headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను పూర్తిగా రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. ఇప్పటివరకు కేర్-లిస్ట్ లో ఉన్న అన్ని జర్నళ్ళు... ఇక పై "పీర్ రివ్యూడ్" జర్నళ్ళుగా కొన్ని ముఖ్యమైన "పారామీటర్లు" పాటిస్తూ కొనసాగాల్సి ఉంటుంది. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతుంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-10 | September 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

2. అన్నవరం దేవేందర్ కవిత్వం: సామాజిక చలనసూత్రాలు

డా. సంగి రమేష్

అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు విభాగం,
ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహేశ్వరం,
రంగారెడ్డి జిల్లా, తెలంగాణ.
సెల్: +91 9440447737, Email: rameshsangi.sangi@gmail.com
Download PDF


సమర్పణ (D.O.S): 13.08.2024        ఎంపిక (D.O.A): 26.08.2024        ప్రచురణ (D.O.P): 01.09.2024


వ్యాససంగ్రహం:

ఏ సమాజమైనా ఏవో కొన్ని అంతర్గత చలన సూత్రాల మేరకు నడుస్తుంటుంది. కొన్ని సార్లు అవి సామాన్యులకు అర్థం కాకపోవచ్చు. కాని సామాజిక తత్వవేత్తలకు, కవులకు, రచయితలకు, విమర్శకులకు అవి తప్పకుండా బోధపడుతాయి. వాటి పర్యవసానాలు వారి రచనల్లో తొంగి చూస్తాయి. వర్తమాన సమాజపు చలన సూత్రాలను లోతుగా అర్థం చేసుకొని వాటి ఫలితాలను తన రచనల్లో నిక్షిప్తం చేసిన తెలంగాణ రచయిత అన్నవరం దేవేందర్. గత మూడు దశాబ్దాలుగా అన్నవరం దేవేందర్ ఎన్నో ఉద్యమాలను, సందర్భాలను, పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన కవి, రచయిత. ఈయన రచనల్లో ప్రతిఫలించిన సామాజిక చలన సూత్రాలను అంచనా వేయడం ఒక చారిత్రక సందర్భం. అన్నవరం దేవేందర్‌ కవిత్వంలోని వివిధ సామాజిక చలన సూత్రాలను అంచనా వేయడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశం. వీరి కవిత్వo మీద రాసిన విమర్శ వ్యాసాలన్నీ కలిపి ‘వస్త్రగాలం' పేరుతో వెలువడ్డాయి. ఈ పరిశోధనా వ్యాసంలో విశ్లేషణాపద్ధతిని పాటించడం జరిగింది. ఈ వ్యాసంలో 1. ఉపోద్ఘాతం 2. విప్లవోద్యమం 3. బహుజనతత్వం 4. ప్రపంచీకరణ 5. ప్రాంతీయ అస్తిత్వం 6. కరువు చిత్రణ 7. మతతత్వం 8. తెలంగాణ ఉద్యమం అనే ఉపశీర్షికలు ఉంటాయి.

Keywords: అన్నవరం దేవేందర్, విప్లవోద్యమం, కరువు, ప్రపంచీకరణ, విధ్వంసం, తెలంగాణ, బహుజనులు, మతం, ప్రాంతీయత, సామాజిక చలన సూత్రాలు.

1. ఉపోద్ఘాతం:

అన్నవరం దేవేందర్‌ సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్‌ మండలం, పోతారం గ్రామంలో 1962 అక్టోబర్‌ 17న కేదారమ్మ, దశరథం దంపతులకు జన్మించాడు. ముస్తాబాద్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసి 2020లో ఉద్యోగ విరమణ పొందాడు. తొలినాళ్లలో కొంతకాలం వివిధ పత్రికలలో జర్నలిస్టుగా పనిచేశాడు. హుస్నాబాద్‌, కరీంనగర్‌లో పలు సాహితీ సంస్థలను స్థాపించి వాటి ద్వారా విలువైన పుస్తక ప్రచురణ, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాడు. అన్నవరం దేవేందర్‌ కవి, రచయిత, కథకుడు, కాలమిస్ట్‌ కూడా. గత మూడు దశాబ్దాలుగా తెలంగాణ తెలుగు పదాలతో, తన చుట్టున్న ప్రపంచాన్ని చాలా లోతుగా పరిశీలిస్తూ విరివిగా కవిత్వం రాస్తున్నాడు. ఇప్పటిదాకా తొవ్వ (2001), నడక (2003) మంకమ్మతోట లేబర్‌ అడ్డా (2005), బుడ్డపర్కలు (నానీలు - 2006) బొడ్డుమల్లెచెట్టు (2008), పొద్దుపొడుపు (2011), పొక్కిలి వాకిళ్ల పులకింత (2014), బువ్వకుండ (దీర్ఘ కవిత - 2016), ఇంటిదీపం (2016), వరి గొలుసులు (2018), గవాయి (2021), జీవన తాత్పర్యం (2022) తదితర కవితా సంపుటాలు వెలువరించాడు. 2022లోనే వీరి సమగ్ర కవిత్వ సంకలనం (1988-2022) వెలువడిరది. మరోకోణం, ఊరి దస్తూరి, సంచారం లాంటి ఇతర పుస్తకాలను రచించాడు. Framland Fragrance, The Unyielding Sky, Grain Chains పేర ఇతని కవితలు కొన్ని ఆంగ్లంలోకి కూడా అనువాదం అయ్యాయి. ఎన్నో గ్రంథాలకు సంపాదకత్వం, సహ సంపాదకత్వం వహించాడు. పొక్కిలి వాకిళ్ల పులకింత కవితా సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం (2016)తోపాటు పలు రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్నాడు. వీరి కవిత్వం మీద వచ్చిన విమర్శ గ్రంథం ‘వస్త్రగాలం’. కవిగా ప్రసిద్ధుడైన వీరి కలం నుంచి ‘చింతచచ్చినా’ వంటి కథలు కూడా వెలువడడం గమనార్హం. 

