headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను పూర్తిగా రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. ఇప్పటివరకు కేర్-లిస్ట్ లో ఉన్న అన్ని జర్నళ్ళు... ఇక పై "పీర్ రివ్యూడ్" జర్నళ్ళుగా కొన్ని ముఖ్యమైన "పారామీటర్లు" పాటిస్తూ కొనసాగాల్సి ఉంటుంది. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతుంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-10 | September 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

8. స్థానాపతి రుక్మిణమ్మ ‘పూలమాల’ ఖండకావ్యం: విశేషాంశాలు

డా. పురుషోత్తం గుంట

తమ్మినాయుడుపేట,
ఎచ్చెర్ల మండలం,
శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 8019215609, Email: purushottamgunta@gmail.com
Download PDF


సమర్పణ (D.O.S): 19.07.2024        ఎంపిక (D.O.A): 25.08.2024        ప్రచురణ (D.O.P): 01.09.2024


వ్యాససంగ్రహం:

ఈ పరిశోధన వ్యాసానికి ప్రధానంగా స్థానాపతి రుక్మిణమ్మ రచించిన ‘పూలమాల’ అనే ఖండకావ్యం ఆధారం. ఈ వ్యాసంలో కరువు దుస్థితిని, వీరుల చరిత్రను, రచయితల మనోభావాలను, వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధతంత్రాలను, తాత్వికవిషయాలైన పరోపకారం, సత్కర్మలు గురించి ప్రస్తావనలున్నాయి అదేవిధంగా మహాభారతంలోని కుంతీవైభవం, పాండవులు, ద్రౌపది తాము పొందిన బాధలు, అవమానాలు మనకు గోచరిస్తాయి. భాగవతములోని శ్రీకృష్ణుని బాల్యక్రీడలు, శ్రీకృష్ణుని దశవతారాలు వంటి వర్ణనలు ప్రత్యక్ష అనుభూతిని కలిగిస్తాయి. పూలమాల ఖండకావ్యంలోని విశేషాంశాలు తెలియజేయడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. వివిధవ్యాసాలు, రుక్మిణమ్మ పూలమాల, కాదంబిని వంటి ఖండ కావ్యాలు ఈ వ్యాసానికి ఆధారం విశ్లేషణాత్మక పద్ధతిలో ఈ వ్యాసం రూపుదిద్దుకుంది.

Keywords: మహాభారతం, భాగవతం, జడభరతుడు,ఝాన్సీలక్ష్మీబాయి, కాత్యాయనిదేవి, ద్రౌపది, కుంతిదేవి, పాండవులు, శ్రీకృష్ణుడు, యశోద.

1. ఉపోద్ఘాతం:

మహాకావ్యాల నుండి  రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన స్వతంత్ర్యఘట్టాన్ని తీసుకొని రాసింది ఖండకావ్యం.   అటువంటి ఖండ కావ్య ప్రక్రియను ఎంచుకొని స్థానాపతి రుక్మిణమ్మ గారు పూలమాల అనే  ఖండకావ్యం ద్వారా  ఆంధ్ర ప్రశస్తిను , తాత్విక విషయాలను  చారిత్రక వీర వనిత అయిన ఝాన్సీ లక్ష్మీబాయి,  ఇతిహాస,  పురాణ గ్రంథాలను  ఆరంభ అంత్య కవితలను తన ఖండకావ్యమైన పూలమాల అనే గ్రంథము ద్వారా పాఠకులకు పరిచయం చేయడం జరిగింది.                    

2. రచయిత్రి పరిచయం:

స్థానాపతి రుక్మిణమ్మ పశ్చిమగోదావరి జిల్లా  నిడదవోలు  వాస్తవ్యులైన శ్రీకాకుళపు పురుషోత్తం, గరుడమ్మ  పుణ్యదంపతులకు క్రీస్తు శకం 1915 వ సంవత్సరం సెప్టెంబరు 28వ తేదీ నాడు జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న మాటకు రుక్మిణమ్మను ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు చిన్ననాటినుంచే ఈమెకు మహాభారత, రామాయణ, భాగవత, పురాణ గాథలపై ఎంతో మక్కువ ఉండేది ఆనాడు వీధుల్లో ప్రదర్శించే గొల్ల కలాపాలు, భామకలాపాలు,తోలుబొమ్మలాటలు, నాటకాలను చూడటానికి తన మేనత్త పాపమ్మ గారితో రుక్మిణమ్మ కలిసి వెళ్లేది అలా తాను విన్న పద్యాలను పాటలను ఆలపిస్తూ పెద్దలను ఆశ్చర్య చకితులను చేసింది. కాదంబిని, పూర్వగానం వంటి ఖండకావ్యాలు. దేవీ భాగవతం వచన పురాణం.  వత్సరాజు , చారు దత్తం, దూత ఘటోత్కచం వంటి నాటకాలు. ఛాయ నవల.  సప్తశతి పద్య సంకలనం. లీల కావ్యం. నీలాటి రేవు, దెయ్యాలు, యుక్తి మాల కథా సంపుటాలు వంటి రచనలు చేశారు.

“స్థానాపతి రుక్మిణమ్మ వయస్సు పదునెనిమిది యేండ్లు  ఈమె విద్యాశాలలందు గాని, పండిత గురువుల సాన్నిద్యమునగాని విద్యనభ్యసించి యుండలేదు. స్వయంకృషి వలనను భర్తృ సహవాసమునను సేకరించిన పూలతో నీ మాల గ్రుచ్చినది“1   ( ఈ కావ్యానికి పీఠిక రాస్తూ అబ్బూరి రామకృష్ణారావు  తెలిపారు.)

