఫ్ భాను దత్త, పుట. 167
  6. తాడేపల్లి పతంజలి, పుట. 28

9. ఉపయుక్తగ్రంథసూచి:

  1. రజనీతరావు, బాలాంత్రపు. ఆంధ్రవాగ్గేయకారచరితము (రెండవభాగము),  కాంపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,  హైదరాబాదు, 2019
  2. లీలావతి, పొన్నా. సంకీర్తనాసౌరభం, తేజ ప్రింటర్స్‌, ఉమెన్స్‌ కాలేజి రోడ్‌, రాజమండ్రి. YEAR
  3. శ్రీరామ అప్పారావు, పోణంగి. అభినయదర్పణం(నందికేశ్వర), నాట్యమాలప్రచురణము, 1987
  4. శ్రీరామ అప్పారావు, పోణంగి. నాట్యశాస్త్రము, నాట్యమాల పబ్లిషర్స్‌, హైదరాబాద్‌, 1967
  5. Krishnamurthy, Salva. The Tunes of Divinity (Sankeertana Lakshanam), Institute of Asian Studies, Thiruvanmiyur, Madras, 1990
  6. సంయుక్త, అసంయుక్త హస్తముద్రలు (All pictures Sources), కళాదర్పణ్ Youtube Channel link: LAD: 30.08.2024.
  7. శ్రీనివాస శర్మ, ప్రముఖజ్యోతిష్కులు, కొత్తగూడెం వారందించిన సమాచారం.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]