తెలుగు నేల మీద ఎలాంటి చలనం కలిగినా వెంటనే చలించిపోయి ఆ చలనాన్ని కవిత్వీకరిస్తూ వస్తున్న వర్తమానకవి అన్నవరం దేవేందర్‌. తొలిదశలో విప్లవోద్యమం నుంచి మొదలుకొని ప్రపంచీకరణ, ప్రాంతీయ చైతన్యం, దళిత బహుజన చైతన్యం, తెలంగాణ ఉద్యమం గుండా సాగుతూ విలువైన కవిత్వం రాశాడు. “అన్నవరం దేవేందర్ మట్టివీరుడు. ఫ్యూడల్ సమీకరణాలు తెలిసినవాడు. ఉద్వేగాన్ని కవిత్వంగా ఊదగలిగిన శక్తిశాలి.”1  (బుడ్డపర్కలు, పుట. 232.)  

‘అన్నవరం దేవేందర్ కవిత్వం - సామాజిక చలన సూత్రాలు’ అనే ఈ వ్యాసంలోకి వెళ్ళే ముందు అసలు ‘సామాజిక చలన సూత్రాలు’ అంటే ఏమిటో తెలుసుకుందాం. సమాజ పరిణామాన్ని ప్రభావితం  చేస్తూ తద్వారా మనిషి జీవితాన్ని విపరీతంగా మార్పుకు గురిచేసే చర్యలనే ‘సామాజిక చలన సూత్రాలు'గా భావించవచ్చు. ఉదాహరణకు పారిశ్రామికీకరణ (Industrialization). దీనివల్ల వస్తుత్పత్తిలో ఊహించని మార్పుతోపాటు సమాజంలో కొత్తగా మధ్యతరగతి ఏర్పడింది. అలాగే విప్లవోద్యమం. దీనివల్ల కూడా మనిషి జీవితంలో శతాబ్దాలుగా నెలకొన్న చీకటి పోయి కొద్దికొద్దిగా నైనా వెలుతురు ప్రసరించించి. అట్లాగే కరువు, మతోన్మాదాల వల్ల కూడా మానవ జీవితం ఎంతో ప్రభావితమై వలసలు, రక్తపాతం పెరిగిపోయాయి. ప్రపంచీకరణ, ప్రాంతీయ అస్తిత్వం, తెలంగాణ ఉద్యమాలు కూడా గత కొన్ని దశాబ్దాలుగా మానవ ప్రపంచాన్ని, ముఖ్యంగా తెలుగు ప్రాంతాలను ఎంతో ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ప్రపంచీకరణ వల్ల వస్తు సంస్కృతి పెరిగి, మనిషి విలువ పడిపోయింది. ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల వల్ల ఆయా ప్రాంతాల ఆదిపత్య పోరు, సాంస్కృతిక దాడులు పెరిగాయి. తెలంగాణ ఉద్యమం ఆత్మన్యూనత నుండి బయటపడి, ఆత్మగౌరవం దిశగా అడుగులు వేసి  ప్రత్యేక రాష్ట్ర కాంక్షను రగిలించింది. 1990ల తర్వాత వచ్చిన అనేక వాదాలు మానవులను కొత్తకోణంలో ఆలోచించేలా చేశాయి. తమను తాము తెలుసుకునేలా చేశాయి. ఇవేగాక ద్రవ్యోల్భణం, స్టాక్ మార్కెట్, ధరల హెచ్చుతగ్గులు, కులవృత్తుల కూల్చివేత, ప్రపంచవ్యాప్తంగా జరిగే యుద్ధాలు, అభివ్వృద్ధిపేర జరిగే విధ్వంసం… ఇలా ఎన్నో సామాజిక చలన సూత్రాలు నిత్యం మనిషిని అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి. ఈ మెట్ల మీదుగా ప్రయాణిస్తూ అన్నవరం దేవేందర్ కవిత్వాన్ని పరిశీలించినపుడు మనిషిని విపరీతంగా ప్రభావితం చేస్తూ ఆయా కాలాలలో ఉత్పన్నమైన సామాజిక చలనసూత్రాలు అన్నవరం దేవేందర్ కవిత్వoలో ఎలా ప్రతిఫలించాయో అవగతం అవుతుంది. “అన్నవరం దేవేందర్ లో చాలా సమస్యల పట్ల స్పష్టమైన  అవగాహన ఉంది. ఎక్కడా నీళ్ళు నమలడాలు లేవు. గుక్కిళ్ళు మింగడాలు ఉండవు. తెగిoపే ఉంటుంది. ఒక కవికి ఉండాల్సిన సంస్కారం ఉంటుంది. కవి ఎటు వైపు ఉండాలో అన్న నిర్ణయం ఉంది. సున్నితమైన మానవ సంవేదనలు దేవేందర్ సొంతం.”2 (బొడ్డుమల్లె చెట్టు, పుట. 279) 

2. విప్లవోద్యమం:

ఈ ఉద్యమం దేశ వ్యాప్తంగా విస్తరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చేరి అక్కడి నుంచి ఉత్తర తెలంగాణకు చేరి ఎంతో ప్రభావితం చేసింది. ఈ కాలంలో కలం పట్టిన ప్రతి కవి విప్లవోద్యమం గురించి రాయకుండా ఉండలేకపోయాడు. ఆనాడు తెలంగాణ నేలంతా పరుచుకున్న రక్తసిక్త వాతావరణం అన్నవరం దేవేందర్‌ను ఎంతో కదిలించింది. అందుకే గుండె లోపలి గదుల్లో మొలకెత్తిన ఆ కదలికను అంతే తడితో కవిత్వంలోకి తీసుకొచ్చాడు.