రుక్మినమ్మ గారి కృతులు పరిమాణమున లఘువులు కావచ్చును. గుణమున గురువులు. అన్నియు అఖండములు. ఈ కాదంబిని యందు అచ్చటచ్చట ప్రాచీన కృతుల ఛాయలుండుట నాకుc దోచెడిని. నాకు పాండిత్యము తక్కువ. గొప్ప పండితులకు ఇంకను ఎక్కువగా అట్టి యంశములు గోచరము లగునేమో!

 నన్నయ యొక్క పోకడలు ఈ కవయిత్రి యందు కాన్పించుట ఆమె శైలి మాధుర్యమునకు గాంభీర్యమునకునునిదర్శనములు”.2  (కాదంబిని ఖండ కావ్యాని కి పీఠిక రాస్తూ  కట్టమంచి రామలింగారెడ్డి గారు  అన్నారు)

“సాహితీ పథికులైన రసపిపాసువులకు’ కాదంబిని’ అమృతం వర్షించి, అమరత్వం పొందుతుంది; సందేహం లేదు”.2

(కాదంబినిఖండకావ్యానికిరాసినపరిచయంలో పురిపండా అప్పలస్వామి గారు అన్నారు)

3. స్థానాపతి రుక్మిణమ్మ పూలమాల ఖండకావ్యం- విశేషాంశాలు:

ఈ పూలమాల ఖండకావ్యాన్ని విశాల హృదయులకు తెనుగు తోబుట్టువులకు భక్తి పూర్వకముగా అంకితం చేస్తున్నాను అని కవయిత్రి కావ్యారంభంలో పేర్కొన్నారు పై మాటను బట్టి పూలమాల ఖండ కావ్యం తెలుగు వారికి అంకితమిచ్చినట్లు అర్థమవుతుంది ఈ విధంగా 18 సంవత్సరాల వయస్సులోనే రుక్మిణమ్మ చేయడం వలన ఆమె హృదయ విశాలత అర్థమవుతుంది
పూలమాల ఖండకావ్యం లో మొత్తం 14 కావ్య ఖండికలు ఉన్నాయి. వీటిలో విశేషాంశాలను  అనుసరించి వర్గీకరించడం జరిగింది.

అవి
1. ఆరంభ అంత్య కవిత విషయాలు.
2. ఆంధ్ర ప్రశస్తిని తెలిపేవి.
3. చారిత్రక వీర గాధ సంబంధితమైనవి.
4. తాత్విక సంబంధిత విషయాలు.
5. భాగవత సంబంధిత విషయాలు.
6. మహాభారతసంబంధితవిషయాలు. 

3.1 ఆరంభ అంత్య కవిత విషయాలు:

స్థానాపతి రుక్మిణమ్మ గారు తన పూలమాల కావ్యారంభంలో స్వస్తి కవితను రాశారు. కాత్యాయని ఇది ఒక దేవి ప్రార్ధన పద్యం ఈ పద్యాన్ని కాత్యాయని దేవిని స్తుతిస్తూ కాత్యాయని శీర్షికతో చెప్పారు చాలామంది కవుల లాగానే రుక్మిణమ్మ కూడా దైవస్మరణతోనే కావ్యాన్ని ఆరంభించారు

“ శ్రీమదోంకారపంజరాసీనశుఖము
ప్రాంచ దుపనిషదుద్యాన పరభృతమ్ము
ఆగమారణ్య వీథీ మహా మయూర
మైన కాత్యాయనీ దేవి నాత్మcదలతు” 3

రుక్మిణమ్మ కాత్యాయని దేవిని ప్రార్థిస్తూ కావ్యాన్ని ప్రారంభిస్తూ రాసిన ఈ పద్యం సంస్కృతంలో శంకరాచార్యులు వారు శ్యామలా నవరత్న మాలిక స్తోత్రం ఒక శ్లోకానికి స్వేచ్ఛానువాదం.

ఓంకారమనే పంజరంలో చిలుక వలె కూర్చున్న దేవిని ఉపనిషత్తులనే ఉద్యానవనంలోనూ వేధారణ్యాలలోనూ స్వేచ్ఛగా విహరించే నెమలి వంటి కాత్యాయని దేవిని మనసులో తలంచి తన కావ్యాన్ని కవయిత్రి ప్రారంభించారు ఏ పనైనా ప్రారంభించినప్పుడు దేవుడిని ప్రార్థించి ముందుకు సాగితే ఆ పని నిరాటంకంగా సాగి విజయ తీరాలను చేరుతుందని తెలుగువారి నమ్మకం రుక్మిణమ్మ కూడా తన కవిత్వ రచనారంభాన్ని దేవి స్తుతితో ప్రారంభించి నిరాటంకంగా అనేక రచనలను చేశారు అలాగే దేవి స్తుతితో తన కావ్యాన్ని ఆరంభించి చదువరులకు కూడా శుభయోగం కలగాలని కవయిత్రి ఆశించారు.

స్వస్తి ఇది పూలమాల ఖండ కావ్యం లోని చిట్టచివరి పద్యం ఈ కవిత నాటకాల్లోని భరత వాక్యం వలె ఉంటుంది ఇది కొన్ని సంస్కృత కావ్యాల చివర నుండే స్వస్తి శ్లోకాన్ని ప్రతిబింబిస్తుంది.

