AUCHITHYAM | Volume-5 | Issue-10 | September 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
9. నేటి సమాజంపై ఇతిహాసాల ప్రభావం : సందేహాలు

బుక్కే ధనకనాయక్
పరిశోధకులు, తెలుగు విభాగం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నాగార్జున నగర్,
గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8187056010, Email: dhanakanaikbukke111@gmail.com

కాడె రాజశేఖర్
పరిశోధకులు, తెలుగు విభాగం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నాగార్జున నగర్,
గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9666950233, Email: kaderajasekhar233@gmail.com

అయ్యప్పగారి స్వప్న
జూనియర్ లెక్చరర్ (తెలుగు)
TG సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ,
కొత్తకోట, వనపర్తి, తెలంగాణ
సెల్: +91 8247665853, Email: swapnaswapna8861@gmail.com
Download
PDF
సమర్పణ (D.O.S): 20.08.2024 ఎంపిక (D.O.A): 30.08.2024 ప్రచురణ (D.O.P): 01.09.2024
వ్యాససంగ్రహం:
రామాయణ, మహాభారతాలు చరిత్రలో జరిగిన నిజసంఘటనలు. కనుకనే వీటిని ఇతిహాసాలు అంటాం. ఇతిహాసాలు వెలువడినప్పటి నుంచి సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు, పాఠకులు ఈ గ్రంథాలను చరిత్రగా కాకుండా దైవభక్తిగా స్వీకరిస్తున్నారు. కానీ ఆధునిక సమాజానికి ఇతిహాసాలలోని కొన్ని ఘట్టాలలో కొన్ని సందేహాలు బలంగా నిలబడ్డాయి. “నేటి సమాజంపై ఇతిహాసాల ప్రభావం - సందేహాలు” అనే శీర్షికతో ఈసందేహాలను విశ్లేషించే ప్రయత్నం చేశాము. ఈ విశ్లేషణ ఆసందేహాలను పరిష్కరించే ప్రయత్నం కాదు. సందేహాలను విస్తృతపరిచే విశ్లేషణ. పాతివృత్యం, వ్యామోహం, రాచరికం, ధర్మాధర్మాలు మొదలైన ఉపశీర్షికలు చేర్చి భాగాలవారీగా సందేహాలను విస్తృతపరచే ప్రయత్నం చేశాము. ఈ అంశంపై గతంలో విశ్వనాథ సత్యనారాయణ, రామాయణ కల్పవృక్షం, రంగనాయకమ్మ, రామాయణ విషవృక్షం అనే శీర్షికలతో గ్రంథాలు వెలువరిచ్చారు. మహాభారతం భీష్ముడి మౌనవ్రతం అనే పేరుతో కాశీనాధుని నాగేశ్వరరావు ఆంధ్రభారతి పత్రికలో 1918 లో వ్యాసాన్ని రాశారు. క్షేత్ర పర్యటనలు లేకుండా పై రచనలతో పాటు మొదలైన రచనలు ఈ వ్యాసానికి ఆధారాలుగా స్వీకరించాము. ఇతిహాసాలలో నాలుగైదు ఘట్టాలు సందేహాలకు మాత్రమే ఈ వ్యాసానికి పరిమితులు. భక్తిపేరుతో ఈ గ్రంథాలను అనుసరిస్తూ వస్తున్న గత సమాజానికి విభిన్నంగా ఈ గ్రంథాలను ఆధ్యాత్మికత కలగలిపిన చరిత్రగా స్వీకరించి ప్రస్తుత సమాజంలోని యువతరానికి, పాఠకులకు ఉన్న సందేహాలను తమ రచనలు, పరిశోధనల ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేయగలరని కవులకు, రచయితలకు, పరిశోధకులకు సూచనలు ఇవ్వడమే ఈ వ్యాస ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా సందేహాలు లేని గొప్ప కావ్యాలను రేపటి తరాలకు అందించగలం.
Keywords: ధర్మాధర్మాలు, పాతివ్రత్యం, వ్యామోహం, యథా రాజా తథా ప్రజా, శూలదండనం.