    ‘‘కనుకొనల నుంచి రాలుతున్న సముద్రం
              తెలంగాణ పల్లె
              ఇది కన్నీళ్ళ కోనేరు
                ఒకవైపు ఉడుకుతున్న నెత్తుటి సంగీతం
                మరోవైపు రివ్వుమంటున్న బుల్లెట్ల వాన
                ఊగుతున్న ఉరితాళ్ళ చప్పుడు’’ (తొవ్వ పుట. 16)

రాత్రి ‘అన్న’లు, తెల్లవారి పోలీసుల మధ్య ఆనాటి పల్లెలు నలిగిపోయాయి. బహుజన కులాల మీద ఆధిపత్య వర్గాల పెత్తనాన్ని ప్రశ్నించిన ఆనాటి యువతరం అన్నల మద్దతును తీసుకుంది. కొన్నిసార్లు అన్నల్లో కలిసి పోరాడిoది. ఈ క్రమంలో గ్రామాలు నెత్తుటి సముద్రాలయ్యాయి. కన్నీటి కోనేరులయ్యాయి. కొంతలో కొంత ప్రజల జీవితాల్లో వెలుతురు ప్రసరించింది. కానీ జరిగిన నష్టం కూడా ఎక్కువే.
2005లో రాజ్యానికి, సాయుధపోరాటదళాలకు మధ్య జరిగిన శాంతి చర్చలను కూడా పాజిటివ్‌గా ఆహ్వానించి ‘‘తుపాకీ బ్యారల్‌ మీద పావురాలు కాపురం చేయాలి’’ అని ఆకాంక్షించాడు. కానీ చర్చలు విఫలమై హింస చెలరేగినపుడు ‘‘ఊరు ఇప్పుడు రక్తం మడుగు/ఊరు ఇప్పుడు కన్నీళ్ల కొలను/ఊరు ఇప్పుడు ఉరికంబపు తాడు’’ (మంకమ్మతోట లేబర్‌ అడ్డా పుట. 192) అని శాంతి పావురం నేలరాలిన విధానాన్ని వివరించాడు.

2. మతతత్త్వం:

‘‘మతం ప్రజల పాలిట మత్తు మందు’’ అంటాడు కార్ల్‌ మార్క్స్‌. భౌతిక ప్రపంచంలో మతం ఎంత చిచ్చు రేపుతుందో ఎన్నో ఉదంతాలు నిరూపిస్తున్నాయి. చరిత్రలో మతం సృష్టించిన అలజడి, విధ్వంసం యొక్క బహుళ రూపాలను అన్నవరం దేవేందర్‌ కళ్లకు కట్టిస్తాడు ఈ కవితలో.
               ‘‘మతం మాయ వింటావా
                కుప్పకూలిన బాబ్రీ మసీదు శిథిలాలకు చెవి ఆన్చు
                ఎగిరిపోయిన శాంతి పావురాలను నిమురు
                దాని మతలబు తెల్సుకోవాలంటే
                వక్కలైన బహుమనీయ బుద్ధ విగ్రహాల నడుగు
                మతం విపత్తు చూస్తావా
                కూల్చివేసిన బౌద్ధారామాలను లెక్కించు"  (నడక పుట. 91)
మత్తు మందు మింగిన మతోన్మాది వేటినైనా తుత్తునియలు చేస్తాడు. అవి విగ్రహాలైనా, జీవితాలైనా వాడికి లెక్కలేదు. అందుకే దేశంలో ఎన్నో దేవాలయాలు శిథిలమై చరిత్రకు ఆనవాళ్ళుగా మిగిలిపోయాయి. బాబ్రీ మసీదు, బౌద్ధారామాలు, మహనీయుల విగ్రహాల శకలాలు ఎన్నో మత రక్కసి కక్కిన మత కల్మషమే నిదర్శనంగా నిలుస్తున్నాయి.  

3. కరువు చిత్రణ:

1990 - 2005 మధ్య తెలుగు నేల మీద విపరీతమై కరువు రాజ్యం చేసింది. సాగు నీరు, తాగు నీరు దొరికే పరిస్థితి లేదు. అది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ఆత్మహత్యల రుతువు. పంటలు లేక, తిండి గింజలు లేక, కనీసం పశువులకు తాగడానికి నీరు కూడా లేక వ్యవసాయదారులు ఎంతో ఆందోళన పడిన కాలం.  ఈ సందర్భంలో అన్నవరం దేవేందర్‌లాంటి కవులు ప్రజల పక్షాన ముఖ్యంగా రైతాంగం పక్షాన నిలబడి వారి బాధలను అక్షరీకరించారు.

                     ‘‘తరుముతున్న కరువుకు
                      పత్రహరితం అదృశ్యమైంది
                      కరువుకు గజ్జెకట్టి
                      లేకిడి రాజ్యం దరువేస్తుంది
                      పీడన పాలనలో అల్పపీడనం లేదు
                      తెప్ప చినుకులన్న రాలవు
                      .............................
                      పొలం పగిలిన అద్దం
                      కంచం ఎండిపోయిన పొలం
                    నీళ్లులేవు బువ్వ లేదు
                    పెయ్యి వెయ్యి వయ్యలైతంది’’   (నడక పుటలు. 124, 125)

వాన రాకడ కోసం ఒళ్లంతా కళ్ళు చేసుకొని చూశారు ఆనాడు రైతులు. ‘‘చేలల్లో నీళ్ళు లేవు, చెలకల్లో నీళ్ళు లేవు, నిన్నే నమ్ముకున్న రైతు కళ్లల్లో నీళ్ళు లేవు’’ అని జయరాజులాంటి వాగ్గేయకారులు రాసిన పాటలు ఆనాటి కరువు దృశ్యాన్ని ఆవిష్కరించాయి. దీనికి తోడు ఆనాటి పాలకుల మొండి వైఖరితో తెలంగాణలో ఎక్కడ చూసినా ఎండిపోయిన బీళ్లే కనిపించాయి. తెలంగాణ యువకులను ఎడారి దేశాలకు వలసపోయేలా చేసిన కరువును అన్నవరం దేవేందర్‌ కూడా ఎంతో గాఢంగా చిత్రించాడు.