“కెరలి వానలు కాలానc గురియుcగాక!
అవని సస్య సమృద్ధమై యలరుc గాక!
దుఃఖమే లేక లోకంబు తొరలుc గాక!
వెరపెరుంగకబ్రాహ్మ్యంబువెలయుcగాక  …..”4

ఈ స్వస్తి కవితలో కవయిత్రి దేశ అభ్యున్నతి కోరుకున్నారు ప్రతిపాదంలోనూ ప్రజానికానికి మేలు జరగాలని ఆకాంక్షించారు ఆంధ్రదేశం పాడి పంటలపై ఆధారపడిన ప్రాంతం పాడిపంటల అభివృద్ధి కి వర్షమే ఆధారం వానలు సరిగ్గా కురిస్తేనే రైతన్న ఇంట ఆనందం వెళ్లి విరుస్తుంది తద్వారా దేశాభివృద్ధి జరుగుతుంది భూమండలమంతా పచ్చగా పరవళ్ళు తొక్కలని లోకంలో బాధలు లేకుండా సాగాలని విజ్ఞానవంతులతో సమాజం నిండిపోవాలని పేదవాడు ధనవంతునిగా మారాలని ప్రకృతి అంతా సౌభాయమానంగా జీవకళను పొందాలని కాంక్షిస్తూ పూలమాల కావ్యాంతంలో స్వస్తి పలికారు.

3.2 ఆంధ్ర ప్రశస్తిని తెలిపేవి:

వందల సంవత్సరాల ఘన చరిత్ర గల ఆంధ్రభూమి నేడు తన ప్రభావం కోల్పోయి వెనుకబాటుకు గురవుతుందని కలతచెంది కవయిత్రి రుక్మిణమ్మ ఈ ఖండికను రాశారు.

“ఎంద రెందరో ఘన సుధాస్యంది లేఖి
నులతెనుగుసీమధనధాన్యనిలయమనుచు
వ్రాసిరే కాని; నేcడది   వ్యర్థమయ్య!
కడుపు కాలెడి వారలc గాంచు కతన” 5

ఎందరో కవులు తమ అమృత కలలతో తెలుగు భూమిని ధన ధాన్య నిలయమని కొనియాడారు కానీ ఆ మాట నేడు వృధా అయ్యింది కారణం ఆకలితో అలమటించే ప్రజలు ఇక్కడ అనేకులున్నారు ఒకనాటి ఆంధ్ర దేశం భారతజాతికి అన్నపూర్ణ అని రత్న గర్భ అని కొనియాడేవారు కాని ఆ పేరు నానాటికి చెదిరిపోతుంది ఇక్కడ కూడా దీనుల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి కరువు భూతం తాండవిస్తుంది రాజైవెలిగిన రైతన్న  ఉరి కొయ్యికి బలైపోతున్నారు అన్నపూర్ణకే ఆకలి నొప్పులు పుట్టిన ఈ ఆంధ్రభూమిలో మరల అలనాటి ధన ధాన్య గారాలు వెలసి కీర్తి ప్రతిష్టలు పెరగాలి అని కవయిత్రి ఆశించారు.

“ఎందరెందరో రుధిర నిష్యంది లేఖి                    నులతెనుcగుసీమయోధసంకలితమనుచు
వ్రాసిరే కాని; నేcడది వ్యర్థ మయ్య!
వీరుcడొకcడును గనరాని కారణమున”6

ఎందరో చరిత్రకారులు రక్తం నింపిన కలాలతో వీరాధివీరులకు తెలుగు ప్రాంతం నిలయమని రాశారు కానీ ఒక్క వీరుడు కనపడకపోవడం వలన ఆ మాట అవాస్తవమైంది.

ఈ కావ్యం జాతీయోద్యమ సమయంలో రాసినది. ఒకనాడు వీరులెందరికో జన్మనిచ్చిన తెలుగు గడ్డలో స్వాతంత్రోద్యమంలో పాల్గునే వీరుల సంఖ్య తక్కువగా ఉండటంతో కవయిత్రి ఆవేదన చెంది ఈ మాటలో పలికి ఉండవచ్చు.

“ఎందరెందరో వర మధు స్యంది లేఖి
 నులతెనుcగుసీమప్రణయమండలమటంచు
వ్రాసిరే కానీ; నేcడది వ్యర్థ మయ్య!
ప్రణయ తత్త్వమ్మె తెలియని ప్రకృతి యగుట7

ఎందరో భావకులు తమ తేనెలూరే కలాలతో తెలుగుదేశాన్ని ప్రణయ మండలమని పేర్కొన్నారు. కాని ఆ మాట తప్పయ్యే పరిస్థితి నేడు వచ్చింది. ఈనాటి జనులు కొందరికి ప్రణయతత్వం అర్థం కాక, కామ ప్రవృత్తినే ప్రణయంగా భావించి అగత్యాలకు తలపడే వారిని చూసి ఈ భావాన్ని  రుక్మిణమ్మ వ్యక్తం చేసి ఉండవచ్చు.

3.3.చారిత్రక వీర గాధా సంబంధమైనవి

‘పూలమాల’ ఖండకావ్య సంపుటిలో ‘లక్ష్మీ’ ఖండిక వీరగాధా కవిత్వం ఇది చారిత్రక ప్రఖ్యాతి గాంచిన ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ యొక్క వీరత్వాన్ని, కథన రంగంలో ఆమె నైపుణ్యతను తెలియజేసే పద్య రత్నాలను ఈ ఖండికలో కవయిత్రి కూర్చారు.