1. ఉపోద్ఘాతం:
ఇతిహాస రాజులు దైవాంశ సంభూతులని నమ్మే విశ్వాసం మన భారతీయులది. వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని జీవనం గడపడం ప్రధానం అంటారు పెద్దలు. క్షత్రియుల బుజబలాలు, ధైర్య సాహసాలు, బ్రాహ్మణుల తపోజ్ఞానం తపస్సు, స్త్రీలు భర్తపై ప్రేమాభిమానాలు, కుటుంబబాధ్యతలు, పాతివ్రత్యం, మొదలైన కట్టుబాట్లను ఇతిహాసాల నుంచే స్వీకరించడం ఉత్తమమని ఎంతో మంది కవులు రచయితలు, చెప్పుకుంటూ వచ్చారు. ఇతిహాసాలను తెలుగులో ఇతరేతర నామాలతో అనువాదాలు చేశారు. కల్పనలు జోడించారు.
2. ఇతిహాసపాత్రలు - వివిధ అభిప్రాయాలు:
ఇతిహాసమంటే పూర్వం జరిగినది లేదా రాజుల యొక్క చరిత్ర అని చెప్పవచ్చు.
“అగ్నిమేళీ పోరోహితం
యజ్ఞస్య దేవ మృతిజమ్
హోతారం రత్న ధాతమమ్” (ఋగ్వేదం. పుట 2)
అనే ఋక్కుతో వేదవ్యాసుడు గాయత్రి ఛందస్సులో వైదికసాహిత్యం రూపుదిద్దుకుంది. అదే ఋగ్వేదం. అలా ఏర్పడిన వైదికసాహిత్యం ఉపనిషత్తులతో అంతమైంది. తరువాత వాల్మీకి రూపొందించిన-
''మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
యత్రౌచమిథునాదేకమవధీః కామమోహితం॥ (వాల్మీకి రామాయణం, మొదటి శ్లోకం)
అనే శ్లోకం అనుష్టుప్ ఛందస్సుతో లౌకికసాహిత్యం ఏర్పడింది. అదే వాల్మీకి రామాయణం. లౌకికసాహిత్యం ఇప్పటికీ చలామణిలో ఉందని ద్వానాశాస్త్రి, భద్రిరాజు కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు.
24వేల శ్లోకాలతో 7 కాండతో రామాయణం సమర్థనీయంగా రాయబడి చరిత్రకెక్కింది. మహాభారతం కూడా 100 పర్వాలతో సంస్కృతంలో మహోన్నతంగా రూపుదిద్దుకుంది. ఈ రెండింటినీ ఇతిహాసాలు అంటాము. తరువాతి కాలంలో తెలుగుకవులు మరియు ఇతర భాషకవులు ఇతిహాసాలను వారివారి భాషలకనుగుణంగా కొన్ని మార్పుచేర్పులతో అనువదించుకున్నారు. గొప్పగొప్ప పురస్కారాలూ అందుకున్నారు.
విశ్వనాథ సత్యనారాయణ రామాయణకల్పవృక్షంలో వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూ రాముడు దైవాంశసంభూతుడని మరోసారి పేర్కొన్నారు. రామాయణవిషవృక్షం అనే శీర్షికతో రంగనాయకమ్మ ఒకగ్రంథం రచించి అందులో రాముడు సాధారణ మానవుడే అని బదులిచ్చారు. పూర్వం నుంచి రామాయణాన్ని సమర్థిస్తూ వస్తున్న కవులందరికీ ఈమె విమర్శలు చేశారు. రామాయణంలోని బలాబలాలను బల్లగుద్ది తేల్చిచెప్పారు. రాజులకోరికల మేరకు రాజులకు అంకితం ఇవ్వడానికి వారి ఆస్థాన కవులుగా జీవించడానికి రచనలుచేసి పేరునుగడిచిన కవులు ఉన్నారు.