                     ‘‘వానమబ్బుల్లేవ్‌/వర్షపు చినుకుల్లేవు
                      తుంపురు తుంపురు/ముసురన్నా రాదాయె
                      కార్తెలు తీరు చెప్పినయి/కాలం కిందిమీదైంది
                      ....................................................
                      పల్లె మొకం/చిన్నబోయింది
                      ఊరు కన్నీరు పెట్టింది
                      పండుగ లేదు/పబ్బం లేదు
                      ఎవల నోట విన్నా/కాలం ముచ్చటే
                      కన్నీళ్ల ముచ్చటే’’ (నడక పుటలు. 127, 128)

బావుల్లో నీళ్ళు లేవు. చెరువుల్లో నీళ్ళు లేవు. బోరు బావుల్లో కూడా నీళ్ళులేని పరిస్థితి. కరెంటు కోతతో పంటలకు నీళ్ల పారకం లేదు. గొడ్డు, గోదలకు నీళ్లులేక కోతకు అమ్ముకునే దయనీయ స్థితి. ప్రజలంతా రోగాల బారిన పడి  మందులు మాకులు లేక చావుకు దగ్గరైన వైనం తెలంగాణ అన్ని పల్లెల్లో కనిపించిన సాధారణ దృశ్యం. అప్పులు పెరిగి, మిత్తీలు పెరిగి రైతులు ఆత్మహత్యలకు దగ్గరైన తీరు గుండెలను కదిలించింది. ‘‘నా ఆవు, నా ఎద్దు, నా బిడ్డలు, నా లచ్చిందేవి, కోతకెట్ల అమ్మాలె? అయ్యో! నారాయణ ఎట్ల బతుకుదు? నీళ్లులేవు, వానల్లేవు, ఇంట్ల గింజల్లేవు’’ అని రైతులు తల్లడిల్లిపోయారు. మరో కవితలో కూడా ‘‘సోడు లేకుంటే పంటం గానీ/సుక్కనీళ్లు లేకపోతే ఎల్లుద్దా?’’ అని నీళ్లంటే... కన్నీళ్లే... అంటాడు. ఇంత జరిగినా రైతుకు భరోసానిస్తూ ఆత్మహత్య వద్దు ఓ రైతన్నా! అని బోధించి ‘‘వేలాడుతున్న ఉరితాడును కొడవలితో కొయ్యి” అని ముల్లును ముల్లుతోనే తీసి ఇగురంగా బతుకుమని జీవితం యొక్క విలువను చెప్పి ఆయన బురదకాళ్లకు మొక్కుతాడు. 

4. ప్రపంచీకరణ:

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు, సంస్కృతులు, సమాజాల పరస్పర అనుసంధానం, ఏకీకరణను ప్రపంచీకరణ అనవచ్చు. దీని వల్ల దేశ సరిహద్దుల వెంబడి పెరుగుతున్న వస్తువులు, సేవలు, మూలధనం, సాంకేతికత, ప్రజల ప్రవాహం, దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోతాయి. అందువల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి అడ్డంకులు తగ్గిపోయాయి. బహుళజాతి కంపెనీలు మరింత స్వేచ్ఛగా వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి మార్గం సులభతరం అయింది. ఈ నేపథ్యంలో మనదేశం 1991లో ఆర్థిక సరళీకరణలు ప్రవేశపెట్టి  ప్రపంచీకరణకు ద్వారాలు తెరిచింది. అప్పటి నుండి మనదేశంలో బహుళజాతి కంపెనీలు విచ్చలవిడిగా పెట్టుబడులు పెట్టి విపరీతమైన లాభాలను గడిరచాయి. ప్రపంచీకరణ ఫలితంగా మనదేశంలో ఆదాయ అసమానతలు పెరిగిపోయాయి.                            ఉద్యోగుల స్థానభ్రంశం అధికమైంది. సాంస్కృతిక విధ్వంసం వందరెట్లు పెరిగింది.
                       ‘‘పగలకుండా పయనించే శీతల పానీయాలు
                        పట్టపగలు చంపే టెర్మినేటర్‌ విత్తనాలు
                        సర్రున లారీలు లారీలుగా చేరుతున్న
                        రసాయన క్రిమి సంహారకాలు
                        ఆ నున్నటి రోడ్డుపై పయనించి పయనించి
                        నా ఊరి సారాన్ని పీల్చి వేస్తున్నాయి’’   (నడక పుట. 82)

ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి, గాట్‌ ఒప్పందాలకు తలవంచి దేశంలో ప్రపంచీకరణ వికటాట్టహాసం చేసింది. ఫలితంగా ఎంతో విధ్వంసం జరిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచీకరణకు భారతదేశం ఒక ప్రయోగశాలగా మారిపోయింది. వస్తు సంస్కృతి పెరిగింది. విదేశీ వలసలు పెరిగాయి. డాలర్ల వేట మొదలైంది. దేశమంతా ఒక బానిసత్వపు ఇంద్రజాలంలో కూరుకుపోయింది. ఎన్నో వస్తువులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వాటిని కొని వాడకపోతే నాగరికులము కాకుండా పోతామేమోననే ఒక కల్లోలం నెత్తి మీదికి వచ్చి కూర్చుంది. అందుకే కవి పల్లెతనాన్ని ప్రపంచీకరణ ఎలా పీల్చి పిప్పి చేసిందో ఈ కవితలో చాలా అద్భుతంగా చూపించారు. గ్లోబలీకరణ పేరుతో ఇవాళ ప్రపంచ దండయాత్ర ఎలా విస్తరించిందో చిత్రించారు. మరో కవితలో ‘‘రోబోట్లు కంప్యూటర్లకు ప్రాణాలొచ్చి /నిండు కుటుంబాలకు ఉరితాళ్లు వేస్తున్నాయి. మంచినీళ్లు అందిచ్చే మా సాంప్రదాయం/నీకు వ్యాపారమై బంగారు గుడ్లు పెడుతుంది.’’ అంటాడు. ప్రకృతిలోని ప్రతి వస్తువు ఎలా వ్యాపారమయం అయిపోయిందో చాలా స్పష్టంగా చెప్తాడు కవి.