“సకలావనీచక్ర సంస్తూయమానమై
యలరు కాశిపురి నవతరించి
అతి బాల్య మందె యశ్వారోహణాదుల
పేరుకెక్కిన యట్టు లారి తేరి 

జయ జయ ధ్వనులతో ఝాన్సీ మహావిభుc
బ్రేమ మీరంగను బెండ్లి యాడి
ఖడ్గ ప్రహార విఖ్యాత పాండిత్యంబు
భువి వైరి వరులకుc జవులు చూపి
……………………  “8

ఈ పద్యాల్లో లక్ష్మీబాయి జన్మించిన కాశీపురి విశిష్టత, చిరుప్రాయంలో గుర్రపు స్వారి వంటి యుద్ధ విద్యల్లో ఆరితేరడం, ఝాన్సీ మహారాజుతో అంగరంగ వైభవంగా వివాహం జరగడం, ఆమె కత్తియొక్కవాడినిశత్రురాజులకురుచిచూపించడం మొదలగు ప్రఖ్యాతులు గల వీర కుమారి లక్ష్మీబాయి ఎల్లప్పుడూ భారత వనితల హృదయాల్లో వెలుగుతుంటుంది. అటువంటి వీరవనితకు చేతులెత్తి హర్షద్వానాలు పలుకుతాను అని కవియత్రి ఝాన్సీ లక్ష్మీబాయిని తలుచుకుంది.

ఈ కింది పద్యాలలో ఝాన్సీ లక్ష్మీబాయి వీరత్వం తో పాటు యుద్ధ తంత్రాలను చూడవచ్చు.

“రణ శిక్షణము లాది రాజ్య తంత్రంబులు
రావు సాహెబునకు రహిని దెలిపి
బాందాయు రోహిలా బంగాళబుందేలి
సేనల వేగమే చేరc గట్టి
పరిపంథి హృదయముల్ భగ్నమౌనట్టుల
తురగవారమ్ముతోcదొలుతనిలిచి…………..,.......”9

వీరోచిత పోరాటాలు చేయడమే కాకుండా రణ శిక్షణాది రాజ్య తంత్ర విద్యలను రావు సాహెబుకు యుద్ధంలో నేర్పి మిత్ర రాజ్యాలను ఏకం చేసి శత్రుసేనల హృదయాలను చీల్చుతూ ఎదురు నిలిచి శత్రుశతాఘ్నలకు భయపడుతున్న స్వసేనకు ధైర్యాన్నిచ్చి గుర్రాన్నెక్కి గర్జిస్తూ సవ్యసాచిల కాల్పి పట్టణంలోభయంకరంగా శత్రుసేనలను చెండాడి ఝాన్సీ రాణిని ఉత్సాహంతో తలంచుతాను. ఝాన్సీ లక్ష్మీబాయి వీరవనిత మాత్రమే కాదని రణతంత్ర శిక్షకురాలని మిత్రరాజ్యాలను ఏకం చేసి శత్రుమూకలను చెండాడగల ధీమంతురాలని ఈ ఖండిక ద్వారా కవయిత్రి మనకు తెలిపారు

3.4.తాత్విక సంబంధిత విషయాలు:

పూలమాల ఖండ కావ్య సంపుటిలో చాటింపు ఖండికలో తాత్వికతను బోధిస్తూ సరళమైన భాషలో రుక్మిణమ్మ రాశారు.

పూర్వం ఒక పట్టణానికి రోజు రాత్రులందు గస్తు తిరిగే తలారి కి ఒకరోజు వేరే పని నిమిత్తం వెళ్ళవలసి వచ్చింది. ఆరోజు తన గస్తు తిరిగే బాధ్యతను ఒక పొలంలో నిద్రిస్తున్న జడభరతుడికి అప్పగిస్తాడు.

పురాణ పురుషుడైన జడభరతుడు పట్టణవాసులకు రాత్రి నాలుగు జాముల్లో నాలుగు హితవులు బోధిస్తూ, గస్తు తిరుగుతూ జాగ్రత్త పరుస్తాడు.

“ఆశచే బద్ధ మయి పోయె నఖిల జగము
వింతగా కర్మలన్ బహుచింతలొదవు
తరుగు దినము- నాయుః క్షీణ  మెరుcగదహహ!
కాన జాగర్తి! జాగర్తి!! కాచుకొనుడు”10


సమస్త జగం ఆశ చేతిలో చిక్కిపోయిందని, మనిషి విపరీత ఆలోచనలతో వింత వింత కర్మలను ఆచరిస్తున్నాడని, దీనితో ఎంతో విలువైన కాలం వ్యర్థమవుతుందని, కాలంతోపాటు ఆయువు కూడా క్షీణిస్తుందని గ్రహించాలి. జాగ్రత్త పడాలని కవయిత్రి జడభరతుని పాత్ర ద్వారా ఈ పద్యంలో చెప్పించారు.

జీవితం చాలా చిన్నది కనుక ఉన్నంతలో నిస్వార్ధంగా, సత్కర్మలని ఆచరించాలి. కానీ ఆశ చేతిలో చిక్కి అల్లాడిపోయి ఆయువుని కోల్పోవద్దని చెప్పే తాత్వికత ఈ పద్యంలో కనిపిస్తుంది.

“క్షణముచిత్తమ్ము,విత్తమ్ముక్షణమెసుమ్ము
క్షణముజీవితమెల్లను,క్షణమునటన
ఎరుకతెలియుcడుయమునకుcగరుణలేదు
కానజాగర్తి !జాగర్తి!! కాచుకొనుcడు”11

మన మనస్సు, ధనం, జీవితం మొదలగునవి అన్నీ క్షణభంగురాలని, ఇవి శాశ్వతమని భావించి వీటి కోసం వెంపర్లాడవద్దని చెబుతూ, మన భవిష్యత్తు తెలిసిన యముడికి కరుణ ఉండదని కావున మనిషి మంచి, మనస్తత్వాలతో జాగ్రత్త గా జీవించాలని జడభరతుడు ద్వారా రెండో జాములో కవయిత్రి హెచ్చరిక చేశారు. నీతి బాహ్యమవుతున్న మానవుడు ఈ తత్వాన్ని తెలుసుకొని సత్ప్రవర్తనను ఆచరిస్తాడని కవిత్రి ఆశించారు.