3. ఇతిహాసాలు - సందేహాలు:
రామాయణభారతాల్లో ధర్మం అధర్మం అంటే ఏమిటి? ప్రస్తుత సమాజంలో ఎలాంటి ధర్మాన్ని విశ్వసించాలి అన్న ప్రశ్న ఈ తరం వారికి ఎదురవుతున్న తొలి ప్రశ్న. ఇక్కడ మనం కేవలం తెలుగుకవులు, తెలుగు చలనచిత్రాలు, తెలుగుభాష గురించి మాత్రమే చర్చించుకుందాం. ప్రస్తుత తెలుగు సినీచిత్రాల్లో అసభ్యకరమైన మాటలు, చేష్టలు, పాటలు, డ్యాన్సులు ఉన్నాయని దర్శకులని, నటీనటులను సినిమాబృందాన్ని విమర్శిస్తుంటాము. సినిమా నాయకి (హిరోహిన్)ని ప్రత్యేకంగా దూసిస్తాము. ఎందుకంటే స్త్రీల కట్టుబాటు సాంప్రదాయన్ని నిలబెడుతుంది కాబట్టి. దానికోసమే విమర్శిస్తుంటాము. ఇవన్నీ ఎందుకు అవసరమా మనకు? అంటే అవసరమే. ఎందుకంటే మన సంస్కృతి అంత గొప్పది. తప్పును తప్పే అని చెప్పగలిగే పెంపకం మన తెలుగువారిది. భారతీయులది కూడ.
3.1 పాతివ్రత్యం:
మన సంస్కృతి, ఆచారవ్యవహారాలు ఎక్కడ కొలువైనది అంటే ఋగ్వేదం, రామాయణ, మహభారతం,భాగవతం వంటి గొప్పరచనల్లో చిత్రీకరించారు అంటాము. తల్లిదండ్రులను గౌరవించడంలో రాముడు, అన్నకోసం లక్ష్మణుడు, భర్తకోసం సీత, ధర్మంకోసం విభీషణుడు, భక్తిసేవలో హనుమంతుడు మొదలైన గొప్ప పాత్రలను మనకప్పగించారు. ఇవన్నీ చాలా గొప్ప మరియు మంచి విషయాలు కూడా వీరిని సమాజం ఆదర్శంగా తీసుకోక తప్పదు. భారతంలో గాంధారి భర్త అంధత్వంలో ఉంటే తాను మాత్రం ప్రపంచాన్ని ఎలా చూడగలను అంటూ అల్లకు గంతలతోనే జీవితం మొత్తం సాగించింది. గాంధారి తనశీలం చేత, నడవడిక చేత, పనుల చేత, కురువంశీయులందరి గౌరవాభిమానాలు సంపాదించుకుని భర్తకు తగువిధంగా సేవ చేస్తూ ఎన్నడూ పరుపురుషుల పేరు కూడా ఎత్తకుండా సుదీర్ఘకాలం సుఖంగా నివసించింది.
వృత్తేనారాధ్య తాన్ సర్వాన్ గురున్ పతిపరాయణా
వాచాపి పురుషానన్యాన్ సువ్రతా నాన్వకీర్తయత్ (మహాభారత సార సంగ్రహము పుట. 41)
అనే మాటల్లో భర్తకోసం త్యాగం ఆమెలో పుష్కలంగా ఉంది. అలా పాతివ్రత్యం వహించే స్త్రీలు ఇప్పుడు కూడా కోట్ల సంఖ్యల్లో ఉన్నారు. భర్త రోజంతా పనిచేసి సాయంత్రం ఇంటికి వస్తే భర్తకు సేవలుచేసే స్త్రీలలో భర్తపై గౌరవం, ప్రేమ, పాతివ్రత్యం గొప్పగా కవులు రచనల్లో వివరించారు ఇప్పుడు మనమం కూడా చాలా మంది స్త్రీలను చూస్తున్నాము. కానీ ఉద్యోగాలకోసం ఇల్లు దాటి బయటికి వెళ్ళిన స్త్రీలు పాతివ్రత్యం వహించరని మనం వేసిన ముద్ర. కూలిపనుల్లో, చిన్న ఆఫీసు పనుల్లోనూ, పెద్ద అధికారినో, సినిమా రంగంలో మరీ ఎక్కువ పుకార్లు. ఇవన్నీ నిజాలేనా. మనం చూశామా అంటే లేదు. పోనీ కొందరిని చూశాము అనుకుందాం. అందరూ స్త్రీలు అలా లేరుగా. ఉండరు కూడా.