                      ‘‘ప్రపంచం పల్లెగా పరిణమించింది
                        దోపిడి పరివ్యాప్తమవుతుంది
                        భూగోళంలో సరిహద్దులు లేవు
                        ఒప్పంద సంతకాల సాక్షిగా
                        తలకాయలు కీలుబొమ్మలవుతున్నాయి’’    (నడక పుట. 90)
ప్రపంచీకరణ దయవల్ల ఈనాడు ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయింది. కుక్కగొడుగుల్లాగా ప్రతి ఇంటి మీద డిష్‌ ఛత్రీ మొలిచి బుర్రలను ఛిద్రం చేస్తున్నాయి. నట్టింట్లో రంగుల పెట్టె ప్రత్యక్షమై కళ్ళను దానికే అతికిస్తున్నారు. సృజనాత్మకత అసలే లేదు. అన్నీ చెదలు పట్టిన ఆలోచనలే. మానవత్వం కాస్తా మంటగలిసి పచ్చని జీవితాలను చిదిమేస్తున్నాయి. నేతన్నలు, రైతన్నలు అందరూ బలిపశువులైపోతున్నారు. ఇంత రాక్షసత్వానికి కారణమైన వాడెవ్వడో మనం ఎప్పటికీ గుర్తుపట్టలేమని కవి వాపోతాడు. 

5. ప్రాంతీయ అస్త్తిత్వం:

నిర్వచనాలకు అందకుండా ప్రాంతీయ అస్తిత్వవాదం తెలుగు సాహిత్యంలో ఎప్పటి నుంచో ఉన్నా 1991 తరువాత నుండి తెలంగాణ సాహితీకారులకు ఈ ప్రాంతీయ అస్తిత్వ స్పృహ బాగా పెరిగింది. అందుకే తమ జీవితాలను ప్రభావితం చేసిన ఆర్ధిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను ప్రాంతీయ అస్తిత్వ కోణంలో చూడడం మొదలు పెట్టారు. తద్వారా సరికొత్త డిక్షన్‌తో తెలంగాణ సాహిత్యం తళుకులీనింది. ఇలా ప్రాంతీయ అస్తిత్వవాదాన్ని తన  ప్రతి అక్షరంలో ధ్వనింపజేసిన అచ్చమైన ప్రాంతీయవాద కవి అన్నవరం దేవేందర్‌. ప్రపంచీకరణకు విరుగుడు ప్రాంతీయ చైతన్యమేనని గుర్తెరిగిన కవి అన్నవరం దేవేందర్‌. ఆయన కవిత్వం నిండా ప్రాంతీయత విశ్వరూపం ధరించి కనిపిస్తుంది. తాను చేపట్టిన ఏ వస్తువునైనా ప్రాంతీయ దృక్పథంతో చూడడం అన్నవరం దేవేందర్‌ కవిత్వ ప్రత్యేకత. ఆయన వాడే భాషలో, వస్తువులో, భావవ్యక్తీకరణలో, పదచిత్రాలలో, వాక్యవిన్యాసంలో, కవితా శీర్షికల్లో అంతటా ఈ ప్రాంతీయ దృక్పథం విస్తరించి కనిపిస్తుంది. ‘నడక’ సంపుటిలోని ‘చెలిమె’, బృహత్కవిత, హుస్నాబాద్‌ ఓ హుస్నాబాద్‌ కవితలతో పాటు మంకమ్మతోట లేబర్‌ అడ్డాలోని అనేక కవితలు ప్రాంతీయ అస్తిత్వానికి ఎత్తిన పతాకలు.

                            ‘‘ప్రపంచ వాణిజ్యం ప్రచండమై
                              గ్రామ వికాసాన్ని ఆర్పేసింది
                              చేతి పనుల ఇరుసులు విరిగిన ధ్వని
                              దేశీయత దేహం గాయమైంది
                              భౌగోళీకరణ అగ్ని
                              దేశ దేశాలకు అంటుకున్న నిప్పు
                              విస్తరిస్తున్న విశ్వీకరణకు
                              ప్రాంతీయాత్మే ప్రతిఘటన’’ (మంకమ్మతోట లేబర్‌ అడ్డా పుటలు 141,142)

‘‘నా ప్రాదేశికత ముందు ప్రపంచీకరణ గుడ్డపేలిక’’ అని ప్రకటించిన కవి అన్నవరం దేవేందర్‌. కవికి తన ఊరు, తన స్నేహితులు, తన వృత్తి, తన పనిముట్లు అన్ని ఎంతో అపురూపమైనవి. పల్లెకు దూరమవుతున్నా కొద్ది ఊరి మీదున్న ప్రేమ మరింత పెరిగిపోతుంది. 

6. బహుజనతత్త్వం:

“సమాజంలో సగానికి పైగా ఉన్న వెనుకబడిన కులాల (బి.సి) ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు ఆకాశమంత ఆవరించి ఉన్నాయి. అనేక సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర వహించి, క్రియాశీలoగా పోరాడిన ఈ బహుజనులు వర్తమానంలో అనేక విధాలుగా అస్తిత్వ సంక్షోభాన్ని అనుభవిస్తున్నారు.”3 (తెలంగాణ బి.సి. వాద సాహిత్యం,  పుట. vii) బహుజనుల అస్తిత్వ పోరాటంతోపాటు, పరాన్నజీవులైన ఆధిపత్యవర్గాలను నిరసిస్తూ బహుజన దృక్పథంతో అన్నవరం దేవేందర్‌ బోలెడు కవిత్వం రాశాడు. ఈ సమాజ నిర్మాణానికి బహుజనులు ఎవరి మార్గంలో వాళ్ళు ఎలా కృషి చేశారో ఆయన రాసిన చాలా కవితలు విడమరిచి చెప్తాయి. వృత్తులు, పనిముట్లు, వారి నైపుణ్యం అంతా కలిసి సమాజ వృద్ధి కోసం పాటుపడేతత్త్వం ఇదంతా పూసగుచ్చినట్లు దేవేందర్‌ కవిత్వంలో తొంగి చూస్తుంది. “అన్ని బీసీ కులాల ఆత్మగౌరవ కేతనాన్ని ఎగిరేశాడు. అన్ని వృత్తుల వైభవ కిరీట ధగద్ధగలను దిగంతాలను చాటింపు వేసిండు దేవేందర్. అన్ని బి.సి. కులాల ఉమ్మడి అస్తిత్వాన్ని విడిగా ఒక్కొక్క కుల అస్తిత్వాన్ని కవిత్వీకరించిండు.”4  (అన్నవరం దేవేందర్ కవిత్వం 1998-2022- పుట. Vii, viii)4

                      ‘‘దూది పింజం నుంచి దారాలన్నీ చేరదీసి
                      పోగుపోగుగా వడికిన నేను
                        విశ్వమానవులకు వస్త్రాలందించిన వాన్ని
                        ...............................................
                        మానవ నాగరికత వికాసపు వెలుగు పులుగును
                        మట్టి పిసికి పాత్రలుగా మలచి
                        మాణిక్యాలు సృష్టించిన కళాకారున్ని నేను
                        ................................................
                        ఎర్రని కొలిమిలో రంగరించిన ఇనుముతో
                        కత్తులు కొడవండ్లు సాన పెట్టిన కర్మ వీరున్ని’’        (తొవ్వ పుటలు 18, 19)

సబ్బండ వర్ణాల పనితనాన్ని ఎంతో కళాత్మకంగా వ్యక్తీకరించి బహుజనుల వృత్తి కళా నైపుణ్యాన్ని ఎత్తి చూపిన కవిత్వం అన్నవరం దేవేందర్‌ది. ‘మహోన్నతున్ని నేను’ అంటూ లోక నిర్మితికి ఉత్పత్తి కులాల యోగదానాన్ని ఎరుక పరిచి భారతదేశ మూలవాసుల చరిత్రను, వారసత్వాన్ని పునర్లిఖించారు. భక్తి మార్గం, పుణ్యతీర్థం పేరుతో  బహుజన వర్గాల మెదళ్ళను ఆక్రమించి ఎలా థాట్‌పోలీసింగ్‌కు పాల్పడుతున్నారో విప్పి చెప్పిన అన్నవరం బహుజన  వర్గాలకు ఒక దారిదీపం.  

       ‘‘వాళ్లు లోకానికేం ఇచ్చిండ్రని నీల్గుడు
         ఏం చేసిండ్రని నిక్కుడు
        వరి నాటేసిండ్రా, వడ్లు పండిచ్చిండ్రా
         దుక్కి దున్నుడా, నీళ్లు కట్టుడా
        నాగలి అమ్రిచ్చిండ్రా, కర్రు మొనవెట్టిండ్రా
        కుండలు వానుడా గూనలు చేసుడా
         మంది కోసం ఏం చేసిండ్రు వాళ్ళు’’ (నడక పుట. 70)

మీసాలు తింపుకుంట, బొత్త తీనుకుంట బహుజన వర్గాలను అదిలించే, బెదిరించే ఆధిపత్య వర్గాల పెత్తనాన్ని, వారి నైజాన్ని పూర్తిగా ఎండగట్టిన కవిత ‘నీల్గుడు’. ఉత్పత్తిలో భాగం కాకుండా కేవలం మీద మీద తిరిగి జనం మీద అజమాయిషీ చేయడాన్ని సహించడు కవి. అందుకే వీళ్లకు ఎందుకింత నీల్గుడని ప్రశ్నిస్తాడు. మందిని ముంచి దోస్క తినుడే వీళ్ల అతి తెలివి. ‘ఎన్నడన్న చెమట కారిందా? పెయ్యి వంగిందా?’ అని నిలదీస్తాడు. అంతా దోఖాబాజీ మాటలు, దొంగ తెలువులు అని వాళ్ల అసలు స్వరూపాన్ని చిత్రిక కడుతాడు కవి. 

7. తెలంగాణ ఉద్యమం:

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కవుల, కళాకారుల కృషి ఎనలేనిది. అన్నవరం దేవేందర్‌లాంటి చలనశీల కవులు ఉద్యమంతో మమేకమై ఉద్యమ భావజాల ప్రచారానికి, పోరాట స్వరూపాలను రికార్డు చేయడానికి, ప్రజల ఆవేశ, ఆగ్రహాలను, సాధక భాధకాలను ఎప్పటికప్పుడు వ్యక్తీకరించడానికి తమ కవిత్వం ద్వారా ఇతోధికంగా పాటుపడ్డారు. 

‘‘ఎంతకాలం ఈ పరిపచ్చపు పాలన 

ఎన్ని రోజులీ ఇసపుకొండి సంసారం 

మిక్కుటమైన అవస్త కక్కుటాన్కచ్చింది 

సకులం తెలంగాణమే అగ్గై మండుతుంది 

..................................................