“లేరు తల్లిదండ్రులు లేదు- లేదు- బంధు
వర్గము; సహోదరులు లేరు వసతి లేదు
తలcప నియ్యెడ సుంతైన ధనము లేదు
కాన జాగర్తి! జాగర్తి!! కాచుకొనుడు”12

ఇది పూర్తి తాత్విక బోధనా పద్యం. ఐహిక బంధాలు, సౌకర్యాలు, వసతులు, ధన సంపదలు మొదలగునవన్నీలేవని, ఇవన్నీ మానవ కల్పితాలని, మన వెంటరావని వీటి కోసం మనిషి పరితపిస్తుంటాడు.  మనిషిఅశాశ్వతమైన పై వాటికోసం వెతకడం మాని, సన్మార్గంలో పరోపకార బుద్ధితో, సేవాగుణంతో జీవించడం మేలని పరోక్షంగా కవయిత్రి తెలిపారు.

3.5. భాగవత సంబంధిత విషయాలు:

పూలమాల ఖండకావ్యం లో గుమ్మడు దశావతారములు అనే రెండు భాగవత సంబంధ ఖండికలు ఉన్నాయి.

భాగవత పాత్ర శ్రీకృష్ణుడు, యశోదమ్మ పాత్రల మధ్య జరిగిన చక్కని సంఘటన గుమ్మడు కవిత ఈ గుమ్మడు కవిత ‘గుమ్మడేడీ గోపీదేవి’ అనే జానపద పాట ఆధారంగా రాయబడింది. ఈ ఖండికలో అల్లరి చేసే చిన్ని కృష్ణుడిని, కట్టడి చేయ తలచిన యశోదమ్మను  కవయిత్రి చాలా రమ్యంగా చిత్రించారు.

“రాణించు ముత్యాల రావి రేకయు బొట్టు
నిరువైన కురులలో మెరయు చుండ
బాగైన వజ్రాల పౌజుల కమ్మలు
తళుకు చెక్కిళ్లపైc దాండవింప……..
………. …… …….. ….   ……
……….  …… ……      ……
వనిత యొయ్యారమునను బ్రభాత వేళ
పెరుగువడిఘుమ్ముఘుమ్మునcదరచు చుండ”13

పై పద్యాల్లో కృష్ణుని పెంపుడు తల్లి యశోదమ్మ వెన్న చిలుకు విధానాన్ని కవయిత్రి సహజ సౌందర్యంగా వర్ణించారు. ఆనాటి గ్రామీణస్త్రీరూపవర్ణనను  ప్రబంధకన్యవలే అలంకరణలతో అందంగా రుక్మిణమ్మ చిత్రించారు. ఉదయపు వేళ యశోదమ్మ అతివయ్యారంగా, వడిగా కవ్వంతో పెరుగును చిలుకునప్పుడు వినిపించే ఘుమ్ము, ఘుమ్ముఅనే శబ్దాన్ని కూడా కవయిత్రి పద్యంలో ధ్వనింప చేశారు.

“నాదముటు విని కృష్ణుండు నవ్వుచు దరిc
జేరి తక్కుచు నడుమున జేయి నునిచి
‘అమ్మ! వెన్న! వెన్నో!’యంచు నెమ్మి తోడ
నడిగి తడయక కవ్వమ్ము నణcచి పట్ట”14

కవ్వపు సడి విని కృష్ణుడు అక్కడికి వచ్చి తల్లిని వెన్న ఇమ్మని అడిగి మారం చేసే విధానాన్ని ఈ పద్యములో చక్కగా రుక్మిణమ్మ చిత్రించారు. ఈ పద్యంలో బాలకృష్ణని పాత్రలో మన ఇంటిలోని చిన్న పిల్లల చేష్టలను కవయిత్రి దర్శింపజేశారు.

“అల నిలింప పుష్పామోద యాయశోద
రట్టుc జేయు పుత్రుని భయపెట్టcదలcచి
అరయు మీ భాండమున గుమ్మcడనెడు బూచి
తిరుగుచున్నాcడు  చెయ్యివెట్టc గరచునమ్మ!15

ఈ పద్యంలో పిల్లల అల్లరిని మాన్పటానికి  ‘బూచి’ పేరుతో భయపెట్టే తల్లిని ‘యశోద’ పాత్రలో కవయిత్రి చూపించారు. కవ్వంతో చిలికేటప్పుడు వెలువడే ‘ఘుమ్’ అనే శబ్దాన్ని ‘గుమ్మడు’ అనే బూచిగా చూపించి, అది కరుస్తుందని బాలకృష్ణుని భయపెట్టాలని యశోదమ్మ ప్రయత్నించటం ఈ పద్యంలో జరిగింది.

యశోద అమాయకంగా కృష్ణుడిని గుమ్మడి పేరుతో భయపెట్టదలిస్తే ప్రతిగా ఆ పరంధాముడు లోకాలన్నీ తిరిగి రాక్షసులెందరినో మట్టు పెట్టానని ఈ ‘గుమ్మడు’ ఎవరో కొత్తగా ఉన్నాడు ఒకసారి చూపించమ్మా నీకు దండం పెడతానని అనడంలో శ్రీకృష్ణుని గడుసరితనాన్ని కవయిత్రి చిత్రించిన విధం కనిపిస్తోంది.

భాగవత సంబంధియైన ఈ ఖండికలో శ్రీమన్నారాయణుడిని పది అవతారాలను పది చరణాల్లో ఇనుమడించి కవయిత్రి తన చాకచక్యాన్ని ప్రదర్శించారు.