మనం ఆదర్శంగా తీసుకునే మహాభారతం ఆది పర్వంలో చిత్రాంగదుడి సోదరుడు హస్తినాపురానికిరాజు విచిత్రవీరుడు అంబిక, అంబాలిక అనే ఇద్దరు భార్యలను కలిగి ఉన్నాడు. అతను మరణించాక రాజ్యపాలనకోసం వారసులే లేరు. భీష్ముడు సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యాన్ని పాలించవచ్చు కానీ తను చేసుకున్న ప్రతిజ్ఞ అడ్డుపడింది. భర్తను కోల్పోయిన అంబిక అంబాలిక ఇరువురికి మరలా వైధవ్యం వివాహం చెయ్యలేదు. వారిద్దరినీ వ్యసముని వద్దకు పుత్రసంతానం కోసం శారీరకంగా కలవడానికి భీష్ముడు దేవారణ్యం అనే పేరుతో ఈ దుస్సాహసానికి పూనుకున్నాడు. దీనికే నియోగమని పేరు. దీనికి కోడళ్లను వ్యాసుడి వద్దకు పంపించడానికి సత్యవతి కూడా అంగీకరించింది. దీనిని రాజ్య శ్రేయస్సు కోసం వారసత్వం కోసం అని సమర్థించుకున్నారు.
ఇప్పుడు పరస్త్రీ మనకు తల్లితో చెల్లితో సమానం అని నినాదాలు ఎక్కువే. ప్రాథమిక పాఠశాల నుంచి పిల్లల పాఠ్యపుస్తకాలలో ఇలాంటి సంఘటనల కావ్యాలు చదివి వాటిని ఆకలింపుచేసుకుంటున్నారు. విద్యార్థులు,పాఠకులు. కానీ వాటిలో మంచిని మాత్రమే స్వీకరించమని చెబుతుంటారు. మంచిని మాత్రమే స్వీకరించే అంశమైతే అలాంటి కావ్యాలలో చెడునెందుకు చేర్చాలని నా ప్రశ్న. ఇలాంటి సంఘటనలు పుస్తకాలు చూసి చదివి పాఠకులు అదే మార్గంలో నడుస్తారుకదా? అలాంటి మహా పవిత్రమైన గ్రంథాలను చదవకపోతే అమ్మ దగ్గరి నుంచి బడిలో టీచర్ వరకు రామాయణ భారత భాగవతాలు చదువు అది మనకు చాలా అవసరం. అని గట్టిగా ప్రోత్సహిస్తారు. లేదా మనల్ని భద్యతలేని వారిలా తీసిపడేస్తారు.
3.2 వ్యామోహం:
ఇంద్రుడు దేవతల రాజు. మహోన్నతుడు ధర్మం యందు ఇచ్చకలవాడు. రామాయణం బాలకండలో ఒక సంఘటన ఉంది. గౌతమునిభార్య అహల్య. ఈమె సౌందర్యవతి. గౌతమముని లేని సమయంలో ఇంద్రుడు దొంగచాటుగా వచ్చి గౌతముడి వేషములో అహల్యతో శారీరకంగా కలుస్తాడు. అదితెలిసిన గౌతమముని అహల్యను శిలగాశపించినట్టు “ఇహవర్ష సహస్రాణి బాహూని నిసిశ్యసి.వాయు భక్ష్యా నిరాహారా తప్యాని భస్మశాయినీ. అదృశ్య సర్వ భూతానాంఆశ్రమే అస్మిన్ నివసిష్యసి” (వాల్మీకి రామాయణం, 48వ సర్గ 30వ శ్లోకం,పుట 118) దేవ దేవేంద్రుడే పరస్త్రీ వ్యామోహితుడై జీవించాడు. ఈ కావ్యములు సమాజములో ఆదరణ పొందినవి. సమాజ హితం కోరేవి. ఇవి ఎలా హితం కోరుతుంది? అని ఒక ప్రశ్న.