విద్యార్థి వీరులకు సమ్మెనే సెమిస్టర్‌ 

లాయర్లు డాక్టర్లు టీచర్లు ఉద్యోగులు 

లడాయి చెయ్యనీకి బంద్‌బాట పట్టిండ్రు 

ఉద్యోగాలకు సలాం కొట్టి ఉద్యమాలకు జై అన్నరు 

సకల జన తెలంగాణమే ఏకమై

ఆంధ్రప్రదేశ్‌ మీద అగ్గై మండిరది’’   (పొద్దుపొడుపు పుటలు. 445, 446)

భారతదేశ స్వాతంత్య్ర సముపార్జన ఒక్క గాంధీజీతోనే సాధ్యంకానట్టు ప్రత్యేక తెలంగాణ కల ఏ ఒక్కరితోనో సాధ్యం కాలేదు. సకల తెలంగాణమే పోరులోకి దూకింది. విద్యార్థులు, ఉద్యోగులు, లాయర్లు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, విద్యుత్‌ ఉద్యోగులు, సబ్బండ వర్ణాల ప్రజలంతా వాళ్ళ వాళ్ళ పనిముట్లకు పనులు చెప్పడం ఆపేసి ఉద్యమ అగ్నిగుండంలో దిగి రాష్ట్ర కలను సాకారం చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద తెలుగు వారందరినీ ఒకే రాష్ట్రంలో కుదించి వేయడం వల్ల జరిగిన నష్టం ఎంతో కవి చెప్పకనే చెప్తాడు ‘లొల్లి’ అనే ఈ కవితలో. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు దగ్గరి నుంచి తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ సమాన అవకాశాలు ఇవ్వలేదని ఈ అన్యాయమే నిప్పులాగా మండి స్వరాష్ట్ర కాంక్షను రగిలించిందని చెప్తాడు. ఎంత కాలం ఈ అన్యాయం అని ‘సకల సమాజమే అలిగి కూసున్నది’ అంటాడు. 

‘‘దేవేందర్‌ వేసిన 12 సంపుటాల్లో ఏ ఇతర అంశం కన్నా తెలంగాణ అంశం మీదనే ఎక్కువ కవితలు ఉన్నవి. తెలంగాణ భాషా ఔన్నత్యం మొదలుకొని వివక్ష, దోపిడి, అవహేళన దాకా జనరలైజ్డ్‌ అంశాల మీదనే కాక పర్టిక్యులర్‌గా రోజువారి అంశాల మీద కూడా రాసిండు. లాంగ్‌మార్చ్‌, సకల జనుల సమ్మె, వంటావార్పు, మార్క్సిస్టుల వైఖరి, రెండో ఎస్సార్సీ, 2009 ప్రకటన విరమణ, అసెంబ్లీలో బిల్లు చించివేయడం, ప్రక్రియ ప్రారంభం, నాన్చుడు, విగ్రహాలు కూల్చుడు, రాజ్యసభలో బిల్‌ పాస్‌ కావడం `ఇట్లా దేన్నీ వదిలి పెట్టకుండా కవిత్వంలోకి పట్టుకొచ్చిండు. దేవేందర్‌ కవిత్వం చదివి ఉద్యమ చరిత్ర రాయొచ్చు.  అయితే అది ఉద్వేగ సహిత చరిత్ర. అంటే దేవేందర్‌ ఉద్యమంలో అంతగా లీనమైండని అర్థం’’5 (నారాయణరెడ్డి, సుంకిరెడ్డి, అన్నవరం దేవేందర్‌ కవిత్వం (1982`2022) ముందుమాట, పుటలు 13, 14) అoతేకాదు దేవేందర్ కవిత్వం “తెలంగాణ భూత, భవిష్యత్ వర్తమానాల స్థితిని వ్యాఖ్యానిస్తుంది. తెలంగాణ జీవితం అందులో భాగమైన సంస్కృతి దానిలోని అంశమైన భాష, దానిలోని ఆత్మగౌరవం కనులకు కడుతుంది.”6 (వెంకటేశ్వర్లు, బూర్ల, సబాల్టర్న్ బులెటిన్ vi, పుట 17)

‘‘హక్కుల కోసం కలెబడి నిలబడి 

గొడ గొడ ఏడ్చిన కాళన్న కన్నును 

ఉద్యమ భాస్వరాన్ని 

మరో తరానికి ఊది అందించిన 

జయశంకరుని ఉపన్యాసాన్ని 

నా దేహానికి నేనే 

పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్న 

శ్రీకాంతాచారి అమరత్వాన్ని 

విజయాన్ని వీరున్ని 

నేను లేచి నిలిచి గెలిచిన 

తెల తెలంగాణను 

రణం చేసి రణం చేసి 

గాయపడ్డ వాన్ని తేరుకుంటున్న వాన్ని’’  (ఇంటిదీపం పుట. 673)

దశాబ్దాల అన్యాయాలను ప్రశ్నించి, పోరాడి తెలంగాణ సాధించిన తరువాత కూడా తన పోరాట వారసత్వాన్ని స్మరించుకొని ఇప్పటికీ అన్యాయం ఎక్కడున్నా ఎదురు తిరగడమే తెలంగాణతనమని సాయుధ పోరాటం నుంచి  నేటి దాకా తను నడచి వచ్చిన పోరుబాటల్ని నెమరు వేసుకుంటాడు కవి. చివరికి ‘దోప్కం ఎక్కడున్నా ఇప్పటికీ కత్తి తీస్తా’నంటాడు.

8. ముగింపు:

  • “ఒక స్తబ్దత నుండి చైతన్యం వరకు, నిశ్శబ్దం నుండి నినాదం వరకు అన్నవరం కవిత్వం వెళ్తుంది”7 (పొద్దుపోడుపు, నారాయణ శర్మ ఎం, పుట. 456)  ఈ కోణంలో చూసినపుడు అన్నవరం దేవేందర్‌ నిత్యచలనశీల కవి. నడుస్తున్న సమాజంతో పాటు తానూ నడుస్తూ సామాజిక చలన సూత్రాలను ఆకలింపు చేసుకొని పీడిత ప్రజల వైపు నిలబడి కవిత్వం రాస్తున్న ప్రగతిశీల కవి. 
  • సమాజంలోని ప్రతిపొరలో అదృశ్యంగా ఉండిపోయిన ప్రతిసంఘటనను కవిత్వం చేసినవాడు. ప్రధాన స్రవంతి నుండి అంచులకు నెట్టివేయబడిన వర్గాల బాధలను, గోసను అక్షరాలకెక్కించిన ఒక ప్రజాస్వామ్య కవిగా నిలబడినవాడు. “దేవేందర్ కవిత్వంలో కమ్ముకూలిన బండి చక్రం, గండి పడ్డ చెరువు, ముసలి తల్లిదండ్రుల్ని ఇంటి ముందు సాయమానులో వదిలి, పనికోసం సమీప పట్టణాలకు, నగరాలకు, దూర దేశాలకు వలస పోతూ ఇండ్లకు తాళం వేసిన తీరు ఏక కాలంలో మన కడుపులో చేయిపెట్టి దేవినట్టు, మన భుజం మీద చేయివేసి భరోసా ఇచ్చినట్లు అనిపిస్తుంది"8 (మంకమ్మతోట లేబర్ అడ్డా, పుట. 138)  
  •  తెలంగాణ జీవితాన్ని, తెలంగాణ మట్టిని, తెలంగాణ భాషను, తెలంగాణ చరిత్రను రక్తగతం చేసుకొని సందర్భం వచ్చిన ప్రతిసారి వాటి మీద ప్రేమను, నెనరును ఎంతో బాధ్యతతో, ప్రేమతో ప్రకటించిన కవి. “తెలంగాణ సోయిని సరైన దిశలో, సరైన రీతిలో వ్యక్తీకరిస్తున్న కవి” (తెలంగాణ సాహిత్యోద్యమాలు పుట. 88) 
  • జీవితం పట్ల, కవిత్వం పట్ల చాలా స్పష్టత ఉన్న కవి అన్నవరం దేవేందర్‌. అందుకే ‘‘కవి అంటే గోడ మీద పిల్లి కాదు. అటో ఇటో తేల్చుకున్న వాడే కవి. వర్ణ పంకిలాన్ని తెగ నరికి, అంతరాల దొంతరలను పగులకొట్టి, ఆధిపత్యాల రహదారి విచ్ఛిన్నం చేసేవాడు మాత్రమే కవి’’9 (నడక, పుట. 52) అని కవికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చాడు. 
  • అంతేకాదు అన్నవరం దేవేందర్‌- ‘‘ఆంధ్ర కవుల ప్రభావానికి దూరంగా తనదైన కవిత్వ నిర్మాణ పద్ధతిని రూపొందించుకున్నాడు. వస్తువులోనే కాదు, అభివ్యక్తిలో తెలంగాణ తనం, భాష, తీరుతెన్ను అతని కవిత్వంలో వ్యక్తమయ్యాయి’10 (పుట్టబండారం, గుడిపాటి, పుట. 118).
  • సామాజిక స్పృహ ఉన్న ఏ కవి అయినా ఆకు కదలినా, చీమ కదలినా దాని అంతరార్ధాన్ని అవగాహన చేసుకుంటాడు. ఆ ప్రకంపనల్ని తన కవిత్వంలో నిక్షిప్తం చేస్తాడు. అలాంటి విశిష్టమైన సామాజిక కవి అన్నవరం దేవేందర్.

9. పాదసూచికలు:

  1. గోపి, ఎన్, బుడ్డపర్కలు, పుట. 232
  2. భాస్కర్, నలిమెల, బొడ్డుమల్లెచెట్టు, పుట. 279 
  3. దత్తయ్య, అట్టెం, తెలంగాణ బిసివాద సాహిత్యం, పుట. vii)
  4. నారాయణ రెడ్డి సుంకిరెడ్డి, అన్నవరం దేవేందర్ కవిత్వం 1998-2022,  పుటలు. Vii, viii
  5. పైదే. పుటలు 13,14.
  6. వెంకటేశ్వర్లు, బూర్ల, సబాల్టర్న్, పుట.17 
  7. నారాయణ శర్మ ఎం,పొద్దుపోడుపు, పుట. 456
  8. మంకమ్మతోట లేబర్ అడ్డా, పుట. 138
  9. భాస్కర్, నలిమెల, నడక, దేవేందర్ అన్నవరం, పుట. 52
  10. గుడిపాటి, పుట్టబంగారం, పుట. 118

10. ఉపయుక్తగ్రంథసూచి:

  1. గుడిపాటి, (2018) పుట్టబంగారం, పాలపిట్ట బుక్స్, హైదరాబాద్. 
  2. గోపి, ఎన్, (2006), బుడ్డపర్కలు (నానీలు), విజేత పబ్లికేషన్స్, గోదావరిఖని. 
  3. జగన్నాథం జూకంటి, (2005), మంకమ్మతోట లేబర్ అడ్డా, నూతన సాహితీ, హుస్నాబాద్. 
  4. దత్తయ్య, అట్టెం, (2021) తెలంగాణ బి.సి. వాద సాహిత్యం, ప్రణవం పబ్లికేషన్స్, హైదరాబాద్. 
  5. దేవేందర్, అన్నవరం, (2003) నడక,  నూతన సాహితీ, హుస్నాబాద్.
  6. నారాయణ రెడ్డి, సుంకిరెడ్డి, (2022) అన్నవరం దేవేందర్ కవిత్వం 1998-2022, మొదటి సంపుటం, సాహితీ సోపతి, కరీంనగర్.
  7. నారాయణ శర్మ ఎం, (2011) పొద్దుపోడుపు, సాహితీ సోపతి, కరీంనగర్. 
  8. ప్రతాప్ రెడ్డి కాసుల, (2015) తెలంగాణ సాహిత్యోద్యమాలు, తెలంగాణ ప్రచురణలు, హైదరాబాద్.
  9. భాస్కర్ నలిమెల, (2008), బొడ్డుమల్లె చెట్టు, తెలంగాణ రచయితల వేదిక, కరీoనగర్
  10. వెంకటేశ్వర్లు బూర్ల, (2021), సబాల్టర్న్, ఫోరం ఫర్ కన్సర్న్ డ్ బీసీస్, హైదరాబాద్

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]