“వేదాది విద్యలు వెలయింపcగాc జేసి 
          ముదము మీరcగ లోకములు వహించి
భూగోళమెల్ల విస్ఫూర్తితోc బైకెత్తి
          ఘన దుర్మదాంధు రక్కసునిc దున్ని
బలిచక్రవర్తిని పాతాళమునc గట్టి
            క్షాత్రమండలమును క్షయ మొనర్చి
నిశిత మార్గణ ఫంక్తి దశకంఠుని జయించి
           కమనీయమైన నాగలిని బట్టి          
ఇంపు దళుకొత్త కరుణ వ్యాపింపc జేసి
భువన కీర్తిగ మ్లేచ్ఛుల మూర్ఛ ముంచి
అత్తుల మతిని నివ్విధి దశాకృతులc దాల్చి
మహిని దనరారు శ్రీకృష్ణు మదిc దలంతు”16

ఆదిమత్స్య, కూర్మ ,వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, మోహిని, కల్కి, కృష్ణావతారాలన్నిటిలోని స్పృశిస్తూ ఆ అవతారంలోని విశిష్టతను ఒక్కో చరణం లో నిబిడీకృతం చేస్తూ పది పాదాలలో పది అవతారాలను స్పురింప చేస్తూ కవయిత్రి ఈ ఖండిక రచించారు.

3.6.మహాభారత సంబంధిత విషయాలు:

‘పూలమాల’ ఖండకావ్య సంపుటి వివిధ రకాల పుష్పాలతో గుచ్ఛబడిన పూలదండ వంటిది. వివిధ రకాల ఇతి వృత్తాలతో ఇందులో ఖండికలను రుక్మిణమ్మ గారు రచించి ‘పూలమాల’ పేరుతో సంపుటీకరించారు. ‘పూలమాల’లో మహాభారత సంబంధమైన ఇతి వృత్తాలతో మరియు పాత్రలతో చేయబడిన ఖండకావ్యాలను ఈ భాగంలోగమనించవచ్చు.

ఇది మహాభారతంలోని ఒక ప్రముఖ పాత్రైన కుంతీదేవి ఇచ్చిన సందేశం కుంతీదేవి పాండురాజు భార్య. పంచ పాండవుకు తల్లి. కోడలిగా కురువంశంలోకి ప్రవేశించిన కుంతీదేవి, పాండురాజు మరణాంతరం అనేక హెచ్చుతగ్గులను అనుభవించింది. కష్టకాలంలో పాండవులకు దిశానిర్దేశం చేసి తల్లి పాత్రకు విశిష్టత చేకూర్చింది. అటువంటి కుంతీదేవి తన సంతానంతో పలుకు మాటలను ఈ పద్యాల్లో రుక్మిణమ్మ  తెలియజేసారు.

కురుక్షేత్ర సంగ్రామం అనంతరం కొంతకాలం పాటు పాండవుల భోగభాగ్యాలను తిలకించి, ఆనందించిన పిమ్మట విరాగియై  తపములాచరించటానికి వనాంతరాలకు వెళ్లేసందర్భములో తన పుత్రుడు ధర్మరాజుతో తల్లి కుంతీదేవి చెప్పు కొన్ని మాటలను ఈ కవితలో గమనించవచ్చు.

“కలుషపు జూదకార్యమునc
గాసిలి రాజ్యపదచ్యుతిన్ యశః
కలనము లేక వైభవసు
ఖమ్ముcదొరంగియు జ్ఞాతిహేళనో
క్తులకుc గృశించి దైన్యమున
ఘోరవనాంతర వాసులౌటచే
తొలివిలపించి మాధవుని
తోc దెగువాడితి సుమ్ము ధర్మజా!”17

పై  పద్యం కుంతీదేవి తన పుత్రుడు ధర్మరాజుతో పలికిన విషయాన్ని తెలుపుతుంది. ఆనాడు జరిగిన మాయాజూదంలో మోసపోయి ఓడిన పాండవులు రాజ్య పదవులను కోల్పోయి, యశస్సు, సుఖ వైభవాలు లేకుండా, దాయాదుల హేళనకుగురై, ఘోరారణ్యాల పాలవటం చేత బాధపడిన కుంతీ, వేదనతో తెగువ చేసి మాధవునితో మాట్లాడానని ధర్మరాజుకి చెప్తుంది.

తన బిడ్డలకు బాధ కలిగితే, వారి కంటే ఎక్కువగా దుఃఖించేది తల్లి అని కుంతీదేవి పాత్ర మాటల్లో కవయిత్రి తెలియజేశారు.కుంతీదేవి చేత భీమసేనుడు గురించి కింది పద్యంలో కవయిత్రి చెప్పించారు.