3.3 ధర్మాధర్మాలు:
రామాయణ మహాభారతాలు ధర్మానికి కట్టుబడి నడిచిన కావ్యాలు. ధర్మం తన వైపు ఉంటే తల్లిదండ్రులను గురువులను చివరకు దైవాన్ని సైతం ఎదిరించమని ఆదిపర్వం భీష్మ పరుశురాముల ద్వందయుద్దం స్పష్టంగా తెలియజేస్తుంది. అంబా అనే స్త్రీని వివాహం చేసుకోకపోతే నిన్ను శిక్షించక తప్పదు అన్న మాట గురువైన పరుశురాముడు పలుకగా గురువు తండ్రిలాంటి వాడు సకల విద్యలు నేర్పిన వాడు తనని శిక్షించదానికి భీష్ముడికేమి బాధకలుగలేదు. ధర్మం భీష్ముడివైపు ఉంది. బలవంతంగా అంబ అంబిక అంబాలిక అనే యువరాణులను స్వయంవరం నుంచి తీసుకురాలేదు. నిజానికి అంబ మనుసులో వేరే పురుషుడు ఉన్నాడనీ భీష్ముడికి అక్కడే ఆమె చెబితే భీష్ముడు ఇంతటి దుస్సాహసానికి పాల్పడడు. ఇప్పుడు భీష్మప్రతిజ్ఞ చేసుకున్నాక ఆమెను పెళ్లాడమంటే ప్రతిజ్ఞను తుంగలో ఎలా తొక్కగలడు. మాటతప్పకపోవడమే ఇక్కడ ధర్మం. కనుకే ధర్మం కోసం గురువైన పరుశురాముడితో సైతం యుద్ధం చేసి గెలిచాడు ధర్మానికి అగ్రతాంబూలం ఇచ్చాడు భీష్ముడు.
అదే భీష్ముడు సభాపర్వంలో ద్రౌపది వస్త్రాపహరణం సందర్భంలో ఎందుకు మౌనంగా కూర్చుండిపోయాడు. అక్కడ రచయతలు కవులు చెప్పిన సమాధానము కురుక్షేత్రం జరిగి కౌరవనాశనం జరగాలంటే భీష్ముడు మౌనం వహించక తప్పదు అని భీష్ముడిని సమర్థించారు. అంత మంది పర పురుషుల ఎదుట అర్ధ వస్రీనిగా మారుస్తుంటే.
కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదో
ద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
కర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైల రక్తౌఘ ని
ర్ఝర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్! (నన్నయ,ఆంధ్ర మహాభారతం, సభా పర్వము, పుట 112)
అంటూ భీముడు ఆక్రోశావేదనతో మాట్లాడుతుంటే భీష్ముడు మెదలలేకపోయాడు. కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ అనే మాటలో ధర్మాన్ని పాటించే భీష్ముడు ప్రముఖుడు. అతడైనా నీచకార్యాన్ని ప్రశ్నిస్తాడని భీముడు మనసులో ఆవేదన పడుతున్నట్లు స్పష్టం అవుతుంది. కానీ జరిగేది ఎలాగైనా కరుగుతుందిలే అని మౌనంగా కళ్లుమూసుకుని కూర్చున్నాడు భీష్ముడు. కానీ అక్కడివారంతా కళ్ళు మూసుకోరు కదా! అది గమనించలేక పోయాడా? భారతంలో భీష్ముడి కథ ధర్మంతో ప్రారంభమైనా అధర్మం వైపే కురుక్షేత్రంలో నిలబడం అతను పాటించే ధర్మం అధర్మమే. ఇక్కడ నేటిసమాజం ఎలాంటి ధర్మాన్ని పాటించాలి? అసలు ధర్మం అంటే ఏమిటి? కురుక్షేత్రంలో కౌరవులు అందరూ నశిస్తారని సభలో జరిగిన అన్యాయాన్ని చూస్తూ కూర్చోవడం ధర్మమా?