“పదివేలేన్గులతో సమాన బలమున్
బ్రఖ్యాత శౌర్యాది సం
పదలన్ గ్రాలెడు  భీమసేనుc డకటా !
ప్రాణా వశిష్టుండు నై
పదమూcడేండ్లు వనమ్ములన్ దిరిగెనే
ప్రారబ్ధమో యంచు మున్
గదనోత్సాహము పుట్టcగాc బలికితిన్
గాలానుగుణ్యంబుగన్”18

ఈ పద్యంలో కుంతీదేవి ధర్మరాజుతో భీమసేనుడి ఘనతను చెప్పడం, అటువంటి వీరుడు కూడాపదమూడుసంవత్సరాలు వనవాసం చేయవలసి వచ్చిందని, భీముడికి సందర్భానుసారంగా కథనోత్సాహం కలిగేటట్లు ఆనాడు గుర్తుచేస్తూ పలికానని అంటుంది. నిరంతర భోగభాగ్య విలాసాలతో ఉల్లాసవంతమైన “పాండు మహారాజు” పరిపాలనా కాలంలో గొప్ప వైన రాజ్యసంపదలను అనుభవించానని, శాస్త్రోక్తంగా దానధర్మాలను నిర్వర్తించి ఎంతో కీర్తిని పొందానని, అవి తనకు చాలు అని కుంతీదేవి ధర్మరాజుకు చెప్తుంది.తన శేష జీవితాన్ని ఎలా గడపాలని కుంతీదేవి నిర్ణయించుకుని ఇకమీదట దట్టమైన అడవులకు వెళ్లి, ఏకాగ్రతతో, ఘోరమైన తపస్సును చేసి తనువుని విడిచి పెట్టి, నా భర్త పొందిన పుణ్యలోకాన్ని చేరి సుఖిస్తాను గాని, ఈ గొప్ప గొప్ప సామ్రాజ్య సంపదలు నాకింక అక్కర్లేదు అని కుంతీదేవి  చెప్పడం గమనించవచ్చు.

ఈ పద్యంలో కుంతీ ధర్మరాజుకు ఏ విధంగా భవిష్యత్తులో కొనసాగాలో చెప్పే సన్నివేశం కనిపిస్తుంది.

“కాన నావనవాస దుఃఖమును విడిచి
భీమసేనాదుల నుజులు  పేర్మిc గొలువ
చతురు దధి వలయిత ధరాచక్ర మొల్ల
ధర్మముననేలుకొనుమోయి ధర్మరాజ!”19

తన యొక్క వనవాసం గురించి చింతించకుండా తమ్ములు ప్రేమాభిమానాలతో కొలుస్తుండగా విశాల సామ్రాజ్యాన్ని ధర్మ వర్తనుడివై పరిపాలించమని ధర్మరాజుకి కుంతీదేవి సందేశం ఇస్తుంది అనేది ఈ పద్య భావం.

ఇది మహాభారత సంబంధమైన కవిత ఖండిక ఈ ఖండికలో సందర్భాన్ని పరిచయం చేస్తూ కొన్ని వాక్యాలు  గద్యంలో కవిత్రి చెప్పారు. ఇది తిక్కన మహాభారతం ఉద్యోగపర్వం లో కౌరవుల వద్దకు రాయబారానికి వెళ్లే శ్రీకృష్ణునితో ద్రౌపది తన ఆవేదనను పంచుకున్న కవిత్వ భాగాన్ని అనుసరించి తనదైన శైలిలో రుక్మిణమ్మ రాసినఖండకావ్యం.

కౌరవుల వలన అనేక అవమానాలకు గురైన ద్రౌపది, వారిని యుద్ధంలో ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న సందర్భంలో, పాండవులు చేసే సంధి సన్నాహాలు చూసి సంక్షోభితమై కృష్ణునితో పలుకు మాటలనే కవయిత్రి రుక్మిణమ్మ కృష్ణునితో పాంచాలి అనే పేరుతో రచించారు. పాండవులు చేస్తున్న సంధి ప్రయత్నాన్ని విన్న ద్రౌపది సంక్షుభిత హృదయముతో, అశ్రుపూర్ణ నయనాలతో, పరాభవ బాధతో ప్రతి హింస కోసం ఎదురుచూస్తూ కాల భుజంగము లాంటి కుంతల కలాపాన్ని చేతబట్టుకుని కంపితమైన గొంతుతో కృష్ణునికి ఎదురు నిలిచి తన ఆవేదనని చెప్పింది.

ఓ కృష్ణ కాసేపు ఆగవయ్యా, పగవారితో సంధి ప్రయత్నానికై వెళ్తున్న నీవు దుశ్శాసనుడి వేళ్ళతో తుంచబడిన మిగిలిన నా జుత్తును గుత్తు తెచ్చుకో వేమి అని ద్రౌపది ప్రశ్నించడంలో ఆనాటి సభలో తనకు జరిగిన పరాభవాన్ని గుర్తు తెచ్చుకొని మరి సంధి ప్రయత్నం చేయమని చెప్పడమే అనగా సంధిసాఫల్యం జరగకుండా యుద్ధం జరిగేలా చేయమని అంతర్గత భావాన్ని ద్రౌపది పాత్రతో రుక్మిణమ్మ పలికించారు.

చంపదగిన వారిని చంపకపోవడం కూడా పాపమే అంటున్న ద్రౌపది మాటలను ఈ కింది పద్యంలో రుక్మిణమ్మ చూపించారు.

“చంపcగూడని వారినిc జంపుcటెంత
పాపమో! యంతకంటెను బదియురెట్లు
చంపుటకుc దగువారినిc జంపకుండ
విడిచి పుచ్చిన పాపమేర్పడదె? కృష్ణా!”20

చంపకూడని వారిని చంపడం మహా పాపం, చంపదగిన వారిని చంపకుండా వదలటం అనేది మరి పది రెట్లు పెద్ద పాపం కలుగుతుందని ద్రౌపది పలికిన ఈ పద్యములో అసలు భావం ఏమనగా అనేక అపరాదాలు చేసిన దుష్ట కౌరవులను తప్పనిసరిగా యుద్దంలో వధించాలి అలా చేయకపోతే అది మహా పాపమని చెప్పడమే. ఈ విధంగా రుక్మిణమ్మ గారు  సృష్టించిన ద్రౌపది మాటల్లో నిగూడంగా కౌరవులను చంపమని సూచించింది.

పాండవులకు కౌరవులు పెట్టిన బాధలను ద్రౌపది కింది పద్యములో చెబుతుంది.

“పలుకష్టములc గూర్చి పగcబూని బాల్యమ్ము నందుcబెట్టిన విషాన్నంబు మాట
కాసికాపురి కంపి కరుణా విహీనులై
యింటి కప్పునకుc జిచ్చిడిన మాట
మాయజూదమున సామ్రాజ్యమును హరించి యడవుల పాల్జేసినట్టి మాట
దండిమగల్గల నిండు సభకు నీడ్చి
… …..    ……. ……
………    ……    …..
…..   ………   …….. “21

కౌరవులు పగతో పాండవులకు కలుగజేసిన ఇబ్బందులు ,ద్రౌపదికి చేసిన పరాభవాన్ని భరించి భీమార్జునులు సంధి కోసం ప్రయత్నించటం, దుఃఖం కలిగించినా అంతమాత్రం చేత తనకు లోటు లేదని రుక్మిణమ్మ గారు ద్రౌపది ధైర్యాన్ని వ్యక్తపరిచింది.

ద్రౌపది ధైర్యం, ప్రశస్తి, క్రోధం మొదలగు భారతంలోని వివిధ పాత్రలను రుక్మిణమ్మ చక్కగా వర్ణించారు.

4. ముగింపు:

  • ఈ ‘పూలమాల’ ఖండకావ్యసంపుటి పేరుకు తగినట్లు వివిధరకాలపూలతో గుచ్చిన మాలవలె వివిధ విషయాలతో నిండిన ఖండికలతో కూర్చిన అందమైన కావ్యం కాత్యాయన స్తుతితో ప్రారంభించి, స్వస్తికవితతో ఈకావ్యం  ముగిసింది.
  • మధ్యలో వివిధ ఇతివృత్తాలతో కూడిన ఖండకావ్యాలు పాఠకులను రసానంద భరితులై చదవడానికి అనుకూలంగా స్థానాపతి రుక్మిణమ్మ గారు రచించారు.
  • పూలమాల ఖండకావ్యంలో భారత, భాగవతాలును పాఠకులకు పరిచయం చేయడం జరుగుతుంది.
  • ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీర వనితల త్యాగాలను స్మరించుకుంటాం.
  • జీవితం చాలా చిన్నది కనుక ఉన్నంతలో నిస్వార్ధంగా కర్మలని ఆచరించాలి కానీ ఆశ చేతిలో చిక్కి అల్లాడిపోయి ఆయువు కోల్పోవద్దని చెప్పే తాత్వికవిషయాలును పరిచయం చేశారు.
  • ఎందరో కవులు తమ అమృత కలాలతో తెలుగు భూమిని ధన, ధాన్యాలకు నిలయమని కొనియాడారని తెలిపారు.
  • ఎందరో చరిత్రకారులు రక్తం నింపిన కలాలతో వీరాధివీరులకు తెలుగు ప్రాంతం నిలయమని రాశారు.

5. పాదసూచికలు:

  1. పూలమాల ఖండకావ్యం పీఠిక
  2. కాదంబిని ఖండకావ్యం పీఠిక
  3. పూలమాల ఖండకావ్యం పుట.3
  4. పైదే.పుట.39
  5. పైదే .పుట.38
  6. పైదే .పుట.38
  7. పైదే .పుట.38
  8. పైదే .పుట.13
  9. పైదే .పుట.15
  10. పైదే .పుట.5
  11. పైదే .పుట.5
  12. పైదే .పుట.6
  13. పైదే .పుట.10
  14. పైదే .పుట.10
  15. పైదే .పుట.10,11
  16. పైదే .పుట.12
  17. పైదే .పుట.16
  18. పైదే .పుట.16
  19. పైదే .పుట.19
  20. పైదే .పుట.21
  21. పైదే .పుట.21

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. నారాయణరెడ్డి, సి. (1999). ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు; ప్రయోగములు.. విశాలాంధ్ర పబ్లిసింగ్ హౌస్ హైదరాబాద్.
  2. నిత్యానందరావు, వెలుదండ.(2013) విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన, ఓం సాయి గ్రాఫిక్స్, హైదరాబాద్.
  3. మోహనరావు, సజ్జా.(2015). సాంఘికోద్యమ రూపకాలు,విజయనరసింహ పబ్లికేషన్స్ ,టెక్కలి, శ్రీకాకుళం.
  4. రుక్మిణమ్మ, స్థానాపతి.(1933). ‘పూలమాల’ ఖండకావ్యం
  5. రుక్మిణమ్మ ,స్థానాపతి .(1950). కాదంబిని’ ఖండకావ్యం
  6. రుక్మిణమ్మ, స్థానాపతి.() ‘దేవీ భాగవతం’(వచనపురాణం) శ్రీవైష్ణవ ప్రెస్, పెంటపాడు.
  7. లక్ష్మీకాంతం, పింగళి. (2002).సాహిత్య శిల్ప సమీక్ష,విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,హైదరాబాద్.
  8. వేణు మాధవ శర్మ, గుమ్మన్నగారి.(2020). మహాభారతం, బండల పబ్లికేషన్స్Ltd హైదరాబాద్.
  9. సీతారామాచార్యులు .బి.(2003). శబ్ద రత్నాకరము, ఆసియన్ ఎడ్యుకేషనల్ సర్వీసిస్, న్యూఢిల్లీ, మద్రాస్.
  10. సూర్యప్రకాశరావు,జోస్యుల.(2012). శ్రీమన్మహా భాగవతము, శ్రీ చైతన్య ఆఫ్సెట్ ప్రింటర్స్, రాజమండ్రి.

 

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]