3.4 రాచరికం:
రాచరికం అంటే ప్రజలు రాజ్యంలో అధికారులచేత అణచబడ్డారని అర్థం. ఐతే వాల్మీకి రామాయణంలో యథా రాజా తథా ప్రజా: (వాల్మీకి రామాయణం, రెండవ సర్గ, 38వ శ్లోకం) అని శ్లోకాన్ని ఆవిష్కరించారు. దానికి అర్థం రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే అంటారు అని అర్థం. ఇక్కడ రాజులాగే అలాగే ప్రజలు అంటే సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగడం కాదు. పాలన బాగుంటే ప్రజలు బాగుంటారని అర్థం. కానీ రామాయణంలో కేవలం రాముడు చుట్టూ జరిగే కథలు సంఘటనలు మాత్రమే రామాయణంలో లిఖించబడ్డాయి. ప్రజలు సంతోషంగా అన్నారు అని మాత్రమే అక్కడక్కడ రామాయణంలో రాయడం జరిగింది. ప్రజలు ఎలాంటి వృత్తులు చేస్తున్నారు, ఎలాంటి ఆహారాన్ని తింటున్నారు. వారు ఆస్తులేవైన కలిగి ఉన్నారా? వారు చెల్లించే పన్నులలో 100కి ఎంత శాతం పన్ను కడుతున్నారనే చర్చే లేదు. అలాంటప్పుడు యథా రాజా తథా ప్రజా: అనే అంశము ఎలా సరిపోతుంది. రాముడు అడవికి వెళుతుంటే కొంతదూరం ప్రయాణించి కొన్ని కారణాల వలన మరలతిరిగి వారివారి ఇళ్లకు వచ్చేశారు. తథా ప్రజా అంటే ప్రజలు కూడా రాముడితో వనవాసం చెయ్యలేదు కదా? ధర్మ సంస్థాపనకోసం రాజ్యాన్ని సుభిక్షంగా పాలించబడడంకోసం సీతనితిరిగి అడువులకు పంపించాడు. ఇది అక్కడి ప్రజలు కూడా పాటించాలా? అనట్లు ప్రస్తుత సమాజం అర్థం చేసుకున్నట్లుగా ఉంది. చిన్న చిన్న కారణాలకు కూడా భర్తలు, భార్యలను, భార్యలు భర్తలను వదిలేసి రాముడంతటివాడే భార్యను వదిలేశాడనీ చెప్పడం రామాయణమును తగ్గించి మాట్లాడినట్లు కనిపిస్తున్నాయి.
3.5 ధర్మదేవుడి స్థాయి:
మాండవ్యముని తనఆశ్రమంలో ఘోరతపస్తు చేస్తూ ఉన్నాడు. రాజ్యంలో దొంగతనం చేసి భటుల నుంచి తప్పించుకొని ముని ఆశ్రమంలో దాక్కున్నారు దొంగలు. భటులు తపస్సులో ఉన్న మాండవ్యముని దొంగల జాడను అడగగా తపస్సులోనే నిమగ్నోడై ఉన్నాడు మాండవ్యముని. తీరా ఆశ్రమంలో దొంగలను గుర్తించారు. దొంగలకి మాండవ్యమునికి సంబంధం ఉందంటూ ఆ దేశరాజు దొంగలతో పాటు మాండవ్యముని కూడా శూలదండనం వేయించాడు. అదిచాలా ఘోరమైన శిక్ష. ఆశిక్ష అనుభవించి కూడా తప్పు ఎవరిది కాదంటూ తపస్సు చేసుకున్నాడు. ఒకరోజు ధర్మదేవుడు వద్దకు వెళ్లి నేనే పాపం చేశానని ఇంతటి ఘోరమైన శిక్ష నాకు విధించావు అని అడగగా. ధర్మదేవుడు ఇలాబదులిచ్చారు- నువ్వు మిడతలు పట్టుకొని వాటితోకలలో ఇషిక అను వాడి అయిన గడ్డిని దూర్చి వాటిని పీడించావు అందుకు ఈ దండనం విధించాను. అప్పుడు అతని వయసు కేవలం 9 సంవత్సరాలు మాత్రమే అని ధర్మదేవుడి ద్వారా తెలుసుకొని 14 సంవత్సరాలలోపు వారిని బాలబాలికలు అంటారు. బాలబాలికలు తెలిసి తెలియక చేసిన పనులను తప్పులుగా లెక్కించకూడదు. అది తెలిసికూడా నీవు నాకుశిక్ష విధించినందుకు నిన్ను నేను శపిస్తున్నాను.
“ఆచతుర్ధ శకాద్వర్శాన్న భవిష్యతి పాతకమ్ .
పరత: కుర్వతామేవం దోష ఏవ భవిష్యతి” (వ్యాస భారతం, ఆదిపర్వం 107.12, పుట346)
అంటూ మాండవ్యముని ధర్మదేవుడిని శపించాడు. ఇక్కడ ధర్మ దేవుడు ధర్మాన్ని కాపాడాలి అదే తన లక్ష్యం. కానీ తెలిసి తెలియని వయసులో చేసినపనికి ఘోరమైన శిక్షవిధించడం ధర్మానికి విరుద్ధం. శిక్ష విధించడం మూర్ఖత్వం, అన్యాయం. అదే కాకుండా ధర్మ దేవుడి స్థాయిలో ఉండి ఒక సాధారణముని చేతిలో శాపానికి గురైన విధానం ధర్మ దేవుడి స్థాయిని తగ్గించి చెప్పినట్టు అనిపిస్తుంది. చాలామంది తెలుగు కవులు, వ్యాసకర్తలు, నీతి నిజాయితీ ధర్మం కలిగి తపస్సు ద్వారా దేవలోకాలను జయించి ఎంతటి శక్తినైనా పొందుతారనీ మునులను మహర్షులను సమర్ధించారు. మరి ప్రస్తుత సమాజంలో దైవభక్తి తగ్గడానికి ఇలాంటి సంఘటనలు కూడా కారణాలు అవుతాయి కదా. ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అంబరీష్యుడు మొదలగు మహాభక్తుల భక్తి మూఢవిశ్వాసంగా లోకం పడేస్తుందేమో అన్నప్రశ్న కళ్ళ ముందు కనిపిస్తుంది.
4. ముగింపు:
- తెలుగులో రంగనాథ రామాయణం మొదలుకొని తర్వాతి కాలంలో వచ్చిన రామాయణ భారతాలన్నిటిలోనూ మూల గ్రంథాలలోవున్న విషయాన్నే మరలా మరలా వర్ణించారు. యథా మూలం, మూల సంక్షేపం, మూల విస్తరణ, మూల పరిహరణ, అన్యధా కల్పన, అమూల కథ మొదలైన అనువాద పద్దతులలోనే ఇతిహాసాలు కొనసాగాయి.కానీ వాటి సందేహాలకు పరిష్కారాలను ఎక్కడా చర్చించలేదు.
- దానికి కారణమూ లేకపోలేదు. ప్రాచీన కవులకి వాల్మీకి, వ్యాసమహర్షిలపై గౌరవం. ప్రాచీన కవులు చేసినా అనువాదం సాధారణమైనది కాదు. చాలా క్లిష్టతరమైనది. అయినా వారి పరిజ్ఞానంతో వాటిని సాధించగలిగారు.
- రామాయణ కల్పవృక్షమునకు జ్ఞానపీఠ పురస్కారం లభించిందంటే అదంతా సులువైన రచన ప్రయత్నం కాదు. రామాయణాన్ని విమర్శిస్తూ రంగనాయకమ్మ రాసిన రామాయణ విషవృక్షానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందంటే ఈ రచనలోనూ సహజత్వం ఉండబట్టే కదా!. ఈవ్యాస ప్రయత్నంలో రామాయణ విషవృక్షం మమ్మలన్ని కదిలించింది.
- కాశీనాధుని నాగేశ్వరరావు రాసిన మహాభారతం భీష్ముడి మౌనవ్రతం అనే వ్యాసంలో ధర్మాధర్మాల చర్చ ప్రధానమైనది. మూల గ్రంథాలను సమర్థిస్తూ వస్తున్న కవులకి నేటి సమాజం తరఫున తొలి ప్రశ్న ఇతిహాసాలోని సందేహాలకు పరిష్కారం ఎక్కడ. ఇతిహాసాలు చదివితే ప్రతి మనిషి జన్మధన్యం అవుతుందని నమ్ముతారు. కానీ ప్రతి సంఘటన ఆ రచనల్లో సరైనదేనా అన్న ప్రశ్న చాలా మంది విమర్శకులకి,పాఠకులకి అనిపిస్తుంది.
- అయితే రామాయణ మహాభారతాల్లో ధర్మం కోసం కొన్ని సంఘటనల్లో ధర్మాత్ములు కూడా అధర్మం వైపు నడిచిన సందర్భాలు ఉన్నాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించే వారికే మంచేదో చెడేదో అర్థమవుతుంది.
- కావ్యభాష పండితులకి పరిజ్ఞానవంతులకు మాత్రమే అర్థమవుతుందనే కాదా! తర్వాత కాలంలో వ్యవహారిక భాష రూపుదిద్దుకోంది. కాలానికి అనుగుణంగా ఏ అంశమైన సులభతరం కావాలి. ఇతిహాసాలను అనుసరించడం వలన పవిత్రత కలుగుతుందినీ అందరూ విశ్వసించేటప్పుడు ఇతిహాసాలు అందరికీ అవసరమే ఇది సత్యం. అలాంటప్పుడు లోతును గ్రహించి సందర్భానుసారం కలిగే సందేహాలకు పరిష్కారాన్ని నివృత్తి చేసుకోలేని పాఠక లోకానికి కృతికర్తలే పరిష్కారాన్ని చూపించాలి. అలాంటి రచనలూ, పరిశోధనలు వచ్చేంతవరకు రామాయణ విషవృక్షం నేటి సమాజానికి అసలైన రామాయణం.
- కాశీనాథునీ నాగేశ్వరరావు మహాభారతం భీష్ముడి మౌనవ్రతం అసలైన భారతం. సందేహాలకు పరిష్కారాలను తమ స్వల్ప రచనలతో లేదా పరిశోధనలతో పరిష్కరించడం సాహితివేత్తలు, పరిశోధకుల బాధ్యత. దీని ద్వారా రేపటి తరం వారికి ఇతిహాసాలను సందేహాలు లేని పవిత్ర చరిత్రలుగా అందించగలం.
5. ఉపయుక్తగ్రంథసూచి:
- నన్నయ్య. (1986) ఆంధ్రమహాభారతం, గాయత్రి పబ్లికేషన్స్, కర్నూల్
- నాగయ్య, జి. (2019) తెలుగు సాహిత్య సమీక్ష, ద్వితీయ సంపుటం, నవ్య పరిశోధక ప్రచురణలు, హైదరాబాద్
- నాగేశ్వరరావు, కాశీనాధుని. (1918) మహాభారతం భీష్ముడిమౌనవ్రతం, ఆంధ్ర భారతి పత్రిక
- రంగనాయకమ్మ, (1996) రామాయణ విషవృక్షం, విశాలాంధ్ర పబ్లికేషన్స్ విజయవాడ
- రామకృష్ణ శాస్త్రి, శిష్లా. (2003) ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సర్వస్వం, విశాలాంధ్ర పబ్లికేషన్స్, విజయవాడ
- వాల్మీకి (1978) రామాయణం. తిరుపతి దేవస్థాన ప్రచురణలు
- వెంకటరామనరసింహం, కాకర్ల. (1998) తెలుగు సాహిత్య దర్శనం, లక్ష్మీ రాఘవేంద్ర పబ్లికేషన్స్, నూజివీడు
- వెంకటావధాని దివాకర్ల. (1995) ఆంధ్ర వాఙ్మయ చరిత్ర, ప్రచురణ-6, కుంతీ పబ్లికేషన్స్, చిత్తూరు
- శ్రీరామచంద్రుడు, పుల్లెల. (2021) మహాభారత సారసంగ్రహం, సంహిత గ్రాఫిక్స్, అమీర్ పేట్, హైదరాబాద్
- సత్యనారాయణ, విశ్వనాథ . (1988) విశాలాంధ్ర పబ్లికేషన్స్, విజయవాడ
- సుబ్బకవి, మోక్షగుండం. (1987) సీతా కళ్యాణం, పలనాడుపబ్లికేషన్స్, నరసరావుపేట
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.